గమనమే గమ్యం -ఓల్గా

1952 జనవరిలో ఎన్నికల నోటీసు వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.

కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువైపోయాయి. ప్రకాశం గారు నిండా సంవత్సరం పని చేశాడో లేదో ఆయనను దించి ఒమండూరు రామస్వామి రెడ్డియారుని ముఖ్యమంత్రిని చేసేవరకూ కామరాజ్‌ నిద్రపోలేదు. వాళ్ళిద్దరికీ కూడా సంవత్సరం కన్నా పొసగలేదు. కాంగ్రెస్‌ పార్టీ లోపలే ఆయన మీద విశ్వాస రాహిత్య తీర్మానం పెట్టి నెగ్గించి కుమారస్వామి రాజాను ముఖ్యమంత్రిని చేశారు. ఆ మంత్రి వర్గం మీద ప్రజలకు అసలు విశ్వాసం లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్‌ వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చెయ్యందే గెలవలేమనుకున్నారు. పైగా 1952లో మొదటిసారిగా రైతు కూలీలు, హరిజనులు ఓటర్లయ్యారు. జమిందార్లకు, ధనిక రైతులకు వ్యతిరేకంగా పనిచేసే కమ్యూనిస్టులంటే వారికి అభిమానం ఉండటంలో ఆశ్చర్యం లేదు. గెలవటానికి కావలసిన ప్రచార దళాలు, సాహిత్యం, అన్నీ సమరోత్సాహంతో నిండి ఉన్నాయి. శారద ఎన్నికలను దూరం నుంచి చూస్తూ తన దగ్గరకు వచ్చేవారిలో కొందరికి ప్రత్యక్షంగా మరికొందరికి పరోక్షంగా కమ్యూనిస్టులకు ఓటెయ్యమని చెబుతూ వైద్యం మీద మనసు లగ్నం చేసింది. నటాషా చదువు ఉండనే
ఉంది. ఏ కొంచెం సమయం దొరికినా నటాషాతో ఆటలు పాటలు చదువులు వీటితో ఆనందంగానే
ఉంటోంది. మూర్తి అసంతృప్తిగా ఉండటం శారదకు తెలుస్తూనే ఉంది. అతనికిప్పుడు పని లేదు. పార్టీ కోసం మద్రాసులో ఉన్న కాస్త ప్రాక్టీసు వదులుకుని బెజవాడ వచ్చేశాడు. ఇప్పుడు పార్టీ పని లేదు. మళ్ళీ మద్రాసులో ప్రాక్టీసంటే… ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఉద్యమం ఊపందుకుంది. తీరా మద్రాసులో కోర్టు కెళ్ళటం మొదలుపెట్టగానే హైకోర్టు బెజవాడకే రావొచ్చు. మరింకెక్కడికైనా రావొచ్చు. అప్పుడు మళ్ళీ కథ మొదట్నుంచీ మొదలుపెట్టాలి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ ఇవ్వగలిగినవి కావు. పుస్తక పఠనంతో ఎంత కాలం గడపాలా అని మధన పడటం శారద గమనించింది. అందువల్లే అతను తరచు మద్రాసు
వెళ్తున్నా అతని పరిస్థితిని అర్థం చేసుకుంది. మూర్తికి బెజవాడలో కంటే మద్రాసులో స్నేహితులెక్కువ. వృత్తిపరమైన చర్చలకు కూడా అదే అనువైన ప్రదేశం. ‘‘నాకీ ప్రాక్టీసు లేకపోతే ఏమయ్యేదాన్ని. పిచ్చెక్కిపోయేది. పాపం మూర్తి’’ అని అతనికి పూర్తిగా తన సహకారాన్ని ఇచ్చింది.
దుర్గాబాయి ఎన్నికలలో పోటీ చేస్తోందంటే శారదకు చాలా సంతోషమనిపించింది. దుర్గ గెలిచి కేంద్రంలో మంత్రయితే దేశానికి చాలా మేలు జరుగుతుందని అనేకమంది శారద కూడా ఆశపడిరది. దుర్గ ఎన్నికల ప్రచారంలో తను కూడా పాల్గొందామంటే దుర్గకు పోటీగా కమ్యూనిస్టు పార్టీ తన అభ్యర్థిగా కంతేటి మోహనరావుని నిలబెట్టింది. కమ్యూనిస్టుకి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యలేననిపించింది శారదకు. దుర్గ గురించి రాజమండ్రిలో ఎవరు చేసే ప్రచారం మాత్రం ఏముంటుంది. రాజమండ్రిలో ఎన్ని చైతన్య దీపాలు వెలిగించింది దుర్గ. అక్కడికి తను వెళ్ళి దుర్గను గురించి మాట్లాడటం అనవసరం అనుకుంది. రాజమండ్రిలో దుర్గ గెలవకపోతే మరింకెవరు గెలుస్తారు. ఈ ఆలోచనలతోనే దుర్గకు తన అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాసింది.
అన్నపూర్ణ రాజమండ్రిలో ప్రచారానికి సిద్ధమై వచ్చింది.
‘‘దుర్గాబాయి గారితో నీకున్నంత స్నేహం నాకు లేదుగదా. కాస్త రికమండేషన్‌ లెటర్‌ సిఫారసు చేస్తూ ఉత్తరం ఇస్తావేమోనని వచ్చాను’’ అంది నవ్వుతూ.
‘‘నువ్వూ పోటీ చేయాల్సింది అన్నపూర్ణా’’ అంది శారద. అన్నపూర్ణ విరగబడి నవ్వింది. నవ్వీ నవ్వీ ఆయాసపడి ఆగి
‘‘ఎన్నికలంటే ఏంటనుకున్నావు? డబ్బు, పెద్ద నాయకుల అండ ఇవన్నీ కావాలి.’’
‘‘దుర్గాబాయి డబ్బు ఖర్చు చెయ్యనవసరం లేదు. ప్రజలు ఆమె పేరు చూసి ఓటేస్తారు గదా. ఆమె అంటే రాజమండ్రి ప్రజలకు కన్న కూతురు లాంటిది. తోడబుట్టిన చెల్లెలు వంటిది. ఎన్ని పనులు చేసింది. ముఖ్యంగా రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెగ్గుకు వచ్చింది.’’
‘‘నాకూ చాలా గౌరవం. అందుకే ఎన్నికల వరకూ రాజమండ్రిలో ఉండి దుర్గాబాయమ్మ గారికి కావాల్సిన సహకారం అందించి వద్దామని బయల్దేరా.’’
