పోరాటంలోనే స్త్రీలకి చోటు!! సంక్షోభ ప్రపంచంలో స్త్రీవాద నాయకత్వం – నందిని రావు

`అనువాదం: డా॥ ఎ. పద్మ
ఈ చక్కటి నినాదం ప్రస్తుత భారతావనిలోని తీవ్రతరమైన రైతు ఆందోళనలోను, ఎన్నో భారతీయ భాషల్లోను కనిపించింది. స్త్రీల చోటెక్కడ? అని మనకి మనం వేసుకుంటున్న ప్రశ్నకి ఇంతకంటే మెరుగైన సమాధానం ఏ స్త్రీవాద ర్యాలీలలో మనకి కన్పించదు. తమ స్థానాన్ని తమ

ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, అంతకంటే ముఖ్యంగా ఈ భూగోళంలో మేమూ నివసిస్తున్నామని స్త్రీలు ప్రకటించుకోవడానికి పోరాటం ఒక్కటే తార్కికమైన ప్రాంతంగా అయ్యింది.
ఎలాంటి ప్రజాస్వామిక వాద, ప్రతివాదాలు, బహిరంగ చర్చలు లేకుండా భారత ప్రభుత్వం కొన్ని నూతన వ్యవసాయ చట్టాలు తేవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. చెప్పాలంటే, వారి పోరాట అంశాలు ఒకరకంగా స్త్రీవాద ఎజెండాలో భాగమే! అయితే, ప్రస్తుత సమీకరణలో ఈ రూపం కన్పించడం లేదు. ఈ నేలమీద పుట్టి, ఇదే నేలమీద పనిచేస్తున్న ప్రజలు (స్త్రీలు, పురుషులు, ఆడ/మగ పిల్లలు, యువత, ముసలివారు) అంతా కలిసి నడిపిస్తున్న రైతు పోరాటంగానే దీనిని మనం చూస్తున్నాం. వీరంతా స్త్రీవాదులుగా గుర్తించబడకపోవచ్చు. కానీ పోరాట అంశాలు స్త్రీవాద ఎజెండాలే. ఈ సందర్భంలోనే పై నినాదానికి మరింత అర్థం చేకూరుతోంది.
సిఏఏ/ఎన్నార్సీ/ఎన్పీఆర్‌ వంటి దేశ ప్రజల స్మృతి విధానాలకు వ్యతిరేకంగా 2019, డిసెంబరులో మొదలైన ప్రజా సమీకరణలోను లేదా పోరాట నిర్వహణలోను ఎక్కడా తనకు తానుగా స్త్రీవాద ఉద్యమాలుగా ప్రకటించుకోని ప్రతిఘటనలు కూడా ఇందుకు మరో నిదర్శనంగా చూడవచ్చు. కొన్ని వర్గాల ప్రజల స్వాతంత్య్రాన్ని హరించేలాంటి బెదిరింపులతో కూడిన ఈ చట్టాలను రాజ్యం తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ పోరాటాలు మొదలయ్యాయి. వీటికి ముఖ్యంగా ముస్లిం స్త్రీలు నాయకత్వం వహించి దేశమంతా నడిపించారు. శాంతి, గౌరవం, దయ, హోదా, ఆధ్మాత్మికత, నిశ్చయత వంటి సూత్రాలపై ఆధారపడి, అప్పటికప్పుడు, అనుకోకుండా సంభవించిన ప్రతిఘటనలు ఇవి. ఇలాంటి స్త్రీవాద పోరాటాల గురించే కదా, మనం కలలు కన్నది…!!
