ప్రియమైన ఇజువేలా పదిహేను సూచనలతో ఒక స్త్రీవాద మేనిఫెస్టో -పి. సత్యవతి

పరిచయం
కొన్నాళ్ళ క్రిందట నా బాల్య స్నేహితురాలు ఒకామె, ఆడపిల్లని స్త్రీవాదిగా ఎట్లా పెంచాలని నన్ను సలహా అడిగింది. ఒక శక్తిమంతురాలైన స్త్రీ, కరుణా స్వభావురాలు కూడా అయిన ఆమె నన్ను ఈ సలహా అడిగినప్పుడు నిజంగా నాకు తెలియదు అని

చెప్పాలనుకున్నాను. అది చాలా క్లిష్టమైన వ్యవహారం అని కూడా అనిపించింది.
నేను స్త్రీవాదంపైన అనేక ప్రసంగాలు చేసి ఉన్నాను కనుక ఆ అంశంలో నేను నిష్ణాతురాలినని ఆమె అనుకుని ఉండవచ్చు. అందుకే ఇలా అడిగి ఉండవచ్చు. అంతేకాదు ఒకప్పుడు నేను బేబీ సిట్టర్‌గా పనిచేశాను. నా మేనల్లుళ్ళను, మేనకోడళ్ళనూ పెంచాను కూడా. పిల్లల పెంపకాన్ని గురించి చాలా విన్నాను, చూశాను కూడా. చూడడం వినడం కన్నా దాని గురించి ఎక్కువ ఆలోచించాను. ఆమె నా సలహా అడిగినందుకు జవాబుగా తనకు ఒక లేఖ వ్రాద్దామనిపించింది. అది చాలా నిజాయితీతో, ఆచరణ సాధ్యంగా ఉండే సూచనలతో ఉండాలని అనుకున్నాను. అది నా స్త్రీవాద దృక్పథాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కూడా అనుకున్నాను. ఆ లేఖే ఇప్పుడు చిన్న సవరణలతో ఒక చిన్న పుస్తకంగా వచ్చింది.
అంతేకాదు ఇప్పుడు నేను ఒక పాపకు తల్లిని. మనమే ఆ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆ అంశం మీద వ్రాయడం సులభం కదా! ఇంతకు ముందుకన్నా విలక్షణంగా పిల్లలను పెంచడం గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఇప్పుడు ఎక్కువ
ఉంది. స్త్రీ పురుషులిద్దరికీ ఒక నాణ్యమైన ప్రపంచాన్ని రూపొందించడం అత్యవసరం.
నా లేఖ చదివిన స్నేహితురాలు నా సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తానని జవాబిచ్చింది. నా సూచనలు నేనే మళ్ళీ చదువుకుని ఒక తల్లిగా వాటిని నేను కూడా పాటించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను.
ప్రియమైన ఇజువాలే,
ఎంత సంతోషం! ఎంత చక్కని పేర్లు మీ అమ్మాయివి! చిజలమ్‌ అడోరా. ఏడు రోజుల పసిపిల్ల! ఎంత బావుందో! అప్పుడే ప్రపంచాన్ని కుతూహలంగా చూస్తోంది. ఎంత గొప్ప పని చేశావు నువ్వు! ఒక ప్రాణిని ప్రపంచంలోకి తెచ్చావు. కేవలం ‘‘అభినందనలు’’ అని చెప్పడం నీ సృష్టిని తక్కువ చేసి చెప్పడం మాత్రమే.
నీ జవాబు చదివి ఏడుపొచ్చింది. నీకు తెలుసుకదా ఒక్కొక్కప్పుడు నేను చాలా తేలికగా ఉద్వేగపడతాను. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని భుజాన వేసుకుంటున్నాను. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. పాపాయిని అసలైన స్త్రీవాదిగా ఎలా పెంచాలి? అని. ‘‘కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీవాదులు ఎలా స్పందించాలో తెలియడంలేదు’’ అని నువ్వు అడగడం నాకిప్పుడు అర్థమైంది. నా ఉద్దేశంలో స్త్రీవాదం ఎప్పుడూ సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటుంది. నాకెప్పుడూ శిలాశాసనం వంటి నియమాలు లేవు. నాదగ్గర ఉన్న రెండు స్త్రీవాద పరికరాలను నీతో పంచుకుంటాను. మొదటగా నువ్వు ఏర్పరచుకున్న నీ నమ్మకాలేమిటి? నువ్వు గట్టిగా నమ్మే విషయం ఏమిటి? మొదట నీకు నీ నమ్మకం మీద అచంచల విశ్వాసం ఉండాలి. నమ్మాల్సింది ఏమిటంటే ‘‘నేను ముఖ్యం’’, ‘‘నేను సమానం’’. ఇందులో ఎటువంటి సంశయాలకి తావులేదు. అక్కడే ఆగిపోవాలి.
రెండవది ‘‘నువ్వు దాన్ని తలక్రిందులు చేసి అదే ఫలితాన్ని సాధించగలవా?’’
ఉదాహరణకి: ‘‘భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటే అతన్ని వదిలిపెట్టమంటారు స్త్రీవాదులు’’ అని చాలామంది అంటారు. అయితే ‘‘అతనితో కలిసి ఉండడం కూడా సందర్భాన్ని బట్టి ఎంచుకోవచ్చు స్త్రీవాదులు’’ అంటాను నేను. చూడి (నీ సహచరుడు) మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అతన్ని నువ్వు క్షమించావనుకో, నువ్వు వేరొకరితో సంబంధం పెట్టుకున్నప్పుడు అతను నిన్ను అలాగే క్షమిస్తాడా? అవును అనేది నీ జవాబు అయితే అప్పుడు కలిసి ఉండడం కూడా స్త్రీవాద ఎంపికే. ఎందుకంటే అక్కడ జెండర్‌ అసమానత్వం లేదు కనుక. కానీ చాలా వివాహాల్లో అది నిజం కాదు. దానికి కారణం జెండర్‌ ఆధారితమైనది. ‘‘మగవాళ్ళు ఎప్పుడూ మగవాళ్ళే’’ అనే అసందర్భమైన ఆలోచన. అంటే మగవాళ్ళకి చాలా తక్కువ నియమాలు, ప్రత్యేక ప్రమాణాలు.
చిజలమ్‌ని పెంచడానికి నా దగ్గర కొన్ని సూచనలున్నాయి. కానీ ఒక సంగతి గుర్తుంచుకో. నేను చెప్పినవన్నీ పాటించడానికి నువ్వు ఎంత కృషి చేసినా ఒక్కొక్కసారి ఫలితం ఉండకపోవచ్చు. జీవితం అంతే. తన పని తను చేస్తుంది. నువ్వు ప్రయత్నిస్తూ ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యం నీ మనసు చెప్పేదే నమ్మడం. ఎందుకంటే నీ మనసెప్పుడూ నీ బిడ్డ ప్రేమనే కోరుతుంది. ఆపై నిన్ను నడిపిస్తుంది.
ఇవిగో కొన్ని సూచనలు:
1. మొదటి సూచన: నువ్వొక సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలి. మాతృత్వం అనేది ప్రకృతి ప్రసాదించిన గొప్ప కానుక. కానీ నువ్వు కేవలం ఒక తల్లివే కాదు. తల్లి పాత్రకే నీ ఉనికి పరిమితం కాదు. నువ్వెప్పుడైతే సంపూర్ణ మానవిగా ఉంటావో అప్పుడే నీ బిడ్డ దానివల్ల ప్రయోజనం పొందుతుంది. మార్లిన్‌ శాండర్స్‌ అనే తొలి తరం ప్రముఖ పత్రికా విలేఖరి వియత్నాం యుద్ధ వార్తలను వ్రాసేది. ఆమె ఒక యువ విలేఖరికి ఒకసారి ఇచ్చిన సలహా ఏమిటంటే ‘‘ఎప్పుడూ కూడా ఉద్యోగం చేస్తున్నందుకు చింతించకు. నీ ఉద్యోగాన్ని ఇష్టంగా చెయ్యి. చేసే పనిని ప్రేమించడం అనే గుణమే నీ బిడ్డకు నువ్విచ్చే అపూర్వ కానుక’’ అని. మార్లిన్‌కి కూడా ఒక పిల్లవాడు ఉన్నాడు.
