నిజం! నమ్మండి! ఇదంతా నేను చెప్పినంత సులభంగా జరగలేదు. ఎన్నో కన్నీళ్ళు, గొడవలు, వాదనలు, కుటుంబాల మధ్య ఎన్నో సంఘర్షణలు…
మా ఊరు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఊరికి చాలా దూరంగా ఏ సౌకర్యాలు లేకుండా విసిరివేయబడినట్లు ఉండే లంబాడి తాండా నాది. అక్కడ మగపిల్లల చదువులే అరకొరగా ఉండి, కొద్దిమంది పదో తరగతి దాకా వచ్చాక ఫెయిలై ముగిసిపోతాయి. ఇక
ఆడపిల్లలకి అక్షరాలు రాయటం వస్తే అదే చాలా గొప్ప. అక్కడ ఉండే అన్ని కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే! వారందరూ ఇంటిదగ్గర మేకలు పెంచడం, వ్యవసాయ కూలీలుగా చేలకు పోవడం, అర, పావు ఎకరాలు ఉన్న కొంతమంది కూరగాయలు పండిరచడం చేస్తారు. నన్ను స్కూల్‌కి పంపాలని అమ్మ మా నాన్నతో చెప్పినప్పుడు ఆయన పెద్దగా స్పందించలేదు. పైగా తమ్ముడ్ని ఎంత కష్టపడైనా ప్రైవేట్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ ఆడపిల్లకి కూడా చదువు అవసరమేనని, తాను చదువుకోకపోవడం వల్ల రోజువారీ వ్యవహారాలలో ఎంత ఇబ్బంది పడుతోందో అమ్మ నాన్నతో చెప్పి తాను స్వయంగా నన్ను తీసుకెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. మా నాన్నకు చదువంటే ప్రాణం. ఆయన మగపిల్లలందర్నీ చదువుకోమని చెప్తుండేవాడు. మన తండా నుంచి ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చూడడం నా కల అనేవాడు. అందుకే ఆయన పరిస్థితికి కష్టమయినా మా తమ్ముడ్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు.
నేను స్కూల్‌కి టైంకి వెళ్ళడానికి ఎంత ప్రయాస పడాల్సి వచ్చేదో. ప్రొద్దున్నే అమ్మతో పాటు నిద్రలేచి వాకిళ్ళు ఊడ్చి కళ్ళాపి చల్లి, ముగ్గు వేయాలి. మేకల దొడ్లో శుభ్రం చేస్తే అమ్మ పాలు పితికేది. అమ్మకి ఇంట్లోకి నీళ్ళు మోయడానికే ఎంతో సమయం పట్టేది. ఆ తర్వాత వంట చేసి నాకు బాక్స్ పెట్టి ఇచ్చేది. తనూ, నాన్నా క్యారేజి కట్టుకుని కూలికి పోవడానికి రెడీ అయ్యేవారు. ఈలోపు నేను తమ్ముడికి ముఖం కడిగి, బట్టలు, షూలు, బెల్టు, లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేస్తే ఆటో వచ్చి వాడ్ని తీసుకెళ్ళేది. నేను నా స్కూల్ బెల్ ఎక్కడ కొట్టేస్తారో అని పరిగెత్తుకుంటూ ఆయాసంతో స్కూల్‌లో అడుగు పెట్టేదాన్ని. అప్పటికే స్కూల్లో ఒక్కోసారి గంట కొట్టేసేవారు. దాంతో టీచర్లు ఆలస్యంగా వచ్చిన వారిని క్లాస్ బయట మోకాళ్ళపై నిలబెట్టేవారు. అలా జరిగిన రోజు నాకు అవమానంతో, కోపంతో ఎంత దుఃఖం వచ్చేదో! ఆ కోపాన్ని ఇంటికెళ్ళి అమ్మపై అరచి చూపించేదాన్ని.
