ఐక్యతారాగం శిక్షణలో మేము నేర్చుకున్న అంశాలను వేరే సంస్థ పనిచేస్తున్న గ్రామాలలోని మహిళలకు అవగాహన కల్పించాము. ఇలా చేయడం మేము తీసుకున్న శిక్షణలో ఒక భాగమే. మొదటగా జెండర్, సెక్స్ అనే పదాలను వారికి పరిచయం చేయాలని వారిని వాటి
గురించి ఎంతవరకు తెలుసు అని అడిగాము. జెండర్ అనగా ఆడ లేక మగ అనేది తెలియచేస్తుందని, సెక్స్ అంటే ఆడ, మగ మధ్య ఉండే శారీరక సంబంధమని వారు చెప్పారు.
జెండర్ అనేది సామాజికపరమైనది అనే విషయాన్ని ఉదాహరణలతో వారికి వివరించాము. అంటే మన దైనందిన జీవితంలో రోజువారీగా చేస్తున్న పనులు, ఆచారాలు, పాటిస్తున్న నియమాలు, కట్టుబాట్ల గురించి చర్చించడం ద్వారా ఈ విషయాన్ని వారికి అర్థం చేయించగలిగాము. కానీ, వారిలో పితృస్వామ్య భావజాలమనేది బలంగా పాతుకుపోవడం వలన ఇప్పటివరకు వారు చేస్తున్నది సహజమైనది, సరైనదని అనే భావనలో ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో జెండర్ అనే అంశం సహజమైనది కాదని, పితృస్వామ్యం చేత రూపొందించబడి, మనందరితో ఆమోదించి, అనుసరించేలా చేయబడిరదని తెలియచేయడానికి మాకు కొంచెం కష్టంగా అనిపించింది.
జెండర్ వర్ణ పటం: సెక్స్ గురించి చెబుతూ ఆడ, మగ పుట్టుక సహజమైనదని, లైంగిక అవయవాలను బట్టి ఒక బిడ్డ అమ్మాయి లేదా అబ్బాయి అని నిర్ణయించగలము. అలాగే జీవితమంతా కూడా వారు పుట్టుకతో వచ్చిన సెక్స్‌తోనే ఉంటారు. కానీ సెక్స్ జీవ సంబంధమైనది కాదని, అది కాలమాన పరిస్థితులను బట్టి కొందరు వ్యక్తులలో మారుతుందని, ఈ మార్పు సంభవమేనన్న విషయాన్ని వారికి తెలియజేశాము. ఈ మాటకి అంతటా కూడా అలా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవడానికి చాలా కుతూహలాన్ని చూపెట్టారు.
అలాగే స్త్రీ, పురుష లైంగిక అవయవాలు రెండూ కలిపి కొంతమందిలో అంతర్గతంగా/ బాహ్యంగా ఉంటాయని, ఇలాంటి వ్యక్తులను ఇంటర్ సెక్స్ వ్యక్తులని అంటారని, ఇలాంటి వ్యక్తులు ప్రపంచమంతటా ఉంటారని, కానీ వారిని సమాజం గుర్తించడానికి నిరాకరిస్తుందని చెప్పినప్పుడు వారు ఆలోచనలో పడ్డారు. వారు కూడా వారు చూసిన, వారికి తెలిసిన ఇటువంటి వ్యక్తుల గురించి మాతో పంచుకున్నారు. జెండర్ యొక్క గుర్తింపు, వ్యక్తీకరణ, లైంగిక ధోరణులను వారికి తెలియజేయడం ద్వారా వారు ట్రాన్స్‌జెండర్, లెస్బియన్, గే వగైరా వ్యక్తులను అర్థం చేసుకుని, అంగీకరించవలసిన అవసరం ఉందని మేము భావించాము. అందుకే ఈ అంశాల గురించి వివరంగా మాట్లాడాము. ఇటువంటి చర్చలు అందరితో కలిసి సౌకర్యవంతంగా చర్చించడానికి మేము తీసుకున్న శిక్షణలో తయారు చేసుకున్న మాడ్యూల్స్ మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. లైంగిక ధోరణి అనేది వ్యక్తి యొక్క భౌతిక, శృంగార లేక భావోద్వేగ ఆకర్షణ, ప్రేమ మరొక వ్యక్తితో లైంగిక సంబంధాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి మరొక జెండర్‌కి సంబంధించిన వ్యక్తి పట్ల ఆకర్షింపబడవచ్చు. ఒక వ్యక్తి LGBTQA+ అన్నీ కావచ్చు. ఈ విషయాలను మేము మా శిక్షణలో నేర్చుకున్నప్పుడు కొంచెం కొత్తగా ఉండి, అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. మా సభ్యులందరం ఒకరితో ఒకరం కలిసి ఎక్కువసార్లు చర్చించుకోవడం వలన ఈ విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఇందులో శిక్షణ ఇవ్వగలిగేంత నైపుణ్యాలను పెంచుకున్నాము.
