గమనమే గమ్యం -ఓల్గా

శారద పెళ్ళి మద్రాసులో పార్టీ ముఖ్యుల ముందు ప్రమాణ పత్రాల మీద సంతకాలు పెట్టడంతో జరగాలని నిర్ణయమైంది.
శారద, సుబ్బమ్మ వారం రోజుల ముందే మద్రాసు వెళ్ళారు.

బంధు మిత్రులకు విందు చేయాలని సుబ్బమ్మ పట్టుబట్టింది. పెళ్ళి గురించి ఒకసారి మనసులో నిర్ణయించుకున్నాక శారద ఉత్సాహంగానే ఉంది. నిరుత్సాహం, నీరసం అనే మాటలు శారద నిఘంటువులోనే లేవు. శారద మద్రాసు వెళ్ళగానే మూర్తిని కలిసింది.
‘‘మొత్తానికి నాకు మొగుడివి అవుతున్నావు’’ అంది శారద నవ్వుతూ.
‘‘ఇదంతా ఇలా జరుగుతుందనీ, మనం భార్యాభర్తలవుతామనే ఆశాలేశం కూడా లేదు నాకు. కానీ జరుగుతోంది. విధి అనేది ఒకటుందని నమ్మాలనిపిస్తోంది’’ అన్నాడు మూర్తి.
‘‘ఆవిడ ఒప్పుకుందన్నారు. బాగా బాధపడిరదా?’’
‘‘లేదు శారదా. మా మధ్య యాంత్రిక సంబంధమే ఉంది. ఆవిడ దృష్టిలో నేను మామూలు మగవాడిని. మగవాళ్ళు కొందరు రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎవరినన్నా ఉంచుకుంటారు. తప్పులేదు. ఆడదానిగా తను మాత్రం నీతిగా ఉంటుంది. దీనికి అంత విలువ ఇవ్వదు. అసలు కళ్ళనీళ్ళు పెట్టలేదనీ కాదు… నేను కొన్ని హామీలివ్వలేదనీ కాదు…’’ ‘‘హామీలేమిటి?’’
‘‘నీ మోజులో ఇంటిని, పిల్లల్నీ గాలికొదిలెయ్యనని’’
శారదకు మనసు చివుక్కుమంది. కానీ ఇవి తప్పవు.
‘‘నేనూరుకుంటానా, నువ్వలా చేస్తే… ఏమైనా నేనీ పరిస్థితిలో పడినందుకు నన్ను నేను సమాధానపరచుకోవడం చాలా కష్టమైంది. అది నీకూ, మిగిలిన వారెవ్వరికీ అర్థం కాదు.’’
శారద గొంతులో దుఃఖం చూసి మూర్తి విలవిల్లాడాడు. ‘‘నువ్వు బాధపడి మన ఆనందాన్ని దూరం చెయ్యకు. డాక్టర్‌ శారదాంబ నా భార్య. నువ్వేమిటో, నీ విలువేమిటో నాకు తెలుసు. శారదా ఇదంతా నిజమేనా అనిపిస్తోంది’’ మూర్తి ఆకాశంలో విహరిస్తున్నాడు. మూర్తి ప్రేమలో శారద మనస్సు కూడా లీనమైంది.
‘‘ఈ లోకంలో నాకు ఒక పురుషుడిలా కనిపించేది నువ్వొకడివే. ఆ రోజు సముద్రతీరంలో మొదటిసారి శారదా అని నువ్వు పిలిచినప్పుడు నాలో కలిగిన సంచలనం నీకు చెప్పలేను. అది తల్చుకుంటే ఎప్పుడూ ఒక పులకింత. నన్నెంతమందో నా పేరుతో పిలుస్తారు. కానీ నువ్వు పిల్చినప్పుడు నాకు అర్థమైంది, నేను నీ కోసం శారదగా పుట్టానని. ఎందరో మగాళ్ళు నన్నాకర్షించాలని ప్రయత్నించారు. ఇంగ్లండులో రామనాధం ఎంతో ప్రాధేయపడ్డాడు. కానీ నా దృష్టిలో పురుషుడంటే నువ్వే. నేను స్త్రీని. నువ్వు పురుషుడివి.’’
శారదను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మూర్తి. శారద ఆ క్షణం నుంచీ తన మనసులో మరింకే సంకోచాలూ లేకుండా మూర్తి తన వాడనుకుంది.
బంధు మిత్రులను విందులకు ఆహ్వానించడం చాలా పెద్ద పని. బంధువుల సంగతి తల్లికి అప్పగించి తను స్నేహితులను కలిసే పని పెట్టుకుంది. విశాల ఎక్కడుందో తెలియలేదు. అందుకని ముందుగా కోటేశ్వరి దగ్గరికి వెళ్ళింది. కోటేశ్వరి ఇప్పుడు ట్రిప్లికేన్‌లో మంచి విశాలమైన ఇంట్లో ఉంటోంది. ఆ సంగతి తన ఊరి నుంచి వచ్చిన బంధువొకడు చాలా వ్యంగ్యంగా చెప్పాడు. శారద ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. నిజంగానే ఇంతకుముందు ఇంటికీ, దీనికీ పోలికే లేదు. రాజ్యం సినిమాల్లో వేషాలు వేస్తోంది. మంచి పేరే సంపాదించింది. రాజ్యం అందం వెండితెరను వెలిగించింది. ఆ వెలుతురు కోటేశ్వరి ఇంట్లో ప్రతిఫలిస్తోంది. కోటేశ్వరి శారద పెళ్ళి మాట విని సంతోషించింది. విశాల ఒక్కసారి కూడా కోటేశ్వరిని చూడడానికి రాలేదట. ఈవిడ మాత్రం కూతురి వివరాలన్నీ కనుక్కుంటూనే ఉంది.
