కల్పన! తిరిగిరానిది నీతో గడిపిన సమయం. మరపురానిది నీ ప్రియమైన స్నేహం. మరువలేనిది నీతోటి అనుబంధం.
కల్పనతో నా తొలి పరిచయం 2007 సంవత్సరంలో వాసన్ సంస్థలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రోగ్రాంలో ఏర్పడిరది. తాను మూడు నెలలకు ఒకసారి అనంతపురానికి వచ్చి ఎన్‌ఆర్‌ఈజీఎస్ కి సంబంధించి ఫీల్డ్‌లో తిరుగుతూ మూడు రోజులు మా ఇంట్లో ఉంటూ చాలా విషయాలు నాతో పంచుకునేది. పనికి సంబంధించి, వ్యక్తిగత విషయాలలో చాలా సలహాలు కూడా ఇచ్చేది.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ ప్రోగ్రాంలో భాగంగా ఢల్లీిలో జాతీయ సదస్సు జరిగినప్పుడు మేమిద్దరం ఒకే రూమ్‌లో ఉన్నాం. తనకు ఆస్థమా ఉండేది. చలికి ఆరోగ్యపరంగా చాలా బాధపడిరది. నేను తనకి ఆవిరి పట్టి నా ఒడిలో పడుకోబెట్టుకున్నప్పుడు అమ్మ ఒడిలో ఉన్నట్లు ఉందన్న తన మాటలు తను ఇక లేదు, చనిపోయిందని అనగానే గుర్తుకువచ్చాయి. తను భౌతికంగా ఇక్కడ లేకున్నా, తను చేసిన పనులు, మనతో నడిచిన అడుగులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. అలాగే PCPNDT Actలో కూడా మేమిద్దరం కలిసి రెండు సంవత్సరాల పాటు కడప, అనంతపురంలో పనిచేశాం.
బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో కూడా తనతో కలిసి చేసిన అనుభవం మరువలేనిది. యాక్షన్ ఎయిడ్ ప్రోగ్రాంలో తను ప్రోగ్రాం ఆఫీసర్‌గా పనిచేసింది. అప్పుడు కూడా మా స్నేహం కొనసాగింది. ఆమె చాలా అంకితభావంతో పనిచేసేది. మేము చాలా సందర్భాలలో అన్ని విషయాలు కలిసి పంచుకునేవాళ్ళం.
ఆమె రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా దాని గురించి నాతో చర్చించారు. మనం ఒక రాజ్యాధికారం సాధించినప్పుడు మాత్రమే విధి విధానాలను రూపొందించి, ఒక పాలసీ మేకర్‌గా మహిళలకు, పిల్లలకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా రాజకీయాల్లోకి వెళ్ళాలనేవారు. కల్పనతో నా అనుబంధం మర్చిపోలేనిది.
కల్పన నాకు పుట్టినరోజున నాకిష్టమైన పోచంపల్లి పట్టుచీర కానుకగా ఇచ్చింది. కానీ నా ఇల్లు కాలిపోయినపుడు ఆ చీర కూడా కాలిపోయింది. తనతో ఈ విషయం చెప్పినపుడు ఇలాంటి చీరలు ఇంకా చాలా ఇస్తాను మా ఇంటికి రా అంటూ ఉండేది.
మా అమ్మాయి వందనతో చాలా ప్రేమగా ఉండేది కల్పన. వందన చేసిన పనులను చాలా ఇష్టపడేది.
ప్రియమైన కల్పనా! తేనెకన్నా తీయనైనది, వజ్రం కన్నా విలువైనది, కడలికన్నా చల్లనైనది మన అనుబంధం ప్రియ నేస్తమా!