హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత
ఆ మాట పురుషులు ఎప్పుడు అంటారంటే, వాళ్ళు చెయ్యకూడని పనులు ఆపేసినప్పుడు. వాళ్ళ స్నేహితులకి, తమ మగతనాన్ని నిరూపించుకుంటూ, ముద్దుగా ఇలా చెప్పుకుంటారు. ‘‘మా ఆవిడ ప్రతి రాత్రి క్లబ్బుకెళ్ళకూడదని అంటోందోయ్‌. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని వీకెండ్‌లోనే వెళ్తానని ప్రామిస్‌ చేశాను’’.

అదే ఆడవాళ్ళు ఇంట్లో ప్రశాంతత కోసం వదిలేసేవి ఏమిటి? ఉద్యోగాలు, ఆశయాలు, కలలు, కెరీర్‌.
వివాహ సంబంధాల్లో ఆడవాళ్ళే ఎక్కువ రాజీ పడాల్సి వస్తుందని వాళ్ళకి మనం నేర్పిస్తాం.
అమ్మాయిలకి ఒకరితో ఒకరు పోటీ పడటం నేర్పిస్తాం. ఆ పోటీ ఉద్యోగాల కోసమో, ఆశయ సిద్ధి కోసమో అయితే బానే
ఉంటుంది. కానీ ఆ పోటీ అంతా మగవాళ్ళని ఆకర్షించటం కోసం.
ఆడపిల్లలని మగపిల్లల్లాగా సహజమయిన లైంగిక వాంఛలు కలిగిన వారిలాగా పెంచి పెద్ద చెయ్యం. మనకి కొడుకులుంటే, వాళ్ళ గర్ల్‌ ఫ్రెండ్స్‌ గురించి తెలుసుకోవటానికి ఉత్సుకతతో ఉంటాం. కూతురుంటే, బాయ్‌ ఫ్రెండా, అమ్మో? ఇంకేమన్నా ఉందా? (అయితే సమయం వచ్చినపుడు, ఆ కూతురే సరయిన మొగుడవ్వగలిగే లక్షణాలున్న అబ్బాయిని ఇంటికి తేవాలని కూడా ఆశిస్తాం.)
అమ్మాయిలపై పూర్తి నిఘా పెడతాం, వాళ్ళ కన్యాత్వాన్ని పొగుడుతాం. అబ్బాయిల కన్యాత్వాన్ని పొగడం. (ఇదెలా సాధ్యమవుతుందో నాకెప్పుడూ అర్థం కాదు. కన్యాత్వం పోగొట్టుకోవటానికి ఇద్దరు మనుషులు కావాలి. వాళ్ళు సాధారణంగా భిన్న జెండర్ల వాళ్ళు అయి
ఉంటారు. అబ్బాయిలు కన్యాత్వాన్ని పోగొట్టుకుని, అమ్మాయిలు పోగొట్టుకోకుండా ఉండటం ఎలా సాధ్యం?)
ఈ మధ్యనే ఒక యువతి నైజీరియాలోని ఒక విశ్వవిద్యాలయంలో సామూహిక అత్యాచారానికి గురైంది. దానికి అనేకమంది యువ నైజీరియన్లు… అబ్బాయిలు, అమ్మాయిలు కూడా… స్పందన ఏంటంటే ‘‘అత్యాచారం తప్పే. కానీ ఆ అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఉన్న రూంలో ఏం చేస్తోంది?’’ అని.
ఆ స్పందనలో ఉన్న దుర్మార్గాన్ని కొంతసేపు, వీలయితే పక్కన పెడదాం. స్త్రీలే అన్నిటికీ బాధ్యత వహించాలి అనే సంస్కృతిలో పెరిగారు ఈ నైజీరియన్లు. వాళ్ళకి మగవాళ్ళు ఏ స్వయం నియంత్రణ లేకుండా పశువుల్లా ప్రవర్తించటం మాత్రం ప్రశ్నించదగినదిగా కనిపించదు.
