స్త్రీ వాద వర్గ పోరాటం -బెల్‌ హుక్స్‌

జాతి సమస్య కంటే ఎంతోముందే స్త్రీలలో వర్గ బేధాలు, అవి స్త్రీల మధ్య సృష్టించే విభజనల గురించి స్త్రీ వాద ఉద్యమం చర్చించింది. స్త్రీ విముక్తి ఏర్పడిన కొత్తల్లో ప్రధానంగా తెల్లజాతి స్త్రీలే ఉండేవారు కాబట్టి వారి మధ్య వర్గపరమైన బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి.

వర్గపరమైన హెచ్చు తగ్గులు ఉన్నాయని తెల్లజాతి వర్గ స్త్రీలు గుర్తించారు. స్త్రీ వాద
ఉద్యమంలో రెండు రకాల దృక్పథాలు సంఘర్షించుకున్నాయి. వర్గ వ్యవస్థని ప్రశ్నించకుండా పురుషులతో సమానత్వం కోరుకునే సంస్కరణ వాద దృక్పథానికి, పాత వ్యవస్థల్ని మార్చి సమానత్వం, అన్యోన్యతలని తేవటానికి అవసరమైన సమూలమైన మార్పులు తెచ్చే రాడికల్‌, విప్లవాత్మక స్త్రీ వాద దృక్పథాలకి మధ్య విభేదాలు తలెత్తాయి. ఉద్యమ క్రమంలో చదువుకున్న తెల్ల జాతి స్త్రీ వాదులు తెల్ల జాతి పురుషులతో సమానంగా వర్గ పరమైన అధికారం పొందటంతో వర్గ పోరాటం ప్రాధాన్యత కోల్పోయింది.
ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ఆధిపత్య వర్గానికి చెందిన స్త్రీలు ‘తమ’ సమస్యలపై నుండి దృష్టి చెదరకుండా చూసుకోగలిగారు. జనాల ఆసక్తి కూడా వారి పైనే ఉండటం దీనికి తోడ్పడిరది. ప్రసార మాధ్యమాల దృష్టిని కూడా వారు ఆకర్షించగలిగారు. శ్రామిక వర్గ స్త్రీలు, స్త్రీ బాహుళ్యానికి సంబంధించిన సమస్యలు ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలకు ఎప్పుడూ పట్టలేదు. అణచివేయబడి ఇంట్లో గృహిణులుగా బంధించబడిన స్త్రీల అసంతృప్తిని బెట్టీ ఫ్రీడన్‌ ‘పేరు లేని సమస్య’గా గుర్తించింది. దీన్ని స్త్రీలందరి ప్రధాన సమస్యగా చూపించటం జరిగింది గానీ, అది కేవలం బాగా చదువుకున్న తెల్ల జాతి స్త్రీల సమస్య. సమాజంలో వారు చాలా చిన్న భాగం. ఇంట్లో బంధించి ఉండటం గురించి వారు ఫిర్యాదు చేస్తున్నప్పుడు, దేశంలోని అత్యధిక భాగం స్త్రీలు కార్మిక శక్తిలో భాగంగా ఉన్నారు. తక్కువ జీతాలకే ఎక్కువ గంటలు బయట పని చేస్తూ, ఇంట్లో పని కూడా చెయ్యటం తప్పని ఆయా స్త్రీలకి ఇలా ఇంట్లో గృహిణులుగా మాత్రమే ఉండగలగటం బహుశా ‘స్వేచ్ఛ’కి ప్రతిరూపంగా అనిపించి ఉండొచ్చు.
