గంగాజలం కంటే పవిత్రమైన గంగూభాయ్‌ -ప్రసాదమూర్తి

ఇక్కడే ధీరూభాయ్‌లూ ఉంటారు, ఇక్కడే గంగూభాయ్‌లూ ఉంటారు. జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ ఓ జరా సోచ్‌నా భాయ్‌. గంగూబాయ్‌ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో నిన్న చూశాను. ఎవరిని అవినీతిమంతులని సమాజం చీదరించుకుంటుందో వారి నోటి నుంచే మనం నీతులు వినాల్సి రావడం ఒక పెద్ద ప్యారడాక్స్‌. ఇంకా ఏది నీతి, ఏది అవినీతి అనే విషయంలో ఈ

మానవ సమూహం ఒక కన్‌క్లూజన్‌కి రాలేదు. బహుశా ఎప్పటికీ రాలేదు కూడా.
ఈలోగా ఒక గంగూబాయ్‌ వచ్చి మనల్ని చూసి నవ్వి, నవ్వి, చివరికి కన్నీళ్ళను మాత్రం ఎవరికీ కనపడకుండా దాచుకుంటూ ఉంటుంది.మనం కూడా ఆ విషాద వినోదం చూస్తాం. అయినా ఈ పత్తిత్తు మనకు నీతులు చెప్పేదా అని పత్తిత్తులంతా పళ్ళు బిగిస్తూనే ఉంటారు. కొన్ని సినిమాలను సినిమాలుగా చూడాలి. కొన్ని సినిమాలను సినిమాలుగా కాకుండా మన జీవితాలకు రన్నింగ్‌ కామెంట్రీగా చూడాలి. నిజాలు నచ్చవు. నచ్చకున్నా నిజం నిజం కాకుండా పోదు.
సర్వసంగ పరిత్యాగులూ, వేశ్యలూ మాత్రమే మనకు అసలైన నీతిని బోధిస్తారేమో. వేమన్న, పోతులూరి లాంటి వారు, మధురవాణి, గంగూబాయ్‌ లాంటి వారు. మిగిలిన వారంతా మీనమేషాల లెక్కలో లెక్క తప్పుతుంటారు. వీళ్ళకు నోరిప్పితే పోగొట్టుకునేవి చాలా ఉంటాయి. వారికి పోయేదేముంది? మహా అయితే మనకు అంటిన మకిలి తప్ప.
గంగూబాయ్‌ సినిమా మీద రివ్యూలు చూశాను. చాలా వరకు అసంతృప్తిని వ్యక్తం చేసినవే. కానీ అలా కాదు, నేను గంగూబాయ్‌ని సినిమాలా మొదలుపెట్టి జీవితంలా చూశాను. గురజాడ లాంటి గొప్ప రచయితలు వేశ్యలతో చీవాట్లు పెట్టించారు. మనమెంత నీతిమంతులమో మధురవాణి లాంటి వారితో కుండబద్దలు కొట్టించారు. రామప్పపంతుళ్ళు, లుబ్దావధాన్లు, గిరీశాలు అప్పుడే కాదు ఇప్పుడూ ఉన్నారు. మరి మధురవాణులూ ఉంటారు కదా. గంగూబాయ్‌ స్త్రీలకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే గంగూబాయ్‌ తమ వృత్తికి లైసెన్స్‌ కావాలని అడుగుతుంది కాబట్టి. అలాంటి చీడపురుగుల వల్లే తమ ఉత్తమోత్తమ పురుష పుంగవులు చెడిపోతారని వారి భయం.
ఈ భయం ఈనాటిది కాదు. సరే వారి భయం వారిదనుకుందాం. దానికి గంగూబాయ్‌ మంచి సమాధానమే చెప్పింది. తామే లేకుంటే రేప్‌లు పెరుగుతాయని, ఆడపిల్లలకు రక్షణ కరువవుతుందని, (ఇప్పుడు మాత్రం ఉందేంటి? ఉంటే కామాటిపురాలెందుకుంటాయి?) మీ పురుషులు మిమ్నల్ని చూస్తూ ఇంట్లో కూర్చోరని, వాళ్ళు వేట ప్రారంభిస్తారని, దాంతో మీ సభ్యసమాజం వేశ్యావాటిక కంటే దరిద్రంగా మారిపోయే ప్రమాదం ఉందని గంగూబాయ్‌ వివరంగా చెప్తుంది. కానీ, ఇది కేవలం సినిమా డైలాగులా చూస్తే మర్చిపోతాం.
