వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేస్తున్న కాలంలో నక్సల్బరీ ప్రాంతంలో అరెస్ట్ చేయబడిన ఒక ఆదివాసిని ఒక పోలీస్ ఆఫీసర్ అడిగాడట, ‘‘మీ నక్సలైట్లు మాట మాట్లాడితే వియత్నాం జిందాబాద్ అని అంటున్నారు కదా, మరి చూపించు అదెక్కడ ఉందో’’ అంటూ ప్రపంచ పటాన్ని ఆ ఆదివాసి ముందు పెట్టాడట. అతనికేమో చదువు రాదు.
అసలు అటువంటి పటాలు ఎప్పుడూ చూడనూ లేదు. బహుశా అవి ఉంటాయని కూడా తెలియకపోవచ్చు. కానీ అతను ఒక్కసారి ఆ పటాన్ని తీక్షణంగా చూసి, చుట్టూ మూగివున్న పోలీసు ఆఫీసర్ల వంక చూస్తూ తన చూపుడువేలును తన గుండె మీద పెట్టుకుని ‘‘అది నా గుండెలో ఉంది’’ అని ధైర్యంగా చెప్పాడట.
ఈ ఉదంతాన్ని తన సహచర అధ్యాపకుడు రవీంద్ర రే చెప్పాడని చెబుతూ సామాజిక శాస్త్రవేత్త నందిని సుందర్ తన పుస్తకం The Burning Forest: India’s War in Bastar (2016) (ఇదే పుస్తకాన్ని 2019లో తెలుగులో ‘‘రగులుతున్న అడవి: బస్తర్‌లో భారత యుద్ధం’’గా మలుపు బుక్స్ వాళ్ళు ప్రచురించారు) ప్రారంభిస్తుంది. ఇది మొత్తం పుస్తకానికి పెద్ద తాత్విక భూమికను అందిస్తుంది. ఇప్పుడు భారతదేశం దండకారణ్య ప్రజలపై కొనసాగిస్తున్న యుద్ధంలో ప్రపంచ విప్లవాగ్నులను తన గుండెల్లో దాచుకున్న ఆదివాసి గుండె మీద తుపాకి పేలుస్తుంది. బహుశా ఈ యుద్ధ సందర్భంలో నాగరికులం, మానవతావాదులం, ఆలోచనాపరులం అనుకునే మనం ఏం చెయ్యాలో, ఎటువైపు నిలబడాలో గుర్తు చెయ్యడానికే ఆ ఆదివాసి ఉదంతాన్ని నందిని సుందర్ గుర్తుచేసిందని అనిపించింది. అడ్రస్ తెలవకపోవచ్చు కానీ ఆపదలో ఉన్నారని వియత్నాంను గుండెల్లో పెట్టుకుని సంఫీుభావం చెప్పిన ఆదివాసులకు ఇప్పుడు చెప్పనలవి కానంత నష్టం జరుగుతోంది. ఈ పుస్తకమంతా వాళ్ళ గాయాల చరిత్రే. ప్రతి పేజీలో రాజ్యం తన క్రూరత్వాన్ని నగ్నంగా ప్రచురిస్తుంది. చదువుతుంటేనే గుండెను పిండేసినట్లు అవుతుంది. మరి వాళ్ళు అంత హింసను ఎట్లా భరిస్తున్నారని దుఃఖం కల్గుతుంది. ఆ మరుక్షణమే వాళ్ళ పోరాట తెగువ భవిష్యత్తు మీద ఒక భరోసాను ఇస్తుంది అనే ఒక ఆశను కల్గిస్తుంది. మనిషి మాయమైపోతున్నాడని బాధ పడడం కాదు, పురుడు పోసుకుంటున్న ఆ నూతన మానవుడిని ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించాలి కదా అనిపిస్తుంది.
నందిని సుందర్ 413 పేజీల ఈ పుస్తకాన్ని 17 చాప్టర్లుగా రాసింది. దీన్ని ‘జగర్నాట్’ పుస్తక సంస్థ వారు 2016లో ప్రచురించారు. నందిని సుందర్ ఒక సామాజిక శాస్త్ర పరిశోధకురాలిగా గత 30 సంవత్సరాలుగా బస్తర్ ప్రాంతంలో ఆదివాసుల జీవితం మీద అధ్యయనం చేస్తోంది. అలాగే ఆదివాసి హక్కుల కోసం పోరాటాలలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఢల్లీి యూనివర్శిటీలో సామాజిక శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అయితే ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పుస్తకం రాజ్యం తన ఆధీనంలోని అన్ని వ్యవస్థల (state apparatus) ద్వారా కొనసాగిస్తున్న విధ్వంసం, హింస మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పుస్తకం చదువుతున్నంతసేపూ చాలా అలజడికి, ఏమీ చేయలేని నిస్సహాయతకు, నిరాశావాదానికి గురికావడం సహజం. కానీ కేవలం రాజ్యం కొనసాగిస్తున్న హింసను మాత్రమే చెప్పి ఊరుకుంటే లేక చెప్పాల్సినంత స్థాయిలో ప్రజా ప్రతిఘటనను, జనతన సర్కార్ నిర్మాణాలను చెప్పకపోతే పెద్ద రాజకీయ ప్రయోజనం ఉండదు. అందుకే ఈ పుస్తకం చదివే ఎవరైనా జనతన సర్కార్ నిర్మాణాల మీద, దాని విజయాల మీద (అవి ఎంత పరిమితమైనవి అయినా సరే!) వస్తున్న సాహిత్యాన్ని (ముఖ్యంగా పాణి రాసిన పుస్తకం, ‘‘జనతన రాజ్యం’’) కూడా జోడిరచి చదివితే కానీ అక్కడి ప్రజలు తీవ్ర నిర్బంధంలో కూడా విప్లవ పరివర్తన (revolutionary transformation) కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయార్ధిక వ్యవస్థను (కేవలం ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా మాత్రమే కాదు) ఎలా నిర్మిస్తున్నారో అర్థం కాదు. ఈ పుస్తకాన్ని కేవలం విప్లవాభిమానులు మాత్రమే కాదు, ‘‘దేశభక్తి’’ ‘‘రాజ్యాంగం’’ ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’’ ‘‘చట్టబద్ధ పాలన’’ అని గుండెలు బాదుకునే ప్రతి ఒక్కరూ నిజాయితీగా చదవాల్సినది. వాళ్ళే కాదు, ‘‘తటస్ఠ’’ బుద్ధిజీవులం అని చెప్పుకునే వాళ్ళు కూడా తాము ఎటువైపు నిలబడాలో తేల్చుకోవడానికి ఉపయోగపడే రచన.
