‘‘ఇంటి పనులు ఎవరు చెయ్యాలి’’ వంటి ప్రశ్నలకు జవాబుగా కమలా భాసిన్ సహజ శైలిలో ఇంకో ప్రశ్న సంధించేది, ‘‘ఇంటి పనులు చేయడానికి గర్భసంచి అవసరమా?’’
మహిళల ఉనికితో ముడిపడున్న సంప్రదాయాల ఉచ్చుతాళ్ళను తెంచి వారిని
స్వేచ్ఛవైపు నడిపించడానికి వారి చేతిని పట్టుకోగానే కమల చేతి వెచ్చని స్పర్శతో వారి ముఖాలమీద చిరునవ్వు నాట్యమాడుతుంది. పుష్పగుచ్ఛంలోని రంగురంగుల పూల మాదిరి కమల వ్యక్తిత్వం కూడా అనేక రంగుల కలయిక. ఆమె ఒక సామాజిక కార్యకర్త, ఒక కవి, ఒక గాయని, ఒక కథకురాలు… భారతదేశపు మహిళా ఉద్యమానికి ఒక ఊపిరి కమల.
మరుగుతున్న నీళ్ళల్లో నీడలు కనపడవన్న విషయం కమలకి బాగా తెలుసు. అందుకే తరతరాలుగా పాతుకుపోయిన అసమానతల గురించి మాట్లాడడానికి ఆమె చాలా సహజమైన, సరళమైన దారిని ఎంచుకుంది. తన మాటలు ఎంతో చిక్కదనంతో ఉండడం వల్ల అవి వినేవారి మనసుల్లో ముద్రపడిపోతాయి. ఎంత మొండిఘటం అయినా కమల మాటలు వింటే ఆమోదించక మానరు. మచ్చుకి ఒకటి ` ఢల్లీిలో జరిగిన ఒక శిక్షణా కార్యక్రమంలో ఒకతను కమల మాటల్ని ఒప్పుకోవట్లేదు. బహుశా అతన్ని తన స్వానుభవం కలవరపెడుతూ ఉంటుంది. లంచ్ బ్రేక్‌లో కమల ఎంతో ప్రేమతో అతని భుజంమీద చెయ్యేసి ‘‘బాబూ, యుద్ధం స్త్రీ పురుషుల మధ్య కాదు, యుద్ధం పురుషులకి ఎంతో నష్టం చేసిన పితృస్వామ్య వ్యవస్థ మీదయ్యా. అది వారిని ఏడవకూడదంది, వారి ఎమోషన్లను కట్టడి చేసింది, తప్పకుండా సంపాదించాల్సిన భారాన్ని వారిమీద మోపింది. నింద పడకూడదన్న ఒత్తిడిలోనే పురుషుడు సంతృప్తిని వెతుక్కుంటూ తిరుగుతాడు’’ అంది కమల. ‘‘ఇంటి పనులు ఎవరు చెయ్యాలి’’, ఈ అంశం మీద చర్చ వచ్చినప్పుడు కమల నుంచి సహజమైన జవాబు సూటిగా ఒక సరళమైన ప్రశ్న రూపంలో వచ్చింది. ‘ఇంటి పనులు చెయ్యడానికి గర్భసంచి అవసరమా?’ వింటున్న వారికి దీని భావం అర్థమై అవాక్కైపోయారు. తను ఒకసారి లక్షాధికారి, కోటీశ్వరుడు అంటే ఏంటని అడిగినప్పుడు కొంచెం అయోమయపడ్డాను. దాని భావం ఏంటనేది అర్థం కాలేదు. కాసేపటికి తనే చెప్పింది. లక్షాధికారి (లఖ్పతి) అంటే లక్ష రూపాయిలకి యజమాని, కోటీశ్వరుడు, (కరోడ్‌పతి) అంటే కోటి రూపాయలకి యజమాని. మరి మహిళకి పతి అంటే మహిళకి యజమాని అనేగా?’ అంత లోతైన పితృస్వామ్య భావజాలన్ని తను ఇంత సునాయాసంగా, సరళంగా చెప్పేసరికి అది బుర్రలో ఇంకిపోయింది. ఇదీ ఆమె.