ఇది చాలా వివేకవంతమైన సలహా. హృదయాన్ని తట్టేదని నాకు అనిపిస్తుంది. నీ ఉద్యోగాన్ని నువ్వు ప్రేమించనక్కర్లేదు. ఆ
ఉద్యోగం ఇచ్చే ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక స్వావలంబననీ గౌరవించు.
నువ్వొక సాంప్రదాయ గృహిణిలా ఇంటికే పరిమితమై ఉండాలని మీ వదిన చెప్పినందుకు నాకేమీ ఆశ్చర్యం లేదు. నీ సహచరుడికి రెండు జీతాలు అవసరం లేదని ఆవిడ అంటుంది. వాళ్ళు చెప్పే దాన్ని సమర్ధించుకోడానికి చాలామంది ‘సంప్రదాయం’ అనే మాట వాడుకుంటారు. అసలు ఇద్దరూ సంపాదించుకోవడమే ఇగ్బో సంప్రదాయం అని ఆవిడకు చెప్పు. బ్రిటిష్‌ కాలనీ కాకముందు ఇగ్బో స్త్రీలు పొలం పని చేసేవారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. బ్రిటిష్‌ ఆక్రమణకు పూర్వం కొన్ని ఇగ్బో ప్రదేశాలలో ముఖ్యంగా స్త్రీలే అమ్మకాలు చేసేవారు. ఆమెకు పుస్తకాలు చదవడం బొత్తిగా అలవాటు లేదేమో మరి. ఈ విషయం తెలుసుకోమను. నేను ఆవిడ మీద వ్యంగ్య బాణం సంధించడం నిన్ను ఉత్సాహపరచడానికి. నువ్వెలా ఉండాలో ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా సలహాలిస్తారు. కానీ నీకేం కావాలో నువ్వు తెలుసుకోవడం ముఖ్యం. నువ్వేం కోరుకోవాలో వాళ్ళు చెప్పడం కాదు. మాతృత్వమూ, ఉద్యోగమూ భిన్న ధృవాలని చెప్పే వాళ్ళ మాట నమ్మవద్దు.
మనని పెంచేటప్పుడు మన తల్లులు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళు. మనం బాగా పెరగలేదా? కనీసం నువ్వు బాగా పెరగలేదా? నా సంగతి అప్పుడే వద్దు కానీ.
పాప పుట్టిన తొలి దినాల్లో నిన్ను గురించి శ్రద్ధ తీసుకో. అందరి సహాయం తీసుకో. నీకు అందరూ సాయం చెయ్యాలని ఆశించు. సర్వ సమర్ధురాలైన స్త్రీ అంటూ ఎవ్వరూ ఉండరు. అసలు ఆ ఆలోచనే తప్పు. పిల్లల పెంపకంలో ప్రేమ, భాగస్వామ్యం ఉంటాయి. తల్లి అనేది ఒక క్రియా పదంగా మారడానికి మూలం ‘‘పిల్లల పెంపకమనేది ఒక ఆరాటంతో అపరాధ భావంతో కూడిన అంతులేని ప్రయాణం’’ అనే మధ్య తరగతి భావజాలం.
అప్పుడప్పుడూ తప్పులు చెయ్యవచ్చు. వైఫల్యాలు ఉండవచ్చు. ఉండనివ్వు. ఏడ్చే పాపని ఊరుకోబెట్టడం తొలి కాన్పులోనే ఆ తల్లికి చేతకాకపోవచ్చు. అన్నీ నీకు తెలిసి ఉండాలని అనుకోకు. పిల్లల పెంపకాన్ని గురించిన పుస్తకాలు చదువు. ఇంటర్నెట్‌ చూడు. పెద్దవాళ్ళ సలహా అడుగు. అదీకాకపోతే ప్రయోగాలు చెయ్యి. అందులో తప్పులు తెలిస్తే సరిదిద్దుకోవచ్చు. అయితే అసలు విషయం మాత్రం నువ్వు కేవలం తల్లిగానే కాక ఒక సంపూర్ణమైన మనిషిగా ఉండు. నీ కోసం కాస్త సమయం మిగుల్చుకో. నీ అవసరాలను గమనించుకో. వాటిని త్యాగం చెయ్యక్కర్లేదు. అన్నీ నేను చెయ్యాలి అనే ఆలోచన మానుకో. అన్ని పనులూ ఒంటిచేత్తో సమర్ధించుకొచ్చే స్త్రీలను మన సమాజమూ, సంస్కృతీ నెత్తిన పెట్టుకుంటాయి. కానీ ఆ ఆరాధనకి వెనక అసలు విషయమేమిటో చర్చించరు. ఈ చర్చపైన నాకు ఆసక్తి లేదు. ఎందుకంటే పిల్లల పెంపకం, ఇంటి పనీ స్త్రీల ఒక్కరి బాధ్యతేననీ పురుషులకి అందులో ప్రమేయం లేదనీ చెప్పడాన్ని నేను అంగీకరించను. ఈ రెండు పనులూ జెండర్‌తో సంబంధం లేనివి. అన్నీ స్త్రీలే చెయ్యాలి అని చెప్పడం కాదు, ఇద్దరూ కలిసి పనిచేయాలనే ప్రతిపాదనకి మద్దతునివ్వాలి. ఇంటిలోనూ, పని ప్రదేశంలోనూ స్త్రీ పురుషుల భాగస్వామ్యం ఉండాలి.
2. రెండవ సూచన : కలిసి పని చెయ్యండి. పని పంచుకోండి. నీకు గుర్తేనా? మనం ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు ‘‘క్రియ’’ అంటే పనిని సూచించే పదం అని నేర్చుకున్నాం. అట్లాగే ఒక తల్లి ‘‘క్రియ’’ అయితే తండ్రి కూడా ‘‘క్రియే’’. జీవశాస్త్రం అనుమతించే పనులన్నీ అతడూ చెయ్యవచ్చు, బిడ్డకి పాలివ్వడం తప్ప. సమాజం తలకెక్కించిన భావజాలం ప్రకారం చాలామంది తల్లులు, తండ్రులకు ఎక్కువ పనులు చెప్పరు. అన్ని పనులూ తమవే అనుకుంటారు. అతడు నీలాగా పాపకి స్నానం చేయించలేడేమో అని నువ్వనుకోవచ్చు. పాప ముడ్డి బాగా శుభ్రం చెయ్యలేడేమో అనుకోవచ్చు. ఇంతలో మునిగిపోయేదేమీ లేదు. ఆ పాప ప్రాణాలు తండ్రి చేతిలో పోవు కదా? పాపమీద నీకు ఎంత ప్రేమో అతనికీ అంతే ప్రేమ. తండ్రి లాలన పాపకు కూడా సంతోషం కదా? అంతా పరిపూర్ణంగా ఉండాలనే ఆలోచన పక్కకు పెట్టు. అంతా నీ బాధ్యతే అనే సమాజపు నియంత్రణని మర్చిపో. పాప పెంపకాన్ని సమంగా పంచుకోండి. ‘‘సమంగా’’ అనేది మీ ఇద్దరి అవగాహన బట్టి ఉంటుంది. ఎవరెవరి అవసరాలు ఏమిటో ఆలోచించుకునే, పంచుకునే అవగాహన కానీ, కాగితం మీద వ్రాసుకునే లెక్క కాదు. నిజమైన మానవత్వం ఉన్నచోట చిర్రుబుర్రులుండవు, అలకలూ, కినుకులూ ఉండవు.