‘‘ఇద్దరు పిల్లల్ని కన్నది. లోపలేం జరుగుతోందో గానీ బైటికి బాగానే ఉంటోంది. పెద్ద ఆఫీసరయింది. మొగుడికింకా పెద్ద హోదా. కావలసినదంతా సాధించుకుంది. మహా మొండిది. నా పోలికే’’ అని నవ్వింది కోటేశ్వరి. అందులో దిగులే గానీ గర్వం కన్పించలేదు. కోటేశ్వరి నుంచి విశాల చిరునామా తీసుకుంది శారద.
శారదను చూసి విశాల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పది నిమిషాల్లో తన హోదా, సంపద, సంతృప్తి అంతా శారదకు అర్థం చేయించాలని తాపత్రయపడిరది. ఇల్లు, పిల్లలు, నౌకర్లు, ఫర్నిచరు అంతా గర్వంగా చూపించింది.
‘‘అంతా నువ్వనుకున్నట్టే జరిగింది. బాగున్నావు’’ అంది శారద.
‘‘మేమిద్దరం ఢల్లీిలో పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నాం. దేశం స్వతంత్రమవుతుంది త్వరలో. అప్పటికి ఢల్లీిలో
ఉన్నవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మంచి పొజిషన్స్‌లోకి తేలిగ్గా వెళ్ళొచ్చు’’.
శారద తన పెళ్ళి సంగతి చెప్పింది.
‘‘ఆయనకు పెళ్ళాం, పిల్లలు ఉన్నారుగా’’ అంది విశాల ఆశ్చర్యంగా.
‘‘ఉన్నారు. ఐనా మేం ప్రేమించుకున్నాం’’ తేలిగ్గా తీసేసింది.
‘‘శారదా ఎంతో తెలివైనదానివి. ఇంత పిచ్చిపని చేస్తున్నావేంటి. నీ పెళ్ళికేం విలువ ఉంటుంది. అందులో మంగళసూత్రం లేని, మెట్టెలు, సప్తపది, ఏదీ లేని కాగితాల పెళ్ళి. ఏ రకంగా దాన్ని పెళ్ళంటారు. దాన్ని ఎవరు గౌరవిస్తారు. నిన్నెవరూ మూర్తి భార్య అనరు’’ ఆవేశపడుతున్న విశాలను ఆపింది శారద.
‘‘ఏమంటారో నాకు తెలుసులేవోయ్‌. ఈ పెళ్ళిళ్ళలో నాకసలు నమ్మకం లేదు. మా మధ్య ప్రేమ ఉంది. పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే ఈ తంతు జరిగేది కాదు’’.
‘‘అవసరమా… అంటే?’’
‘‘అంటే నా రాజకీయాలు నీకు తెలుసుగా. పెళ్ళికాని స్త్రీ రాజకీయాల్లో ఉంటే ప్రజలంతా గౌరవించరని, ఆ గౌరవం కోసం పెళ్ళాడుతున్నా. రెండో పెళ్ళి వాడయినా ఒక మగవాడు పక్కనుంటే గౌరవం. అందుకని పెళ్ళాడుతున్నా’’ కాస్త విసురుగా, కసిగా అంది.
‘‘నీకా గౌరవం రాదు. ఉన్న గౌరవం పోతుంది. గౌరవం ఉన్నవాళ్ళెవరూ ఈ పెళ్ళిని గౌరవించరు’’.
‘‘గౌరవించేవాళ్ళు గౌరవిస్తారు. లేనివాళ్ళు లేదు. ఇది పార్టీ నిర్ణయం. ఒకరకంగా నేను సంతోషంగానే ఉన్నాను’’.
‘‘నేను సంతోషంగా లేను’’ అంది విశాల నిర్మొహమాటంగా.
‘‘సరే సంతోషంగా లేకపోతే నేనిచ్చే విందుకు రావొద్దులేవోయ్‌’’ పేలవంగా నవ్వింది శారద.
‘‘శారదా… ఇప్పటి నీ పరిస్థితిలో పడతానని నేను ఎన్ని సంవత్సరాలు భయపడ్డానో నీకు తెలియదూ. నువ్వు చూసి చూసి ఆ స్థాయికి ఎందుకు దిగిపోతున్నావు? పైగా సంతోషంగా… మనిద్దరికీ ఎంత తేడానో చూడు’’.
