నా సంతోషం సొరకాయకూర వండడంలో లేదు సూర్యోదయంలో వుంది

వంట చెయ్యడమంటే నాకు పరమ చిరాకు.

దాన్నొక వృత్తిగా మలచి విశ్వవిద్యాలయాలు నడిపిస్తూ ఏటేటా వేలాది మంది సంస్థాపరమైన వంట నిపుణుల్ని దిగుమతి చేస్తున్నా సరే అవి నాకేమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. మూడు తరాల ఆడపిల్లలు కలలు కన్న ఎయిర్ హోస్టెస్ (గగన సఖి) ఉద్యోగం కూడా వంటకి అనుబంధమైన వడ్డన వుండటం వల్లనే అనాకర్షణీయంగా కనిపిస్తుంది.

నా అభిప్రాయాలు నావి అవి ఎవర్నైనా బాధిస్తే క్షమించాలి. ఆ మాటకొస్తే నన్ను నేనిలా క్షమించుకుంటూ బాధించుకుంటూ గత పాతికేళ్ళుగా వొండి వారుస్తూనే వున్నాను. బహుశా ఒక మహా నగరానికి సరిపడినంత కూరలూ పచ్చళ్ళూ, సాంబార్లూ ఈ సుష్కమైన చేతుల్తో ఉడికించేసి వుంటాను.

వంటని ఇంతగా ద్వేషించే మీరు అందులో ఉన్న “శ్రమ జీవన సౌందర్యా”న్ని ఎలా గుర్తిస్తారనో, ఎవరు వండకపోతే తిండి ఎలా తింటారనో మీరు నన్ను అడగచ్చు. అన్ని పనుల్లాగే వంటకూడా అభిరుచికీ అవసరానికీ పరిమితమై వుండక ఒక జెండర్ జీవితాన్నే ఎందుకు కాల్చుకు తింటుందనేది నా ప్రశ్న.”వంట బానే చేస్తావుగా కాస్త మొహం ప్రశాంతంగా వుంచుకుంటే ఏం పోయింది?” నీకేం కావాలో చెప్పు మిక్సీనా, కొత్త స్టవ్వా? అంటాడు మా ఆయిన.

అడిగితే వంటావిడ్ని కూడా కొని పెడతాడు. అప్పుడు నేను వంటింటికి నటీమణి స్థాయినుంచి దర్శక స్థాయికి మారుతానే తప్ప ఆ గోడలు దాటి ఇవతలికి మాత్రం రాలేను. నేను అడుగుతున్నవి ప్రత్యామ్నాయ మార్గాలు కాదు. విధానంలో వున్న లోపాల్ని గురించి.

బతకడం కోసం తినాలి కాబట్టి తిండికి వంట తప్ప, ఆ వండేందుకు నా చేతులు తప్ప ఇంకో దారి లేదు కాబట్టి నేను పుట్టకముందునుంచి వంటింటికి లొంగిపోయాను.

ఈమధ్య పన్నాల సుభ్రమన్య భట్టు అనే పెద్దమనిషి, “నేనిప్పుడు ఇంటికెళ్ళీ, మడి కట్టుకుని మా అమ్మకి వొండిపెడతాను తెలుసా? ఏమిటి మీ ఫెమినిస్టు కష్టాలు?” అన్నాడు.

ఇందులో అనేక కోణాలు ఉన్నాయి.

వంట ఏమంత కష్టం తల్చుకుంటే నాలాంటి మగధీరుడు కూడా వొండి పడేస్తాడు. అనేది ఒకటి. అయితే ఇదే వంట వాళ్ళమ్మ మంచంలో పడ్డాకా గానీ రుచి చూసే భాగ్యానికి నోచుకోలేదు. ఈ భాగ్యానికి ముందు ఆవిడ ఎన్ని టన్నుల మడి బట్టల్ని ఆరేసిందో, ఎన్ని ఎకరాల్ని ఉడికించిందో ఈ కొడుక్కి తెలీదు.

వంటింటిని గురించి సగటు మగవాడి కబుర్లు భలే ఆసక్తిగా వుంటాయి. “ప్చ్… ఏం ఉద్యోగాలో ఏం పాడో ఆడాళ్ళ ప్రాణానికి సుఖం లేకుండా పోతోంది” అంటాడు మా మామగారు. సుఖంగా వుండటమంటే సోరకాయని ఆవపోసి, పులుసుపోసి, పాలుపోసి, పెరుగుపోసి, సెనగలు పోసి, గన్నేరు పప్పులు పోసి వండటమనేది ఆయన అభిప్రాయం కావచ్చు. మరెందుకో గాని నా సుఖం సంతోషం సోరకాయలో లేవు. అవి సూర్యోదయంలో వున్నాయి. వంట చింతలేని ఆకాశంలో పొడిచిన సూర్యోదయం.

అందుకోసం నేను రాత్రే కూరలు తరుక్కుని కూచోవాలి. లేదా సూర్యోదయానికి ముందు ఇడ్లీ కుక్కర్ స్టవ్వు మీద విసిరి కొట్టి మేడమీదికి పారిపోవాలి. కుక్కరు ఈలేసినా వంటిల్లు కన్ను కొట్టినా వెనక్కి చూడకూడదు.

ఇడ్లీల కోసమే నిద్ర లేచిన వాళ్ళకి ఆ ఇడ్లీలంటే ఆసక్తి లేని, సూర్యోదయం మీద ప్రేమ వున్న వాళ్ళు ఆ ప్రేమంతా త్యాగం చేసి పిండి ముద్దలై ఉడకాలి. భలే బావుంది కదూ.

