వే టూ మెట్రో -కుప్పిలి పద్మ

బొంగరాన్ని సంధించి వదిలేవాళ్ళకు గిర్రున తిరిగే బొంగరం ఓ కేరింత. కానీ తిరిగితిరిగి ఏ క్షణాన తను ఒరుగుతుందోనని బొంగరానికెంతో ఆందోళనగా ఉంటుంది. అలా వాలి ఓ చోట
ఉండనిచ్చినా ఓ పద్ధతి. ఉన్న చోటనే ఉండడంలో చిన్నదో చితకదో ఓ నిశ్చింత. కానీ అలా
ఉండనివ్వరు కదా. ఆ తాడుని అందుకొన్న మరో చెయ్యి తన ప్రతాపం చూపిస్తుంది.

అంట్లు తోముతున్న రaాన్సీకి బొంగరం ఆట కళ్ళముందు కదుల్తోంది.
ఇంతకు ముందు ఈ అపార్ట్‌మెంట్‌లో పిల్లలు, పెద్దలు ప్లే ఏరియాలో ఆడుతున్నప్పుడు బొంగరం పరిభ్రమణాన్ని తదేకంగా చూసేది. కానీ ఇప్పుడు ఆమెలో ఆ పారవశ్యం లేదు. ఆ బొంగరంలో ఆమెకి తన జీవితం కనిపిస్తోంది. ఆ తాడు ఇప్పుడు ఏయే చేతుల్లోకి మారుతుందా అనే ఆదుర్దాగానూ
ఉందామెకి.
405 ఫ్లాట్‌లో పని పూర్తి చేసేసరికి సాయంరశ్మి అపార్ట్‌మెంట్‌ చుట్టూ ఉన్న వేపచెట్ల కొమ్మల్లోంచి గోడల వరకూ ప్రసరిస్తోన్న ఆ భవంతి లోపల ఊదా రంగు చటుక్కున అలుముకొంటోంటే రaాన్సీ అన్ని ఫ్లోర్స్‌లోని కారిడార్లలో లైట్లు వేసింది. వాచ్‌మెన్‌ కోసం ఇచ్చిన తమ గదిలోకి వచ్చి పిల్లలని అన్నం తినేసి, చదువుకోమని చెప్పి అపార్ట్‌మెంట్‌ మెయిన్‌ గేటు దగ్గరికి వచ్చింది.
తన పన్నెండేళ్ళ కూతురి డాన్స్‌ ప్రోగ్రాం కోసం కుట్టిన బట్టలు తీసుకురావడానికి టైలర్‌ దగ్గరికి బయలుదేరిన 302 మేడమ్‌ కారుని చూసి అక్కడి నుంచి ఏదో పనున్నట్లు పక్కకి తప్పుకుంది రaాన్సీ. తను బైటికి వెళ్తున్నప్పుడు ఎదురు రావొద్దని రెండ్రోజుల క్రితమే ఆమె సూపర్‌వైజర్‌ ప్రవీణ్‌తో రaాన్సీకి స్పష్టంగా చెప్పించింది.
బొట్టు చెరిపేసుకుని ఇంకా పట్టుమని నెల రోజులు కాలేదేమో బొట్టులేని ముఖం మనసుకింకా అలవాటు కాలేదు రaాన్సీకి. బొట్టు పెట్టుకోవాలనే ఉంది. కానీ ఈ బొట్టుకి, అంజిబాబుకి ముడిపెడుతున్నారు తన వాళ్ళు. అంజిబాబు ఎక్కడికీ వెళ్ళిపోలేదు, తన మనసులోనే ఉన్నాడు. తన బొట్టు బిళ్ళల అట్టా, తన పరుసులో తన హృదయానికి దగ్గరగానే ఉంది. అప్రయత్నంగా ఆమె చెయ్యి జాకెట్టుకి ఎడమవైపున వాలింది. పల్సని పర్సు చేతికి తగిలింది.
ఏయే ఫ్లాట్ల వాళ్ళు ఎలా ఎలా ప్రవర్తిస్తారనే గ్రహింపు దాదాపు పదేళ్ళ నుంచి ఈ అపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్న అనుభవం రaాన్సీకి నేర్పింది. అయినా సరే రaాన్సీ ఫ్లాట్స్‌ వాళ్ళ నుంచి ఇలాంటి ఆజ్ఞ వస్తుందని నెల రోజుల క్రితం ఊహించలేకపోయింది. వారం రోజుల్లో కొత్త వాచ్‌మేన్‌ వస్తున్నాడని కమిటీ వాళ్ళు ఆమెని ఇల్లు ఖాళీ చేయమన్నారని సూపర్‌వైజర్‌ రaాన్సీకి చెప్పాడు.
‘‘ఇల్లు ఖాళీ చెయ్యాలా. ఎందుకు? అయినా కొత్త వాచ్‌మేన్‌ రావడమేంటి?’’ ఆదుర్దా రaాన్సీ స్వరంలో. సూపర్‌వైజర్‌ తనకేమీ తెలియదన్నట్లు కళ్ళు పైకెత్తి రెండు చేతులూ ఆకాశం వైపు చూపించాడు. కమిటి వాళ్ళనే అడుగుతాను అని సెక్రటరీ ఇంటికి వెళ్ళింది రaాన్సీ. అందరితో మాట్లాడి చెబుతానంది ఆమె.
