భూమిక సంస్థ పనిచేస్తున్న హైదరాబాద్‌లోని 10 బస్తీలలోని విద్యార్థినీ, విద్యార్థులు మరియు మహిళలతో ‘కమలాభాసిన్’ వ్రాసిన ‘‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే… పిల్లలపై లైంగిక హింస’’ (మంచి స్పర్శ, చెడు స్పర్శ) అనే పుస్తకాన్ని జనవరి నుండి ఏప్రిల్ 2021
మధ్యలో అన్ని బస్తీలలోని సుమారు 3,000 మందితో చదివించి చర్చించడం జరిగింది. ఈ పుస్తకంలో ఒక అమ్మాయి వివిధ సందర్భాలలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వారి తల్లిదండ్రుల ద్వారా ఎదుర్కొన్న శారీరక, మానసిక హింసను, మరియు తన చిన్నతనంలో ఎదిరించే ధైర్యం లేక, తల్లిదండ్రులతో చెప్పలేక ఆ సందర్భాలలో తాను అనుభవించిన బాధను వివరిస్తూ ప్రస్తుతం అటువంటి సందర్భాలు ఎదురైతే ఎలా స్పందించాలి, ఎలా తిరస్కరించాలి, నైపుణ్య ఆవశ్యకత, ఆ విషయాలను ఎవరికి చెప్పాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మరియు బాల బాలికల కోసం పని చేస్తున్న సహాయ సంస్థలు ఏమిటి అనే విషయాలు ఉన్నాయి.
పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకంలోని అంశాలు వారికి ఎలా ఉపయోగపడ్డాయి, నిత్య జీవితంలో ఈ సమాచారం ఆవశ్యకత ఏమిటి అనే అంశంపై భూమిక సంస్థకు టాటా ఇన్స్టిట్యూట్, ముంబై ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌కి వచ్చిన సోషల్ వర్క్ విద్యార్థులు జి.శివకాంత్, కవితలతో కలిసి భూమిక టీం పుస్తకం చదివిన వాళ్ళల్లో నుండి 270 మందితో చిన్న అధ్యయనం చేయడం జరిగింది. ముందుగా మంచి స్పర్శ, చెడు స్పర్శ అనే విషయం గురించి ప్రస్తావించినప్పుడు 40% మంది మాత్రం పాఠశాల, వార్తలు, దేశంలో జరుగుతున్న లైంగిక వేధింపుల సంఘటనల ద్వారా విన్నామని అన్నారు. 60% మంది మాత్రం ఈ అంశాల గురించి అంతగా తెలియదని చెప్పారు.
పుస్తకం చదవడం ద్వారా వాటి గురించి బాగా అర్థమైందని చెప్పారు. ముఖ్యంగా లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనతో మంచిగా ప్రవర్తిస్తూనే ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ చేతులు పట్టుకుని ఎంతకూ వదలకపోవడం, బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం, ఒళ్ళో కూర్చోపెట్టుకోవడం, నడుము, ఛాతీ, తొడలు, సున్నితమైన, రహస్య భాగాలను పదే పదే తాకడం, పిండటం మొదలైనవి చెడు స్పర్శగా భావించాలని చెప్పారు.
మంచి స్పర్శ అంటే చేతిలో చేయి కలపడం, భుజం తట్టడం, ఒక అడుగు దూరంగా నిలబడి మాట్లాడడం వంటివని చెప్పారు.
అయితే పిల్లలను ఆకర్షించడానికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వడం, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వంటి వాటిని ఆయుధాలుగా వాడి పిల్లలను లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. ముఖ్యంగా ఈ పుస్తకం చదవడం వలన ఇతరుల ఉద్దేశ్యాన్ని అంచనా వేయడం, మంచి స్పర్శ`చెడు స్పర్శ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం తెలిసిందన్నారు.
వ్యక్తుల ముఖం, మాట్లాడే తీరు, వారి అలవాట్లు, ప్రవర్తించే తీరు, వారి చర్యల ద్వారా వారి ఉద్దేశ్యాన్ని పసిగట్టే విధానం నేర్చుకున్నామన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, అపరిచితులు, ఇంటి చుట్టూ నివసించే వారితో ఎంతవరకు మెలగాలి, ఒకవేళ వారు హద్దు మీరినట్లు అనిపిస్తే అక్కడి నుండి సురక్షితంగా ఎలా బయటపడాలో బాగా అర్థమైందన్నారు. మరి కొందరు అమ్మాయిలు మాట్లాడుతూ వారి చిన్నతనంలో అనుభవించిన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఎవరికీ చెప్పుకోలేకపోయామని అప్పుడు ఇంతలా అభయం ఇచ్చే సంస్థలు గాని, మనుషులు గాని తారసపడలేదని చెప్పారు.
మరికొందరు ఈ మధ్య పాఠశాలలో జరిగిన సంఘటనలు ధైర్యంగా ప్రధానోపాధ్యాయునికి చెప్పిన తీరు, ఆ సమస్య పరిష్కారానికి టీచర్లు ఇచ్చిన సహకారం గురించి చెప్పారు. వీరు భవిష్యత్తులో ఒకవేళ ఇలాంటి సంఘటనలు ఎదురైతే ముందుగా కుటుంబంలోని అమ్మకు, నాన్నకు, మరియు భూమిక హెల్ప్‌లైన్, భూమిక టీం సభ్యులకు, ఛైల్డ్‌లైన్, పాఠశాల సిబ్బంది, షి టీం, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లను సంప్రదించి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ పుస్తకం చదవడం, చర్చించడం ద్వారా వారి జీవితానికి చాలా ఉపయోగపడుతుందని వారిలో చాలా ప్రవర్తనా మార్పు ఉందన్నారు. మరియు ఈ విషయాలను వారి స్నేహితులతో పంచుకున్నామన్నారు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలు వారిలో ఉన్న మానసిక సంఘర్షణ, ప్రతిస్పందనా తీరు, నివారణ పద్ధతులను కూడా అర్థం చేసుకొని అవి పాటిస్తున్నామన్నారు. మరోవైపు వారి తల్లులు స్పందిస్తూ ‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే’ పుస్తకాన్ని చదవటం ద్వారా తమ పిల్లలకు ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బాగా అర్థమైందని చెప్పారు.