మరొక విషయం. ‘‘సహాయం’’ అనే మాట రానివ్వద్దు. తన స్వంత బిడ్డను చూసుకోవడం అతడు నీకు సహాయం చెయ్యడం కాదు. అతడు తన బాధ్యత నిర్వహిస్తున్నాడు, అంతే. తండ్రులు మనకి సహాయం చేస్తున్నారంటే, బిడ్డ బాధ్యత మొత్తం తల్లిదేనని అర్థం. అదేదో స్త్రీల సామ్రాజ్యం అనీ అందులోకి పురుషులు దయగా అడుగుపెడుతున్నారనీ అర్థం. అది అబద్ధం. తండ్రులే కనుక ముందునుంచీ పిల్లల పెంపకాన్ని పంచుకుని ఉంటే, ఇప్పుడు చాలామంది సంతోషంగా సమర్ధవంతంగా ఉండి ఒక నాణ్యమైన ప్రపంచాన్ని నిర్మించి ఉండేవాళ్ళు. ఎప్పుడూ కూడా అతడు పాపని చూసుకుంటున్నాడు (దీaపవంఱ్‌్‌ఱఅస్త్ర) అనవద్దు. దీaపవంఱ్‌్‌ఱఅస్త్ర చేసేవాళ్ళకి పిల్లలు ఒక ప్రాథమ్యం కాదు. అతడికి పాప పెంపకంలో భాగం పంచుకున్నందుకు నువ్వేమీ కృతజ్ఞత చెప్పనక్కరలేదు. నీకూ అతడు చెప్పనక్కరలేదు. మీరిద్దరూ కలిసి ఆ పసి ప్రాణిని భూమి మీదకు తెచ్చారు. కనుక పాప పెంపకంలో ఇద్దరిదీ సమ బాధ్యత. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్లనో, నీ ఎంపికతోనో నువ్వు ఒంటరి తల్లివై ఉంటే అప్పుడు నీకు వేరే ఎంపిక లేదు. తప్పనిసరిగా పాప బాధ్యత అంతా నీదే అయి ఉండేది. ఇప్పుడు నువ్వు బాధ్యతంతా ఒక ఒంటరి తల్లిలా నీ భుజాన వేసుకోకూడదు.
నా స్నేహితుడు న్వాబూ భార్య అతన్నీ, ఇద్దరు చిన్న పిల్లలనీ వదిలి వెళ్ళిపోయింది. అతనొకసారి నాతో ‘‘నేనిప్పుడు మిస్టర్‌ మామ్‌ అయ్యాను’’ అన్నాడు. అంటే ఒక తల్లిలాగా పిల్లల్ని చూసుకుంటున్నానని అర్థం. కానీ అతను మిస్టర్‌ మామ్‌ కాదు నాన్న మాత్రమే. నాన్నలు కూడా పిల్లల్ని పెంచవచ్చు.
3. మూడవ సూచన: స్త్రీల పనులు ఇవి, పురుషుల పనులు ఇవి అని వేరుచేసి చెప్పడం మూర్ఖత్వం అని పెద్దదౌతున్న పాపకు చెప్పు. అంతేకాదు ‘‘నువ్వు ఆడపిల్లవు కనుక ఫలానా పని చెయ్యాలి, ఫలానా పని చెయ్యకూడదు’’ అని ఎప్పుడూ చెప్పకు.
ఒక పని చెయ్యడానికి చెయ్యకపోవడానికి, ‘‘నువ్వు ఆడపిల్లవు’’ అనేది ఎప్పుడూ ఒక కారణం కాదు.
నా చిన్నప్పుడు ఇల్లు చిమ్ముతున్నప్పుడు ‘‘బాగా ఒంగి చిమ్ము, ఒక ఆడపిల్లలాగా’’ అని చెప్పేవాళ్ళు.
అంటే ఇల్లు చిమ్మడం ఆడపిల్లల పని అని అర్థం. అలా కాకుండా ‘‘ఒంగి చిమ్ము. అలా అయితేనే దుమ్ము బాగా పోతుంది’’ అని చెప్పవచ్చు కదా! నా అన్న తమ్ముళ్ళకి కూడా అలాగే చెప్పి ఉండాల్సింది అనుకుంటూ ఉంటాను.
ఇటీవల నైజీరియా ప్రసార మాధ్యమాల్లో ‘‘స్త్రీలు, వంటపని’’ అనే అంశంపై గంభీరమైన చర్చలు జరుగుతున్నాయి. భర్తల కోసం భార్యలు వంట చెయ్యాలని వాదిస్తున్నారు. వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక్కొక్కసారి విచారకరమైన విషయాలు కూడా హాస్యం పుట్టిస్తాయి. విచారకరం ఎందుకంటే ఇంకా ఇప్పటికీ వంట వచ్చి ఉండడం స్త్రీలకి వివాహార్హతగా భావించడం. వంట సామర్థ్యం స్త్రీల శరీరంలో యోనితో పాటు ముందుగానే ఏర్పడి ఉండదు. వంట పుట్టుకతో వచ్చేది కాదు. అది నేర్చుకునే విద్య. ఇంటి పని, వంట పని స్త్రీ పురుషులిద్దరూ నేర్చుకోవలసిన సాధారణ విషయాలు. అది ఇద్దరికీ కూడా అంతుపట్టని నైపుణ్యం కూడా కావచ్చు ఒక్కొక్కసారి.
వివాహం అవడం అనేది స్త్రీలకు దక్కిన వరం అనే ఆలోచన నుంచీ మనం బయటపడాలి. అప్పటిదాకా ఇటువంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. వివాహం ఒక వరం అనే సామాజిక నియంత్రణ నుంచీ బయట పడనంతవరకూ పాక శాస్త్ర నైపుణ్యం వివాహార్హత కింద ఉంటూనే ఉంటుంది. ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి.
మన చిన్నప్పటినుంచే మనం ఎలా ఉండాలో ప్రపంచమే నిర్ణయిస్తుంది. చిజలమ్‌కి దుస్తులు కొందామని నిన్న ఒక బట్టల దుకాణానికి వెళ్ళాను. ఆడపిల్లల విభాగంలో బాగా వెలిసి పోయినట్లున్న గులాబిరంగు దుస్తులు ఉన్నాయి. నాకవి నచ్చలేదు. మగపిల్లల విభాగంలో కంటికి నదురుగా కనిపించే నీలం రంగు బట్టలున్నాయి. పాప మేని ఛాయకు నీలం రంగు బాగా నప్పుతుందనిపించింది. ఫోటోలలో కూడా కనిపిస్తుంది అనుకున్నాను. అందుకని ఒక జత కొన్నాను. డబ్బు చెల్లించే దగ్గర కుర్రవాడు, ఆ దుస్తుల్ని ప్రశంసిస్తూ ‘‘ఇప్పుడే పుట్టిన మగపిల్లలకు ఈ దుస్తులు చాలా బాగుంటాయి’’ అన్నాడు.
‘‘ఇవి ఒక పసి పాప కోసం’’ అన్నాను.
అతను దిమ్మెరపోయాడు. ‘‘అమ్మాయికి నీలం రంగా?’’ అన్నాడు.
ఆడపిల్లలకు గులాబి, మగ పిల్లలకు నీలం రంగు అని ప్రచారం చేసిన వ్యాపారస్తుడి తెలివికి ఆశ్చర్యపోయాను. అక్కడ ఆడ, మగ పిల్లలిద్దరికీ ఉపయోగపడే బట్టలున్న విభాగం కూడా ఉంది. అందులో అన్నీ జీవంలేని బూడిద రంగు బట్టలే ఉన్నాయి. ‘‘పిల్లల బట్టలు’’ అని చెప్పి రంగురంగుల బట్టలు వాళ్ళ వయసుల ప్రకారం సర్దిపెట్టవచ్చు కదా? పిల్లల దుస్తుల్లో కూడా ఈ రంగు భేదాలేమిటి? పసిపిల్లలంతా ఒకే మాదిరిగా ఉంటారు కదా?
ఇక పిల్లల ఆటబొమ్మలు సరే సరి. అవి కూడా ఆడ, మగ భేదాలతోనే ఉన్నాయి. మగ పిల్లల బొమ్మలు ఉత్సాహపరిచేవి, కదిలేవి, పరిగెత్తేవి… అంటే రైళ్ళు, కార్లు వంటి చలనం కలవి. ఆడపిల్లలకు స్థిరంగా ఉండేవి, అలంకరించిన అమ్మాయిల బొమ్మలు. సమాజం ఎంత త్వరగా అబ్బాయిలెలా ఉండాలో, అమ్మాయిలెలా ఉండాలో నిర్ణయిస్తుంది కదా? బొమ్మలు జెండర్‌ను బట్టి కాక వాటి నమూనాలను బట్టి పేర్చవచ్చు కదా దుకాణాలలో!
బహుశా ఈ సంగతి నీతో చెప్పే ఉంటాను. ఒకసారి నేను ఏడేళ్ళ నైజీరియన్‌ అమ్మాయితోనూ, ఆ పాప తల్లితోనూ అమెరికాలో ఒక మాల్‌కు వెళ్ళాను. అక్కడ వైర్‌లెస్‌ రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే ఒక హెలికాఫ్టర్‌ చూశాము. పాపకి అది బాగా నచ్చి కొనిపెట్టమని అడిగింది. వాళ్ళమ్మ ‘‘వద్దు! నీకు నీ బొమ్మలున్నాయి కదా’’ అంది. ఆ పాప వెంటనే ‘‘నేనెప్పుడూ బొమ్మలతోనే ఆడుకోవాలా?’’ అనడిగింది.