… … …
వాళ్ళంతా ఏం మాట్లాడుకున్నారో కానీ ఆ తర్వాత రోజు సెక్రటరీ బయటికి వెళ్తూ గేటు దగ్గర రaాన్సీ కనిపిస్తే ‘‘వీలుకాదు. వాచ్‌మేన్‌ పని అంటే మగవాళ్ళు చేసే పని. ఆడమనిషిగా నువ్వతనికి చేదోడువాదోడుగా పనులు చెయ్యొచ్చు. కానీ నువ్వెలా మొత్తం వాచ్‌మేన్‌గా ఉండగలవా అన్నారు కమిటీ మెంబర్లు’’ అని చెప్పేసి రaాన్సీకి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా తెరచి ఉన్న మెయిన్‌ గేటు నుంచి కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్ళిపోయింది సెక్రటరీ. ఆ వెళ్ళిపోతున్న కారు రేపిన పల్చని దుమ్మూ, కాసింత పొగనీ ముక్కులోకి వెళ్ళకుండా చేత్తో అటూ ఇటూ విసురుకొంటూ తనకి ఈ విషయంలో ఎవరు సహాయం చెయ్యగలరా అని ఆలోచించింది రaాన్సీ.
… … …
406లో ఉన్న మేడమ్‌ బస్తీల్లో స్త్రీల గురించి పని చేస్తుందని, అప్పుడప్పుడూ టీవీల్లో కూడా స్త్రీల సమానత్వం గురించి మాట్లాడుతుందని ఆమె దగ్గరికెళ్ళి ‘వాచ్‌మేన్‌ పని చేసుకోగలను, నేనే చేసుకుంటానని’ అడిగింది రaాన్సీ.
‘ఇక్కడ నా మాట ఎవ్వరూ వినరు. ఇక్కడ కొన్ని రూల్స్‌ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాలి…’ అని ఆగి ఓ అరక్షణం తర్వాత ‘ఓ… వాటే బ్రైట్‌ ఐడియా… వాచ్‌ విమెన్‌ కాన్సెప్ట్‌ మీద పని చెయ్యాలి. గుడ్‌… గుడ్‌… ప్రపోజల్‌ రాయాలి వాళ్ళకి…’ అని తనలో తనే స్వగతంలా అనుకొంటూ ‘సారీ… హెల్ప్‌ చెయ్యలేను’ అందామె.
‘ఎవరికి రాస్తారమ్మా… ఈ అపార్ట్‌మెంట్‌ కమిటీకా’ అడిగింది రaాన్సీ.
ఆమె ఓ క్షణం అయోమయంగా రaాన్సీని చూసి ‘ప్చ్‌… వీళ్ళకి కాదు… ఈ మార్పు రావాలంటే పెద్ద ఉద్యమం చెయ్యాలి. వేరే దేశం వాళ్ళకి రాయాలి’ అంది.
‘తనకి వచ్చిన వాచ్‌మెన్‌ పని చెయ్యటానికి, తనని కొన్నాళ్ళు ఇక్కడ ఉండనివ్వటానికి ఆమె అంత పెద్ద పని చెయ్యాలా… అదీ వేరే దేశం వాళ్ళతో కలిసి. ఏమిటో నా సమస్యకి పరిష్కారం అంత కష్టమా’ అనుకొంది రaాన్సీ.
… … …
ఇంటిపని చేసే 301 మేడమ్‌కి విషయం చెప్పింది రaాన్సీ.
‘వాచ్‌ విమెన్‌గా ఉండడం వీలుకాదు అంటున్నారు రaాన్సీ. పోనీ నువ్వు ఉంచమని అడుగుతోన్న ఆ కొన్ని నెలలు కూడా నేను నిన్ను ఇంట్లో ఉండమనలేను. చుట్టం చూపుగానో, స్నేహంతోనే వచ్చినవాళ్ళే ఓ రోజుకంటే ఎక్కువ ఉంటే ఇబ్బందిగా ఫీలయ్యే రోజులకి ఎప్పుడో వచ్చేశాం. వచ్చేవాళ్ళు కూడా
ఉండడానికి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. నువ్వు ఒక్కదానివే కాదు, ఇద్దరు పిల్లలు కూడా. ఇంతమందిని ఎవ్వరూ తమతో ఉండమని అడగలేరు. ఏమీ అనుకోకు… కానీ దగ్గరలో ఇల్లు తీసుకో. మరో రెండిళ్ళలో పని వెతుక్కో. అవునూ… మన ఏరియాలో బస్తీలేం ఉన్నట్లు లేవు కదా’ అని సలహాలని, సందేహాన్ని కలిపి వెళ్ళబుచ్చిందామె.
‘అవును… ఇక్కడ తను ఉండటానికి బస్తీలు ఏమున్నాయో’.
… … …
ఎక్కడికి వెళ్తుంది తను అనుకుంది రaాన్సీ.
కొత్త పెళ్ళికూతురిగా అంజిబాబు వెంట ఈ అపార్ట్‌మెంట్‌కి వచ్చింది. గత తొమ్మిదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. తాము ఇక్కడికి వచ్చినప్పటికే సైబరాబాద్‌ పెద్ద పెద్ద భవంతులతో పూర్తిగా కాపుకొచ్చిన అరటిగెలలా ఉంది. పిల్లలిద్దరూ ఇక్కడే పుట్టారు. పెద్దాడికి ఏడేళ్ళు. చిన్నదానికి నాలుగేళ్ళు. పిల్లల్ని బాగా చదివించుకోవాలని దగ్గర్లో ఉన్న కాన్వెంటులో ఒక్కొక్కరికీ యాభై వేలు డొనేషన్‌ కట్టారు. ఆ డబ్బు కోసం చీటీని కొంత నష్టానికి ముందే పాడారు.
ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఉండే ఇల్లొక్కటే సమస్య కాదు. కోల్పోయే పని, నెలనెలా కట్టాల్సిన చీటీలు కళ్ళముందు కదిలాయి రaాన్సీకి. పిల్లల డొనేషన్‌ చీటీ. అలాగే అంజిబాబు ఆఖరి చెల్లి పెళ్ళికని మరో చీటీ పాడి ఊరికి లక్ష రూపాయలు పంపారు. ఈ మూడు చీటీలకే నెలకి దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు కడుతున్నారు.