లైంగికత: స్త్రీలు వివక్షతకి, హింసకి గురవడానికి పితృస్వామ్య వ్యవస్థ ఎటువంటి అంశాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేది విపులంగా చక్కగా అర్థం చేయించారు. ఇందులో లైంగికత అంటే ఏంటి? లైంగికతని ఎలా అర్థం చేసుకోవాలి, అది స్త్రీలపై ఎటువంటి ప్రభావాలని చూపుతుంది అనేది చర్చల ద్వారా అర్థం చేసుకున్నాము. కులం, మతం, వర్గం మరియు జెండర్ ఆధారంగా ఆహారం చుట్టూ ఉన్న వివిధ నిషేధాలు, నియమాలు మరియు పరిమితులను అర్థం చేసుకున్నాము. మనకు ఇష్టమైన, ఇష్టం లేని ఆహార పదార్థాల గురించి చర్చల్లో చెప్పాము. ఇష్టమైన ఆహారం, ఇష్టం లేని ఆహారం రెండు కాలమ్స్‌లో రాయడం జరిగింది. ఈ ఇష్టాలు స్థిరంగా ఉంటాయా లేక మారుతూ ఉంటాయా అనేది చర్చించినప్పుడు శిక్షణలో ఉన్న సభ్యుల నుండి వచ్చిన కొన్ని పాయింట్లు.
వండే పద్దతులను బట్టి, వివిధ రకాల వంటకాలను చూసి రుచి చూడడం వంటి పలు అంశాలపై ఆధారపడి ఆహారపు ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయని అర్థం చేసుకున్నాము ఈ చర్చల ద్వారా. కులం, మతం, వర్గం మరియు జెండర్ ఆధారంగా ఆహారం చుట్టూ నిషేధాలు మరియు సమాజం యొక్క ప్రభావాలు ఉంటాయనే విషయం అర్థం చేసుకున్నాను. కులం, మతం మరియు వర్గం మనం తినే ఆహారాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదా: ముస్లింలు పంది మాంసం తినరు, గోవు పవిత్రమైనది కాబట్టి గోమాంసాన్ని హిందువులు తినకూడదని చెప్పబడిరది (అయితే కొంతమంది తింటున్నారు). ఆపిల్ ధనవంతుల ఫలంగాను మరియు జామపండు పేదవారి ఫలంగాను చూపబడుతున్నాయి. సాంస్కృతిక, మతపరమైన ఆచారాల ఆధారంగా ఆహారం తీసుకోవడంపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదా:` పవిత్రమైన మాసాల్లో/రోజుల్లో మాంసాహారం నిషేధించబడిరది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు ప్రాంతాలు, ఆర్థిక పరిస్థితులు మరియు లభ్యతపై ఆధారపడి తినడం జరుగుతుంది. పండిరచే పంటల ప్రాధాన్యతలో మార్పులు, రేషన్ దుకాణాల ద్వారా బియ్యం లభ్యత, ఆహారపు అలవాట్లలో తరతరాల మార్పు వంటి కారణాల వలన ఆహార సంస్కృతి మారుతుంది.
స్త్రీలు మరియు బాలికలు తినే ఆహారంపై కొన్ని జెండర్ ఆధారిత ప్రత్యేకమైన నిషేధాలు ఉన్నాయి. ఉదా:` బహిష్టు అయిన స్త్రీలు మరియు వితంతువులు, గర్భిణీలు కొన్ని ఆహార పదార్థాలు తినకుండా కట్టడి చేయబడ్డారు. స్త్రీలు పంది మాంసాన్ని తినకూడదు, బాలికలు త్వరగా రజస్వల అవుతారనే భయంతో వారికి మాంసాహారాన్ని పెట్టరు. కొన్నిసార్లు తగినంత ఆహారాన్ని కూడా ఇవ్వరు. బాలురు, బాలికలకు వివిధ రకాల ఆహార పదార్థాలలో కూడా తేడాలు ఉన్నాయి. భర్త చనిపోయిన స్త్రీలు ఉప్పు, కారాలు లేని చప్పిడి ఆహారాన్ని మాత్రమే తినాలి. అంతేకాక స్త్రీలు ఆహారాన్ని కుటుంబ సభ్యులకు వండి వడ్డించిన తర్వాత మిగిలిన ఆహారాన్ని మాత్రమే తినాలి. చర్చను ముగిస్తూ మతం, కులం, వర్గం మరియు జెండర్ ఆధారిత ఆహారపు అలవాట్లపై నిషేధాలు నియంత్రణ ఉన్నట్లుగానే లైంగికతపై కూడా ఇటువంటి నియమాలు ఉన్నాయని అర్థం చేసుకున్నాము.