కమల నిర్వహించే వర్క్‌షాప్స్‌కి మారుమూల గ్రామాల నుంచి మహిళలు వచ్చినపుడు వారి మొహమాటాల్ని, సంశయాల్ని పోగొట్టడానికి ముందుగా తనే వారి వద్దకు వెళ్ళి వారితో కలిసి పాడడం, ఆడడం చేసేది. తను వ్రాసిన పాటలతో ఆ మహిళల సంశయాన్ని పారద్రోలి వాళ్ళ మనసుల్లో నాటుకుపోవడానికి ఇదో శక్తివంతమైన మార్గమయ్యేది. ‘సోదరీ! స్పృహతో ప్రవహించగలిగితే, ఇదిగో జాగృతమయ్యే సమయం వచ్చింది.’ ‘అక్కాచెల్లెళ్ళొస్తున్నారు బంధనాలు తెంచుకుని’, ఇంకా ‘వస్తుంది, అణచివేతని నిర్మూలిస్తుంది, ఆమె కొత్త శకాన్ని తెస్తుంది’ వంటి పాటలు వారిలో ఉత్తేజాన్ని నింపేవి. ఇవాళ మహిళా ఉద్యమానికై తయారవుతున్న ప్రతి ఒక్క అమ్మాయి కమలా భాసిన్ వ్రాసిన పాటలే పాడుతుంది. వందలాది నినాదాలిచ్చే కమల ‘స్వేచ్ఛ`స్వేచ్ఛ, స్వేచ్ఛ మా హక్కు’ అని నినాదాలిచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది మహిళలు ఆమెతో కలిసి ఒక్కసారిగా నినదించారు. అదొక ప్రపంచ రికార్డు అయింది.
ఆమె ఉర్దూ మాట్లాడితే కొంచె లక్నవీ యాస, కొంచెం పంజాబీ యాసతో ఉన్నా ఎంతో స్వచ్ఛంగా, సొగసుగా ఉంటుంది. ఆమె ఉచ్ఛారణలో ఎప్పుడూ తప్పు దొర్లలేదు. తనవాళ్ళతో ఉన్నప్పుడు ఎప్పుడూ హిందుస్తానీలో మాట్లాడడానికే ఆమె ఇష్టపడేది. విదేశాల్లో చదువుకున్నా తనకు ఏనాడూ ఇంగ్లీషు భాషాహంకారం ఉండేది కాదు.
స్త్రీ వాద ప్రబల పక్షపాతి అయిన కమల మహిళా రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతూ కేవలం మహిళలు పార్లమెంటుకు వచ్చినంత మాత్రాన పరిస్థితులు మెరుగవ్వవు. స్త్రీ వాద మహిళలు స్త్రీ`పురుషుల సమానత్వం గురించి ఎప్పుడైతే మాట్లాడుతారో అప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. పిల్లల్ని సమానత్వంతో కూడిన/అసమానతలు లేని మనుషులుగా తయారుచేయడానికి ఆమె చాలా వ్రాసింది. తనొక మాటంటుంది ‘‘నువ్వు బట్టలు వేసుకుంటావా? అవునండీ అవునండీ. నువ్వు బట్టలు ఉతుకుతావా? లేదండీ లేదండీ. బట్టలు అంటే అవునంట, ఉతకడమంటే కాదంట, ఇదేమి చోద్యం రాజా?’ స్త్రీలపై బలాత్కారం చేసి వారి పరువుని కొల్లగొడుతున్నారని హాహాకారాలు చేసేవారిని ఒకచోటకి పిలిచి చిరునవ్వుతో వారికిలా సమాధానమిచ్చింది` ‘‘వంశమంతటి పరువుని తెచ్చి స్త్రీల యోనిలో ఎందుకు పెట్టారు? బలాత్కారం వల్ల స్త్రీల పరువు కాదు, పురుషుల పరువే పోతుంది.’’
కమల వ్రాసిన ప్రసిద్ధి చెందిన ఈ కవిత స్త్రీలని అడుగడుగునా అడ్డుకునే శక్తులకు ‘‘తోటలోని పూలన్నింటిని కాలరాయగలరేమో కాని, వసంతాగమనాన్ని మాత్రం ఆపలేరు’’ అంటూ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మిస్తామని హెచ్చరిక జారీ చేస్తుంది. చిక్కటి పాలమెరుపు లాంటి కేశాలతో మెరిసే మన అద్యురాలు కమలకి గౌరవపూరిత నివాళి ప్రకటిస్తూ, ఆమెకి ప్రేమపూర్వక సలాం చేస్తున్నాం. కమలా భాసిన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి న్యాయాన్ని కాంక్షించే శతకోటి జనం సిద్ధంగా ఉన్నారు. ఆమె అభిరుచిని కొనసాగిస్తామని మేమంతా వాగ్ధానం చేస్తున్నాం.