(గత సంచిక తరువాయి…)
గాంధీ`ఇర్విన్ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నప్పుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు.
శారద ఆ వార్త విని అచేతనంగా ఉండిపోయింది చాలా సేపు.
సుదర్శనం చాలా ఆందోళనతో వచ్చాడు శారద దగ్గరకు.
ఇద్దరూ కలిసి మైలాపూర్ సముద్ర తీరంలో చాలాసేపు మాటలు లేకుండా కూర్చుండిపోయారు.
సుదర్శనం ముఖం, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది.
‘‘కాసేపు సముద్రంలో ఈతకొట్టి రా సుదర్శనం, చల్లబడతావు’’ అంది శారద అతని
ఉద్రేకాన్ని చూసి నవ్వుతూ.
‘‘నీకు నవ్వెలా వస్తోంది శారదా. భగత్‌సింగ్‌ని తల్చుకుంటే నాకు దుఃఖం ఆగటం లేదు. ఇంత అన్యాయమా?’’ సుదర్శనం ఏడ్చేశాడు.
‘‘ఈ దేశంలో అన్యాయం లేనిదెక్కడో చెప్పు. అన్యాయాన్ని సహించటం అలవాటు చేసేశారు.’’
‘‘కానీ శారదా, గాంధీ దీనిని ఎలా చూస్తూ ఊరుకున్నారు? ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? నాకు గాంధీ మీద విశ్వాసం పోయింది. చాలా కోపంగా ఉంది.’’
‘‘ఒద్దు సుదర్శనం, విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఇవాళ దేశానికి గాంధీ మాత్రమే ఆశాకిరణంలా ఉన్నారు. ఆయనని కూడా నమ్మకపోతే మనం బతకలేం.’’
‘‘కానీ ఆయనేం చేశాడు. వైస్రాయితో జరిపిన చర్చల్లో భగత్‌సింగ్ ఉరిని ఆపాలనేది ఒక షరతుగా ఎందుకు పెట్టలేదు?’’ తీవ్రత ఆగటం లేదు సుదర్శనం కంఠంలో.
‘‘ఏమో, ఎందుకు పెట్టలేదో. నమ్ము. సకారణంగానే గాంధీ అలా చేశారని నమ్ము. ఆ మాత్రం నమ్మకం లేకపోతే శాంతి ఉండదు. బతకటం కష్టమైపోతుంది. నేను విశ్వసిస్తున్నాను. నీకూ చెబుతాను నా విశ్వాసానికి కారణాలను. కారణాలతో పనిలేకుండా లక్షల మంది విశ్వసిస్తున్నారు గాంధీని. ఆ ఆధారాన్ని ఒదలొద్దు.’’ సుదర్శనం భుజం మీద చేయి వేసింది శారద.
‘‘కానీ శారదా. భగత్‌సింగ్ ఎంత ధైర్యంగా ఉరికంబమెక్కాడో తెలుసా? తృణప్రాయంగా చూశాడు ప్రాణాన్ని. పాట పాడుతూ ఉరికంబం ఎక్కాడు’’ సుదర్శనానికి దుఃఖం ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు.
శారద కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నా అవి వెలుగుతున్న ప్రమిదల్లా కాంతిని విరజిమ్ముతున్నాయి.
‘‘సుదర్శనం, అంత బేలగా అయిపోకూడదు నువ్వు. భగత్‌సింగ్ మరణించాడని నువ్వు ఏడుస్తున్నావు. కానీ అతనికి తెలుసు తనకు మరణమన్నదే లేదని. అతనికి ముందు చూపు. అతనికి తెలుసు లక్షలాది యువతీ యువకుల మనసుల్లో చిరకాలం తాను జీవించబోతున్నానని. అందుకే ఆయనకంత ఉత్సాహం ఉరికంబం దగ్గర. అమృతం తాగాడాయన ఆ క్షణంలో. భగత్‌సింగ్ చనిపోయాడని ఎందుకనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? నీకు ఆయన ఎన్నడైనా కనిపించాడా? ఒక్కసారైనా చూశావా? అతనొక వెలుగు. అతనొక మార్గం. ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఎవరిమీదనైనా మనకి విశ్వాసం పోతుందేమో. కానీ భగత్‌సింగ్ మన విశ్వాసాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు. ఉజ్వలంగా జీవిస్తూ, శ్వాసిస్తూ, మన రక్తంలో ప్రవహిస్తూ ఉంటాడు.’’
శారద మాటలు సుదర్శనం దుఃఖాన్ని పోగొట్టి అతనిలో కొత్త చైతన్యాన్ని నింపాయి. శారదలో ఉన్న శక్తి అదే. శారద చుట్టూ చేరే యువకులూ, విద్యార్థులు తమ తమ నిరాశా నిస్పృహలను పోగొట్టుకునేది ఈ విధంగానే.
బలహీనంగా శారద దగ్గరకు వచ్చిన సుదర్శన్ కొత్త బలంతో అక్కడినుంచి బయల్దేరాడు.
‘‘మూర్తిని చూశావా? దెబ్బలు బాగానే తగిలాయి’’ అన్నాడు వెళ్ళబోతూ.
‘‘చూడలేదు. వాళ్ళిల్లు నాకు తెలియదు’’ అంది శారద నిర్లిప్తంగా.
‘‘నేనిప్పుడు అక్కడికే వెళ్దామనుకుంటున్నా. నువ్వూ రాకూడదూ?’’