వాచ్‌మెన్‌ పనికి పదివేలు, పన్నెండు కార్లని తుడవడం వల్ల ఆరువేలు వస్తాయి అంజికి. అలాగే మూడు ఇళ్ళల్లో చేసే పనికి పద్దెనిమిది వేలు వస్తాయి రaాన్సీకి. ఈ ముప్ఫై నాలుగు వేలల్లోంచి చీటీ డబ్బులు కడుతున్నారు. ఇంటి అద్దె లేదు. కరెంట్‌, కేబుల్‌, నీళ్ళ బిల్లు లేదు. చీటీలు కట్టగా మిగిలిన పదహారు వేలల్లో రోజూ తాగడానికి నెలకి దాదాపు ఐదువేలు ఖర్చు చేస్తాడు అంజి. ఇక మిగిలిన పదకొండు వేలల్లో పిల్లల స్కూల్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజు, యూనిఫాం, పుస్తకాలు, ప్రతి పండక్కి, పుట్టిన రోజులకి పిల్లలకి కొత్త బట్టలు, వాటిని జరపడం, అత్తగారికి ఖర్చు కోసం నెలకో వెయ్యి, తమకి నెలకి కావలసిన సరుకులు తెచ్చుకోవటం ఆ ఇంట్లోనో ఈ ఇంట్లోనే చేసే చిన్న చిన్న పనులకి వచ్చే వందో రెండొందల్లో మొత్తానికి డబ్బులకి తడుముకోవలసిన చికాకు లేకుండా, వెనకేసుకున్న పైసలేం లేకపోయినా జీవితం సాఫీగా సాగుతోంది.
మూడు నెలలకి ఓసారి రేషన్‌ తెచ్చుకోవడానికి ఊరెళ్ళి వస్తారు ఆ రేషన్‌ కార్డు పోకుండా. మళ్ళీ ఓటు వెయ్యటానికి వెళ్ళినపుడు తప్ప పెద్దగా సెలవలూ పెట్టరు. ఈ తొమ్మిదేళ్ళలో ఇంటికి కావాల్సిన టీవీ, ఫ్రిజ్‌, మిక్సీ, గ్యాస్‌ స్టవ్‌, గాడ్రెజ్‌ బీరువా, మంచం, పిల్లలకి వీడియో గేమ్స్‌, తమిద్దరికీ నెట్‌ ఫోన్‌, పిల్ల చెవులకి బంగారపు పోగులు, కాళ్ళకి వెండి పట్టీలు, బాబుకి ఓ ఉంగరం, తన కోసం జుంకాలు ఇలా కాసింత బంగారాన్ని వీలైనప్పుడంతా రaాన్సీ సమకూర్చుకుంటూనే ఉంది.
అంజి శరీరాన్ని కాస్త కూడా అలవనీయడు. రాత్రిపూట శుభ్రంగా తాగి పదింటికల్లా నిద్రపోయేవాడు. అప్పుడు చెయ్యాల్సిన పనులు చేస్తూ, ముఖ్యంగా వారాంతంలో అయితే పార్టీలకు వెళ్ళివచ్చే యువతీ యువకులు, పెద్దలూ కూడా ఎక్కువే. తెల్లారి మూడు, ఒక్కోసారి నాలుగు వరకు వస్తూనే ఉంటాయి కార్లు. అతిథులకు కారు పార్కింగ్‌ లేదు. కొన్ని ఫ్లాట్స్‌ వాళ్ళకి ఒకటో రెండో పార్కింగ్‌ ఉంటే ఒక్కొక్కరికి మూడు, నాలుగు కార్లున్న వాళ్ళూ ఉన్నారు. ఎప్పుడూ కార్ల పార్కింగ్‌ దగ్గర ఏదో ఒక పేచీనే నడుస్తుండేది.
అలా గొడవలు ఎక్కువ కాకుండా అందరికీ అపార్ట్‌మెంట్‌ ఉన్న రోడ్డు వారగానో పక్కనో ఎలాగోలా పార్క్‌ చేసుకునే స్థలాన్ని రaాన్సీనే సర్దుబాటు చేసేది. అయినా ఫ్లాట్స్‌ వాళ్ళ మధ్య వారంలో రెండు మూడు సార్లు అరుపులు సర్వసాధారణం.
ఉదయం ఐదింటికి లేచి అపార్ట్‌మెంట్‌ ముందు ఊడ్చి కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టేది రaాన్సీ. నీళ్ళ మోటార్లు వేసేది. జనరేటర్‌కి కావాల్సిన డీజిల్‌ ఉందో లేదో చూసుకునేది. అపార్ట్‌మెంట్‌లో అంజిబాబు కడగడానికి ఒప్పుకొన్న ఓ పదికార్లని తెల్లారకముందే రaాన్సీనే కడిగేది. అంజిబాబు ఎప్పుడైనా తుడిచేవాడు.
ఉదయమే ముగ్గు వేయకపోతే ఎలా అని ఆమె పనిచేసే ఇళ్ళల్లోని వాళ్ళు అప్పుడెప్పుడో అన్నప్పటి నుంచి తెల్లారుతూనే ఆ ఇళ్ళముందు తుడిచి ముగ్గు పెట్టేది. సుద్దముక్క ముగ్గుని ఇష్టపడని వాళ్ళే వాళ్ళంతా.
ఇంట్లో వంట ముగించి, పిల్లలని రెడీ చేసి, టిఫిన్‌ పెట్టి, బాక్సు కట్టి ఇద్దరు పిల్లల్ని బడికి పంపించి తాను పనిచేసే ఇళ్ళల్లో పనికి వెళ్ళేది. తినడానికి, బడికి వెళ్ళడానికి పేచీ పెట్టని తన పిల్లలని చూస్తే రaాన్సీకి భలే ముద్దు.
అంజిబాబు తీరిగ్గా ఏ ఎనిమిదింటికో లేచేవాడు. శుభ్రంగా స్నానం చేసి ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలేసుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని దేముడి ముందు ఓ అగరొత్తి వెలిగించి అప్పుడొచ్చి గేటు ముందు కూర్చునేవాడు. సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి సాయంత్రం ఏడిరటికి నైట్‌ వాచ్‌మెన్‌ వచ్చేవరకూ గేటు దగ్గర అంజిబాబు ఉండాలి. భోజనం చేసి కాసేపు నడుం వాల్చేది. అప్పుడూ ఆ పని రaాన్సీనే చేసేది.
