కల్పన ఒక ఆడపిల్లగా ఎంత పోరాటం చేసిందో తాను చెప్పిందే రాయాలని ఉంది. తాను ఒక స్థాయికి వచ్చాక ఏమి చేసిందో అందరూ చెబుతున్నారు. కానీ కల్పన, కల్పనగా రూపొందిన విధానం, అందుకోసం తాను పడ్డ తపన, చేసిన పోరాటాలు ఆమె చెప్తేనే తెలిసిన విషయాలను మీకు చెప్పాలి.
ఇంటర్మీడియట్ చదువుతుండగా పెళ్ళయితే, 44 ఏళ్ళలో తనకు తానుగా రూపొందడం కోసం ఆమె చేసిన పోరాటం నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎక్కడా తగ్గకుండా బిఎ చదివి, ఎమ్మే కూడా పూర్తి చేసింది. సీటు విషయంలో యూనివర్శిటీ వాళ్ళతో ఒంటరిగా పోరాడిరది. యాక్టివిస్ట్ వృత్తిని ఎంచుకుని, మనలో చాలామంది అంటరాని వాటిగా చూసే, బయటి ప్రపంచంలో అంటరానిదానిగా చూసే పాలకవర్గ రాజకీయాలలో చేరడానికి కూడా వెనుకాడకుండా ఆమె చేసిన పోరాటాలు… తనను తాను రూపొందించుకోవడానికి చేసిన పోరాటాలు… వంటివన్నీ ఇద్దరు ఆడపిల్లల తల్లిగా బాధ్యత తీసుకుంటూ చేసినవే. ఒక్క మాట కూడా చెప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడిరది. అందంగా నవ్వుతూ ఉంటే మనకి ముచ్చట వేసేది కానీ, ఒంటిమీద బట్టలు లేవేమో అన్నట్టు చూసే మగవాళ్ళ మధ్య ఒక మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలో పనిచేసింది. తన ఆరోగ్యం బాగోలేదని, చారు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన తనకు ఒక తల్లిగా అనిపించడం సరైనది కాదేమోనని మధన పడేది. ఇన్ని పోరాటాలు చేసి తనని తాను రూపొందించుకున్న కల్పనని క్యాన్సర్ ఎగరేసుకు పోయింది. ఎంత అన్యాయం!