మనిషిని తన స్వార్ధపు రంగుల్ని వదిలించుకుని మనసులోకి తొంగి చూడమని చెప్పిన ఇరానియన్‌ సినిమా – జ్యోతి

ఇరానియన్‌ సినిమా అంతర్జాతీయ సినీ ప్రపంచంతో పరిచయమున్న వాళ్ళందరికీ ఒక అద్భుతం. మానవ మనసులోని భావాలను, అనుభూతులను ఇరానీ సినిమా ఎంత విస్తారంగా పరిచయం చేస్తుందంటే, మానవ జీవితం ఒక అద్భుతంగా, ఒక అంతుపట్టని రహస్యంగా, ఎంత సోధించినా దరిచేరని రహస్య నిధిలా అనిపిస్తుంది. పసి పిల్లలను వ్యక్తులుగా, వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా, మానవ సృష్టి ఉన్న అద్భుతాలుగా చూపించే ఇరానియన్‌ సినిమాను

భారతీయులు తప్పకుండా చూడాలి. మనం మాటలతో వ్యక్తపరచలేని సున్నితమైన అనుభూతుల్ని స్క్రీన్‌పై కథ ద్వారా నడిపించే ఇరానియన్‌ సినిమాలు మనకు ఇంటర్నెట్‌ వెలుసుబాటుతో దొరుకుతున్న వరం. ఏ సినిమాలతో ఇరానియన్‌ సినిమాను మొదలెట్టాలి అంటే నిస్సంకోచంగా వచ్చే జవాబు మాజిద్‌ మజీది తీసినThe colour of Paradise.
మాజిద్‌ మజీది మన దేశానికి వచ్చి సినిమా తీయాలనుకున్నారు. ఇది ఎప్పటి సంగతో కాదు 2017 నాటి మాట. మనం దేవుళ్ళలా పూజించే హీరోలెవ్వరూ తను తీసే సినిమాకి పనికి రారని ఓపెన్‌గా చెప్పాడు. మన సినీ హంగులన్నీ వాస్తవ జీవితానికి దూరంగా ఉంటాయని, అలాంటి సినిమాలు తీయనని చెప్పి, పూర్తిగా కొత్తవారయిన నటులతో Beyond the clouds తీశారు. మన భారతీయ ప్రేక్షకులకు సహజంగానే ఈ సినిమా నచ్చలేదు. మాజిద్‌ మజీది తీసిన సినిమాలలోని ఆ సున్నితమైన భావాలను అనుభవించాలంటే చాలా అవాస్తవిక హంగులకు దూరంగా ఉండాలి. ఆ జీవితంలోని లోతు తెలియాలి. ఆ భావావేశం లేని తరానికి ఇరానియన్‌ సినిమా పరిచయం చేయాలి. ఒక్కసారి The colour of Paradise చూపించాలి. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్న నిజాన్ని మరోసారి స్పష్టపరిచే సినిమా ఇది. అదీ చిన్నపిల్ల వానికి అర్థమవడం, ఆ ఆర్థిక సంబంధాలు, కొలతల మధ్య మనసు పలికే భావాలను నొక్కిపెట్టి జీవితంలో సాగిపోవడమే మనిషి ఎదుగుదల అని నమ్మే సమాజపు భావజాలాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక పసి మనసు పడే బాధ మనం అనుభవిస్తాం. మన జీవితంలో ఆ అమాయకపు బాల్యం ఎలా ఈ ప్రపంచాన్ని దోచేసిందో, మనం బ్రతకడానికి లోపలి ఎన్ని గొంతుకలను నొక్కి పెట్టామో… ఇవన్నీ ఈ సినిమా చూసిన తరువాత ప్రశ్నలుగా మనలో తిరుగుతూనే ఉంటాయి.