కానీ అమ్మ ఏదో గొణగడం విన్నాను కానీ ఆమె సమాధానమేంటో మాత్రం నాకు వినపడలేదు. ఇంతవరకు చదివించడం కోసం అమ్మ చాలా కష్టపడిరది. కానీ నాన్నను ఎదిరించి అమ్మ ఈ పెళ్ళిని ఆపగలదా? ఈ ప్రమాదాన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు. వెంటనే ఈ విషయాన్ని నేను నా టీచర్లకి చెప్పాను. వారు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడతామన్నారు. అన్నట్లే వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మా, నాన్నతో మాట్లాడారు. నాకు మంచి మార్కులు వస్తే మొత్తం చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, ఆడపిల్లలు చదువుకుంటే ఎవరిపైనా ఆధారపడకుండా తమ బ్రతుకుతాము బ్రతకగలరని ఎంతో నచ్చచెప్పారు.
అంతలోనే నాన్న ఎవరి మాటలనూ అర్థం చేసుకోకుండా మా అత్త, నాన్నమ్మ చెప్పిన మాటలు విని బలవంతంగా మా బావతో నా పెళ్ళి జరిపించారు. అమ్మ ఈ పెళ్ళి తప్పదని నాకే నచ్చచెప్పింది. నా భర్త పదవ తరగతి ఫెయిలై ఆటో నడుపుతున్నాడు. పెళ్ళయిన రెండు రోజులకే నా 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. మండలస్థాయిలోనే నేను ఫస్ట్ వచ్చానని తెలిసి టీచర్లంతా నన్ను అభినందించారు. అమ్మ సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాన్న ముఖంలో కదలాడే భావాలేంటో నేను చెప్పలేను. కానీ అంత ఖర్చు పెట్టి ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నా తమ్ముడు మాత్రం చదువులో వెనుకబడి ఉండడం నాన్నకి బాధ కలిగిస్తోందని మాత్రం అర్థం చేసుకోగలను.
నా పెళ్ళయిన రెండు, మూడు నెలల కాలం చాలా సంతోషంగా సాగింది. కొత్త చోటు, కొత్త పరిచయాలతో కొత్త కొత్త అనుభవాలు, బాధ్యతలతో వేగంగా గడిచిపోయింది. కానీ నా మనసులో మాత్రం చదువుని ఎలా కొనసాగించాలా అనే ఆలోచనలు తిరుగుతుండేవి. ఇంట్లో జరిగే సంభాషణలలో ఏదో ఒక రకంగా నేను చదువుకుంటాననే విషయాన్ని ఎలాగోలా వారికి చెప్పేదాన్ని. కానీ ఆ విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. నా భర్తకు నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నించాను. కానీ అతను వాళ్ళ అమ్మ, నాన్నమ్మల మాటలను వినేవాడు. ఆడపిల్లలు చదువుకోవడమనేది వారికి అంతగా నచ్చే విషయం కాదు. అందులోనూ పెళ్ళయిన ఆడపిల్లని కాలేజికి పంపడమనేది అస్సలు ఒప్పుకోరని నా భర్త నాతో అన్నాడు. పైగా తనకంటే భార్య ఎక్కువ చదువులు చదవడమేంటి? అనే భావన కూడా అతనికి ఉండేది. అందుకేనేమో చాలా త్వరగానే నాపై ఇంటి బాధ్యతను మోపారు. చదువుకోవడం వలన ఇంట్లో ఎవరికీ పెద్దగా ఉపయోగం లేదు. అదే వాళ్ళతో కలిసి పొలం పనుల కోసం వెళ్తే కూలి డబ్బులయినా వస్తాయని నన్ను కూడా బలవంతంగానే పొలానికి తీసుకెళ్ళారు.