మనం అమ్మాయిలకి అన్నింటికీ అవమానపడాలని నేర్పిస్తాం. కాళ్ళు దగ్గరికి పెట్టుకో, ఒళ్ళు కన్పించకుండా బట్టలు వేసుకో అంటూ అనేక రకాలుగా తమ శరీరం గురించి అవమానపడటం నేర్పిస్తాం. ఆడవాళ్ళుగా పుట్టటమే ఒక దోషమనే భావన కల్పిస్తాం. దీంతో అమ్మాయిలు పెరిగి పెద్దయిన తర్వాత తమ మనసులోని భావనలు, కోరికల గురించి తామే బయటికి చెప్పుకోలేని స్త్రీలుగా తయారువుతారు. తమ నోరు తామే నొక్కేసుకుంటారు. తాము నిజంగా ఏమనుకుంటున్నారో బయటికి చెప్పలేరు. నిజ జీవితంలో నటించటం మొదలుపెట్టి ఆ నటనలో అవార్డులు అందుకునే స్థాయికి చేరిపోతారు.
ఇంటి పనిని ద్వేషించిన ఒక యువతి నాకు తెలుసు. కానీ అదంటే తనకెంతో ఇష్టమని ఆమె నటిస్తూ ఉండేది. ఎందుకంటే ఇంటిపనిని ఇష్టపడడం, ఒక మంచి భార్య అయ్యే ‘హోమ్లీ’ అమ్మాయికుండాల్సిన లక్షణం కాబట్టి. ఈ లోపల ఆ అమ్మాయికి పెళ్ళయింది. కొద్దిరోజుల్లోనే అత్తవారి కుటుంబం ‘ఈ అమ్మాయి మారిపోయింది, మునుపటిలా లేదు’ అని ఫిర్యాదు చేయటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఏమీ మారలేదు. ఇంటిపని ఇష్టమని నటించటం మానేసిందంతే.
జెండర్‌ చట్రంతో సమస్య ఏమిటంటే, మన వ్యక్తిగత ప్రత్యేకతలు ఏమిటో గుర్తించకుండా మనకున్న ఒక్క లక్షణాన్ని బట్టి మనమెట్లా ఉండాలో నిర్దేశిస్తుంది. ఆడవాళ్ళు ఇలా ఉండాలి, మగవాళ్ళు ఇలా ఉండాలి అన్న ఈ రకమయిన అంచనాలు లేకుంటే మనమందరం ఇంకెంత స్వేచ్ఛగా, సంతోషంగా ఉండగలమో ఒకసారి ఊహించండి!
… … …
జీవశాస్త్ర పరంగా అమ్మాయిలు, అబ్బాయిలు భిన్నమైన వాళ్ళే కానీ సమాజం వారిని పెంచే విధానంలో, సాంఘికీకరణలో, ఆ భిన్నత్వాన్ని బాగా పెంచుతుంది, ఆ బిన్నత్వం జీవితాంతం కొనసాగేలా చేస్తుంది. వంట చేయడాన్నే తీసుకోండి. ప్రస్తుతం, మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ వంట, ఇంటి పని చేయడం సర్వసాధారణం. కానీ, ఎందుకలా అవుతోంది? వాళ్ళేమన్నా ప్రత్యేకంగా వంట జీన్స్‌తో పుడతారా? లేక కొన్ని తరాలుగా వంట వారి పనే అని పదే పదే చెప్పటం వల్ల వంట చెయ్యటం తమ సహజసిద్ధమైన పాత్రగా తీసుకుంటున్నారా? ఆడవాళ్ళు వంట జీన్స్‌తో పుట్టారని చెప్పబోయాను గానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన వంట చేసే వాళ్ళలో… షెఫ్‌ అంటారు వీళ్ళని, ఎక్కువ మంది మగవాళ్ళేనని గుర్తుకొచ్చింది.
మా అమ్మమ్మని చూసినప్పుడల్లా ఆమె చాలా తెలివిగల మనిషి, ఈమెకి తన తరం మగవాళ్ళతో సమానంగా అవకాశాలు ఇచ్చి ఉంటే ఏమై ఉండేదోనని అనుకుంటూ ఉండేదాన్ని. ఈ తరం ఆడవాళ్ళకి ఆ తరంకన్నా కొంత ఎక్కువ అవకాశాలే ఉన్నాయి, విధానాల్లో, చట్టాల్లో మార్పుల వల్ల. ఇవి చాలా ముఖ్యం.
