(Break the Taboo 1 )
మొన్నీమధ్య మలయాళంలో వచ్చిన ‘‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’’ అనే సినిమాలో, పడుకున్నప్పుడు పుస్తెలతాడు గుచ్చుకుంటే, విసురుగా సరిచేసుకునే ఒక సీన్ ఉంటుంది. ఒక్క సెకెండ్ మాత్రమే కనిపిస్తుంది ఆ సన్నివేశం. కానీ అది ఎంత తరతరాల చెర చాలా మందికి చెప్పినా అర్థంకాదు.
ఇపుడెవరు వేసుకుంటున్నారు అనొద్దు. వేసుకోని ఆ ఒక్కరిద్దర్ని సమాజం ఎంత అప్రతిష్టగా చూస్తుందో తెలియనిది కాదు. ఇష్టంగా, అలంకారంగా వేసుకుంటే బాధలేదు. నిద్రపోయినపుడు కూడా, కష్టమైనా భరించటానికి కారణాలు వేరే చెప్పాలా? అవి జన్మహక్కులుగా భావించే స్త్రీల సంగతి సరేసరి!
భార్య బొట్టు పెట్టుకోకపోతే తమకు అవమానంగా భావించే భర్తలెందరో! ఆయనగారు ఈమె మొఖానికి బొట్టు పెట్టుకొనే హక్కు, ఆడతనం కల్పించినట్టు. అది ఆయన మగతనం మరి! బొట్టు వల్ల పిట్యుటరీ గ్లాండ్ ఎక్టివ్ అవుతుందని తేల్చే వాట్సప్ సైంటిస్టులు లేకపోలేదు. మొగుడు పోయిన ఆడవాళ్ళ పిట్యూటరీ గ్లాండ్ మీద ఆ సైంటిస్టులు ఇంకా రీసెర్చి చెయ్యలేదనుకుంటా.
కల్తీ బొట్లు, కుంకుమల వల్ల స్కిన్ అలర్జీలు అయినప్పటికీ, ఇంట్లో వాళ్ళో, ఇంటిపక్కవాళ్ళో ఏమైనా అనుకుంటారని ఒక్కరోజైనా బొట్టు పెట్టుకోవటం మానుకోని స్త్రీలు మనకు తెలుసు. ఇంకా జుట్టు కత్తిరించుకున్న స్టైల్‌ని బట్టి, జుట్టు పొడవును బట్టి ఆమె ఎట్లాంటి కారెక్టర్ గల మనిషో కనిపెట్టెయ్యగలరంటే మనిషి బుర్రది ఎంత అభివృద్ధి! కాళ్ళ వేళ్లు చెడినా ఆ మెట్టెలు గల వేళ్లు రెండు జీవితంలో స్వతంత్రం ఆశిస్తే మహాపాపం. ఇది సంస్కృతి, సంప్రదాయం, మతం మీద దాడి అని జవాబు ఏడిస్తే నాకు ఆశ్చర్యంలేదు. అదే సంస్కృతి మగవాళ్ళకు పట్టుధోతులు కట్టుకోవటం చూస్తే ఇప్పుడు పండగలకు మురిసిపోతుందంటే తప్ప ఇది ఆచారం, చెయ్యవలసిందే అన్నట్టు ఏమైనా ఉందా? కుండలాలు, పోగులు, కిరీటాలు గట్రా! మొదట్నించీ సంప్రదాయాలన్నీ ఆడవాళ్ళకు మాత్రమే అని రాసి ఉంచాయి కదా.
‘‘నా భార్య మెడ్రన్ డ్రెస్సులే వేసుకుంటుందండీ. నేనుగానీ, మా ఇంట్లో వాళ్లుగానీ అభ్యంతరం చెప్పం’’ ఆమె ఒంటికి ఏమోస్కోవాలో వీడి అభ్యంతరం, మళ్ళా కుటుంబం అభ్యంతరం కూడా ఉండవలసిందిగానీ లేదు. అంటే ఎంత గొప్పో! ఎంత ఆదర్శమో!! పొరపాటున ఆమె జబ్బ మీద పెట్టికోట్ కనపడితే అప్రదిష్ట పాలయినట్లు aఅఞవఱ్‌వ మళ్ళా వాడికి. మగాడివి నువ్వు కంచం తియ్యటమేవిట్రా? హవ్వా! నువ్వే టీ కాస్తున్నావా అనే తల్లులు, కూరగాయలు తరగటం వీడి తిండికని కాకుండా, పెళ్ళాంకి సహాయం చెయ్యటం, ఆమె జీవితాన్ని ఉద్ధరించటం అనే మొగుళ్లు డైనోసర్లు కాదు, అంత త్వరగా అంతరించటానికి, వాళ్ళే ‘‘సీరియళ్ళు చూస్తూ మొగుడికి తిండి పెట్టడం మర్చిపోయింది’’ అనే కార్టూన్లకు ఈ శకంలోనూ పగలబడినవ్వేది. ‘‘మా ఆమె ఒక్కోసారి బాగానే వండుతుంది గానీ ఇప్పటికీ సరిగా వంటరాదు. ఉప్పులు, కారాలెంతెయ్యాలో తెలీదు. ఆమెని బాధపెట్టకూడదని వంట బాగుందనే చెప్తా’’ అయ్యో, అంత బాధ కడుపులో పెట్టుకొని, కుమిలిపోతూ బయటవాళ్ళకు చెప్పుకొని ఏడ్చే బదులు,
ఉప్పులు, కారాలు నువ్వే వేసుకొని సరిగ్గా వండుకు మింగరాదూ? నీకు వీలు కానప్పుడు చెయ్యటానికి ఆమెకు నేర్పరాదూ! ఆపిందా నిన్ను ఆమెగానీ? నీవెక్కడ వచ్చంటావా? మూసుకుతిను. లేదా అదేదో నువ్వే నేర్చుకో. ఏంపోతుంది? వంట ఆడ దానికి అలంకారం, మగాడికి నామోషీ ఎట్లా అయిందీ!?
ఆమె విజయాలు మొగుడి ఘనతే అనుకునే కుటుంబాలు, సమాజాలు. వెనక్కి లాగకపోవటం గొప్పే కదా అనుకునే స్త్రీలు. ఇష్టమనుకొనో, కష్టమనుకొనో, హక్కో బాధ్యతో అనుకొనో, సంస్కృతనో, భయంగానో ఈ 21వ శతాబ్ధంలోనూ, ఆమె మెడకేమేస్కోవాలో, చేతికి, నుదుటికి, కాళ్ళవేళ్ళకి, నెత్తికి, ముఖానికి ప్రతిదానికి గాలి పీల్చుకున్నంత సహజంగా ఆంక్షలు అలవాటయిపోయాయి. ఎవరివారే ఏర్పరుచుకొనేంత బానిసత్వమూ అలవాటయిపోయింది. మనసు మీద ఆంక్షల సంగతి కూడా వేరే అనాలా? ముఖం మీద మురికినీళ్ళు విసిరిపోవటం ఒక్కటే పరిష్కారమా? మనుషులం కదా, మామూలుగానే అర్థం అవదా!