‘‘విశాలా… నీకూ నాకూ చాలా తేడా ఉంది. నీకు వివాహం మీదా, స్త్రీకి అది తెచ్చిపెట్టే గౌరవం మీదా, ఎంతో నమ్మకం ఉంది. నాకా నమ్మకం లేదు. నీకు నీ చుట్టూ ఉన్న లోకం ఇచ్చే పై పై గౌరవాలు కావాలి. నేను ఈ లోకాన్ని మార్చాలి. మన మన కుటుంబ నేపథ్యాల కారణంగా మన జీవితాల్లో, ఆలోచనల్లో ఈ తేడాలు, నా రాజకీయాల వల్ల కూడాననుకో. ఇప్పటి నా పెళ్ళిలో వింత, వైరుధ్యం ఏమిటంటే నేను లోకం ఇచ్చే గౌరవం కోసం ఈ పెళ్ళి చేసుకుంటున్నాను. అది నాకు ఇష్టం లేదు. నేను మూర్తిని ప్రేమించాను. అతను తప్ప మరెవరినీ నా జీవితంలోకి రానిచ్చే ఉద్దేశమే లేదు. తీరా అతనితో వివాహం నా కోసం కాకుండా లోకం కోసం జరుగుతోంది. ఇదంతా అర్థం చేసుకోవటం నాకే కష్టంగా ఉంది. నీకసలు అర్థమే కాదు. వదిలెయ్‌. రావాలనిపిస్తే మమ్మల్ని అభినందించటానికి రా. లేకపోతే లేదు. నే వెళ్తా’’ శారద లేచింది.
‘‘ఆగు’’ అంటూ విశాల లోపలికి వెళ్ళి వెండి పళ్ళెంలో రవికె గుడ్డ, పూలు, పళ్ళూ తీసుకొచ్చి శారదకు బొట్టుపెట్టి, పూలూ, పళ్ళూ, రవికె ఇచ్చింది.
‘‘పూర్తిగా బ్రాహ్మణుల్లో కలిసిపోయావా’’ అంది నవ్వుతూ శారద.
‘‘అవును శారదా. నా పిల్లలు బ్రాహ్మణులు. బాగా చదువుకుంటున్నారు. నన్ను చూసి గర్వపడతారు. మా అమ్మను చూసి నేనేనాడూ గర్వపడలేదు. సిగ్గుపడ్డాను. బాధపడ్డాను. కోపం తెచ్చుకున్నాను. ఆ పరిస్థితిలో నా పిల్లలు పడకూడదనుకున్నాను. నా అదృష్టం. అన్నీ నేననుకుంటున్నట్టే జరుగుతున్నాయి. మా అమ్మ, మా కులం ఇవన్నీ నా పిల్లలకు తాకకుండా జాగ్రత్తగా పెంచుతున్నాను’’.
‘‘చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు గ్రహించే ఉంటావు. మీ అమ్మంటేనే నాకు గౌరవం. నువ్వంటే జాలి…’’
‘‘నేను జాలిపడాల్సిన స్థితిలో లేను శారదా. నేను పెద్ద చదువు, హోదా, అధికారం ఉన్న ఆధునిక స్త్రీని. నన్ను చూసి జాలి ఎందుకు’’ తీవ్రంగా అంది విశాల.
శారద విశాల భుజం తట్టి బైటికి వచ్చేసింది.
విశాల మాటలు శారదలో కలకలం రేపాయి. విశాల తనను తాను ఆధునిక స్త్రీ అనుకుంటోంది. చదువు, ఉద్యోగం, హోదా, ఇల్లాలుగా, తల్లిగా గౌరవం ఇవేనా ఆధునికతకు లక్షణాలు. చదువు గురించి సందేహం లేదు. తమను ఆధునిక స్త్రీగా చూడాలనుకున్న రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, నాన్న, హరిగారు అందరూ చదువు ఆధునికతకు మొదటిమెట్టు అనుకున్నారు. విశాల ఎవరి ప్రోత్సాహం లేకుండానే కష్టపడి చదివింది. ఇద్దరూ ఎవరి కుల సంప్రదాయాలను వాళ్ళు వ్యతిరేకించారు. విశాల తల్లికి దూరమైతే, తాను నాన్నమ్మకు దూరమైంది. లేదా తన ఆధునికత నాన్నమ్మను అందరికీ దూరం చేసింది. ఇప్పుడు విశాల తల్లిని దూరం చేసుకుని తను ఆధునికం అని నమ్మిన దారిలో నడుస్తుంటే, అందులో ఏదో పొరపాటుందని తనకన్పిస్తోంది. సంప్రదాయబద్ధంగా పెళ్ళి చేసుకోకుండా పెళ్ళయినవాడిని ప్రేమించి, కాగితాల మీద సంతకాలతో, పార్టీ ఆదేశంతో పెళ్ళాడుతుంటే అది తప్పని విశాలకు అన్పిస్తోంది. పెళ్ళికి కాక ప్రేమకు విలువివ్వటం ఆధునికత అని తను నమ్ముతోంది. ఎవరిది పొరపాటు. ఆధునికతను అర్థం చేసుకోవటంలో తనది పొరపాటు కాదు. మార్క్స్‌ కమ్యూనిస్టు మ్యానిఫెస్టోలో వివాహం గురించి రాసింది చదివి తను ఎంత పొంగిపోయింది. ఈ బూర్జువా వివాహ వ్యవస్థను గౌరవించాల్సిన పనిలేదు. దాని విధి నిషేధాల