అవును ఒకసారలా
నీ తప్పేమీ లేకుండా
కాలికే కాదు,
మనస్సుకూ నెట్టెగురుతుంది
అవును ఒకసారలా
రాత్రంతా గీసిన బొమ్మపైన ఉదయానికి
వాన చినుకులు పడి ఉంటాయి
మంచి నిద్రలో నీకే సంబంధం లేని
కలగురించి ఏడుస్తూ ఉంటావు
చాలా ఇష్టంగా… అపురూపంగా దాచుకుందేదో
హఠాత్తుగా కనపడకుండా పోతూ ఉంటుంది.
మేము పెరగడమే తప్పు అయినట్లు…
ప్రాణంగా పెరిగిన బాల్య స్నేహితురాలిని
అసలు చూడలేక పోతూ ఉంటాము
ఏమీ జరగనట్లు… పెద్దరికాన్ని
ప్రతిసారీ నటించలేము.
విరిగిపోయిన బొమ్మను చేతిలో పట్టుకుని
నాన్న భుజాలపై పడుకొని
వెక్కివెక్కి ఏడ్చే పాపలైపోతాం అప్పుడు.
అంతే ఒకోసారి అంతే
మనస్సుకు లాల పోయాల్సిందే
కన్నీటితో.