ఐక్యతా రాగం
సామూహిక స్వరాలమై… చైతన్య గళాలమై…
ఇది చదివిన వెంటనే ఒక విషయం అర్థమైపోతుంది. ఈ టైటిట్, ట్యాగ్‌లైన్ వెనక లోతైన ఆలోచన ఉందని. అవును! ఇది ఒక్కరోజులోనో, ఒకరి మైండ్‌లోనో తయారైనది కాదు
.
తరతరాలుగా మన సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలం, ఆధిపత్య ధోరణి, అసమానతలు కేవలం స్త్రీ పురుషుల మధ్యకాదు.. కులం, మతం, ప్రాంతం, భాష, వృత్తి, ఆర్థిక స్థితి, రాజకీయ సంబంధాల ప్రాతిపదికన నిచ్చెన మెట్ల వ్యవస్థని కొన్నిసార్లు అస్పష్టంగాను, చాలాసార్లు అతి స్పష్టంగాను గీతలు గీసి విభజించేశాయి. ఇక్కడ హక్కుల గురించి, రాజ్యాంగం ద్వారా లభించే స్వేచ్ఛ గురించి మాట్లాడే పరిస్థితి రానురానూ కనుమరుగౌతోంది. దీని ప్రభావం సహజంగానే అణచివేతకు గురైన వారిని మరింత అంచులకి నెట్టేయడంతో పాటు సామరస్యభావం, సహనశీలత కొందరిపైనే రుద్దబడుతోంది. ఇంకొందరు దీనికి విరుద్ధంగా వ్యవహరించినా అది చెల్లుబాటైపోతోంది. ఈ అసంబద్ధ పరిస్థితుల్లో స్త్రీలు మరింత హింసకి గురవడం ూGదీుూIA వంటి ఇతర లైంగిక గుర్తింపులు కోరుకునేవారికి అసలు చోటేలేకపోవడం పరిపాటైపోయింది.
ఈ నేపథ్యంలో 2018 ప్రారంభంలో రమ వేదుల ఒక ఆలోచనకి బీజం వేశారు. క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు ఉద్యమస్థాయిలో పనిచేస్తున్న వారి అనుభవాల నుండి నేర్చుకుంటూ, దానికి తమ అనుభవాలను చేర్చి విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తూ జెండర్, సామాజిక న్యాయం అంశాలను అర్థం చేసుకోగలిగితే… ‘సమ్మతి ` అసమ్మతి’… దీనిచుట్టూ గాఢంగా అల్లుకున్న అనేక అంశాలను స్పష్టం చేసుకోగలిగితే…! అదిగో, అక్కడ ప్రారంభమైంది ఈ క్షేత్రస్థాయి కార్యకర్తలని థీటైన నాయకత్వంలోకి ప్రయాణింపచేసే ప్రక్రియ. నందిని, నేను ముందుండి ఈ ప్రక్రియని నడిపించాలని రమ ప్రతిపాదన. భూమిక, గ్రామ్య, వేదిక సంస్థల్లోని క్షేత్రస్థాయి కార్యకర్తలకి ఇదొక ‘శిక్షకులకు శిక్షణ’గా రూపొందించాలన్నది ఆలోచన. అన్ని కోణాల నుంచి ఆలోచించి, చాలా రోజులు చర్చించినాక ఇది కేవలం ఒక శిక్షణగా కాక ఇదొక కోర్స్‌గా ప్రారంభించాం. వివిధ నేపధ్యాలనించి ఒక దగ్గర కొచ్చి ఈ కోర్సులో భాగమైన దాదాపు 30 మంది కార్యకర్తలు బేసిక్ కాన్సెప్ట్స్‌ను నేర్చుకోవడంతో ప్రారంభించి క్రమేపీ ఈ కోర్సు దిశని, గతిని నిర్దేశించే స్థాయికి చేరుకోడం ఒక అపురూపమైన విషయం. ట్రైనర్స్‌గా నాకు, నందినికి ఒక విశిష్టమైన అనుభవం. దీనికి చేయూత గ్రామ్య రుక్మిణీరావ్, వేదిక జయ, భూమిక సత్యవతి. ఇంకేంకావాలి, అదో చైతన్య స్రవంతి. ప్రతి ఒక్కరం ఒకరినించి ఒకరం నేర్చుకున్నాం.