ఆ సంఘటన నేనెప్పుడూ మర్చిపోలేను. వాళ్ళమ్మ మంచి ఉద్దేశంతోనే అని ఉండవచ్చు. ఎందుకంటే ఎవరు ఎలా ఉండాలో ఆమెకి బాగా తెలుసు. ఆడపిల్లలకు బొమ్మలు, మగపిల్లలకు హెలికాఫ్టర్లు. ఇప్పుడు నిరాశగా అనుకుంటాను ‘‘ఆ పాపకి హెలికాఫ్టర్‌ కొనిచ్చినట్లయితే పెద్దయ్యాక అది ఎలా తయారయిందో, ఎలా పనిచేస్తోందో తెలుసుకుంటే తనొక మంచి ఇంజనీర్‌ అయి ఉండేదేమో’’ అని.
చిన్నపిల్లల మీద మనం వాళ్ళ ఆశల్ని బంధించే ఈ జెండర్‌ పాత్రలు రుద్దకపోతే వాళ్ళ సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము కదా! చిజలమ్‌ను ఒక వ్యక్తిగా చూడడం అలవాటు చేసుకో. సమాజం నిర్దేశించిన పాత్ర పోషించే ఒక ఆడపిల్లగా కాదు. ఒక వ్యక్తిగా, ఆ పిల్లలోని బలాలనూ, బలహీనతలనూ చూడు. ఒక ఆడపిల్ల అనే త్రాసులో పెట్టి తుయ్యకు. ఆ పిల్లలో మంచిని చూడు. ఒక నైజీరియన్‌ అమ్మాయి నాతో ఇలా చెప్పింది… తను చాలాకాలం అబ్బాయిలా ప్రవర్తించేదట. ఫుట్‌బాల్‌ అంటే చాలా ఇష్టమట. ఆడపిల్లల దుస్తులంటే విసుగు పుట్టిందట. చివరికి వాళ్ళమ్మ బలవంతంగా మాన్పించిందట. అలా వాళ్ళమ్మ తనని తీర్చిదిద్దినందుకు తను వాళ్ళమ్మకు ఎంతో ఋణపడి ఉందట. అది విని నాకు చాలా విచారం కలిగింది. అలా బలవంతంగా తన కోర్కెలను అణగార్చుకోవడం ఎంత బాధాకరం! తను అబ్బాయిలాగా ప్రవర్తించలేదు, నిజానికి తనలాగా ప్రవర్తించింది. తను ఎంత కోల్పోయిందో కదా!
మరొక అనుభవం చెబుతాను. ఒక అమెరికన్‌ (నార్త్‌ వెస్ట్‌ పసిఫిక్‌లో ఉంటుంది) పరిచయస్తురాలు నాతో ఒక
సంగతి చెప్పింది. ఒకసారి తను తన ఏడాది కొడుకుని పిల్లల ఆటస్థలానికి తీసుకువెళ్ళిందట. అక్కడికి వచ్చిన ఆడపిల్లల తల్లులు పిల్లలని ‘‘ఇది ముట్టుకోకు’’, ‘‘అది ముట్టుకోకు’’, ‘‘అలా వెళ్ళకు, ఆగు చక్కగా ఉండడం నేర్చుకో’’ అని అన్నిటికీ ఆంక్షలు పెట్టారట. మగపిల్లల తల్లులు వాళ్ళను స్వేచ్ఛగా వదిలారట. ఇలా ఆంక్షలు పెట్టలేదట. వాళ్ళకి వాళ్ళ తల్లులు ‘‘చక్కగా ఉండు, పద్ధతిగా ఉండు’’ అని చెప్పలేదట. ఆమె చెప్పిందేంటంటే ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే తక్కువ స్వేచ్ఛ, ఎక్కువ నియంత్రణా ఉంటాయి, మగపిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ, తక్కువ నియంత్రణా ఉంటాయి అని.
ఈ జెండర్‌ నియంత్రణ మనమీద ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది మన కోరికలను, ఆశలను, సంతోషాన్నీ ఆవిరి చేస్తున్నా మనం దాన్ని అనుసరించి పోతూ ఉంటాం. ఒకసారి మెదడులో జొరబడిన ఆ జెండర్‌ నియంత్రణ మనం చెరుపుకోలేము. అందుకే చిజలమ్‌ ఆ భావజాలాన్ని తిరస్కరించేలా పెంచు. పాప ఆ జెండర్‌ వ్యవహారాన్ని అంతర్గతం చేసుకోకుండా ఆత్మవిశ్వాసం అలవరచు. తన పనులు తాను చేసుకుంటూ, తన వ్యక్తిత్వాన్ని తనే నిర్మించుకునేలా చూడు. ఏవైనా వస్తువులు విరిగినా, పగిలినా వాటిని ఎలా మరమ్మతు చేసుకోవాలో నేర్పించు. ఆడపిల్లలు ఆ పనులు చేయలేరని మనం త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ ఆ పిల్లని ప్రయత్నించనీ. విఫలమైనా కానీ ఫర్వాలేదు. తనకు ఆడుకోడానికి బ్లాక్స్‌, కార్లు, రైళ్ళు, బొమ్మలు కూడా కొనిపెట్టు.
4. నాలుగవ సూచన: ఇప్పుడు ప్రచారమవుతున్న ‘‘ఫెమినిజం లైట్‌’’ చాలా ప్రమాదకరం. దీని గురించి జాగ్రత్తగా ఉండు. ఇది షరతులతో కూడిన స్త్రీ సమానత్వం. అసలు దీన్ని పూర్తిగా తిరస్కరించు. ఇది చాలా బోలు వ్యవహారం. దివాలాకోరుతనం, మనని సముదాయించే ప్రయత్నం. స్త్రీవాదిగా ఉండడం అంటే ఒక విధంగా గర్భవతిగా ఉండడంలాగా. నువ్వు ఉండడమా, లేకపోవడమా! నువ్వు స్త్రీ పురుషుల సంపూర్ణ సమానత్వాన్ని నమ్ముతావా లేదా?
ఫెమినిజం లైట్‌ ఏం చెబుతుందో తెలుసా? పురుషుడు తల అయితే స్త్రీ మెడ. నువ్వు ముందు సీట్లో కూర్చుంటావు కానీ అతనే ఎప్పుడూ కారు నడుపుతాడు. ఇంకా ఏమిటంటే పురుషుడు సహజంగానే మనకన్నా అధికుడు, కానీ అతను స్త్రీలను బాగా చూసుకోవాలి. కుదరదు కాక కుదరదు. స్త్రీల సంక్షేమం పురుషుల దయ మీద ఆధారపడేది కాదు.
ఫెమినిజం లైట్‌ ఇంకొక మాట కూడా ఉపయోగిస్తుంది. అదేమిటంటే ‘అనుమతి’. థెరిస్సా మే బ్రిటిష్‌ ప్రధానమంత్రి అయినప్పుడు ఒక అభ్యుదయ వార్తాపత్రిక ఆమె భర్త గురించి ఇలా వ్రాసింది. ‘ఫిలిప్‌ మే గురించి రాజకీయ వర్గాల్లో ఇలా అనుకుంటారు. అతను వెనక సీట్లో ఉండి భార్యను ఇలా గొప్ప స్థానంలో ఉండటానికి అనుమతించాడు’ అని.
ఆమె అలా ఉండడానికి అతని ‘అనుమతి’ అన్నమాట. ఇప్పుడీ మాటను మనం తిరగరాయాలి.
థెరిస్సా మే తన భర్తకు ‘‘అనుమతి’’ ఇచ్చింది అంటామనుకో, దానికి అర్థం ఉంటుందా? ఫిలిప్‌ మే గనుక ప్రధాన మంత్రి అయి ఉంటే, థెరిస్సా అతనికి బాగా మద్దతు ఇచ్చిందనో, అతని పక్కన నిలబడిరదనో, లేక అతని విజయానికి వెనక ఆమె ఉందనో అనేవాళ్ళం. అంతేగాని అతను ప్రధాన మంత్రి కావడానికి ఆవిడ అనుమతి ఇచ్చిందని అనం.