మన చుట్టూ ఉన్న ప్రపంచం:
దక్షణాసియా ప్రాంతం తరచూ సంఘర్షణలు, పోరాటాలతోనే వార్తల్లో కనిపిస్తోంది. మన భారత దేశంలోనే కాక, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌ వంటి చుట్టుపక్కల దేశాలన్నింటిలో ఈ సందర్భాలెన్నింటినో మనం చూస్తూనే ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితి ప్రపంచం సంక్షోభంలో ఉందనడానికి మరో ఉదాహరణ తాలిబన్లు ప్రజల ఆలోచనలపై పూర్తి నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. వారి చర్యలు, జీవితాలపై కూడా పట్టు బిగిస్తున్నారు. స్త్రీలు, ఆడ/మగ పిల్లలు, క్వీర్‌, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు, జెండర్‌ నాన్‌`బైనరీ వ్యక్తులు… వీరంతా తాలిబన్ల చట్టాలు, షరతులకు లోబడి, వారి దయపై ఆధారపడి జీవించాల్సి వస్తోంది. అయితే మీడియాలోని చాలామంది తాలిబన్లను మితవాదులుగా, నియో తాలిబన్లుగా చిత్రీకరించడం గమనార్హం. గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోని అణచివేయబడ్డ వర్గాలపై, ముఖ్యంగా స్త్రీలపై ఎన్నో విధాల దురాగతాలు చేశారు. ఈ దుశ్చర్యలకు బలైనవారు, వాటి గురించి విన్న ఇతరులు ఎవరైనా తాలిబన్లు మితవాదులంటే నమ్మగలరా? వారు ప్రస్తుతం అధికారంలోకి రాగానే స్త్రీలు నడిపే వ్యాపారాలను, వారి ఆస్తులను రూపుమాపిన కథలు వింటూనే ఉన్నాం. తమని వ్యతిరేకించిన వర్గాలపై తాలిబన్లు రాళ్ళు రువ్వడం, కొట్టడం వంటి భౌతిక శిక్షలు విధించడం గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇదంతా తాలిబన్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండు వారాలలోపే జరిగిపోయింది. నిరసనకారులపై కాల్పులు వంటి తీవ్ర హింసాత్మక చర్యల నేపథ్యంలో కూడా తాలిబన్ల ముందు స్థిరంగా, నిశ్చలంగా నిలబడి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న ఆఫ్ఘన్‌ స్త్రీల నుండి మనం స్ఫూర్తిని పొందాలి. నిజానికి ఈ మహిళలే పోరాటానికి మారుపేరని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.
ఇకపోతే, మన భారతదేశంలో…
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశంలో స్త్రీల ప్రస్తుత పరిస్థితి గురించి వివరించాలంటే… మన చుట్టూ నేల ఉన్నా, దానిపై నిలబడలేని పరిస్థితి. ముందుకు అడుగులేస్తున్నాం, కానీ మళ్ళీ జారిపోయి వెనక్కు వెళ్ళిపోతున్నాం!! ఒకరి నుండి ఒకరు ధైర్యం తెచ్చుకుంటూ, బలాన్ని ప్రోగు చేసుకుంటూ మళ్ళీ అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పరిస్థితికి ప్రధాన కారణం రాజ్యం పురుషాధిక్య, పితృస్వామ్య ధోరణిని ప్రతిబింబించేట్లుగా ఉండటమే. మతతత్వ సిద్ధాంతాలను, ఆధిపత్య విలువలను సాంస్కృతిక, బోధనా/భాషా, రాజకీయ రంగాల్లో చొప్పించి, వివిధ విధానాల్లో రాజ్యం పితృస్వామ్య ధోరణులను వ్యాప్తి చేస్తోంది. తద్వారా మొత్తం రాజకీయ, సామాజిక వాతావరణం బెదిరింపులకు లోను చేసేదిగా ఉంటోంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. 2018 నాటి నీతి ఆయోగ్‌ అంచనాల ప్రకారం 85 శాతం మంది, 2018`19 భారతీయ ఆర్థిక సర్వే ప్రకారం 93 శాతం ప్రజలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులే. ఒక పక్క నోటాబందీ (డీమానిటైజేషన్‌), అసంబద్ధమైన ఆర్థిక విధానాలు, మరో పక్క రక్షించాల్సిన కార్మిక చట్టాలు వారికి వ్యతిరేకంగా ఉండడంవల్ల వీరిలో చాలామంది జీవితాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. కోవిడ్‌`19, ప్రణాళికా బద్ధత లేని లాక్‌డౌన్‌ విధింపులు ఈ పరిస్థితికి తోడవ్వడంతో అసంఘటిత రంగంలో భాగమైన వందలాది మంది ప్రజలు సరైన ఉపాధి లేక చతికిలబడ్డారు. వీరంతా ఆకలి, దారిద్య్రం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు, సరైన విద్యావకాశాలు లేకపోవడంతో మరింత తీవ్రంగా ప్రభావితమౌతున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు, అందులోనూ ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వాతంత్య్రం వంటివి అణచివేయబడ్డాయి. చాలా సందర్భాల్లో అతి ముఖ్యమైన జీవించే హక్కు కూడా ప్రభావితమౌతోందనే చెప్పాలి. ప్రజాస్వామిక వ్యవస్థలు బలహీనమై, అస్థిరపడడంతో వందలాది మంది పౌరులు తమ జీవితాలకు సరైన అర్థం కోసం సంఘర్షణకు లోనవుతున్నారు. భారతదేశం ఎప్పుడూ ఒక జాతిగా, కులం, వర్గం, మతం వంటి తీవవ్రమైన ఘర్షణలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఈ కోవిడ్‌ మహమ్మారి ఈ అంతరాలను మరింత పెంచింది. అంతేకాదు… సమాజంలో ఇప్పటికే ఉన్న జెండర్‌, వికలాంగత, సామర్ధ్యత, లైంగికత, జాతీయత వంటి అంతరాలను ఇంకా విస్తృతం చేసింది. ఇటువంటి వాతావరణంలో మన ముందు తరాల పెద్దలు కష్టపడి సంపాదించిన హక్కులను కొల్లగొట్టాలని చూసే వర్గాలను మనం ఎలా సవాలు చేయగలం??