శారద రెండు నిమిషాలు తటపటాయించింది. వెళ్తేనే మంచిది. మూర్తిని ఆ ఇంట్లో భార్యా పిల్లల మధ్య చూస్తే తన మనసు ప్రశాంతం కావచ్చు.
‘‘నేను వస్తాను. ముందు మా ఇంటికి వెళ్ళి వెళ్దాం’’. ఇద్దరూ శారద ఇల్లు చేరారు.
శారద లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి చీర మార్చుకుని వచ్చింది.
వీళ్ళిద్దరూ ట్రిప్లికేన్‌లో ఉన్న మూర్తి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రమయింది. బస్సులు, ట్రాములు ఒక పట్టాన దొరకలేదు.
వీళ్ళిద్దరినీ ఆహ్వానించిన మూర్తి భార్య లక్ష్మిని చూస్తే శారదకు ఏదో జాలి పొంగుకొచ్చింది.
లక్ష్మి వీళ్ళిద్దరినీ మూర్తి పడుకుని ఉన్న గదిలోకి తీసికెళ్ళింది.
విశాలమైన గది. గాలీ వెలుతురు వచ్చే గది.
మూర్తి మధ్యాహ్నపు నిద్ర నుండి అప్పుడే లేచినట్లున్నాడు. చాలా బలహీనంగా అనిపించాడు.
‘‘నా భార్య లక్ష్మి…’’
‘‘పరిచయం అయింది’’ ప్రశాంతంగా నవ్వింది శారద.
సుదర్శనం కుశల ప్రశ్నలు అడుగుతుంటే శారద నాడి చూసి, కళ్ళూ నాలుకా పరీక్షించింది.
లక్ష్మి వంక తిరిగి ‘‘రక్తం బాగా పోయినట్లుంది. పాలు రెండు పూటలా ఇవ్వండి. వేరుశనగపప్పు, బెల్లం కలిపి
ఉండలు చేసి పెట్టండి. అంతా బాగుంది. కంగారుపడాల్సిందేమీ లేదు’’ అని ధైర్యం చెప్తున్నట్లు అంది.
‘‘భగత్‌సింగ్‌ని ఉరి తీశారని విని తట్టుకోలేక శారద దగ్గరకు వెళ్ళాను. శారద మాటలతో కాస్త ఊరట కలిగింది. ఇద్దరం నిన్ను చూడాలని ఇక్కడకు వచ్చాం.’’
‘‘మంచి పని చేశారు. భగత్‌సింగ్ ఉరితో భారత ప్రజలకు బ్రిటీష్ ప్రభుత్వం మీద అసహ్యం, కోపం మరింత పెరుగుతాయి?’’
‘‘కానీ గాంధీ ఈ ఉరిని ఆపొచ్చు కదా. శారద ఎంత చెప్పినా నాకు గాంధీ మీద ఈ విషయంలో కోపంగానే
ఉంది.’’
‘‘లేదు సుదర్శనం. గాంధీనే కాదు, ఎవరూ ఆపలేరు భగత్‌సింగ్ మరణాన్ని. అతను దేశ స్వాతంత్య్రానికి తన జీవితాన్ని కానుక చేయదల్చుకున్నాడు. అది గాంధీకి అర్థమైందేమో.’’
‘‘అంటే… ’’ సుదర్శన్ అసహనంగా అన్నాడు.
‘‘అంతే. భగత్ సింగ్ మార్గం, గాంధీ మార్గం పూర్తిగా భిన్నం. ఆ భిన్నత్వాన్ని అంగీకరించాడు గాంధీ. భగత్‌సింగ్ దేశంలోని యువతరానికి సాహసం నేర్పదల్చుకున్నాడు. భగత్‌సింగ్ బ్రిటీష్ వాళ్ళను క్షమాపణ అడుగుతాడా? తాను చేసింది ఇంకో పదిసార్లయినా అవకాశం వస్తే అలాగే చేస్తానంటాడు. చెరసాలనూ, ఉరికొయ్యలనూ, ప్రాణత్యాగాలనూ లెక్కచెయ్యని సాహసం భగత్‌సింగ్‌ది, అతని సహచరులది. ఆ సాహసం రగిలించాడు భగత్‌సింగ్. యువతరంలో… ఆ యువతీ యువకుల సాహసం, దీక్ష కావాలి గాంధీకి. ఆ సాహసాన్ని ఆయన మరో మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే సాహస యాత్రికులను భగత్‌సింగ్ మన జాతికి అందించాడు’’ శారద తన ఆలోచనలకు మరింత స్పష్టమైన రూపాన్నిచ్చి చెప్తున్న మూర్తివంక అలాగే చూస్తుండిపోయింది.
సుదర్శనం మరింత అసహనంగా లేచి నిలబడ్డాడు.
‘‘అంటే అది రాజకీయ ఎత్తుగడా…?’’
‘‘కావొచ్చు. కాకపోవచ్చు.’’ అన్నాడు మూర్తి.
శారద కాస్త గట్టిగా చెప్పింది.
‘‘కాదు. కానే కాదు. గాంధీ ఏం చెయ్యాలని నీవనుకుంటున్నావు సుదర్శనం? భగత్‌సింగ్‌ని ఉరి తీయొద్దని, క్షమించమని అడగటమంటే అతని మార్గం నుంచి అతన్ని దారి మళ్ళించటమే. గాంధీ ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తాడు. ఈ సంఘటనను మనం మామూలు దృష్టితో, బాధతో, మమకారంతో అర్థం చేసుకోకూడదు. చాలా ఉన్నతం భగత్‌సింగ్ ప్రాణత్యాగం. గాంధీనో, మరొకరో రక్షిస్తే జీవించి, లేకపోతే మరణించేంత స్వల్ప ప్రాణం కాదు భగత్‌సింగ్‌ది. ఆయన లక్ష్యం వేరు. భగత్‌సింగ్ మరణించాడని నువ్వంటున్నావు. అతనికి మరణమే లేదని నేనంటున్నాను. యువకుల మనసుల మీద భగత్‌సింగ్ వేసిన ముద్ర ముందు గాంధీ చాలడు. అది ఇవాళ కాదు… ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది.’’