తన ఇంటిని, ఆ అపార్ట్‌మెంట్‌ని తన రెండు రెక్కలపై నిలబెట్టటం చూసిన ఫ్లాట్స్‌లోని వాళ్ళంతా రaాన్సీ సమర్థతను మెచ్చుకునేవారు.
నెలన్నర క్రితం ఓ పాడు జ్వరం బారిన పడి అంజిబాబు పోయాడు. అంజిబాబు పోయాక ‘ఆ శవాన్ని ఇక్కడికి తీసుకురావొద్దు. దినాలు ఇక్కడొద్దు. మీ బంధువులంతా వస్తే ఎక్కడుంటారు’ అని మేనేజ్‌మెంట్‌ కమిటి సూపర్‌వైజర్‌తో రaాన్సీకి ఫోన్‌లో చెప్పించారు. ఆమేమీ ఆశ్చర్యపోలేదు, నొచ్చుకోనూ లేదు.
ఫ్లాట్‌లోని పెద్దవారు పోయినప్పుడు వాళ్ళని అక్కడ ఉంచడానికి ఒప్పుకోరు. సొంత వాళ్ళకే దిక్కు లేదు. తనెంత…
ఆ ఫ్లాట్స్‌లో ఇంటి పనిచేసే ఆమెకి తన బట్టలు, పిల్లలిద్దరికీ కావాల్సిన బట్టలు సర్ది ఇస్త్రీ అబ్బాయికి ఇమ్మని చెప్పింది రaాన్సీ. ఆమె సర్ది ఆ సూట్‌కేసుని ఇస్త్రీ అబ్బాయికి ఇచ్చింది.
కమిటీ మేనేజ్‌మెంట్‌ రaాన్సీకి ఇవ్వమని చెప్పి సూపర్‌వైజర్‌కి పదివేలు ఇస్తూ మరో కొత్త వాచ్‌మేన్‌ని చూడమని అతనికి చెప్పారు. అంత తొందరగా వాచ్‌మేన్‌ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటూ దొరికాక రaాన్సీకి ఆ విషయం చెప్పొచ్చులే అనుకున్నాడు అతను. పిల్లల స్కూలు పోతుందని ఆమె త్వరగానే రావొచ్చు, అప్పటివరకూ ఆ డీజిల్‌ పని, లైట్లు వేసే పని… ఇలా చాలా పనులు తన నెత్తిమీదే పడతాయి అనుకున్నాడతను. అతను ఇస్త్రీ అబ్బాయికి డబ్బు ఇచ్చి రaాన్సీకి ఇవ్వమన్నాడు. ఇస్త్రీ అబ్బాయి తన బండిమీద వెళ్ళి ఆ సూట్‌కేసును, డబ్బును రaాన్సీకి ఇచ్చాడు.
పిల్లలు, అంజిబాబు తమ్ముడు, రaాన్సీ తమ ఊరికి అంబులెన్స్‌లోనే వెళ్ళారు. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక పదిహేను రోజులకే రaాన్సీ తిరిగి అపార్ట్‌మెంట్స్‌కి వచ్చింది. అప్పటికి వాచ్‌మేన్‌ కుదరలేదు.
వాచ్‌మేన్‌ కుదరకముందే ఆమెను గది ఖాళీ చెయ్యమంటే రోజువారి పనులకు ఇబ్బందని, అప్పుడే ఆమెకి ఈ విషయం చెప్పొద్దని సూపర్‌వైజర్‌ కమిటీ వాళ్ళకి సలహా ఇచ్చాడు. వాళ్ళూ నిజమే కదా అతనికి అప్పచెప్పాం, అతనే చూసుకుంటాడు, ఇవన్నీ పట్టించుకునే సమయం తమకెక్కడుంది, అపార్ట్‌మెంట్‌ పనులు చూసుకోవడానికేగా సూపర్‌వైజర్‌ అనుకున్నారు.
రaాన్సీ వచ్చిన రెండు వారాలకి కొత్త వాచ్‌మేన్‌ కుదిరాడు. అతను పనిలో చేరడానికి వారం రోజుల సమయం అడిగాడు. అప్పుడు రaాన్సీకి ఒక వారం సమయమిచ్చి ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పాడు సూపర్‌వైజర్‌.
‘పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చెయ్యమంటే ఎలా. పనులన్నీ చేస్తున్నాగా. మా ఆయన ఉన్నప్పుడు కూడా నేనేకదా అన్ని పనులూ చేసేదాన్ని’ అందామె.
‘మాటలు అనవసరం. నిర్ణయం అయిపోయింది’ స్పష్టంగా చెప్పేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు సూపర్‌వైజర్‌.
‘అంతగా నా పనిని మెచ్చుకునే వారిప్పుడు మగమనిషే వాచ్‌మేన్‌గా ఉండాలని అంటున్నారు. పిల్లల చదువులు అయ్యేవరకైనా ఉండే అవకాశం ఇవ్వటం లేదు. ఇన్నాళ్ళుగా వాళ్ళు తనని మెచ్చుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, మారిపోతోన్న ప్రపంచపు తీరా ఇది’ అనుమానంగా అనుకొంది రaాన్సీ.
… … …
రaాన్సీ పిల్లలకు టిఫిన్‌ పెట్టింది. పేచీ పెట్టకుండా, నస లేకుండా పద్ధతిగా తినేసి, బడికి వెళ్తోన్న పిల్లల్ని చూస్తే రaాన్సీకి కాస్త మనసు స్థిమితపడుతోంది. 208లో పనికి వెళ్ళాల్సిన సమయం అవుతోంటే గబగబా వెళ్ళింది. నిన్న మొన్నటివరకు పనికొచ్చిన తన ముఖం ఇప్పుడు ఎదురికి పనికిరాదని రaాన్సీకి తెలుసు. ఆ ఇంటి యజమాని ఆఫీసుకి బయలుదేరే సమయంకంటే కాస్త ముందుగానే ఆ ఇంటికి పనికి వెళ్ళింది.
