‘మరణం’… ఎందుకో ఈ మాటంటే కూడా అందరికీ అంత భయం! జననం ఎంత సహజమో, సంబరమో మరణమూ అంతే సహజం కనుక ఆ చివరి శ్వాస వరకు జీవితాన్ని ఒక సంబరంగా మలచుకోగలిగితే… మనిషి పుట్టుకని ఎంత వేడుకగా చేసుకుంటామో ఆ మనిషి
చావునీ, చివరి యాత్రనీ అంతే వేడుకగా చేసుకోగలిగితే… అసలిది సాధ్యమేనా? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకనాడు పోతానని తెలిసీ, చావు గురించి మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా అది అపశకున మని, అపవిత్రమని నమ్ముతూ ఆ విషయాన్ని దాటేస్తుంటారు. కానీ బ్రతుకు ముగిం పుని కూడా నిండుగా, ఆత్మీయులందరి మధ్య సంతోషంగా వెళ్ళబుచ్చగలిగితే!! అది అచ్చం కమలాజీ మరణంలాగే ప్రేమ నిండిన వాతావరణం లో పూలరెక్కలు, సుగంధ పరిమళాలు, ఉత్తేజ కరమైన పాటలు, చిరు నాట్యాల మధ్య ఆహ్లాదంగా ఈ లోకాన్ని వీడిపోవచ్చు…
శాంతి మనసులో చెలరేగుతున్న ఆలోచనలు చివరికి ఈ రూపం తీసుకోగానే ముఖంమీద కాంతితో నిండిన చిరునవ్వు విరిసింది. మనసు తేలికపడిరది.
పొద్దున్నే పార్వతితో కలిసి గిన్నెలు కడుగుతూ పెట్టిన ముచ్చట్లు, కొద్దిసేపట్లోనే గత వారం రోజుల్లో జరిగిన నాలుగు మరణాల వైపు మళ్ళిపోయాయి. ఆ నాలుగు మరణాల గురించి పార్వతి చెప్పిన వివరాలు శాంతిని విస్తుపోయేలా చేశాయి. ఎందుకంటే అవన్నీ ఆత్మహత్యలే ఒక్కటి తప్ప. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఇద్దరు పురుషులు, ఒకరు మహిళ. ఆ మహిళకి ఇద్దరు టీనేజీ కొడుకులు. ‘భర్త బానే చూసుకుంటాడు. తాగుడు, వేస్టు ఖర్చులు ఏమీ లేవు. ఇద్దరూ ఎప్పుడూ కొట్లాడుకోలేదు కూడా. అయినా ఆమెకేమయిందో ఉరి పెట్టుకుంది. కొడుకులు కూడా ఎందుకలా చేసిందో అర్థం కాలేదంటు న్నారు’ చెప్పుకొచ్చింది పార్వతి.
మరణించిన మగవాళ్ళిద్దరూ పురుగు మందు తాగి చనిపోయారని, అందులో ఒకతనికి 25
ఏళ్ళు కూడా ఉండవని, పెళ్ళై మూణ్ణెల్లే అయిందని, భార్య వేధింపులు తట్టుకోలేక మందు తాగాడని విడ్డూరంగా చెప్పింది పార్వతి. ‘ఏమని వేధించేదట’ అన్న శాంతి ప్రశ్నకి ‘అత్తమామలతో కలిసుం డొద్దంట, అబ్బాయి ట్రాక్టరు నడుపుతాడు, అది మానేసి కారు నడపొచ్చు పట్నం పోదాం అని ఒకటే రొద పెట్టేదంట. అబ్బాయి నాన్నకి పక్షవాతం. రెండెకరాల పొలం ఉంది. అమ్మా నాన్న అది చూసుకోలేరు, మనం పట్నం పోతే ఆళ్ళనెవరు చూసుకుంటారు, పొలమెవరు చేస్తారు అనే వాడంట. అమ్మాయేమో పొలం కౌలుకిద్దాం, ఆళ్ళకి డబ్బు పంపుదాం. ఇంత వండిపెట్టలేదా అత్తమ్మ అనేదంట…’ చెప్పుకుపోతోంది పార్వతి. ఇలాంటి కేసులు ఎక్కువగానే వింటున్నాం ఈ మధ్య. చావు వరకు వెళ్ళకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువై పోలీస్టేషన్లకు వెళ్తున్నారు. దీనికి కారణా లేంటో ఒక అధ్యయనం చెయ్యాలి’ అనుకుంది శాంతి.
మూడో కేసు గురించి కూడా చెప్పుకొచ్చింది పార్వతి. ‘అబ్బాయికి ముప్ఫై ఏళ్ళంట. పెళ్ళై ఆరేళ్ళయిందట. పెళ్ళైన ఏడాదికే బైక్ మీద వస్తూ చీకట్లో స్పీడ్ బ్రేకర్ చూసుకోకపోవడంతో బండి మీద నుంచి ఎగిరి పడ్డాడంట. నడుము విరిగి నాలుగు నెలలు దవాఖానలోనే ఉన్నాడు. ఎప్పటికో నడకొచ్చింది. ఉన్న ఎకరం పొలం, బైకు, ట్రాక్టరు అమ్మేస్తే పైన లక్ష రూపాయలు అప్పు మిగిలిందంట. ఇంత చేసినా నడకైతే వచ్చింది కానీ, కుంటుతూ నడుస్తాడు, ఒక ప్రక్కకి ఒంగినట్టుంటాడు. ఆ పిల్లకేమో ఆఫీసర్లెక్క
ఉండాలి…’ చెప్తున్న పార్వతిని మధ్యలో ఆపి ‘అలా ఎలా చెప్పగలవు. ఆ అమ్మాయి అలా అంటుందా? అయినా ఒకవేళ అతనలా నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు కదా! ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునేంత అవసరం ఏముంది’ అంది శాంతి. సమాధానంగా, ‘సంవత్సరం క్రితం వదిలేసి పుట్టింటికెల్లిపోతే ఆళ్ళ అమ్మోళ్ళు నచ్చచెప్పి తీసుకొచ్చి దించెల్లారు. అప్పట్నుంచి గొడవలే. పిల్లలవ్వలేదని బాధ. ఆమె కూలికెల్తుంది. ఆ అబ్బాయి బరువు పనులు చెయ్యలేడు. అందుకని కిరాణం కొట్లో సామాన్లు కట్టడానికి పనిచేసేవాడు. వచ్చే పైసలు ఆళ్ళిద్దరికీ సరిపోతాయి. ఆ ఇబ్బందీ లేదు మరి’ అని ఆగింది.