ఈ పుస్తకం నిండా నందిని సుందర్ రాజ్యహింసకు సంబంధించిన ఎన్నో సంఘటనలను చాలా వివరంగా చర్చించారు. కానీ నయా ఉదారవాద రూపంలో కొనసాగుతున్న సామ్రాజ్యవాద దాడి సందర్భంలో రాజ్య స్వభావాన్ని, పాలకవర్గ లక్షణాలను అర్థం చేసుకోవడానికి కావాల్సిన దృక్పథాన్ని ఇవ్వలేకపోయింది. బూర్జువా ప్రజాస్వామ్యంలో అనేక స్థాయిల్లో, అనేక రూపాల్లో కొనసాగుతున్న రాజ్యహింస అర్థం కావాలంటే మార్క్సిస్టు దృష్టి కోణం అవసరమైనది, అనివార్యమైంది. మార్క్సిస్టు అవగాహనతో నందిని సుందర్ పుస్తకం చదివితే కానీ బస్తర్‌లో భారతదేశం ఎందుకు యుద్ధం చేస్తోందో పూర్తిగా అర్థం కాదు. పుస్తకం నిండా ఉన్న అమానవీయ సంఘటనలు ఆదివాసుల మీద సానుభూతిని కలిగిస్తే, మార్క్సిస్ట్ దృష్టికోణం ఆదివాసుల ప్రతిఘటనా పోరాటాల యెడల ‘‘బయట’’ సమాజం ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ఎందుకు వాళ్ళకు అండగా నిలబడాలో తెలుపుతుంది.
మార్క్సిస్ట్ రాజ్య సిద్ధాంతం కేవలం బూర్జువా రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదుÑ దాన్ని ఎలా, ఎందుకు ధ్వంసం చేయాలో తెలుసుకోవడానికి కూడా అవసరం. ఇదే విషయాన్ని మార్క్స్ »»The Eighteenth Brumaire of Louis Bonaparate లో »The Civil War in Franceµ లో స్పష్టం చేశాడు. బూర్జువా రాజ్యాన్ని సంస్కరించుకొని దానినుండి పురోగతి చెందుతామనే భ్రమలు ఉండాల్సిన అవసరం లేదు. శ్రామిక వర్గ పార్టీలు చేయాల్సింది బూర్జువా రాజ్య వ్యవస్థను ఒకరి చేతి నుండి మరొకరి చేతికి మార్చడం కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం (smash) చేయడం. ఇదే నిజమైన విప్లవకారుల కర్తవ్యమని చెప్పాడు. హింసను ఆధారం చేసుకొని మనుగడ సాధించే బూర్జువా రాజ్యాన్ని తొలగించి శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలంటే సాయుధ విప్లవం (»»violent revolution)` లెనిన్ వాడిన మాట) తప్ప మరో మార్గం లేదని లెనిన్ స్పష్టంగా ప్రకటించాడు. అందుకే బూర్జువా రాజ్యంపై మార్క్సిస్ట్ అవగాహనకు సంబంధించిన మౌళికమైన విషయాలను పరిమితంగానైనా ప్రస్తావించుకోవాలి.
రాజ్యం గురించి సూత్రీకరణ చేసే క్రమంలో మార్క్స్ అంతకుముందే హెగెల్ చేసిన ఒక ప్రతిపాదనను బద్దలు కొట్టాడు. హెగెల్ “The Philosophy of Right” అనే గ్రంథంలో రాజ్యమనేది ‘‘వాస్తవంలోకి వచ్చిన ఒక నైతిక భావన’’, ‘‘అది తన హేతుబద్ధ ఆలోచనతో వ్యక్తిగత అవసరాలు, స్వేచ్ఛను దాటి అత్యున్నత స్థాయిలో సమాజ విశ్వజనీయమైన స్వేచ్ఛ (universal freedom) కోసం పరితపిస్తుంది, ప్రయత్నిస్తుంది అనే రాజ్య భావనను సమర్ధిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, హెగెల్ ఉద్దేశంలో రాజ్యమంటే అందరి బాగు కోసం పాటుపడే ఒక నిజాయితీ గల స్వతంత్ర వ్యవస్థ. దీనిని మార్క్స్ పూర్తి అవాస్తవంగా, మర్మమైన ఆదర్శవాదంగా (mystical idealism) కొట్టిపారేశాడు. ఎందుకంటే రాజ్యం ఎప్పుడూ కూడా అందరి అవసరాలు తీర్చడానికి పనికిరాదు. అది ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తిని కాపాడడం కోసమే ఉనికిలోకి వచ్చింది, వివిధ రూపాలలో అదే పనిని చేస్తుంది. రాజ్యమనేది పాలక వర్గ ప్రయోజనాలు కాపాడే ఒక వ్యవస్థ అని మార్క్స్, ఏంగెల్స్ లోతైన ఆలోచన చేశారు. దీన్ని లెనిన్ మరింత స్పష్టంగా తన “State and Revolution” అనే దీర్ఘ కరపత్రంలో వివరించాడు. లెనిన్ ప్రకారం వర్గ సమాజంలో రాజ్యమంటేనే బలగాలను, బలాన్ని ఉపయోగించి అణగారిన వర్గాల మీద దోపిడీ, హింసను కొనసాగించే ఒక సాధనం.
రాజ్య స్వభావాన్ని ముఖ్యంగా ఆధునిక పెట్టుబడిదారీ రాజ్య వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద మార్క్సిస్టులలో (ముఖ్యంగా 1960లలో) ఒక పెద్ద చర్చే జరిగింది. అందులో ప్రధానంగా రెండు ఆలోచనా ధారలు ముందుకొచ్చాయి. ఒకటి, రాజ్యాన్ని పెట్టుబడిదారీ వర్గాల చేతిలో ఒక సాధనంగా చూడడం. పెట్టుబడిదారుల మధ్య ఎన్ని విభేదాలైనా ఉండనీ, వాళ్ళంతా రాజ్యాన్ని తమ చెప్పుచేతుల్లో ఉంచుకొని తమ వర్గ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు. అదే “the state of the capitalists”. ఇక రెండవది, బూర్జువా రాజ్యం ఎవరి చేతుల్లో ఉన్నా, వాళ్ళ సిద్ధాంతాలు ఏవైనా అంతిమంగా అది పెట్టుబడి ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది. అంటే అది “the state of capitalµµ”. అయితే ఇవి రెండు పరస్పర విరుద్ధమైనవి కాకపోగా, ఒకదానికొకటి సహకరించుకుంటాయి.