ప్రతికూల శక్తులను సవాల్‌ చేయడం ఎలా?
సమాజంలో ప్రతికూల శక్తులు విసిరే సవాళ్ళను ఎదుర్కోవడానికి స్త్రీ వాదులు ఎప్పుడూ వివిధ విధానాలను ఎంచుకుంటూ వస్తున్నారు. రచనలు చేయడం, పరిశోధనలు చేపట్టడం, చట్టాలను చేయడం, సాంత్వన నివ్వడం, బోధించడం, ప్రచారాలు, అడ్వకసీ, లాబీయింగ్‌ వంటివి చేయడం… తమ భావాలను ఇంద్రధనుస్సు రంగుల్లో వ్యక్తీకరిస్తారు. కొందరు విస్తారంగాను, మరికొందరు సున్నితంగాను, తమలోని భావాలను ప్రస్ఫుటం చేస్తారు. అసంఖ్యాక తంత్రులలో స్త్రీవాద నాయకత్వాన్ని బలోపేతం చేయడం ఒక ముఖ్యమైనది. సామాజికంగా అణచివేయబడి, దుర్భలమైన నేపథ్యాలలో ఉన్న స్త్రీలు, పురుషులు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు ప్రపంచంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై జ్ఞానాన్ని పెంపొందించడం, వారు ఈ జ్ఞానాన్ని తిరిగి తమ తోటివారితో పంచుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచడం, పరికరాలను అందించడం దీని ఉద్దేశ్యం. స్త్రీ వాద విలువలను, దృక్పథాలను ప్రజలతో పంచుకోవడం ద్వారా వారి ఆలోచనా సరళిలో మార్పు తేవాలన్నది లక్ష్యం. అంతేకాదు… ఒకవేళ వారు వాటిని నమ్మితే, తమ వాస్తవిక జీవితాలలో మార్పు తెచ్చుకునే అవకాశం కూడా వారికి కల్పించినట్లవుతుంది.
ఈ భావజాలం నుండే ఐక్యతారాగం పుట్టింది.
మహిళా ఓ మహిళా నీలో ఉన్న శక్తిని గుర్తించి
ఉప్పొంగిన కెరటంలా ఎగసిపడు
ఆచారాలు, సంప్రదాయాలు అంటూ బంధించిన
సంకెళ్ళను తెంచి నీపై నీకే నిర్ణయాధికారం
ఉందని తెలిపి ఈ జగతికి నువ్వేంటో నిరూపించు
మహిళా ఓ మహిళా
ఐక్యతారాగం: సామూహిక స్వరాలమై, చైతన్య గళాలమై…
ప్రస్తుతం మన భారతదేశాన్ని కబళిస్తోన్న స్త్రీ వ్యతిరేక, నూతన జాతీయవాదపు అలలను ఎదుర్కొనడానికి మొదలుపెట్టిన స్త్రీవాద నాయకత్వపు ప్రయాణంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ ప్రక్రియలో కీలకమైనది 3 సంస్థల పరస్పర సహకారం. ఆంధ్రప్రదేశ్‌ నుండి వేదిక సంస్థ, తెలంగాణ నుండి భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ అనే రెండు సంస్థలు సమిష్టిగా ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాయి. ఈ స్త్రీల బృందాలు క్షేత్రస్థాయి సమూహాలతో కలిసి కుల అసమానతలు, లింగ వివక్షత, జెండర్‌ ఆధారిత హింస, గిరిజన సమూహాలు, మహిళా రైతుల హక్కులకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకించి పనిచేస్తున్నాయి. దాదాపు 3 సంవత్సరాలకు పైగా ఈ మూడు సంస్థలు కలిసి ఒక సామూహిక బృందం (సమిష్టి బృందం)గా ఏర్పడి, జెండర్‌, సామాజిక న్యాయం, మానవ హక్కులు, రాజ్యాంగపరమైన హక్కులపై అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగస్వాములైనవారు:
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని అర్బన్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో, ఈ మూడు సంస్థల నుండి పనిచేస్తున్న కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు, క్షేత్రస్థాయి కౌన్సిలర్లు ఈ సమిష్టి ప్రయాణంలో భాగస్వాములు. వీరు, వీరితో పాటు ట్రైనర్లు అందరూ కలిసి సాగిస్తున్న ప్రయాణంలో ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవడం, తమ పరిజ్ఞానాలను అవలోకనం చేసుకోవడం, పునఃసమీక్షించుకోవడం, తిరిగి నేర్చుకునే క్రమంలో ప్రయాణించడం, ఈ మొత్తంలో ప్రశ్నలు, వాదోపవాదాలు, వ్యతిరేకతలు, ఒప్పుదలలు ఇవన్నీ చాలా సహజంగా పొదువుకున్నాయి. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఈ చర్చలు భాగం చేసుకున్నాయి. పార్టిసిపెంట్‌లలో చాలామంది విని ఉండని, దేశంలో సుదూర ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. అదే సమయంలో, అంతే ప్రధానంగా పార్టిసిపెంట్‌ల పని పరిధిలోని/స్వంత గ్రామాల్లో జరుగుతున్న విషయాల గురించి కూడా చర్చించుకున్నాం. చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితులు మాకెంత ముఖ్యమో, ఒక చిన్నపాటి తండా/కుగ్రామంలో జరిగే సంఘర్షణ కూడా అంతే ప్రధానమైనదిగా మేము భావించాము. మనందరం కలిసి పంచుకుంటున్న ఈ ప్రపంచం పట్ల మా అవగాహనను మరింత లోతుపరచుకున్నాం. అదే సమయంలో, మా వేర్వేరు సామాజిక, ప్రాంతీయ పరిస్థితుల వల్ల మా స్థానాలు/హోదా వేరుగా, విభిన్నంగా ఉండడాన్ని కూడా అర్థం చేసుకున్నాం. ఒకవైపు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూనే కొంతమందిని దూరంగా తోసేయడం (బాహ్య పరిధిలో ఉంచడం) జరుగుతోంది. ఇది ఎందుకని? మన ప్రపంచాలలో ఈ పగుళ్ళు, చీలికలు ఇన్ని ఎందుకున్నాయి? ఎవరు వీటిని సృష్టిస్తున్నారు? ఈ మొత్తంలో ప్రధానమైనది… ఈ అసమానతలను తగ్గించుకుంటూ, సమన్వయం సాధించుకోవడానికి మనం ఏం చేయగలం?
అన్నింట్లో ఆస్తి హక్కు… ఆడపిల్లలకుంది సమానత్వపు హక్కును… కాల రాస్తుండ్రు
ఆస్తి ఇచ్చి చూడు… ఓ అమ్మా నాన్నలారా ప్రశ్నించి తీసుకుందాం… ఓ అక్కా చెల్లెల్లారా
దర్జాగా బ్రతుకుదాము… ఓ అక్కా చెల్లెల్లారా సాధించి చూపుదాము… ఓ అక్కా చెల్లెల్లారా
సదస్సులు ఎలా రూపుదిద్దుకున్నాయి?
సదస్సులలో చర్చలు చాలా లోతుగాను, వివిధ స్త్రీవాద పద్ధతుల ద్వారాను జరిగాయి. బృందాన్ని ఒక దగ్గరకి తీసుకుని రావడానికి పూర్తి విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను కలుపుకుంటూ ఒక బలమైన సమూహం ఏర్పరచడం, తద్వారా వారి వారి వ్యక్తిగత ప్రయాణాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఈ సదస్సులు ఉద్దేశించబడ్డాయి.
సభ్యులు తమ వ్యక్తిగత అనుభవాలను తోటివారితో పంచుకోవడం, అందరూ కలిసి ఆటలు, నృత్యాలు చేయడం, లోతైన చర్చలు చేయడం, ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, సరదాగా నవ్వుకోవడం… వీటన్నింటి ద్వారా వారి మధ్య చక్కటి, బలమైన స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. మొదట్లో ఫెసిలిటేటర్లు చేసిన సూచనలను అనుసరించినా, త్వరలోనే ఆటల్లోను, సెషన్లలోను వారంతట వారే ముందుకొచ్చి నిర్వహించడం మొదలుపెట్టారు. మొదట్లో ‘‘ఇంతకు ముందెప్పుడూ ఇలా చేయలేదే… ఇప్పుడెలా చేయడం’’ అనే సందేహపూరిత ధోరణితో ఉన్న సభ్యులే ‘‘రేపు పొద్దున్న ఈ ఆటని నేను ఆడిస్తాను’’ అనే ఖచ్చితమైన, సానుకూల దృక్పథానికి వచ్చే దిశగా వారి ప్రయాణం సాగింది. నిశ్శబ్దంగా ఉంటూ, తమ భావాలను బయటకు వ్యక్తపరచని సభ్యులు (ఈ సెషన్లలో) మరింత స్పష్టతను, దృఢత్వాన్ని అలవరచుకున్నారు. ఎక్కువగా బయటకు మాట్లాడేవారు తమ విధానాలకు కళ్ళెం వేసి, తమను తాము వ్యక్తపరచుకోవడానికి సమయం తీసుకునే సభ్యులకు చోటు కల్పించడం నేర్చుకున్నారు. ఈ మొత్తం క్రమంలో తమ అభిప్రాయాలను వెంటనే బయటికి వ్యక్తపరిచే సభ్యులను ఒప్పించడం, ఇతరులకు చోటు కల్పించేలా నచ్చచెప్పడం కొంచెం కష్టమైన పనే అయ్యిందని చెప్పాలి.