‘‘ఔను సుదర్శనం. నా అభిప్రాయం కూడా అదే. శారదా, నేనూ ఒక్కలాగే ఆలోచిస్తాం. కదూ శారదా’’. మూర్తి బలహీనంగా నవ్వాడు.
శారదకు ఒక్కసారి పట్టరాని దుఃఖం వచ్చింది. దానిని నిగ్రహించుకుని పేలవంగా నవ్వింది.
లక్ష్మి ఫలహారాలేవో తీసుకొచ్చింది. లక్ష్మితోపాటు రెండేళ్ళ వయసున్న చిన్న పిల్లవాడు కూడా వచ్చాడు.
‘‘మా అబ్బాయి’’ అంది లక్ష్మి.
‘‘వాడి పేరు మీ నాన్నగారి పేరే… రామారావు’’ మూర్తి శారద కళ్ళలోకి చూసే ప్రయత్నం చేశాడు.
శారద పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది. ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల మీద ముద్దు పెట్టింది.
సుదర్శనం తను పనిచేస్తున్న పత్రిక విశేషాలేవో చెబుతూ కూచున్నాడు.
‘ ‘‘ఆలస్యం అవుతోంది. వెళ్దామా’’ అని లేచింది శారద.
లక్ష్మి, శారదకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది.
ఆ రాత్రి శారద మనసు ప్రశాంతమైంది. మూర్తి మంచి స్నేహితుడు. అంతేనని ఆమె మనసు స్థిరం చేసుకుంది.
‘‘మూర్తి మగవాడు కాకపోతే ఎలా అరమరికలు లేకుండా స్నేహం చేసేదో అలాగే చెయ్యాలి. మూర్తి ఈ స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొత్తగా ఏర్పడుతోంది. బహుశా ఆ స్నేహాన్ని తనలాగా ఆస్వాదిస్తున్న స్త్రీ ఆంధ్రదేశంలో ఇంకొకరు లేరేమో. తనకు మగ స్నేహితులే చుట్టూ… వాళ్ళతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతోంది. వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తుంది. వాళ్ళు నిరాశతో ఏడుస్తుంటే తల నిమిరి బుజ్జగిస్తుంది. వాళ్ళెవరూ దానిని వేరే రకంగా తీసుకోలేదు. కొందరు అక్కా అని బాంధవ్యం కలుపుకున్నా స్నేహంగానే చూసేవారు చాలామందే ఉన్నారు. బహుశా మూర్తి ఈ స్నేహం ప్రేమగా అనుకుంటున్నాడేమో. సుదర్శనంతో స్నేహానికి, మూర్తితో స్నేహానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. సుదర్శనంతో కంటే మూర్తితో తన భావాలు బాగా దగ్గరవుతాయి. తను సుదర్శనానికి బలం ఇవ్వగలదు. మూర్తి తనకు బలం ఇవ్వగలడు. భావాలలో తనకంటే బలమైన పురుషుడిని మొదటిసారి చూసి తను కూడా కొంత సంచలనానికి, ఆకర్షణకు లోనయింది. అది ప్రేమ అనుకున్నది. తనలాంటి ఆధునిక స్త్రీని ఎన్నడూ చూడని మూర్తి తనని చూసి ఆకర్షితుడై ప్రేమిస్తున్నాననుకున్నాడు. కానీ ఇదంతా తాత్కాలికం. తమది స్నేహం.
స్త్రీ పురుషుల మధ్య స్నేహం కుదురుతుంది. నాన్నకూ, హరి బాబాయికి ఉన్న స్నేహం లాంటిదే తమ స్నేహం.
శారదకు చలం గారి ‘శశిరేఖ’ పుస్తకం గుర్తొచ్చింది. స్నేహం, ప్రేమ, మోహం వీటి గురించి గందరగోళ పడే కదా శశిరేఖ అంత ఘర్షణ పడిరది. తనకా గందరగోళం ఉండకూడదు.
శశిరేఖ గురించి ఆలోచించటానికి చాలా ఉందనిపించింది. ఆ పుస్తకం తీసి చదువుతూ నిద్రపోయింది.
మరుసటి రోజు కాలేజీలో, ఆస్పత్రిలో పనులన్నీ ముగిసాక ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళింది. స్త్రీ పురుష సంబంధాలను మానసిక శాస్త్ర రీత్యానూ, సామాజికంగానూ విశ్లేషణ చేసే పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగింది. హెవలాక్ ఎల్లిస్ పుస్తకం చదివారా అని అడిగారాయన. లేదంది. ‘నా దగ్గరుంది ఇస్తాను’ అని తనతో పాటు శారదను ఇంటికి తీసుకెళ్ళి ఆ పుస్తకం ఇచ్చి పంపాడు.