ఈ రెండు ధోరణులను ఇండియాకి అన్వయిస్తే, పెట్టుబడిదారులే ఏకంగా చట్టసభలను కైవసం చేసుకునే ప్రయత్నం ఒకవైపుÑ చట్టసభలలో కాంగ్రెస్ ఉన్నా, బిజెపీ ఉన్నా, లేక మరే ఇతర పార్టీ ఉన్నా ఆ ప్రభుత్వాలు ప్రధానంగా పెట్టుబడి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న స్థితి మరోవైపు. ఈ రెండు ప్రక్రియలు ఏకకాలంలో జరుగుతాయి. మొత్తంగా రాజ్య వ్వవస్థ పెట్టుబడిదారుల/పాలక వర్గాల ప్రయోజనాల కోసం సమాజంలోని వర్గ సంఘర్షణలను నియంత్రించి, స్థిరమైన సామాజిక క్రమాన్ని (stable social order) నెలకొల్పడమే ప్రధాన కర్తవ్యంగా చేసుకుంటుంది. దోపిడీ వర్గాల ప్రయోజనాలను కాపాడడం కోసం, లెనిన్ మాటల్లో చెప్పాలంటే, రాజ్యం శ్రామిక వర్గం మీద ఎంతటి వికృతమైన హింసనైనా కొనసాగిస్తుంది. ఒకవైపు రాజ్యం హింసను కొనసాగిస్తూనే, ఇటాలియన్ కమ్యూనిస్ట్ అంటోనియో గ్రాంసీ చెప్పినట్లు, మరోవైపు అది చేసే పనులకు పౌరసమాజంలో సమ్మతి కూడగట్టడానికి, బూర్జువా పాలనమీద, చట్టసభల మీద భ్రమలను రేకెత్తించడానికి అనేక మార్గాలను, ఎత్తుగడలను ఎంచుకుంటుంది. పాలకవర్గ ప్రయోజనాలే అందరి ప్రయోజనాలు అనుకునేలా కుట్ర చేస్తుంది. దాన్నే నిత్యజీవిత ఇంగిత జ్ఞానం (కామన్‌సెన్స్)లో భాగం చేయడానికి తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలను (విద్య, సాహిత్యం, సాంస్కృతిక రంగాలతో పాటు మీడియాను కూడా) వాడుకుంటుంది.
పాలకవర్గం అధికారం చేతిలోకి వచ్చినపుడు ఎన్ని రకాలుగా అణచివేతను కొనసాగిస్తుందో యురాన్ థేర్ బార్న్ (స్వీడిష్ సామాజిక శాస్త్రవేత్త, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ అధ్యాపకులు) తన ప్రసిద్ధ పుస్తకం “What Does the Ruling Class Do When it Rules?” (1978)లో ఎంతో లోతుగా విశ్లేషిస్తాడు. పాలక వర్గాలు తన అధీనంలో ఉండే అన్ని అణచివేత సాధనాలను, పద్ధతులను, వనరులను, వ్యవస్థలను (న్యాయ వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియతో సహా) ఉపయోగించుకుని ఏ విధంగా తమ వర్గ ప్రయోజనాలకు కావాల్సిన పరిస్థితులను ఏర్పర్చుకుంటాయో వివరిస్తాడు. ప్రశ్నించే, ధిక్కరించే గొంతులను నిర్భందించడం, నిషేధించడం, ఆ సమూహాల మీద నిరంతర నిఘా కొనసాగించడం, వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఆలోచనలనే నియంత్రించడం… ఇవన్నీ చేయడానికి రాజ్యం తన చేతిలోని అన్ని అధికార విభాగాలను ఎంత అనైతికంగానైనా, దుర్మార్గంగానైనా ఉపయోగిస్తుంది. వీటికంతటికీ చట్టబద్ధ ముసుగు వేయడానికి, సమాజంలో (ముఖ్యంగా పెటీ బూర్జువా వర్గం) మద్దతు కూడగట్టడానికి అనేక విధాల కో`ఆప్టేషన్ పద్ధతులను వాడుకుంటుంది. రాజ్యం తన కో`ఆప్టేషన్ పద్ధతులను పునాదిలోనూ, ఉపరితలంలోనూ ఉపయోగిస్తుంది. పరిమిత సంక్షేమ, ఉపాధి పథకాలను కల్పించి రాజ్యం ప్రజల కోసమే పనిచేస్తోందని మభ్యపెడుతుంది. పాలక, పాలిత వర్గాల మధ్య నిష్పక్షపాత సంధానకర్తగా పనిచేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తుంది. ఆర్థిక అభివృద్ధి సూచికలను చూపిస్తూ అభివృద్ధి జపం (developmentalist mantra) చేస్తూ రాజ్యంతో సహకరిస్తే (trickledown effectతో) అభివృద్ధి ఫలాలు ప్రజలందరూ పొందుతారని బొంకుతుంది. దీన్ని సిద్ధాంతీకరించడానికి, ప్రచారం చేయడానికి ఒక ‘‘అద్దె’’ మేధావి వర్గాన్ని తయారు చేసుకుంటుంది. వీటికి తోడుగా, జాతీయవాదాన్ని, దేశభక్తిని ప్రశ్నించే శక్తులను స్వీయరక్షణలో పడేలా చేస్తుంది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళకు రకరకాల ప్రలోభాలు ఎరవేసి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంది. వాటిని కూడా తిరస్కరించి నిలబడే వాళ్ళ కోసం రోమ్ చక్రవర్తుల కాలం నుండి వస్తోన్న “bread and circuses” పాలసీని వాడుకుంటుంది. పాలక వర్గానికి ఇబ్బంది పెట్టని ఆట, పాట, విందును ప్రజల సంస్కృతిగా, వాళ్ళ అస్తిత్వంగా, ఆత్మగౌరవ విషయంగా మార్చి తన ఆధిపత్య భావజాలాన్ని ఎటువంటి బలవంతం లేకుండానే ప్రజల మీద రుద్దుతుంది. అంతేకాదు, ప్రజా ఉద్యమాల వెల్లువ నుండి వెలుగులోకి వచ్చిన కొత్త విలువలను, ప్రమాణాలను కూడా బూర్జువా రాజ్యం తన మనుగడ కోసం కో`ఆప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజానికి, బూర్జువా రాజ్యంలో ‘‘ప్రజాస్వామ్యం’’ అనేదే ఒక కో`ఆప్టేషన్ సాధనం. అందుకే, బూర్జువా ప్రజాస్వామ్యం సారాంశంలో దోపిడీ వర్గ నియంతృత్వమే! నందిని సుందర్ ఈ అవగాహనను తన పుస్తకంలో పొందుపరచలేదు కానీ, ఆమె వివరించిన అనేక సంఘటనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి.
