ఎప్పుడూ చలాకీగా ఉండే బిందు నిర్లిప్తంగా, నిస్తేజంగా కనబడిరది. నిన్న సాయంత్రం కూడా అలాగే ఉంది. అపార్ట్‌మెంట్‌లో అందరితో కలివిడిగా ఉండే బిందుతో కాస్త ఎక్కువ స్నేహమే శాంతికి. ఎదురెదురు ఫ్లాట్స్ అవడం వలనా, ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు కావడం వల్ల కూడా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా ఐదారేళ్ళుగా రెండు మూడు రోజులకొకసారైనా కాసేపు మాట్లాడు కోవడం అలవాటైంది. అలా మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి ఏ అంశం ఉండక్కర్లేదు.
ఇంటి పనుల దగ్గర్నుంచి ఉద్యోగం దాకా, కరివేపాకు దగ్గర్నుంచి మలైకోఫ్తా దాకా, అపార్ట్‌మెంట్ అసోసియేషన్ దగ్గర్నుంచి దేశ రాజకీయాల దాకా, కుటుంబ కలహాల దగ్గర్నుంచి మహిళా ఉద్యమాల దాకా ఎన్నో అంశాలు దొర్లిపోతుంటాయి వాళ్ళ మాటల్లో. ఎప్పుడూ నవ్వులే కాని నవ్వులాటలు ఉండవు.
ఎవరి బాధలు ఎలా ఉంటాయో, వాటిని తమ తోనే దాచిపెట్టుకుని బైటికి మామూలుగా కనబడ డానికి పడే పాట్ల వల్ల స్త్రీలు మానసికంగా ఎంత ఘర్షణకి లోనవుతున్నారో, వారి ఆరోగ్యాలు ఎలా పాడవుతున్నాయో ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు. స్త్రీలు వారి ఐడెంటిటీని బైటపెట్టకుండానే తమ బాధల్ని పంచుకోడానికి హెల్ప్‌లైన్లు ఎంత ఉపయోగ పడుతున్నాయో చెప్పుకున్నారు. ఈ మాటల్లో ప్రశ్నల్ని లేవనెత్తడం బిందు పని, వాటికి సమాధానా లతో పాటు సమస్యల్ని ఒంటరిగా ఎదుర్కోలేనప్పుడు సహకారం తీసుకోడానికి గల వ్యవస్థల గురించి, విధానాల గురించి చెప్పడం శాంతి పని. మరి శాంతి చేస్తున్న ఉద్యోగం అలాంటిదే కనుక.
గత పదిరోజులుగా శాంతి బిజీగా ఉండి బిందు కనబడినా పలకరింపే కానీ నిలబడి మాట్లాడే సమయం లేకపోయింది. నిన్న, ఇవాళ బిందు వాలకం చూస్తే ఏదో పెద్ద సమస్యలో
ఉన్నట్టనిపించి పని పూర్తిచేసుకుని బిందు ఫ్లాట్‌కి వెళ్ళింది శాంతి. ఆదివారం అవ్వడంతో ఆమె భర్త, కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నారు. శాంతి రావడంతో అప్పటివరకు టి.వి. చూస్తున్న సౌరభ్ ‘హలో ఆంటీ’ అని పలకరించి, రెండు మాటలు మాట్లాడి లోపలికెళ్ళిపోయాడు.
అప్పటివరకు ఫోన్ చూసుకుంటున్న బిందు భర్త రాజు ఫోన్ పక్కన పెట్టి ‘చాలా రోజులైంది చెల్లెమ్మా ఇలా వచ్చి, ఇవాళ భోజనం ఇక్కడే, బావగార్ని కూడా పిలుస్తా…’ అంటూ హడావిడి చేశాడు. ‘ఫ్రెండ్సిద్దరూ మాట్లాడుకోండి వంట నేను చేస్తా’ అని వద్దన్నా వినకుండా చికెన్ తెస్తానంటూ బైటికెళ్ళాడు. ‘భోజనానికి ఇక్కడికే రమ్మని అన్నయ్యతో చెప్పి వెళ్ళు, మర్చిపోకు’ అంది వెనకనుండి బిందు. బైటికెళ్ళిన రాజు కనీసం గంటదాకా రాడని ఇద్దరికీ తెలుసు. అందరికీ తల్లో నాలికలా, ఎంతో స్నేహంగా ఉండే రాజుకి ఊరంతా ఫ్రెండ్సే. ఎవ్వరూ తొందరగా వదిలిపెట్టరు మరి.
ఇదంతా సరేకానీ నువ్వలా ఎందుకున్నావో చెప్పు. ఆరోగ్యం బానే ఉందా? ఊర్లో అంతా బానే ఉన్నారా? ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువయిందా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది శాంతి. ఒక్క క్షణం మౌనంగా శాంతిని చూస్తూ ‘లోపల కూర్చుందాం రా’ అంటూ బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. ‘నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఇంకెవ్వరితోనూ చెప్పలేను ఇవి…’ అని శాంతికి ఎదురుగా కూర్చుంది. మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది.