… … …
ఆసుపత్రిలో ఆ రోజు విపరీతంగా పని మీద పడిరది శారదకు. సరళ అనారోగ్యంతో నాలుగు రోజులుగా రావటం లేదు. ఆడవాళ్ళ వార్డులో డ్యూటీ శారద మీద పడిరది. ఉదయం ఆరు గంటలకే వెళ్ళిన శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. చాలా అలసటతో వెంటనే స్నానం చేసి నిద్రపోవాలనుకుంటూ వచ్చిన శారదను వాకిట్లోనే ఆపింది సుబ్బమ్మ.
‘‘అమ్మాయ్… ఇంతాలస్యమా? ఎవరొచ్చారో చూడు. పొద్దున్నించీ మేమిద్దరం నీ కోసం చూస్తున్నాము.’’
తల్లి ముఖంలో ఉత్సాహం చూస్తుంటే ఎవరో ముఖ్యులే అనిపించింది. బంధువులు కాకూడదు భగవంతుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళింది.
పుస్తకం చదువుకుంటూ కూచున్న విశాలాక్షి శారదను చూసి నవ్వింది.
‘‘నేను శారదా. విశాలాక్షిని. అన్నపూర్ణా, నువ్వూ… నేను’’ శారద ఒక్క గంతులో విశాలాక్షి దగ్గరకొచ్చి భుజాలు పట్టుకుని ఊపేసింది.
‘‘విశాలా… ఎన్నేళ్ళకు కనపడ్డావు. అన్నపూర్ణ కూడా ఈ మధ్య నిన్ను చూడలేదంది. ఎలా ఉన్నావు. ఏం చేస్తున్నావు. నాకు ఉత్తరాలన్నా రాయొచ్చు గదా…’’
‘‘ఉండు శారదా… కాస్త ఊపిరి తీసుకో. అన్నీ చెప్తాను.’’
ఇద్దరూ చిన్నపిల్లల్లా కారణం లేకుండా నవ్వుకున్నారు.
శారద స్నానం చేశాక సుబ్బమ్మ ఇద్దరికీ విందు భోజనం పెట్టింది.
‘‘గుంటూరు ఒదల్లేదు అమ్మ. ఆమెతోపాటు నేనూ.. బాబుగారు పోయాక అన్నీ అమ్ముకుని గుంటూరు చేరాం కదా. ఆ తర్వాత మన ఊరు వెళ్ళలేదు నేను. గుంటూరులో ఎన్నో జరిగాయి. తర్వాత ఎప్పుడన్నా తీరిగ్గా చెబుతాలే. నా చదువు మాత్రం ఆగకుండా చూసుకున్నా. అమ్మ నాటకాల్లో వేషాలు వేయటం మొదలుపెట్టి చివరికి తనే ఒక నాటకం కంపెనీ పెట్టింది. బి.ఎ. పూర్తి చేసి కూర్చున్నాను. రెండేళ్ళు ఊరికే గడిచిపోయాయి. మద్రాసులో చదవాలని నా కోరిక. అమ్మని అక్కడ నాటకం కంపెనీ మూసి ఇక్కడ తెరవాలని ఒప్పించేసరికి బ్రహ్మ ప్రళయం అయింది. ఎలాగైతేనేం వచ్చాం. ఎడ్మిషన్లకు ఇంకా చాలా టైముందిగా. ఈ లోపల కాస్త స్థిరపడాలి. నాటకాల్లో వేషాలు వేయటం తప్పదు…’’
శారద ఆశ్చర్యంగా వింటోంది. విశాల నటిస్తుందా?
‘‘ఏం చదవాలనుకుంటున్నావు?’’
‘‘ఎమ్.ఎ. ఎకనామిక్స్.’’
‘‘ఎకనామిక్సా? ఎందుకు?’’
‘‘ఎందుకేమిటి? నాకిష్టం. పైగా రేపు దేశానికి స్వతంత్రం వస్తే దేశాన్ని ఆర్థికంగా ఎలా నడిపించాలో ఎకనామిక్సు చదివితేనే తెలుస్తుంది.’’
‘‘ఓ! ఆర్థిక శాస్త్రవేత్తవవుతావన్నమాట’’
‘‘నువ్వు డాక్టర్‌వి కావటంలా’’
‘‘పాపం అన్నపూర్ణ చదువే…’’ జాలిగా అంది శారద.
‘‘పాపం అని జాలిపడనక్కర్లేదు. అది రాజకీయాల్లో దిగిందిగా. దేశానికి స్వాతంత్య్రం వస్తే ఏ మంత్రో అవుతుంది. మనిద్దరం దాని దగ్గర చేతులు కట్టుకుని నిల్చోవాలి.’’
ఇద్దరూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని నవ్వుకున్నారు.
‘‘ఇప్పుడేం నాటకం వేస్తున్నారు?’’
‘‘ఏముంది? శాకుంతలం.’’
‘‘నువ్వు శకుంతలవా?’’
‘‘ఊ… నా పాట వింటావా?’’
అభినయిస్తూ పాడిరది విశాల. ముగ్ధురాలయి చూసింది శారద.
‘‘నువ్వు ఆర్థికశాస్త్రం చదవొద్దు ఏమొద్దు. హాయిగా నాటకాలు వేసుకో. జనం నీరాజనాలు పడతారు.’’
‘‘వెంటపడతారే తల్లీ. మగాళ్ళున్నారే. ఛీ, ఛీ… ఒదలరు. కానుకలంటారు. షికారుకి రమ్మంటారు.’’
‘‘అంతమంది వెంటపడుతుంటే బాగానే ఉంటుందేమో.’’
‘‘తన్నబుద్దేస్తుంది ఒక్కొక్కడిని.’’
‘‘ఒక్కడన్నా నచ్చలేదా?’’
