ప్రేమించిన వాళ్ళైనా, ద్వేషించిన వాళ్ళైనా ఉండేది ఆలోచనల పొరల్లోనే. మెదడు వెనకాల భాగంలో ఉండే ‘‘ఎమిగ్దలా’’ అనే బాదంకాయ సైజు పదార్ధంలోనే భావావేశాల తాలూకు వంట తయారయ్యేది. హృదయం, మనసు, మస్తిష్కం… అనేవన్నీ తలకాయకి పర్యాయ పదాలే! రకరకాలుగా మనం మాటల గారడీ చేస్తుంటాం అంతే. ప్రేమ అయినా, ద్వేషం అయినా,
ముందు తన మీద తనకి ఉన్న ప్రేమనీ, కన్సర్న్‌ని బట్టే వస్తాయి. ప్రేమించిన వాళ్ళు హృదయం లోనూ, ద్వేషించే వాళ్ళు మస్తిష్కంలోనూ ఉండరు. అవన్నీ వాళ్ళ తాలూకు ఆలోచనలు, కవిత్వాలే!! కాకపోతే ప్రేమించిన వాళ్ళంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాబట్టి, ఆ ఆలోచనలు సంతోషాన్ని ఇస్తాయి. ద్వేషించే వాళ్ళ విషయంలో, ఆ ద్వేషం తన ఇగోనో, అభిమానమో దెబ్బ తినబట్టి వచ్చి ఉంటుంది. ఇక్కడా ‘‘అహం’’ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆ మాటకొస్తే, ప్రేమించడం కూడా ‘‘అహం’’ వల్లనే చేస్తాం. ఒకరు అడిగారని ప్రేమించం, మనకిష్టమైతేనే… అంటే మన అహం ఒప్పుకుంటేనే ప్రేమిస్తాం. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఏదో నచ్చి, వాళ్ళ ఆలోచనలు మనకి బాగుండి మాత్రమే. ఇది కూడా అహం కదూ, స్వ అర్థమే కాదూ? ఎదుటివాళ్ళొచ్చి ఇష్టపడమంటే, ప్రేమించమంటే అలానే చేస్తామా?
ప్రేమ, ద్వేషం మాత్రమే కాదు, రకరకాల భావావేశాలు మనిషి సహజాతమే. పుడుతూనే అమ్మని గుర్తు పట్టి అమ్మని విడవకుండా ఉండటం, అమ్మంటే పొజెసివ్‌గా ఉండటం, అమ్మ దూరంగా ఉంటే వచ్చేవరకూ ఉండే దుఃఖం,
ఉక్రోషం లాగా, ఈ ఇతర భావావేశాలన్నీ కూడా ఆయా సందర్భాలను బట్టి ‘‘సహజ’’ సహ`జాతాలే. సహజాతాలు అనేకంటే అవే మనిషి అని చెప్పొచ్చు. ఆలోచనల ద్వారా సమాజంతో మమేకమయ్యే మనిషి స్వభావమే…ఈ ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, ప్రేమ, కీర్తి వ్యామోహం, డబ్బు వ్యామోహం వగైరా. మనిషి పెరిగి పెద్దయ్యాక ఈ ‘‘నేను’’ లోంచి వచ్చిన స్వాతిశయమే మనిషిని ఒకసారి విచక్షణ, నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. ఏం చేసినా ఈ మానవ స్వభావాన్ని మార్చలేం. ఎందుకంటే, ప్రతి మనిషికీ తన మొహంలా అది ప్రత్యేకంగానే ఉంటుంది కాబట్టి. ఏ రెండు స్వభావాలు ఒకేలా ఉండవు. అందుకే మార్చితే మారేవి కావవి. మారుద్దామని ఒకవేళ అనుకున్నా, ఒకో మనిషికి ఒకో వేదాంత కారుడూ, ఒకో ప్రవచనకర్తా ఉండి అనుక్షణం చెక్ చేస్తూ ఉండాలి. అలా అని ఏ ఫీలింగ్ శాశ్వతంగా ఉంటుందని అనుకోలేం. ప్రేమ వికటిస్తే, మన ఇగోని బట్టి అది ద్వేషంగానూ, ఇగో తృప్తి పడితే ద్వేషం ప్రేమగానూ మారే అవకాశమూ ఉంటుంది. కాదంటారా… మనసుని ఆపగలం అంటారా? అందుకే చెప్పారు, అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్దికి జ్ఞానమే సోపానమని. మనం మనమే. భావావేశాలనీ, అహాలనీ మోస్తూ తిరిగే ‘‘మర’’ మనుషులమే.