గిన్నెలు తోమి బట్టలు ఉతికి ఆరేస్తోంటే ‘కాస్త చేపలు శుభ్రం చేసి పెట్టు’ అని రaాన్సీని అడిగిందామె.
శుభ్రం చేస్తూ ‘అమ్మా ఈ ఏడాది పిల్లల పరీక్షలు అయ్యేవరకైనా ఉండనివ్వండమ్మా’ నమ్రతగా అడిగింది రaాన్సీ.
‘నాకు టైం ఉండదు, నేనెప్పుడూ ఈ మెయింటెనెన్స్‌ విషయాల్లో కల్పించుకోనని నీకు తెలుసుగా. వాళ్ళు అడిగిన డబ్బులు కట్టటం, నీళ్ళు కంటిన్యూస్‌గా వచ్చినంత కాలం నేనింకేమీ పట్టించుకోను’ అంటూ ‘ఆ ఇన్సూరెన్స్‌ డబ్బులతో అప్పులు తీర్చేసుకో’ అందామె.
‘మాకేం ఇన్సూరెన్స్‌ ఉందమ్మా. ఉంటే యజమాని పోతే కుటుంబానికి చాలా డబ్బులు వస్తాయంట కదమ్మా. ఆ 508 మేడం చెప్పారు. మా బతుకులకి అంత ముందు చూపు యేడ’ నిర్లిప్తంగా అంది రaాన్సీ.
చేపలు శుభ్రం చేయడం పూర్తిచేసి వాసన పోయేట్టు చేతులు శుభ్రంగా కడుక్కొంది. అయినా వాసన పూర్తిగా పోలేదు.
… … …
‘ఇల్లు దొరికిందా’ అడిగింది 105 ఫ్లాటామె.
‘ఎక్కడా… లేదమ్మా.. ఈ చుట్టుపక్కల బస్తీలు లేవు కదమ్మా’.
‘మరెలా’
‘దూరంగా వెళ్ళాలంటే పిల్లల బడికి దూరమైపోతుంది. ఈ స్కూలు బాగుంటుందని డొనేషన్‌ కట్టామప్పుడు. ఇప్పుడు వేరే స్కూలంటే మళ్ళీ డొనేషన్‌ కట్టాలి. అదీకాక ఇప్పుడు సంవత్సరం మధ్యన కదమ్మా. కాస్త సెక్రటరీ మేడం గారికి చెప్పండమ్మా’ బతిమాలుతూ అడిగింది రaాన్సీ. ‘ప్చ్‌… ఎవరూ వినటం లేదు రaాన్సీ. కొత్త వాచ్‌మేన్‌ని కూడా మాట్లాడారుగా. మంచిరోజు చూసుకొని వస్తాడని సూపర్‌వైజర్‌ చెప్పాడు’ అందామె.
అంతా వట్టిది. ఈమె మాట్లాడి ఉండదు. ఈ మేడంలందరూ కలిసి రaాన్సీ ఈ పని చెయ్యగలదు అని ఓ మాట అంటే సార్లు ఏం అనరు. ఆ సార్లుకి అనాలని ఉన్నా ఈ ఆడవాళ్ళు ఏమంటారోనని వాళ్ళకి భయం అని ప్రవీణ్‌ మొన్ననే మాటల్లో చెప్పాడు.
… … …
సైబరాబాద్‌లో రోడ్డుకి అటూ ఇటూ ఉన్న పెద్ద పెద్ద భవనాలని చూస్తూ నడుస్తోన్న రaాన్సీ మనసు పరిపరి విధాల పోతోంది. ఏదో ఒక బస్తీలో ఇల్లు వెతుక్కోవాలి. పిల్లల్ని స్కూలుకి బస్సులోనో, మెట్రోలోనో, ఎం.ఎం.టి.ఎస్‌.లోనో రావటం అలవాటు చెయ్యాలి. అంజి సంపాదించే ఆ పద్దెనిమిది వేల కోసం తనెంతగా పనిచెయ్యాలో. వంట చెయ్యటానికి ఓ రెండు ఇళ్ళు చూసుకోవాలి.
ఆ పెద్ద పెద్ద గాజు అద్దాల భవనాల్ని చూస్తూ… తన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఇలాంటి ఆఫీసుల్లో ఉద్యోగం చేసేంత బాగా చదివించుకోవాలి, ఏమైనా సరే పిల్లల స్కూల్‌ని మార్చను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది రaాన్సీ.
… … …
ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక కూర్చుని కాస్త తీరుబడిగా ఆలోచించుకోవాలని పెన్ను, పేపర్‌ తీసుకొని ఇక్కడినుంచి వెళ్ళిపోతే తగ్గిపోయే సంపాదన ఎంతో, పెరిగే ఖర్చులు ఎన్నో రాసుకొంటే ఇంటి అద్దె, కరెంట్‌, కేబుల్‌, నీళ్ళ బిల్లు పెరుగుతుందిÑ అంజిబాబు సంపాదన తగ్గటమే కాక ఓ ఆరువేల వరకు ఖర్చులు పెరుగుతాయిÑ అంటే తనిప్పుడు అదనంగా ఓ ఇరవై రెండు వేలు సంపాదించాలి అనుకొంది. ఈ ఏరియాని వదిలి వెళ్ళటం ఇప్పట్లో కుదరదు. మరో ఏరియాలో ఇంటి పనికి, వంట పనికి ఇంతింత జీతాలు రావు. పిల్లలు దూరం నుంచి రావటానికి ఆటో పెట్టాలి. అదో ఖర్చు. కానీ తప్పదు. చుట్టాలంతా ఊర్లో ఉన్నారు. స్నేహితులూ లేరిక్కడ.
