పాత సినిమాలో చివరి సీన్లో పోలీసు లొస్తారు. హ్యాండ్స్ అప్ అంటారు. కాలం మారే రోజుల్లో అంతా అయిపోయాక పోలీసు లొస్తారు అనే జోక్ కూడా స్థిరపడిపోయింది. కాలం మారాక మొత్తం సీన్ మారిపోయింది. హ్యాండ్స్ అప్‌లు, బేడీలు ఉండవు. హీరో ఎడాపెడా బుల్లెట్లు కురిపిస్తుంటాడు.
లెక్క లేకుండా వందలకొద్దీ మనుషుల్ని అలా చంపేస్తాడు. హీరో పోలీస్ అయినా అంతే. హీరోయిజం రూపం మారింది. దీనికి ముద్దు గా instantism అని పేరు పెట్టుకుందాం. హీరో నేచర్ అయిపోయింది. ఇన్‌స్టంట్ జస్టిస్ చేసేవాడే హీరో. ఇప్పుడు ప్రభుత్వం హీరో కావాలనుకుంటోంది. మాస్ మసాలా హీరో… బయట వాతావరణం అలాగే తయా రయింది కాబట్టి జనామోదం ఉంది. కాక పోతే సమస్య ఏమిటంటే జనామోదం ఉన్న వన్నీ సరైనవే అయి ఉండాలని రూలేం లేదు. ప్రజాస్వామ్యం అంటే మూకస్వామ్యం కాదు.
ఏదైనా ఘోరం జరిగినపుడు మనిషిలో ఆక్రోశం పెల్లుబికడం అర్థం చేసుకోవచ్చు. మనుషులం కదా, ఆవేశకావేశాలు ఉంటాయి. వ్యవస్థకు కూడా ఆవేశకావేశాలు ఉండొ చ్చునా? బాధితుల తరపున ప్రతీకారం తీర్చుకోవడం మాస్ ఈగోను శాటిస్ఫై చేయడం అనే బాధ్యత మీదేసుకుని చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవచ్చునా అనేది ప్రశ్న. రాజ్యాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నా మంటే మన చుట్టూ అంతా బాగుందని కాదు. అత్యాచారాలపై ఆందోళన వెలిబుచ్చే కొందరు మనుషుల సున్నితత్వాలు చిత్రంగా ఉంటాయి. అవతల ఒక రేప్ గురించి విపరీతంగా ఆవేశపడుతు న్నవాడే చట్టబద్ధ పాలన అవసరమయ్యా అనే మహిళను నిన్ను పదిమందితో గ్యాంగ్ రేప్ చేయిస్తాను అని పచ్చిగా బెదిరించగలడు. రాయటానికి వీల్లేని భాషలో మాట్లాడగలడు. బస్సుల్లోనో, రైల్లోనో పిక్ పాకెటర్ పట్టుబడితే గుంపంతా కలిసి తలా ఒక తన్ను తన్నాలనే ఉత్సాహం కనబరు స్తారు. ఆఫీసుల్లో బల్లల కింద చేతులు పెట్టే వాళ్ళే కాదు, బల్లల పైన కూడా చేతులు, గొంతు లేపి దర్జాగా వైట్ కాలర్ రౌడీ మా మూలు డిమాండ్ చేసేవాడు కూడా కసిగా తంతాడు పిక్ పాకెటర్ని. మన మూకుమ్మడి వైఫల్యాలకు, మన దరిద్రాలకు, మన దౌర్భా గ్యాలకు ఎవడో ఒకడ్ని బలివ్వాలి అంతే. లోపలి చూపు మందగించిన సమాజం మనది.
నేరాలు చేసినందుకే కదా, అంత ఘోరం చేసినందుకే కదా, అలాంటి శిక్ష, అనేవాళ్ళు ఒకసారి తాలిబన్లను చూడండి. తాలిబన్లకు కూడా లెజిటిమసీనే వచ్చి ఉంటుంది. కానీ అదెక్కడిదాకా పోయిందో చూస్తున్నాం కదా. అడ్డూ అదుపూ లేని నాగరికం కానీ, చట్టబద్ధం కానీ, ఆధునిక విలువలు లేని ఆదిమకాలపు శిక్షలను ఇన్‌స్టంట్ జస్టిస్‌కి లెజిటిమసీ కల్పిస్తే ఆగుతుందా. ఒకసారి పోలీసులకు అటువంటి అధికారాలు దఖలు పడితే పర్లేదు, మనం చంపేయొచ్చు అని నమ్మకం కలిగాక అది ఒకచోట ఆగుతుందని వీళ్ళెవరైనా భరోసా ఇవ్వగలరా. హీరో ఎవర్నో చితగ్గొడితే చప్పట్లు కొట్టే స్వభావం తెరమీద వరకు పెద్ద ప్రమాదం కలిగించక పోవచ్చు. పోలీసులు ఇలా నిందితులను చంపితే చప్పట్లు కొట్టే స్వభావం చాలా ప్రమా దాలను తెచ్చిపెడుతుంది. కాళ్ళముందు తప్ప కళ్ళముందు చూపు దీర్ఘంగా సారించి చూడ లేనంత హ్రస్వదృష్టి ఏర్పడ్డ సమాజం మనది.