గ్రూప్‌ సభ్యుల సృజనాత్మకతకి హద్దులే కన్పించలేదు. అందరికంటే నిశ్శబ్దంగా ఉండే సభ్యురాలు ముందుకు వచ్చి ‘‘నా మనస్సులోని భావాలను తెలియపరచడానికి నిన్న నేనొక పాట వ్రాశాను, చదవాలని ఉంది’’ అని అంటుంటే మా సంతోషాలు మిన్నంటాయి. సెషన్లలో వ్యాసాలు, ఆర్టికల్స్‌, పద్యాలు వంటివి అందరూ కలిసి చదివేవారు. ఇది ఫెసిలిటేటర్‌కి ఉండవలసిన, నిజానికి మనలో చాలామందికి కరవైన నైపుణ్యం. అలా చదివిన వాటిని వ్యక్తిగతంగాను, చిన్న గ్రూపుల్లోను చర్చించుకుని, సమీక్షించుకోవడం వంటి నైపుణ్యాలు ఎన్నింటినో సభ్యులు నేర్చుకున్నారు. అందరూ కలిసి రోల్‌`ప్లేలు చేయడం, సభ్యులలోని పురుషులు ఈ రోల్‌ప్లేలలో స్త్రీ పాత్రలు ఎంచుకుని అభినయించడానికి ముందుకు రావడం, ఆ పాత్రల్లోని భావాలను వ్యక్తపరిచేందుకు ఉత్సాహం చూపడం మమ్మల్ని ఎక్కువగా కదిలించింది.
బృందంలో అంతర్గతంగా కనిపించిన ఈ మార్పు వారి వారి వ్యక్తిగత, సమిష్టి బలాలకు కొత్త ఉత్తేజాన్నిచ్చిందనే చెప్పాలి.
బృందాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొద్దిమంది సభ్యులతో కోర్‌గ్రూప్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని శిక్షకులు ఆలోచన చేశారు. ఇలా ఏర్పాటయ్యే కోర్‌ గ్రూప్‌ సభ్యులు ఒకవైపు తాము నేర్చుకునే ప్రక్రియను కొనసాగిస్తూనే, మరోవైపు తమ జ్ఞానాన్ని ఇతర సభ్యులకు పంచుకునే బాధ్యత తీసుకుంటారన్నది ప్రణాళిక. ఈ సదస్సులలో కూడా పెద్ద గ్రూపుతో కోర్‌ గ్రూప్‌ సభ్యులు లీడర్లుగా ఎదగడం మేము ప్రత్యక్షంగా గమనించాము. అదే సమయంలో కోర్‌ గ్రూప్‌లో భాగం కాని ఇతర సభ్యులు కూడా ఒక్కొక్కరూ తమదైన ప్రత్యేక శైలిలో తమ భావాలను, జ్ఞానాన్ని ఇతరులకి అందించగలరని మా నమ్మకం.
శిక్షణలో భాగస్వాములుగా ఉన్న వీరందరూ ‘సభ్యులు’గా… అంటే… ‘‘మార్పు ప్రక్రియలను స్వంతం చేసుకున్న వారు’’గా మారారు. మా సమిష్టి ప్రయాణంలో ఈ మార్పు ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు.