కానీ వాటికన్నా ముఖ్యమైనది మన ఆలోచనా రీతి, మన మైండ్‌సెట్‌.
నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఇద్దరికీ ఒక సంవత్సరమే తేడా. ఇద్దరూ బాగా చదువుతారు, అద్భుతమైన తెలివితేటలున్నాయి. కానీ ఆ అబ్బాయికి ఆకలి వేసినప్పుడు, తల్లిదండ్రులు ఆ అమ్మాయితో ‘‘వెళ్ళి, మీ అన్న కోసం ఇండోమి నూడుల్స్‌ చేసి తీసుకురా’’ అని చెప్తారు. ఆ అమ్మాయికి ఇండోమి నూడుల్స్‌ తయారు చేయడం ఇష్టం లేదు. కానీ అమ్మాయి కాబట్టి చేసి తీరాల్సిందే. అదే ఆ తల్లిదండ్రులు మొదటి నుండి పిల్లలిద్దరికీ వండుకోవడం నేర్పిస్తే ఎంత బాగుంటుంది? వంట చెయ్యటం ప్రతి అబ్బాయికి అవసరమయిన, రోజూ పనికొచ్చే నైపుణ్యం. అసలు నాకు ఎప్పుడూ అర్థం కాని విషయం ఏంటంటే, మనల్ని మనం పోషించుకునే సామర్ధ్యం వేరే వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టాలి?
నాకు తెలిసినామె, ఆమె భర్త ఇద్దరూ ఒకే డిగ్రీ చదివి, ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఆఫీసు నుండి ఇంటికి రాగానే, ఇంటి పనంతా ఆమే చేస్తుంది. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. కానీ, భర్త ఎప్పుడయినా పాప డైపర్‌ మారిస్తే, ఆవిడ అతనికి థాంక్స్‌ చెప్తుంది. అది తండ్రిగా అతని బాధ్యత కాబట్టి దాన్ని మామూలు పనిగా ఆమె తీసుకోగలిగితే బాగుంటుంది కదూ!
… … …
నేను పెరిగి పెద్దయ్యేటప్పుడు నేర్చుకున్న జెండర్‌ పాఠాలని మర్చిపోవడానికి ఇప్పటికీ నేను కష్టపడుతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా అప్పుడప్పుడూ స్త్రీగా నా నుండి సమాజం ఆశించేది చెయ్యకుండా ఉండలేను. మొదటిసారి రచనా వ్యాసంగంపై వర్క్‌ షాప్‌ నిర్వహించినపుడు కొంత ఆందోళనకు గురయ్యాను. బోధన కోసం ఏ వ్యాసాలు, రచనలు ఉపయోగించాలి అన్న విషయం గురించి కాదు. నాకిష్టమైనదే బోధిస్తున్నాను కాబట్టి దాని గురించి బాగా చదివి, కావాల్సిన వ్యాసాలన్నీ సమకూర్చుకుని ముందే సిద్ధమయ్యాను. నా బాధంతా వర్క్‌ షాప్‌కి వచ్చేవాళ్ళు నేను ఏ బట్టలు వేసుకుంటే నన్ను సీరియస్‌గా తీసుకుంటారు అని.
నేను స్త్రీని కాబట్టి, ఎక్కడయినా సరే నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలని నాకు తెలుసు. స్త్రీత్వం ఉట్టిపడే బట్టలేసుకుంటే నన్నెవరూ సీరియస్‌గా తీసుకోరు. నాకు పెదాలకి రంగు వేసుకుని, నాకిష్టమయిన చిన్న అమ్మాయిలు వేసుకునే లాంటి (గర్లీ) స్కర్ట్‌ వేసుకోవాలని ఉంది. కానీ వద్దని నిర్ణయించుకున్నాను. మ్యాన్లీగా ఉండే ఒక అసహ్యమయిన, సీరియస్‌ సూట్‌ వేసుకుని వర్క్‌ షాప్‌కి వెళ్ళాను.