‘‘అవసరమైతే నాకూ కబురు చెయ్యవోయ్‌ నేనూ వస్తానోయ్‌.’’
‘‘అంత అవసరం రాదు. ఒక కమ్యూనిస్టు మీద పోటీ చేస్తున్న దుర్గాబాయి తరపున మరొక కమ్యూనిస్టు ప్రచారం చేయటం వింతగానే ఉంటుందననుకో…’’ నవ్వింది అన్నపూర్ణ.
శారద కూడా నవ్వింది. ఆ నవ్వులో కొంచెం విషాదం కలగలిసింది.
‘‘బాధపడకు శారదా…’’
‘‘బాధ లేకుండా ఉండదోయ్‌. దాదాపు పాతికేళ్ళు ఊపిరిగా పీల్చుకున్న విశ్వాసాలు, పెంచుకున్న ఆశయాలు ఎలా తుడిచివేయగలం? ఒక్కోరోజు రాత్రి అంతా గుర్తొచ్చి గుండె నీరయిపోతుంది. అందరూ గుర్తొస్తారు. అసలేమీ అర్థం కానట్లుంటుంది. ఎందుకిలా ఎందుకిలా అని పిచ్చిగా ప్రశ్నిస్తాను. కానీ సమాధానం చెప్పేదెవరు? కాలం ఒకటే… కాలం చెప్పింది, నేననుకున్నది సరైనదని. పోరాట విరమణ చెయ్యాలని అందరూ అనుకున్నారు, చేశారు. అదే మాట వాళ్ళకంటే ముందు చెప్పటం నేరమెలా అవుతుందో, దానిని వాళ్ళెలా సమర్ధించుకుంటున్నారో నాకు తెలియదు. సరే, పోనీ నేను ఒక కమ్యూనిస్టుగానే జీవిస్తున్నాను. సభ్యత్వం పార్టీలో లేదేమో. కానీ ఆ విలువలు పాటించే వారిలో నేనూ సభ్యురాలినే. సహచరినే. నడుస్తూనే ఉంటాను. నడక ఆపకపోవటం ముఖ్యం. నడకే ముఖ్యం ప్రయాణమే అసలు విషయం. సారాంశం’’ ఆవేశంగా మాట్లాడుతున్న శారద చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది అన్నపూర్ణ.
‘‘సాయంత్రం రైలుకి మా అమ్మాయి స్వరాజ్యం వస్తుంది శారదా. ఈ నెల రోజులూ నీతో ఉంటుంది.’’
‘‘ఔనా… మరి చెప్పవేం ఇంతసేపూ. స్వరాజ్యం వస్తే ఇల్లు కళకళలాడుతుంది. నటాషాకూ బాగుంటుంది.’’
‘‘మన స్నేహం పిల్లలకు అర్థం కావాలనే స్వరాజ్యాన్ని బతిమాలి ఒప్పించాను. గుంటూరు వదిలి ఎక్కడికీ వెళ్ళదు. శారదా నికేతన్‌లో పాఠాలు చెబుతుంది గదా. అదే కాలక్షేపం. పెళ్ళి చేసుకోమంటే వద్దంటుంది. వచ్చే ఏడు విశాఖపట్నం పంపి ఎమ్మే అన్నా చదివించాలంటున్నాడు వాళ్ళ నాన్న.’’
‘‘ఔనోయ్‌. బియ్యేతో ఆపటం ఏంటి? అవకాశాలు లేనివాళ్ళు లేక చదవటం లేదు. స్వరాజ్యం చదవక పోవటమేమిటి?’’
‘‘అది చదువుతాననే అంది. పోయినేడాది చేరవలసింది. సరిగ్గా అదే సమయానికి ఆరోగ్యం పాడయి సంవత్సరం వృథా అయింది. పెళ్ళి…’’ ‘‘అన్నపూర్ణా, నువ్వు కూడా పెళ్ళంటావేమిటోయ్‌. హాయిగా చదువుకుని ఉద్యోగంలో చేరి అప్పుడాలోచించవచ్చులే’’ అన్నపూర్ణ కూతురు తన దగ్గర నెల రోజులుంటుందంటే శారదకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
ఆ రాత్రి కూతురిని శారదకప్పగించి రాజమండ్రి రైలెక్కింది అన్నపూర్ణ. శారదంటే స్వరాజ్యానికి ఇంతకు ముందు గౌరవంతో పాటు భయం కూడా ఉండేది. ఆ భయంతోనే తల్లి రమ్మంటే వెంటనే ఒప్పుకోలేదు. ఇరవై ఏళ్ళ స్వరాజ్యం శారదను చాలా తక్కువసార్లే చూసింది. చూసినప్పుడు శారద చొరవ, ఠీవి, ఎవరితోనైనా సూటిగా మాట్లాడే తీరూ ఇవన్నీ స్వరాజ్యానికి కొంత బెరుకు కలిగించాయి. అదంతా రెండు రోజుల్లో పోయేలా చేసింది శారద. స్వరాజ్యం శారదను పెద్దమ్మా అని పిలవటం మొదలుపెట్టింది. నటాషా అక్కా అక్కా అంటూ స్వరాజ్యాన్ని వదలటం లేదు. ఇద్దరికీ పదకొండేళ్ళ తేడా. స్వరాజ్యం వెనకాలే తిరుగుతూ ఏవో కబుర్లు చెప్పటం అలవాటయింది నటాషాకు. శారద దగ్గరున్న పుస్తకాలు స్వరాజ్యానికి ప్రధానాహారం, చిరు తిండి కూడా అయిపోయాయి. సుబ్బమ్మగారు ‘ఈ స్వరాజ్యం చూడు. అన్నం తింటూ కూడా పుస్తకం వదలదు’ అని చెప్తే ‘భేష్‌’ అని మెచ్చుకున్నారు మూర్తి, శారదలు.
అబ్బయ్య దగ్గర ఇన్ని పుస్తకాలు, ఇంత వైవిధ్యమైన సాహిత్యం లేదు. ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యం ఇంత లేదు. స్వరాజ్యం ఆ పుస్తకాల మీద పడిరది. మూర్తి రోజూ కాసేపు ఎవరో ఒక రచయిత గురించి స్వరాజ్యానికి చెప్తున్నాడు.