మీద తిరగబడటమే ఆధునికత. కానీ పార్టీ ఆదేశానికి ముందు తాను తిరగబడాలనుకోలేదు. పార్టీ లోకానికి గౌరవం ఇచ్చి తనను పెళ్ళాడమనేవరకూ తను మూర్తిని దూరంగా ఉంచింది. ప్రేమ ఉన్నప్పుడు అదే ముఖ్యమని ఎందుకు అనుకోలేకపోయింది. మరో స్త్రీని బాధపెట్టాల్సి వస్తుందనా? ఎన్ని సంక్లిష్టతలు… ఎన్ని వైరుధ్యాలు… ఔను ఆధునికతకు దారి సుగమం కాదు. ఆధునికత అనేక స్థాయిలలో ఉంటుంది. విశాలకు చదువు, పెళ్ళి, తనకు చదువు, రాజకీయాలు, సమాజాన్నంతా సమ సమాజం చేయాలనే తపన. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క స్థాయి. అందరూ ఒకలాగే ఉండాలనుకోవటం అత్యాశ. ఏదైనా తిరుగుబాటు ఆధునికత… విశాల కూడా తన కులం మీద తిరగబడిరది. కానీ ఆ తిరుగుబాటులో ద్వేషం లేకుండా న్యాయం మాత్రమే ఉంటే బాగుండేది. ద్వేషం లేకుండా తిరగబడటం… ఇదేంటి వర్గ ద్వేషాన్ని నమ్మే తనలో విశాల ద్వేషం గురించి అభ్యంతరం ఎందుకు? కానీ గాంధీ చెప్పింది ద్వేషం లేని తిరుగుబాటే కదా. అది తనకు బాగా నచ్చింది. చిన్నతనం నుంచీ అది తన జీవితానుభవం. నాన్నమ్మ, నాన్న, అమ్మ, తనూ అందరూ తాము నమ్మినవాటి కోసం ఎవరినీ ద్వేషించకుండానే తిరుగుబాటు చేశారు. కానీ అది అన్ని కులాల వారికీ, వర్గాల వారికీ సాధ్యం కాకపోవచ్చు’’.
శారదను ఆ రాత్రంతా ఈ ఆలోచనలు వేధించాయి. వీటికి సమాధానం వెతకాలి, మూర్తితో కలిసి, తన తోటి సహచరులతో కలిసి… అనుకుని సమాధానపడి ఎప్పటికో నిద్రపోయింది.
శారద మూర్తిని పెళ్ళాడటం నిజానికి బంధుమిత్రులలో ఎవరికీ అంతగా నచ్చలేదు. అందరూ విశాలలా బహిరంగంగా చెప్పలేదు. విందుకు హాజరై శారదనూ, మూర్తినీ అభినందించారు. నోటితో నవ్వి నొసలితో వెక్కిరించే మనస్తత్వం నాగరికతో పాటు పెరుగుతూ వస్తోంది. దుర్గాబాయిది విశాఖపట్నంలో ఎమ్మే చదవటం పూర్తయింది. లా చదువుతోంది. శారదను అభినందిస్తూ ఉత్తరం రాసింది. అందులో దుర్గాబాయి కూడా తమకిద్దరికీ ఉన్న తేడాను చూపింది.
‘‘రాజకీయాల కోసం నేను వివాహం నుంచి ఐచ్ఛికంగా బైటికి నడిచాను. నీ రాజకీయాల కోసం నువ్వు ఒకప్పుడు వద్దనుకున్న వివాహబంధంలోకి నడుస్తున్నావు. ఇది బంధం కాకుండా చూసుకో. ఏ పని చేసినా స్త్రీల విద్య గురించి మర్చిపోకు. ఈ ఆధునిక ప్రపంచంలో విద్య, ఆర్థిక స్వేచ్ఛ మాత్రమే స్త్రీలను కాపాడగలవు’’ అంటూ దుర్గ రాసిన ఉత్తరం కూడా శారదను ఆధునికత గురించి ఆలోచింపచేసింది.
అన్నపూర్ణ, అబ్బయ్యలు మద్రాసు రాలేదు. వస్తారని శారదా అనుకోలేదు.
శారద ఒక వారం మద్రాసులో గడిపి మూర్తితో కలిసి బెజవాడ వెళ్ళేసరికి విజయవాడలో మిత్రులందరూ ఘనంగా స్వాగతం పలికారు. ఎంతోమంది వచ్చి అభినందించారు. శారద దగ్గర వైద్యం చేయించుకున్నవారు వద్దన్నా కానుకలు తెచ్చి ఇచ్చారు. ఈ సందడంతా అణిగాక వచ్చింది అన్నపూర్ణ.
‘‘మొత్తానికి పెళ్ళి చేసుకుని అమ్మ దిగులు తీర్చావు’’ అంది.
‘‘పార్టీవాళ్ళు పట్టుబట్టారు. ఇంకా నయం. మూర్తినే చేసుకోమన్నారు. లేకపోతే ఏం చేసేదానినో…’’
‘‘మీ పార్టీ వాళ్ళకు మరో దారి లేదే. నీకు… డాక్టర్‌ శారదాంబకు నీ చదువుకీ, హోదాకీ, చైతన్యానికీ, ముఖ్యంగా నీ వయసుకి సరిపోయే వరుడు ఎక్కడ దొరుకుతాడు మీ పార్టీ వాళ్ళకు. మీ ప్రేమ సంగతి తెలుసు గాబట్టి హమ్మయ్య అనుకుని గుండెల మీద బరువు దించుకున్నారు’’ స్నేహితులిద్దరూ మనసారా నవ్వుకున్నారు.