అన్ని జాతులకు చెందిన ఆధిపత్య వర్గాల స్త్రీలని బయట పని చెయ్యకుండా ఆపింది జెండర్‌ పరమైన వివక్ష, అణచివేత కాదు. పని చెయ్యాలనుకుంటే మిగిలిన శ్రామిక వర్గ స్త్రీల లాగే వాళ్ళు కూడా అతి తక్కువ జీతాలిచ్చే, నైపుణ్యం లేని శ్రమలో భాగం అవ్వాల్సి వచ్చేది. దిగువ మధ్య తరగతి, శ్రామిక వర్గాలకి చెందిన స్త్రీలు చేసే పనులు చెయ్యొద్దనుకున్న కులీన వర్గ, విద్యాధికులైన స్త్రీలే ఇళ్ళల్లో ఉండిపోయారు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి, భర్తలకు ఇష్టం లేకుండా కొంతమంది స్త్రీలు బయటికొచ్చి వాళ్ళు చదువుకున్న చదువుకు సంబంధం లేని పనులు చేసేవాళ్ళు. ఇంటి బయట పని చెయ్యటం పట్ల వాళ్ళు ఎదుర్కొన్న ఈ వ్యతిరేకతే దాన్ని జెండర్‌ వివక్షకి సంబంధించిన సమస్యగా పరిణమించేటట్లు చేసి, పితృస్వామ్యాన్ని వ్యతిరేకించేటట్లు చేసింది. అదే తమ వర్గ పురుషులతో సమానత్వం కోరుకోవటానికి వర్గ పోరాటాన్ని కాకుండా స్త్రీ వాదాన్ని వేదికగా ఎంచుకునేటట్లు చేసింది.
మొదటి నుండి కూడా వర్గ ఆధిపత్యం ఉన్న తెల్లజాతి స్త్రీలకి తమకు కావాల్సిన దాని పట్ల స్పష్టత ఉండేది. అవి తమ వర్గానికి చెందిన పురుషుల కుండే స్వేచ్ఛ, అధికారం. ఇళ్ళల్లో పురుషుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన అనుభవం వారికి వర్గాలకతీతంగా అందరి స్త్రీలతో జత కట్టటానికి పనికొచ్చింది. ఆ స్త్రీలు కూడా పురుషాధిపత్యం గురించి విసుగు చెందిన వాళ్ళే. కానీ బయట పనిచేస్తే స్వంత కాళ్ళమీద నిలబడేంత ఆదాయం వస్తుందనే విలాసవంతమైన ఊహలు కేవలం వాళ్ళ ప్రివిలేజ్‌ వల్లే సాధ్యమయ్యాయి. తమకొచ్చే వేతనాలు తమని విముక్తి చేయవని శ్రామిక వర్గ స్త్రీలకి అప్పటికే తెలుసు. ఆధిపత్య వర్గాల స్త్రీలు తమ సంస్కరణ వాద ప్రయత్నాలతో స్త్రీలు పని స్థలాల్లో ఎదుర్కొనే వివక్షని తగ్గించి, వారి వేతనాలు మెరుగుపడేటట్లు చేయటం స్త్రీలందరి జీవితాలపై అనుకూల ప్రభావం చూపించిందనటంలో ఏ సందేహం లేదు. అది గణనీయమైన ప్రయోజనమే. అయితే ఆధిపత్య వర్గాల స్త్రీలకి లభించిన వేతనాల సమానత్వం అధికారం లేని స్త్రీ బాహుళ్యానికి ఎప్పుడూ లభించకపోవటం, వర్గ ఆధిపత్యం స్త్రీ వాద ప్రయత్నాలకు ఎట్లా గండి కొట్టిందో అర్థం చేయిస్తుంది.
స్త్రీ వాద ఉద్యమంలో వర్గం గురించిన చర్చని అందరికీ అర్థమయ్యే భాషలో లేవనెత్తిన వాళ్ళు లెస్బియన్‌ స్త్రీ వాదులు, భర్తల మీద ఆధారపడే ఆలోచన తలపెట్టలేని స్త్రీలు. పురుషులతో జీవించాలనుకునే స్త్రీలకంటే పని స్థలాల్లో ఎదురయ్యే కష్టాల గురించి వీరికి గుర్తింపు బాగా ఉండేది. 1970ల షార్లోటీ బంచ్‌, నాన్సీ మైరన్‌ క్లాస్‌ అండ్‌ ఫెమినిజం వివిధ వర్గాల నుంచి వచ్చిన స్త్రీలు స్త్రీల ఉద్యమంలో వర్గ సమస్యని ఎలా చూస్తున్నారనే విషయంపై సంకలనాలని తీసుకొచ్చారు. ఆ సంకలనంలో ఉన్న ప్రతి వ్యాసం వర్గం అన్నది కేవలం ‘డబ్బు’కి సంబంధించిన విషయం కాదని నొక్కి చెప్పింది. రీటా మే బ్రౌన్‌ (అప్పటికి ఇంకా ప్రముఖ రచయిత్రి కాలేదు) స్పష్టంగా ఏమి చెప్పారంటే:
‘‘వర్గం అన్నది కేవలం ఉత్పత్తి సాధనాలతో మనుషులకుండే సంబంధం మాత్రమే కాదు. వర్గం అంటే మన ప్రవర్తన, మన ఆలోచనా భూమిక, మనకు నేర్పే పద్ధతులు, మన నుండి, ఇతరుల నుండి మనం ఆశించే విషయాలు, భవిష్యత్తు గురించిన ఊహలు, మనం సమస్యలని అర్థం చేసుకుని, పరిష్కరించే తీరు, ఏమాలోచిస్తాం, దేని గురించి ఫీలవుతాం, ఏమి చేస్తాం` అన్నీ కూడా మన వర్గ స్థానంలో భాగమే.’’