ఆ రోజు శారద హాస్పిటల్‌ నుంచి పెందలాడే వచ్చింది. వరండాలో చల్లగాలి వీస్తోంది. అక్కడ కూర్చుని మూర్తి షేక్‌స్పియర్‌ నాటకాల గురించి స్వరాజ్యానికి చెబుతుండగా శారద వచ్చింది. తనూ కాసేపు కూచుని వింటూ పైకి వెళ్ళి హామ్లెట్‌ పుస్తకం తెచ్చింది.
‘‘హామ్లెట్‌ గురించి అంత చెప్పాము. కాస్త చదివి రుచి చూపిద్దామోయ్‌ మనమ్మాయికి. మనం చదివి కూడా చాలా రోజులయింది కదా.’’ మూర్తి ముఖం వికసించింది. అది వరకు ఎంత పని ఒత్తిడిలోనూ కాసేపయినా కలిసి ఒక పుస్తకంలో కొన్ని పేజీలైనా చదివేవారు. కలిసి ఒక పాటైనా పాడుకునేవారు. రెండేళ్ళుగా స్తబ్దత, ఏ పని మీదా ఆసక్తి లేకుండా ఎవరి పని వారిదన్నట్లు బతుకుతున్నారేమో స్వరాజ్యం పుణ్యమా అని మళ్ళీ సాహిత్యం వారి మనుగడలోకి వచ్చింది.
ఒఫీలియా, హామ్లెట్‌ల సంభాషణలున్న భాగం తీసి పక్కపక్కనే కూచుని భావయుక్తంగా నాటకంలా చదువుతుంటే స్వరాజ్యానికి ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఆ పిల్లకు మానవ మాత్రులుగా కనిపించలేదు. ఆ రాత్రివేళ హామ్లెట్‌, ఒఫీలియాలు నిజంగానే మాట్లాడుకుంటుంటే తను వింటున్నాననిపించింది. ఆ ఘట్టం చదివాక మూర్తి హామ్లెట్‌ సోలిలోక్వి తనొక్కడే చదివాడు. ఆ రాత్రి అతని గంభీరమైన కంఠస్వరం హామ్లెట్‌ సందిగ్ధతను పలికించిన తీరుకి పులకించింది శారద.
‘‘ఎన్నాళ్ళయిందోయ్‌ నువ్విలా చదివి’’ అని అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది.
మూర్తి కూడా వివశుడయ్యాడు. వారిద్దరినీ వారి ఏకాంతానికి వదిలి స్వరాజ్యం మెల్లిగా లేచి లోపలికి వెళ్ళింది. చల్లని ఆ రాత్రి వెన్నెల వారి మనసులలోని అశాంతిని చల్లబరిచింది. ఎంతోసేపు వారిద్దరూ అలా కూచుని ఉండిపోయారు. ఇద్దరి చెంపలూ తడిసి, గాలికి ఆరిపోతూ, మళ్ళీ తడుస్తూ ఆ రాత్రి గడిచిపోయింది.
తమ తమ ఒంటరితనాల నుంచి బైటపడేసిన స్వరాజ్యాన్ని ఎంతగానో ప్రేమించారు వారిద్దరూ. స్వరాజ్యానికి వాళ్ళిద్దరంటే ఆరాధన వంటి భావన కలిగింది. ముగ్గురూ నటాషాతో కలిసి ఆడుతూ పాడుతూ రోజులు గడుపుతుంటే నెల ఎట్లా గడిచిందో తెలియనే లేదు. మధ్యలో అన్నపూర్ణ ఉత్తరం కొంత ఆందోళన కలిగించినా శారద ఆ ఆనందంలో దాన్ని పక్కకు నెట్టింది. ఒక రోజు సరస్వతీ, గోరాలను, వాళ్ళ పిల్లలను, మెల్లీని, లక్ష్మణరావు గారిని తమ ఇంటికి భోజనానికి పిలిచింది. ఆదివారం పూర్వపు సందడంత కాకపోయినా ఇల్లు పెద్దల రాజకీయ చర్చలతో, పిల్లల సాహిత్య చర్చలతో నటాషా ఆటలతో గడిచిపోయింది.
అప్పటికే లక్ష్మణరావు గారు అతడు`ఆమె నవల రాయటం, అది శారద చొరవతో సూర్యం ప్రచురించటం జరిగిపోయింది. ప్రచురణ బాధ్యత సూర్యం సంతోషంగా తీసుకున్నాడు. ఆ నవల మీద సమీక్షలు రాలేదని లక్ష్మణరావు గారు బాధపడుతుంటే, ‘‘దాన్ని సమీక్షించటం అంత తేలిక కాదు. మీరు తొందరపడొద్దు. ఆంధ్ర దేశం ఆ నవలను నెత్తిన పెట్టుకుంటుంది. దానికి న్యాయం చేసే విమర్శలూ వస్తాయ’’ని శారద, సరస్వతి, మూర్తి ఓదార్చారు. మెల్లీ నవ్వుతూ తనూ అదే అనుకుంటున్నానన్నది. అందరూ స్వరాజ్యాన్ని కూచోబెట్టి అభిప్రాయం చెప్పమన్నారు. ఆ అమ్మాయి కిందటి వారమే ఆ నవల చదివింది. స్వరాజ్యం చటుక్కున ‘‘పెద్దమ్మ, పెదనాన్నలను గురించి రాసినట్టుంది’’ అంది.
అందరూ నవ్వారు. ‘‘మరీ నేను శాస్త్రంత లౌక్యుడినా’’ అన్నాడు మూర్తి.
‘‘అదంతా కాదు మీరలా ప్రేమగా ఉంటారు’’ అంది స్వరాజ్యం సిగ్గుపడుతూ.
‘‘వీళ్ళిద్దరూ నాకు ఇన్‌స్పిరేషన్‌. కాకపోతే నవలలో కల్పన పాలు ఉండాలి కదా’’ అన్నారు లక్ష్మణరావు.
‘‘మా శారద మీ శాంతం కంటే గొప్పది. రాజీపడదు’’ అంది సరస్వతి.
‘‘నిజం’’ అంది మెల్లీ.
సూర్యం అక్కవైపు గర్వంగా చూశాడు. పద్మ లోపలికి వెళ్ళి ఫలహారాలతో తిరిగి వచ్చింది. చర్చ కూడా దారి మళ్ళి ఎన్నికల వైపు తిరిగింది. ‘‘ఉండండి. అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదువుతాను’’ అంటూ లోపలికి వెళ్ళి ఉత్తరం తెచ్చింది శారద. అందరూ ఆసక్తిగా సర్దుకుని కూర్చున్నారు.
