వెన్నెల కాంతులు లేని
ఈ ప్లాస్టిక్ పున్నముల్ని బహిష్కరించాలి
పున్నమి ముసుగులో పొంచి ఉన్న
పున్నమి నాగుల్ని
ఆ పడగ నీడల్ని సంహరించాలి
రగులుతోంది మొగలిపొదల్ని
కాలర్టోన్‌లను నిషేధిస్తూ
రగిలే సెగతగిలే భగభగ మండే
నెత్తుటి కాగడాలై ఉరికే చైతన్య భారతం రావాలి
వాసన లేని కాగితం పూల చెట్టులా
మొండి కత్తిలా
చేతులు మొలవని నిర్భయ చట్టాల నిగ్గుతేల్చాలి
చట్టాలను అమలు చేయలేని
ఊసరవెల్లి అధికారాన్ని నిలదీయాలి
ఆత్మవంచన నయవంచనల నడుమ
ఎంతకాలం నడిచే శవాలమై పడివుందాం
అర్థరాత్రి స్వాతంత్య్రం ఇంకా తెల్లవారనట్టు
ఆడది ఒంటరిగా తిరగలేని జనారణ్యంలో
ప్రేక్షక పాత్ర సమాజాన్ని నిలువుకోతేయాలి
ఎందరు రమ్యలో… ఎలుగెత్తి ఘోషిస్తున్నా
నడిరోడ్డుపై మానవత్వం నరికేయబడుతున్నా
ఈ గాంధారీ పుత్రుల లోకంలో
ఏ గజేంద్ర మోక్షపురాణమూ కనికరించదు
గంతలు కట్టుకున్న ధర్మ దేవత కరుణించదు
దేవాలయాలపై బూతుబొమ్మలున్న దేశం కదా
కులమతాల రాజకీయం నోరుమెదపదు
జాతిపిత చెప్పిన మూడుకోతుల సామెత
తలకిందులుగా వేలాడుతూ…
కనకదుర్గమ్మ త్రిశూలం తుప్పుపట్టిందేమో
అలంకారాలకే పరిమితమైంది
కరోనా కాలంలో గుడి ఐసొలేషన్‌లో బంధింపబడి
అతివల ఆర్తనాదాలు ఏ దేవుళ్ళ చెవికెక్కాయి
ఏ రాజ్యం ఆలకించింది
కాళ్ళకు చేతులకు సంకెళ్ళతో మనిషితనం ఓవైపు
ఈ అత్యాచార పర్వంలో
మగువల ఆర్తనాదాలు ఓ వైపు
ఈ స్వార్థ అవినీతి లోకాన్ని సంస్కరించలేక
కాలం కరోనాను ప్రయోగించినా
ఆగని మానవమృగాల మారణహోమం
అణువు నుండి అంతరిక్షం దాకా
అతివ విజయాలు సాధించినా
ఆకాశంలో సగమై కీర్తింపబడుతున్నా
ప్రతిభ ప్రభాతమై వెలిగినా
దీపం కింద చీకటిలోనే మగ్గుతూ
రాహుకేతువుల బలత్కారానికి గురౌతూ
ప్రేమ కామ గ్రహణ శాపంలోనే
సృష్టి చెట్టుకు తల్లివేళ్ళైనా
మగువ పదం ఆరంభమైంది
‘మగ’ని వేలుపట్టుకునే కదా
అణిగి మణిగి వుండాలన్న
అణచివేతల పాఠాలనుంచే కదా
బహుపాత్రధారిణిగా నిత్యం
సేవలందిస్తున్న పనిమంతురాలే
ఐనా ఆమె ఎప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరురాలే
అణచివేయబడే దళితురాలే
శాస్త్రీయ విజ్ఞానం విస్ఫోటనమై
విధ్వంసక ముఖచిత్రాలను ఆవిష్కరిస్తూ
ఆధునిక అభివృద్ధి రంగులు పూసుకుని గ్లోబు…
సెల్‌ఫోన్ రూపంలో మనిషి చేతిలో
పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబు
పాఠశాలలో చేసిన ప్రతిజ్ఞ
అరిగిపోయిన రికార్డు
పాడుబడ్డ బాయిలోంచి
నీతినిజాయితీలను ఎవరు తోడాలి
మదమెక్కిన ప్రేమోన్మాదం విశృంఖలత్వంలో
సోదరతత్వమే లేని లోకంలో
నేనెవరికి రాఖీ కట్టాలి
నేనెవరిని రక్షణ కోరాలి
నేనేమని నా దేశాన్ని పొగడాలి…
ఎవరికి శుభాకాంక్షలు తెలపాలి
చావుకు పెళ్ళికి ఒకే మేళమైనట్టు
దేశమే శవాలదిబ్బైన కాలంలో
పాడెలను మోస్తూ పండుగ ఎలా చేయాలి
సందర్భమేదైనా సంఘటన ఎక్కడైనా
నిత్యం రాజ్యం అబలల మరణశాసనం రాస్తుంటే
నిర్భయ నుండి రమ్యదాకా
భరతమాత భుజం మీద వేలాడుతున్న శవాలై
మా రక్తంతో రాస్తున్న
ఆడబిడ్డల మరణవాంగ్మూలం
పోస్ట్‌మార్టమ్ రిపోర్టు తారుమారవ్వచ్చేమో
న్యాయస్థానం నిర్దోషులుగా తీర్పు ఇవ్వొచ్చేమో కానీ
నీవు జన్మించిన నీ జన్మస్థానం సాక్షిగా
నీ కన్నతల్లే నిన్ను ఖండఖండాలుగా ఖండిస్తూ కడదేర్చడమే
అంతిమ తీర్పు
ఈ మానవ మృగాల మానసిక జాడ్యానికి వ్యాక్సిన్ కనుగొనాలిపుడు
ఇక నేటి తరం యువతి వీరరaాన్సిలా
తనకు తానే స్వయం రాఖీ కట్టుకోవాలి
రక్షాబంధనమై బతుకు యుద్ధభూమిలో
తనను తానే సంరక్షించుకోవాలి యోధురాలై