ఒక తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ముహమ్మద్‌. అతనికి కళ్ళు కనిపించవు. తెహ్రాన్‌లో ఒక బ్లైండ్‌ స్కూల్‌లో చదువుతూ
ఉంటాడు. కళ్ళు కనిపించకపోయినా ప్రతి భావాన్ని అనుభవించి, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకమవుతాడు. మనసే అతనికి కన్ను అవుతుంది. దాంతో తన చుట్టూ ఉన్న వ్యక్తులకు చేరువవ్వాలనుకుంటాడు. విశ్వమంతటినీ అంతే ప్రేమతో స్వీకరిస్తాడు. ఒక పిల్లి అరుపుతో అది దేన్నో తినడానికి వచ్చిందని ఊహించి, చెట్ల మధ్య ఏదో మూగ జీవి దానికి ఆహారమవబోతోందని పిల్లి గొంతు వినిపించిన దిశగా చెవులకు పని చెప్పి ఆ దిక్కున ఎండిపోయిన ఆకుల మధ్య పడిపోయి ఉన్న పిల్ల పక్షిని చేతితో స్పృశించి, దాన్ని పట్టుకుని, అంత చిన్న పక్షి అక్కడ పడిరదంటే ఆ చెట్టుపైనే దాని గూడు ఉండి ఉంటుందని ఊహించి ఆ చెట్టు పైకి ఎక్కి, సరిగ్గా ఆ పక్షి పడ్డ పై కొమ్మ పైకి చేరి అక్కడ పక్షి గూడు కనుక్కొని ఆ గూటిలో ఆ పక్షి పిల్లను ఉంచిన తరువాత అతను అనుభవించే తృప్తీ, ఆనందం ఆ గాజు కళ్ళల్లో కూడా ప్రతిఫలిస్తుంది. ఇది చూసి మర్చిపోగలమా… అసలు అన్ని ఇంద్రియాలు పని చేస్తున్న వ్యక్తులకు ఈ ప్రాకృతిక మమేకం అర్థమవుతుందా? ఈ బాధ్యత గురించి అవగాహన ఉందా…
ముహమ్మద్‌ తండ్రి పేదవాడు. భార్య చనిపోతుంది. ముహమ్మద్‌ కాకుండా అతనికి ఇద్దరు ఆడపిల్లలు. వారి ఊరి స్కూలులో చదువుతూ నాన్నమ్మ సహాయంతో వాళ్ళు పెరుగుతుంటారు. నానమ్మకు ముహమ్మద్‌ అంటే చాలా ఇష్టం. పరీక్షలైపోయాక సెలవులకు ఇంటికి తీసుకుళ్ళమని స్కూలు యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు కబురు చేస్తుంది. అందరి తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఇంటికి తీసుకువెళ్తారు. ముహమ్మద్‌ కూడా నాన్నని, నాన్నమ్మని, చెల్లెళ్ళని చూడాలని
ఉత్సాహంగా తన సంచి సర్దుకుని తండ్రి కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ తండ్రి రాడు. ముహమ్మద్‌ తండ్రి ఈ కళ్ళు లేని బిడ్డ సంరక్షణ తీసుకోవడానికి ఇష్టపడడు. అతనికి మళ్ళీ వివాహం చేసుకోవాలని కోరిక. కానీ గుడ్డి కొడుకు ఉన్నాడని తెలిస్తే అతని బాధ్యత జీవితాంతం తీసుకోవడానికి ఏ స్త్రీ తల్లిగా వస్తుంది? అందుకని అసలు ఈ కొడుకు ఉన్నాడన్న విషయమే ఎవరికీ చెప్పడు. కానీ ఇప్పుడు స్కూలు యాజమాన్యం సెలవులలో స్కూలు మూసి వేస్తారని ముహమ్మద్‌ని ఇంటికి తీసుకువెళ్ళడం తప్పదని గట్టిగా చెప్పడంతో తప్పక, ఇష్టం లేక స్కూలుకి చాలా ఆలస్యంగా వస్తాడు. గేటు ముందు కూర్చున్న కొడుకుని చూసినా ముందు అతని వద్దకు వెళ్ళకుండా ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్ళి సెలవుల్లో కొడుకుని
ఉంచుకొమ్మని బ్రతిమలాడతాడు. కానీ ప్రిన్సిపాల్‌ ఒప్పుకోడు. ముహమ్మద్‌ టీచర్‌కి అతనంటే చాలా ఇష్టం. అతను ముహమ్మద్‌ తండ్రి వైఖరి చూసి బాధపడతాడు. సున్నిత మనస్కుడైన ముహమ్మద్‌ తండ్రి వైఖరి గమనిస్తే బాధపడతాడని అతని తండ్రి సంగతి తెలియకుండా జాగ్రత్తపడతాడు.
