అనువాదం: అపర్ణ తోట
శాంతి మాంరిa, బీహార్‌లోని షియోహార్ జిల్లాలో ముసహర్ అనే కుగ్రామంలో తన ఏడుగురు పిల్లల్ని ఇంట్లోనే ప్రసవించింది. చాలా తక్కువమందికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అందులో చాలామందికి అక్కడ పిహెచ్సిలో కాన్పులు చేస్తారని కూడా తెలీదు.
శాంతి మాంరిa ఈ జనవరిలో మొదటిసారి అమ్మమ్మ అయింది. ఆమె వయస్సు 36 ఏళ్ళు. కానీ అదే రోజు రాత్రి ఆమె మొదటిసారి ఇంకొక పని చేసింది. రెండు దశాబ్దాలలో ఏడుగురు పిల్లలను ఒక డాక్టర్ గాని, నర్స్ గాని లేకుండా ఇంటిలోనే ప్రసవించిన ఈ గట్టి మహిళ, ఈసారి మాత్రం ఆస్పత్రికి వచ్చింది.
‘‘నా కూతురు గంటల తరబడి నొప్పులు భరించింది కానీ గర్భంలో శిశువు బయటకు రాలేదు. అందుకని ఒక టెంపోని పిలిపించాము’’ అని ఆమె పెద్ద కూతురు మమతకి ఇంట్లోనే నొప్పులు మొదలైనప్పుడు అన్నారామె. టెంపో అంటే ఒక మూడు చక్రాల బండి, ఇది ఆమె గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న షియోహార్ పట్టణం నుండి ఆమె ఇంటికి రావడానికి ఒక గంట సమయం తీసుకుంది. మమతను వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆ తరువాత ఎన్నో గంటలకు ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ‘‘అతను 800 తీసుకున్నాడు’’ శాంతి గుర్రుమంది. ఆమెకి ఇంకా టెంపోకి అయిన ఖర్చు కోపంగా ఉంది. ‘‘మా టోల (గ్రామం)లో ఎవరూ ఆసుపత్రికి వెళ్ళరు. అసలు మాకు అంబులెన్స్ అనేది ఉంటుందని కూడా తెలీదు’’. శాంతి ఆ రాత్రి ఇంటికి రావలసి వచ్చింది. ఆమె నాలుగేళ్ళ చిన్న బిడ్డకు నిద్రపోయే లోపల ఏమన్నా తినిపించాలి. ‘‘నేనొక అమ్మమ్మని అయ్యాను’’ అన్నదామె. ‘‘కానీ నాకు అమ్మ బాధ్యతలు కూడా ఉన్నాయి.’’ మమత, కాజల్ కాకుండా ఆమెకు ఇంకా ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మాంరిa కుటుంబం, ఉత్తర బీహార్‌లోని షియోహార్ జిల్లా, అదే బ్లాక్‌లో, మధోపూర్ అనంత్ గ్రామంలోని కిలోమీటర్ దూరంలో గుంపుగా ఉన్న గుడిసెల మధ్య ముసహర్ టోల అనే ప్రదేశంలో ఉంటుంది. టోలలో దగ్గరగా 40 మట్టి, వెదురు ఇళ్ళల్లో 300`400 మంది వరకు జనాభా ఉంటారు. అందరూ ముసహర్ కులానికి చెందినవారే. వీరు మహాదళిత్ వర్గం వారు. బీహార్‌లో వీరిని అట్టడుగు వర్గానికి చెందినవారిగా పరిగణిస్తారు. వీరు తమ ఇరుకైన ఇళ్ళల్లో ఒక మూల కొన్ని మేకలను, ఆవునూ కట్టేస్తారు.
