నటీనటులు తమ పాటలు తామే పాడేవారయితే సమస్య లేదు. బాణీని సైతం ఆయా నటీనటుల ప్రతిభ ఆధారంగా సృజించే వీలుంటుంది. నేపథ్య గాయనీ గాయకులు రంగప్రవేశం చేశాక పరిస్థితి మారింది. తెరపై కనబడే నటుడే పాడుతున్న భ్రమను కలిగించాల్సి ఉంటుంది.
అంటే తెరపై కనిపించే నటుడి ఆకారానికి, హావభావాలకు, తెరవెనుక నుంచి వినపడే గాయకుడి స్వరం తగ్గట్టు అనిపించాలి. అతడే పాడుతున్న భ్రమ కలగాలి. లేకపోతే పాట అభాసు పాలవుతుంది. ప్రేక్షకులు మెచ్చరు. నేపథ్యగానం ఆరంభమయిన కొత్తల్లో ప్రేక్షకులు వేరే ఎవరి గొంతుతోనో తెరపై కనబడే నటీనటులు పాడుతున్నట్టు నటించటాన్ని నిరసించారు, హేళన చేశారు, నవ్వారు. కానీ పాటల మాయాజాలం ఎలాంటిదంటే కొద్దికాలానికి పాటల మాధురీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. ఇక్కడే నటుడికీ, గాయకుడి స్వరానికి గల అనుబంధం తెరపైకి వచ్చింది. ఒక నటుడిని చూడగానే, అతని స్వరం నిలచిన గాయకుడు గుర్తుకు వస్తాడు. ఈ రకంగా, ఆ కాలంలో నటులందరికీ ఓ ప్రత్యేకమయిన గాయకుడి స్వరం నిర్ణయమయింది. రాజ్ కపూర్ అనగానే ముకేష్ గుర్తుకు వస్తాడు. దిలీప్ కుమార్ అనగానే తలత్ మహమూద్ గుర్తుకువస్తాడు. దేవ్ ఆనంద్ వాడినన్ని గొంతులు మరే నటుడు వాడలేదు. కానీ దేవ్ ఆనంద్ అంటే ప్రధానంగా కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీలే గుర్తుకు వస్తారు. ఇలా నటుడు, గాయకుడి నడుమ అనుబంధం వ్యాపారపరంగా కూడా లాభకరం. నటుడి విలువ పాటల వల్ల పెరుగుతుంది. గాయకుడికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అభిమానులు లభిస్తారు. దాంతో గాయకుడి వల్ల కూడా సినిమాకు అదనపు ఆకర్షణ కలుగుతుంది. అంటే గాయనీ గాయకుల స్వరాలు వినబడగానే ఆయా నటీనటులు కళ్ళముందు నిలబడాలన్నమాట. కాబట్టి నాయకుడిని కానీ, నాయికను కానీ ప్రతిబింబించే స్వరం కావాల్సి ఉంటుంది. నాయకుల విషయంలో పెద్ద సమస్య లేకుండా ముకేష్, రఫీ (కిషోర్ కుమార్ తనకు, దేవ్ ఆనంద్‌కు మాత్రమే పాడేవాడు) తలత్ మహమూద్, మన్నాడే వంటి వారున్నారు. కానీ నాయికల విషయంలో సమస్య వచ్చింది. ఈ సమస్య స్వరూపం అర్థం కావాలంటే ఒక్కసారి లత కన్నా ముందు ఉన్న గాయనిలు, లత సమకాలీకుల గురించి టూకీగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
1931 నుండి 1943 వరకూ పదమూడు సినిమాలలో నటించిన ఖుర్షీద్ సినిమా పాటలపై తనదైన ముద్ర వేసింది. 1947లో పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఖుర్షీద్ అప్పటి ఆనవాయితీ ప్రకారం తన పాటలు తానే పాడుకునేది. కానీ ఖుర్షీద్‌కు సంగీతంలో ఎటువంటి శిక్షణ లేదు. ఆమె స్వరం మరీ బలహీనంగా ఉండేది. పాటలు విన్నవారికి శాంతిగా అనిపించేది. ఆమె పెద్దగా హై పిచ్‌లో పాడగలిగేది కాదు. అందుకే ఆమె తన గాన ప్రతిభ వల్ల కాక స్వరమాధుర్యం వల్లనే చక్కటి గాయనిగా గుర్తింపు పొందింది. ఆమె దీర్ఘంగా రాగాలు తీయగలిగేది కాదు. ఎప్పుడైనా రాగం తీయవలసి వస్తే స్వరంలో వణుకు స్పష్టంగా తెలిసేది. పాటలు ఎలా పాడమంటే అలా పాడేది తప్ప, గాయనిగా తనవైపు నుంచి బాణీకి ప్రత్యేకతను ఆపాదించగలిగేది కాదు. అందుకే ఖేమ్‌చంద్ ప్రకాశ్ ‘ముంతాజ్ (1943)’ సినిమాలో ‘దిల్ కో ధడ్‌కన్ బనాలియా’ పాటలో ఖుర్షీద్ ఒక పాదం పాడగానే, దానికి అనుబంధంగా వాయిద్యాలతో పాటను సుందరం చేయాలని ప్రయత్నించాడు. అయితే, తన పాటలు తానే పాడుకునేది కాబట్టి ఆమెను నేపథ్య గాయనిగా పరిగణించే వీలు లేదు.