ఈ పుస్తకంలో నందిని సుందర్ ముఖ్యంగా అవిభక్త బస్తర్‌లో రాజ్యం వనరుల దోపిడీ కోసం ఆదివాసులపై జరుపుతోన్న అనేక రకాల దాడుల గురించి విశ్లేషిస్తుంది. బస్తర్ అంటే సహజ వనరుల భండాగారం. మొత్తం దేశంలో ఉన్న ఇనుప ధాతువు (ఐరన్ ఓర్) నిలువలలో పది శాతం అక్కడే ఉన్నాయి. అంతేకాదు, అల్యూమినియం తయారీకి వాడే బాక్సైట్, భూమి పొరల్లో అరుదుగా దొరికే అతి విలువైన ప్లాటినం, ఆభరణాలలో కెంపులుగా మార్చబడే కురువిందరాయి (corundrum), వివిధ రకాల సున్నపురాళ్ళు (limestones), ఇంకా అనేక రకాల సహజ వనరులు అక్కడ ఉన్నాయి. వీటికి తోడు విస్తారమైన అటవీ సంపద. ఈ సహజ వనరుల సారమంతా పిండుకోవడానికి (extractivism) సామ్రాజ్యవాద శక్తులతో రాజ్యం చేతులు కలిపి అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ ఆ వనరుల మీద ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళు విప్లవ చైతన్యంతో మావోయిస్టులుగా రూపాంతరం చెంది ఉన్నారు. బ్రిటిష్ రాజ్యానికి చెమటలు పట్టించిన 1910 నాటి భూంకాల్ పోరాట స్ఫూర్తితో నిలబడి ఉన్నారు. దోపిడీ రాజ్యాన్ని తమ జీవితాల్లోకి రానివ్వమని గిరిగీసుకున్నారు. ఈ ధిక్కారాన్నే రాజ్యం ‘‘తీవ్రవాదం’’ అని ప్రచారం చేస్తోంది. దాన్ని అంతం చేసి దోపిడీకి మార్గం సులభం చేయడం కోసమే దండకారణ్యంలో ప్రజలపై రాజ్యం యుద్ధం చేస్తోంది.
రాజ్యం ప్రజలపై యుద్ధాన్ని అనేక ఎత్తుగడలతో కొనసాగిస్తోంది. ఒకవైపు వేలాది పోలీస్, అర్థ సైనిక బలగాలను మోహరిస్తూనే, మరోవైపు ప్రైవేట్ హంతక ముఠాలను తయారు చేయడం మొదలుపెట్టింది. మొదట 1990లో బీజాపూర్ బ్లాక్‌లో ‘‘జన్ జాగరణ్ అభియాన్’’ పేరిట కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో మొదలుపెట్టింది. జన్ జాగరణ్ అభియాన్ ముఖ్యమైన పని, మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు తీయడం, సంఘ కార్యకర్తలను బెదిరించి వందల సంఖ్యలో దొంగ లొంగుబాట్లు చూపించడం. అంతేకాదు గ్రామాలకు పోయి మావోయిస్టుల మాదిరిగా తిరుగుతూ పజలకు లాల్ సలాం చెప్పి ప్రతిగా లాల్ సలాం చెప్పేవాళ్ళను చిత్రహింసలు పెట్టి చంపిన సందర్భాలు లెక్కలేనన్ని. ఎంతోమంది ఆదివాసీ స్త్రీలను అత్యాచారం చేశారు. కొందరు ఆదివాసులు, వాళ్ళు పెట్టే హింసలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన సంస్థను ఒక సందర్భంలో స్థానిక సీపీఐ పార్టీ కూడా సమర్ధించింది. ప్రారంభంలో దాని కొన్ని కార్యక్రమాలలో పాలుపంచుకుంది. కానీ 1992లో బాసగుడలో తమ కార్యకర్తను మావోయిస్టు పార్టీ శిక్షించడంతో తాము చేసిన తప్పు ఏంటో ఆ పార్టీ తెలుసుకుంది. కానీ, అప్పటికే ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయి వాళ్ళను దూరం పెట్టేశారు.
జన్ జాగరణ్ అభియాన్‌కు రాజ్యంతో పాటుగా పూర్తి సహకారం అందించింది గుమర్గుండలో ఉన్న శివానంద ఆశ్రమం మరియు బాబా బిహారి దాస్ భక్తులు. ఈ భక్తులు ఆదివాసులను శాఖాహారులుగా మార్చి హిందూమతంలోకి చేర్చుకోవడమే పనిగా పనిచేశారు. వాళ్ళు పెట్టే ఒత్తిడికి ప్రతీకారంగా మతమార్పిడికి అంగీకరించని కొందరు ఆదివాసులు బాబా అనుచరుల చేత బలవంతంగా బీఫ్ తినిపించేవాళ్ళు. ఈ పని మావోయిస్టులే చేయిస్తున్నారని రాజ్యం, హిందూ సంస్థలు ప్రచారం చేశాయి. కానీ నందిని సుందర్ పరిశోధన ప్రకారం మావోయిస్టులకు ఆ చర్యలతో సంబంధం లేదు. పైగా మావోయిస్టులు గ్రామాలలో ప్రజల మధ్య చెడిపోయిన సంబంధాలను పునర్నిర్మాణం చేసి సంఘటిత పరిచారు.
జన్ జాగరణ్ అభియాన్ రెండవ దశను 1998లో బైరాంఘర్ బ్లాక్‌కు విస్తరించారు. ఈ దశలో హిందూ సంస్థలతో పాటుగా కొన్ని ‘‘స్వచ్ఛంద సంస్థలు’’ (బస్తర్ బంధు, జన్ వాది ముక్తి మోర్చా) కూడా మావోయిస్టు వ్యతిరేక సమావేశాలకు ప్రజలను తరలించేవి. రాజ్యం జన్ జాగరణ్ అభియాన్ కార్యక్రమాలను ఆపివేసి మరో దుర్మార్గ మార్గం ఎంచుకోగానే ఈ సంస్థలు కూడా మూతపడిపోయాయి. జన్ జాగరణ్ అభియాన్ తర్వాత 2005లో సల్వాజుడుం వచ్చింది. ఆరెస్సెస్ లీడర్ బాల్ ఆప్టే సల్వాజుడుం అధికార ప్రారంభ దినం జూన్ 5 చాలా పవిత్ర దినమని ప్రకటించాడు. ఎందుకంటే అది గోల్వాకర్ వర్థంతి రోజు కాబట్టి.