‘‘అనుమతి’’ అనేది చాలా క్లిష్టమైన పదం. ఫెమినిజం లైట్‌ యొక్క నైజీరియన్‌ శాఖ ఏమంటుందో విన్నావా? ‘‘భర్త అనుమతి ఉన్నంతవరకూ స్త్రీలు వారికి నచ్చిన విధంగా ఉండవచ్చు’’ అని.
భర్త స్కూల్లో ప్రధానోపాధ్యాయుడి లాంటి వాడా? భార్య విద్యార్థిని కాదు కదా? అనుమతి, అంగీకారం ఏకపక్షంగా ఉన్నప్పుడు ఆ వివాహంలో సమానత్వం ఎక్కడ? సమానత్వం ఉన్నా వివాహాల్లో ఇలాంటి పదాలు వాడకూడదు.
ఫెమినిజం లైట్‌ గురించి ఇంకొక భయంకరమైన ఉదాహరణ ఉంది.
ఒకాయన ఇలా అంటాడు, ‘‘స్త్రీలే ఎప్పుడూ ఇంటి పని చెయ్యాలని లేదనుకో. నేను కూడా మా ఆవిడ ఊరెళ్ళినప్పుడు ఇంట్లో పనిచేస్తాను.’’
కొన్నాళ్ళ క్రిందట నన్ను గురించి చాలా దారుణమైన వ్రాతలు వ్రాసినప్పుడు మనం ఎంతగా నవ్వుకున్నామో గుర్తుందా? నన్ను గురించి అలా వ్రాసిన ఆయన నాకు బాగా ‘కోపం’ అన్నాడు కోపం అనేది సిగ్గుపడవలసిన విషయం అయినట్లు. నిజంగానే నాకు కోపం
ఉంది. వర్ణ వివక్ష మీద, జెండర్‌ వివక్ష మీద. కానీ తరువాత నాకు వర్ణ వివక్ష మీద కంటే జెండర్‌ వివక్ష మీద ఎక్కువ కోపం అని గ్రహించాను.
జెండర్‌ వివక్షపై నాకున్న కోపం వల్ల ఒక్కొక్కసారి నేను ఒంటరినైనట్లు భావిస్తాను. ఎందుకంటే నేను ఇష్టపడే వాళ్ళు నాతో
ఉండే వాళ్ళు వర్ణవివక్షనే అధికంగా ద్వేషిస్తారు. జెండర్‌ పరంగా జరిగే అన్యాయాలను పట్టించుకోరు. చాలాసార్లు నేనెక్కువ ఇష్టపడే
వాళ్ళు కూడా జెండర్‌ వివక్ష గురించి ఒక్క ఉదాహరణ అయినా నిరూపించు అంటారు. (ఈ విశాల ప్రపంచంలో చాలామంది వర్ణ వివక్షని కూడా నిరూపించమంటారు. కానీ నా దగ్గర వాళ్ళు అట్లా అనరు.) చాలాసార్లు నేను ఇష్టపడేవాళ్ళే జెండర్‌ వివక్షను గురించి తేలిగ్గా కొట్టిపారేశారు.
మన స్నేహితుడు ఇకేన్గా ఎప్పుడూ స్త్రీలకే అనుకూలతలు ఎక్కువని వాదిస్తాడు. మనం చెప్పేది వినిపించుకోడు. అతను ఒకసారి ఇలా అన్నాడు. ‘‘మా నాన్న మా ఇంటికి యజమానిలా కనిపిస్తాడు కానీ నిజానికి మా అమ్మే వెనకనుంచీ అన్నీ నడిపిస్తుంది’’. అతను జెండర్‌ వివక్ష లేదని అంటున్నాడు కానీ ఒక విధంగా నన్ను సమర్ధించినట్లే. అతను ‘‘వెనక నుంచీ’’ అన్నాడు చూడు. అలా ఎందుకు? తనకి నిజంగా అధికారమే ఉంటే అట్లా దాచిపెట్టుకోవడం ఎందుకు?
విచారకరమైన నిజం ఏమిటంటే మన లోకమంతా అధికారంలో ఉన్న స్త్రీలను ఇష్టపడని స్త్రీ పురుషులతో నిండి
ఉంది. అధికారం అనేది పురుష లక్షణం, వాళ్ళ స్వంతం అని మన బుర్రలు నియంత్రించబడ్డాయి. ఎక్కడో ఒక స్త్రీ ఏదో ఒక పదవిలో ఉంటే అది ఒక అసాధారణ వింత విషయంగా చూస్తాం. ఆమెపై అందరూ నిఘాపెడతారు. అధికారంలో ఉన్నా స్త్రీ గురించి మనం కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తాం. ఆమె వినయంగా ఉంటుందా? ఎప్పుడన్నా ఒక చిరునవ్వు చిందిస్తుందా? విశ్వాస పాత్రంగా ఉంటుందా? ఇల్లు చూసుకుంటుందా? ఇటువంటి ప్రశ్నలు మనం అధికారంలో ఉన్న పురుషులను అడగం. మన అసహనం అధికారం పట్ల కాదు, స్త్రీల పట్ల. మనం అధికారంలో ఉన్న పురుషుల పట్ల కంటే అధికారంలో ఉన్న స్త్రీల పట్ల ఎక్కువ కఠినంగా ఉంటాం. ఫెమినిజం లైట్‌ దీనికి దోహదం చేస్తుంది.
5.అయిదవ సూచన : చిజలమ్‌కు చదవడం నేర్పు. పుస్తకాలను ఇష్టపడడం నేర్పు. అలా చెయ్యడానికి ఉత్తమ మార్గం ఒక్కటే, నువ్వు చదవడం తను చూస్తే చదవడం మంచిదని తను కూడా అనుకుంటుంది. తను స్కూలుకి పోకపోయినా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే సాధారణ విద్య నేర్చుకునే వాళ్ళకన్నా జ్ఞానవంతురాలవుతుంది. ప్రపంచ జ్ఞానం పెంపొందడానికి, ప్రశ్నించడానికి, తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, భవిష్యత్తులో తను ఏమి చెయ్యాలనుకుంటోందో ఒక నిర్ణయానికి రావడానికి పుస్తక పఠనం ఎంతో ఉపకరిస్తుంది. ఉదాహరణకి తను సైంటిస్టు కావాలనుకుంటుందో, గాయని కావాలనుకుంటుందో లేక షెఫ్‌ కావాలనుకుంటుందో పుస్తకాలు చదవడం ద్వారా ఆ ఎంపికా నైపుణ్యం అలవడుతుంది. నేను చెప్పేది స్కూలు పుస్తకాల గురించి కాదు. ఆత్మకథలు, చరిత్ర, నవలల వంటివి. నువ్వు ఏ విధంగానూ తనకి పుస్తకాల మీద ఆసక్తి కలిగించలేకపోయావనుకో అప్పడు తాయిలం ఇస్తానని చెప్పు. లంచానికి ముద్దు పేరు తాయిలం. పుస్తకం చదివినప్పుడు ఒక బహుమతి ఇవ్వు, మెచ్చుకుంటూ ఉండు. ఏంజిలా అనే నైజీరియన్‌ స్త్రీ, ఒంటరి తల్లి కూడా. ఆమె అమెరికాలో ఉంటూ తన పిల్లలను పెంచుతోంది. ఆ పిల్ల చదవడానికి మొండికేసినప్పుడల్లా పేజీకి అయిదు సెంట్లు ఇస్తాననేది. కాస్త ఖరీదైన వ్యవహారమే కానీ తరువాత బాగా లాభించిందని చెప్పింది.