అమీర్ బాయి కర్ణాటకి నటిగా తెరపైకి వచ్చినా గాయనిగానే ఆమెను సినీ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. 1940 నుంచి 1950 నడుమ ఆమె దాదాపు 225 పాటలు పాడిరది. ఆ కాలంలో గొప్ప హిట్ పాటలు పాడిరది. కిస్మత్ (1943) సినిమాలో ‘ధీరే ధీరే ఆరె బాదల్’, రతన్ (1944) సినిమాలో ‘మిల్ కే చిఛడ్ గయే అఖియాన్’, సమాధి (1950)’లో ‘గోరే గోరే ఓ బాన్కే చోరే’ వంటి హిట్ పాటలు పాడిరది అమీర్ బాయి కర్ణాటకి. ఈమె కూడా శిక్షణ పొందిన గాయని కాదు. ఆమె స్వరం శక్తివంతమైనది. ఈమె పాటల్లో భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచేది. పాటల్లో పదాలను కాస్త నెమ్మదిగా ఉచ్ఛరించటం ద్వారా గొప్ప ప్రభావాన్ని సృజించేది. ‘కిస్మత్’ సినిమాలో ‘ఘర్ ఘర్ మే దివాలీ’ పాటలో పలు భావాలను ఒకేసారి సమర్థవంతంగా పలికించి మెప్పించింది. అయితే 1940 దశకం చివరికి వచ్చేసరికి ఈమె కుటుంబపరంగా వ్యక్తిగత సమస్యలలో చిక్కుకుంది. పాటలపై దృష్టి పెట్టలేకపోయింది. దాంతో నెమ్మదిగా సినీ పరిశ్రమకు దూరమయింది. కానీ విశ్లేషకులు లత తెరపైకి రావటం, అమీర్ బాయి కర్ణాటకి కెరీర్‌ను దెబ్బ తీసిందని వ్యాఖ్యానిస్తారు. కానీ అది పొరపాటు. 1950లో ‘సమాధి’ సినిమాలో లత ‘గోరెగోరె’ పాటను అమీర్ బాయి కర్ణాటకితో పాడే సమయానికి అమీర్ బాయి వ్యక్తిగత సమస్యల వల్ల పాటలను తగ్గించింది. సి.రామచంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో నాయిక నళినీ జయవంత్‌కు లత, కుల్దీప్ షార్‌కు అమీర్ బాయి పాడారు. సాధారణంగా మన సిపిమాలలో నాయికకు పాడే స్వరం నెంబర్ వన్ గాయనిది అయి ఉంటుంది. అంటే, అప్పటికే లత అగ్రస్థాయి గాయనిగా పరిగణించబడుతోందన్నమాట.
బెంగాల్‌కు చెందిన గాయని అయినా నటి కానన్ దేవి పాటలో బెంగాలీ యాస కనబడేది కాదు. ఆమె స్వరం బలమైనది. హైపిచ్‌లో కీచు గొంతు వచ్చేది కాదు. ‘విద్యావతి (1938)’ సినిమాలో ‘డోలే హృదయ్ కీ నయ్యా’ పాటలో ఆమె హైపిచ్‌లో అద్భుతంగా పాడిరది. ‘లగాన్ (1943)’లో ‘హమారీ లాజ్’ పాట, ‘హాస్పిటల్’ సినిమాలో ‘జరా నైనోంసే నైనా’ పాటలో హైపిచ్ నుంచి హఠాత్తుగా లోపిచ్‌కు సులభంగా, ఎలాంటి ప్రయాస లేకుండా దిగుతుంది ఆమె స్వరం. ‘తరానా’ కూడా అద్భుతంగా పాడగలదని ‘విద్యావతి’ సినిమాలోని ‘అంబువా కి డాలీ’ పాట నిరూపిస్తుంది. అలాగే, ‘జవాబ్ (1942)’లో ‘తుఫాన్ మెయిల్, దునియా యే దునియా’ లాంటి వేగవంతమైన పాటలను కూడా సులభంగా పాడగలదు కానన్ దేవి. అయితే ఆమె పాటలు సినిమాను దాటి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సంతరించుకోలేదు. కానీ 1946 వచ్చేసరికి కానన్ దేవి ప్రాభవం, ప్రాధాన్యం తగ్గిపోయాయి.