ఏదో ఆలోచనతో శాంతి ‘అతను సంసారం చెయ్యగలడా’ అని అడిగింది. ఒకసారి శాంతివైపు చూసి కొంత నిశ్శబ్దం తర్వాత ‘ఏమో, అదెప్పుడూ మాట్లాడలేదామె’ అంది పార్వతి. ‘ఒకవేళ గొడవలకి అది కారణం కావచ్చేమో’ అంటున్న శాంతిని ఆశ్చర్యంగా చూస్తూ ‘ఏమో మరి. ఆ విషయానికి ఆ అమ్మాయి ఎల్లిపోతుం దేమో అని, తను పనికిరాడని అందరూ అనుకుం టారని బాధ పడ్డాడేమో. అందుకే పురుగుమందు తాగుంటాడు. అంతే అయ్యుండొచ్చు!’ చేస్తున్న పని ఆపేసి కొత్త విషయాన్ని కనుక్కున్నట్టు అంది పార్వతి.
నవ్వి ‘అది కూడా ఆలోచించాలి’ అంటూ ‘మరి మల్లమ్మ ఎలా చనిపోయింది’ అడిగింది శాంతి. అసలామె చనిపోవాల్సింది కాదు. కొడుకూ, కోడలూ చూడకే సచ్చిపోయింది. ఆమెని కుక్క కరిచింది. మల్లమ్మకి కళ్ళు కనపడవుగా, ఓనాడు అన్నం తిని పాక బైట గోడకి కూర్చుందంట. కాసేపటికి ఎక్కడ్నుంచొచ్చిందో పిచ్చికుక్క వచ్చి కరిచిపోయిందంట. ఒకటే మొత్తుకుందంట ఎవరన్నా దవాఖానకి తోలుకుపొమ్మని. ముసిల్దా నివి ఎన్నాళ్ళు బతుకుతావు, ఇప్పుడు డాక్టర్లకి, మందులకి, సూదులకి పైసలెక్కడెల్తయి అని కొడుకు పసరు కట్టుకట్టి నొప్పి తగ్గడానికి గోలీలేసిండంట. సరిగ్గా తినక, సరైన వైద్యం లేక, ఎవరూ చూడక మూడోనాడే సచ్చిపోయింది. దవాఖానకు తోలుకపోయుంటే బతికేదే…’ బాధపడుతూ చెప్పింది పార్వతి. ‘అయ్యో అంత అన్యాయమా’ అని మాత్రమే అనగలిగింది శాంతి. ఏదో తెలియని గుబులు ఆవహించి మౌనంగా అయిపోయింది.
ఇన్ని రకాల మరణాలు… మానవ సంబం ధాలు… జీవితానికిచ్చే విలువ… మనిషికిచ్చే గౌరవం… పరిస్థితులు… ఏది ఏమైనా బలవంతపు మరణం సరికాదు. ఆ బలహీన క్షణాన్ని రాకుండా చేసుకోడం ఎలాగో పిల్లలకి చిన్నప్పటినుంచే నేర్పాలి. జీవితాన్ని ప్రేమించడం, ఎప్పుడూ అన్నీ మనకు కావలసినట్టే జరగవని, ప్రత్యామ్నాయాలని వెతుక్కుంటూ ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించాలి. అది చదువు లో భాగం చేస్తేనే సాధ్యమవుతుంది. ప్రాణాన్ని ప్రేమించడం కాదు, జీవితాన్ని, జీవనగమనాన్ని ప్రేమించాలని, కష్టాలు, ఎదురు దెబ్బలు జీవితంలో భాగమేనని, తనపైన తనకి ప్రేమ ఉంటే, ఎదుటి వారిపైన గౌరవం ఉంటే అన్నిటికీ సమాధానం దొరుకుతుందని, ఆ విశాలత్వాన్ని ఏర్పరచుకోడం అవససరమని చెప్పాల్సిందే.
పూలూ, ముళ్ళూ, చీకటి వెలుగుల్లా కలిసే
ఉంటాయని చెప్తే సరిపోతుందా? అర్థం చేయించ డానికి ఇంకేం చేయాలి? ‘నీకున్న సమయం చాలా తక్కువ’ అని డాక్టర్లు చెప్పినా మరణాన్ని పాటలతో, నవ్వులతో ఆహ్వానించి, మరణానికే ఇంకొంచెంసేపు ఆగుదాం అనిపించేలా చేసి తనువు చాలించిన కమలాదీ ఒక ఆదర్శం కావాలి. జనన, మరణాల మధ్య జీవితాన్ని వేడుక చేసుకోడం ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ అత్యవసరం. జవశ్రీవపతీa్‌వ ూఱటవ!