మనమే ఏర్పరచుకున్న రాజ్యాంగమూ, చట్టాలూ మనకి అడ్డంకి అయిపోయి చంపేయి, నరికేయి, రైలు పట్టాల మీద తోసెయ్ అనేదాకా వెళ్తే అది వెనక్కు వెళ్ళడమా, ముందుకు వెళ్ళడమా?? తాతలు, మామలు, బాబాయిలు, ఇరుగుపొరుగు అన్నయ్యలు ఇట్లా ఎన్ని పేర్లతో ఎంతమంది పసిబిడ్డలపై తెలీకుండా అకృత్యాలకు పాల్పడడం లేదు. నాకు జీవితంలో అలా ఎప్పుడూ జరగలేదు అని ధైర్యంగా చెప్ప గలిగిన స్త్రీని దుర్భిణి వేసి వెతకాల్సిందే. అందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దశలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు తెలి సినవాళ్ళతోనే అట్లాంటి హింస అనుభవిం చిన వాళ్ళమే. అందుకని ఈ హింసను నార్మల్‌గా తీసుకుందాము అనకండి. నిలువెల్లా హిపోక్రసీ నింపుకున్న సమాజం మనది. ఎంతమందిని చంపుతారు. అసలు చంపడం మాత్రమే పరిష్కారమా. రాజ్యం తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉండడమే సమస్య ఇక్కడ.
హీరోయిన్‌ను ఏడిపించడాన్ని సమర్ధించు కుంటూ, చిన్నప్పుడు నా వెంట కూడా మగాళ్ళు పడ్డారు అని నువ్వు గర్వంగా తల్చు కోవద్దా అంటాడు ఒక హీరో. ఇట్లాంటి హీరోలు, ఇట్లాంటి సినిమాల మధ్య పెరిగిన మనుషులు ఆడవాళ్ళను ఏడిపించడం, ఎవరూ లేకపోతే అంతకంటే ముందుకెళ్ళడం మగాడి హక్కు అనుకుంటాడు. ఏం చేద్దాం ఈ సినిమాలను? ఈ హీరోలను? అదే హీరోలు బుల్లెట్ల మీద బుల్లెట్లు కురిపిస్తూ డైలాగుల మీద డైలాగులు వాంతి చేసు కుంటూ ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా నిందితుడిని నరకాల్సిందే అంటారు.
ఇంతకుముందు ఎన్‌కౌంటర్ ప్రహస నాలను చూశాం. తగ్గాయా, లేదా అని తెలిసి కూడా అదే పరిష్కారమని పదే పదే అనగలం. తోలు నోరు, నరం లేని నాలుక, మెదడు లేని తల. ఏమైనా అనగలం. ఇలా కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అన్న సమాజాలు దిగజారిపోయాయి. వ్యవస్థలు అలా దెబ్బతింటే, ఒక వ్యవస్థకు లేని అధికా రాలు అప్పగిస్తే అది అంతిమంగా జనాల్ని బలితీసుకుంటుంది. బలహీనులే సమిధల వుతారు అని చెప్పిన పాపానికి, చట్టబద్ధ పాలన సాగాలి, మనం ఏర్పరచు కున్న రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించాలి అని చెప్పిన పాపానికి మహిళా నాయకురాళ్ళు అత్యాచారాల బెదిరింపులను, చెప్పలేని
బూతులను ఎదుర్కోవాలి? నిరంతరం తమ శ్రమను, శక్తిని సమాజం కోసం వెచ్చిస్తున్న యాక్టివిస్టులకు మన సమాజం ఇస్తున్న గౌరవం ఇది. సామూహికంగా సిగ్గుపడదామా?