సల్వాజుడుం అనే పేరే దుర్మార్గమైనది. గోండి భాషలో సల్వా అంటే శుద్ధి చేయడం, జుడుం అంటే వేట. సల్వాజుడుం అంటే ‘‘శుద్ధిచేయడం కోసం వేట’’. ఎవరు మైల పడ్డారు? ఎవరు శుద్ధి చేస్తారు? దేని కోసం వేట? సల్వాజుడుంను రమణ్ సింగ్ ఒక ‘‘పవిత్ర యుద్ధమని’’, మావోయిస్టులను ఎదుర్కొనడానికి ఆదివాసులు ‘‘స్వచ్ఛందంగా’’ ఏర్పాటు చేసుకున్న ‘‘శాంతియుత గాంధేయవాద
ఉద్యమం’’ అని పదే పదే చెప్పినప్పటికీ, వాస్తవంలో దాని ఆధారంగా రాజ్యం తన దాడిని ఉధృతం చేసి గ్రామాలను తగులబెడుతూ, జీవనోపాధులను కొల్లగొడుతూ, స్త్రీలపై లైంగిక అత్యాచారాలు చేస్తూ, లెక్కలేనంత హింసను కొనసాగించారు. జన్ జాగరణ్ అభియాన్ కొన్ని టార్గెట్ చేసుకున్న ఇళ్ళను మాత్రమే కాల్చేస్తే, సల్వాజుడుం మాత్రం మొత్తం గ్రామాలనే తగులబెట్టేది. ఇదంతా అక్కడున్న ప్రజలను విస్థాపితులను చేసి వాళ్ళ వనరులను బహుళజాతి మైనింగ్ సంస్థలకు అప్పచెప్పడానికి చేసిన దుర్మార్గం. కానీ కొన్ని వర్గాల మీడియా మరియు మధ్యతరగతి మాత్రం ఆదివాసులను ‘‘నాగరీకరించడానికి’’, వాళ్ళ జీవితాలలో ‘‘వెలుగులు’’ నింపడానికి వాళ్ళను అడవి నుండి బయటకు తీసుకొని రావడమే సరైన మార్గమని రాజ్యానికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది అమానవీయం. 2007లో నందిని సుందర్, రామచంద్రగుహ మరియు ఈఎస్ శర్మ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ వల్ల 2011 జులై 5న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ రాజ్యాంగ వ్యతిరేక సల్వాజుడుం చెల్లదని తీర్పు ఇచ్చారు. కానీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సల్వాజుడుం కార్యకర్తలను స్పెషల్ పోలీస్ అధికారులుగా నియమించి, వాళ్ళ హింసను చట్టబద్ధతను కల్పించిందని నందినీ సుందర్ అంటారు.
సల్వాజుడుం ప్రధానమైన పని… గ్రామాల మీద పడి తగలబెట్టి, ప్రతిఘటిస్తే చంపేసి, మిగిలిన వాళ్ళను ‘‘రిలీఫ్ క్యాంపు’’లలో చేర్చడం. ఇదే ఆదివాసులను ‘‘నాగరికులను’’ చేసే నమూనా! ఇదేమీ భారత పాలకులు కొత్తగా కనిపెట్టింది కాదు. బ్రిటిష్ వాడు మలేషియాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి ‘‘కొత్త గ్రామాల’’ పేరిట ప్రజలను తమ తమ గ్రామాల నుండి వేరుచేసి కొత్త క్యాంపులను కట్టి వాటిలో ప్రజలను ఉంచి వాళ్ళను విప్లవ పార్టీలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. అదే నమూనాను అమెరికన్ సామ్రాజ్యవాదం వియత్నాంలో ఉపయోగించింది. దాన్ని వ్యూహాత్మక కుగ్రామ ప్రోగ్రాంగా (Strategic Hamlet Program) 1960`63 కాలంలో ఉపయోగించి, విఫలమై ఆపివేశారు. ఇవే పద్ధతులను లాటిన్ అమెరికాలో అనేక ఉద్యమాల అణచివేతకు అక్కడి రాజ్యాలు అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ప్రయోగించాయి. దండకారణ్యంలో మొత్తంగా భారత రాజ్యం చేస్తున్నది కూడా అలాంటి ప్రయత్నమే. కానీ ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. 2006లో ఎర్రబోర్ క్యాంప్ మీద దాడిచేసి తమ ప్రజలను విడిపించుకుపోయారు.
బస్తర్‌లో రాజ్యం చేస్తున్న యుద్ధంలో ఆదివాసీ మహిళలు అతి క్రూరమైన హింసకు గురవుతున్నారు. నందిని సుందర్ ఎంతోమంది మహిళలతో సంభాషించి వాళ్ళ గొంతుకను బయటి ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేశారు. అక్కడ లైంగిక అత్యాచారాలు నిత్యకృత్యం. గ్రామాల మీద దాడిచేసిన ప్రతి సందర్భంలోనూ సల్వాజుడుం మరియు సీఆర్పీఎఫ్ బలగాలు అత్యాచారం చేయకుండా పోయిన సందర్భాలు లేవంటారు. అక్కడ వయస్సుతో సంబంధం లేదు. పదేండ్ల నుండి అరవై ఏండ్ల వరకు స్త్రీలు ఎవ్వరు దొరికినా వాళ్ళు వదలరు. 2008లో వెంగైపాడు గ్రామంలో ఒక అమ్మాయి అనారోగ్యానికి గురైతే, తోడుగా మరో అమ్మాయిని ఉంచి పెద్ద వాళ్ళు పొలం పనులకు వెళ్ళారు. అంతలోనే పోలీసు బలగాలు, సల్వాజుడుం మూకలు గ్రామంపై దాడిచేసి అన్ని ఇళ్ళను వెదుకుతూ ఆ అమ్మాయిలు ఉన్న ఇంటికి వచ్చి, ఇద్దరినీ సామూహిక అత్యాచారం చేసి, వాళ్ళను తమతో పాటు తీసుకువెళ్ళి జుట్టు కత్తిరించి, యూనిఫాం వేసి, ఫోటో తీసి ‘‘నక్సలైట్లు’’గా మార్చేశారు. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు వాళ్ళను విడిపించుకోవడానికి ఒక సీనియర్ లాయర్‌కు పదివేల రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ‘‘నక్సలైట్ల’’కు ఇంకా బెయిల్ దొరకలేదు.
