చావడి పక్కనున్న
చింత చెట్టుకి
ఊయలలా మారి
నన్ను లాలించిన
ముద్ద మందార పూల
అమ్మ చీర
మా ఇంటి
మట్టి కుండకు
గొడుగులా చుట్టుకున్న
బులుగు చీరల
అమ్మమ్మ చీర
ఎగురుతున్న తూనీగలు,
సీతాకోకచిలుకలను
దిండు కవర్లుగా
మార్చిన అక్క చీర
అమ్మ ఈ రోజుకీ
అక్కకు ప్రేమ కానుకగా
త్యాగం చేస్తున్న
బతుకమ్మ చీర
గుడి బయట
కొబ్బరికాయ కొంటూ
ప్రియురాలి దేవతను
దర్శింపచేసిన
లేత నిమ్మ పసుపు చీర
అమ్మ ముఖంలో
నవ్వులు పూయించే
నా స్నేహితురాళ్ళ
బహుమతి చీర
గడుసరి స్నేహితురాలి
అల్లరిని మెరిపించే
నెమలి చీర
నాన్న చనిపోయినుప్పుడు
అమ్మను ఏడిపించిన
తెల్ల చీర
ఆకాశ చుక్కల చీరలో
నడుచుకుంటూ
వెళ్తున్న తల్లి భూదేవి
ఇసక మైదానంలో
సేద తీరుతున్న
కొన్ని వందల
చీర పక్షులు
గాలి చెట్టుకి పూస్తున్న
మరికొన్ని చీర పిట్టలు
నా కలల హరివిల్లుకు
వెచ్చటి
రంగు రంగుల
చీర దుప్పట్లను
కప్పుకుంటాను.
1. దీAజఖ ుూ ునజు చీAుఖRజు అన్న మాటని మీరెలా చూస్తున్నారు?
పదమూడు సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఇరవై సంవత్సరాల హైదరాబాద్ నగర జీవితం వదిలేసి నిజామాబాద్ దగ్గరున్న నా స్వగ్రామం శ్రీనగర్‌కు ఏడాది క్రితం తిరిగి వచ్చాను. జీవితంలో ఉద్యోగం చేయకూడదు అని నిర్ణయించుకుని ఫ్రీలాన్సర్‌గా పిల్లల యానిమేషన్ సినిమాలకు మాటలు రాశాను. దాంట్లో భాగంగానే ప్రపంచంలోని గొప్ప గొప్ప పిల్లల సినిమాలు చూశాను. అవన్నీ పిల్లలకు పెద్దలు ఉపయోగ పడాలని ‘పిల్లల సినిమా కథలు’ కాఫీ టేబుల్ బుక్ తెచ్చాను. కేవలం రెండున్నర నెలల్లో కాపీలన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు ‘బాలల సినిమా కథలు’ అనే పుస్తకం రాస్తున్నాను. బోల్డంత కవిత్వం రాస్తున్నాను. ‘దీaషస ్‌శీ ్‌ష్ట్రవ చీa్‌బతీవ’ అంటే ‘దీaషస ్‌శీ ్‌ష్ట్రవ వీశ్‌ీష్ట్రవతీ’ అంటాను. నేను తిరిగి నా అమ్మ వద్దకు చేరాను. ఆ అమ్మ కమ్మదనం, పక్షులు నన్ను మానసికంగా పునర్జన్మించేలా చేశాయి. వీటన్నిటికీ తోడు పిల్లల కోసం తీయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాను.
2. ప్రకృతి, మానవ ప్రకృతిలో మిమ్మల్ని ఆకట్టుకునే విషయాలు?
ప్రకృతిలో సమస్తం నాకు ఆరాధన, ఇష్టం. ఇప్పుడు వర్షాకాలం. ఈ వాక్యం రాస్తున్నప్పుడు కూడా ఈగల గుంపు నాపై వాలుతూ ఉంది. ఈ ఈగ ఎంత ముఖ్యమో మా పొలాలపై ఎగిరే వందల రామచిలుకలు, ట్రాక్టర్ పొలం దున్నుతుంటే భూమిలోని పురుగుల కోసం దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే తెల్లటి కొంగలు, అద్భుతమైన ఇంజనీరింగ్ శైలిలో గూళ్ళు కట్టే గిజిగాళ్ళు, నల్లబఱ్ఱెపై ధ్యానం చేసే తెల్ల కొంగ, నా చిన్నతనం నుండి కాలయంత్రంలో ప్రయాణించి నా ఒడిలో వాలిన ఎర్ర తూనీగ, వానలో కాలవలో కాగితం పడవలు వదిలే పచ్చకప్ప, నాతో నిత్యం సంభాషించే మా ఇంటి జామచెట్లు, మామిడి చెట్టు, ఇలా ప్రతిదీ ముఖ్యమే. మానవ స్వభావంలో నాకు నచ్చేవి భోళాతనం, ముక్కుసూటితనం, లెక్కలు వేసుకోకుండా చేసే స్నేహాలు, ప్రేమలు.