‘‘ఛీ! మగాడా? నచ్చటమా? వాళ్ళ వెకిలి వేషాలు చూస్తే నిప్పెట్టబుద్దవుతుంది.’’
‘‘నీతోపాటు వేషాలు వేసే నటులో… దుష్యంతుడెవరు?’’
‘‘యాక్.. బీడీ కంపు’’
ఇద్దరూ పొట్టలు చేత్తో పట్టుకుని నవ్వీ నవ్వీ ఆయాసపడ్డారు.
‘‘మీ అమ్మ వాళ్ళందరితో కంపెనీ నడుపుతోంది. నువ్వు వాళ్ళని అసహ్యించుకుంటున్నావ్.’’
‘‘మా అమ్మని చూస్తే నాకు కాస్త కోపంగానే ఉంటుందే. మంచిదే సమర్ధురాలే… కానీ… ఏం చెప్పాలి? బాబు గారంటే అమ్మకి చాలా ప్రేమ. ఆయన పోయాక గుంటూరులో గోవిందయ్య అనే ఆయన అమ్మకు దగ్గరయ్యాడు. మంచిగానే ఉండేవాడు. అండగా ఉంటాడ్లే అనేది అమ్మ. నాలుగేళ్ళకు ఏమయిందో మళ్ళీ రాలేదు. కనపడకుండా పోయాడు. ఇక తనకు తనే అండ అని నాటకం కంపెనీ పెట్టింది అమ్మ. ఇక చుట్టూ ఎంతమంది చేరారో. నన్ను నేను వాళ్ళందర్నించీ రక్షించుకోవాల్సి వచ్చింది. అమ్మకు తనను తాను రక్షించుకోటానికి ఒకటే సూత్రం తెలుసు. రంగనాధరావు అనే ప్లీడరుని దగ్గరకు రానిచ్చింది. ఆయనగారి మనిషి అంటే ఇక ఎవరూ పిచ్చి వేషాలెయ్యరు అంది. నిజంగానే ఆయన మా జీవితంలోకి వచ్చాక నాకు కాస్త తెరిపి వచ్చింది. బి.ఎ. చదువు పూర్తయింది. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మ వయసయిపోయింది. నన్ను ఎవరి అండనైనా పెట్టాలని అమ్మ ఆలోచన. నాకు అక్కడే అమ్మను చూస్తే మండిపోతుంది. ఎమ్మే చదివి ఉద్యోగంలో స్థిరపడాలని నా ఆలోచన. ఇద్దరం పోట్లాడుకుంటాం.
మా అమ్మ చాలా సమర్ధురాలు. తెలివైంది. కానీ నేనావిడలా బతకను’’ విశాలాక్షి ఆపకుండా చెప్పుకుపోతోంది. శారద తనకింతవరకూ తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు విశాలాక్షిని చూస్తోంది.
‘‘నువ్వు మగపిల్లలతో కలిసి చదువుతున్నావు. ఎవరినైనా ప్రేమించావా?’’ అడిగింది విశాలాక్షి.
‘‘లేదు’’ అని నవ్వేసింది శారద.
‘‘ఇంత అందమైన నిన్ను ఎవరూ ఇష్టపడలేదా?’’
‘‘ఇష్టం, ప్రేమ, స్నేహం వీటి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నా.’’
‘‘ఆలోచించు మరి. పెళ్ళి వయసు దాటిపోతోంది. ఇప్పటికే ఆలస్యమైంది.’’
‘‘పెళ్ళా… నేను పెళ్ళి చేసుకోను.’’
విశాల నవ్వేసింది. ‘‘అందరు ఆడపిల్లలు అనేమాటే నువ్వూ అన్నావు. ఐనా నువ్వెందుకు పెళ్ళి చేసుకోవు? నేను పెళ్ళి చేసుకోనన్నానంటే దానికో అర్థముంది.’’
‘‘ఏంటో ఆ ఆర్థం.’’
‘‘నన్ను ఏ మగవాడూ గౌరవంతో, ప్రేమతో పెళ్ళాడడు కాబట్టి. నా కులం, మా అమ్మ, ఈ నాటకాలు… వీటన్నిటినీ చూసి నన్ను ఎవరైనా గౌరవిస్తాడా? నా అందం చూసి వస్తారనుకో… వాళ్ళు నాకక్కర్లేదు. నా పెళ్ళి అసాధ్యం.’’
‘‘అంత అసాధ్యం కాదులే. లోకం మారుతోంది. నాకు డాక్టర్‌గా నా వృత్తి, దేశ స్వాతంత్య్రం… ఇవి తప్ప పెళ్ళీ, పిల్లలూ వద్దనుకుంటున్నా.’’
‘‘ఓ! అన్నపూర్ణ పిచ్చి నీకూ ఉందా?’’
‘‘పిచ్చేమిటే… నీకు స్వతంత్రం ఒద్దా?’’
‘‘కావాలే… చాలా చాలా స్వతంత్రాలు కావాలి. కానీ అన్నిటికంటే ముందు ఈ స్వతంత్రం కావాలంటున్నవాళ్ళు నన్ను మనిషిగా చూడాలి. నన్ను ఆడదానిగా చూసి వెంటబడే మనుషుల నుంచి స్వేచ్ఛ కావాలి. నా కులం నుంచి, నా వృత్తి నుంచి బైటపడి బతికే స్వతంత్రం కావాలి. గౌరవప్రదమైన ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకునే స్వతంత్రం కావాలి. నా బతుకు నన్ను బతకనిచ్చే స్వతంత్రం కావాలి.’’