‘‘ఇంతకు ముందు ఆడపిల్ల పెళ్ళి తల్లిదండ్రులకే సమస్య. ఇప్పుడు రాజకీయ పార్టీలకూ సమస్య అయింది’’ అంది అన్నపూర్ణ.
‘‘సమస్యగా చూసే తత్వం నుంచి మార్చేందుకు మనలాంటివాళ్ళం కృషి చెయ్యాలి’’.
స్నేహితులిద్దరూ రాజకీయ చర్చల్లో మునిగారు.
శారదాంబ శ్రీమతి అయింది. తాత్కాలికంగా చాలామంది నోళ్ళకు తాళాలు పడ్డాయి. ఐతే శారదను ఎప్పుడూ గౌరవంగా చూస్తూ, తమకు ఆదర్శంగా నిలుపుకున్న సామాన్య జనానికి శారదను కొత్తగా గౌరవించేందుకేం లేకపోయింది.
సూర్యానికి పద్మతో వివాహం జరిగింది. పద్మ అందం, సౌకుమార్యం, సౌజన్యం కలగలసిన అమ్మాయి. శారద పద్మను మరదలికంటే ఎక్కువ ఆత్మీయంగా చూసింది. శారదంటే పద్మకు ఆరాధన. రెండు జంటలతో ఇల్లు కళకళలాడుతుంటే సుబ్బమ్మ మనసు ప్రశాంతంగా ఉంది.
… … …
మూర్తికి మద్రాసులో కుటుంబ బాధ్యతలు, పార్టీ బాధ్యతలు, బంధు మిత్రుల బంధాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటి మధ్యా తరచూ బెజవాడ రావటం, ఎక్కువ రోజులు ఉండి వెళ్ళటం మొదలయింది.
మూర్తి రాక కోసం ఎదురు చూడటం శారదకో కొత్త అనుభవం అయింది. మూర్తి మీద ప్రేమ అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. అప్పుడూ మూర్తి రావాలని అనిపించేది. ఐదారునెలలకోసారి మూర్తి వచ్చినపుడు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకునేవారు. పార్టీ మిత్రులతో కలిసి మాట్లాడుకునేవారు. ఏ నాటకానికో, మీటింగుకో వెళ్ళేవాళ్ళు. నాలుగు రోజులుండి మూర్తి వెళ్తుంటే శారద తెరిపిగానే అతనికి వీడ్కోలు చెప్పేది. మూర్తితో పెళ్ళి పేరుతో దగ్గరి సంబంధం ఏర్పడిన తర్వాత మూర్తి నుంచి దూరంగా ఉండటం కష్టంగా ఉంది.
మానవ జీవితంలో సెక్స్‌కి ఉన్న పాత్ర గురించి తెలియని చిన్నపిల్ల కాదు శారద. ఐనా లైంగిక సంబంధం ఒక మనిషి మీద ఇంత అధికారాన్ని ఇవ్వటం ఆశ్చర్యంగా అనిపించింది. శారీరక సంబంధం లేకముందు మూర్తితో సంబంధం మానసికం మాత్రమే. అతన్ని ప్రేమించింది. ఆ ప్రేమ ఇప్పటికంటే అప్పుడు తక్కువ లేదు. కానీ శారీరక సంబంధం వల్ల ఆ ప్రేమలో ఏదో మార్పు వచ్చింది. అతని మీద ఏదో హక్కు ఉన్నట్లు. అది సరైందా కాదా? ఒక మనిషి మీద అధికారం, హక్కూ ఉన్న భావన కలిగితే అది ఆ సంబంధానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అనే ప్రశ్నలు శారద మనసులో.
‘‘తమది అందరిలాంటి బంధం కాదు. సంప్రదాయ పెళ్ళిళ్ళలో ఈ హక్కులూ, అధికారాలూ చాలా మామూలు. అవన్నీ పురుషుల పరంగానే ఉంటున్నాయి. వాటివల్ల స్త్రీలు చాలా బాధపడుతున్నారు. తమ బంధం ఇద్దరు స్వతంత్ర వ్యక్తులు ఒక బాధ్యతతో ప్రత్యేక పరిస్థితులలో ఏర్పరచుకున్నది. డబ్బు, ఆస్తులు, కుటుంబ సంబంధాల ప్రమేయం లేదు.
చుట్టుపక్కల వాళ్ళంతా మూర్తిని తన ‘భర్త’గా చూసినంత మాత్రాన భర్త అనే మాటకున్న ఏ అర్థంలోనూ అతను తనకు భర్త అనిపించుకోడు. ఐనా తమ మధ్య ఆ సంబంధం ఏర్పడే ప్రమాదం ఉంది. దాన్నుంచి తనను తాను రక్షించుకోవాలి. మూర్తితో కూడా దీని గురించి మాట్లాడాలి. పరాధీనత ఎవరికీ మంచిది కాదు. ఒకరినొకరు ప్రేమించటంలో ఆధారపడటం అనేది ఎంత మాత్రమూ మేలు చేయదు.