ఏ అపార్ట్‌మెంటు వాళ్ళైనా వాచ్‌మెన్‌కి మాత్రమే ఇల్లు ఇస్తాం అంటున్నారు. సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్న వాళ్ళు కూడా డ్రైవర్‌ పనిచేసే వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఆడమనిషిని వంట పనికో, ఇంటి పనికో పెట్టుకుంటారు. వర్కింగ్‌ విమెన్‌, మెన్స్‌ హాస్టల్స్‌లో కూడా గది ఇచ్చి పని దొరుకుతుందేమోనని వాటి చుట్టూ తిరిగింది. పని ఉన్నా గది లేదు. కొన్ని చోట్ల పని లేదు.
తనిప్పుడేం చెయ్యాలి. తెల్లారితే కొత్త వాచ్‌మెన్‌ వస్తున్నాడు. గది అప్పచెప్పమని రాత్రే ప్రవీణ్‌తో కబురు పంపించారు.
‘ఇల్లెందుకు దొరకదు. ఇక్కడే ఉండిపోవాలని కాకపోతే… చెబితే అర్థం కాదా ఏంటీ. ఇలా ఉంటే సరేలే అంటామనుకోకు’ మొండితనమని సూపర్‌వైజర్‌ పెదవులపై కటుత్వం తెలుస్తూనే ఉంది.
‘సారూ… ఇల్లు ఏదో ఒక బస్తీలో దొరుకుతుంది. ఆ ఇంటితో పాటు నాకు అక్కడికి దగ్గర్లో పని దొరకాలి. ఈ ఏరియాలో అయితే ఇంటి పనికి ఆరు నుంచి పదివేల వరకూ జీతం దొరుకుతుంది. తుడవడానికి చాలా కార్లు ఉంటాయి. వీటన్నింటికంటే పిల్లల స్కూలు చాలా ముఖ్యం కద సారు. ట్యూషన్‌ ఉంది. మరో నాలుగు నెలల్లో పరీక్షలు ఉన్నాయి. ఇక్కడికి కాస్త దగ్గరగా ఉన్న బస్తీలో ఇల్లు తీసుకొని, పిల్లలని ఆటోలో పంపిద్దాం అనుకొన్నా. కానీ ఇప్పుడా బస్తీలో ఇళ్ళు కూడా ఖాళీగా లేవు. ఈ విషయమే కదా సారూ మీ అందరికీ చెపుతున్నా’ అంది రaాన్సీ.
‘ఏమోనమ్మా… ఉదయం వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వైతే వెళ్ళాలి’ అన్నాడు ప్రవీణ్‌.
… … …
ఇంత పెద్ద నగరంలో ఇద్దరు చిన్న పిల్లలతో బతకడం కష్టం కాదు, ఎలాగోలా బతకొచ్చు. కానీ పిల్లలిద్దరినీ తిరిగి ఇప్పట్లో అలాంటి బడిలో చేర్పించలేను. తిరిగి అంత డబ్బు చీటీని ఇప్పట్లో పాడలేను. ఈ బడి వల్ల తను మరో చోటుకు వెళ్ళలేను అంటే తన పుట్టింట్లో, అత్తింట్లో వాళ్ళకీ విషయం కొరుకుడు పడటం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళాలి. మరో నెలరోజులు ఇక్కడ
ఉండటానికి ఇక్కడ మరో గది లేదు. తను ఎప్పటికి కుదురుకోగలదో.
రోడ్డు మీద ఉండడానికి పేవ్‌మెంట్స్‌ లేవు. ఫ్లై ఓవర్లు, మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలకి నడుమ ఉన్న ప్రదేశమంతా రంగు రంగుల క్రోటన్‌ మొక్కలతో నింపేశారు. కాస్త దూరంలో ఉన్న బస్తీలో ఇల్లు దొరికేవరకూ ఎక్కడుండాలి. తనలాంటి వాళ్ళు ఉండే హాస్టల్స్‌ లేవు. ఆలోచించి ఆలోచించి విసుగొచ్చేసింది. ఆ విసుగులోంచే ఆమెకి ఓ ఆలోచన తళుక్కుమంది. అది మాయమయ్యేలోగానే ఆమె ఆ పని చేసెయ్యాలని నిర్ణయించుకొంది.
తనవి, పిల్లలవి అవసరమైన బట్టలు ఒక సూట్‌కేసులో, మరికొంత సామాను ఓ లెదర్‌ బ్యాగ్‌లో సర్దింది. పిల్లల పుస్తకాలన్నీ స్కూల్‌ బ్యాగ్‌లలో పెట్టింది. బయట సామాను, బట్టలు అన్నీ బీరువాలో సర్దింది. తాళం వేసింది. పిల్లలిద్దరినీ లేపి రెడీ చేసింది. ఆ గదిని ఒక్కసారి పరిశీలనగా అంగుళం అంగుళం చూసుకొంది. గదిలోంచి బయటికి వచ్చింది.
నైట్‌ డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డుకి గది తాళం ఇచ్చి సూపర్‌వైజర్‌కి ఇమ్మని చెప్పింది. తన చేతిలో సూట్‌కేసును గార్డు కూర్చున్న క్యాబిన్‌లో ఉంచింది. తను పని చేస్తున్న ఇళ్ళకి వెళ్ళి ఇంటిముందు ముగ్గు వేసింది. కొంత పనిచేసి మళ్ళీ వస్తానని వాళ్ళకి చెప్పి పిల్లల స్కూల్‌కి వెళ్ళే దారిలో ఉన్న బండిమీద ఇడ్లీలు కొంది. ముగ్గురూ తిన్నారు. పిల్లలకి బడి దారి తెలుసు. వాళ్ళని బడికి వెళ్ళమని చెప్పి తిరిగి అపార్ట్‌మెంట్‌కి వచ్చింది. అప్పటికి కొత్త వాచ్‌మేన్‌ కుటుంబం వచ్చారు. ఇద్దరు పిల్లలు. తన పిల్లల వయసే ఉంటుంది.