చివరకు తప్పక తండ్రి ముహమ్మద్‌ను ఊరికి తీసుకువస్తాడు.కళ్ళు లేకపోయినా ముహమ్మద్‌ తండ్రి ముభావాన్ని, అతని స్పర్శలో ప్రేమ లేకపోవడాన్ని గమనిస్తాడు. అతను ఊరికి వెళ్ళాక మాత్రం అతని చెల్లెళ్ళు మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానిస్తారు. అతని రాకను ఆనందిస్తారు. నాన్నమ్మ కొండంత ప్రేమ చూపుతుంది. దారిలో ముహమ్మద్‌ తండ్రి తాను చేసుకోబోయే అమ్మాయికి నగలు కొంటాడు. అవి తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్ళి మాటలు మాట్లాడుకుని ఆమె తల్లిదండ్రులకు ఆ కానుకలన్నీ సమర్పిస్తాడు. అతని పిల్లలకు ఇవ్వడానికి మాత్రం అతనేమీ తీసుకురాడు. ముహమ్మద్‌ మాత్రం స్కూలులో తాను తయారుచేసిన కానుకలను చెల్లెళ్ళకీ, నానమ్మకు కూడా ఇస్తాడు. అతని ప్రేమకు నానమ్మ కళ్ళు చెమరుస్తాయి.
అడవిలో పూల మధ్య ఆనందంగా రోజులు గడుపుతుంటాడు ముహమ్మద్‌. అతని చెల్లెళ్ళు స్కూలుకు వెళ్తుంటారు. వారి స్కూలుకు ఇంకా సెలవులు ఇవ్వలేదు. చదువంటే ఎంతో ఇష్టపడే ముహమ్మద్‌ తాను కూడా స్కూలుకు వెళ్తానని గోల చేస్తాడు. కానీ చెల్లెళ్ళు అతన్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు. తోటి పిల్లలు వెక్కిరిస్తారని ముహమ్మద్‌ స్కూలుకి రావడం వారికి ఇష్టముండదు. ముహమ్మద్‌ నానమ్మ మాత్రం అతని కోరిక గ్రహించి ఆ స్కూలు టీచర్‌ని పర్మిషన్‌ అడిగి అతన్ని క్లాసులో కూర్చోబెడుతుంది. క్లాసులో అందరికన్నా ముందుగా, తొందరగా పాఠాలు అప్పచెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు ముహమ్మద్‌. టీచర్‌ అతని తెలివిని అందరి ముందు మెచ్చుకున్నప్పుడు మొదటి సారి ముహమ్మద్‌ని చూసి గర్వపడతారు అతని చెల్లెళ్ళు.
ముహమ్మద్‌ తండ్రి మాత్రం అతను తన పెళ్ళికి అడ్డు వస్తున్నాడని, అతన్ని ఇంటి నుండి దూరం ఉంచాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వేరే ఊరిలో ఒక గుడ్డివాడయిన వడ్రంగి ఉన్నాడని తెలుసుకుని అతని వద్ద పని నేర్చుకోవడానికి ముహమ్మద్‌ని పంపాలనుకుంటాడు. ముహమ్మద్‌ కూడా తనలాగానే గుడ్డివాడని తెలుసుకున్న ఆ వడ్రంగి ఆ బిడ్డకు పని నేర్పించడానికి ఒప్పుకుంటాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో ముహమ్మద్‌ని మోసం చేసి తనతో తీసుకువెళ్త్తాడు ముహమ్మద్‌ తండ్రి. ముహమ్మద్‌ ఏడుస్తున్నా అతన్ని బలవంతంగా ఆ వడ్రంగి వద్ద వదిలిపెడతాడు. ఇంట్లో కుటుంబంతో సమయం గడపాలని కోరుకుని ఇంటికి వచ్చిన ముహమ్మద్‌ మనసు ఈ సంఘటనతో గాయపడుతుంది. ఏడుస్తూ ప్రపంచాన్ని తానెంత ప్రేమించినా తనను ఎవరూ స్వీకరించట్లేదని అతను వడ్రంగితో చెప్పుకునే సన్నివేశం కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది. ఆ వడ్రంగి కూడా ఇలాంటి అనుభవాలను ఎన్నో చూసి ఉన్నాడు కాబట్టి ముహమ్మద్‌ కన్నీళ్ళ వెనుక ఉన్న గాయాలు అర్థమవుతాయి. మౌనంగా తన కొత్త శిష్యుడిని స్పృశిస్తూ అతని బాధ తనకు అర్థమవుతోందనే సందేశాన్ని మాత్రమే ఇవ్వడం తప్ప ఏమీ చేయలేడు.