మూర్తి లేనప్పుడు ఇలాంటి ఆలోచనలతో తమ సంబంధం గురించి ఆలోచించేది. మూర్తి వచ్చాడా ఇక ఆలోచనలకు ఆస్కారమే లేదు. అతనున్న వారం పదిరోజులూ అతని సమక్షం ఒదలాలంటే పరమ అయిష్టంగా ఉండేది. ఏ పనీ చేయబుద్ది అయ్యేది కాదు. అతన్ని చూస్తూ కూచుంటే చాలదా జీవితానికి అనిపించేది. అతని కోసం ఏదైనా చేసి సంతోషపెట్టాలనిపించేది. కానీ చేయటానికి ఏమీ
ఉండేది కాదు.
ఒట్టి మాటలు, నవ్వులు, పాటలు, కథలు, కబుర్లు వీటి మధ్య నుంచి రాత్రి తెల్లవారుతుంటే అతన్ని వదిలి వేరుబడి వేరే పనుల కోసం వెళ్ళాలి గదా అని బాధగా ఉండేది. దాన్ని జయించటం ఒక సవాలుగా మారింది శారదకు.
ఆ సాయంత్రం బైటి పనులన్నీ ముగించుకుని శారద వచ్చేసరికి మూర్తి టేబుల్‌ దగ్గర కూర్చుని ఏదో పని చేస్తున్నాడు.
వీలైనంత నిశ్శబ్దంగా వెళ్ళి వెనక నుంచుంది శారద. ఎక్కడ సంపాదించాడో తెల్లని చెక్కముక్కలు చిన్నచిన్నవి పెట్టుకుని వాటికి చతురస్రాకారంలో చిన్న మేకులు కొట్టి బిగిస్తున్నాడు. పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన అతన్ని చూస్తూ నిలువునా కరిగిపోయింది శారద. అతన్ని గట్టిగా హత్తుకోవాలనే కోరికను నిగ్రహించుకుని అతను చేస్తున్నది చూస్తోంది. ఆ చదరంలో అతను పెట్టిన ఫోటో చూసి ఆశ్చర్యపోయింది.
‘‘ఈ ఫోటో…’’ అనుకోకుండా శారద నోట్లోంచి వచ్చిన మాటకు మూర్తి ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు.
రెండు చేతులూ చాచింది శారద. మూర్తి నవ్వుతూ ఆ చేతులలోకి వెళ్ళి చిక్కుకుపోయాడు.
‘‘ఆ ఫోటో…’’
‘‘గుర్తులేదా. నువ్వు ఇంగ్లండ్‌ వెళ్ళినప్పుడు ఒక రాత్రి అపురూపంగా గడిపాం. ఆ రోజు నే తీసిన ఫోటో’’.
‘‘నాకింతవరకూ చూపించలేదెందుకు?’’
‘‘నాకోసం తీసుకున్నది. నువ్వు నా దగ్గరే ఉన్నావు. నీకెందుకిది? నా కోసం. నిన్ను నా దగ్గరే బంధించటం కోసం’’.
‘‘నేను నీ దగ్గరే ఉన్నట్లు లేదు మూర్తీ. నీ లోపల ఉన్నట్లుంది. అక్కడే ఉండిపోవాలని ఉంది. బైటికి రావాలనీ, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చెయ్యాలనీ అనిపించటం లేదు’’.
‘‘వీటన్నిటినుంచీ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా?’’
‘‘ఎక్కడికి?’’
‘‘ఎక్కడికన్నా… మనిద్దరం తప్ప మరెవ్వరూ లేని చోటికి’’.
‘‘మైదానంలోకా? ఏటి ఒడ్డున మైదానంలోకా?’’
ఇద్దరూ ఫక్కున ఒక్కసారి నవ్వారు.
‘‘నిజంగా అలా వెళ్ళిపోదామా?’’ ఎంతో కోరికతో అడిగింది శారద.
‘‘నేను రాగలను. నువ్వే రాలేవు’’.
‘‘ఒస్తా. ఒస్తా. ఒస్తా’’ మూర్తిని ఊపిరాడకుండా ముద్దుపెట్టుకుంటూ అంది శారద.
‘‘అలాగే, వెళ్దాం పద. ఇప్పుడు ఈ నిమిషంలో’’
‘‘ఈ నిమిషం దేనికోసమూ డిస్ట్రబ్‌ కాను’’. పొంగుతున్న ప్రేమనూ, కాంక్షనూ పరిపూర్ణంగా అనుభవిస్తోంది శారద.
మూర్తి ఉన్న రోజులన్నీ శారదకు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి. మూర్తి మద్రాసు బయల్దేరాడా… భరించలేని అసహనం. మిగిలిన విషయాల్లో స్వతంత్రంగా ఉండగల తను మూర్తితో ఎమోషనల్‌గా అస్వతంత్రురాలవుతున్నానని గ్రహించింది. దీనినుంచి బైట పడాలా వద్దా అన్నదొక సమస్య.
ఈ అస్వతంత్రత ఎంతో బాగుంది. ఒక్క నిమిషం కూడా మూర్తిని వదిలి ఉండలేననే అనుభూతి బాగుండటమేమిటి. అది పరాధీనత కాదా? ప్రేమ ముందు తన మిగిలిన స్వతంత్ర గుణాలేవీ నిలబడటం లేదేమిటి?