ఈ కోర్సు జరుగుతున్న మూడేళ్ళ సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నెలకొన్న పరిస్థితులపైన, ప్రారంభమైన
ఉద్యమాల మీద, మారుతున్న సామాజిక, రాజకీయ వైనాలపైన పార్టిసిపెంట్స్‌కి అవగాహన ఇవ్వడంతోపాటు విస్తృతంగా చర్చించడం, ఈ అంశాలన్నింటిని వారివారి జీవితాలకి, జీవన విధానాలకి, క్షేత్రస్థాయి వాస్తవికతలకి జోడిరచి చూడగలిగేలా సహకరించడం మరవలేనిది. ఈ ప్రక్రియ మొత్తంలో అనేకసార్లు వేడి, వాడి చర్చలు జరిగాయి. కొన్నిసార్లు అసమ్మతితో కూడిన నిశ్శబ్దం కనబడేది. ఇంకొన్నిసార్లు అర్థంకాని అయోమయం ఉండేది. దీనికి చదువు, ఎక్స్‌పోజర్, అనుభవాలు, ప్రివిలేజస్, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, గ్రామీణ పట్టణ జీవనం వంటి అనేక విభిన్న నేపథ్యాలు కారణమయ్యేవి. ఇన్ని రకాల విభిన్నతలని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరూ ఇంకొకరి స్థితి పరిస్థితులని అర్థం చేసుకుంటూ సమ భాగస్వాములయ్యేలా, ఒకరి చేతినొకరు అందుకుని కలిసి నేర్చుకుంటూ, విషయాలను అధ్యయనం చేస్తూ ఆ క్రమంలో సామూహిక స్వరాలతో, చైతన్య గళాలతో ఎలుగెత్తి ఐక్యతారాగాన్ని ఆలపించడం… క్షేత్రస్థాయి కార్యకర్తలు స్త్రీవాద నాయకత్వంగా ఎదగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చారిత్రక అధ్యాయం.
సామాజిక సమన్యాయపు అవగాహన ఫలితం కరోనా కష్టకాలంలో మరింత స్పష్టంగా కనబడిరది. ఐక్యతా రాగంలోని కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావంతో పీడితులైన మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌వ్యక్తులు, నిరుపేదలు, ఒంటరి స్త్రీలు, వలస కార్మికులు, దినసరి కూలీలు వంటి వర్గాలకు చేయూతనిచ్చి వారికి సహకారం అందేలా కృషి చేయడంలో ఈ అవగాహన, మార్పు ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ సమయంలోనూ భౌతికంగా ఎక్కడెక్కడో ఉన్నా ఐక్యతారాగం సభ్యులుగా ఒకరినొకరు పలకరించుకుంటూ, పనిలో సలహాలిచ్చుకుంటూ, మనోధైర్యాన్నిచ్చుకుంటూ, ముందుకు సాగడానికి ఉమ్మడిగా ప్రయత్నించడం… అదీ ఒక కొత్త చైతన్యంతో, సామూహిక ధైర్యంతో… అనేక దారాల అల్లికలా, గిజిగాని గూడులా, వైవిధ్యభరిత రంగుల హరివిల్లులా…
మూడేళ్ళయ్యే సరికి నందిని, నేను శిక్షకులుగా కాక సహకార్యకర్తలుగా మారిపోయాం. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరు ఫెసిలిటేటర్‌గా ఎదిగారు. ఒకరికొకరు తోడై సహనాయకత్వంగా కలిసి నడిచే స్థాయికి చేరారు. ఇది వాస్తవ రూపం దాల్చిన ఒక అద్భుతమైన స్వప్నం. ఇది ఐకత్యా రాగం!