ఒకరోజు ఉదయం మా ఇంటికి ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి మా అత్త, మామ, భర్తతో మాట్లాడడం చూశాను. ఎవరై ఉంటారని నేను కూడా వెళ్ళాను. అక్కడ మా స్కూల్ హెడ్‌మాస్టర్‌ని చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదో తెలియని ధైర్యం వచ్చింది. వాళ్ళు కాలేజి నుండి వచ్చారు. నన్ను వాళ్ళ కాలేజీలో చేర్పించమని అడిగారు. అందుకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందని నచ్చచెప్పారు. కాలేజీలో చేర్పించమని నేను రెండ్రోజులు ఇంట్లో అన్నం తినకుండా ఏడ్చి నిరాహార దీక్ష చేశాను. మా అత్త, భర్త వాళ్ళేం చెప్పినా, బ్రతిమలాడినా, తిట్టినా నేను నా మాటపైనే మొండికేయడంతో చేసేది లేక మా అమ్మ, నాన్నలకు కబురు పెట్టి పిలిపించారు. వాళ్ళు కూడా నాకు ఎంతగానో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా నేను వినలేదు. నన్ను ఇలా మొండిదానిలా పెంచారని, గారాబం చేసి చెడగొట్టారని మా అత్త మా అమ్మా, నాన్నలను తిట్టిపోసింది.
చివరకు చేసేది లేక మా అత్త, నా భర్త, మా అమ్మ, నాన్న, నానమ్మల ముందు నన్ను కాలేజీలో చేర్చాలంటే వారు పెట్టిన షరతులన్నింటికీ ఒప్పుకొని తీరితేనే కుదురుతుందని చెప్పారు. అందులో ఒకటి నేను కాలేజికి వెళ్ళేటప్పటికి ఇంటి పని మొత్తం పూర్తి చేయాలి, అలాగే ముస్తాబు చేసుకుని కాలేజికి వెళ్ళకూడదు, అక్కడ అబ్బాయిలెవరితోనూ మాట్లాడకూడదు, నా భర్త ఆటోలోనే వెళ్ళి అదే ఆటోలో తిరిగి రావాలి, కాలేజీలో ఏ ఖర్చుల కోసం వాళ్ళని డబ్బులు అడగకూడదు. ఏవైనా చిన్న చిన్న ఖర్చులుంటే తాను చూసుకుంటానని మా నాన్న అనడంతో, కాలేజీలో చదువుకోవడం కోసం వారు పెట్టే ఏ షరతులకైనా నేను సరేననడంతో రెండు సంవత్సరాలు మాత్రమే చదివిస్తామని చెప్పారు.
కాలేజీలో చేరగానే నా కల సగం నిజమైందనే సంబరం కలిగింది. కానీ ఇంగ్లీషు మీడియం కావడంతో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. డిక్షనరీ పక్కన పెట్టుకుని అవస్థలు పడి చదివేదాన్ని. సాయంత్రం గబగబా ఇంట్లో పనంతా చేసేసి చదువుకునేదాన్ని. అన్నట్టుగానే మా ఆయన నన్ను కాలేజీలో దిగబెట్టేవాడు. మంగళసూత్రాలతో, మెట్టెలతో, చీర కట్టుకుని కాలేజీకి వెళ్తే అందరూ నన్ను వింతగా చూసేవాళ్ళు. కాలేజీలో నాలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు వేరే క్లాసులో ఉన్నారు.
లెక్చరర్లు కూడా నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు నోట్సులు ఇచ్చి తెలియనివి అడగ్గానే చెప్పేవారు. నన్ను
వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించేవారు. కాలేజీలో మిగతావాళ్ళ సంగతులేవీ నాకు పట్టేవి కావు. నా ఇల్లు, సంసారం, చదువు… దీంతోనే నా సమయమంతా గడిచిపోయింది. అతి కష్టంగా ఫస్టియర్ పరీక్షలు బాగానే రాశానని సంతోషించేలోపే నాకు సుస్తీ చేసింది. ఏమీ తినబుద్ధయ్యేది కాదు. నీరసంగా కళ్ళు తిరుగుతూ ఉండేవి. మా అత్త, మా అయన నేను రాత్రిళ్ళు మేల్కొని చదువుకుంటూ ఆ గోలలో సరిగ్గా తినకుండా బలహీనంగా తయారయ్యానని మా అమ్మా నాన్నతో అన్నారు. కాలేజీకి సెలవలే కదా! కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకుని పంపిస్తామని మా అమ్మా, నాన్నా నన్ను మా ఊరికి తీసుకెళ్ళారు. వాళ్ళు నా పరిస్థితి చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ నన్ను పరీక్ష చేసి మూడో నెల నిండిరదని చెప్పింది. మా అమ్మా, నాన్న చాలా ఆనందపడ్డారు. మా అత్త, నా భర్త కూడా ఆ కబురు విని చాలా సంతోషించారు. ఇక నా చదువెలా అని రహస్యంగా ఏడ్చింది నేనొక్కదాన్నే. నేను బలహీనంగా ఉన్నానని, చిన్నతనంలోనే గర్భవతి అయితే వచ్చే కష్టాలు, నష్టాలు ఏంటో అమ్మకు, నాకు వివరించింది డాక్టర్. ఎన్నో మందులు రాసి రోజూ కరక్టుగా వేసుకోమని, నెలనెలా చెకప్ చేయించుకోవాలని చెప్పింది.