మగాడి హృదయానికి పొట్టలోంచి దారి వుంటుందిట. అంత చెత్త దారిలోంచి ప్రయాణించే అవసరం ఎవరికి రాకుండుగాక. మరి ఆడాళ్ళ హృదయానికి దారి ఎవరైనా కనిపెట్టారా? ఎదురుగుండా టి.వి లో “పెళ్ళాం ఊరెళితే…” అనే సినిమా వస్తోంది. ఒకే ఒక ఆడదాని కోసం ఎంత వెర్రి వెంగళాయిలైపోతున్నారో చూస్తున్నాను. మరి మొగుడు ఊరెడితే ఆ సమయం ఎంత ఫలవంతంగా, ఆనందంగా వుంటుందో ఎన్నాళ్ళనుంచో వాయిదా పడ్డ పనులు ఎంత బాగా చేసుకోవచ్చో నేనది అనుభవిస్తున్నాను. ఇవాళ అన్నం వొండుకోలేదు. కాఫీ కలుపు కోలేదు. నచ్చిన పాటలు విన్నాను. నచ్చిన రాతలు రాశాను. నచ్చిన మిత్రులతో కబుర్లు చెబుతున్నాను. ఆకలి వేస్తే బైటికి పోయి తింటాను. అది ఇంకొకరికి ఆదాయం అవుతుంది. ఇది స్వేచ్ఛ రుచి అభిరుచి పానీయం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to నా సంతోషం సొరకాయకూర వండడంలో లేదు సూర్యోదయంలో వుంది

  1. sarath says:

    మీ రచనలు అంతగా నాకు నచ్చవండీ.మరీ అలా మొహమ మీద కొట్టినట్లు చెపుతారేమిటీ. మీ రచనలు చదవటానికీ ముందే కొంత మానసికముగా prepare అవ్వక తప్పదు. వ్యంగ్యము బానే వుంటుంది కానీ సూటిగా గుచ్చుకుంటుందాయే. కానీ చదవకుండా ఉండలేని పరిస్థితి. అందుకనే మనస్సులో ఎన్ననుకుంటున్నా మీ article కనప్డగానే చదివి భుజాలు తడుముకోవడము పరిపాటి అయ్యింది. ఏదేమైనప్పటికీ చాలా thanks . చాలా రోజుల తరువాత మరోసారి మెదడులో బూజు వదిలింది.

  2. ఇల్లు, వంట, పిల్లలు (అత్తా మామలకు సేవ వగైరా వగైరా) ఇవన్నీ జన్మతహ ఆడోల్లు చెయ్యలిసిన పనులు అన్న మనస్థత్వం నుండి మొగోల్లే కాదు, ఈ పురుషహంకారానికి బలైన ప్రతీ స్తీ బయట పడాలె.

    ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలె. మూడేల్లు బ్రహ్మచారిగ అమెరికాల ఉన్నంక పెల్లిచేసుకొని వచ్చిన కొన్ని నెలలకు మా నాయిన ఫోనుల మాట్లాడుకుంట ఏం చేస్తున్నవు అంటె ‘కూరగాయలు కోస్తున్న’ అని చెప్పిన. ఎంబడే రియాక్ట్ అయ్యి ‘చ్చా ! నీకేం ఖర్మరా మగపిల్లలు గంటె పట్టొద్దు’ అని అన్నడు. “ఏమయ్యిందిప్పుడు, తిండి తినుడుల లేని శిగ్గు వండుకుంటె వచ్చిందా” అని అందామని నోటిదాక వచ్చింది, కని చిన్నప్పటినుంచి ఎదురు చెప్పే అలవాటు లేక ఆ మాట గొంతులనే సచ్చిపోయింది.

    విషయం నేను ఎదురు చెప్తనా లేదా అన్నది కాదు. నీకు నీ భార్య, (చెల్లె, తల్లి) పట్ల గౌరవం లేకపోతె, వాల్లకు అన్ని పనులల్ల సహాయ పడలేక పోతె పారసైట్లకు మనకు పెద్ద తేడా ఏం లేదు. సహచరి / అర్ధాంగి అని ఎవరికైనా పరిచయం చేసే ముందు అందుల ఎంత నిజమున్నదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన అవసరమున్నది.

    ఆడదానికి శత్రువు ఆడదే అన్నట్టు, తన జీవితంల ఎన్ని అనుభవించినా, సాగనంపేటప్పుడు ‘తలదించుకొని ఉండాలే, కుటుంబ గౌరవం నిలబెట్టాలే, నీ పతియే నీకు దైవం’ అని వాల్ల తల్లులు వల్లించిన వల్లమాలిన నీతులు తమ బిడ్డలకు అప్పజెప్పుతరు. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టినా (ఆడ గానీ మగవాల్లు గానీ) ఈ మనస్థత్వం నుండి దూరం కాకపోతే మనం ఇంకా రాతి యుగంలనే ఉన్నమని నేను అనుకుంట.

    నిర్మలగారు, మీరు ఇలాంటి వ్యాసాలు ఇంకా అందించాలని, చదివేవాల్లంత ఉత్తగ చదివి తర్వాత మర్చిపోకుంట వాటిల ఉన్న ఆంతర్యాన్ని గమనించాలని కోరుకుంటున్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.