కాస్త ఈ జీవితాన్ని అటువైపు తిరగేసి చూస్తేనే గాని విషయం బోధపడదు. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న వారికి అనేక చురకలు అంటిస్తుంది. మా దగ్గరకు వచ్చే వారి విషయంలో కులమతాలు, రంగు, ధనిక, పేద, ఊపర్‌ నీచే భేదభావాలు పాటించం అని చెప్తే ఆ క్షణంలో నవ్వుకుని వదిలేస్తాం, అంతే కదా. కానీ మన మాటల్లో, కలల్లో, ఉపన్యాసాల్లో, పుస్తకాల్లో మాత్రమే ఉన్న సర్వమానవ సమతా స్వర్గం గంగూబాయ్‌ లాంటి వారి దగ్గర మాత్రమే వాస్తవంలో ఉందన్న వాస్తవాన్ని గమనించినప్పుడు ఇన్నేళ్ళ మన అభివృద్ధిని ఎక్కడ మడిచి పెట్టుకోవాలో కాస్తంత ఆలోచించుకుని కాస్తంత సిగ్గుపడతాం.
కామాటిపుర పక్కనే ఉన్న స్కూలు మీద చెడు ప్రభావం పడుతుందని ఆ వేశ్యావేటికను ఖాళీ చేయించమని పెద్దమనుషులు కోర్టులో పిటిషన్‌ వేస్తారు. అప్పుడు గంగూబాయ్‌ అడుగుతుంది… ఏం సార్‌! మా ప్రభావం వాళ్ళమీదేనా, ఆ స్కూలు ప్రభావం మా పిల్లల మీద ఎందుకు పడదు? అని. సమాధానం అప్పటి ప్రధాని నెహ్రుగారే చెప్పడానికి తికమకపడ్డారు. అసలు ఈ సినిమాలో గంగూబాయ్‌ ప్రతి మాటా విని ఈ సకల సభ్య సమాజమూ తరించవలసిందే. ఓటు కోసం రాజకీయ నాయకులకు గంగూబాయ్‌ కావాలి. నోటు కోసం పోలీసులకు గంగూబాయ్‌ కావాలి. కోట్ల కోసం పిల్లల్నెత్తుకెళ్ళి అమ్ముకునే వారికి గంగూబాయ్‌ కావాలి. ఇళ్ళల్లో ఉండే పతివ్రతలతో సుఖానికి ఒక పరిమితి ఉంటుందని, అపరిమిత సుఖం పతితల దగ్గరే దొరుకుతుందని పరుగులు పెట్టే పవిత్రుల ఆటవిక వేట కోసం గంగూబాయ్‌ కావాలి. దొంగలు, ఖూనీకోర్లు, మాఫియా డాన్‌లు, రాజకీయ కీచకులు, అరాచకులు, తాగుబోతులు, లక్షా తొంభై లంపెన్‌ రంపాలు మాత్రమే కాదు, మర్యాద రామన్నల మహా ప్రపంచమంతా కష్టపడి, ఇష్టపడి పగటికీ, రాత్రికీ ముసుగులు వేసి పెంచి పోషించుకుంటున్నదే గంగూబాయ్‌ వ్యవస్థ. దీన్ని రద్దు చేస్తే అంతా తలకిందులే.
ఈ సినిమాని ఆ కోణంలో చూడాలి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఉమ్రావ్‌ జాన్‌లో రేఖతో, పాకీజాలో మీనాకుమారితో, మండీలో స్మితాపాటిల్‌తో అలియాభట్‌ని పోల్చి చూస్తే ఎలారా నాయనా, గంగూబాయ్‌తో పోల్చి చూడాలి కదా.