వర్గ సమస్యని పరిష్కరించకుండా భిన్న వర్గాల నుండి వచ్చిన స్త్రీలు కలిసి పితృస్వామ్యాన్ని ధిక్కరించే రాజకీయ సహోదరిత్వం ఏర్పరచటం కష్టమని గుర్తించిన వాళ్ళల్లో ఈ స్త్రీలు మొదటివాళ్ళు. వర్గాన్ని స్త్రీ వాద ఎజెండాలో చేర్చినప్పుడు వర్గం, జాతి కలిసిన ఇంటర్‌ సెక్షన్‌ను గుర్తించే అవకాశం కూడా ఏర్పడిరది. జాతి, లింగం, వర్గం కలిసిన మన సామాజిక వ్యవస్థలో నల్ల జాతి స్త్రీలు ఆర్థిక గోత్రాలలో క్రింది స్థాయిలో ఉన్నారు. స్త్రీ వాద ఉద్యమంలో ఏ వర్గానికి చెందిన నల్ల జాతి స్త్రీలతో పోల్చినా బాగా చదువుకున్న తెల్ల జాతి శ్రామిక వర్గ స్త్రీలు కూడా మొదట్లో బాగా కనబడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అన్ని జాతులలోని ఆధిపత్య వర్గ స్త్రీల కంటే జాతి, వర్గం, జెండర్‌ ఆధిపత్యాలని వ్యతిరేకిస్తే వచ్చే కష్ట నష్టాలు బాగా తెలుసు. తమ అర్థిక పరిస్థితులను మార్చుకోవటానికి చెయ్యాల్సిన సంఘర్షణ జరుగుతూ ఉండేది. స్త్రీ వాద ఉద్యమంలో అంతకు ముందు ఏ వామపక్ష ఉద్యమంలోనూ పాల్గొనని ఆధిపత్య వర్గాల స్త్రీలు వర్గ పోరాటానికి అవసరమయిన నిర్దిష్ట రాజకీయాల గురించి, క్రింది వర్గాల స్త్రీలెదుర్కొనే సమస్యల గురించి నేర్చుకున్నారు. అలాగే ఆ క్రమంలో ఘర్షణల్ని నిర్మాణాత్మకంగా ఎదుర్కోవటం, దానిక్కావాల్సిన నైపుణ్యాన్ని, స్థిరత్వాన్ని నేర్చుకున్నారు. అయినప్పటికీ చాలామంది తెల్లజాతి ఆధిపత్య వర్గ స్త్రీ వాదులు స్త్రీ వాదం తమదే అయినట్లు, వాళ్ళే దానికి నాయకులయినట్లు ప్రవర్తించటం మానలేదు.
