ఎంఎఫ్ గోపీనాథ్ గారు రాసిన ఈ పుస్తకంలో ‘పొగరు’ అంటే మూర్ఖంగా మాట్లాడడమో, అహంకారమో కాదు. కులవివక్షను భరిస్తూ ఉండడాన్ని మంచితనంగానూ, అందరినీ కలుపుకుపోయే అద్భుతమైన క్వాలిటీగానూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే, అటువంటి
పనికిమాలిన ఇమేజ్ కోరుకోకుండా, ఎదురుతిరిగి సమానత్వాన్ని డిమాండ్ చేయడమే ఈ పుస్తకంలోని ‘పొగరు’.
‘వంగి వంగి దండాలు పెడితేనే నీకు ఎదిగే అవకాశం కల్పిస్తాం. లేదంటే తొక్కేస్తాం’ అని ఎదుటివాడు అన్నప్పుడు, ‘నువ్వేంటి నాకు ఇచ్చేది, ఈ అవకాశం నా హక్కు’ అనే ధిక్కార స్వరాన్ని వినిపించడమే ఈ పుస్తకంలోని పొగరు. కన్నింగ్‌గా, వంకరగా మాట్లాడకుండా సూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడమే ఈ పుస్తకంలోని పొగరు.
పదవుల్లో ఉన్నవారు తప్పు చేస్తున్నారని, దానివల్ల చాలామంది నష్టపోతున్నారని తెలిసి కూడా, వెంటనే ప్రశ్నిస్తే తనను టార్గెట్ చేస్తారు కాబట్టి, జరగాల్సిన డామేజ్ అంతా జరిగిపోయాక, తీరికగా టైం చూసుకుని సేఫ్ జోన్‌లో చర్చించే కన్వీనియెంట్ యాక్టివిస్టుల్లా కాకుండా, ఎంతటివారైనా అప్పటికప్పుడే నలుగురి ముందూ నిలదీయడమే ఈ పుస్తకంలోని ‘పొగరు’. కులం కారణంగా
ఉండడానికి చోటు దొరక్కపోయినా, చదువు, ఉద్యోగం మధ్యలో ఆగిపోయే పరిస్థితులు వచ్చినా కూడా, ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా, నిజాయితీగా ధైర్యంగా నిలబడి పోరాడటమే ఈ పుస్తకంలోని పొగరు. ఈ పుస్తకంలోని పొగరుకి అరుదైన అందం ఉంటుంది. వాస్తవాన్ని ఒప్పుకోగలిగే వారందరినీ అది ఆకర్షిస్తుంది.
ఈ పుస్తకం కవర్ పేజీ మీద ‘భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు’ అని ఉంటుంది. కులం ఎందుకు మెన్షన్ చేయాలి అని కొందరికి అనిపించవచ్చు. ఒక వ్యక్తి గొప్పతనాన్ని చెప్పడానికి తను ఎన్ని కోట్లు సంపాదించాడు, ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నాడు అనేది ఒక్కటే సరైన కొలత కాదు. ఎక్కడ మొదలుపెట్టాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఏం సాధించాడు అనే మూడు కొలతల్ని లెక్కలోకి తీసుకున్న తరువాతే విజయాన్ని లెక్కపెట్టాలి. వారసత్వంగా వచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన సోషల్ కనెక్షన్స్, వారసత్వంగా వచ్చిన మానసిక ప్రశాంతత (కులవివక్షను ఫేస్ చేయాల్సిన అవసరమే లేకపోవడం), కులవివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల సేఫ్ అయ్యే టైం Ê ఎనర్జీ. ఇన్నిన్ని ప్రివిలేజెస్ ఉన్నవారు సాధించిన విజయాలు నిజానికి గొప్పవేమీ కావు.
కులవ్యవస్థ ఇప్పటికంటే బలంగా ఉన్న 1954వ సంవత్సరంలో సాధారణ దళిత కుటుంబంలో పుట్టి, సిటీకి, టౌన్ వాతావరణానికి దూరంగా విసిరివేయబడ్డ అయ్యోరి గూడెం అనే పల్లెటూరిలో, టీచర్ లేని స్కూల్‌లో పాఠాలు మొదలు పెట్టి, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించడమే పెద్ద విషయం. అటువంటిది యూనివర్శిటీలో కూడా తనను వదలని కులవివక్షను ఎదుర్కొంటూ టైం Ê ఎనర్జీ మొత్తం దానికే ఖర్చయిపోతున్నా, అగ్రవర్ణ ప్రొఫెసర్లు తనను ఫెయిల్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నా, స్టూడెంట్ లీడర్ బాధ్యతలు మోస్తూ ఎంబీబీఎస్‌ను పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. అటువంటిది పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎండీ) కూడా పూర్తి చేసి, త్రివేండ్రంలోని చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ Ê టెక్నాలజీలో డిఎం కార్డియాలజీ పూర్తి చేయడం ఒక గొప్ప ఇన్‌స్పిరేషనల్ లైఫ్ స్టోరీ. ప్రతి స్టేజిలో కులం ఎలా వెంటాడిరదో వివరంగా రాశారు. అన్నీ పూర్తి చేసిన తరువాత ప్రొఫెషనల్ కెరీర్‌ని కూడా కుల రాజకీయాలు ఎలా ప్రభావితం చేశాయో రికార్డు చేశారు. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. కుల వివక్షను ఎదిరించి జీవితంలో ఎదగడం ఎలా? ఆత్మగౌరవం అంటే ఏమిటి? దాన్ని నిలుపుకోవడం ఎలా? అనే అంశాలను అర్థం చేసుకోవడానికి దళిత, బహుజనులు తప్పక చదవాలి. కులం, కుల వివక్ష అనే సమస్యలను స్టడీ చేయకుండా, కులం వల్ల వచ్చే ప్రివిలేజెస్ అన్నీ అనుభవిస్తూ, ఇన్‌సెన్సిటివ్ కామెంట్లు చేసే ఆధిపత్య కులాలు ఈ పుస్తకాన్ని చదివితే వాస్తవాలు అర్థమవుతాయి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. సమస్య అర్థమై కూడా కుల వివక్షను సపోర్ట్ చేసేవారు ఎలాగూ ఉంటారు. వారిని ఏ పుస్తకమూ, ఏ సత్యమూ కదిలించలేదు. వాళ్ళకే ఈ పుస్తకంలోని పొగరు వల్ల గాయాలయ్యేది.
శైలి విషయానికి వస్తే ఎటువంటి బరువైన పదాలు వాడకుండా, పుస్తకం మొత్తం స్నేహితులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. కులాల ప్రస్తావన వచ్చినపుడు కూడా ఏ డొంక తిరుగుడూ లేకుండా ఆయా కులాల పేర్లను ఉన్నది ఉన్నట్టు రాసుకుపోయారు. కులాన్ని పట్టించుకోను అని డప్పు కొట్టుకుంటూ బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, కాపు ఐడెంటిటీలను మోస్తూ ఉంటే, కులం పేరుతో వచ్చే విమర్శ బాధిస్తుంది. అలా కాకుండా ఒక మనిషిగా ఆలోచిస్తే, చదివితే మాత్రం ఈ పుస్తక పఠనం చాలా హాయిగా ఉంటుంది.
ఈ పుస్తకం ఛాయా పబ్లిషింగ్ హౌస్ నంబర్ 09848023384కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో కూడా దొరుకుతుంది.