దురదృష్టవశాత్తూ లుక్‌ విషయానికి వచ్చేసరికి మగవాళ్ళ లుక్‌ ఒక స్టాండర్డ్‌గా ఉంటోది. మనలో చాలామందికి స్త్రీత్వం ఎంత కనిపిస్తే అంత మనల్ని సీరియస్‌గా తీసుకోరనే భావన బలంగా ఉంది. ఏదయినా బిజినెస్‌ మీటింగ్‌కి వెళ్ళే పురుషులు తాము ధరించే బట్టలను బట్టి తమల్ని సీరియస్‌గా తీసుకుంటారా, లేదా అన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ స్త్రీలు మాత్రం తప్పకుండా ఆలోచించాలి.
ఆ రోజు అసహ్యమైన సూట్‌ వేసుకోకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు నామీద నాకున్న ఆత్మవిశ్వాసం అప్పుడు ఉండుంటే, నా విద్యార్థులు కూడా నా టీచింగ్‌ నుండి ఇంకా నేర్చుకునేవాళ్ళు. నేను హాయిగా, సౌకర్యవంతంగా ఉండి ఇతరులు అనుకున్నట్లుగా కాకుండా నాకు నచ్చినట్లు ఉండగలిగినప్పుడు నా బోధన కూడా మెరుగవుతుంది కదా!
ఇప్పుడిరక నా స్త్రీత్వాన్ని గురించి అపరాధ భావంతో మెలగకూడదని నిర్ణయించుకున్నాను. నా స్త్రీత్వాన్ని అందరూ గౌరవించాలని నేను భావిస్తున్నాను. అది నా హక్కు. నాకు చరిత్ర, రాజకీయాలు అంటే ఇష్టం. ఏది సరైన ఆలోచనోనని చర్చించటం నాకన్నిటికన్నా ఆనందాన్నిచ్చే విషయం. నాకు అమ్మాయిలాగా ఉండటం ఇష్టం. అమ్మాయిలాగా తయారవటం సంతోషంగా ఉంటుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరినుండి ప్రశంసలు అందుకోవటం ఇష్టం. (స్టైలిష్‌గా ఉండే స్త్రీల నుండి ప్రశంసలంటే అన్నిటికన్నా ఇష్టం). కానీ, చాలాసార్లు మగవాళ్ళకి నచ్చని బట్టలు, ‘ఏంటో ఈ బట్టలు’ అనే రకమైనవి వేసుకుంటాను. నాకిష్టం కాబట్టి, వేసుకుంటే నాకు బాగుంటాయి కాబట్టి వేసుకుంటాను. నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయాల్లో ‘మగ చూపు’ పాత్ర ఇప్పుడు కేవలం యాదృచ్ఛికమే!
… … …
జెండర్‌ గురించి మాట్లాడటం అంత సులువైనది కాదు. అది మనల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది. కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరికీ జెండర్‌ గురించి మాట్లాడటం అంత నచ్చదు, ఇద్దరూ ఈ విషయాన్ని దాటవెయ్యటానికి ప్రయత్నిస్తుంటారు. యధాతథ స్థితిని మార్చే ఆలోచన ఎప్పుడూ అసౌకర్యంగానే ఉంటుంది.
కొంతమంది ‘‘ఈ ఫెమినిస్టు అనే మాటెందుకు? నీకు మానవ హక్కుల భావనలో నమ్మకముందని చెప్పొచ్చు కదా?’’ అని అడుగుతారు. అది ఎంత మాత్రం నిజాయితీలేని మాట. స్త్రీ వాదం ఒక విస్తృత మానవ హక్కుల స్పృహలో భాగమే కానీ, ఒక అస్పష్టమయిన మానవ హక్కులు అనే పరిభాష వాడటం వల్ల జెండర్‌ సమస్యకుండే ప్రత్యేక, నిర్దిష్ట స్వభావాన్ని తోసిపుచ్చటమే అవుతుంది. శతాబ్దాల తరబడి పక్కన పెట్టబడిరది స్త్రీలు కాదని చెప్పాల్సి వస్తుంది. జెండర్‌ సమస్య గురిచూసి దెబ్బ కొట్టేది స్త్రీలని కాదని చెప్పాల్సి వస్తుంది. సమస్య మనుషులందరి గురించి కాదు, ఆడ మనుషుల గురించే. శతాబ్దాల పాటు ప్రపంచం మనుషులని రెండు గుంపులుగా విడగొట్టి ఒక గుంపుని దూరంగా పెట్టి, అణచివేసింది. ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతున్నప్పుడు కనీసం ఇది జరిగిందని చెప్పడం సముచితంగా ఉంటుంది.