ఈ విషయాలు మాట్లాడటానికి మూర్తి తప్ప మరెవ్వరూ లేరు. పరస్పర ఆధారాన్నీ, పరాధీనతను వేరు చేసి చూడాలన్నాడు మూర్తి.
‘‘అది నాకు తెలియదా? నేను ఎమోషనల్‌గా, మానసికంగా ఒకరు లేకపోతే భరించలేని స్థితిలో ఉండటాన్ని పరాధీనత అంటున్నాను. ఇంతకుముందు లేని ఈ స్థితి ఈ బంధం వల్ల ఎందుకొస్తోంది అంటున్నాను. ప్రేమ ఈ స్థితిని కల్పించినట్లయితే ప్రేమలో ఏదో లోపమున్నట్లే కదా. ప్రేమ మనిషికి బలమివ్వాలి గానీ బలహీనపరచకూడదు కదా. నేను నీ విషయంలో ఇంతవరకూ చాలా బలంగా నిలబడ్డాను. ఈ కొత్త సంబంధం నన్ను బలహీనపరుస్తోందా అనిపిస్తోంది’’.
‘‘నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపించటం బలహీనమెలా అవుతుంది?’’
శారద చాలాసేపు ఆలోచించి ‘‘అది బలమూ కాదు. బలహీనతా కాదు. ఒకానొక మానసిక స్థితి. ఈ స్థితిని అవతలి వ్యక్తి అలుసుగా తీసుకోనంత వరకూ, ఈ స్థితిని గౌరవించినంత వరకూ, తనూ ఈ స్థితిని ఆనందించినంత వరకూ ఈ స్థితి వల్ల ప్రమాదమేమీ లేదు. అవతలి వ్యక్తులు అలుసుగా తీసుకున్నప్పుడు వాళ్ళు వీరిని పరాధీనులుగా చేస్తారు. పరాధీనత అనుభవించే వారికి బాగుండదు గానీ స్వాధీనం చేసుకున్నవాళ్ళకు బాగుంటుంది. దానివల్ల వాళ్ళకు లాభం కూడా. అదే బాగుంటుందనీ, అదే మంచిదనీ, భద్రత అనీ పరాధీనుల్ని… అంటే స్త్రీలను పురుషులు నమ్మిస్తారు. ప్రేమ, పరాధీనత, పాతివ్రత్యం, ఇవన్నీ కలగలిసి చిక్కగా చిక్కుబడిపోతాయేమో మామూలు బార్యాభర్తల సంబంధాల్లో. చాలాసార్లు ఆ సంబంధంలో ప్రేమ ఉండదు. ఇక అప్పుడది నరకమే. ప్రేమ బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేననుభవించే స్థితి కేవలం ప్రేమ కాదు. మోహం కలగలిసిన ప్రేమ అనిపిస్తోంది. బహుశా ఈ మోహ తీవ్రత కాలం గడిచేకొద్దీ తగ్గవచ్చు’’.
‘‘శారదా.. మరీ చీల్చి చూడకు. కొంత మిస్టరీ మిగుల్చు. అప్పుడే బాగుంటుంది.’’
‘‘నీకు మిస్టరీ బాగుంటుంది. నాకు స్పష్టత బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఏంగెల్స్‌ ‘‘కుటుంబం`వ్యక్తిగత ఆస్తి’’ చదవాలోయ్‌ మనిద్దరం కలిసి’’. ‘‘చలం, కృష్ణశాస్త్రి, నండూరి కవిత్వాలను చదవాల్సిన సమయంలో ఏంగెల్స్‌ని చదవాలంటావు. నీకు మరీ మేధావితనం పెరిగిపోతోంది. ఇలాగైతే నాకు నచ్చదు’’.
‘‘నేను ఇంగ్లండులో ఉన్నప్పుడు నువ్వు రాసిన ఉత్తరాల నిండా అవే గదా’’.
‘‘ఔను ప్రపంచంలోని కవులంతా మనకోసమే, మన ఆనందం కోసమే ప్రేమ కవిత్వం రాశారు. సంగీతమంతా మన ప్రేమనే గానం చేస్తోంది. ప్రకృతి మన ప్రేమనే పరిమళిస్తోంది’’.
శారద తన్మయంగా మూర్తి వంక చూస్తూ ఉండిపోయింది. ఆలోచనలన్నీ ఆగిపోయాయి. అనుభూతి, పరవశం, ప్రేమ మనశ్శరీరాలను దురాక్రమించాయి. ఆ దురాక్రమణకు లొంగిపోయి పొంగిపోయారు మూర్తి, శారదలు.