ప్రియమైన శారదా`
ఇక్కడికి వచ్చి పదిహేను రోజులవుతున్నది. మొదటి వారం ఉత్సాహంగా నియోజక వర్గాన్ని, చేయాల్సిన పనుల్ని తెలుసుకోటానికే సరిపోయింది. కమ్యూనిస్టు అభ్యర్థి కంతేటి మోహనరావుకి మంచి పేరే ఉంది గానీ దుర్గాబాయి పోటీ చేసినపుడు ఆమెను కాదని ప్రజలు ఇంకెవరికి ఓటేస్తారు అనుకుని చాలా ఉత్సాహంగా పనిలో పడ్డాను. కానీ వారం తిరక్కుండానే ఎన్నో లోతులు చూపించారు. ఇప్పుడు నాకు భయంగా ఉంది. దుర్గాబాయి గెలుపు అంత తేలిక కాదనిపిస్తోంది. కేవలం కమ్యూనిస్టుల బలమే అయితే నాకు భయం ఉండేది కాదు. జయాపజయాలు దైవాధీనాలు అనుకునో, కమ్యూనిస్టులు ప్రజల్లో అంతగా పాతుకుపోయారనో అనుకుని ఉండేదాన్ని. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే కాంగ్రెస్‌ వాళ్ళే దుర్గాబాయికి ఓటెయ్యవద్దని చెబుతున్నారు. లోపల లోపల చాలా కథలు జరుగుతున్నాయి. అసలు కారణం దుర్గాబాయి ఆడది. కేవలం ఆడది మాత్రమే కాదు, అఖండ మేధా సంపత్తి, అపారమైన దేశభక్తి, అంకితభావం, నిజాయితీ, ప్రజాసేవ తప్ప ఇంకొక ధ్యాస లేకపోవటం, నెహ్రుగారికి దుర్గాబాయి గారంటే ఉన్న గౌరవం… వీటన్నింటివల్లా స్థానిక కాంగ్రెస్‌ పెద్దలు దుర్గాబాయి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. దుర్గాబాయి గెలిస్తే మంత్రి పదవి తప్పదు. నెహ్రు గారు ఆ సంకేతాలు ఇచ్చారు. జిల్లా నుంచి ఆవిడ మంత్రయితే జిల్లాలో ఈ మగపురుషుల అవినీతి పనులను సాగనిస్తుందా? ఆవిడ నిజాయితీతో జిల్లా బాగుపడుతుంది గానీ ఈ పెద్దలు నష్టపోతారు. ప్రజలందరూ ఆమెనే నేరుగా కలుస్తారు. సమస్యలు చెప్పుకుంటారు. సమర్థురాలైన ఆమె పరిష్కరిస్తుంది. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆమెనే ఎన్నుకుంటారు. ఆమె తనవంటి నిజాయితీ పరులతో ఒక గ్రూపు తయారు చేసుకుంటుంది. ఇప్పటి ఆషాఢ భూతులకూ, అవినీతి పరులకూ ఇక భవిష్యత్తు ఉండదు. వాళ్ళే జిల్లాలో అధికారం కావాలనుకుంటున్నారు. దాంతో వెనకనుంచి గోతులు తవ్వుతున్నారు. ఆ ప్రచారాలు, ఆ మాటలు నేను రాయదగ్గవి కాదు. మొత్తంమీద ఇవన్నీ తెలిసి నా తల తిరిగిపోయింది. కానీ ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇద్దరు అభ్యర్థులూ మంచివారే. కానీ మోహనరావు గారు దుర్గాబాయమ్మ ముందు నిలవలేడు.
కానీ శారదా, ఆడవాళ్ళు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించి గెలిచి చట్టసభల్లో సగభాగమవటం ఇంకొక వందేళ్ళకయినా జరగదు. ఈ మగవాళ్ళు అలా జరగనివ్వరు. దుర్గాబాయమ్మకున్న సద్గుణాలన్నిటితో ఒక మగవాడు పోటీచేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఇది దారుణం. కానీ వాస్తవం. ఆడవాళ్ళు ఉద్యమాల్లో జెండాలు మోయటానికి, వండి వార్చటానికి, సత్యాగ్రహులకు సేవలు చెయ్యటానికి, జైళ్ళు నింపటానికి పనికొస్తారు గానీ ఎన్నికై చట్టసభలలోకి వెళ్ళి పదవులు పొందకూడదు. హిందూ కోడ్‌ బిల్లు మీద ఉన్నంత వ్యతిరేకత ఉంది ఆడవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయటం మీద. దుర్గాబాయి ఒకవేళ ఓడిపోతే అది కాంగ్రెస్‌ వారి వల్లనే గాని కమ్యూనిస్టుల బలం వల్ల కాదు. నా మాట నమ్ము. కాంగ్రెస్‌లోని నీచమైన దారులు, పద్ధతులూ నాకు చాలా తెలుసు గానీ ఇంత నీచత్వం ఉందనుకోలా. ఇంక ఎంత రాసినా ఇదే… ముగిస్తాను. శక్తి వంచన లేకుండా పని చేస్తున్నాం మహిళా దళం వాళ్ళం. ఫలితం గురించి ఆలోచించడం అనవసరం. మరో పదిహేను రోజుల్లో అంతా తేలిపోతుంది.
నీ ప్రియమైన
అన్నపూర్ణ
అందరూ నిశ్శబ్దమైపోయారు.
గోరా గారు లేచి ‘‘సరస్వతీ, నువ్వూ పిల్లలూ తర్వాత రండి. నేను వెళ్తాను’’ అంటూ వెళ్ళిపోయారు. ఆయన చాలా అలజడి చెందాడని అందరికీ అర్థమయింది. దుర్గాబాయి ఆయన విద్యార్థిని. ఆయన ఆందోళన సహజం.
‘‘ఈసారి ప్రతి పార్టీ ఆడవాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టాలని అడుగుదాం’’ సరస్వతి కోపంగా అంది. అందరూ నీరసంగా నవ్వారు.
‘‘అసలీ ఎన్నికల్లో ఇంత దుర్మార్గులుంటే పోటీ చెయ్యటం సరే ఓట్లు కూడా వెయ్యకూడదు’’ అంది స్వరాజ్యం ఆవేశంగా.
‘‘మరి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది. మనది ప్రజాస్వామ్యం గదా’’ అంది మైత్రి.