శాంతి అప్పుడే టోలకు ఒక చివరన ఉన్న బోరింగ్ పంప్ నుండి ఒక ఎర్ర ప్లాస్టిక్ బకెట్‌తో నీళ్ళు తీసుకు వచ్చింది. అప్పటికే ఉదయం 9 గంటలైంది. ఆమె తన ఇంటి బయట ఉన్న సన్నని దారిలో నిలబడి ఉంది. ఆమె పక్కింటి వాళ్ళ ఆవు రోడ్డు పక్కనే సిమెంటుతో కట్టిన చిన్న తొట్టిలో నీళ్ళు తాగుతోంది. ఆమె తన స్థానిక భాషలో మాట్లాడుతూ, తన ఏడు కాన్పులు ఇంట్లోనే ఏ ఇబ్బంది లేకుండా జరిగాయని చెప్పింది. ఆమె బొడ్డు పేగు ఎవరు కోశారని అడిగితే, ‘‘మేరీ దేయాదీన్’’ అంటూ భుజాలు ఎగరేసి చెప్పింది. దేయాదీన్ అంటే భర్త సోదరుడి భార్య. బొడ్డు పేగు కత్తిరించడానికి ఏమి వాడేవారని అడిగితే తనకు తెలీదని చెప్పింది. టోలలో ఉన్న 10`12 మంది ఆడవాళ్ళు చుట్టూ చేరి ఇంట్లో ఉన్న కత్తిని కడిగి వాడతారని చెప్పారు. అది పెద్దగా ఆలోచించే విషయం కాదని వాళ్ళందరూ అనుకున్నారు. ముసహర్ అనంత్ టోలలో చాలామంది ఆడవారికి ఈ పద్ధతిలోనే వారి ఇళ్ళల్లోనే కాన్పులు జరిగాయి. కానీ కొందరు మాత్రం ఆ సమయంలో ఇబ్బందులు రావడం వలన ఆస్పత్రికి వెళ్ళవలసి వచ్చింది. ఆ కుగ్రామంలో నైపుణ్యంగా కాన్పులు చేయగలిగిన వారెవరూ లేరు. చాలామంది ఆడవారికి కనీసం నలుగురైదుగురు పిల్లలున్నారు. వారికి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ (పిహెచ్సి) ఎక్కడ ఉందో తెలీదు, అక్కడ కాన్పులు చేస్తారని కూడా తెలీదు.
ప్రభుత్వం నడిపే ఆస్పత్రి గురించి, గ్రామ ఆరోగ్య కేంద్రం గురించి అడిగితే తనకు సరిగ్గా తెలీదని శాంతి చెప్పింది. 68 ఏళ్ళ బాగులనీయ దేవి మధోపూర్ అనంత్‌లో కొత్త క్లినిక్ గురించి తాను విన్నానని చెప్పింది. కానీ తను అక్కడికి వెళ్ళలేదని, అక్కడ మహిళా డాక్టర్ ఉంటుందో లేదో తెలీదని చెప్పింది 70 ఏళ్ళ శాంతి చూలై మాంరిa. పైగా టోలలో మహిళలెవ్వరికీ ఎప్పుడూ క్లినిక్ ఉందని చెప్పలేదని, కొత్త క్లినిక్ పెడితే తమకెలా తెలుస్తుందని ప్రశ్నించింది. మధోపూర్ అనంత్‌లో పిహెచ్సి లేదు కానీ ఒక సబ్ సెంటర్ ఉంది. అప్పుడు మధ్యాహ్న సమయం కావడం వలన ఎక్కువ శాతం మూసే ఉంటుందని గ్రామస్థులు చెప్పారు. 2011`12లో డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్, షియోహార్ బ్లాక్‌కు 24 సబ్ సెంటర్లు అవసరమని, కానీ ఇక్కడ 10 మాత్రమే ఉన్నాయని చెప్పారు. శాంతి తాను గర్భవతిగా ఉన్నప్పుడు తనకు అంగన్వాడీ కేంద్రం నుండి ఐరన్, కాల్షియం మాత్రలేమీ లభించలేదని, తన కూతురికి కూడా ఇవ్వలేదని, ఆమె చెకప్‌ల కోసం ఎక్కడికీ వెళ్ళలేదని చెప్పింది. పైగా ఆమె గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలలు, కాన్పు వచ్చేదాకా పనిచేస్తూనే ఉంది. కాన్పు అయిన పది రోజులకు తాను మళ్ళీ పనికి వెళ్ళిపోయేదాన్నని శాంతి చెప్పింది.
ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) పథకం కింద అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భవతులు, బిడ్డలకి పాలిచ్చే తల్లులు, చంటిపిల్లలకు పోషక పదార్థాల సప్లిమెంట్లు పొట్లాలుగా ఇవ్వడం కానీ, లేదంటే వండి పెట్టడం కానీ చేయాలి. గర్భవతులు కనీసం 180 రోజుల పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, కాల్షియం సప్లిమెంట్లు వేసుకోవాలి. ఆమెకు ఏడుగురు పిల్లలు, ఒక మనవడు ఉన్నా తాను అలాంటి పథకం గురించి వినలేదని శాంతి చెప్పింది. ముసహర్ టోలలో ఆడవాళ్ళు ఏ అంగన్వాడీ లోను తమను తాము నమోదు చేసుకోలేదని, ఆ పక్కనే ఉన్న మాలి పోకర్ భీండా గ్రామంలోని ఆశావర్కర్ కళావతి దేవి చెప్పింది. ఇక్కడ రెండు అంగన్వాడీలు ఉన్నాయని, ఒకటి మాలి పోకర్ భీండాలో, ఇంకొకటి ఖైర్వా దారప్లో ఉన్నాయని చెప్పింది. ఇది ఒక పంచాయితీ ఉన్న గ్రామమని, అయితే ముసహర్ ఆడవారికి ఎక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలో తెలీదని, అందువల్ల ఎవరూ నమోదు చేసుకోలేదని చెప్పింది. ఈ రెండు ఊళ్ళు ముసహర్ టోల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. భూమి లేని శాంతి వంటి ఇతర ఆడవారికి, వారు పని చేసే ఇటుకబట్టీల పని కోసం 4`5 కిలోమీటర్లు నడవడమే కాకుండా, ఇంకా ఇక్కడవరకు రావడానికి చాలా నడవవలసి ఉంటుంది. శాంతి చుట్టూ చేరిన ఆడవారు తమకు సప్లిమెంట్లు కానీ, దానికి సంబంధించిన సమాచారం కానీ అందలేదని, అంగన్వాడీ నుండి తీసుకునే హక్కు ఉందని కూడా తమకు తెలీదని చెప్పారు. అక్కడ ఉన్న వృద్ధ మహిళలు తమకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను అందుకోవడం దాదాపు అసాధ్యమవుతోందంటూ ఆరోపించారు. 70 ఏళ్ళ ధోగారి దేవి తన జీవితంలో ఎప్పుడూ వితంతు పెన్షన్ అందలేదని చెప్పింది. వితంతువు కాని బాగులని దేవి నెలకు 400 రూపాయలు తన బ్యాంక్ అకౌంటులో పడతాయని, కానీ దేనికి సబ్సిడీగా ఇది తనకు చేరుతుందో తెలీదని చెప్పింది.
ఆశావర్కర్ కళావతి మాట్లాడుతూ ఈ మహిళలకు ఉన్న అస్పష్టతకు వారే కారణమంటుంది. కనీసం గర్బవతులుగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో తెలియకపోవడానికి వారికి చదువులేకపోవడమే కారణం. ప్రతి ఒక్కరికీ ఆరేడుగురు పిల్లలున్నారని చెప్పింది. ఖైర్వా దారపు అంగన్వాడీలో నమోదు చేసుకోమని తాను చాలాసార్లు వాళ్ళకు చెప్పానని ఆమె తెలిపింది. మాదాపూర్ అనంత్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల టోలకు దగ్గరగా ఉంది, కానీ ముసహర్ నుండి అక్కడికి వచ్చే పిల్లలు చాలా తక్కువ మంది. శాంతి పూర్తిగా నిరక్షరాస్యురాలు. ఆమె భర్త, ఏడుగురు పిల్లలు కూడా అంతే. ఏదైతేనేం వాళ్ళు రోజు కూలి కోసం పనిచేయాల్సిందే అని తేల్చింది ధోగరి దేవి అనే వృద్ధురాలు. బీహార్‌లో షెడ్యూల్ కులాల వారిలో నిరక్షరాస్యత ఎక్కువ. 28.5 శాతం వద్ద ఉన్న బీహార్ షెడ్యూల్ కులాల అక్షరాస్యత, మొత్తం భారతదేశ షెడ్యూల్ కులాల (సెన్సస్ 2001లో పేర్కొన్నట్లుగా) అక్షరాస్యతలో 54.7 శాతం మాత్రమే. ఈ సమూహాలలో, ముసహర్ల అక్షరాస్యత రేటు అత్యల్పంగా 9 శాతం మాత్రంగానే ఉంది. ముసహర్ కుటుంబాలకు వ్యవసాయ ఆస్తులు లేవు. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సామాజిక అభివృద్ధిపై నీతి ఆయోగ్ సర్వే నివేదికలో బీహార్‌లోని ముసహర్లలో కేవలం 10.1 శాతం మంది మాత్రమే పశువులను కలిగి ఉన్నారని, ఇది ఎస్సీ సమూహాలలో అతి తక్కువని తేలింది. ఇదేకాక, 1.4 శాతం ముసహర్ కుటుంబాలు మాత్రమే ఎద్దును కలిగి ఉన్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, కొంతమంది ముసహర్లు పందులను పెంచుతారు. ఇది వారి సంప్రదాయ వృత్తి. ఇతర కులాల వారు ఈ వర్గాన్ని ఈ కారణంగా కూడా ఇష్టపడరు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాలలో సైకిల్, రిక్షాలు, స్కూటర్లు లేదా మోటార్‌సైకిల్ యాజమాన్య నివేదిక కోసం సర్వే చేయగా, ముసహర్ కుటుంబాలకు అసలు స్వంత వాహనాలే లేవని తెలిసింది.
శాంతి కుటుంబం పందులను పెంచదు. వారికి కొన్ని మేకలు, కోళ్ళు ఉన్నప్పటికీ, వీటిని వారు వండుకుని తింటారు కానీ అమ్మరు. తాము ఎప్పుడూ బ్రతకడం కోసమే పని చేశామని, అలాగే వేరే రాష్ట్రాలలో కూడా చాలా సంవత్సరాలు పనిచేశామని శాంతి చెప్పింది. ఆమె, ఆమె భర్త ఇటుక బట్టీల్లో పనిచేస్తూ, ఊర్లు మారినప్పుడు పిల్లలు కూడా వారితోనే ఉండి పనిచేసేవారు. ‘‘మేము అక్కడ నెలల తరబడి ఉండేవాళ్ళం. కొన్నిసార్లు ఆరునెలల పాటు కూడా ఉండేవాళ్ళం. ఒకసారి మేము కాశ్మీర్లో ఒక సంవత్సరం పాటు
ఉన్నాం. అక్కడ ఇటుక బట్టీలలో పనిచేశాం’’ చెప్పింది శాంతి. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. కానీ గర్భంలో ఎన్నో బిడ్డను మోసిందో గుర్తులేదు. ‘‘అది ఆరేళ్ళ క్రితం జరిగింది’’ అని చెప్పింది. కాశ్మీర్లో ఏ ప్రాంతంలో పనిచేశారో కూడా ఆమెకు గుర్తులేదు. గుర్తున్నదంతా అదొక పెద్ద ఇటుక బట్టీ అని, వచ్చిన కూలీలంతా బీహార్నుంచేనని చెప్పింది.
