వలసంటే…
పొట్టచేత పట్టుకొని
కట్టుబట్టలతో కదిలి పోవుడే… కాదు
పుట్టినింటినీ…
ఇంటిపేరునూ విడిచి
కొత్త చిరునామాలోకి ప్రవహించడం (ప్రవేశించడం) కూడా
నగరానికి నా వలస
ఈ మూసలోంచే
మెతుకుల అన్వేషణైనా
మెరుగైన జీవనమైనా… మరేదైనా
అలవడేదాకా ఇది
గిలగిలా కొట్టుకునేదే…
మనసును కలచివేసేదే…
తలుగు
ననుసరించిన లేగదూడలా
నాలుగు వందలేళ్ళ నగరానికి నా వలస
అబ్బో…!
అప్పుడీ పట్నం
మా ఊరి వెలమదొరసానే…!
నన్నారుబయటే నుంచోబెట్టి హుంకరించేది…
పల్లె పిల్లని కదా
తెల్లనివన్నీ పాలేననీ నమ్మే నాకూ
ఈ బహురూపుల పట్నానికీ
ఇసుమంతన్నా పొసిగేది కాదు…!
పచ్చటి పంట చేల్లోంచి
కాంక్రీట్ జంగల్లో ఆగమైన ఊరపిచుకని…
విశాలాకాశం నుంచి
ఇరుకిరుకు పంజరంలో ఒదిగిన రామచిలుకని…!
తోడొచ్చిన అక్షరాలే
కొత్త చిగురులను పూయించి
సరికొత్త రెక్కలతో ఆకాశానికెగిరించాయి
ఇప్పుడు
నగరంతో… నాలుగు దశాబ్దాల అనుబంధం నాది
వద్దు వద్దనుకున్నా బొట్టు బొట్టుగా
నాలోకి ఇంకిపోయిందీ విశ్వనగరం
నేనూ…
ఆ తైలవర్ణ చిత్రంలో వెలిసిపోని రంగునయ్యా…!
కొమ్మలూ రెమ్మలూ పూలతో నిండి
వేళ్ళూనిన చెట్టునయ్యా…!
చిత్రమేమోగానీ… నేను మారానో
నగరమే మారిందో ఎంతకీ అంతుచిక్కదు
ఎందరినో చేరదీస్తున్న నా భాగ్యనగరం
నాకిప్పుడు కన్నతల్లి…!
అన్నటీనడుమ
ఓ హఠాత్పరిణామం…!
వలస జీవుల లెక్కాపత్రాల కోసం
వస్త్రగాలం పడుతన్నారట…
అరిగీ జీర్ణమైన ఆ దస్త్రాలని
ఎక్కణ్ణుంచి తెచ్చేదిప్పుడు!?
ఆకాశానికి గోడలు కట్టి
ఆ సైబీరియా పక్షిని అడ్డుకోమను
అప్పుడు చూద్దాం!