‘‘దేశం స్వతంత్రమైతే అవన్నీ నీకు వస్తాయి.’’
‘‘నువ్వు పిచ్చిదానివా? నన్ను పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఏమీ రావు. నా బతుకు మారాలంటే స్వతంత్రం చాలదే. ఇంకా చాలా కావాలి. అవేంటో నాకు తెలియదు.’’
‘‘ఏమిటో తెలియనిదేదో రావాలంటే ముందు స్వతంత్రం రావాలి. జాతికి గౌరవం లేనిదినీకెలా వస్తుంది?’’
‘‘తోటి మనిషిని గౌరవించలేని జాతికి స్వతంత్రం ఎలా వస్తుంది? ఆ స్వతంత్రంతో ఎవరికైనా ఏం జరుగుతుంది?’’
‘‘నువ్వు మరీ నిరాశావాదిలా మాట్లాడుతున్నావు.’’
‘‘నా అంత ఆశావాది ఇంకొకరు లేరు. నా స్థానంలో నువ్వుంటే కూడా నాలా ఆశతో బతికేదానివా అనేది నాకు అనుమానమే. నేనింత హీనస్థితిలో కూడా కలలు కంటున్నా. ఎమ్మే పాసవుతా. ఇంకా పరీక్షలు రాస్తా. పెద్ద అధికారినవుతా. నా హోదా చూసి అందరూ నన్ను గౌరవిస్తారు. నేను రాగానే లేచి నిలబడతారు. నా వెనక చెప్పుకుంటారేమో ఈమె తల్లి ఫలానా… ఈవిడా నాటకాల్లో వేషాలు వేసేదట. కానీ నా ముందు నోరెత్తలేరుగా. అలాంటి అధికారం సంపాదిస్తా. ఆ ఆశతో బతుకుతున్నా.’’
శారద విశాల చేతిని తన చేతిలోకి తీసుకుని ధైర్యాన్నిస్తున్నట్లు గట్టిగా తట్టింది.
‘‘నీ ఆశ నెరవేరుతుంది. నే చెప్తున్నాగా.’’
వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు.
కాలం నెమ్మదిగా నడుస్తోందనిపించింది శారదకు. దేశం కూడా నెమ్మదించింది. అక్కడక్కడా ప్రదర్శనలూ, జెండా ఎగరెయ్యటాలూ తప్ప పెద్దగా జరుగుతున్నదేమీ లేదు.
అన్నపూర్ణ, దుర్గ జైలు నుంచి విడుదలయ్యారు. అన్నపూర్ణ గుంటూరు చేరింది. దుర్గ కాకినాడ చేరింది. రామకృష్ణ జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు మొదలుపెట్టాడు. సత్యాగ్రహం మీద ఆశలు పెట్టుకున్న వారందరూ నిరాశలో పడ్డారు. అన్నపూర్ణ కూతుర్ని కంది. స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది.
సుదర్శనం, మూర్తీ, శారద తరచు కలుస్తున్నారు.
మూర్తి తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు. శారద మీద అదే చనువు, అదే అధికారం.
కానీ శారద తనను కలుసుకోకుండా దూరంగా ఉంచుతోందని మూర్తికి అర్థమైంది. ఇంటికి వెళితే ఆహ్వానిస్తూ నవ్వుతుంది కానీ ఆ నవ్వులో జీవం ఉండదు. యాంత్రికంగా నవ్వుతున్నట్లు తెలుస్తూనే ఉంది. మిగిలిన యువకులందరూ మామూలుగానే ఉంటున్నారు గానీ రామకృష్ణ ముభావంగా ఉంటున్నాడు. మూర్తికి ఈ మార్పు ఎందువల్ల వచ్చిందో అర్థమయింది. దాని గురించి శారదతో మాట్లాడటం తన బాధ్యత అనుకున్నాడు. కానీ శారదతో ఏకాంతం దొరకటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు శారదనంటిపెట్టుకుని ఉంటున్నారు.
ఒక ఆదివారం నాడు శారద తమ ఇంట అందరికీ విందు చేయబోతున్నానని ప్రకటించింది. కారణం అందరికీ తెలిసిందే. రామకృష్ణయ్య మద్రాసు ఒదిలి బెంగుళూరు వెళ్తున్నాడు. అక్కడ ఇంటర్ పూర్తి చెయ్యాలని సంకల్పం. రామకృష్ణయ్య, శారదల మధ్య అనుబంధం అందరికీ తెలుసు. అక్కా అని అతను పిలిచే పిలుపులో రక్తసంబంధాన్ని మించిన సోదర భావం పలుకుతుండేది. ‘రామూ’, ‘రామయ్యా’ అంటూ శారద తన అభిమానాన్ని కురిపించేది. ఇద్దరూ కలిసి చదివే పుస్తకాలు, చేసే చర్చలు, వాదోపవాదాలూ వారిని మరింత దగ్గర చేస్తాయి. రామకృష్ణయ్య ఒక్కోసారి చాలా నిరుత్సాహపడేవాడు. ఈ దేశం ఎప్పటికి స్వతంత్రమయ్యేను? ఏది మార్గం? నేనేం చెయ్యాలి? రైతులు, కూలీలు, పేదరికం, అంటరానితనం… ఒక్కసారి వీటన్నిటితో తలపడటం ఎట్లా? అసలు గమ్యమేమిటి? స్వతంత్ర సాధనేనా? ఈ ప్రశ్నలను మధించి, మధించి, విసిగి వేసారి పోయేవాడు.