క్యాంపులలో కూడా అత్యచారాలు ఆగడం లేదు. ఆదివాసీ స్త్రీలను లైంగిక బానిసలు (sex slaves) గా వాడుకుంటున్నారని నందినీ సుందర్ అనేక సంఘటనలు వివరించారు. ఒక స్త్రీ మూడు`నాలుగు నెలల గర్భవతి. ఆమె తన తల్లిదండ్రులను చూడడానికి పుట్టింటికి వచ్చింది. ఒకరోజు ఉదయం 9`10 గంటల ప్రాంతంలో సల్వాజుడుం మరియు పోలీసు బలగాలు ఊరిమీద దాడిచేశాయి. ఆ సమయంలో ఆమె నిద్రపోతోంది. ఆ కిరాయి మూకలు రావడంతోనే ఆమె తల్లిదండ్రులను కొట్టడం మొదలుపెట్టారు. తర్వాత ఆమెను కూడా బయటకు లాగి రోడ్డుమీదికి తీసుకువచ్చారు. అక్కడ మరికొంతమందితో కలిపి జగర్ గుడ క్యాంపుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఒక వారం ఉంచి ప్రతి రాత్రి అత్యాచారం చేసేవారు. బట్టలన్నీ చిరిగిపోయాయి, తిండి సరిగ్గా లేక నీరసించిపోయేది. వారం తరువాత శరీరం దాచుకోవడానికి చిన్న బట్ట ముక్క ఇచ్చారు. అక్కడ చిత్రహింసలు పెట్టిన తర్వాత, చింతల్నార్ పోలీసులకు అప్పజెప్పారు. ఆ పోలీసులు ‘‘దయ తలచి’’ వాళ్ళను చంపకుండా వదిలేస్తున్నందుకని మనిషికి పదిహేను వందల చొప్పున తీసుకున్నారు.
పిల్లల ముందు తల్లులు, తల్లిదండ్రుల ముందు పిల్లలు, భర్తల ముందు భార్యలను అత్యాచారం చేసి అది ‘‘మావోయిస్టులకు సహకరిస్తున్నందుకు ఒక గుణపాఠం’’ అని చెప్పే సందర్భాలు ఎన్నో. వీటికి తోడు జైళ్ళలో అక్రమంగా నిర్బంధించడం, ఊర్లకు ఊర్లనే ఖాళీ చేయించడం చేస్తున్నారు. మావోయిస్టులు చేసే ప్రతి ప్రతిఘటన చర్యలో కొందరిమీద కేసు నమోదు చేసి, వారితో పాటుగా ‘‘తెలియని ఇతరులు’’ (బఅసఅశీషఅ శ్‌ీష్ట్రవతీం)గా కేసు నమోదు చేస్తారు. ఆ ‘‘తెలియని ఇతరులు’’ ఎవరైనా, ఎప్పుడైనా కావచ్చు. ఈ పద్ధతుల వల్ల రాష్ట్రంలోని జైళ్ళన్నీ ఆదివాసీ ఖైదీలతో నిండిపోయాయి. ఒక ఖైదీ నందిని సుందర్‌తో చెప్పినట్లుగా ‘‘పడుకున్నాక పక్కకు తిరగాలంటే, ఆ మనిషి పూర్తిగా లేచి మరో పక్కకు తిరగాలి’’. అక్కడి జైళ్ళ పరిస్థితికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల వల్లనే ఆదివాసీలు/మావోయిస్టులు 2007 డిసెంబరులో దంతెవాడ జైలు గోడలు బద్దలు కొట్టుకొని 350 మంది ఖైదీలు బయటపడ్డారు.
ఇక క్యాంపులలో ఆదివాసుల జీవితాలు చాలా దుర్భరం. స్వేచ్ఛగా అడవిలో తిరిగే వాళ్ళను పట్టుకొచ్చి క్యాంపుల్లో నిర్బంధిస్తే వాళ్ళ మానసిక పరిస్థితి కోలుకోలేని స్థాయిలో దెబ్బతింటుంది. సరైన ఆహారం ఉండదు, కనీస వసతులు ఉండవు, మనుషులుగా విలువ లేదు. ఇలాంటి పరిస్థితులలో క్యాంపులలో పిల్లలపై 2007లో ఐక్యరాజ్యసమితి సంస్థ యునిసెఫ్ ఒక డాక్యుమెంటరీ తీసి రాజ్య హింస గురించి మాట్లాడకుండా ఆ పిల్లలందరూ ‘‘నక్సలైట్ తీవ్రవాదుల హింసకు గుర్తులు’’ అని నిస్సిగ్గుగా ప్రచారం చేశారు. ఇదిలా ఉండగా, హిందూ మతోన్మాద శక్తులు (గాయత్రి పరివార్ వంటి సంస్థలు) క్యాంపుల్లో జొరబడి ఆదివాసులను హిందువులుగా మార్చే కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే నాగ, మిజో బెటాలియన్ల ఆధ్యాత్మిక అవసరాల కోసం వచ్చే క్రైస్తవ పాస్టర్లు ఎర్రబోర్, ఇంజరం క్యాంపులలో దాదాపు వందమందిని క్రైస్తవులుగా మార్చారు. క్యాంపులలో బాధలు భరించలేని కొందరు తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. వాళ్ళను మావోయిస్టు పార్టీ స్వాగతిస్తుందని, వారికి కావలసిన సహాయాన్ని తమ సంఘాల ద్వారా అందచేస్తుందని నందిని సుందర్ ఎన్నో సంఘటనల ఆధారంగా వివరించారు.
బలగాల వసతుల కోసం, గాలింపుల కోసం, క్యాంపుల కోసం రాజ్యం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అందులోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయని నందిని సుందర్ అనేక వివరాలను తన పుస్తకంలో చర్చించారు. మొత్తం బస్తర్‌లో పెద్ద పెద్ద హైవే రోడ్లు తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. రోడ్లు గాలింపుల కోసం, వాళ్ళ అవసరాల కోసం వేసుకున్నవే. ఎందుకంటే అక్కడ ఒక్క శాతం జనాభాకి కూడా కనీసం సైకిళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు రోడ్లతో పనేముంటుంది? పిల్లల బడులు బలగాల వసతి గృహాలయ్యాయి. విద్య, ఆరోగ్యం ప్రభుత్వ ప్రధాన అజెండాలోనే లేవు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి నందిని సుందర్‌తో మాట్లాడుతూ అన్న మాటలను ఆమె ఇందులో ప్రస్తావిస్తుంది. ‘‘ఇక్కడి పిల్లలకు రసాయన శాస్త్రం చెప్తే వాళ్ళు పోయి బాంబులు తయారుచేస్తారు’’ అని చెప్పాడట ఆయన. మరిప్పుడు వాళ్ళు ఆ సైన్స్ విద్య లేకుండానే బాంబులు చేస్తున్నారు కదా!