పెళ్ళై పదిహేనేళ్ళయింది. బిందుని ప్రేమించా నని తిరిగి తిరిగి, నాలుగేళ్ళపాటు ప్రయత్నించి, ఆమె ఇంట్లో వారిని ఒప్పించి, తనింట్లో వాళ్ళని ఎదిరించి, పెళ్ళిచేసుకున్నాడు రాజు. మహా అయితే రెండేళ్ళు ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉన్నారు. ఊరంతా స్నేహితులే ఉన్న రాజుకి, చదువుకున్న, తెలివైన, అందంగా ఉండే బిందు ఒక స్టేటస్ సింబల్ అయింది. పార్టీల్లో బిందుని అంటి పెట్టుకునే ఉండి ఆమెకేమి కావాలో అడిగి మరీ తెచ్చిచ్చేవాడు. జోక్స్‌తో ఆమెని నవ్వించేవాడు. రిలేషన్ అంటే ఇలానే ఉండాలనిపించేది అందరికీ. ఆ మాట వారితో అనేవారు కూడా. నన్ను చూసి నేర్చుకోండి మీరు కూడా అని కవ్వించేవాడు ఫ్రెండ్స్‌ని. ఆడా, మగా తేడా లేకుండా అందరితో చనువుగా ఉండేవాడు. ఎదుటివారూ అంతే. ఎవ్వరితో ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు రాజు. బిందు కూడా మురిసిపోయేది.
పెళ్ళయిన రెండేళ్ళకి ప్రెగ్నెంట్ అయిన బిందు ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకుంటానని అంది. డెలివరీ అయ్యాక ఒక ఏడాది ఆగి మళ్ళీ ఉద్యోగం చూసుకుంటానంది. అప్పుడు మొదలైంది రాజు స్వరూపం ఒకటొకటిగా తెలియడం.
పేరున్న కంపెనీలో హెచ్.ఆర్.మేనేజర్‌గా పనిచేస్తున్న బిందు ఉద్యోగం మానేస్తే, మళ్ళీ రెండేళ్ళ తర్వాత అంటే అలాంటి ఉద్యోగం దొరకదని, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుకి తన సంపాదన మాత్రమే చాలదని, ఇంట్లో కూర్చుని తింటే లావైపోయి అందం చెడిపోతుందని, ఇంకా ఎన్నో చెప్పాడు. ఇవన్నీ ఆశ్చర్యం అనిపించినా ఎక్కువ వాదించదలచుకోని బిందు ఉద్యోగం కొనసాగించింది. ఏడ్నెల్లు నిండాయి. ఆఫీస్‌కి వెళ్ళి రావడం ఇబ్బందవుతోంది బిందుకి. ఆయాస పడుతోంది. ఒకరోజు అనుకోకుండా ఆఫీసుకెళ్ళడం ఇబ్బందై ఇంట్లోనే ఉండిపోయింది. పదకొండ వుతుండగా పడుకునున్న బిందుకి తలుపు తెరిచిన చప్పుడైతే రాజు వచ్చి ఉంటాడని, లోపలికొస్తాడులే అని చూస్తోంది. అనుకున్నట్టుగానే బెడ్రూం తలుపు తోసుకుంటూ రాజు వచ్చాడు, కానీ గర్ల్‌ఫ్రెండ్‌ని పొదివి పట్టుకుని అత్యంత సన్నిహితంగా!
ఆ రోజైన గొడవ, తర్వాత పరిణామాల వల్ల ఉన్న ఊరొదిలి, రిక్వెస్ట్ మీద ట్రాన్స్‌ఫర్ చేయించు కుని, వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్యా బంధం తెగిపోయినట్లే అనిపించింది. కాళ్ళావేళ్ళా పడ్డాడు. ప్రెగ్నెంట్ అవడంతో భార్యని ఇబ్బంది పెట్టలేక తాను తప్పు చేశానన్నాడు. బతిమాలాడు. బిందు కరిగిపోయింది. ఆర్నెల్లు గడిచింది. బానే ఉన్నాడనుకుంటుండగానే కథ మొదటి కొచ్చింది. మళ్ళీ ట్రాన్స్‌ఫర్. ఇక విడాకులే దారి అనుకున్న సమయంలో కొడుకు భవిష్యత్తుని పాడు చెయ్యొద్దని, అందరితో చెప్పించాడు. ఒత్తిడికి లొంగిపోయింది. ఇప్పటికీ గర్ల్‌ఫ్రెండ్స్ అయితే తగ్గారు కానీ ఛాటింగ్, ఫోటోస్ షేరింగ్, పార్టీలు మామూలే. అన్నింటికీ ఒక చక్కటి కథ నిజమని పించేలా సిద్ధంగా ఉంటుంది.
సఖి సెంటర్‌కి వెళ్ళింది. భరోసాకి వెళ్ళింది. కౌన్సిలింగ్‌లో అంతా బానే ఉందని తేల్చేశారు. నువ్వే సమస్య అన్నట్టు మాట్లాడారు. రాజు అసలు రంగు ఎవ్వరికీ తెలియట్లేదు. తను ప్రతిచోటా చెడైపోతోంది. తనదే తప్పని చూపిస్తున్నాడు. ఏ దారీ లేదని, ఈ ఘర్షణ తట్టుకోలేనని, మానసికం గా చచ్చిపోయానని, బతకాలని లేదని ఏడ్చింది. మన దగ్గర మానసిక ఆరోగ్యానికి ఇంకా ప్రాధాన్యత లేకపోవడంతో తనని సరిగ్గా పట్టించుకోవడం లేదని, రాజు మాటల్లో ఏది నిజమో తెలుసుకోలేక పోతున్నారని అర్థమైంది శాంతికి. తనేం చెయ్యాలో కూడా స్థిరంగా నిర్ణయించుకుని బిందుకి చెప్పింది.
ఇటువంటి కుటుంబాలు మన చుట్టూ చాలా ఉన్నాయి. పైకి ఒకలా కనిపించినా లోలోపల బోలు, బలహీనంగా ఉన్న ఈ కుటుంబాల్లో మహిళల స్థానం ఎలా నిలుపుకోడం? ఏది నిజమో ఎలా నమ్మడం??