1. మూడు సంస్థల సభ్యులతో కలిసి పనిచేయడం మీకెలా అనిపించింది?
జ. మూడు సంస్థలతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఐక్యతారాగంకి వచ్చే ముందు మనసులో ఎన్నో ప్రశ్నలతో, మొహమాటంతో, అలాగే అన్ని ట్రైనింగ్స్‌లో లాగానే
ఐక్యతారాగంలో కూడా ఫెసిలిటేటర్స్ వాళ్ళ అంశం వాళ్ళు చెప్పి వెళ్తారేమో, బోర్ కొడుతుందేమో, వారం రోజులు కొత్తవాళ్ళతో ఎలా ఉండగలుగుతామో అనుకుంటూ ఐక్యతారాగంలోకి అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన ఐదు నిమిషాల్లోనే అక్కడ ఉన్న సభ్యులందరం స్నేహితులు, కుటుంబసభ్యుల్లాగా కలిసిపోయాము. అందరి నుండి అనేక కొత్త విషయాలను నేర్చుకున్నాను.
2. మీరు నేర్చుకున్న అంశాలలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశం లేదా ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉంటే తెలుపగలరు.
జ. ఐక్యతారాగంలో తెలుసుకున్న ప్రతి అంశం నన్ను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్, లైంగికత, అధికార చక్రం, జెండర్ బాక్స్, పితృస్వామ్య వ్యవస్థ, కులం, మతం… ప్రతి అంశం కూడా నా ఆలోచనా విధానంలో మార్పు తెచ్చాయి. ప్రతి సంఘటనను స్త్రీ వాద దృక్పథంతో ఆలోచించగలుగుతున్నాను.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. ఐక్యతారాగం వల్ల స్త్రీవాద దృక్పథంతో ఆలోచిస్తున్నాను. నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నా మీద నాకు నమ్మకం పెంచింది. నేను పాటలు పాడగలనని, కవితలు రాయగలనని ఐక్యతారాగం ద్వారానే తెలిసింది.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ముందుకు ఎలా తీసుకొని వెళ్తారు?
జ. జెండర్ సంబంధిత అంశాలు నాకు కౌన్సిలింగ్లో చాలా ఉపయోగపడుతున్నాయి. సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ ఇంకా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకుని, సర్వేయర్‌కి వివరించి తను స్ట్రాంగ్‌గా ఉండేలాగా కౌన్సిలింగ్ చేయగలుగుతున్నాను. ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సెషన్ ప్లాన్ మాకు చాలా బాగా ఉపయోగపడిరది. మేము నేర్చుకున్న అంశాలను, యువతకి, మహిళలకి జెండర్‌పై అవగాహన కార్యక్రమాలను చేపడతాము.
5. జెండర్ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో గానీ, బంధువుల్లో గానీ, పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాలలో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. కుటుంబంలో పితృస్వామ్య వ్యవస్థ గురించి, జెండర్ బాక్స్ గురించి చర్చించాను. కొంతవరకు సానుకూల స్పందనే వచ్చింది. స్నేహితులతో జెండర్ అంశాల గురించి మాట్లాడినప్పుడు వారి నుండి కూడా సానుకూల అభిప్రాయాలే వచ్చాయి. కానీ పనిచేసేచోట పితృస్వామ్య వ్యవస్థ గురించి, కొన్ని నాటుకొనిపోయిన మన ఆచార సంప్రదాయాల గురించి, ముఖ్యంగా సమ్మతం (లైంగికత) గురించి పూర్తి వ్యతిరేకత వచ్చింది.
6. స్త్రీ వాద దృక్పథంలో యువ నాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు?
జ. ప్రస్తుతం స్త్రీ వాద ఉద్యమాలలో చురుకుగా పనిచేస్తున్న యువతతో మరియు ఉద్యమాలు చేస్తున్న మహిళా
ఉద్యమకారిణిలతో వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకొని మమ్మల్ని మేము ఇంకా మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాము. మమ్మల్ని వేరే రాష్ట్రానికి కూడా తీసుకొనివెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఉద్యమకారుల యొక్క అనుభవాలను, అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని అనుకుంటున్నాము.
7. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. 3 సంస్థల సభ్యులం కలిసి పనిచేయడం వల్ల వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను, అక్కడి సమస్యలను అర్థం చేసుకోవచ్చు. 3 సంస్థల ఫెసిలిటేటర్లు కలిసి మన భాగస్వామ్య సంస్థలతో కూడా పనిచేయవచ్చు.