తన కొడుకు క్రూరత్వం, తనకు తెలియకుండా ముహమ్మద్‌ని ఇంటికి దూరం చేయడం ఆ ముసలి నాన్నమ్మ తట్టుకోలేకపోతుంది. ఒంటరిగా ముహమ్మద్‌ దగ్గరకు బయల్దేరుతుంది. ముహమ్మద్‌ తండ్రి తన తల్లి వెంటపడి తన బాధను చెప్పుకుంటాడు. తనకో తోడు కావాలని, ఒకవైపు పేదరికం, మరోవైపు ఒంటరితనం, తన ఆఖరి రోజులు ఎలా గడుస్తాయనే భయం తనను అశక్తుడ్ని చేస్తున్నాయని, తన బాధను అర్థం చేసుకోమని, ఎంతో కొంత డబ్బు ఇస్తే తప్ప తనకు పెళ్ళి కాదని, పైగా గుడ్డి కొడుకు ఉన్నాడంటే తన వైపు ఏ స్త్రీ చూడదని, తాను రోజులెట్లా గడపాలో చెప్పమని తల్లి ముందు భోరుమని ఏడుస్తాడు. కొడుకు బాధను అర్థం చేసుకుని అశక్తురాలై మనవడి మీద ప్రేమ చంపుకుని ఇంటికి తిరిగి వస్తుంది ఆ ముసలి తల్లి. కానీ ఆ నిమిషమే ఆమెలో బ్రతకాలనే కోరిక కూడా చచ్చిపోతుంది. మనోవ్యధతో కొన్ని రోజులకే మరణిస్తుంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ముహమ్మద్‌ని తీసుకురాడు అతని తండ్రి. ఒక ఇల్లు బాగు చేసి, కొత్త భార్య కోసం అన్నీ సిద్దం చేసుకుంటాడు.
కానీ ఎవరి ద్వారానో ముహమ్మద్‌ గురించి తెలుసుకుంటారు పెళ్ళి వారు. ఈ పెళ్ళి జరగదని, అతను ఇచ్చిన కానుకలన్నీ తిప్పి పంపిస్తారు. ఇక తనకు జీవితంలో పెళ్ళి కాదనే నిరాశలో కూరుకుపోతాడు అతను. ఇక తప్పక ముహమ్మద్‌ని తీసుకురావడానికి వెళ్తాడు. తండ్రిలో ఆ దగ్గరితనం కనిపించకపోయినా మౌనంగా తండ్రితో వెళ్ళడానికి సిద్ధపడతాడు ముహమ్మద్‌. దారిలో ఒక వాగు దాటేటప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతాడు ముహమ్మద్‌. తండ్రి చూస్తూ కూడా ఏమీ చేయడు. కానీ బిడ్డ నీళ్ళల్లో దూరంగా కొట్టుకుపోతున్నప్పుడు అతనిలోని తండ్రి ప్రేమ బైటకు వస్తుంది. తన కంటిముందు మునిగిపోతోంది తన కన్నబిడ్డే అన్నది అతని మనసు చెబుతుంది. కన్నీళ్ళతో, పశ్చాత్తాపంతో అతను నీళ్ళలోకి దూకుతాడు. ప్రాణాలకు తెగించి బిడ్డ కనిపించిన వైపునకు ఈదుకుంటూ వెళ్తాడు. గాయాలను లెక్క చేయక చాలా ప్రయత్నిస్తాడు. చివరకు స్పృహ తప్పుతాడు. మెలకువ వచ్చాక అతను తాను ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు గమనిస్తాడు. కాస్త దూరంలో ముహమ్మద్‌ కూడా కనిపిస్తాడు. కన్నీళ్ళతో కొడుకు వద్దకు వెళ్ళిన ఆ తండ్రి ప్రాణం లేని కొడుకు శరీరాన్ని హత్తుకుని తనను క్షమించమని కన్నీళ్ళతో చేసే ఆక్రందన మనసు ద్రవింపచేస్తుంది. అప్పుడు చనిపోయిన ఆ శవం చేయి చిన్నగా కదులుతుంది. ఒక వింత వెలుగుతో ప్రకాశిస్తుంది. దాని లోతు తెలుసుకునే ఆ చిన్న మనసు, మనిషిలో ఒక్క క్షణం చిగురించిన మానవత్వాన్ని స్పృశిస్తుంది. అది తాను చూడాలనుకున్న మానవత్వాన్ని స్పృశిస్తున్న అనుభూతా లేదా స్వర్గంలో దేవుని చేతిని అందుకుంటున్న అనుభవమా అన్నది నిర్ధారించుకోవలసింది ప్రేక్షకులే.
