‘‘భొగన్‌విల్లా’’ పేరుతో ప్రముఖ రచయిత్రి ఆపర్ణ తోట రాస్తున్న కాలం మొదలవుతోంది. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
` ఎడిటర్
దిగులు గుబులు, జంట ముళ్ళపొదలు
పైన పూచే నవ్వులే పువ్వులు
అవును,
తలెత్తుకుని నడిచే ముళ్ళదారుల్లో పూవులే పూవులు.
ఎన్ని రంగులు, ఎన్ని రూపాలు, ఎన్ని రకాలు!
ఒంటరిగా ఉండొచ్చు.
కలిసికట్టుగా ఒకే వరుసన కుటుంబా లుగా జీవించొచ్చు.
అతి సున్నితమైన పూవులు. బలమైన కాడ, గట్టి కొమ్మలున్న సున్నితమైన నవ్వులు.
పసుపు, తెలుపు, రాణి రంగు, ఆరెంజ్, ఎరుపు, తెలుపు ` ఏ రంగు లేదని? కొత్తవి ఇంకెన్ని ఎన్ని రంగులు ఉన్నాయో మరి. ఇంకా ఎన్ని కనిపెట్టాలో!
ఒక కాడలో ఒక సమూహమే
ఉంటుంది. బయటకు ఎంత సుకుమా రమో లోపల అంత బలమైన, దట్టమైన అల్లిక! శత్రువుల నుండి వాటికవే కాపాడుకోగలిగేవి.
ఇంత అందమైన పూవులు ఆర్భాటపు వేడుకలకు పనికిరావు. సత్కారాల సమయాల్లో వీటి జాడే ఉండదు. పూజలలో వీటి ప్రమేయం సరేసరి. కనీసం ఒక ఆహార్యంగా కూడా చూడలేము.
ఒకసారి దారి మలుపులో అద్భుతంగా ఎదురైతే, మరోసారి దారులు దాటుతున్నపుడు చేతులు కట్టుకుని మనలను గమనిస్తున్న పెద్దమనిషిలాగా మారుతాయి. లేదా ఇద్దరి ఆత్మీయ సంభాషణ మధ్య ఒక మూడో మనిషిలా మౌనంగా పాల్గొంటాయి.
అడివితనం! విచ్చలవిడిగా ఎక్కడబడితే అక్కడ నివాసం ఏర్పరచుకొని విశృంఖ లంగా ఎదిగే స్వభావం వీటి స్వంతం.
బలవంతంగా ఒకవేళ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా ఇవి పెరగవు. స్వేచ్ఛ మాత్రమే తమ ఎదుగుదలకు సూత్రమని నమ్మే మూఢ జాతి ప్రేమికులు. వేరొకరికి వీటిని నిలువరించే శక్తి లేదు. ఆగాలను కున్నప్పుడు ఆగడమే వీటి తత్వ్తం.
కృత్రిమాలకు లొంగని సహజత్వం వీటి సొంతం.
ఇల్లు అవసరం లేదు, రక్షణ అసలే అవసరం లేదు. వీటికివే ఒక ఇల్లు, వాటి స్వభావమే వాటికి రక్షణ. స్వతహాగా పోషించుకోగలిగే శక్తి కలవి, జీవించడానికి బయటి వనరులు పెద్దగా అవసరం లేనివి, సౌందర్యానికి సవాలు విసిరేంత అందమైనవి. కొన్నిసార్లు ఒంటరిగా మనగలిగేవి, కొన్నిసార్లు సమూహాలలో వెలసేవి.
ఇంటి గేట్ల వద్ద, ఒక చక్కని గొడు గులా, లేక చేతబుచ్చుకున్న భారీ బొకేలాగా ఇంటి లోపలికి, ఆ ఇంటిలో జరిగే కొత్త అనుభవాలకు, అనుభూతులకు ఆహ్వానం పలుకుతూ పలకరించేవి.
కానీ చిత్రం చూడండి!
బయటవారిని లోనికి రానీయక, లోనివారిని బయటికి పోనీయక, తమకు నచ్చినప్పుడు మాత్రమే ఆహ్వానం పలికి కాస్త దూరం సాగాక తన సరిహద్దులను తెలుసుకుని నడుచు కుంటాయి.
బయటవారికే కాదు, వీటికి ఇవే కంచె.
ఓయ్ అక్కలు, చెల్లెళ్ళూ వింటున్నారా!
బహుశా
అందంతో పాటు బలమూ కావాలని,
అనుభవాలకు అనుభూతులకు ఆహ్వానం పలకడంతో పాటు,
ఇతరులతో, మనతో మనకు కూడా సరిహద్దులు ఏర్పరచుకోవడం అవసరం అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాయేమో.
సన్న జాజి, మల్లెపూవు, ముద్ద మందారం, గులాబీల్లా కాదు, బోగన్ విల్లియాల్లాగా మారిపోదాం.