‘‘ఇక నా వల్ల కాదక్కా’’ అంటూ శారద దగ్గరకు వచ్చేవాడు. శారదకు నిరుత్సాహం అంటే తెలియదు. సమస్యలు వచ్చేకొద్దీ సముద్రంలో తరంగాలు వస్తుంటే చూసినంత ఆనందం. రామకృష్ణయ్య ఏది గమ్యం అని తల పట్టుకుంటే…
‘‘ప్రతి అడుగూ గమ్యమే. అమ్మయ్య గమ్యం చేరామని కూర్చుందామని ఆశపడుతున్నావా? లేదు. నువ్వు చేరిన తర్వాత చూస్తే ముందు మరో గొప్ప ఆశయం కనపడుతుంది. ఆయాసం తీర్చుకునే వ్యవధి కూడా ఇవ్వదు. వెంటనే అటువైపు అడుగులు వేస్తాం మనం. వెయ్యకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంది? నడుస్తూనే ఉంటాం జీవితం చాలదు. తర్వాత వాళ్ళు అందుకుంటారు… ఆ నడక అలా సాగుతూనే ఉంటుంది.’’
ఒక్కోసారి రామకృష్ణయ్య శారద మాటల్ని కాదనేవాడు.
‘‘గమ్యం ఉండాలి. లేకపోతే నడవటానికి ప్రేరణ ఎలా వస్తుంది?’’
‘‘గమ్యం స్థిరం కాదని చెప్తున్నాను గానీ అసలు లేదనటం లేదు. మనం ఒకచోట గమ్యం సాధించామని ఆగకూడదని అంటున్నాను. ఆగామా… ఇక నిలవనీటి చందమే… నాలుగు దిక్కులూ ప్రవహించాలి మనం’’.
రామకృష్ణయ్య ముఖంలో వెలుగు కనిపించేంత వరకూ శారద మాట్లాడుతూనే ఉండేది.
రామకృష్ణయ్య బెంగుళూరు వెళ్తున్నాడంటే శారదకు బెంగగా ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఈ విందు ఏర్పాటు చేసింది. అందరితో పాటు మూర్తికీ పిలుపు చేరింది.
రామకృష్ణయ్యకు భోజనంలో కూడా ఆడంబరం గిట్టదు. అందువల్ల సుబ్బమ్మ ప్రత్యేకం ఏమీ వండలేదు. కానీ ఆమె ఏం వండినా, వండిరచినా, అది అమృతంతో సమానమే ఆ యువకులకి.
పదిమంది స్నేహ బృందం వెళ్ళి రామకృష్ణయ్యను రైలెక్కించింది. రైలు కదిలిపోతుంటే శారద ముఖంలో ఒక మబ్బుతెరలా దిగులు వచ్చి వచ్చినంత త్వరగానూ వెళ్ళిపోయింది.
‘‘మన రామయ్య మరింత జ్ఞానం సంపాదించుకొస్తాడు. పదండి పోదాం’’ అంటూ వెనుదిరిగింది.
స్నేహితులు ఎవరి నెలవులకు వాళ్ళు వెళ్తామని తలోదారీ పట్టారు. శారద ట్రాము కోసం చూస్తూ నిలబడి ఉంది. పది గజాలు నడిచిన మూర్తి మళ్ళీ వెనక్కు వచ్చి శారద పక్కన నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూసింది శారద.
‘‘మనం కొంచెం మాట్లాడుకోవాలి. నా వైపు నుంచి నేను చెప్పుకోవాల్సింది ఉంది’’.
‘‘నువ్వేం చెప్తావో నాకు తెలుసు మూర్తీ’’.
‘‘తెలిసింది మాత్రమే సర్వం అని నువ్వు కూడా అనుకుంటే ఎట్లా?’’
‘‘సర్వం అనుకోవటం లేదు. ఈ విషయంలో మరింత తెలుసుకోవాలని మాత్రం అనుకోవటం లేదు’’ అంది నిర్లిప్తంగా.
‘‘కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెప్పేంతవరకూ నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. దయచేసి ఒక్క గంట’’ శారద మూర్తి ముఖంలోకి చూసింది. అక్కడ బాధ, నిజాయితీలు తప్ప మరేమీ కనిపించలేదు.
‘‘సరే, బీచ్‌కి పోదాం పద’’.
మైలాపూర్ బీచ్‌లో సముద్రానికి కాస్త దూరంగా కూర్చున్నారిద్దరూ. సముద్రపు హోరు వాళ్ళ మనసులో రేగుతున్న హోరు ముందు చిన్నదయింది. మూర్తి మాటల్ని పోగొట్టుకున్నట్టు ఆ సముద్రపు ఒడ్డున వాటిని వెతుకుతున్నట్టు చూస్తున్నాడు.
‘‘మూర్తీ, నీకు పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది. అదే నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయమని కూడా నాకు తెలుసు’’. శారదే మూర్తిని ఇబ్బంది నుంచి బైట పడేసింది.