బీహార్‌లో వచ్చే కూలి డబ్బుల కంటే ఇక్కడ ఆదాయం ఎక్కువ ఉండేది. ప్రతి వెయ్యి ఇటుకలకి బీహార్‌లో 450 రూపాయలు వస్తే ఇక్కడ 600 నుంచి 650 రూపాయల వరకు వచ్చేవి. ఆమె పిల్లలు కూడా ఆ ఇటుక బట్టీలలో పనిచేసేవారు. శాంతి, ఆమె భర్త సులువుగా వెయ్యికన్నా ఎక్కువ ఇటుకలు చేసేవారు కానీ అప్పట్లో వారు ఆ పని ద్వారా ఎంత సంపాదించారో ఆమెకు గుర్తులేదు. తాము ఇంటికి వచ్చేయాలని, తక్కువొచ్చినా ఫర్వాలేదని అనుకున్నామని శాంతి చెప్పింది. ప్రస్తుతం ఆమె భర్త 38 ఏళ్ళ దొరిక్ మాంరిa పంజాబ్‌లో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. నెలకు 4000 నుండి 5000 వరకు ఇంటికి పంపిస్తాడు. కొవిడ్ మహమ్మారి, లాక్డౌన్ల వల్ల పని తక్కువగా దొరుకుతోంది. కూలి కాంట్రాక్టర్ కూడా ఈ సమయంలో పని చేయడానికి మగవాళ్ళనే ఎంచుకుంటాడు. భర్తతో పాటు వెళ్ళకుండా ఇక్కడ వరి పొలాల్లో ఆమె ఎందుకు పని చేయవలసి వస్తోందో వివరించింది శాంతి. కూలి డబ్బులు అందుకోవడం ఒక పెద్ద సమస్య అని, తమకు డబ్బులివ్వడానికి యజమాని వారంలో ఒక రోజును ఎంచుకుంటాడని చెప్పింది. ఆమె బన్హరి లేదా కూలి డబ్బుల కోసం చాలాసార్లు అతని ఇంటికి తిరగవలసి వస్తుంది. కానీ తాము కనీసం తమ ఇంట్లోనే ఉంటున్నామని చెప్పింది.
ఆమె కూతురు కాజల్ రోడ్డు పక్కనే చుట్టుపక్కల పిల్లలతో ఆడుతోంది. కానీ ముసురు పట్టి
ఉంది. అందరూ తడిసిపోయి ఉన్నారు. శాంతి కాజల్‌ని ఫోటో దిగడం కోసం, ఉన్నవాటిలో మంచి గౌను వేసుకుని రమ్మంది. కాసేపట్లోనే, ఆ పాప మళ్ళీ ఆ గౌను విప్పేసి, రోడ్డు మీద పిల్లలతో కలిసి ఒక గుండ్రని రాయిని కర్రలతో తోసుకుంటూ బురదలో ఆడుతోంది. పరిమాణంలో, జనాభాను బట్టి షియోహార్ జిల్లా, బీహార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే చిన్న జిల్లా. ఇది సీతామాడి నుండి 1994లో విడిపోయింది. షియోహార్ జిల్లా హెడ్ క్వార్టర్ మాత్రమే ఇక్కడ ఉన్న పట్టణం. గంగా నదికి ఉపనది అయిన బాగుమతి నది ఈ జిల్లాలో ఉన్న నదులలోకెల్లా పెద్ద నది. దీని జన్మస్థానమైన నేపాల్‌లో వర్షం పడినపుడు ఈ నది పొంగిపోయి ఉత్తర బీహార్‌లోకి నీళ్ళు వచ్చేస్తాయి. కోసి, ఇంకా వేరే నదుల పాయలు ప్రమాదపు అంచువరకు చేరుకుంటాయి. వరి, చెరకు ఇక్కడ చాలా ప్రసిద్ది పొందిన పంటలు. రెండూ నీటి ఆధారంగా పెరిగే పంటలే. ముసహర్ టోల, మధోపూర్ అనంత్‌లో ప్రజలు స్థానిక వరి పొలాలలో, ఇంకా దూరంగా ఉన్న భవనాల కట్టడాల పనులలో, ఇటుక బట్టీలలో పనిచేస్తారు. కొందరికి చిన్న చిన్న భూములు ఉన్న బంధువులు ఉన్నారు. వీరికి కత్తాన్ (ఎకరంలో కొంత భాగం)లు ఉన్నా కానీ ఎవరూ భూమికి హక్కుదారు కాదు. మీ కూతురికి కూడా ఇంతమంది పిల్లలు ఉంటారా అని అడిగితే నవ్వుతూ అది తనకు తెలియదని చెప్పింది శాంతి. ఆమె జుట్టు జటలు గట్టి ఆమె మెరిసే నవ్వుతో పోటీపడుతోంది. దాని గురించి ఆమెను అడిగినప్పుడు ఇంకో ఇద్దరు స్త్రీలు తమ నెత్తిమీద కొంగును తీసి తమ జుట్టు కూడా అలాగే ఉందని చూపించారు. ఇది అఘోరి శివ కోసం అంది శాంతి. కానీ వారు గుండు గీయించుకోమని చెప్పామని, అది ఒక రాత్రి దానంతట అదే అలా అయిపోయిందని చెప్పింది.