అందరూ ఇద్దరిద్దరుగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అందరికంటే చిన్నవాడు రవికి విసుగుపుట్టి తనతో ఆడాలని పేచీ పెట్టాడు. స్వరాజ్యం, మైత్రి, ఆమె చెల్లెళ్ళు నటాషా, లావణ్య అందరూ రవి చెప్పినట్లు ఆడటం మొదలు పెట్టారు. చెప్పినట్లు ఆట మొదలుపెట్టారు. అందరిలో మెల్లీ ముఖం బాగా వాడిపోయి ఉండటం శారద గమనించింది. మెల్లీ భుజం తట్టి ‘‘నిరాశపడకు. ప్రజలు ఉన్నారు. వాళ్ళమీద నమ్మకం ఉంచు’’ అంది.
‘‘నాకు మోహనరావు గెలవాలనే ఉంది. కానీ ఇలా కాంగ్రెస్‌ ద్రోహం వల్ల కాదు’’ అది మెల్లీ.
‘‘నాకు అర్థమైంది’’ అని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది శారద.
రాత్రి భోజనాలు చేసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. అన్నపూర్ణ ఉత్తరం గుర్తొస్తే చేదుమాత్ర నోట్లో చప్పరించాల్సి వచ్చినట్లు అనిపిస్తోంది అందరికీ. ఎన్నికలు పూర్తయిన రోజే అన్నపూర్ణ రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది.
దుర్గాబాయి ఎన్నికల్లో ఓడిపోయింది. రెండువందల కంటే తక్కువ ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి గెలిచాడు. శారద దుర్గాబాయికి ఉత్తరం రాసింది. కమ్యూనిస్టు అభ్యర్థులు ఎక్కువమంది గెలిచినందుకు ఆనందపడిరది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరాడని పనులతో శారద పరుగిడుతోంది. దుర్గాబాయి ఓటమి కలిగించిన నిరాశ మనసులోంచి పూర్తిగా పోకముందే దుర్గాబాయి, చింతామణి దేశ్‌ముఖ్‌ల వివాహ వార్త వచ్చింది. అన్నపూర్ణ, స్వరాజ్యం ఆ ఆనందాన్ని మోసుకుంటూ బెజవాడ వచ్చారు. స్వరాజ్యం ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్‌.ఎస్‌.సి.లో చేరటానికి వెళ్తోంది. వెళ్ళేముందు శారద పెద్దమ్మతో నాలుగు రోజులు గడపాలని ప్రయాణమైతే ఒక్క రోజుకి నేనూ మీ పెద్దమ్మతో మాట్లాడుకోటానికి వస్తానంది అన్నపూర్ణ. ‘‘నువ్వొస్తే మీరిద్దరూ మాట్లాడుకుంటారు. నేనొక్కదాన్నే వెళ్తానంది’’ స్వరాజ్యం. ఆ విషయం మీద కాసేపు తగవు పడిన తల్లీ కూతుళ్ళను అబ్బయ్య సమాధానపరిచాడు. ‘‘అన్నపూర్ణ ఒక్క పూట మాత్రమే ఉండి వచ్చేస్తుంది. స్వరాజ్యం నాలుగు రోజులుంటుంది’’ అన్న తండ్రి మాటను గొణుక్కుంటూనైనా ఒప్పుకోక తప్పలేదు స్వరాజ్యానికి.
‘‘నాకంటే నీకు శారద పెద్దమ్మ ఎక్కువైంది’’ నిష్టూరమాడిరది తల్లి. ‘‘కాదమ్మా నువ్వూ పెద్దమ్మా చిన్నప్పటి నుంచీ స్నేహితులు. నాకు మొన్న మొన్ననే గదా పెద్దమ్మ దగ్గర చనువు. ఆమె పూర్తిగా నాకే కావాలనిపిస్తుంది. అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలనిపిస్తుంది. నాకు పెద్దమ్మంటే ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు…’’ తన ఉద్వేగాన్ని అణచుకోలేక అక్కడినుంచి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, అబ్బయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ‘‘ఏంటంత ఆవేశపడుతోంది’’ అన్నపూర్ణ ఆశ్చర్యపడిరది.
‘‘ఈ వయసులో పిల్లలకు కొందరికి విపరీతమైన ఆరాధన ఏర్పడుతుంది. అది మామూలే. మనకా వయసులో గాంధీ గారు ఆరాధ్యుడు కదూ… అలాగే…’’
‘‘ఇది కమ్యూనిస్టు అవదు గదా’’ ‘‘ఆ భయం నాకూ ఉంది’’ నవ్వాడు అబ్బయ్య.
సాయంత్రానికి బెజవాడ చేరారు. అన్నపూర్ణ ఆ రాత్రి మాత్రమే ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోతుంది. రాత్రి భోజనాలయ్యాక అందరూ కూర్చుని కబుర్లాడుకునేటపుడు ‘‘దుర్గాబాయి గారు పెళ్ళి చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’’ అంది అన్నపూర్ణ.
‘‘ఎందుకంత ఆనందం. పెళ్ళే జీవిత పరమార్ధమా?’’ నవ్వింది శారద.
‘‘పరమార్థమని కాదు. ఒక మంచి తోడు దొరికింది. చేసే పని మరింత బాగా చెయ్యటానికి మరింత బలం.’’ ‘‘దుర్గకి ఎవరి బలమూ అరువుగా అక్కర్లేదు. తన బలం తనకు చాలు.’’
‘‘దుర్గ సంగతి పక్కన బెడదాం. ఆమె అసామాన్యురాలు. మిగిలిన వాళ్ళకు ఒకరికొక తోడు అక్కర్లేదా?’’ ‘‘అది మనకు అలవాటైపోయింది అన్నపూర్ణా. ఒక పెళ్ళి… భార్యా, భర్త. భర్త మంచివాడైతే ఫర్వాలేదు. ఎందరు ఆడవాళ్ళకు వాళ్ళ భర్తలు బలమిస్తున్నారు చెప్పవోయ్‌. భార్యలలోని సర్వశక్తులూ లాగేసే వాళ్ళే ఎక్కువ. మనం కూడా పెళ్ళిళ్ళకు ఆనందపడటం, పిల్లలకు పెళ్ళి తప్పనిసరిగా చెయ్యాలనుకోవటంతో ఆ ఆచారమనూ, మరొకటనూ బలపడుతుంది. దాన్ని బలపడనివ్వకూడదు. అది ఎంత బలహీనపడితే ఆడవాళ్ళకంత మంచిదోయ్‌.’’
‘‘చలం గారిలా మాట్లాడుతున్నావు.’’