శారద, మూర్తిలకు జరిగింది వివాహం కాదని బంధుగణం చెవులు కొరుక్కున్నా సుబ్బమ్మ చలించలేదు. శారద జీవితంలో వచ్చిన కొత్త ఆనందాన్ని కళ్ళారా చూసి ఆనందపడుతోంది. అసలు శారద ఒంటరిగా ఉండిపోతుందేమోననే భయం తొలగి శారదకు ఇష్టమైన తోడు దొరికిందని తృప్తి కలిగిందామెకు. కానీ మనిషి తృప్తికి తృప్తిపడి ఊరుకునే గుణం లేదు. అందుకే సుబ్బమ్మ మనసులో కొత్త కోరికలు చిగుర్లు వేస్తున్నాయి. పద్మ నెల తప్పిందని తెలిసినప్పటి నుంచీ శారదకి చిన్న పాపాయి పుడితే అన్న ఊహ బీజంగా ఆమె మనసులో పడి మహా వృక్షమై సుడిగాలికి కంపించినట్లు అలజడి సృష్టిస్టోంది. శారదను అనుక్షణం కనిపెడుతూ ఉంది. శరీరంలో గానీ, ప్రవర్తనలో గానీ, మానసికంగా గానీ శారదలో ఏ మార్పయినా వచ్చిందా అని పరిశీలిస్తోంది. శారద వయసు తక్కువ కాదు. తొందరగా బిడ్డను కంటే మంచిది. డాక్టరయిన కూతురికి ఈ సంగతి తను చెప్పక్కర్లేదన్న వివేకం ఆమెకుంది. కానీ ఒక్కోసారి వివేకం లేకపోవడమే మంచిదేమో. కూతురితో ఈ సంగతులన్నీ నేరుగా ప్రస్తావించలేక, అది అణచుకోలేక సుబ్బమ్మ ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడిరది. రక్తపోటు పెరిగింది. శారద మందులైతే ఇచ్చింది గానీ తల్లి ఎందుకు అశాంతి పడుతోందో, అలజడికి లోనవుతోందో అర్థం కాలేదు.
ఒకరోజు తీరిక చేసుకుని సుబ్బమ్మ పక్కనే పడుకుని ఆమె పొట్టమీద చేయివేసి అక్కడున్న పెద్ద పులిపిరిని చేతితో మెల్లిగా నిమురుతోంది. అది శారదకు చిన్నప్పుడైన అలవాటు. ఎప్పుడు తల్లి పక్కన చేరినా చెయ్యి అలవాటుగా పొట్టమీద పులిపిరిని వెతుక్కుంటుంది.
‘‘ఎందుకమ్మా నీ రక్తపోటు పెరుగుతోంది? ఎందుకో నీ మనసు పాడుచేసుకుంటున్నావు. దేనికో బాధపడుతున్నావు. నాతో చెప్పవా?’’ లాలనగా శారద అడిగిన తీరుకి సుబ్బమ్మ కళ్ళు తడి అయ్యాయి.
‘‘చెప్తాను. నువ్వు నవ్వకూడదు. తీసిపారెయ్యకూడదు.’’ చిన్నపిల్లలా అంటున్న తీరుకి శారద నవ్వి`
‘‘అలాగే… నవ్వను. ఒట్టు. చెప్పు’’ అంది పెదిమలు రెండూ బిగించుకుంటూ.
‘‘నాకు మనవడో, మనవరాలో ఎవరో ఒకరు కావాలి’’.
శారద పెదిమలు విచ్చుకున్నాయి. నవ్వుల చెట్టులాంటి శారద ముఖమంతటి నుండీ పువ్వులు జలజలా రాలటం మొదలయింది. సుబ్బమ్మ ముఖం చిన్నబోయింది.
శారద నవ్వు ఆపి తల్లిని కావలించుకుని`
‘‘అమ్మా… దీనికా ఇంత కథ చేసి అనారోగ్యం తెచ్చుకున్నావు. నాకీ నెల నెలసరి రాలేదు. ఇంకో రెండు వారాలు చూసి నీకు చెబుదామనుకున్నాను. నీకు ఎవరు కావాలో కరక్టుగా చెప్పు’’. సుబ్బమ్మ ఆనందం కట్టలు తెంచుకుంది. శారదను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ ‘‘నిజం చెప్పనా. నాకు నీలాంటి మనవరాలే కావాలి. నిన్ను మళ్ళీ పెంచుకుంటాను.’’
శారదకు సుబ్బమ్మను చూస్తే ఎందుకో ఒక్కసారి దిగులనిపించింది.
తండ్రి చనిపోయాక, తనే లోకం ఆమెకు. తను ఏ ప్రపంచాన్ని ఏర్పరచుకుందో, ఆ ప్రపంచాన్నంతా ప్రేమించింది. మామూలు మనుషుల్ని ఎదిరించింది. తను ఏం చెయ్యాలనుకున్నా ‘పద ముందుకు’ అని ప్రోత్సహించింది. మిగిలిన ఆడపిల్లలందరి కంటే భిన్నంగా పెరుగుతున్న తనను ఒక్కరోజు ‘అదేమిటమ్మా ఇలా ఎందుకమ్మా’ అనలేదు. అనంతమైన విశ్వాసం తనమీద. అమ్మకు ఎంత చేసినా తక్కువే. తనేమో ఆమె ఆరోగ్యాన్ని గురించి కూడా పట్టించుకోలేని పనుల్లో మునిగిపోతోంది.
‘‘ఏంటి తల్లీ ఆలోచిస్తున్నావ్‌’’
‘‘ఏం లేదమ్మా… నాలాంటి మనవరాలు ఎందుకమ్మా? నావల్ల నీకన్నీ కష్టాలే’’.
‘‘కష్టాలా?’’ ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.