కొంతమంది మగవాళ్ళు ఫెమినిజం అనే పదం వింటేనే దడుసుకుంటారు. అబ్బాయిలను పెంచే విధానం వల్ల వారిలో వచ్చే అభద్రతా భావం నుండి పుట్టిన భయమిది. మగవాళ్ళుగా పుట్టినందుకు వారే ఎప్పుడూ పై మెట్టుమీద
ఉండాలని చెప్పే సమాజాల్లో పెరిగినప్పుడు, తమది పై చేయి కాకుండా పోతే తమ విలువ తగ్గిపోయినట్లు పోషించే మగవాళ్లు తయారవటం సహజమే కదా!
… … …
ఇంకో రకం పురుషులు ఏమంటారంటే, ‘‘నువ్వు చెప్పేది చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది కానీ, నేనలా అస్సలు ఆలోచించను, నేనసలు జెండర్‌ గురించే ఆలోచించను’’ అని.
నిజమే కావచ్చు. వాళ్ళు నిజంగానే ఆలోచించకపోవచ్చు.
అక్కడే సమస్య ఉంది కూడా. చాలామంది మగవాళ్ళు జెండర్‌ గురించి క్రియాశీలంగా ఆలోచించరు, పట్టించుకోరు కూడా. నా స్నేహితుడు లూయి లాగా ‘ఇదెప్పుడో పాత సమస్య, ఇప్పుడంతా బాగానే ఉంది’ అంటారు. చాలామంది మగవాళ్ళు ఉన్న పరిస్థితిని మార్చడానికి ఏమీ చెయ్యరు కూడా. మీరో పురుషుడనుకోండి, రెస్టారెంట్‌లోకి ఒక స్త్రీతో కలిసి వెళ్ళారనుకోండి. ఆ వెయిటర్‌ మిమ్మల్ని మాత్రమే విష్‌ చేసి ఊరుకున్నాడనుకోండి. మీరడుగుతారా ‘‘ఆమెని ఎందుకు విష్‌ చెయ్యలేదు’’ అని? చిన్న చిన్న విషయాల్లో కూడా కల్పించుకుని మాట్లాడాలి మగవాళ్ళు.
జెండర్‌ గురించి మాట్లాడటం అసౌకర్యంగా ఉంటుంది కనుక తేలిగ్గా ఈ సంభాషణని ముగించే దారులు వెతుక్కుంటాం.
కొంతమంది జీవశాస్త్ర పరిణామ క్రమం గురించి మాట్లాడటం మొదలుపెడతారు. కోతుల గురించి చెప్తారు. ఆడ కోతులు, మగ కోతులకి ఒంగి సలాం కొడతాయంటారు. కానీ విషయం ఏమిటంటే, మనం కోతులం కాము. కోతులు చెట్లమీద ఉంటాయి. వానపాముల్ని తింటాయి. మనం చెట్లమీద ఉండము, వాన పాముల్ని తినము.
ఇంకొంతమంది ఏమంటారంటే, ‘‘పేద మగవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడరా మీరు’’ అని. అవును, కరక్టే, వాళ్ళు కష్టపడుతున్నారు.