దీనికి తోడు ఆదివాసులు అమాయకులని, వాళ్ళను మావోయిస్టులు బ్రెయిన్ వాష్ చేసి తమలో కలుపుకుంటున్నారని అదే పనిగా ప్రచారం చేసే అనేక పాలకవర్గ బృందాలు ఒకవైపు, రాజ్యం, మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారని (శాండ్ విచ్ సిద్ధాంతం చెప్పే) ఉదారవాదులు మరోవైపు గందరగోళం సృష్టిస్తున్నారు. కానీ విప్లవ రాజకీయ ఆచరణలో భాగంగా ఆదివాసులు, మావోయిస్టులు ‘‘వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా’’ రూపాంతరం చెందిన చారిత్రక క్రమాన్ని నందిని సుందర్ స్పష్టంగా వివరించారు.
1980లో మొదటి మావోయిస్టు సాయుధ దళాలు గోదావరి దాటి ఆదివాసి జీవితంలోకి ప్రవేశించనప్పటి నుంచీ వాళ్ళతో మమేకమైన ఎన్నో విషయాలను ఆదివాసీలతో, మావోయిస్టులతో జరిపిన అనేక సంభాషణలు ప్రస్తావిస్తూ ఆమె వివరించారు. అంతేకాదు, తొలితరం విప్లవకారులు పడిన కష్టాలు కూడా డాక్యుమెంట్ చేశారు. అతి పరిమిత వనరులతో వాళ్ళు ప్రజలతో ఎలా కలిసి పనిచేశారో ఎన్నో ఉదాహరణలను ఈ పుస్తకంలో వివరించారు. ఒక ఉదాహరణ: తొలి దళాలు రాళ్ళ మయంగా ఉండే కరెగుట్ట కొండ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు దళసభ్యుల చెప్పులు వారానికే తెగిపోయి అవి మార్చుకోవాల్సి వచ్చేదట. దానివల్ల వారానికి ఒక్కో సభ్యునికి 100`150 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదట. ఆ ఖర్చు తగ్గించుకోవడం కోసం చెప్పులు లేకుండానే నడవడం మొదలుపెట్టారట. వాళ్ళు తమ కళ్ళముందే ఎంత శ్రమ పడ్డారో చూసిన ఆదివాసులు వాళ్ళను అంత నమ్మకంగా తమ జీవితాల్లోకి ఆహ్వానించారు. ఇక అప్పటినుంచి మావోయిస్టుల ఆధ్వర్యంలో భూములు చదును చేసుకోవడం, సహకార వ్యవసాయం చేయడం, చెరువుల నిర్మాణం, విత్తన మరియు ధాన్య బ్యాంకులు ఏర్పాటు చేయడం, విడివిడిగా బ్రతికేవాళ్ళు సంఘాలుగా ఏకం కావడం, మూఢనమ్మకాలను కొద్దికొద్దిగా వదులుకోవడం మొదలయ్యాయి. పాత అధికార నిర్మాణాలను (pargana majhis) కూలగొట్టి వాటి స్థానంలో ప్రజా పరిపాలనా విభాగాలు నిర్మించుకున్నారు. మొత్తంగా ఆదివాసీ సమాజ చలనంలో గుణాత్మకైన మార్పులు చోటుచేసుకోసాగాయి.
మావోయిస్టులు ఆదివాసులను సంఘటితం చేయడం, ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మాణం వైపు నడిపించడమే కాదు, వాటిని కాపాడుకోవడం కోసం, వాళ్ళను ఏ విధంగా సాయుధం చేస్తున్నారో కూడా నందిని సుందర్ ఈ పుస్తకంలో వివరించారు. ప్రజా సైన్య నిర్మాణం గురించి చెబుతూ, అందులో 40 శాతం మహిళా కార్యకర్తలు ఎందుకు ఉన్నారో విశ్లేషించారు. బయట ప్రచారంలో ఉన్నట్లు మావోయిస్టులు తమ పార్టీలోకి ఎవ్వరినీ కూడా బలవతంగా చేర్చుకోవడం అనేది లేదని, ఆదివాసులే క్రూరమైన రాజ్యహింస సందర్భంలో పార్టీలో చేరడానికి వెళ్తున్నారని ఆమె తన పరిశీలనను వివరించారు. పిల్లలు సైతం బాల సంఘాలలో పనిచేయడాన్ని ఎంతో గర్వంగా చెబుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలను ‘‘వాళ్ళు పార్టీ బిడ్డలే’’ అని ఆనందంగా చెప్పుకుంటున్నారని ఒక తల్లి చెప్పిన విషయాన్ని
ఉదహరించారు. మావోయిస్టులు చేపట్టిన అనేక రాజకీయ కార్యక్రమాల ద్వారా ఆదివాసీలకు వాళ్ళమీద వాళ్ళకు ఎంతో విశ్వాసం పెరిగిందని నందిని సుందర్ బస్తర్‌లో తన 30 సంవత్సరాల పరిశోధనా పరిశీలన నుండి సాధికారికంగా ప్రకటించారు. ‘‘ఒకప్పుడు కొత్తవాళ్ళను చూసి తప్పించుకునే చూపులు చూసే ఆదివాసులు, ఇప్పుడు మావోయిస్టు రాజ్య పౌరులుగా ఎదుటి మనిషి కళ్ళలోకి చూసి కరచాలనం చేయగలరు, అంతేకాదు, మావోయిస్టుల వల్ల ఇప్పుడు భారతదేశమంతా బస్తర్‌లో అద్భుతమైన ధైర్యసాహసాలు చేయగల మనుషులు ఉన్నారనే విషయం తెలియవస్తుంది. అందుకు మావోయిస్టులకు కృతజ్ఞతలు చెప్పాలి’’ అని నందిని సుందర్ అంటారు. అయితే, బస్తర్ పరిస్థితులపై బయటి ప్రపంచానికి చెప్పడానికి వెళ్ళే పరిశోధకుల మీద, రిపోర్టర్ల మీద, పౌర హక్కుల సంఘాల మీద కూడా ఆంక్షలు, దాడులు జరుగుతున్నాయి. స్వామి అగ్నివేష్ మీద జరిగిన దాడి, బినాయక్ సేన్‌పై కుట్ర కేసు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆ సంఘటనలకు సంబంధించిన వివరాలను నందిని ఇందులో వివరించారు.