‘‘కానీ శారదా! ఆ ఉదయం ఈ సముద్రపొడ్డున నేను నిన్ను చూసినప్పుడు నాకు పెళ్ళయిందనే విషయం గుర్తు లేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినా ఆమెనూ, నా కొడుకునూ చూసినా కూడా నాకు పెళ్ళయిందన్న విషయం నాకు గుర్తు లేదు. మర్నాడు, ఆ తర్వాత చాలా రోజులు గుర్తు రాలేదు. నేనొక ఉన్మాద అవస్థలో పడిపోయాను. చివరికి తెలివొచ్చింది. నా భార్య ఒక రాత్రి గుర్తు చేసింది. నేను బిగ్గరగా ఏడ్చాను. ఆమె భయపడిరది. ఆ దుఃఖం తగ్గాక ఆలోచించాను. నాకు పెళ్ళయితే ఏమయింది. నేను పెళ్ళి చేసుకున్న స్త్రీతో ప్రేమలో పడలేదు. నాకు ఊహ తెలియకముందే, స్త్రీ అంటే ఏమిటో, ప్రేమంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలియకముందే నా మీద ఆ బాధ్యత పడిరది. బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రేమ ఎదురైంది. ప్రేమకూ, పెళ్ళికీ మధ్య సంబంధం ఎలాంటిదో, ఎంత వాంఛనీయమో, ఎంత అవాంఛనీయమో ఆలోచిస్తుంటే మతిపోతోంది. రెండేళ్ళ క్రితం చలం గారి శశిరేఖ నవల చదివి ‘‘ప్రేమ ఉంటే ఇంక పెళ్ళెందుకూ’’ అన్న శశిరేఖ మాటలను పిచ్చి మాటలుగా కొట్టేశాను. అర్థం కాలేదు నాకవి. ఇవాళ నాకు అర్థమవుతున్నాయి. ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు. ప్రేమ ఉంటే పెళ్ళితో అవసరం లేదు. ఇది నాకు తెలిసొచ్చింది కానీ సంఘంలో పెళ్ళికున్న విలువ ప్రేమకు లేదు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే ఆ మాటలకు నువ్వు విలువ ఇవ్వవు’’.
‘‘ఇస్తాను’’ గంభీరంగా అన్న శారద మాటలకు ఆశ్చర్యపోయి చూశాడు మూర్తి. సముద్రం స్తంభించిపోయినట్లనిపించింది ఒక్క క్షణం.
‘‘మూర్తీ. మనం ఎప్పుడూ మనసు విప్పి ఒకరి మీద ఒకరికున్న ప్రేమను చెప్పుకోలేదు. ప్రేమ కలిగిన మాట వాస్తవం. దానిని నిరాకరించి ఆత్మవంచన చేసుకోవటం ఎందుకు? నీకు పెళ్ళయిందని తెలిసి నేను తల్లడిల్లిపోయిన మాటా వాస్తవమే. నీలాగే నేనూ ప్రేమ, పెళ్ళి, వీటి పరస్పర సంబంధం, స్త్రీ పురుష సంబంధాలు మారుతూ వచ్చిన తీరూ, వీటి గురించి ఆలోచిస్తున్నాను, చదువుతున్నాను. సమాధానాలు దొరుకుతున్నట్లే ఉంటున్నాయి గానీ ఆచరించే మానసిక స్థిమితం రావటం లేదు. నా ప్రేమ నిజమై నీది విలువలేనిదవుతుందా? కానీ విలువ వల్ల ఉన్న పరిస్థితి మారదు. మనం స్నేహితుల్లా ఉందాం. ప్రేమ బంధం, భార్యాభర్తల బంధం, పెళ్ళి తంతు వీటి గురించి మర్చిపోదాం. అక్కడ నీ జీవితం నిర్ణయమైపోయింది అంతే. అది మారదు. మార్చాలనుకోకు’’.
శారద మాటలకు ఏం సమాధానం చెప్పాలో మూర్తికి తెలియదు. ‘‘థాంక్స్ శారదా. నన్ను స్నేహితుడిగా అంగీకరించావు. అది చాలు. నన్ను దూరం చేస్తావేమో అని భయపడ్డాను’’.
‘‘ఎందుకు దూరం చేస్తాను మూర్తీ. నువ్వేం నేరం చేశావని? నన్ను ప్రేమించటం నేరం అనుకోమంటావా? మరి నేనూ నిన్ను ప్రేమించాను. నా ప్రేమ నేరం కాకుండా నీ ప్రేమ నేరమవుతుందా? కేవలం నీకు పెళ్ళయినందువల్ల అది నేరమవుతుందా? పెళ్ళి ఒక సామాజిక బంధం. వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఒకటుందిగా. ఆ రెండిరటికీ యుద్ధం జరుగుతుంది ఈ కాలంలో. బహుశా అన్ని కాలాల్లోనూ జరుగుతుందేమో మనకిప్పుడు తెలిసి వచ్చింది. మనం ఆ యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధం చేయాలని లేదు, ఉంది. ప్రేమ అనే ఆయుధం ఉంది. చూద్దాం. ఈ ఆయుధానికి పదును పెట్టాల్సిన అవసరం వస్తుందేమో’’.
శారద మాటలను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు మూర్తి. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇద్దరికీ అక్కడనుంచి కదలాలని లేదు. సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నారు. తమ అంతరంగాలను చూసుకుంటున్నట్టే ఉంది. విరుచుకుపడే అలలు, అగాధమైన లోతు, అవతలి తీరం కనపడనంత దూరం. వెన్నెల తరకలు, చీకటి నీడలు, అంతులేని సౌందర్యం, భయం గొలిపే అద్భుతం.
లోకంతో పనిలేనట్టు, లోకమేమైనా తనకేం పట్టనట్టూ ముందుకు విరుచుకు పడుతూ, భళ్ళున బద్దలై వెనక్కు తోసుకుపోతూ ఆ సముద్రం. ఆ సముద్రం తామే అన్నంత వివశంగా వాళ్ళిద్దరూ.