6. ఆరవ సూచన : మనం ఉపయోగించే భాషను ప్రశ్నించడం అలవాటు చెయ్యి. భాష మన నమ్మకాలనూ, అభిప్రాయాలనూ మన అనవసరపు అసూయలను నిల్వ ఉంచే ఖజానా లాంటిది. నా స్నేహితురాలు ఒకామె తను ఎప్పుడూ తన పిల్లని రాజకుమారి అని సంభాషించేదట. చాలామంది ముద్దుగా అలా పిలుస్తూ ఉంటారు. కానీ ఆ సంబోధనలో, ఆ పిల్లలో చాలా ఆశలు రేకెత్తించే గుణం ఉంది. తనలో ఒక సౌకుమార్యం ఎవరో ఒక రాజకుమారుడు వలచి వస్తాడనే కోరికా మొలకెత్తుతాయి. నిజానికి ఆ పాప మీద చాలా బరువు పెట్టడం అది. రాజకుమారి అనడం కంటే, దేవతా అనో నక్షత్రమా అనో అనడం మేలు అంటుంది ఆ స్నేహితురాలు. అందుకని పాపతో ఎట్లా మాట్లాడతావో నువ్వే నిర్ణయించుకో. నువ్వు నీ బిడ్డతో మాట్లాడే భాషకు చాలా ప్రభావం ఉంటుంది. దానివలన తను దేనికి విలువ ఇవ్వాలో పాప నేర్చుకుంటుంది. పిల్లల్లా ప్రవర్తించే వారిపట్ల ఒక ఇగ్బో హాస్య గుళిక ఉంది. ‘‘మర్చిపోయావా? నువ్వింక పసిపాపవు కావు. నీకు పెళ్ళీడు వచ్చింది’’ అంటూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడూ అలా అంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా అంటాను ‘‘నువ్వు పసిపాపవు కాదు ఉద్యోగం చేసే వయసు వచ్చింది’’ అని. వివాహమే మన జీవితాశయం అని పిల్లలకి మనం నేర్పకూడదు.
చిజలమ్‌ సమక్షంలో నువ్వు ఎప్పుడూ ‘‘స్త్రీ ద్వేషము, పితృస్వామ్యం అనే మాటలు వాడవద్దు. మనం స్త్రీ వాదులం. ఎక్కువగా ఒక పరిభాష వాడుతూ ఉంటాం. అది ఒక్కొక్కసారి వాళ్ళకి అర్థం కాదు. ఏదైనా ఒక విషయంలో స్త్రీ ద్వేషం అని చెప్పవలసి వస్తే, అదెందుకో, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుని ఎదుర్కోవాలో వివరించు. ఒక స్త్రీలో ఒక గుణాన్ని మనం విమర్శించి అదే గుణం పురుషులలో ఉంటే విమర్శించకపోవడం అంటే నీకు స్త్రీలతోనే సమస్య ఉందన్న మాట. కోపం, కోరిక, గట్టిగా పోట్లాడటం, మొండితనం, స్తబ్దత, కాఠిన్యం ఆ గుణాలు. అవి ఎవరిలోనైనా అభ్యంతరకరమే కదా?
‘‘కేవలం మనం స్త్రీలమైనంత మాత్రాన మనం ఫలానా పని చెయ్యకూడదా? అలా చేస్తే మనకు సాంస్కృతిక గౌరవం పోతుందా? మరి అలాంటి పనులు చేసిన పురుషులకు ఎందుకు సాంస్కృతిక గౌరవం పోదు? వాళ్ళకి ఎందుకు అన్నింటికీ అనుమతి?’’ అని అడగడం నేర్పు.
ఇందుకు ఉదాహరణలు మనకు రోజువారీ సంఘటనలలోనే దొరుకుతాయి.
మనం లేగోస్‌లో ఒక టెలివిజన్‌ కార్యక్రమం చూశాం, గుర్తుందా? అందులో ఒక పురుషుడు వంట చేస్తూ ఉంటే అతని భార్య చప్పట్లు కొడుతూ ఉంటుంది. నిజమైన అభ్యుదయం అదికాదు. అతను వంట చేసినందుకే మెచ్చుకోనక్కర్లేదు. చేసిన పదార్థం బాగుంటే మెచ్చుకోవచ్చు. ఆమె వంట బాగుంటే అతను మెచ్చుకుంటాడు లేకపోతే విమర్శిస్తాడు. అలాగే ఆమె కూడా అతనికి ప్రశంసో, విమర్శో చెయ్యొచ్చు. ఇక్కడ జెండర్‌ వివక్ష ఎక్కడ కనిపిస్తుందంటే వంట ఆమె బాధ్యత అయినట్లూ అతను ఆ పని చెయ్యడమే మహాభాగ్యం అన్నట్లు ఆవిడ చప్పట్లు కొట్టడం. లేగోస్‌ ఒక మెకానిక్‌ అని అందరూ లేడీ మెకానిక్‌ అనేవారు గుర్తుందా? చిజలమ్‌కి అలా అనవద్దని చెప్పు. స్త్రీ అయినా, పురుషుడయినా మెకానిక్కే కదా? అలాగే లేగోస్‌ ట్రాఫిక్‌లో నీ కారుని ఒక పురుషుడు గుద్ది ‘‘పోయి మీ ఆయన్ని పిలుచుకురండి నేను స్త్రీలతో వ్యవహారం చెయ్యను’’ అన్నాడనుకో. అప్పుడు చిజలమ్‌కి చెప్పు స్త్రీ ద్వేషం ప్రత్యక్షం గానూ, ఒక్కొక్కసారి పరోక్షంగా చాపకింద నీరులాగా ఉంటుందని. ఎట్లా ఉన్నా మనం సహించకూడదు. చిజలమ్‌కి మరొక విషయం కూడా చెప్పాలి. తమకు సంబంధించిన స్త్రీలపైనే కాక ప్రతి స్త్రీని ఒక వ్యక్తిగా ఆమెపై సహానుభూతి ఉండాలి పురుషులకు అని.
అత్యాచారాలపై మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది పురుషులు ‘‘అదే నా అక్కో చెల్లో, నా భార్యో, కూతురో అయి ఉంటే…’’ అంటారు. కానీ అత్యాచారం చేసిన పురుషుడు ‘‘నా తమ్ముడో కొడుకో అయితేనా…’’ అనరు. స్త్రీలను ఒక ప్రత్యేక జాతిగా చూడవద్దని చిజలమ్‌కి చెప్పు.
ఒకసారి ఒక అమెరికన్‌ రాజకీయ వేత్త, స్త్రీలకు తన మద్దతు తెలపడానికి ‘‘స్త్రీలను పూజించాలి. వాళ్ళకు మద్దతు ఇవ్వాలి’’ అనడం విన్నాను. ఇది చాలా మామూలే… కనుక చిజలమ్‌కి నువ్వేం చెప్పాలంటే ‘‘స్త్రీలను పూజించడం కాదు, మీతో సమానమైన వ్యక్తులుగా చూడండి. పూజించడం అనే మాటలో వాళ్ళు స్త్రీలు కనుక మనం వాళ్ళను ‘దయగా చూడాలి’ అనే అంతరార్థం ఉంటుంది. నాకు ‘శౌర్యం (జష్ట్రఱఙaశ్రీతీవ)’ అనే మాట గుర్తొస్తోంది. పురుషుల శౌర్యమే స్త్రీల బలహీనత.
7. ఏడవ సూచన : వివాహం అనేది తను సాధించాల్సిన గొప్ప విషయం అని చిజలమ్‌కి ఎప్పుడూ చెప్పకు. అదొక గొప్ప విషయమూ కాదు, జీవిత ధ్యేయమూ కాదు. వివాహం ఒక్కొక్కప్పుడు సంతోషదాయకంగా ఉండొచ్చు, ఒక్కొక్కప్పుడు విచారకరంగానూ ఉండవచ్చు. కానీ దానికదే మన జీవిత ధ్యేయం కాదు. మగపిల్లలకి మనం ఎప్పుడూ పెళ్ళి జీవిత గమ్యం అని చెప్పం. అంటే మొదటినుంచీ మనం ఇద్దరిమధ్యా ఒక సమతూకం లేకుండా పెంచుతాం. ఆడపిల్లలు పెళ్ళి గురించిన ధ్యాసతోనే స్త్రీలవుతారు. మగపిల్లలు అలాంటి ఆలోచనలతో పురుషులుగా మారరు. ఈ స్త్రీలు ఆ పురుషులని పెళ్ళి చేసుకుంటారు. అప్పుడు వాళ్ళమధ్య ఉండే సంబంధంలో ఒక సమతూకం ఉండదు. ఒకరికి వివాహ వ్యవస్థ మీద ఎక్కువ నమ్మకం, మరొకరికి అసలు లేదు. కనుకనే వివాహంలో స్త్రీలు ఎక్కువ త్యాగాలు చేస్తారు, ఎక్కువ నష్టపోతారు. ఆ అసమానత్వాన్ని వాళ్ళు నిరంతరం మోస్తూ ఉండాలి. ఈ అసమానత్వానికి పర్యవసానంగా ఇద్దరు స్త్రీలు బాహాటంగా ఒక పురుషుడి గురించి పోట్లాడుకుంటూ ఉంటే ఆ పురుషుడు గుడ్లప్పగించి చూస్తూ ఉంటాడు.
