పొద్దు పొడవక ముందే లేసి
అందరి అవసరాలు తీర్సి
అడవిని నిద్ర లేపి…
మోతుకు శెట్ల నడుమ రానిలా తిరుగుతూ
సంచులకొద్ది మోతుకాకులు తెచ్చి
దోర్నాలతో మిద్దంతా నింపి
పొద్దుందాకా అంటలు కుట్టి
ఇంటికి ఎన్నుబొక్క అయితివి
పాపం…
పొద్దు నీతో పోటీ పడలేక అలిసిపోయేది
కష్టాలకు బెదరని దైర్నం నీది
ఓంబత్తిలా కరుగుతూ…
నీ పిల్లలకు బతుకునిచ్చి
నీ బతుకే మరిసినవు
బతకనేర్సినొల్లు…
నిన్ను కవేల కిందికి శేర్సిరి
ఈపునంటిక డొక్కతో
కవేల కింద కూసోని గుడ్లు నిలేసి
మూతల్లకేసి సూస్తుంది
బుక్కెడు బువ్వకొరకు మా అత్తా
సుస్తయిందని పైసలడిగితే
పెయ్యంతా…
మోతుకుపూవ్వులా మారింది
నువ్వు పెంచిన మాంసం ముద్ద
నీకు ముద్ద పెట్టుడే దండుగ అంటుంది
నీ బతుకులానే…
నువుదిరిగిన అడవి మారింది అత్తా