ఎప్పుడయినా
ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా
అమ్మలో కొంత మిగిలే ఉంటుంది
బిడ్డల కోసమే
అమ్మ… కొంత దాచి ఉంచుతుంది
వంటింట్లో ఆఖరి అన్నం మెతుకుదాకా
పోపుల డబ్బాలో చివరి చిల్లర నాణెందాకా
ఏదో ఒకటి… ఎక్కడో ఒకచోట
బిడ్డల కోసమే
అమ్మ… కొంత దాచి ఉంచుతుంది
ఒక్కొక్కరికి జన్మ ఇస్తున్నప్పుడు
రక్తమాంసాలే కాదు
రాబోయే రేపు కోసం
అందమైన ఆశల్ని కూడా
అమ్మ దాచి ఉంచుకుంటుంది
మనవడు… మనవరాళ్ళ కోసం కూడా
చిట్టిపొట్టి పాటలు… చిన్నారుల కథలు
తాను తరలిపోయాక కూడా
తన మాటలు తొలకరించిన శబ్దాలు
అమ్మ దాచి ఉంచుతుంది
చివరి క్షణాల్లో ఆఖరి శ్వాసలో కూడా
అత్తవారింటి నుంచి ఆయాసపడుతూ
కన్నీళ్ళతో పరిగెత్తుకొచ్చే కూతురి కోసం
గాలిలోకి మాయమైపోయే తీయని మమకారాన్ని
తప్పకుండా
కంటిపాప కదలికల్లో
అమ్మ దాచి ఉంచుతూనే ఉంటుంది.