అన్ని గాలులు వీచే ముందు
ముందుగా
తమ దిశను ప్రకటించాలని ఎవరో ఆదేశించారు
గాలులు మొదట తమ వేగాన్ని కూడా తెలియజేయాలి
అవి ఇష్టం వచ్చినట్లు వేగంగా వీయడానికి ఇక వీలులేదు తుఫానులు
ఇకపై అనుమతించబడవు
మా ప్రాకారాలన్నీ ఇసుకతో నిర్మించబడ్డాయి
మా రాజభవనాలన్నీ కాగితంతో తయారు చేయబడ్డాయి
వాటిని రక్షించుకోవడం ముఖ్యం
అందరికీ తెలిసిందే
తుఫాను వాటి పాత శత్రువు
ఆ నదిలో తరంగాల్ని కూడా ఎవరో రేపుతున్నారు
వాటి తిరుగుబాటుని అరికట్టాలి
వాటిని వాటి పరిమితుల్లో ఉంచాలి
వాటి చురుకైన పెరుగుదల మరోసారి తలెత్తకుండా సమర్ధవంతంగా
తిప్పికొట్టాలి.
కాబట్టి అప్రమత్తంగా ఉండాలి
వాటిలో ఏదో తప్పుడు సూచన ఉంది
వాటిలో ఏదో ఒక పిచ్చి దుశ్శకునం ఉంది
ఆ శకునం ఒక తిరుగుబాటు.
ఏ తిరుగుబాటూ సహించబడదు
ఈ పిచ్చి అంగీకరించబడదు
తరంగాలు నదిలో ఉండాలనుకుంటే
అవి ఎప్పుడూ నిశ్శబ్దంగానే ప్రవహించాలి.
ఇకపై అన్ని పువ్వులు ఒకే రంగులో ఉండాలని
ఎవరో ఒకరు నిర్ణయించారు
రేపటి తోటలు ఏ ఆకారంలో ఉండాలో
నిర్ణయించే కొందరు అధికారులు ఉంటారు
ఖచ్చితంగా పువ్వులు అన్నీ ఒకే రంగులో ఉంటాయి
కానీ ఎంత లోతైన రంగు లేదా ఎంత కాంతిలో ఉంటాయో
అధికారులు ఎలా నిర్ణయిస్తారు?
ఒక తోటలో ఎక్కడా ఒకే రంగు పువ్వులు
ఉండవని వారికి ఎలా చెప్పాలి
అనేక రంగులు కలిసి ఒకే రంగులో దాక్కుంటాయి
తోటను ఒకే రంగుగా మార్చడానికి ప్రయత్నించిన
వారి విధిని చూడండి
వంద రంగులు ఒకే రంగులోకి వచ్చి
అవి ఎంత ఇబ్బంది పెడుతున్నాయో
వారు ఎంత ఆందోళన చెందుతున్నారో చూడండి.
వారికి ఎలా చెప్పాలి?
గాలులు, తరంగాలు ఎవరి ఆజ్ఞల్నీ ఎప్పుడూ పట్టించుకోవు
పాలకుల పిడికిళ్ళలో గాలులు ఉండవు
జైళ్ళలో కవులు, కళాకారులు ఉన్నట్టు.
ఒకవేళ ఈ తరంగాలు ఆగిపోయినప్పటికీ,
నది ఎంత ప్రశాంతంగా మారినప్పటికీ,
ఈ పొంచివున్న వరద, తుఫాను
కేవలం ఒక అడుగు దూరంలోనే ఉంటాయని
వారికి ఎలా చెప్పాలి?