కులం, మతం
ఒంటిమీద బెత్తమై తేలితే
నెత్తురోడే గాయాలు మీరు
అసీఫా, మనీషా,
బదౌన్ అక్కాచెల్లెళ్ళు
బిల్కిస్ బానో!
స్త్రీత్వాన్ని
శాపగ్రస్తంగా పొందినవారు మీరు
మీ ఆడతనం
పరికిణీ ఓణీల పండగ కాదు
బడిలో, గుడిలో
బహిర్భూమిలో
కులమతాల కుమ్ములాటల్లో
యుద్ధ భూములయ్యే
చిత్తు దేహాలు
చింపిరి బతుకులు మీవి
మీరు ఇండియాస్
డాటర్స్, సన్స్ కాదు
పుట్టుకతో నేరస్తుల జాబితాలో
నమోదైన వాళ్ళు
మీ కోసం ‘జాతి’ యావత్తూ
రోడ్డెక్కి న్యాయం కోసం
ఆక్రోశించదు
ఆడపిల్లలు నిర్భయంగా
తలెత్తుకుని తిరగాలని
దిశా నిర్దేశం చేసే దేశంలో
ఆనిర్భయాకాశం
మిమ్మల్ని చూసి అవకాశవాదమై
మొహం చాటేస్తుంది
……
ఒరే, చిన్నోడా!
ఎక్కెక్కి ఏడవటానికి
దేశపు ముద్దుబిడ్డవి కాదు నువ్వు!
నీకోసం కన్నీరు మున్నీరయ్యే
ఛానళ్ళు లేవు
రక్షించే చట్టాలు లేవు
గుక్కెడు మంచినీళ్ళ కోసం
పవిత్ర నదీనదాల ముందు
తరాల నుంచీ
గొంతెత్తి అరిచినా
కులం రెండు గ్లాసుల విషమై
ఎగజిమ్ముతూనే ఉంది
ఏదో మురిపెంగా యింద్రా చంద్రా
అని పేరుపెట్టుకోడం తప్ప
సొతంత్ర సొర్గం
గడప తొక్కింది లేదు
అమృతం తాగిందీ లేదు
మీ దాసత్వం
మరికొంత కాలం పాటు
పొడిగించబడిరదని
వజ్రాసనం మీద కూర్చుని మరీ
ఫత్వా జారీ చేసింది మను సంతతి
……
ఇక
రిసిగారే గాయాలు
విడివిడిగా కునారిల్లి పోతాయని
మనువు నిండుగా నిట్టూర్చాడు
గాయాలు
మాట్లాడుతున్నాయి
గుండెలో పూడుకుపోయిన
దుఃఖ సముద్రాలు
ఉప్పెనై మనువుని
కూల్చే రోజు కోసం చూస్తున్నాయి
‘బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి
చావదే సుమతీ!’
నల్లబల్ల మీద గోడల మీద
తను రాసుకుంటూ పోతున్నాడు
చావు బతుకుల్లో ఉన్న
చిన్నారి గాయానికి
తెల్లవారు జామునే
కల వచ్చింది.