కానీ ఈ సంభాషణ దాని గురించి కాదు. జెండర్‌ వేరు, వర్గం వేరు. పేద మగవాళ్ళకి కూడా సంపద పరమైన ఆధిక్యత లేకపోయినా, జెండర్‌ పరమైన ఆధిక్యత ఉంటుంది. నల్లజాతి మగవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు వివిధ అణచివేతల గురించి, ఒక అణచివేత, ఇతర అణచివేతలను ఎలా కనుమరుగు చెయ్యవచ్చో బాగా అర్థమయింది. ఒకసారి జెండర్‌ గురించి మాట్లాడుతుంటే, ఒక వ్యక్తి నాతో, ‘‘నువ్వెందుకు స్త్రీగానే మాట్లాడాలి? మనిషిగా ఎందుకు మాట్లాడవు?’’ అని అడిగాడు. ఈ రకమైన ప్రశ్నలు ఒక వ్యక్తికున్న ప్రత్యేక అనుభవాన్ని తొక్కిపెడతాయి. నేను మనిషినే, దాన్లో ఏ సందేహం లేదు. అయితే నేను స్త్రీనవ్వటం వల్ల ఈ ప్రపంచంలో నాకు కొన్ని ప్రత్యేక అనుభవాలు ఎదురవుతాయి. ఇదే మగమనిషి అటు తిరిగి నల్ల జాతి పురుషుడిగా తన అనుభవాన్ని గురించి అనర్గళంగా మాట్లాడతాడు. (‘‘మరి మీరెందుకు మనిషిగానో, మగమనిషిగానో మాట్లాడరు? నల్లజాతి పురుషుడిగా ఎందుకు మాట్లాడుతుంటారు?’’ అని బహుశా నేను అడిగి ఉండాల్సింది)
చెప్పేదేమిటంటే, ఈ సంభాషణ జెండర్‌ గురించి, వేరే వాటి గురించి కాదు. మరికొంతమంది ఏమంటారంటే, ‘ఆడవాళ్ళకే నిజమైన అధికారం ఉంటుందండీ, క్రింద ఉండి చెలాయించేది’. (ఇది నైజీరియాలో తన లైంగికతను
ఉపయోగించి పురుషుల నుండి తమకు కావాల్సింది పొందే స్త్రీల గురించి వాడే వ్యక్తీకరణ). ఈ క్రింద ఉండి ఉపయోగించే అధికారం అసలు అధికారమే కాదు. ఆ స్త్రీకి అధికారం లేదు కాబట్టి మగవాడిని పట్టుకుని అతని అధికారాన్ని వాడుకోవాల్సి వస్తోంది. ఆ మగమనిషే మంచి మూడ్‌లో లేకపోయినా, అతనికి ఆరోగ్యం బాగాలేకపోయినా, అతనికి తాత్కాలికంగా లైంగికేచ్ఛ నశించినా ఆమె చేయగలిగేది ఏమీ ఉండదు.
మరి కొంతమంది ఆడవాళ్ళు, అణిగిమణిగి ఉండడం మన సంస్కృతి అంటారు. కానీ సంస్కృతి ఎప్పుడూ మారుతూ ఉంటుంది. నాకిద్దరు చక్కటి పదిహేనేళ్ళ కవల మేనకోడళ్ళు ఉన్నారు. వాళ్ళే వందేళ్ళ క్రితం పుట్టినట్లయితే అవతలికి తీసుకెళ్ళి చంపేసి ఉండేవాళ్ళు. ఇగ్బో సంస్కృతిలో వందేళ్ళ క్రితం కవల పిల్లలు పుట్టడాన్ని చెడు శకునంగా భావించే వాళ్ళు. ఈ రోజు ఆ ఆచారం గురించి ఇగ్బో ప్రజలు ఊహించను కూడా లేరు.
అసలు సంస్కృతి ఉండేదెందుకు? ఒక ప్రజని సంరక్షించి, కొనసాగేటట్లు చెయ్యటమే సంస్కృతికుండే ప్రధాన ధర్మం. నా కుటుంబంలో అందరిలోనూ మనమెవరం, మన ఆచారాలేంటి, మన తాతల భూమి ఎక్కడుండేది వంటి విషయాల గురించి చాలా ఆసక్తి గల పిల్లని నేనే. నా సోదరులకు అటువంటి వాటిలో అస్సలు ఆసక్తి లేదు. కానీ, ఇగ్బో సంప్రదాయం ప్రకారం ఉమ్మడి కుటుంబంలోని మగవాళ్ళు మాత్రమే పెద్ద నిర్ణయాలు తీసుకునే కుటుంబ సమావేశాల్లో పాల్గొనగలరు. నేను స్త్రీని కాబట్టి నాకు ఆ అవకాశం లేదు. నాకు ఈ విషయాల్లో ఎంత ఆసక్తి ఉన్నా సరే నేను ఆ సమావేశాలకు వెళ్ళలేను, నేననుకున్నవి చెప్పలేను.