‘గదిలో సామాను తియ్యలేదింకా’ అన్నాడు ప్రవీణ్‌.
‘నాకు ఇల్లు దొరికేవరకూ నా సామాను ఇక్కడే ఉంటుంది. కాదనకండి’ అని ఆ సూపర్‌వైజర్‌ చేతిలో మూడువేలు పెట్టింది. అలా అయితేనే అతను కమిటీ వాళ్ళకి, ఈ కొత్త వాచ్‌మేన్‌కి సర్ది చెబుతాడు.
అడ్డుపడిన వాడి చేతిలో నోటు పెడితే ఎలాంటి పనైనా అయిపోతుందని ఈ కాలం అందరికీ స్పష్టంగా చెప్పినట్లు ఇంతకు ముందెన్నడూ చరిత్రలో చెప్పి ఉండి ఉండదు కాలం.
వచ్చినవాళ్ళను ‘మీకు మంచముందా’ అడిగింది రaాన్సీ. లేదన్నారు.
‘అన్నా! నాకు కావలసిన సామాను తీసుకున్నా. పెద్ద గదిలోకి మారాక మిగిలిన సామాను తీసుకుపోతా. మంచం, టీవీ, ఫ్రిజ్‌, గ్యాస్‌ బండ, బీరువా ఉన్నాయి. బీరువాలో నా సామానుంది. అది తప్ప మిగిలినవన్నీ మీరు వాడుకోవచ్చు’ అని చెప్పింది. కొద్దిగా వంట గిన్నెలు, బట్టలతో వచ్చిన కొత్త వాచ్‌మెన్‌కి ఇలా సామానుతో గది దొరకటం బానే అనిపించింది. ఆ బీరువా అని నసిగాడు. ఈ సామాను ఊరికే ఉంచుతున్నా కదా, నా అవసరమే అనుకో… కానీ మీకూ ఉపయోగమేగా అంది. అతని భార్య ఆ బీరువా అని మళ్ళీ గొణిగింది.
‘సర్లే… పట్టుకుపోతాలే. సామానంతా మా చుట్టాలు కావాలన్నారు. ఏదో ఇక్కడే ఉంటే రోజూ పనికి వస్తాను కదా… నా కళ్ళముందే ఉంటాయనుకొన్నా’ అంది రaాన్సీ.
రaాన్సీకి తెలుసు వాళ్ళు మెత్తబడతారని.
‘సర్లే… కానీ త్వరగా పట్టుకుపోవాలి, పెద్ద గది దొరగ్గానే’ అంది కొత్త వాచ్‌మెన్‌ భార్య.
అలాగే అన్నట్టు తలాడిరచింది రaాన్సీ.
పనులు పూర్తి చేసి కార్ల యజమానుల ఇళ్ళకు వెళ్ళి కార్లు తనే తుడుచుకుంటానని చెప్పింది రaాన్సీ.
‘కొత్త వాచ్‌మెన్‌కేగా ఈ పనులు ఇవ్వాలి’ అన్నారు వాళ్ళు.
‘ఇది బిల్డింగులో పని కాదు కదా… మీరు విడిగా చేయించుకొనేదేగా’ అంది.
ఈ పని కూడా ఉంటుందనే కదా ఆ వాచ్‌మెన్‌ వాళ్ళు ఆ జీతానికి వచ్చిందని ఎవ్వరూ కార్లు తుడిచే పని ఇవ్వటానికి ఒప్పుకోలేదు. నిజమేగా అనుకొని పనులు పూర్తి చేసుకుంది. పిల్లలు బడినుంచి వచ్చాక సాయంత్రం వంటకి కుదిరిన ఇంట్లో వంట చేసేటప్పటికి ఎనిమిది అయింది.
తనకి కావలసిన సామానుని ఓ చిన్న సంచిలో పెట్టుకొంది. మిగిలిన బట్టలని సూట్‌కేసులో సర్దుకొంది. ఆ సూట్‌కేసుని ఇస్త్రీ బల్ల కింద ఉంచుకొంటానని ఆ ఇస్త్రీ అతనికి చెప్పింది. అవక్కడ పెడుతున్నానని సూపర్‌వైజర్‌కీ చెప్పింది. సెక్యూరిటీకి, వాచ్‌మేన్‌కి తన మిగిలిన సామాను చూసుకోమని ఇద్దరికీ చెరొక ఐదు వందలు ఇచ్చింది.
‘పోవులేమ్మా చూసుకొంటాం’ అన్నారిద్దరూ.
అప్పటివరకూ ఇస్త్రీ అబ్బాయి బల్ల దగ్గర చదువుకొంటున్న పిల్లలని, ఆ చిన్న సంచిని తీసుకుని అపార్ట్‌మెంట్‌ నుంచి బయటికి వచ్చింది. కర్రీ పాయింట్‌ దగ్గర ముగ్గురికీ కావలసిన అన్నం, కూర, పప్పు కొంది. తిన్నాక మెల్లగా నడుచుకుంటూ తన కళ్ళల్లో ఫోటోలా ముద్రించుకుపోయిన ప్రదేశానికి వచ్చింది.
నిలువెత్తు మెట్రో స్టేషన్‌ స్లాబ్‌కి ఒక గోడ ఓ ఆఫీస్‌కి కాంపౌండ్‌ వాల్‌. రెండో గోడ షాపింగ్‌ మాల్‌ది. మూడో గోడ మెట్రో స్టేషన్‌కి వెళ్ళే లిఫ్ట్‌ది. కింద చక్కని నున్నని గచ్చు. కప్పుతో సహా మూడు గోడలు అమిరాయి. ఒక గదిలా ఉంది మొత్తం. అక్కడ పక్క వేసి పిల్లల్ని పడుకోమంది. బయటికి గుమ్మం ఉండాల్సిన వైపు పల్చటి నల్లని దుప్పటికి కర్టెన్‌గా వేసి పెద్ద ప్లాస్టర్‌తో గోడలకి అతికించింది. గది లేదా ఇల్లు… ఏదైతేనేం ఉండడానికి ఓ చోటుని అమర్చుకోగలిగింది రaాన్సీ.