రాజ్య హింసకు సంబంధించిన అనేక విషయాలను ఎంతో లోతుగా విశ్లేషించిన నందిని సుందర్ చివరగా విప్లవ హింసను, ప్రజా కోర్టులలో శిక్షల అమలు తీరును గురించి బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలనే మళ్ళీ మావోయిస్టు పార్టీకి వేస్తుంది. ప్రజల ప్రయోజనాలతో సంబంధంలేని రాజ్యాన్ని, ప్రజలే భాగస్వాములైన విప్లవ పార్టీని ఒకే గాటన కట్టి చూడటం సరైన అవగాహన కాదు. ‘‘మావోయిస్టులు లేకపోతే ఆదివాసుల జీవితాలను మైనింగ్ కార్పొరేషన్లు ఆక్రమించుకునేవిÑ వాళ్ళు ఉండడం వల్ల పోలీసు బలగాలు, సల్వాజుడుం వాళ్ళ బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. రెండు విధాలుగా ఆదివాసులకు ఒరిగింది ఏమీ లేదు’’ అని ముగిస్తుంది. నందిని సుందర్ ఆదివాసుల గొంతుకగా మాట్లాడినప్పటికీ వాళ్ళను మధ్యలో నలిగిపోయే అమాయక జీవులుగా చూడడం, వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని కించపరచడమే. తానే చెప్పినట్లు ఆదివాసులు పరివర్తన చెందుతున్నారు, ఒక సామాజిక పరివర్తనలో భాగమవుతున్నారు.
మావోయిస్టు పార్టీ ఎన్నికలను బహిష్కరించడం నందిని సుందర్ దృష్టిలో ఒక తప్పుడు ఎత్తుగడ. పాలక వర్గాలపై ప్రజలలోని కోపాన్ని, అసహనాన్ని రాజకీయ ముఖచిత్రం మీదికి తీసుకుని రావడం వల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తుంది. అదే సందర్భంలో రివిజనిస్టులు, అవకాశవాద ఉదారవాదులు ఎప్పుడూ చెప్పే విషయాన్నే మళ్ళీ లెనిన్ రాసిన “Left-Wing Communism, An Infantile Disorder” నుండి కోట్ చేసి బూర్జువా పార్లమెంట్ వ్యవస్థలోకి విప్లవకారులు ఎందుకు వెళ్ళాలో చెప్తుంది.
కానీ లెనిన్ చెప్పిన ఆ విషయానికి ఒక ప్రత్యేక చారిత్రక సందర్భం ఉందనే విషయాన్ని, రివిజనిస్టుల మాదిరిగానే నందిని సుందర్ కూడా మర్చిపోయింది. అంతేకాకుండా లెనిన్‌ను చాలా సెలక్టివ్‌గా చదవడంతో మిగిలిన రచనల్లో తాను బూర్జువా రాజ్యానికి, విప్లవానికి ఉండే సంబంధం గురించి చేసిన విశ్లేషణలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఎన్నికల విషయంలో నందిని సుందర్ గందరగోళానికి గురయ్యారు. ఎన్నికలు బహిష్కరించడం వల్ల సీపీఐ వంటి పార్టీలకు నష్టం జరుగుతుందని, దానివల్ల చట్టసభల్లో ఉండే కొద్దిపాటి ప్రజా గొంతుకలు కూడా మూగబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారామె. కానీ అసలు చర్చ చేయాల్సింది బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు రూపం మీద, దానికీ, దోపిడీదారులకూ ఉండే సంబంధం మీద. అంతేకానీ ఎన్నికల మీద కాదు. ఎందుకంటే బూర్జువా ఎన్నికల ద్వారా అధికారం పాలకవర్గాల చేతులు మారుతుందే తప్ప, అధికారమే చెలాయించలేని సమాజం రాదు. ఎన్నికలు ఒక ఊబి నేలని (quagmire) భారత పార్లమెంటరీ కమ్యూనిస్టులు, పక్కనే ఉన్న నేపాల్ మావోయిస్టులు పూర్తిగా నిరూపించారు.
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మిగిలింది అసాధ్యమైన సాయుధ విప్లవం లేక మనసును గడ్డ కట్టించే రాజ్యహింస అనే రెండు ఎంపికలు మాత్రమే’’ అని నందిని సుందర్ తీవ్ర నిరాశావాదాన్ని ప్రకటిస్తుంది. కానీ తన చివరి మాటను తాను కంటోన్న ఒక కలతో ముగిస్తుంది. పారామిలటరీ క్యాంపులు లేని బస్తర్, గాయాల మచ్చలను కప్పేస్తూ దట్టంగా పెరిగే పచ్చని అడవి, ప్రభుత్వాలు మారి నరహంతకులందరినీ జైళ్ళలో పెట్టే రోజు, కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చి ప్రజలందరూ వాళ్ళకు కావాల్సిన అభివృద్ధిని నిర్ణయించుకునే సమయం. బస్తర్ గనులలో వచ్చే రాయల్టీలన్నీ అక్కడి ఆదివాసీలకు దక్కే సందర్భం. విద్యా, ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాల ప్రథమ విషయమై అమలయ్యే రోజులు… ఇలా చాలా పెద్ద కోరికల జాబితా చెబుతుంది. కానీ ఇవేవీ కూడా బూర్జువా ప్రజాస్వామ్యంలో సాధ్యం కావని నందిని సుందర్ అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఇక్కడే మళ్ళీ లెనిన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి: »»…the liberation of the oppressed class is impossible not only without a violent revolution, but also without the destruction of the apparatus of the state power, which was created by the ruling class…” (State and Revolution)
చివరగా, వియత్నాంను గుండెల్లో పెట్టుకున్న ఆ ఆదివాసి మాదిరిగా మనం కూడా రాజ్యంతో పోరాడుతున్న ఆదివాసులను మన గుండెల్లో పెట్టుకుందాం, సంఫీుభావాన్ని ప్రకటిద్దాం, వాళ్ళకు అండగా కనీసం అక్షరమై నిలబడుదాం.
(The Burning Forest: India’s War in Bastar ఆధారంగా రాసిన ఈ వ్యాసం అరుణతార ఫిబ్రవరి 2018 సంచికలో ప్రచురితమయ్యింది.)