జోహ్రాబాయి అంబాలేవాలి ‘రతన్ (1944)’ సినిమాలో ‘అఖియ మిలాకే’, ‘రుమ్ రaుమ్ బర్సే బాదర్‌వా’ పాటలతో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందింది. 1941 నుండి 1950 నడుమ 1229 పాటలు పాడిరది జోహ్రాబాయి. జోహ్రాబాయి కూడా పాట పాడటంలో శిక్షణ పొందలేదు. ఆమె స్వరం వేగవంతమైన పాటల్లో అందంగా ధ్వనించటంతో సంగీత దర్శకులు ఆమెతో వేగవంతమైన పాటలు పాడిరచేందుకే ఉత్సాహం చూపారు. దాంతో ఆమెకు బాణీని అనుసరించి స్పష్టంగా పాడటం తప్ప తన ప్రతిభను ప్రదర్శించి, పాటకు మెరుపులు అద్దే వీలు చిక్కలేదు. అయినా సరే తనకున్న పరిమిత పరిధిలో అక్కడో పదాన్ని, ఇక్కడో పదాన్ని విభిన్నంగా ఉచ్ఛరించటం ద్వారా, పాటలో అభినయాన్ని ప్రదర్శించాలని ప్రయత్నించింది జోహ్రాబాయి. ‘జీవన్ (1944)’ సినిమాలో ‘నైనోమే నైనా మత్ డాల్’, ‘చంద్రలేఖ (1948)’లో ‘మేరా హుస్న్ లూట్ లియా’ వంటి పాటలు ఇందుకు చక్కని ఉదాహరణలు. ‘సమర్a లో నజర్ కే ఇషారే’ (కశ్మీర్), ‘క్యా బతాయే కిత్ని హస్రత్’ (నాటక్), ‘ఫిర్ ఆప్‌ా దిల్‌సే నిక్‌లీ’ (మేలా) వంటి ‘గజల్స్’ను అద్భుతంగా పాడిరది జోహ్రాబాయి. కానీ సంగీత దర్శకులు ఆమెను వేగవంతమైన పాటలకే అధికంగా పరిమితం చేయటంతో, విభిన్నమైన పాటలు పాడగలిగి ఉండి కూడా కొన్ని రకాల పాటలకే పరిమితమయింది జోహ్రాబాయి. ఈమె 1953లో సినిమాలలో పాడడం నుంచి విరమించుకుంది.
సురయ్య ‘తాజ్‌మహల్’ సినిమాతో 1941లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే సురయ్య ప్రధానంగా తన పాటలు తానే పాడుకునేది. దాంతో నేపథ్య గాయనిలు ఎవరితోనూ ఆమెకు పోటీ లేదు. గాయనిగా తనదైన ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. నటిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆరంభంలో ‘స్టేషన్ మాస్టర్’ (1942) సినిమాలో నేపథ్య గాయనిగా పాడిరది. ‘శారద’ సినిమాలో ‘మెహ్తాబ్’కు ‘పంఛీ జా పీఛే రహాహై బచ్ పన్’ అనే పాటను పాడిరది. కానీ నటిగా పేరు సాధించిన తర్వాత ఆమె తన పాటలు మాత్రమే పాడుకుంది. అంటే ఎందరు నేపథ్య గాయనిలు వచ్చినా ఆమెకు ఎవరితోనూ పోటీలేదు. ఎవరికీ ఆమె పోటీ కాదు.