బయటికి వచ్చి రోడ్డువైపు నుంచి ఆ కర్టెన్‌ వైపు చూసింది. మరీ పట్టి పట్టి చూస్తే కానీ ఈ కర్టెన్‌ కనిపించటం లేదు. ఎవరైనా వచ్చి ఇక్కడ రాత్రి పడుకోవడాన్ని అభ్యంతరపెట్టినా వాళ్ళని ఎలా వెనక్కి పంపాలో తనకిప్పుడు తెలుసు. ఆమె చెయ్యి జాకెట్టు ఎడమవైపు స్పర్శించింది. పర్సు చేతికి తగిలింది.
తనపై కన్నేసి దారిన పోయేవాడు వచ్చినా ఏం చెయ్యాలో తనకి తెలుసు. వాడికింక చూపు ఉండదు. తను టీవీలో ఆ సినిమా చూసింది. ఎర్రని కారం… మండిరచే కారం. ఆయమ్మ చూపులు ఎంత ముందు చూపున్న చూపులు.. పేరేమిటో… ఆ… స్మితా… ఆ… ఇంకా ఏదో ఉండాలి. ఏదైతేనేం తనకో ధైర్యాన్నిచ్చిన చూపు.
పగలు తను ఈ పరదాని తీసేస్తుంది. పిల్లలకి ఆ అపార్ట్‌మెంట్‌లో పనివాళ్ళ కోసం ఉన్న రెస్ట్‌రూమ్‌నే వాడుకుంటోంది. స్నానాలు చేసి పిల్లలు బడికి వెళ్ళిపోతారు. తను పనికి వెళ్ళిపోతుంది. సర్వెంట్‌ బాత్రూమ్‌ వాడుకోవడానికి, సామాను పెట్టుకోవడానికి ఒప్పుకొన్న మేనేజ్‌మెంట్‌ ఆ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో పడుకోవడానికి ఒప్పుకోలేదు. ఏమో అనుకుంటాం కానీ రాత్రి పడుకునే చోటు చుట్టూ చాలా విషయాలున్నాయన్న మాట. ఇల్లు దొరికేవరకూ ఇక్కడే. ఈ మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ దగ్గరే.
ఇప్పుడామెకి తాడు, బొంగరం తన చేతిలోనే ఉన్నంత నిశ్చింత. తనని తనే ఆడిస్తుంది. మరెవ్వరికీ ఆ అవకాశం ఇవ్వనే ఇవ్వదు.
పరదా దగ్గరికి వచ్చి నిలబడి పక్కకి చూసింది. తన జాకెట్‌లోంచి చిన్న పర్సు తీసి జిప్‌ తీసింది. అంజిబాబు ఫోటో చేతుల్లోకి తీసుకొని మళ్ళీ పర్సులోంచి బొట్టు బిళ్ళల అట్ట తీసి ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు స్టిక్కర్‌ నుదుటిమీద పెట్టుకొని ‘నీ మీద ఒట్టయ్యా. పిల్లల్ని కంటికి రెప్పల్లా చూసుకొంటా. కానీ చదువు కోసం కొన్నాళ్ళు కష్టపడక తప్పదు. నమ్మయ్యా. ఏంటో నువ్వెప్పుడూ పని చెయ్యవు అనుకునేదాన్ని. బాధ్యత లేదు అనుకునేదాన్ని. కానీ నువ్వు చాలా పెద్ద బాధ్యతనే మోసావయ్యా. ప్చ్‌… ఇప్పుడు నడిరోడ్డులో నిలబడిరది రహదారి కోసమేనయ్యా…’ ఆమె కళ్ళల్లో ఊరుతోన్న సుడిగుండం.
‘ఛా… నేను జీవితాన్ని సుళ్ళు తిరగనివ్వనయ్యా. నదిలా పారిస్తా…’ చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ కుడివైపుకి చూసింది.
గుండ్రని అక్షరాలు మెరుస్తూ… వాటిని చూడగానే రaాన్సీ పెదవులపై చిరునవ్వు. అంజిబాబు వెళ్ళిపోయాక ఆమె పెదవులపై తొంగి చూసిన మొదటి చిరునవ్వు. ఎడమవైపుకి చూసింది.
అవే గుండ్రని అక్షరాలు మెరుస్తూ ` వే టూ మెట్రో…
నిచ్చెన చివర్న మెట్రో ఆఖరి స్టాప్‌ దగ్గర పంచవర్ష ప్రణాళిక పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రచిస్తుంది. అప్పుడు ఎవరి జీవితాలు ఏ మెట్లు ఎక్కుతాయో ఏ మెట్లు దిగుతాయో తెలీదు.
రaాన్సీ ఇక్కడికి టెంపరరీగా చేరింది. తర్వాత ఏం చెయ్యాలో రaాన్సీకి తెలీదు. ఈ వర్షం తగ్గేవరకూ, ఈ మెట్టు ఎక్కేవరకూ, ఈ రాత్రి తెల్లారేవరకూ ఏం చెయ్యాలి, ఎక్కడుండాలి అన్నది మాత్రం రaాన్సీకి తెలిసినంత ఇంకెవరికీ తెలీదు. ఏ సమస్య వస్తే ఏం చెయ్యాలి అని జీవితానికి సంబంధించిన ప్రణాళిక రaాన్సీ దగ్గర లేదు. కానీ నగర ప్రణాళలికల గజిబిజి దారుల మధ్య నుంచి చాకచక్యంగా ఎదిగిపోగల రaాన్సీ రేపటిరోజున ఈ నగరంలో ఏం చేస్తుందో ఎవరికి తెలుసు.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.