కలల రాజకుమారుడితో ఎక్కడికైనా పారిపోవడానికి సిద్ధపడే అమాయకురాలైన అమ్మాయి కామాటిపురా ఎలా చేరుకుంది? అక్కడ రక్తపు మడుగులో ఒక అత్తరు పువ్వుగా ఎంత హింసాత్మకంగా వికసించింది? గంగూబాయ్‌గా ఎలా మారింది? మారి సాటి పడతుల బాగోగుల కోసం తనెంత కొవ్వొత్తిలా కరిగిపోయింది? వారి పిల్లల చదువుల కోసం, గౌరవనీయుల సమాజంలో వారికి కనీస గౌరవం కోసం ఎంత పోరాటం చేసింది? రాజకీయ, అరాజకీయ సభ్యాసభ్య మాయలమరాఠీలతో, గూండాలతో నెగ్గుకు రావడానికి మాఫియా గంగూ ముద్రనెలా మోసిందీ… ఇదంతా చరిత్ర కదా, కనుకనే దీన్ని ఆ ప్రత్యేక దృష్టితో చూసినపుడు నాకు చాలా చాలా నచ్చింది. ఆలియాభట్‌ కంటి చివర అనేకసార్లు ఒక కొంటె నవ్వులాంటి విషాద వైరాగ్యంతో చేసిన వెక్కిరింపు మౌన దాడి ముందు ఏ అణు బాంబూ పనిచేయదు.
అన్నింటికంటే నాకు ఎక్కువగా నచ్చింది ప్యాసా సినిమాలోని సాహిర్‌ లూధియాన్వీ పాటలోని పంక్తులను చివర దర్శకుడు గుర్తు చేయడం. ఆ మాటలు కేవలం రాతలు కాదు, అవి మనకు, నెహ్రులాంటి ఆ తర్వాత రాజకీయ తరాలకూ ఒక మహాకవి పెట్టిన వాతలు. ప్యాసా సినిమాలో వేశ్యావాటికలో రోజురోజూ వాడి కాలి బూడిదైపోతున్న ఆడబిడ్డల కోసం, కవి కన్నీరు కారుస్తూ పాడిన పాటలోని వాక్యాలవి. కొందరు ఆ మాటల్ని వాడిన తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.
నెహ్రు కాలంలోనే గంగూబాయ్‌ కథ జరిగిందో లేదో తెలీదు. జరగకున్నా అది పెట్టడం చాలా సమంజసం. అప్పుడూ ఇప్పుడూ పుణ్యభూమి నా దేశం నమో నమామీ అంటూ గర్వపడే పెద్ద పెద్ద నాయకులకు ఈ పాట ఎప్పటికీ పక్కలో పాములాంటిదే. జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ ఓ కహా హై అని అడుగుతాడు కవి. వారిని ఒకసారి ఇక్కడకు తీసుకువచ్చి చూపించమని కాబోలు… చూస్తే వారి ముఖాలు ఎలా ఉంటాయో చూడాలని కూడా కవి భావం కాబోలు. అంత తేలిక కాదు ఇలాంటి సినిమాలను జీర్ణం చేసుకోవడం. అప్పట్లో నెహ్రుగారు ఈ పాట విని కన్నీరు పెట్టారని చెప్తారు.
ఏ కూచే, యే నీలామ్‌ ఘర్‌ దిల్‌ కషీకే, యే లుట్తే హుయే కారవా జిందగీ కే, కహా హై కహా హై ముహాఫిజ్‌ ఖుదీ కే, జిన్హే నాజ్‌ హై హింద్‌ పర్‌ వో కహా హై? కహా హై? కహా హై? ఇలా సాగిపోయే ఆ పాట పంక్తులు ఇంకా ఇంకా గుర్తు చేసుకుని సిగ్గుపడే స్థితిలోనే ఉన్నంతకాలం అవి ఎవరు ఏ సందర్భానుసారం గుర్తుచేసినా వారికి నా పాదాభివందనాలు. ఇంకా శ్రద్ధ తీసుకుంటే, కొన్ని ఉద్వేగాలు, కొన్ని ఉద్రేకాలు, కొన్ని చలనశీల సన్నివేశాలు, ఇంకొన్ని గొప్ప పాటలు పెడితే బాగానే ఉంటుందని నాకూ అనిపించింది. కానీ దర్శకుడు తక్కువోడు కాదు, అసలు కథకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్టున్నాడు. అందుకే సంజయ్‌ లీలా భన్సాలీకి నా వందనాలు. భ్రష్ట సమాజానికి పతితుల మాటలు ఎప్పటికీ మరింత అవసరమే.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.