రాజ్‌కుమారి సైతం తన పాటలు తానే పాడుకునే నటిగా సినీ రంగంలో అడుగుపెట్టింది. కానీ 1938 నుండి ఆమె నటనకు స్వస్తి చెప్పి నేపథ్య గానం వైపు దృష్టి పెట్టింది. రాజ్‌కుమారికి శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా ‘టప్ప’ పాటల గానంలో శిక్షణ పొందింది. దాంతో రాగాలు తీయగలదు, ‘పల్టా’లు పాడగలదు. నాటకాలలో మైకు లేకుండా హైపిచ్‌లో పాడే అలవాటు ఉండడంతో హైపిచ్‌లో పాటలు పాడటంలో ఆమెకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఆమె స్వరం పలు రకాల భావాలను పలకగలిగేది కాదు. ముఖ్యంగా పాటలో ‘నాసల్ టోన్’ రావటం ఇబ్బంది కలిగించేది. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆమే ‘పాటలు పాడటంలో నా పరిధి పరిమితం’ అని చెప్పింది. అయితే 1950 దశకం ఆరంభం నుంచీ ఆమె పాటలు పాడటం తగ్గించింది. 1950 చివరికల్లా ఆమె స్వరం సినిమాల్లో వినిపించటం మానేసింది. పాటలు పాడటం ఎందుకు తగ్గించుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను తగ్గించుకోలేదు. పాటలు పాడేందుకు సంగీత దర్శకులు నన్ను పిలవటం మానేశారు. కారణం తెలియదు’ అని చెప్పింది ఆమె. 1960 దశకంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ‘కోరస్’లో పాడేది. నౌషాద్ ఆమెకు అలా అవకాశాలిచ్చాడు కానీ సోలో పాటలు పాడే అవకాశాలు ఇవ్వలేదు.
నూర్జహాన్ సైతం తన పాటలు తానే పాడుకోవటం వల్ల, ‘హిట్ గాయని’గా నిలిచినా నేపథ్య గాయనిలకు ఆమె ఎలాంటి పోటీ కాదు. నేపథ్య గాయనిలు ఆమెకు పోటీ కాదు. పైగా దేశ విభజన సమయంలో ఆమె పాకిస్తాన్‌కు వెళ్ళిపోవటంతో సినిమా పాటలపై ఆమె ప్రభావం మాత్రం మిగిలింది, అంతే. లత సినీరంగంలో నిలద్రొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఉన్న ప్రధాన గాయకులు వీరు. వీరిలో ఒక్క రాజ్‌కుమారికి తప్ప మరెవరికీ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేదు, గానంలో శిక్షణ లేదు. రాజ్‌కుమారికి పాట పాడటంలో శిక్షణ ఉన్నా, ఆమె స్వరానికి బహు పరిమితులున్నాయి. కాబట్టి ఆ కాలంలో లతకు గట్టి పోటీని ఇవ్వగలిగిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు లత కన్నా ముందు సినీ నేపథ్య గీతాల రంగంలో స్థిరపడినవారు, మరొకరు దాదాపుగా లతతో పాటు రంగప్రవేశం చేసినవారు. ‘శంషాద్ బేగం’ అగ్రశ్రేణి గాయనిగా స్థిరపడిరది. లతా మంగేష్కర్ శంషాద్ బేగం పాటలు, నూర్జహాన్ పాటలు పాడుతూ ఎదిగింది.
గీతారాయ్‌కు సంగీతం వంశపారంపర్యంగా అందింది. ఆమె పండిత్ హీరేంద్రనాథ్ చౌదరి వద్ద సంగీతంలో శిక్షణ పొందింది. 1942లో బెంగాల్‌లో పెరుగుతున్న మతకల్లోలాల నుంచి తప్పించుకుని, వారి కుటుంబం ఆస్తులన్నీ వదులుకుని బొంబాయి వచ్చింది. ఆమె సోదరులిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. గీతారాయ్ ఇంట్లో సంగీత సాధన చేస్తుంటే విన్న పండిత్ హనుమాన్ ప్రసాద్ ఆమెను సినిమాల్లో నేపథ్య గాయనిగా పరిచయం చేశాడు. 1946లో ‘భక్త ప్రహ్లాద’లో ఆమె పాడిన రెండు పాదాలు అందరినీ ఆకర్షించాయి. 1947లో ఎస్‌డి బర్మన్ ‘దో భాయ్’ సినిమాలో గీతారాయ్ ‘అంబువాకే డాలీ పె కోయల్’, ‘అజీ ప్రీత్ కా నాతా టూట్ గయా’, ‘మేరీ పియాతో బస్ పర్దేస్’, ‘హమే ఛోడ్ పియా’ వంటి పాటలు పాడినా ‘మేరా సుందర్ సప్నా బీత్‌గయా’, ‘యాద్ కరోగీ’ పాటలు సూపర్ హిట్ అయి గీతాకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి. శంషాద్ బేగం తర్వాత 1940 దశకంలో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందిన యువగాయని గీతారాయ్. ముఖ్యంగా ‘మేరా సుందర్ సప్‌నా’ పాట, గీతారాయ్ కోసం సంగీత దర్శకులు వరుస కట్టేట్టు చేసింది. పదహారేళ్ళ అమ్మాయి అంత గొప్పగా విఫల ప్రేమలోని విషాదాన్ని పాటలో ప్రదర్శించటం ఒక అద్భుతంగా భావించారు. లత తరువాత సినీ ప్రపంచంలో ప్రవేశించినా, లత ఇంకా అవకాశాల కోసం వెతుక్కుంటున్న సమయంలో గీతారాయ్ సూపర్‌హిట్ గాయనిగా ఎదిగింది. ఆమె పాటలో బెంగాలీ యాస ఉన్నా అది పాటకు అందాన్ని ఆపాదించేది తప్ప ఎబ్బెట్టుగా ఉండేది కాదు. భజనలు, విషాద గీతాలు పాడటంలో ‘గీతారాయ్’ను మించిన వారు లేరన్న పేరు సంపాదించింది. అంతే కాదు ఆ కాలంలో ఇతర గాయనిలకన్నా ముందుండటంలో లతకు ఉన్న సౌలభ్యం గీతారాయ్‌కూ ఉండేది.