3. కవిత్వంతో మీరు, మీతో కవిత్వం ఇంత గాఢంగా ప్రేమలో పడటం అకస్మాత్ ఘటనా లేక పిల్లల రచయిత మాటున కవి ఎప్పటినుంచో దాగున్నాడా?
2000 సంవత్సరంలో డిగ్రీ చదవడానికి హైదరాబాద్ నగరానికి వచ్చాను. అప్పటికే శ్రీ శ్రీ కవిత్వానికి అభిమానిని. నారాయణగూడలో ప్రయివేట్ హాస్టల్లో ఉంటూ చిక్కడపల్లిలోని ఫుట్‌పాత్‌పై కవిత్వం పుస్తకాలు కొనుక్కుని విస్తృతంగా చదివాను. కవులను కలిశాను. నిద్రలో కూడా కవిత్వాన్ని కలవరించి పలవరించేవాడిని. నా జీవితంలో కవిత్వం ఉంది. కవిత్వంలోనే బతికాను. అనార్కిజం, క్రమశిక్షణ అనే రెండు అంశాలు నాలోని వైరుధ్యాలు. ఇవి రెండు కూడా ఎన్నో సంవత్సరాలుగా నాలో నిబిడీకృతంగా ఉన్నాయి. నాలోని అనార్కిస్టు ప్రపంచాన్ని పరిశీలిస్తే క్రమశిక్షణ దాన్ని రికార్డు చేయిస్తుంది.
4. పచ్చ కప్ప, ఎర్ర బెంచీ, వేప చిలకలు, బులుగు తూనీగ, వాన జింకల గురించి కొంచెం చెప్పండి.
నా కవిత్వంలో పచ్చ కప్ప, ఎర్ర తూనీగ, జింకలు, పక్షులు విరివిగా వస్తుంటాయి. మిత్రుడు సంతోష్ నందిపేట్ దగ్గరున్న శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్స్ (గోదావరి) లోని కొన్ని వందల కృష్ణ జింకలు, పెలికాన్స్, గడ్డిపూలు, బాతులు, కొంగలను తన జీప్‌లో తీసుకెళ్ళి చూపించాడు. అక్కడ కొన్ని వందల నెమళ్ళు, వేల రామచిలుకలు చూశాను. దట్టమైన అరణ్యం మధ్యనున్న మాయా సరోవరం లాంటి అందమైన పక్షుల నెలవైన లింగం చెరువును చూపించాడు. అరుదైన డిచ్‌పల్లి రామాలయం, నల్లరాళ్ళ అద్భుత నవసిద్ధుల గుట్ట చూశాను. నిజామాబాద్ జిల్లాలో ఉన్న అద్భుతాలలో ఇవి కొన్ని. ఇవన్నీ చూడగానే నాలో ఉన్న కవి స్పందించాడు. నా కవిత్వంలో మాయా వాస్తవికత (ఎaస్త్రఱష తీవaశ్రీఱంఎ) ఎక్కువగా ఉంటుంది. ఇది అప్రయత్నంగా జరిగింది.
5. ఒక ఊరు చేతికొస్తే ఇంత కవిత్వం వచ్చింది కదా. మరి ఒక అడవి మీ చేతికొస్తే?
అడవి చేతికొస్తే అద్భుతం జరుగుతుంది. నేను అడవిలో భాగమై కవిత్వంగా మారతాను. చెట్లు నాతో మాట్లాడతాయి. పక్షులు నన్ను కలవరపెడతాయి. ఎందుకంటే ఇవన్నీ నా పూర్వజన్మ నేస్తాలు. కవిత్వం అంటే కాగితం మీద రాసేది కాదు. కవిత్వం పుస్తకంగా ఉండేది కాదు. అది ఒక జీవిత విధానం. అతడు/ఆమె ఒక పొయెమ్‌లా బతకాలి. బతుకులో, జీవితంలో కవిత్వం ఉంది. దాన్ని చూసే కన్ను, మనసు మనకు కావాలి. అంతే.