రెండు నెలలు మందులు వాడుతూ, అమ్మ ప్రేమగా చేసి పెట్టేవి తింటూ ఇంట్లో ఉన్నాను. నన్ను అత్తగారింటికి తీసుకెళ్ళడానికి నా భర్త వచ్చాడు. అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. నా భర్త, అత్త కూడా నన్ను నీళ్ళు మోయించడం లాంటి బరువు పనులు చేయనివ్వలేదు, కానీ ఇంట్లో పనంతా నాదే. కాలేజీలు తెరిచారు. ఇలా కాలేజీకి ఎలా వెళ్తావని, రోజూ ఆటోలో టౌన్‌కి పోయి రావటం మంచిది కాదని నన్ను వద్దన్నారు. ఈసారి చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు కూడా వద్దని, పెద్దల మాట వినాలని ఒత్తిడి చేశారు. కానీ నేను నా ఆరోగ్యంకన్నా నా చదువు ముఖ్యమని అలాగే కాలేజీకి వెళ్ళాను. వాళ్ళు వద్దనేకొద్దీ నా చదువు గురించి నాకెంతో ప్రేమ, ఇష్టం పెరిగిపోయాయి. లెక్చరర్లు నన్ను రోజూ కాలేజీకి రావాల్సిన పని లేదని, పాఠాల నోట్సు చదువుకోమని వెసులుబాటు కల్పించారు.
మా ఊరికి మహిళా సంఘం (ఐక్యతారాగం) వాళ్ళు వచ్చి ఆడపిల్లలను సమానంగా చూడాలని, ఆడపిల్లలను కూడా చదివించాలని, చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకూడదని, మహిళలు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకుని బ్యాంకుల నుండి లోన్ తీసుకుని తమకు చేతనైన వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వీథి నాటకాలు, పాటలు, పోస్టర్లు, పాంప్లెట్ల ద్వారా ఊరివారందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 18 సం॥ల లోపు పెళ్ళయిన వాళ్ళందరినీ ఒకచోట కూర్చోబెట్టి సమావేశం పెట్టి చిన్న వయసులో గర్భం వస్తే ఎలాంటి కష్టాలు వస్తాయో అర్థమయ్యేలా చెప్పారు. అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే పౌష్ఠికాహారం, ఆశా వర్కర్లు ఇచ్చే మందులు ఎందుకు తీసుకోవాలో, వాటివల్ల మాకు ఉపయోగమేమిటో చెప్పారు. పోషకాహారమంటే ఏంటి, ఇంట్లో వాటిని ఎలా తయారు చేసుకోవాలో శిక్షణనిచ్చారు. నేను గర్భంతో ఉండి కూడా ఇంట్లో వాళ్ళను ఎదిరించి పట్టుదలగా కాలేజికి వెళ్ళి చదువుకుంటున్నానని తెలిసి నన్ను ప్రత్యేకంగా అభినందించారు. దాంతో నాకు నా మీద, నేను చేస్తున్న పని మీద ఇంకా గౌరవం, ఇష్టం పెరిగాయి.