పాటలు పాడాల్సిన అవసరం తీరటంతో సినిమాల్లో నాయికలకు అందమైన స్వరం ఉండాల్సిన అవసరం తీరింది. దాంతో నాయికల అందంపై దృష్టి మళ్ళింది. నాయికలు అందంగా ఉన్నా నాయికకు నేపథ్యంలో పాడే స్వరం ఆ అందానికి తగ్గట్టు ఉండకపోతే పాట ప్రభావం తగ్గుతుంది. అంతవరకూ నేపథ్య గాయనిలుగా స్థిరపడి ఉన్నవారి స్వరాలు బలమైనవి. అందమైన నాయికల మౌగ్ధ్యాన్ని, సున్నితత్వాన్ని ఆ స్వరాలు అంతగా ప్రతిబింబించలేవు. బయట విన్నప్పుడు అలరించినా తెరపై యువ నటీమణులపై ఆ పాటలు అలరించవు. నర్గీస్, శంషాద్ బేగం స్వరంలో ‘గమ్ కా ఫసానా కిస్‌కో సునాయే’ అని పాడటం, సినిమాలో నర్గీస్‌ను చూస్తుంటే అంతగా రుచించదు, ముఖ్యంగా క్లోజప్‌లలో. ఇది ఏ రకంగానూ శంషాద్ బేగమ్ గానాన్ని, స్వరాన్ని కించపరుస్తున్నట్లుగా భావించకూడదు. ఆ కాలంలో యువ నాయికలు కొత్తగా వస్తున్నప్పుడు, ఆప్పటికే స్థిరపడి ఉన్న బలమైన గొంతులు ఆ యువ నాయికల నాజూకు ఆకారాలకు సరిపోలేదు. శంషాద్ బేగం గొంతులో ఎబ్బెట్టుగా అనిపించిన నర్గీస్, గీతాదత్ స్వరంలో ‘జోగన్’ సినిమా పాటలు పాడుతుంటే చూసి మైమరచిపోతాం. అంటే, తెరపై నాజూకుగా కనిపించే నాయికలకు బలమైన గొంతులకన్నా ఆ నాజూకుదనాన్ని స్ఫురింపజేసే సన్నని తీగలాంటి యువస్వరం అవసరమైందన్నమాట. ఆ సమయంలో హిందీ సినీ పరిశ్రమలో అలాంటి స్వరాలు రెండే రెండు. ఒకటి గీతారాయ్, రెండు లతా మంగేష్కర్. ‘జోగన్న’ సినిమాలో నర్గీస్‌కు గీతారాయ్ పాడిన పాటలు గీతాను అగ్రశ్రేణి గాయనిగా నిలిపాయి. ముఖ్యంగా ఆమె పాడిన మీరా భజనలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. బులో సి రాణి సంగీత దర్శకత్వంలోని ఈ సినిమా పాటలతో ఆ కాలంలో లతకు ధీటుగా నిలబడిన ఏకైక గాయని గీతారాయ్.
గీతా తాను పాడిన తొలి చిత్రంలోని పాటతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు భిన్నంగా లతా మంగేష్కర్ అవకాశాల కోసం కష్టపడాల్సి వచ్చింది. అప్పటికి అలవాటైన స్వరాలకు భిన్నంగా లత గొంతు బలహీనంగా ఉండటం, లతను తిరస్కరించటానికి ప్రధాన కారణమయితే, సినిమా పాటలకు అవసరమైన హంగు, ఆర్భాటాలు లతకు లేకపోవటం ఆమెను ఎవరూ అంతగా పట్టించుకోకపోవడానికి మరో కారణం.