హిల్లరీ క్లింటన్‌ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు ట్విట్టర్‌లో ఆమె గురించిన మొదటి పరిచయ వాక్యం ‘‘క్లింటన్‌గారి భార్య’’. ఆయన పోటీ చేసినప్పుడు బిల్‌ క్లింటన్‌ గురించి ‘‘వ్యవస్థాపకుడు’’ అని వ్రాశారు, కానీ ‘‘భర్త’’ అని వ్రాయలేదు (ఇందువల్లనేమో తమను తాము ఫలానా వారి ‘భర్త’లుగా పరిచయం చేసుకునే వాళ్ళంటే నాకు గౌరవం). కానీ ఇదంతా మనకి చాలా సాధారణమైన విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచం స్త్రీల విషయంలో అన్నిటికన్నా ముందు వారి వైవాహిక స్థితిని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. గృహిణిత్వమూ, మాతృత్వమూ స్త్రీకి ఎప్పటికీ గౌరవనీయాలే. తప్పనిసరి విధులే.
1975లో బిల్‌ క్లింటన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె తన పేరు హిల్లరీ రోఢమ్‌గానే ఉంచుకుంది. కానీ తరువాత తన పేరుకు క్లింటన్‌ను కలిపింది. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడుల వలన రోఢమ్‌ను వదిలిపెట్టేసి హిల్లరీ క్లింటన్‌ మాత్రమే అయింది. క్లింటన్‌ భార్య తన స్వంత పేరు ఉంచుకుంటే అతనికి ఓట్లు తగ్గిపోతాయేమో మరి.
ఇది చూసిన తరువాత అమెరికన్‌ ఓటర్లు వివాహ వ్యవస్థ గురించి ఎంత తిరోగమన మార్గంలో ఉన్నారో అర్థమైంది. ఇక్కడ నా పేరుతో నాకైన అనుభవం కూడా చెప్పాలి. నాకు వివాహమైన తర్వాత ఒక పత్రికా విలేఖరి నా పేరును శ్రీమతి ‘‘భర్త ఇంటిపేరు’’గా మార్చాలని చూశాడు. అప్పుడు నేను అది నా పేరు కాదని గట్టిగా చెప్పాను. ఆ సంఘటనపై చాలామంది నైజీరియన్‌ స్త్రీలు నన్ను దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ఎక్కువ వ్యతిరేకించింది స్త్రీలే. వాళ్ళు నన్ను ఆ పేరుతో పిలవడం మొదలుపెట్టారు నా నోరుమూయించడానికన్నట్లు. నాకు ఆశ్చర్యం కలిగింది. బహుశా సమాజంలో స్థిరపడి ఉన్న సంప్రదాయాన్ని నేను సవాలు చేస్తున్నట్లు వాళ్ళు భావించి ఉండాలి.
కొంతమంది స్నేహితులు ‘‘నీ పేరు ఉంచుకున్నావు బాగానే ఉంది. సఫలమయ్యావు’’ అన్నారు. తన పేరు తను
ఉంచుకోవడం కూడా ఒక విజయమా అనిపించింది విస్మయంతో పాటు…
నిజానికి నా పేరు నేను ఉంచుకున్నందుకు విజయవంతురాలిని కాలేదు. నేను ఒక పేరొందిన రచయితను కాకపోయినా నా పేరునే ఉంచుకునేదాన్ని. నా పేరు ఎందుకు ఉంచుకున్నానంటే అది నా పేరు కనుక, నా పేరంటే నాకు ఇష్టం కనుక.
కొంతమంది ఇలా కూడా వాదిస్తారు, ‘‘నీ ఇంటి పేరులో కూడా పితృస్వామ్యం ఉంది. అది మీ నాన్న ఇంటిపేరు కాదా?’’ అని. కానీ ఒక సంగతి. ఆ ఇంటిపేరు మా నాన్న దగ్గరనుంచీ రానీ, చందమామ నుంచీ రానీ, అది నాకు పుట్టినప్పటి నుంచీ ఉంది. నేను కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌కి వెళ్ళినప్పటి అనేక మైలురాళ్ళు దాటి వచ్చినదాకా ఉంది. ఎన్సుక్కాలో ఒక పొద్దున్న నేను బడిలో చేరినప్పుడు మా ఉపాధ్యాయురాలు హాజరు పిలుస్తూ, మీ పేరు పిలిచినప్పుడు ‘ప్రెజెంట్‌’ అని చెప్పండి అంది. నెంబర్‌ వన్‌ ‘‘అడిచే’’.
ముఖ్యంగా ప్రతి స్త్రీకి తన ఇంటిపేరు ఉంచుకునే ఎంపిక ఉండాలి. కానీ సమాజ నియమాలకి కట్టుబడి ఉండాలనే ఒత్తిడి చాలా ఎక్కువ. కొంతమంది స్త్రీలకి తన భర్త ఇంటిపేరు పెట్టుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఉండదు. కానీ సమాజ నియమాలకు ఎదురీదాలంటే చాలా మానసిక, భావోద్వేగ, శారీరక శక్తి కావాలి. అలా పెళ్ళికాగానే ఇంటిపేరు మార్చుకోమంటే ఎంతమంది పురుషులు ఒప్పుకుంటారు?
శ్రీమతి (మిసెస్‌) అనే టైటిల్‌ నాకు ఇష్టముండదు. ఎందుకంటే నైజీరియన్‌ సమాజం ఆ పదానికి చాలా విలువ ఇస్తుంది. ఈ పదం పక్కనుండడం ఒక గర్వకారణంగా భావిస్తారు చాలామంది నైజీరియన్‌ స్త్రీ, పురుషులు. అది లేకపోవడం ఒక లోపంగా కూడా చూస్తారు. ఈ పదం పేరు ముందు తగిలించుకోవడమనేది మన ఎంపిక కావాలి, కానీ బలవంతంగా మనమీద సంస్కృతి పేరు మీద రుద్దడం కంపరం కలిగిస్తుంది. శ్రీమతి అనే పదానికి మనం ఇచ్చే విలువను బట్టి వివాహం సమాజంలో స్త్రీల హోదాను మారుస్తుంది కానీ పురుషుల హోదా మారదు. అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కొంతమంది స్త్రీలు తమ భర్తలమీద ఫిర్యాదు చేస్తూ ఉంటారు,
వాళ్ళు వివాహమయినా ఇంకా అవివాహితుల్లాగే ప్రవర్తిస్తారని. ఒకవేళ మన సమాజం పురుషులను కూడా వాళ్ళ ఇంటిపేర్లు మార్చుకోమని తమ పేర్ల పక్క మిస్టర్‌ అని కాక ఇంకా ఏదో పెట్టుకోమనీ అంటే వాళ్ళప్రవర్తన కూడా మారుతుందేమో! హ హ హ… మాస్టర్‌ డిగ్రీ సంపాదించిన ఇరవై ఎనిమిదేళ్ళ వయసున్న నువ్వు ఉన్నట్లుండి ఇజువాలే ఇజు అనే పేరు మార్చుకుని మిసెస్‌ ఇజువాలే ఉడుగ్వేనమ్‌గా మారావనుకో, పాస్‌పోర్ట్‌లు, లైసెన్స్‌లు మార్చుకునే శక్తి కాక ఈ కొత్త మార్పుని స్వీకరించే మానసిక శక్తి కూడా కావాలి. పురుషులకు కూడా ఇలాంటి మార్పు అవసరమైనప్పుడు మనకి అది అంత కష్టం అనిపించదు. మిసెస్‌కు బదులుగా నేను వీం అని పెట్టుకోవడం ఇష్టపడతాను. ఎందుకంటే అది వీతీ తో సమానంగా ఉంటుంది. వివాహితుడైనా అవివాహితుడైనా పురుషుడిని మనం వీతీ అనే అంటాం. అలాగే వివాహిత అయినా, అవివాహిత అయినా స్త్రీని వీం అనడం సబబు.