ఆమె సృష్టికి మూలం అంటారు
కానీ ఇంట్లో ఆమె స్థానం ఓ మూల
ఇంటికి దీపం అంటారు
కానీ ఆమె వెలుగుని గుర్తించరు
ఆకాశంలో సగం అంటారు
శిక్షణనిచ్చిన వారు (శిక్షకులు):
ఈ మొత్తం ప్రక్రియను ఫెసిలిటేట్‌ చేసిన శిక్షకులు కూడా తమని తాము బృందంలో అంతర్భాగంగా పరిగణించుకున్నారు. శిక్షణ తీసుకునేవారు, మేము వేర్వేరు అన్న భావనకి ఎంతమాత్రం రాలేదు. వీరంతా స్త్రీవాద కార్యకర్తలు, విభిన్న రంగాలకి చెందినవారు. ముఖ్యంగా స్త్రీవాద, వికలాంగ, క్వీర్‌, గిరిజన, కుల హక్కులకి సంబంధించిన ఉద్యమాల్లో భాగమైనవారు. శిక్షకులలో కొంతమంది రచయితలు, కవయిత్రులు, మరికొంతమంది చక్కని ఉపన్యాసకులు, గాయకులు కూడా! అందరూ తమపై తాము లేదా ఒకరినొకరి పట్ల హాస్యోక్తులు చేయగల, పెద్దగా నవ్వుకోగల సామర్ధ్యం ఉన్నవారు. వారి ఈ చతురత మమ్మల్ని చుట్టేసింది. ఇప్పుడు కూడా మేము కలిసి చేస్తున్న ఈ సమిష్టి ప్రయాణంలో అది మమ్మల్ని తాకుతూనే ఉంది.
ఈ శిక్షకుల బృందం స్త్రీవాద ఉద్యమంలోని వివిధ అంశాల ప్రాముఖ్యతను సోదాహరణంగా చూపగలిగారు. నమ్మకం, సౌకర్యం, సరదా, స్నేహం ఇవన్నీ కలగలిపి ఉండే వాతావరణాన్ని కల్పించే అవసరం గురించి వివరించారు. అదే సమయంలో మన పరిధులను స్పష్టంగా ఏర్పరచుకుని, అవసరమైన చోట క్రమశిక్షణ పాటించగలగడం గురించి కూడా తెలియచెప్పారు. కొన్నిసార్లు ముందుండి భాగస్వాములను నడిపించే బాధ్యత వహిస్తే, మరికొన్నిసార్లు వెనుకగా నిలబడి భాగస్వాములను ప్రోత్సహించారు. శిక్షకులు, పార్టిసిపెంట్ల మధ్య ఉండవలసిన సంబంధాలు, వారి వారి పాత్రల విభిన్నతలను అర్థం చేసుకుంటూ పరస్పరం సహకరించుకోవడం స్త్రీవాద నాయకత్వంలోని ప్రధాన అంశం. ఐక్యతారాగం స్త్రీవాద సిద్ధాంతాన్ని మా అందరి మనసుల్లో స్థిరపరిచిందనే చెప్పాలి. ఈ ప్రయాణంలో పాలుపంచుకున్న మాలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఇది ఒక గొప్ప పాఠమయింది.
మా గుండెల్లో వెలుగులు నింపిన రిసోర్స్‌ పర్సన్లు:
ఈ మూడు సంవత్సరాలుగా మేము వివిధ ఉద్యమాల్లో భాగస్థులైన వ్యక్తులను శిక్షణలకు/సదస్సులకు రిసోర్ట్‌ పర్సన్లుగా ఆహ్వానించాము. తద్వారా వారి ఆలోచనలను పార్టిసిపెంట్లతో పంచుకోవడానికి వీలు కలిగింది. వీరంతా కుల హక్కులు, క్వీర్‌, ట్రాన్స్‌జెండర్‌ హక్కులు, వికలాంగత అంశాలు, ముస్లిం స్త్రీల హక్కులకు సంబంధించిన పోరాటాల్లో పాల్గొన్న కార్యకర్తలు. అంతేకాదు… వీరు సెక్స్‌ వర్కర్లు, మహిళా రైతులు, డొమెస్టిక్‌ వర్కర్లు వంటి వివిధ సమూహాలతో కలిసి పనిచేస్తున్నవారు. కొంతమంది అదే సమూహాలకు చెందిన వారు కూడా అయి ఉన్నారు.
ప్రత్యేక సెషన్లను నిర్వహించమని మేము ఆహ్వానించిన శిక్షకులు, రిసోర్స్‌ పర్సన్లు ఒకే విధమైన స్త్రీవాద, రాజకీయ సిద్ధాంతాలను మాతో పంచుకున్నారు. ఇది కూడా మా ప్రక్రియలకు మరింత తోడ్పాటైంది. జెండర్‌ న్యాయం, కుల వ్యతిరేక పోరాటాలు (యాక్టివిజమ్‌) వంటి అంశాలలో పనిచేసిన వారిలో ప్రతి ఒక్కరి అనుభవం అందరి మధ్యలో ఉన్న హద్దులు చెరిపేసి, ఒకరితో ఒకరు కలిసి పనిచేసేలా చేసింది. ఈ అంశాలపై చర్చలన్నీ కూడా చాలా సహజంగా ఒకదానితో ఒకటి ఇమిడేలా ఉన్నాయి.