‘‘ఆయన మాటలు నిజమని నాకనిపించినపుడు నా మాటలకు ఆయన మాటలకూ తేడా
ఉండదు కదోయ్‌.’’
స్వరాజ్యం ఎదుట ఆ మాటలు పొడిగించాలనిపించలేదు అన్నపూర్ణకు. కానీ శారద ఆపలేదు.
‘‘స్త్రీ పురుషుల మధ్య స్నేహం, ప్రేమ, సాంగత్యం, సెక్స్‌ ఇవి ఆనందాన్నివ్వవని నేననటం లేదు. మనుషులకు సెక్స్‌ అవసరమని తెలియని దాన్ని కాదు. కానీ పెళ్ళి తప్ప సెక్స్‌కి ఇంకో దారి లేకపోవటం, స్త్రీ పురుషుల స్నేహానికి వీలు లేకపోవటం ఎంత దుర్మార్గమోయ్‌. దానివల్ల చచ్చినట్లు పెళ్ళి చేసుకోవాలి. ఇక ఆ పెళ్ళి ఇద్దర్నీ కుంగదీస్తుంది. ఇక ఆ పెళ్ళి నుంచి బైటపడే దారీ ఉండదు’’.
‘‘హిందూ కోడ్‌ బిల్లు వస్తోందిగా.’’
‘‘బిల్లులతో, చట్టాలతో పోయేంత బలహీనమైంది కాదోయ్‌ పెళ్ళి. కొండ చిలువలా చుట్టుకొని బిగుసుకొని ఉంది.’’ ‘‘శుభమా అని దుర్గ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే…’’
‘‘పెళ్ళి శుభం అనుకోవటంతోనే నా పేచీ, దుర్గ పెళ్ళితో కాదు. వాళ్ళిద్దరి సంగతి గురించి కాదు. మొత్తం పెళ్ళి అనే తప్పనిసరి చెరసాల గురించి చెబుతున్నాను.’’
‘‘ఆడవాళ్ళందరం అందులో బందీలంటావు.’’
‘‘ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా. మానవుల్ని అమానుషంగా చేస్తుందోయ్‌ పెళ్ళి.’’
‘‘మరీ దారుణంగా మాట్లాడకు శారదా.’’
‘‘దారుణం నా మాటలు కాదు. పెళ్ళి… అందులో పెత్తనం, అధికారం ఉందోయ్‌. అది చాలా దారుణం.’’ ‘‘దాన్నుంచి బైటపడేదెట్లా పెద్దమ్మా… బైటపడి ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రేమగా కలవటం ఎట్లా.’’ ‘‘ఎట్లా అంటే ఇట్లా అని చెప్పటానికి నా దగ్గర రెడీమేడ్‌ సమాధానం లేదమ్మా. ఇది దారుణం అని గుర్తించటం ఒక ముందడుగని నాకనిపిస్తుంది. తర్వాతి అడుగులు చాలా ఉన్నాయి. కులం, మతం, డబ్బు… వీటి ప్రభావాల నుంచి తప్పించుకుని ప్రేమించగలిగేందుకు చేసే పోరాటాలు… ఇలా అడుగులు వేసుకుంటూ ఆ దారిలో నడుస్తూ వెళ్ళటమే. పెళ్ళి దారుణమని సన్యాసులవటం కాదు పరిష్కారం. ప్రేమ కోసం, ఉన్నతమైన స్త్రీ పురుష సంబంధాల కోసం అన్వేషించటంలోనే ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి.’’
శారద వంక ఆరాధనగా చూస్తున్న స్వరాజ్యాన్ని చూస్తుంటే అన్నపూర్ణకేదో ఆందోళన.
‘‘నాకు నిద్రొస్తోంది పడుకుందాం రా’’ అని లేచింది.
‘‘నువ్వు పడుకోమ్మా. నాకు నిద్రరాటంలా’’ స్వరాజ్యం లేవలేదు. చేసేది లేక అన్నపూర్ణ వెళ్ళింది. స్వరాజ్యం శారదకు మరింత దగ్గర చేరి తన సందేహాలన్నీ అడగటం మొదలుపెట్టింది, శారద చెబుతుంటే శ్రద్ధగా వింటూ…
ఈ రాత్రే కాదు మిగిలిన నాలుగు రోజులూ శారదను ఒక్క క్షణం వదలలేదు స్వరాజ్యం. ఆమెతో పాటు ఆస్పత్రికి వెళ్ళింది. రోగుల ఇళ్ళకు వెళ్ళింది. సరస్వతీ గోరాల దగ్గరకూ, మెల్లీ లక్ష్మణరావుల దగ్గరకూ వెళ్ళింది. అదంతా కొత్త ప్రపంచంలా ఉందా అమ్మాయికి.
‘‘ఇన్నాళ్ళూ నేనిదంతా మిస్సయ్యాను పెద్దమ్మా. అమ్మా నాన్నా ఎంత చెప్పినా బెజవాడ వచ్చేదాన్ని కాదు. ముందే వచ్చుంటే ఎంత బాగుండేది’’ అంటే శారద నవ్వింది.
‘‘ముందే వస్తే ఇంత నచ్చేది కాదేమో. ప్రతి దానికీ ఒక టైముంటుంది. కోడిగుడ్డు పిల్లవటానికున్నట్టు’’
‘‘పెద్దమ్మా… నేను ఉత్తరాలు రాస్తే సమాధానం ఇస్తావా?’’
‘‘ఎందుకివ్వను పిచ్చిపిల్లా. నేను మీ పెద్దమ్మను’’ అని స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకుంది.
స్వరాజ్యం విశాఖపట్నంలో హాస్టల్‌లో ఉన్నా శలవు రోజుల్లో తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళి ఇష్టమైనవన్నీ వండిరచుకుని తినమని శారద వాళ్ళ అడ్రసులన్నీ ఇచ్చి వాళ్ళకు ఉత్తరాలు రాసింది.
… … …
మీ వాళ్ళు చూడు ఏం చేశారో. మూడేళ్ళు తిరగకుండా ఎన్నికలు తెచ్చిపెట్టారు. మొన్నటివరకూ సాయుధ విప్లవం ద్వారా నెహ్రు ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. ఇప్పుడు…’’
‘‘ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పడగొట్టారు. మంచిదే గదా. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంలో తప్పేమీ లేదోయ్‌.’’
‘‘నిన్ను వాళ్ళు శత్రువులా చూస్తున్నారు. నువ్వు మాత్రం వాళ్ళను సమర్థించటం మానవు.’’
