సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి, ఆర్థిక వ్యవస్థలు చేసే ప్రయత్నాలలో పేదరిక నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోతుంటుంది. పేదరిక నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగవుతోందనేది అర్థం కాదు. కరోనా సంక్షోభం
సమయంలో కూడా భారత్‌లో కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్లకు సంపద 35% పెరిగింది, (ఆక్స్ ఫామ్ నివేదిక`2021) అంటే ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద పేదరికానికి దిగువన ఉన్న పదికోట్ల మంది సంపదకు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఆర్థిక అసమానతలు ఇలా ఉన్న దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో కేవలం 16% మహిళలు మాత్రమే భూమిపై హక్కును కలిగి ఉన్నారు (సోర్స్: తెలంగాణలో మహిళా రైతులు`భూ యాజమాన్యం, ప్రభుత్వ పథకాల అందుబాటు`2015). జాతీయ స్థాయిలో చూస్తే సగటు 12.8% మాత్రంగానే ఉంది. భారతదేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 2005లో 26% ఉండగా, 2019కి 20.3%కి పడిపోయింది.
50% మహిళా జనసాంద్రత ఉన్న భారతదేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉందనేది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించి వారిలోని ఆలోచనలు, భయాలు బయటికి తీసి క్షేత్రస్థాయి కార్యకర్తలు పక్కా ప్రణాళిక, డాటాలతో మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి ఐక్యతారాగం 4 దశలలో చేసిన శిక్షణ కార్యకర్తలలో చాలా మార్పునకు దారి తీసింది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జెండర్ అసమానతల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నారు. పౌర సమాజాన్ని తీర్చిదద్దడంలో స్త్రీలు, పురుషుల అసమానతల గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. జెండర్ అంటే స్త్రీలు, వారి హక్కులు`ఆ హక్కులని కాపాడడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ హక్కులకి న్యాయపరమైన హామీలు ఇచ్చేస్తే వారికి న్యాయం జరుగుతుందని భావిస్తుంటారు. ఈ అవగాహన సమాజంలో స్త్రీ, పురుష అసమానతల్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం సరిపోదు. అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నట్లే రాజ్యాంగ పరంగా స్త్రీలకు సమాన హక్కులు ఇచ్చినప్పుడు ఇంకా మన దేశంలో స్త్రీల పట్ల ఎందుకు ఇంత హింస జరుగుతోంది, ఎందుకింత వివక్ష ఉందనేది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఐక్యతారాగం శిక్షణని ప్రవేశపెట్టడమనేది చాలా సంతోషించాల్సిన విషయం.
చట్ట సభలలో స్త్రీలకు 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ఎన్ని ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి? మహిళలను ఎప్పుడూ శారీరకంగా బలహీనులుగా, సామాజికంగా వెనుకబడ్డవారిగా, పురుషులకంటే తక్కువగా చూస్తారు. పితృస్వామ్య వ్యవస్థ స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సంబంధాలను, వారికి, సామాజిక వ్యవస్థలకు మధ్య ఉన్న సంబంధాలను నిర్దేశిస్తూ ఉంటుంది. వివక్ష, హింస పట్ల లోతైన అవగాహన, మహిళలు, పురుషుల మధ్య సామాజికంగా రూపొందే సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఐక్యతారాగం శిక్షణ చాలా ఉపయోగపడిరది.
కుటుంబాలలో కూతుర్ని, కొడుకుని ఎలా పెంచుతారు? ఎందుకు కొడుకులే కావాలని అనుకుంటారు? వారికే ప్రత్యేక స్థానాన్ని ఎందుకు ఇస్తారు? సమాజంలో ఉన్న కొన్ని కులాలకు, ఆదివాసీలకు సమాన అవకాశాలు లేకుండా చేయడం, వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకోకుండా చేయడం జరుగుతుంది. మహిళలను కుటుంబంలోను, వివాహ వ్యవస్థలోనూ తక్కువగా చూస్తూ, ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మెలిసి ఉండే అవకాశాలు ఇవ్వకుండా వేర్వేరు పద్ధతుల్లో పెరగడం వలన మహిళల పట్ల విలువ లేకుండా పోతోంది. దానివల్ల జెండర్ సంబంధాలు హింసాత్మకంగా తయారవుతున్నాయని అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.
