ఈ మధ్య
కొన్ని సంగతులు మర్చిపోతున్నాను,
ముఖ్యంగా పేర్లు,
స్మృతి ఆకాశంలో
తారకలు మసక బారటమంటే
ఇదేనేమో!
‘సార్ నేనెవరో చెప్పండి’
అన్నాడా వ్యక్తి.
ఎక్కడో చూసినట్టే వుంది
అతని ముఖ కవళికలను
దశాబ్దాల వెనుకకు తీసికెళ్ళి
జ్జాపకాల పటం మీద పెట్టి
చిత్రం గీస్తున్నాను.
‘నేను మీ పూర్వ విద్యార్థిని’ అన్నాడు
ఇప్పుడు కాస్త తెల్లారింది
‘అవునవును’ అన్నాను.
కొంత నటన కూడా అబ్బుతున్నది.
చిన్నతనంలో
ఓ మిత్రుడూ నేనూ
ఆజీవితం విడిపోవద్దని
వాగ్దానం చేసుకున్నాం.
కానీ ఇవాళ
అతని పేరు గుర్తుకు రావటం లేదు
‘చ’తో మొదలయ్యేదనుకుంటాను.
ఈ మధ్య
తెగిపోయిన స్మృతి హారం లోంచి
ఒక్కో పూసే రాలిపోతున్నది
ఆఖరికి
దారమే మిగిలేటట్టుంది.
అంటున్నాను గాని
నా జ్ఞాపకశక్తి తక్కువేమీ కాదు
ఆరో యేటి నుంచి గుర్తుంది జీవితం నాకు.
పసి వయస్సులో జ్వరం వస్తే
నా సంధి ప్రేలాపనల్ని
మా నాయన గుర్తు చేసేవాడు.
వాటినిప్పుడు
మిమిక్రీ చేసి చూపెట్టగలను.
పదహారో యేట చదివిన
నవలలు వర్ణనల్తో సహా గుర్తే.
‘చివరకు మిగిలేది’లో
అమృతం పాత్ర
నా యౌవన సముద్రంలో
కల్లోలం రేపిన పెను కెరటం.
‘వేయి పడగల్లో’
ధర్మారావు పడిన యుగ సంధి వేదన
అప్పుడర్ధమయ్యేది కాదు.
జీవితంలో
కొన్ని జ్ఞాపకాలు వెలిసి పోతాయి
కొన్ని ఎప్పటికీ నిలిచి వుంటాయి.
ఇష్టమైనవీ, అవసరమైనవీ
అలా అలా ఆగిపోతాయి కాబోలు!
అంతే కాదు
కాల వ్యవధి ఎక్కువైతే
స్మృతి జ్వాలలు ఆరిపోతాయి.
స్మృతికీ జీవనగతికీ మధ్య
కాలం ఒక నిరంతర సంధ్య
సుదీర్ఘ సంక్లిష్ట యాత్రలో
హేతువు ఒక మిథ్య.
మిగిలినవే మిగుల్తాయి
కాని జ్ఞాపకాలు ఒక తరగని సంపద.