‘‘వాళ్ళు చేసింది సరైనది కాదని వ్యతిరేకిస్తేనే కదా వాళ్ళు నేనూ అని మాట్లాడే అవకాశం వచ్చింది. ఎన్నికల రాజకీయాలలో వాళ్ళు చేసింది కరెక్టేనోయ్‌.’’
అన్నపూర్ణకు మరి మాట్లాడేందుకేమీ లేకపోయింది.
ఒంట్లో బాగోలేదని శారద దగ్గర పరీక్ష చేయించుకోటానికి వచ్చింది అన్నపూర్ణ.
పరీక్ష చేసి మందులిచ్చాక రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తున్నారు.
శారద వాళ్ళను పరీక్షిస్తూ, జాగ్రత్తలు చెప్తూ అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉంది.
ఆ సమయంలో తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న ఓ యువతి వచ్చింది. పక్కనే కాస్త పొట్టిగా తెల్లగా ఉన్న కుర్రవాడు. వాళ్ళిద్దరినీ చూస్తూనే శారద ముఖం విప్పారింది.
‘‘రావోయ్‌… రా. విశేషమా… అన్నపూర్ణా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? చలసాని శ్రీనివాసరావు చెల్లెలు. వీడు తమ్ముడు ప్రసాదు. హేమలత కదూ నీ పేరు.’’
డాక్టర్‌ గారికి తామంతా గుర్తున్నందుకు ఆ అక్కాతమ్ముళ్ళు సంతోషపడ్డారు.
‘‘ఔనండి. నాకిప్పుడు మూడో నెల. పరీక్ష చేయించుకుందామని వచ్చాను.’’
‘‘మీ పెళ్ళి గోరాగారు చేశారు కదా. నే రాలేదులే. సరస్వతి చెప్పింది. మీ అన్నయ్య శ్రీనివాసరావంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ కళ్ళల్లో మెదుల్తున్నట్లే ఉంటాడు. అన్నపూర్ణా… మీ పార్టీనే పొట్టన బెట్టుకుంది. పదమ్మా పరీక్ష చేస్తాను’’ అంటూ పక్కకు తీసుకెళ్ళి కర్టెను వేసి కబుర్లు చెబుతూ పరీక్ష చేసింది.
‘‘శ్రీనివాసరావు ఒక రోజు మీ అందరి గురించీ చెప్పాడు. మీ నాన్నగారు బసవయ్యగారు బాగున్నారా? ఈ ప్రసాదుని చూస్తుంటే ముచ్చటేస్తోందోయ్‌. బాగా చదివించండి. శ్రీనివాసరావు గుర్తొస్తే మాత్రం బాధగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది.’’
పరీక్ష పూర్తి చేసి జాగ్రత్తలు చెప్పి మందులు తనే ఇచ్చి ‘‘క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకో. నీ పురుడు చులాగ్గా అవుతుంది’’ అని వాళ్ళను పంపింది గానీ శ్రీనివాసరావును తల్చుకుంటూ కన్నీరు పెట్టింది.
అన్నపూర్ణ ఏదో చెప్పబోయేంతలో మరో గర్భిణీ స్త్రీ రావటం శారద ఆమెను పరీక్ష చేయటం… ఇలా మధ్యాహ్నం వరకూ గడిపి ఇద్దరూ భోజనానికి ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర మళ్ళీ రాజకీయ చర్చలు వేడి వేడిగా సాగాయి. చూస్తుండగానే ఎన్నికలు దగ్గరకొచ్చాయి. కమ్యూనిస్టుల విజయం మీద ఎవరికీ సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ నమ్మారు.
అందరి నమ్మకాలనూ ఎన్నికలు దెబ్బతీశాయి. కమ్యూనిస్టులకు అదివరకున్న బలం కూడా లేకుండా పోయింది. ఘోరంగా ఓడిపోయారు. కారణాలనేకం. అవి ఫలితాన్ని మార్చలేవు. శారద, మూర్తీ ఆశ్చర్యపడి ఏవేవో విశ్లేషణలు చేశారు. శారదకు ఇప్పుడు పార్టీతో ఏ సంబంధమూ లేదు. నాయకులెవరూ ఆమెతో మాట్లాడరు. కోటేశ్వరమ్మ, రాజమ్మ వంటి వాళ్ళు ఎప్పుడైనా, ఎక్కడైనా కనబడితే ప్రాణం లేచొచ్చినట్లు పలకరిస్తారు, అంతే. అయినా కమ్యూనిస్టు పార్టీ ఓడిరదంటే శారదకు గుండె కలుక్కుమంది. బాధపడుతూ కూర్చునే తీరిక లేకపోవటమే శారదను రక్షించింది. శారద ప్రాక్టీసు విపరీతంగా పెరిగింది. హాస్పిటల్‌కి వచ్చేవారిని చూసి ఊరుకోదు శారద. సాయంత్రం నాలుగు నుంచీ జట్కా బండిలో బీదవాళ్ళుండే పేటలకు వెళ్తుంది. ఇంటింటికీ వెళ్ళి యోగక్షేమాలడిగి, ఆరోగ్య సూత్రాలు చెప్పి, అవసరమైన వాళ్ళకు తన వెంట తెచ్చిన మందులిచ్చి వస్తుంది. ఏడిరటి నుంచీ మళ్ళీ హాస్పిటల్‌. పురుళ్ళకూ ఒక సమయమంటూ ఉండదు. తిండికి, నిద్రకూ కూడా సమయం లేకుండా పనిచేసే రోజులు చాలానే ఉంటాయి. బెజవాడ ప్రజలకు శారద ప్రత్యక్ష దేవత అనే భావం కలిగిందంటే అందులో ఆశ్చర్యపడటానికేమీ లేదు. ఒకరోజు మధ్యాహ్నం పనంతా పూర్తి చేసుకుని ఇక భోజనానికి ఇంటికి వెళ్దామనుకుంటూ లేస్తుంటే గదిలోకి వచ్చిన ఉమాదేవిని చూసి ఆశ్చర్యపోయింది. ఆరేళ్ళ క్రితం తనను ద్రోహిగా చూసిన ఉమాదేవి… ఎవరినీ తనతో మాట్లాడనివ్వకుండా చూసిన ఉమాదేవి.
‘‘రావోయ్‌ రా… ఒంట్లో ఎలా ఉంది?’’ నిష్కల్మషంగా నవ్వింది శారద.