ప్రధాన స్రవంతి పితృస్వామ్యం ఆధిపత్య వర్గాల స్త్రీల సమస్యలే అసలైన సమస్యలుగా గుర్తించి ఈ భావనని పటిష్టం చేసింది. దాంతో స్త్రీవాద సంస్కరణ వాదం ఉన్న వ్యవస్థలో సామాజిక సమానత్వం సాధించటాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఆధిపత్య వర్గాల స్త్రీలు తమ వర్గంలోని పురుషులతో సమానత్వాన్ని కోరుకున్నారు. తమ వర్గంలో సెక్సిజం ఉన్నప్పటికీ శ్రామిక వర్గ పురుషుల స్థాయిని మాత్రం ఎప్పుడూ కోరుకోలేదు. ఈ కోరిక తెల్లజాతి పెట్టుబడిదారీ పితృస్వామ్య ఆశయాలలో చక్కగా ఇమిడిపోయింది. నల్ల జాతీయులు, ఇతర జాతుల వాళ్ళు కొంత ఆర్థిక అధికారాన్ని, ఆధిపత్యాన్ని సాధిస్తే తెల్లజాతికుండే ఆధిపత్యం, అధికారం తగ్గి పోతాయనే జాత్యహంకార భయాలు స్త్రీ వాదులు ఉన్న వ్యవస్థలో కొంత సమానత్వాన్ని కోరుకోవటంతో చల్లబడ్డాయి. రాడికల్‌ స్త్రీవాద రాజకీయాల ప్రభావాన్ని తగ్గించి జాత్యహంకార తెల్ల జాతి పితృస్వామ్య అధికారాన్ని బలపరచడానికి ఈ సంస్కరణ వాద తెల్ల జాతి అధికార స్త్రీ వాదం పనికొచ్చింది.
విప్లవ స్త్రీ వాదులు ఈ రకంగా స్త్రీ వాద ఉద్యమాన్ని ప్రధాన స్రవంతి ఉపయోగించుకోవటాన్ని తీవ్రంగా గర్హించారు. ప్రత్యామ్నాయ మాధ్యమాల్లో ఈ రకమైన విమర్శకి చోటు దొరికింది. తెల్ల జాతి రాడికల్‌ స్త్రీవాద కార్యకర్త మేరీ బార్‌ ఫుట్‌ ది కమింగ్‌ ఆఫ్‌ బ్లాక్‌ జెనోసైడ్‌ అనే వ్యాస సంకలనంలో ఇలా అంటారు.
‘‘1970లలో వచ్చిన స్త్రీల ఉద్యమం స్త్రీల సహోదరిత్వానికి దారి తీసిందని నమ్మిన తెల్ల జాతి స్త్రీలు ఈ ఉద్యమం ద్వారా పై మెట్టుకెక్కాలనే స్త్రీల పట్ల కోపంతో ఉన్నారు, బాధపడుతున్నారు. ఆయా స్త్రీలు తిరిగి పితృస్వామ్య గృహాలకి వెళ్ళిపోయారు. ఒక రకంగా స్త్రీల ఉద్యమం తండ్రుల పక్కలని వదల్లేదు, ఏ యుద్ధం జరగలేదు, ఏ విముక్తి రాలేదు. ఈ సామూహిక హత్యాకాండలో మన వాటా మనకి దొరికింది. మనం దాన్ని చూసుకుని సంబరాలు చేసుకుంటున్నాం. మనం కేవలం పితృస్వామ్య సహోదరిత్వాన్ని సాధించాము, జాతి, వర్గ అణచివేతల నిజమైన సమర్థకులం మనం. యూరోపియన్‌ సామ్రాజ్య వాదం ప్రపంచ వ్యాప్త పితృస్వామ్యానికి ఉన్నత శిఖరం. మనం పితృస్వామ్య పక్కలని వదలని అక్కా చెల్లెళ్ళం, మన అన్నదమ్ములకి దొరికిందంతా మనక్కూడా కావాలని కోరుకున్నాం, చివరికి వాళ్ళకి ఏ వ్యవస్థయితే ఇవన్నీ ఇచ్చిందో దాన్నే సమర్ధిస్తున్నాం.’’