ఐక్యతారాగం ప్రయాణంలో ‘అంతర్వుద్యమాల హక్కుల వేదిక’ ఒక ముఖ్యమైన అంశం. వివిధ రంగాలకు చెందిన 20 మంది ఉద్యమ కార్యకర్తలు తమ అనుభవాలపై మాట్లాడారు. వారి ఆలోచనలను, భావాలను, ఆ క్రమంలో రూపొందిన పాటలను, కవితలను పార్టిసిపెంట్లతో పంచుకున్నారు. ఐక్యతారాగం వేదికగా దొరికిన ఈ చోటు మొత్తం బృందంలో విద్యుతుత్సాహం రేకెత్తించి చాలా గంటలపాటు అందరూ చర్చల్లో మునిగి తేలేందుకు శక్తినిచ్చింది.
ఈ వేదిక సమస్యల జాతరలా ఉంది. ఇక్కడున్న ఉద్యమకారులందరూ వెలుతురు కిరణంలా ఉన్నారు. హిందుత్వ మబ్బులు కమ్ముకున్నాయి. కానీ ఈ మబ్బులు తరలిపోతాయి. మనం చూడాలని కోరుకుంటున్న కొత్త సూర్యుడు ఖచ్చితంగా ఒకరోజు ఉదయిస్తాడు. మనం అనుకున్న ఉదయం అప్పుడు తప్పకుండా వస్తుంది ` రచన
రిసోర్టు పర్సన్లలో ఒకరైన రచన తనతోటి ఐక్యతారాగం సభ్యుల ఆశలు, కలల్ని అక్షర రూపంలోకి మార్చి చూపించింది.
నైపుణ్యాలను సమూహాలలో ఉపయోగించడం:
ఐక్యతారాగంలో భాగంగా నాలుగు గోడల మధ్య జరిగిన శిక్షణలు పార్టిసిపెంట్లకు వివిధ దృష్టి కోణాల లోతులను పరిచయం చేసి, వారి జ్ఞానాన్ని పెంచుతూ, ఫెసిలిటేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరిచేలా ఉన్నాయి. తరువాతి చర్యల్లో శిక్షణల్లో నేర్చుకున్న సాధనాలను ఉపయోగించుకుంటూ తమ సంస్థల పరిధిలో క్షేత్రస్థాయి శిక్షణలు నిర్వహించారు. సభ్యులందరూ చాలా సృజనాత్మకంగాను, భావగర్భితంగాను ఉండి, ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎప్పటిలాగా తమకు సౌకర్యవంతమైన పరిధిలోంచి కాకుండా క్షేత్రస్థాయి సెషన్లను సజీవంగాను, పరస్పర సంప్రదింపులకు చోటు కల్పించేవిగా ఉండేలా నిర్వహించారు. తద్వారా ఈ సెషన్లలో క్షేత్రస్థాయి సమూహాల అవసరాలు ప్రధాన చర్చనీయాంశాలయ్యాయి. ఒకవైపు తమని తాము నిశితంగా పరిశీలించుకుంటూనే ఇతరుల నైపుణ్యాలను కూడా సానుకూలంగా విమర్శ చేయగలిగారు. ఈ రకమైన సమ ఉజ్జీల విమర్శలు, పునః నేర్చుకునే ప్రక్రియలు సభ్యుల మధ్య ఉన్న సంబంధాలను మరింత గట్టిపరిచాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు జరిగిన క్షేత్రస్థాయి సెషన్ల ద్వారా ఐక్యతారాగం సభ్యులు క్షేత్రస్థాయి ఫెసిలిటేటర్లుగా ఎదగడాన్ని స్వయంగా పరిశీలించుకోగలిగారు.
సమైక్యగానాన్ని కొనసాగించడం:
మేము ఏర్పరచుకున్న ఈ మార్గం మొత్తం సమృద్ధిగాను, వివిధ రంగుల కలయికతోను, సృజనాత్మకతతోను నిండి ఉంది. మా మధ్యన ఉన్న విభిన్నతలపై మేమెప్పుడూ ఆవేశపడలేదు. వాటిని పండుగలాగా జరుపుకున్నాం. ఐక్యతారాగం మా సంబంధాలలో చతురతను, ఏకత్వాన్ని నింపినట్లయింది. తద్వారా బలమైన స్నేహ సంబంధాలు, స్త్రీవాద సంఫీుభావాలను సృష్టించుకోగలిగాము. ఈ కలయిక వలన బృందంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటించింది. అందరూ తమ తమ బలాలను, ఇంకా మెరుగుపరచుకోవలసి సామర్ధ్యాలను గుర్తుంచుకునేలా చేసింది. ప్రపంచంలో ప్రస్తుతం కోవిడ్‌`19 ఎన్నో రకాల సవాళ్ళను విసిరింది. మేము కూడా మా వ్యక్తిగత, రాజకీయ, పని పరిధులలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొంటూనే ఉన్నాం. మహమ్మారి తరువాతి దశలో కూడా ఇంకా ఆరోగ్యం, చలనం (గతిశీలత), ఉపాధి, కుటుంబాలు వంటి ఎన్నో అంశాలలో మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ దశలో మేము మా సంస్థలతోను, క్షేత్ర సమూహాలతోను కలిసి పనిచేసే మార్గాల అన్వేషణ కొనసాగిస్తున్నాం.