మనోహర్ టోలలో ఆడవారు శారీరక పరిశుభ్రతను అసలు పాటించరని ఆశా వర్కర్ కళావతి చెప్పింది. ఆమెలాంటి ఆశా వర్కర్లు ప్రతి వ్యవస్థాపక ప్రసవానికి 600 రూపాయలు తీసుకోవచ్చు. కానీ ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఇందులో కొంత సొమ్ము మాత్రమే వారికి వస్తోంది. వారిని ఆస్పత్రికి వెళ్ళమని ఒప్పించడం చాలా కష్టమని, పైగా తనకు డబ్బులు కూడా సరిగ్గా రావని ఆమె చెప్పింది.
ముసాహరుల పద్దతులు మొండిగా ఉంటాయని బయటివారు అనుకుంటారని తెలియడం వల్ల శాంతి నాతో ఆచార వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఆమె పోషకాహారం గురించి మాట్లాడలేదు. నేను ప్రత్యేకంగా ముసాహరుల మీద ఉన్న చిన్నచూపును గురించి మాట్లాడినప్పుడు, ‘‘మేము ఎలుకలను తినము’’ అని ఒకే ఒక్క మాట చెప్పింది. ఈ ముసహర్ టోలలో భోజనమంటే సాధారణంగా అన్నం, బంగాళదుంపలు మాత్రమే తింటారని, ఎవరూ ఆకు కూరలు తినరని మాత్రం ఖచ్చితంగా తెలుసని చెప్పింది ఆశా వర్కర్ కళావతి. ఇక్కడ ఆడవారు, పిల్లల్లో రక్తహీనత చాలా ఎక్కువని చెప్పింది. అక్కడి రేషన్ దుకాణంలో ప్రతి నెల బియ్యం, గోధుమలు కలిపి 27 కిలోలు కొంటుంది శాంతి. పిల్లలందరి పేరు రేషన్ కార్డులో నమోదు చేయలేదని, అందుకే చిన్న పిల్లల కోటాలో బియ్యం, గోధుమలను తెచ్చుకోలేనని చెప్పింది. రాత్రి సమయాల్లో రోటీలు తింటారు. ఈ ఇంట్లో గుడ్లు, ఆకు కూరలు చాలా అరుదుగా వండుతారు, ఇక పండ్లయితే అసలే కొనరు.
ఆమె కూతురు కూడా ఆమెలాగానే ఇంతమంది పిల్లల్ని కంటుందా అని అడిగితే ఆమె నవ్వింది. తనకు తెలియదని, మమత అత్తగారిల్లు నేపాల్ సరిహద్దులో ఉందని, కానీ ఆమెకు ఆస్పత్రి అవసరం పడితే మాత్రం ఇక్కడికే వస్తుందని శాంతి తెలిపింది.
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా, ూARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమార దశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాయి. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తోంది.
1. ఫోటో రైటప్ : శాంతి తన ఏడుగురు పిల్లలలో నలుగురితో (అమ్రిత, సయాలి, సాజన్, అరవింద్).
2. ధోగారి దేవి (ఎడమ), తాను ఎప్పుడూ వితంతు పింఛను తీసుకోలేదని చెప్పింది. బాగులనియ (కుడివైపు ఆమె భర్త జోగిందర్ సా) అకౌంటులో ప్రతి నెల 400 రూపాయలు పడుతున్నాయి. ఎందుకో ఆమెకి తెలియదు.
3. ముసహర్ టోలా (కుడివైపు)లో కొన్ని పశువుల కోసం పంచాయతీ నిధులతో రహదారి పక్కన నిర్మించిన ఒక భాగస్వామ్య తాగునీటి తొట్టి (ఎడమ)
ఇలస్ట్రేటర్ : ప్రియాంక బోరార్