9వ నెల రాగానే కాలేజికి వెళ్ళడం మంచిది కాదని మానేశాను. నోట్సులు ఇస్తామని మా లెక్చరర్లు నా భర్తకు చెప్పి నా చదువు కొనసాగేలా చేశారు. 9 నెలలు నిండగానే నాకు బాబు పుట్టాడు. నేను బలహీనంగా ఉండడంతో కాన్పు కష్టమై హాస్పిటల్‌లో సిజేరియన్ చేయాల్సి వచ్చింది. బాబుని అమ్మ చూసుకుంటే నేను చదువుకునేదాన్ని. మా నాన్న నాకు చదువుమీద ఉన్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. మా నాన్న అంత ఖర్చు పెట్టినా మా తమ్ముడు అత్తెసరు మార్కులతో పదో తరగతి అయిందనిపించి నాకిక చదువుకోవాలని లేదని కంపెనీలో పనికి వెళ్తానన్నాడు.
మా బాబుకి మూడో నెలలో నాకు ఇంటర్ ఫైనలియర్ పరీక్షలు జరిగాయి. అమ్మ బాబుని చూసుకుంటే నేను కష్టపడి పరీక్షలన్నీ రాశాను. నా కొడుకుతో నాకిక క్షణం తీరిక లేకుండా పోయింది. ఇంటర్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. కాలేజీ లెక్చరర్లు, మా అమ్మా నాన్న, నా స్కూలు టీచర్లు, మహిళా సంఘం వాళ్ళే కాక, మా అత్తగారు వాళ్ళు, వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువులు కూడా నన్ను మెచ్చుకున్నారు. వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లే కన్పించింది.
మా అత్తవాళ్ళు ఇక చదివించరనేది నాకు తెలుసు. మా స్కూల్ టీచర్ సలహాతో టీటీసీ ట్రైనింగ్ కోసం అప్లై చేశాను. ఉచితంగా సీటు వచ్చింది. టీచర్ కావాలనే నా కల నెరవేరటానికి ఇక ఒక మెట్టే మిగిలిందని, ఈ ట్రైనింగ్ పూర్తి చేస్తే నాకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వస్తే డబ్బులన్నీ నా అత్త చేతికే ఇస్తానని ఎన్నో ప్రామిస్‌లు చేసినా కూడా నేను పసిపిల్లవాడ్ని వదిలి ట్రైనింగ్‌కి ఎలా వెళ్తానని నన్ను తిట్టింది. అప్పుడు నా కొడుకును తాను పెంచుతానని మా అమ్మ ముందుకు వచ్చింది. మా అమ్మ, నాన్నకు కూలి నష్టమైనా ఇంట్లోనే ఉండి నా కొడుకుని చూసుకోవడం వారికి ఎంత కష్టమైనా చదువుపై నా ఆసక్తిని చూసి ఒప్పుకున్నారు. నా కొడుకును విడిచి ఉండడం నాకు ఎంతో కష్టమైనా టీచర్ కావాలన్న నా కల నాకు చేతికందే దూరంలో ఉందనే నమ్మకంతో ఆ బాధను భరించాలనుకున్నాను.
టీటీసీ ట్రైనింగ్ పూర్తయింది. అప్పుడే ప్రైమరీ టీచర్ పోస్టులకి ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చింది. నేను వెంటనే అప్లై చేశాను. నేను సెలక్ట్ కావడం, మా అత్తగారి ఊర్లోనే టీచర్ ఉద్యోగం రావటం అంతా ఒక కలలా జరిగిపోయింది. మా అత్త, నా భర్త ఎంతో సంతోషించారు. మా అమ్మా, నాన్నల ఆనందానికి హద్దే లేదు. నా కూతురు ప్రభుత్వ ఉద్యోగిని అని మా నాన్న అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి సంబరంగా చెప్పుకున్నాడు. నా కల నిజం చేసుకోటానికి నేను నాతోనూ, నా ఇంటి వాళ్ళతోనూ, ఊరి వాళ్ళతోనూ యుద్ధం చేశాను అంటే, ఇదంతా చదివాక మీరు అవుననే అంటారు కదూ!