ఐక్యతారాగం ఒక పెద్ద ప్రపంచపు సూక్ష్మరూపంగా అభివర్ణించవచ్చు. స్త్రీ వాదులు నిర్వహించే విధానాన్ని తలపించే విధంగా కూడా ఉంటుంది. స్త్రీలంటే సంరక్షణ, పోషణ, ప్రేమించడం వంటి పాత్రల్లోంచి చూడటం, వాటిని స్థిరీకరించడం నుంచి స్త్రీవాద సంఫీుభావాలు దూరంగా వచ్చాయి. విభిన్నంగాను, వేర్వేరు లక్షణాలతోను, ఒక్కోసారి సంక్లిష్టంగాను ఉండే తమ దృక్పథాలపై పరస్పరం వాద, ప్రతివాదాలు, ఒప్పుదలలు, తిరస్కారాలు జరుపుకుంటూ తరచి చూసుకోవడానికి ప్రజలకు సహాయపడుతున్నాయి. ఈ క్రమంలో అందరి ఆలోచనలు ఒక సమగ్రరూపంలోకి తీసుకువచ్చి, వాటిని వ్యక్తీకరించడానికి వీలు కలుగుతోంది. అయితే, ఇదంతా మన మేథాసంపత్తి నుండి వాస్తవికంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళి ఒక బలమైన ఉద్యమం దిశగా మార్పు చెందేలా చేయడం ఒక పెద్ద సవాలే అవుతుంది. ఇక్కడ ‘‘క్షేత్రం’’ అనే పదం భౌగోళికం కావచ్చు లేదా డిజిటల్‌ కూడా కావచ్చు. ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో ఇప్పటికే ప్రజల మధ్య కుల, జాతి, వర్గ, వికలాంగత, సామర్ధ్యత, మతం ఇంకా జెండర్‌ వంటి వివిధ అంతరాలు ఏర్పడి ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటూ, మన మధ్య ఏర్పరచుకున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌… రెండు విధానాల్లోనూ వీటిపై పనిచేయాల్సిన అవసరం కన్పిస్తోంది.
నేడు రాజ్యం (తనపైన) వ్యతిరేకతను, అసమ్మతిని నేరపూరితంగా భావిస్తోంది. వ్యక్తులను వేరుచేసి వారిని ఒకరిపై ఒకరిని పురికొల్పేలా చేస్తోంది. సెడిషన్‌ (విద్రోహం) వంటి చట్టాలను చేస్తూ ప్రజల స్వరాలను అణచివేసే దిశగా, ప్రజల మధ్య ఒకరిపట్ల మరొకరికి అనుమానాలు రేకెత్తించేటట్లుగా ప్రవర్తిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి మనకి మరి ఇంకా వేరే అవకాశాలు లేవు.
ప్రస్తుత రైతు ఆందోళనల్లో ఇప్పటివరకూ స్త్రీ వాదంగా గుర్తించబడని స్త్రీల అంశాలను వెలికి తీయడం మనం చేయగల పని. ఇందుకు చక్కటి ఉదాహరణ: పోరాటంలోనే స్త్రీలకి చోటు అన్న నినాదం. భారతదేశంలోనే కాక, యావత్‌ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సంకుచిత గోడలను పగులగొట్టి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరివర్తన తీసుకురావాలన్న (స్త్రీ వాదుల) ఆలోచనలకి ఈ నినాదం ఊపిరిని/ఆశలను కల్పిస్తుంది.
ఈ చక్కటి గానం వినండి…
కులము లేదు మతము లేదు… మనుషులంతా ఒక్కటేనంట
జెండర్‌ అంటేనే… అవి తేడాలు లేవమ్మా
ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎటువంటి సమస్యకైనా ‘రాగం చూడమ్మో’
చర్చ చేద్దాము… అవి తీర్చుదామూ
ఆలోచించమ్మో మన ఐక్యతారాగంలోన

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.