మొదటి దశలో అధికారం, జెండర్, పితృస్వామ్యం మరియు జెండర్ ఆధారిత హింస వంటి అంశాలపై అవగాహన కల్పించి ఈ అంశాలన్నింటిని ప్రాథమిక, రాజ్యాంగ హక్కులతో కలిపి ఎలా చూడాలి అనేది నేర్చుకోగలిగారు.
రెండవ దశలో జెండర్ మరియు లైంగికత అంశాలపై లోతుగా అవగాహన పెంపొందించుకుని, భాగస్వామ్య సంస్థలతో కలిసి పని చేయడానికి తగిన సృజనాత్మక పద్ధతులను నేర్చుకోగలిగారు. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ట్రాన్స్‌జెండర్ హక్కుల ఉద్యమాల గురించి కూడా తెలుసుకోగలిగారు.
మూడవ దశలో భాగస్వామ్య సంస్థల సముదాయాలలో చేసిన కమ్యూనిటీ సెషన్స్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకొని జెండర్ ఆధారిత హింస యొక్క వ్యవస్థాగత స్వరూపంపై కార్యకర్తలు దృష్టి కోణం పెంపొందించుకోగలిగారు. గ్రూప్ డైనమిక్స్ గురించి అర్థం చేసుకోగలిగారు.
నాల్గవ దశలో స్త్రీల హక్కుల అంశాలకు సంబంధించిన అంతర్జాతీయ వేదికల గురించి చర్చించి, స్త్రీల ఉద్యమాలు, కులం, వికలాంగత్వం, ముస్లిం స్త్రీల హక్కులు, ఎల్జిబిటిక్యూ ఉద్యమాల గురించి వివరంగా తెలుసుకున్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా మనుష్యులమే అనే స్పృహను, గౌరవాన్ని సమాజంలో పొందడానికి, కుటుంబంలో, ఇతర వ్యవస్థలతో నిత్యం ఈ రోజుకీ పోరాడాల్సి వస్తోంది. వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ప్రత్యక్షంగా కలిసి, విన్న తర్వాత క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు, మహిళల సమస్యలను ఒక కొత్త కోణం నుంచి చూడడం అలవాటవుతుంది. మహిళా ఉద్యమాల గురించి తెలుసుకున్నప్పుడు ఇలాంటి ఉద్యమాలలో భవిష్యత్తులో భాగస్వాములు కావాలనే ఉత్తేజాన్ని కార్యకర్తల్లో తీసుకురావడానికి జెండర్ గురించి చాలా ప్రశ్నలతో సతమతమయ్యే వారికి ఈ శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. జెండర్ సమస్యలు కేవలం కొత్త చట్టాలవలన కానీ, లేదా పాలనారంగంలో మార్పుల వలన కానీ పరిష్కారం కావు. రోజువారీ జీవితంలో జెండర్ అసమానతల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరియు ఐక్యతారాగం గ్రూప్ కలిసి ముందుకు వెళ్ళడానికి కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ శిక్షణ కార్యకర్తల్లో పెద్ద మార్పునకు దారి తీసింది.
పాటలు, కథలు, సినిమాలు, కవితలు, స్వీయ చరిత్రలు, గణాంకాలు… ఇలా అవసరమైన ఇతర సమాచారంతో కూడిన సెషన్స్ చేయడం వలన ఈ శిక్షణలో ఉన్న అందరికీ చాలా ఉపయోగపడిరది. ఈ శిక్షణ మొత్తాన్ని దశలవారీగా మాడ్యూల్స్‌గా తీసుకొని వచ్చి అందరికీ అందుబాటులో ఉంచడం వలన కార్యకర్తలందరికీ సహాయంగా ఉంటుంది.
ఈ శిక్షణ ఇంత విజయవంతంగా పూర్తి చేసిన ఫెసిలిటేషన్ టీం మరియు శిక్షణలో భాగస్వాములైన టీమ్ అందరికీ కూడా కృతజ్ఞతలు.
సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మన ముందు చాలా సవాళ్ళు సమాజంలో కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడానికి ఫెమినిస్ట్ నాయకత్వం చాలా ముఖ్యం.