పుస్తకం చదవకముందు, చర్చించక ముందు వరకు కౌమార దశలో ఉన్న వారి పిల్లలతో ఎప్పుడూ మాట్లాడలేదని, అది అంత తేలిక కాదని అనుకునేవాళ్ళమని అన్నారు. ఏముంది, ఎదుగుతుంటే వారే అర్థం చేసుకుంటారని అనుకునేవాళ్ళమని కానీ వారికి ఇలాంటి సంఘటనలు ఎదురుకావొచ్చని ఊహించలేదన్నారు.
ఈ పుస్తకం చదివిన తర్వాత తమ పిల్లలు ఎలాంటి సంఘటనలైనా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పొందారన్నారు.
తమ పిల్లలను ఇతర ప్రదేశాలకు పంపేటప్పుడు కొత్త వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో, తగు జాగ్రత్తల గురించి ఇద్దరం కలిసి చర్చిస్తున్నామన్నారు. పిల్లలకు ముందు జాగ్రత్త చర్యగా కరాటే నేర్పిస్తామని చెప్పారు. స్వీయరక్షణ పద్ధతులను, ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు మెలిగే పద్ధతులు, పిల్లలు ఒకవేళ ఏదైనా సంఘటన లేదా అనుభవం చెప్పుకోవడానికి తగు విధంగా ఎలా ప్రవర్తించాలో వారు చెప్తున్న విషయాన్ని తీసిపారేయకుండా వారిని గౌరవించి తగిన సహాయాన్ని ఇస్తూ సమస్య పరిష్కరించుకోవాలని అర్థమైందని చెప్పారు. ముఖ్యంగా అబ్బాయిలకు వారి పరిమితులు, సరిహద్దులను గురించి తెలియజేస్తున్నామని చెప్పారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులను నిందించకుండా ఇరుగు పొరుగు వారి సహకారం పొంది సమస్య పరిష్కారం దిశగా అడుగు వేయాలని నేర్చుకున్నామన్నారు. బాల బాలికలకు వారు నివసిస్తున్న బస్తీలను, పాఠశాలలను సురక్షిత ప్రదేశాలుగా మార్చుకోవడానికి బస్తీ లీడర్ల సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ పుస్తకం చదివిన తర్వాత సమాజంలో ఉన్న కొన్ని సున్నితమైన అంశాలను పిల్లలకు చెప్పడం సులభమైందన్నారు. ఇలాంటి మంచి స్పర్శ, చెడు స్పర్శ అనే సమాచారం అమ్మాయి/అబ్బాయిలకు ఇది సాధారణ సమస్య అని ఇద్దరితో మాట్లాడగల నైపుణ్యం వచ్చిందన్నారు. అబ్బాయిలు కూడా చెడు స్పర్శ సందర్భాన్ని ఎదుర్కొంటే వారు ఎలా స్పందించాలో చెబుతున్నామన్నారు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎలా మెలగాలో చెబుతున్నామన్నారు.
ముగింపుః ఈ సర్వేలో మహిళలు, యువతులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని ప్రశ్నలకు ఓపికతో సమాధానమిచ్చారు. భూమిక సంస్థ చేసిన ఈ కార్యక్రమం చాలా విలువైనదని అన్నారు. సమస్యపై అవగాహన, నివారణ చర్యలు, సహాయ సంస్థల గురించి చాలా విషయాలను నేర్చుకున్నామని చెప్పారు. పుస్తకం చదివిన తర్వాత అబ్బాయిలు, అమ్మాయిల వైఖరిలో చాలా మార్పులు చూశామన్నారు. ఆ మార్పు ఏంటంటే సమస్యలను అర్థం చేసుకునే విధానం మరియు స్పందించే తీరు మంచిగా ఉందన్నారు. ఈ పుస్తకం ద్వారా పిల్లలు తమను తాము సురక్షితంగా ఉండడానికి టెక్నాలజీని వాడుతున్నారని, జిపిఎస్‌ను ఆన్ చేసుకుంటున్నారని, అమ్మాయిలు ఇలాంటి సంఘటన ఎదురైతే పోలీసులకు, ఇతర అధికారులకు ఇంట్లో చెప్తున్నారన్నారు. మహిళలు కూడా పని ప్రదేశాల్లో, కార్యాలయాలు, బస్సులు, ఆటోలలో ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంటే ఎలా స్పందించాలో అర్థమైందన్నారు.
ఈ విషయాలను చదివించడం కాకుండా అందరికీ ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపించడం వలన తమ బంధువులు, స్నేహితులతో ఇలాంటి విషయాలను పంచుకోవడం సులభమైందన్నారు. అయితే భవిష్యత్తులో అబ్బాయిలు సమాజం పట్ల, స్త్రీలు, అమ్మాయిల పట్ల ఎలా సున్నితంగా వ్యవహరించాలో మరియు అబ్బాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు, హింస, వారిలో సామాజిక పరివర్తను ఎలా తీసుకురావాలో వారి బాధ్యతలను తెలిపే పుస్తకాలు రావాలని సూచించారు. ముఖ్యంగా ఈ పుస్తకం ఎదిగే ప్రతి బిడ్డకు అవసరమని అన్నారు.