‘‘బాగానే ఉంది డాక్టర్‌ గారు. మీతో పనుండి వచ్చాను’’ ఉమాదేవి కూడా ఏమీ జరగనట్లే మాట్లాడిరది.
‘‘చెప్పు ఏమిటి పని? ఏం కావాలి?’’
‘‘ఉద్యోగం డాక్టర్‌ గారు’’
‘‘ఉద్యోగమా?’’
‘‘ఔను డాక్టర్‌ గారు. ఉద్యోగం చేస్తే కాస్త మా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా చెప్పి ఏదైనా ఉద్యోగంలో వేయిస్తే…’’ ఉమాదేవి బిడియంగా తలదించుకుంది.
‘‘దాన్దేముందోయ్‌… అలాగే చేద్దాం. నేను ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి దొరక్కపోదు. నువ్వు బెంగ పెట్టుకోకు. ఏదీ నాలుక చూపించు. ఎనీమిక్‌గా ఉన్నావు. రక్తం తక్కువగా ఉంది. మందులిస్తాను. వాటిని వాడుతూ ఆకు కూరలు బాగా తిను.’’
జాగ్రత్తలు చెబుతూ మందులిచ్చింది. కుటుంబ యోగక్షేమాలడిగింది.
ఉమాదేవి శారదకు మంచి స్నేహితురాలనుకునేవారు తెలియని వారెవరన్నా అక్కడుంటే.
మరొక వారం రోజుల్లో ఉమాదేవి ఉద్యోగంలో చేరింది. శారద ఆ క్షణంలో సంతోషపడి ఆ సంగతి మర్చిపోయింది.
అయితే హేమలత నిండు గర్భిణిగా ప్రసవానికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఆమెను కాస్త బాధపెట్టకపోలేదు.
హేమలతని పార్టీ వాళ్ళంతా శారద దగ్గర పురుడు పోసుకోవద్దని బలవంతం చేశారట. ఆపాలని ప్రయత్నించారట.
‘‘నేను మొదట్నుంచీ ఆమె దగ్గర చూపించుకున్నాను. ఆమె మంచి డాక్టరు. మీ రాజకీయాలతో నన్నిప్పుడు వెళ్ళొద్దంటే నేనెలా మానేస్తాను. నేనావిడ దగ్గరకే వెళ్తాను’’ అని ఎదిరించి వచ్చానని చెబితే శారదకు చాలా చిరాకనిపించింది.
‘‘ఇంత ఎదగని మనుషులు ఏం సాధిస్తారు?’’ అనిపించింది. హేమలతకు ఆడపిల్ల పుట్టింది.
‘‘బంగారు బొమ్మలా ఉందోయ్‌ నీ కూతురు’’ అంటూ నవ్వుతూ, పాపను నవ్వించింది.
‘‘నీకు కొడుకు పుడితే శ్రీనివాసరావని పేరు పెట్టుకున్నావు. పాపకేం పేరు పెడతావు. మంచి పేరు పెట్టు.’’
తన దగ్గరకు వచ్చిన ప్రతివారితో స్నేహంగా మాట్లాడి కష్టసుఖాలు పంచుకోటానికి, ఏ అవసరమైనా వస్తే ఆదుకోటానికీ డాక్టర్‌ శారదాంబ ఉందనే నమ్మకాన్ని కలిగిస్తుంది వాళ్ళలో. చాలాసార్లు ఆ నమ్మకాలు నిజమవుతాయి. నా సమస్య ఇదమ్మా అంటూ వచ్చిన వాళ్ళు శారద దగ్గర నుంచి సహాయం పొందకుండా వెళ్ళరు.
వీటన్నిటితో ఇరవై నాలుగు గంటలూ చాలవన్నట్టు పనిచేస్తున్నా శారదకు మనసులో ఏదో వెలితి.
తను విడివిడి వ్యక్తులకు తన చేతిలో ఉన్న సహాయమేదో చేయగలుగుతోంది. కానీ ఎంతమందికి చేయగలుగుతుంది?
ఎన్నాళ్ళు చేయగలుగుతుంది? వ్యవస్థలలో, సాగుతున్న ఆచారాలు, విధానాలలో మార్పులు రాకుండా వ్యక్తులుగా చేసే పనులకు, వాటికున్న పరిమితులకు తేడా తెలియనిది కాదామె. ఆ తేడా బాగా తెలిసే రాజకీయాలకు, జన్మనిచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి ఆమె. అందువల్ల రాజకీయ జీవితం లేని లోటు ఆమెను వేధిస్తూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం వచ్చి గుంటూరులో హైకోర్టు ఏర్పడిన తర్వాత మూర్తి కొంత నిలకడగా ప్రాక్టీసు గురించి ఆలోచించటంతో అతని అశాంతి కొంత పోయింది. ఇద్దరూ తమ తమ పనులలో మునిగిపోయారు. నటాషా చదువు, తన స్నేహితులు, బంధువులతో సంతోషంగానే ఉంది. స్వరాజ్యం శెలవులకు విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు మాత్రం ముగ్గురినీ ఒకచోట కలుపుతుంది. పాటలు పాడుకుంటారు విడివిడిగా… కలిసి. మూర్తీ, శారద షేక్‌స్పియర్‌, షా, ఇబ్సన్‌ నాటకాల నుంచి కొంత భాగమైనా చదివేదాకా ఊరుకోదు స్వరాజ్యం. ఇబ్సన్‌ ‘డాత్స్‌హవుస్‌’లో చివరి ఘట్టాన్ని మూర్తి, శారదలు భావయుక్తంగా చదువుతుంటే స్వరాజ్యం ఉత్తేజితురాలయ్యేది. నటాషా స్వరాజ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండేది. స్వరాజ్యం శలవులన్నీ బెజవాడలోనే గడుపుతోందని అన్నపూర్ణ విసుక్కున్నా లెక్కజేసేది కాదు. ‘‘తమ్ముడున్నాడు గదమ్మా. వాడు చాలు మిమ్మల్ని సతాయించటానికి. నేను కూడా ఎందుకు’’ అని హాస్యంలోకి దించేది. ‘‘వాడు మా దగ్గరే ఉండీ, నువ్వు లేకుండానూ మమ్మల్ని సతాయిస్తున్నారే తల్లీ. ఏం పిల్లలో మీరు’’ అని అన్నపూర్ణ కోపం తెచ్చుకుంటుంటే అబ్బయ్య ఆమెను ఓదార్చి శాంతింపజేసేవాడు.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.