ఈ సినిమాలోని ఆఖరి ఘట్టం మనిషి మనసును ఎన్నిరకాలుగా ఆవిష్కరిస్తుందో చూపిస్తుంది. ముహమ్మద్‌ తండ్రి చెడ్డవాడు కాదు. కానీ సుఖంగా జీవించడానికి వ్యవస్థలోని మనుష్యుల కోరికలకు బలయిన ఒక సాధారణ జీవి. బిడ్డ నీళ్ళల్లో పడ్డప్పుడు అతని చావునే కోరుకున్నాడు. కానీ కొన్ని క్షణాలలోనే అతని మానవత్వం మేల్కొంటుంది. ఈ ప్రపంచంలో ఆర్థిక అసమానతలు సృష్టించిన పేద, గొప్ప తేడాల మధ్య జీవిస్తున్న ప్రతి వ్యక్తిలో మనసుకి, మేధస్సుకి మధ్య జరిగే పోరాటమే అతనిలో చూస్తాం. కొడుకుకి, మనవడి ప్రేమకి మధ్య ఏం చెప్పలేక ఇరుపక్షాలలోని బాధను నిస్సహాయంగా చూసే ఆ ముసలి తల్లి పడే వేదన… ఇవన్నీ మనసుని కలచివేస్తాయి. ఎంతో వాస్తవంగా, సున్నితంగా ప్రపంచంలో జీవించడానికి మనసుని కుదువ పెట్టుకుంటున్న మానవ జీవితాలను చూపిస్తారు దర్శకులు.
ముహమ్మద్‌ తన చేతి వేళ్ళతో ప్రపంచాన్ని చూస్తాడు. రంగుల్ని చూసే ప్రయత్నం చేస్తాడు. చివరకు మృత్యువు దగ్గర నిల్చి కూడా ప్రతి దాన్ని తాకి అనుభవించి, అనుభూతి పొందాలన్న అతనిలోని ఆ స్పర్శను ఆఖరి సీన్‌తో దర్శకుడు ఎంత అద్భుతంగా చూపించాడంటే ఇది సినిమా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన చిత్రీకరణ. స్వర్గపు రంగుని తండ్రి పశ్చాత్తాపంతో బిడ్డను మొదటిసారి దగ్గరగా తీసుకోవడంలో అనుభవించాడా లేదా ఈ క్రూర ప్రపంచం నుంచి నిష్క్రమించి ఏ అసమానతలు, వైషమ్యాలు లేని ఆ మరో ప్రపంచంలో తన చేయి అందుకున్న దేవదూతల స్పర్శతో అనుభవించాడా అన్నది మరో ముహమ్మద్‌ మనసుకే తెలియాలి. అద్భుతమైన ఛాయాగ్రహణంతో ఈ సినిమా కంటికి, మనసుకి, మెదడుకి మందులా పనిచేస్తుంది. మనసున్న వ్యక్తులు మరచిపోలేని చిత్రంThe colour of Paradise

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.