జాత్యహంకార ఆలోచన కంటే తమ వర్గ ఆధిపత్యాన్ని వదులుకోవటానికి అనేక మంది స్త్రీ వాదులు కష్టపడ్డారు. వారికి తమ వర్గ పురుషులతో ఆర్థిక సమానత్వ అవకాశం వచ్చిన తర్వాత వర్గం గురించిన చర్చలే మాయమైపోయాయి. కొంతమంది స్త్రీల ఆర్థిక పురోగతిని అందరి స్త్రీల పురోగతిగా చూడాలని చెప్పటం మొదలయింది. వాస్తవంలో చూస్తే శ్రామిక వర్గ స్త్రీలు, పేదరికంలో మగ్గే స్త్రీల పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. ఆధిపత్య వర్గ పురుషులు ఇంటి పనిలో పాలు పంచుకోవటానికి నిరాకరించటంతో ఆయా స్త్రీల స్వేచ్ఛ ఆర్థికంగా క్రింది స్థాయిలో ఉండి శ్రామిక వర్గ, పేద స్త్రీలు ఇళ్ళల్లో అందించే తక్కువ విలువ గల సేవలపై ఆధారపడిరది. 1990లలో ఉన్న సామాజిక నిర్మాణంతో రాజీ పడటం ద్వారా స్త్రీ విముక్తి ఉద్యమం అమ్ముడు పోయింది. స్త్రీ వాదం కంటే వర్గ పరమైన అధికారం ప్రధానంగా పరిణమించింది. ఈ రాజీ కార్యక్రమమే స్త్రీ వాద ఉద్యమాన్ని అతలాకుతలం చేసింది. పురుషుల కంటే భిన్నంగా ప్రవర్తించకుండానే వర్గ పరమైన అధికారం, స్థాయి పొందటంతో స్త్రీ వాద ఉద్యమ రాజకీయాలు కుంటుపడ్డాయి. అనేకమంది స్త్రీలు తాము మోసానికి గురయ్యామని భావించారు.
స్త్రీ వాదం ఇచ్చిన ఊతంతో పని స్థలాల్లో ప్రవేశించిన దిగువ, మధ్య స్థాయి మధ్య తరగతి స్త్రీలు తాము బయట పని చేసినంత మాత్రాన, ఇంట్లో పని మగవాళ్ళు పంచుకోరనే చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘నో ఫాల్ట్‌ డివోర్స్‌’ (ఎవరి తప్పు లేని విడాకులు) స్త్రీల కంటే పురుషులకే ఆర్థికంగా ఉపయోగపడిరది. జెండర్‌ని జాతిపరమైన అఫర్మేటివ్‌ యాక్షన్‌ (రిజర్వేషన్లు)తో ముడి పెట్టి, ఆధిపత్య వర్గాల స్త్రీలు ఆర్థికంగా పైకి ఎగబాగటం చూసిన నల్ల జాతి స్త్రీలకి ఇదంతా తెల్ల జాతీయుల అధికారం బలపడే ప్రక్రియేనన్న అనుమానం తీవ్రంగా కలిగింది. సామాజిక సంక్షేమాన్ని నాశనం చేసి, ఒంటరి తల్లులకిచ్చే సంక్షేమ సేవలని వెనక్కి తీసుకునే చర్యలని స్త్రీ వాద ఉద్యమం ఎదిరించకపోవడం స్త్రీ వాద లక్ష్యాలనే పూర్తిగా దెబ్బ కొట్టింది. ఆడవాళ్ళలో పేదరికం పెరగటం అన్న తీవ్ర పరిణామాన్ని తమని తాము స్త్రీవాదులని పిలుచుకునే ఆధిపత్య వర్గాల స్త్రీలు ఏ మాత్రం పట్టించుకోలేదు.
‘అధికార స్త్రీవాదానికి’ ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలలో లభించినంత చోటు క్రింది వర్గాల స్త్రీల పట్ల సంఫీుభావాన్ని పోగొట్టుకోకుండా కొంత వర్గపరమైన అధికారాన్ని సంపాదించుకున్న స్త్రీలకి దొరకదు. స్త్రీ వాద రాజకీయాలలో ఉంటూ, ఆర్థిక స్వావలంబన సాధించుకుని, ఇతర స్త్రీల స్వావలంబన కోసం పాటుబడటం మా ఆశయంగా ఉంటూ వచ్చింది. ప్రపంచంలో ఉన్న తెల్ల జాతి పెట్టుబడిదారీ పితృస్వామ్య వ్యవస్థతో రాజీ పడితేనే ఆర్థిక స్వావలంబన సాధ్యమన్న భావనని మా అనుభవాలు త్రోసి పుచ్చుతాయి. దేశం మొత్తం మీద ఆర్థిక స్వావలంబన సాధించుకున్న స్త్రీవాదులలో మాకున్న వనరులని, అధికారాన్ని విప్లవాత్మక సామాజిక మార్పు కోసం, అందరి స్త్రీల ఆర్థిక పరమైన జీవితాలని మెరుగు పరచటం కోసం పనిచేసే వాళ్ళు అనేకమంది ఉన్నాం.