లైంగికత చుట్టూ ఉన్న నియమాలు మరియు నిర్బంధాలు:
పితృస్వామ్య వ్యవస్థ లైంగికత చుట్టూ అన్ని నియమాలను మరియు నియంత్రణలను విధించిందని అర్థం చేసుకోవడానికి సభ్యులం 4 గ్రూపులుగా విడిపోయి గ్రూప్ ఎక్సర్‌సైజ్ చేశాము. ఉత్తర భారతంలో కొన్ని కమ్యూనిటీలు లైంగికతను ఆమోదిస్తాయి. ఆదివాసీలలో కూడా కొన్ని సమూహాలలో భర్త చనిపోతే, బావతో కానీ, మరిదితో కానీ లైంగిక సంబంధం కలిగి ఉండొచ్చు. దీనికి ఆమోదిస్తారు. అలాగే మహిళా సెక్స్ వర్కర్స్‌తో పురుషులు లైంగిక సంబంధం పెట్టుకోవడాన్ని కూడా ఆమోదిస్తారు. ఆమోదించనివి ఏంటంటే, వివాహేతర సంబంధాలు, లెస్బియన్లు, ‘గే’లతో స్వలింగ సంపర్కం చేసేవాళ్ళని, అలాగే ట్రాన్స్ జెండర్ వ్యక్తులతో, పురుష సెక్స్ వర్కర్లతో సంబంధం పెట్టుకోవడం. ఇలాంటి నిబంధనలతో నిండి ఉంది సమాజమని అర్థం చేసుకున్నాం.
ఈ లైంగిక చర్య చీకటి గదిలో, నాలుగు గోడల మధ్య జరగాలిÑ ఇద్దరి మధ్య స్త్రీ, పురుషుల మధ్య జరగాలిÑ పెళ్ళి చేసుకున్న తర్వాత లైంగిక చర్య ఉండాలనేది జరుగుతుంది. ఇది ఏ కులం, మతం, వర్గం, ప్రాంతం అనే భేదం ఉండదు. బహిర్గతంగా లైంగిక విషయాలను చర్చించకూడదు అనే అపోహ కూడా ఉంది. చాలా రహస్యంగా మాట్లాడుకోవాలిÑ లైంగిక చర్య అనేది రాత్రిపూట మాత్రమే జరగాలిÑ మిగతా సమయాల్లో ఉండకూడదు అనేది కూడా ఉంది. శిక్షణ సమయంలో లైంగిక చర్య గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా సిగ్గుగా అనిపించింది. తొందరగా అందరి ముందు ఓపెన్‌గా మాట్లాడలేకపోయాము. ఆహారానికి, లైంగికతకు లింక్ ఎలా అర్థం చేపిస్తామనే ఆందోళనగా చూశాము. ఈ విషయాన్ని పని ప్రదేశంలోకి ఎలా తీసుకెళ్తామనేది ఒక ప్రశ్నగానే అనిపించింది కాని సభ్యులందరూ చిన్న గ్రూపులుగా ఏర్పడి చర్చించుకున్నాము. ఈ చర్చల్లో భాగంగా కులం, మతం వర్ణం మరియు జెండర్ ఆధారంగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ ఉన్నట్లుగానే, లైంగికతపై కూడా నియంత్రణ ఉన్నట్లు తెలుసుకోగలిగాము.
లైంగికత సమస్యలు వచ్చినప్పుడు ఒకరి ఇష్టాన్ని ఒకరు అర్థం చేసుకోవడం వలన ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశముందని అర్థం చేసుకున్నాము. తిరిగి కౌన్సిలింగ్‌లో, పని ప్రదేశంలో మహిళలకు లైంగికతను అర్థం చేయించడానికి సులభంగా మాడ్యూల్ సిద్ధం చేసుకున్నాము. గ్రూప్ ఎక్సర్‌సైజ్ ఇవ్వడం, వ్యక్తిగతంగా అర్థం చేయించడానికి ఛాలెంజింగ్‌గా అనిపించింది. మగవాళ్ళతో మాట్లాడుతున్నపుడు మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ శిక్షణలో చర్చల తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాక సిగ్గు, బిడియం పోయి ఇప్పుడు పూర్తిగా అవగాహనతో మా పనిలో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమస్యతో వచ్చిన వారికి అర్థం చేయించగలుగుతున్నాము. వివిధ సమూహాలకి మేము శిక్షణ కూడా ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకున్నాము, ఇస్తున్నాము.