సంస్కృతి ప్రజలను తయారు చెయ్యదు. ప్రజలు సంస్కృతిని తయారుచేస్తారు. స్త్రీలని సంపూర్ణ మానవులుగా చూడటం మన సంస్కృతిలో లేకపోతే ఇప్పుడు మనం దాన్ని ‘మన సంస్కృతిగా’ చేసుకోవాలి.
… … …
నా స్నేహితుడు ఒకోలోమా గురించి నేను చాలాసార్లు తలచుకుంటాను. అతను, అతనితో ఆ సోసోలిసో విమాన ప్రమాదంలో చనిపోయిన వారందరూ భూమి తల్లి ఒడిలో నిద్రపోతున్నారు. అతన్ని ప్రేమించే వాళ్ళందరి హృదయంలో అతనెప్పుడూ నిలిచే ఉంటాడు. అన్నేళ్ళ క్రితం నువ్వు ఫెమినిస్టు అని అతనన్నది కరక్టే. నేను ఫెమినిస్టునే.
అన్నేళ్ళ క్రితం నేను నిఘంటువులో ఆ మాటకి అర్థం వెతికినప్పుడు ఫెమినిస్టు అంటే ‘స్త్రీ, పురుషుల మధ్య సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోరే వ్యక్తి’ అని కనబడిరది.
నేను విన్న కథలను బట్టి నా ముత్తవ్వ ఫెమినిస్టు. ఆమెని పెళ్ళాడాలనుకున్న వ్యక్తి ఇంటినుండి పారిపోయి తాను కావాలనుకున్న వ్యక్తిని పెళ్ళాడిరది ఆమె. భూమి ఇవ్వకపోయినా, భూమి నుండి వచ్చే ఫలాలు ఇవ్వకపోయినా ఒప్పుకునేది కాదు, నిరసన వ్యక్తం చేసేది, గొంతెత్తి చెప్పేది. ఆమెకి ఫెమినిస్టు అన్న పదం తెలియదు. అంత మాత్రాన ఆమె ఫెమినిస్టు కాకుండా పోలేదు. మనలో మరింతమంది ఆ పదాన్ని స్వంతం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక గొప్ప ఫెమినిస్టు నా సోదరుడు కెనే. అందంగా ఉంటాడు, దయతో వ్యవహరిస్తాడు, కండలు తిరిగి ఉంటాడు. నా నిర్వచనంలో ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ ఫెమినిస్టు అవ్వాలంటే వాళ్ళు ‘‘అవును, ఇప్పుడున్న జెండర్‌ ఏర్పాటు సమస్యా పూరితమైంది. మనం దాన్ని మరమ్మతు చేసి, బాగు చెయ్యాలి. ఇప్పటికంటే మనం మెరుగ్గా బ్రతకాలి’’ అని చెప్పగలగాలి.
మనమందరమూ… స్త్రీలూ, పురుషులూ, అందరూ ఇప్పటికంటే మెరుగ్గా బ్రతకాలి.
రచయిత్రి గురించి:
చిమమండా అడిచే నైజీరియాలో పుట్టి పెరిగారు. ఆమె రచనలు 30కు పైగా భాషల్లో అనువదించబడ్డాయి. న్యూయార్కర్‌, గ్రాంట, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వంటి అనేక ప్రసిద్ధ పత్రికల్లో ఆమె రచనలు ప్రచురించబడ్డాయి. ఆమె నవలలు ది పర్పుల్‌ హైబిస్కస్‌, హాఫ్‌ ఆఫ్‌ యెల్లో సన్‌, అమెరికానా అనేక అవార్డులు పొందాయి. న్యూయార్క్‌, నైజీరియాల్లో ఆమె తన సమయాన్ని విభజించుకుని గడుపుతుంటారు.