స్త్రీ విముక్తి నిజంగా సాధించాలంటే వర్గపరమైన కులీనత్వాన్ని సవాలు చేసే సామాజిక మార్పు కోసం పనిచేసే దృక్పథం ఉండాలి. మూడవ ప్రపంచ దేశాల్లో స్త్రీలని పరాధీనులని చేసి, అణచివేసే ప్రపంచ వ్యాప్త తెల్ల జాత్యహంకార పితృస్వామ్య వ్యవస్థ వల్లే పశ్చిమ దేశాల్లోని స్త్రీలు వర్గపరమైన అధికారం పొందటం, జెండర్‌ అసమానతలు తీవ్రం కావటం జరిగాయి. ఈ దేశంలో జైళ్ళ పరిశ్రమలు, సంప్రదాయ వలస కార్మిక విధానం, పని చేస్తే సంక్షేమం అన్న విధానాల వల్ల ఒక రకమైన ఒప్పంద బానిసల విధానం అమలవుతోంది. ఉన్న సంక్షేమ విధానాలను అంతం చెయ్యటం వల్లే క్రిందికి తోసివేయబడి వ్యవస్థీకృత దోపిడీకి తమను తాము సమర్పించుకునే స్త్రీలు, పిల్లలు తయారవుతారు.
మన జాతి రాజ్యంలో వర్గ పరమైన వాస్తవాలు, ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న తీవ్రమైన అంతరాలు, పేదరికంలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్న స్త్రీల పరిస్థితి చూస్తుంటే, ఇప్పటి వరకూ సంకరణ వాదం ద్వారా సాధించిన నాటినుండి పాఠాలు నేర్చుకుని, కొత్త ఎత్తుగడలతో రాడికల్‌, ప్రజా స్త్రీ వాద ఉద్యమాన్ని నిర్మించటం తక్షణ అవసరంగా తోస్తుంది. ఆ ఉద్యమం పేదరికంలో ఉన్న శ్రామిక వర్గ స్త్రీల నిర్దిష్ట సమస్యల గురించి, వారితో కలిసి పని చెయ్యాలి. అంటే తక్కువ ఆదాయం ఉన్న స్త్రీల కోసం ఆధిపత్య వర్గ స్త్రీలు ఇళ్ళని కట్టించి ఇచ్చేటటువంటి ఉద్యమం తయారు కావాలి. దాని కోసం విమర్శనాత్మక స్త్రీ వాద ఉద్యమ చదువు అందించాలి. అందరి స్త్రీల జీవితాలని స్పృశించే ఈ ఉద్యమం స్త్రీ వాద మౌలిక నియమాలను విస్తృత పరుస్తుంది.
అవకాశవాదంతో స్త్రీ వాద వేదికలని ఉపయోగించుకుంటూ క్రింది వర్గ స్త్రీలని తొక్కి పట్టి ఉంచే పితృస్వామ్య వ్యవస్థను సమర్థించి స్త్రీ వాద రాజకీయాలకు గండి కొట్టే ఆధిపత్య వర్గ స్త్రీలు కేవలం స్త్రీ వాదాన్ని మోసం చెయ్యట్లేదు, తమను తామే మోసగించుకుంటున్నారు. వర్గం, స్త్రీ వాదులైన స్త్రీలు, పురుషుల మధ్య సంబంధాల గురించిన చర్చలకు తిరిగి వస్తే సంఫీుభావ రాజకీయాలను నిర్మించడానికి అవసరమైన చోటు ఏర్పడుతుంది. అప్పుడు వర్గపరమైన మూలాలతో సంబంధం లేకుండా వనరుల పెంపకం, వ్యక్తిగత ప్రగతికి అవకాశాలు కల్పించటం కోసం అవసరమైన ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకోవటానికి కూడా చోటు ఏర్పడుతుంది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.