అనువాదకురాలి మాట:
ఈ పుస్తకాన్ని స్వీడిష్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పాఠ్య పుస్తకంగా పెట్టడంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచి అందరి దృష్టికీ వచ్చింది. మనం చెప్పే పాఠశాల చదువుల్లో, మారుతున్న సమాజంలో ఆడపిల్లలు, మగపిల్లలు ఒకరితో ఒకరు మనుషుల్లాగా, పరస్పర గౌరవంతో ఎలా మెలగాలి అనే జెండర్‌ సెన్సిటివిటీ నేర్పకపోవడం వల్ల అనేక మంది యువకులు, యువతులు తమ జీవితాలని తీవ్రంగా కష్టపెట్టుకుంటున్నారు. మూసపోసిన ఆలోచనలను వదులుకోలేక పోతున్నారు. అటువంటి మార్పుకి ఇటువంటి చిన్న ప్రయత్నాలు కొంత దోహదం చేస్తాయి.
కొంత దోహదం అని ఎందుకంటున్నానంటే చిమమండా అడిచే అవగాహన కూడా అసంపూర్ణమైనదే. ఈ పుస్తకం ప్రచురించిన తర్వాత ట్రాన్స్‌ మహిళలని (అంటే అబ్బాయిలుగా సమాజం వర్ణించే వ్యక్తులు తాము పురుషులం కాదని, అనేక కష్టాలకి ఓర్చి, స్త్రీలుగా బ్రతికేవారు) స్త్రీలుగా పరిగణించలేమని, ఎందుకంటే వారి సాంఘికీకరణ పురుషులుగా జరిగిందని అంటూ తాను కూడా స్త్రీ, పురుషుల మధ్య ఒక చెరపలేని భేదం ఉందనే అవగాహన వ్యక్తపరిచారు. స్త్రీలు, పురుషుల మధ్య నైపుణ్యం, సామర్ధ్యం, తెలివి వంటి వాటిలో హార్మోన్లకి సంబంధం లేదని అంటూ, సాంఘికీకరణ వల్లే ఈ భేదాలు పెంచబడ్డాయని అంటున్నప్పుడు, ఇంకొంత ముందుకెళ్ళి ఎన్నో కష్టాలకోర్చి స్త్రీలుగా బ్రతికే ట్రాన్స్‌ మహిళలను ఎందుకు స్త్రీ జాతిలో భాగంగా పరిగణించకూడదో ఆమె చెప్పలేదు. పురుషులు, స్త్రీలుగా పుట్టుకతో పిలువబడి ఆ జెండర్‌లో ఇమడలేని వ్యక్తుల పరిస్థితుల గురించి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవటం మొదలుపెట్టాయి సమాజాలు.
ఈ పుస్తకం స్త్రీలు, పురుషులు అన్న మూస ఆలోచనలు ఎందుకు మానవజాతిగా మన పురోగతిని ఆపుతున్నాయో అర్థం చేయించటానికి ఒక ప్రాథమిక గైడ్‌గా పనికొస్తుంది. సమాజం ఈ రెండు వర్గాలతోనే పనిచేయదు. పురుషుల్లో, స్త్రీలలో జాతి, కులం, వర్గం, జాతీయత, మతం, ఇంకా ఎన్నో రకాలయిన భేదాలు రోజువారీ జీవితాలను, వారి సమాజ స్థాయిని, వచ్చే అవకాశాలను, ఎవరిని గౌరవ ప్రదమయిన మనుషులుగా పరిగణించాలో, ఎవరి మాటకి విలువనివ్వాలో, ఎవరి జీవితాలకు ప్రాధాన్యత ఉంటుందో వాటినన్నింటినీ కూడా ఇవి నిర్ణయిస్తాయి. ఆ సంక్లిష్టతను అర్థం చేసుకోవటానికి ఇది కొంతమేరకయినా పనికొస్తుందని నా ఆశ.
(సమాప్తం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.