కనుక స్త్రీ పురుష సమానత్వాన్ని మన్నించే సమాజంలో వివాహం కాగానే స్త్రీల హోదాలో, పేర్లలో మార్పులు
ఉండకూడదని చిజలమ్‌కి చెప్పు. ఒక కొత్త సూచన చేస్తాను. వివాహం కాగానే ఆ కొత్త దంపతులు కొత్త ఇంటిపేరు పెట్టుకోవాలి, ఇద్దరికీ సమ్మతమైనప్పుడే. అప్పుడు ఇద్దరు చేతులు పట్టుకుని జంటగా పాస్‌పోర్ట్‌ ఆఫీసులకి, డ్రైవింగ్‌ లైసెన్సులకి బ్యాంక్‌ అకౌంట్‌లకి, సంతకాలకి వెళ్ళవచ్చు.
8. ఎనిమిదవ సూచన : ‘‘ఇతరుల మెప్పు కోసం మనం’’ అనే విషయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించమని చిజలమ్‌కి చెప్పు. అందరికీ నచ్చేలా ఉండడం తన కర్తవ్యం కాదు. తనకి నచ్చినట్లు తను ఉండాలి. నిజాయితీగా ఉంటూ ఇతరుల సమానత్వాన్ని గౌరవించేలా ఉండాలి. నేను చేసే పనినీ, మాట్లాడే మాటనీ జనం మెచ్చరని చాలాసార్లు మన నేస్తం చియోమా నాతో అంటూ ఉండేది. అప్పుడు నాకు చాలా చిరాకు కలిగేది. అమూర్త రూపం అయిన ఈ ‘‘జనం’’ అనే పదం చియోమా రూపంలో నన్నొక మూసలోకి తొయ్యడానికి ఒత్తిడి చేస్తోందనిపించేది. మనకి సన్నిహితులైన వారు మనని ప్రోత్సహించడానికి బదులు నిరుత్సాహపరుస్తుంటే చిరాకే కదా. నీ కూతురిమీద ఇటువంటి ఒత్తిడి ఎప్పుడూ పెట్టకు. మనం ఆడపిల్లలకి అందరికీ నచ్చేలా, సుకుమార సుందరంగా ఉండాలని బోధిస్తాం. ఆ విధంగా వాళ్ళు తప్పుడు విలువలు నేర్చుకుంటారు. మగపిల్లలకి ఇవీ నేర్పం. ఇది చాలా ప్రమాదకరమైన శిక్షణ. ఆడపిల్లలను వేధించే వారికీ, వాళ్ళమీద అఘాయిత్యాలు చేసేవారికీ ఈ శిక్షణ బాగా ఉపయోగిస్తుంది. తమని పురుషులు దుర్భాషలాడినా, అసహ్యంగా ప్రవర్తించినా మౌనంగా ఉండిపోతారు చాలామంది ఆడపిల్లలు. నాజూగ్గా ఉండడానికి మన్నన పొందే విధంగా ఉండడానికి చాలా సమయం వెచ్చిస్తారు. తమకి హాని తలపెట్టే వారితో కూడా కఠినంగా ప్రవర్తించలేరు. తమని కష్టపెట్టిన వాళ్ళ భావాల గురించి కూడా ఆలోచిస్తారు ఇలాంటివాళ్ళు. మెప్పుదల కోసం అర్రులు చాచడంలో జరిగే విధ్వంసం ఇది. లోకంలో చాలామంది స్త్రీలు గట్టిగా ఊపిరి కూడా విడవలేరు. ఎందుకంటే వాళ్ళు మెప్పుదల కోసం రకరకాల మూసల్లో ఒదిగిపోయారు.
కనుక చిజలమ్‌కి లోకపు మెప్పుదల కాదు కావలసింది, నిజాయితీగా ఉండడం, దయగా ఉండడం, ధైర్యంగా
ఉండడం, తన మనసులో మాట ధైర్యంగా చెప్పడం నేర్పు. నిజం చెప్పడం నేర్పు. తను అలా చెప్పినప్పుడు మెచ్చుకుంటూ ఉండు. తను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఎంత కష్టమైనదైనా సరే లోకరీతికి భిన్నమైనదయినా సరే తనని మెచ్చుకో. ఎందుకంటే ఆమె నిర్ణయంలో నిజాయితీ ఉంటుంది కనుక. కరుణ ముఖ్యం అని చెప్పు. ఆమె ఎవరిపట్ల అయినా దయగా ప్రవర్తించినప్పుడు మెచ్చుకో. కానీ ఆమె దయా స్వభావాన్ని ఇతరులు అలుసుగా తీసుకోకూడదు. తనతో కూడా ఇతరులు దయగా ప్రవర్తించాలని చెప్పు. ఏదీ ఒకేవైపు కాదు. పరస్పరం కావాలి. తనకు కావలసిన దాని గురించి రావలసినదాని గురించి గట్టిగా అడగాలని చెప్పు. దానికోసం గట్టిగా నిలబడాలని చెప్పు. తన ఆటవస్తువు మరొకరు తన అనుమతి లేకుండా తీసుకుంటే దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పు. తన అనుమతి ముఖ్యం. తనకి ఎప్పుడైనా అసౌకర్యం కలిగితే ఆ సంగతి చెప్పాలి, వినకపోతే అరిచి చెప్పాలి.
తనను అందరూ ఇష్టపడాలనే నియమం ఏదీ లేదని చెప్పు. తను ఒకరికి నచ్చకపోతే, తనను ఇష్టపడేవాళ్ళు ఇంకొకరు
ఉంటారు. ఇష్టపడడానికీ, పడకపోవడానికీ తను ఒక వస్తువు కాదని చెప్పు. తను ఒక వ్యక్తి. తను కూడా ఎవరినైనా ఇష్టపడవచ్చు, పడకపోవచ్చు. ఆ హక్కు తనకి ఉంది. కౌమారంలో ఎవరైనా మగపిల్లలకి తను నచ్చలేదని ఏడుస్తూ ఇంటికి వస్తే, వాళ్ళు కూడా తనకి నచ్చలేదని చెప్పమను. అది కష్టమే. ఎందుకంటే మన సెకండరీ స్కూల్లో నేను న్నమ్డీ అనే అతన్ని ఇష్టపడేదాన్ని. కానీ అప్పుడు ఎవరైనా నాకిలా చెబితే బాగుండేదని ఇప్పుడు కూడా అనుకుంటాను.
9. తొమ్మిదవ సూచన : చిజలమ్‌కి ఒక గుర్తింపు ఇవ్వు. అది చాలా అవసరం. ఆ విషయం గురించి స్పష్టంగా చెప్పు. మిగతా విషయాలతో పాటు తనని తను ఒక ఇగ్బో అమ్మాయినని గర్వంగా చెప్పుకునేలా చెయ్యి. ఆ విషయంలో నువ్వు కొన్ని ఎంపికలు చేసుకో. ఇగ్బో సంస్కృతికి చెందిన అంశాలను స్వంతం చేసుకోమని, కానీ వాటిని దూరం పెట్టమని చెప్పు. ఆయా సందర్భాలను బట్టి చెబుతూ
ఉండు ‘‘ఇగ్బో సంస్కృతి ప్రేమాస్పదమైనది, ఎందుకంటే అందులో కష్టపడి పనిచేసే తత్వం, ఏకాభిప్రాయాలకు ప్రయత్నించడం, సమాజాన్ని గౌరవించడం వంటి మంచి లక్షణాలున్నాయి. అంతేకాదు ఇగ్బో భాష, అందులోని నానుడులు, సామెతలూ విజ్ఞానదాయకమైనవని చెప్పు. కానీ ఇగ్బో సంస్కృతిలో స్త్రీలకు కొన్ని నిషేధాలున్నాయి కేవలం స్త్రీ అయినందువల్ల. అది తప్పని చెప్పు. ఇగ్బో సంస్కృతి భౌతిక వాదానికి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. డబ్బు ముఖ్యమే, డబ్బుతో ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. కానీ డబ్బుని బట్టి మనుషులను గౌరవించకూడదని చెప్పు.
ఆఫ్రికన్‌ ప్రజల పట్టుదల, నల్లజాతి ప్రజల సౌందర్యం గురించీ స్పష్టంగా చెప్పు. ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తున్న రాజకీయ ప్రభావాల వలన, తను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శ్వేతజాతీయుల శక్తి, క్రియాశీలత, వారు సాధించిన విషయాలు, వారి చర్మపు రంగులో సౌందర్యం మొదలైన వాటి గురించి వింటూ, చూస్తూ పెరుగుతుంది. తను చూసే టీవీ కార్యక్రమాల్లో తను మెసలుతున్న సాధారణ సంస్కృతిలో, తను చదివే పుస్తకాలలో అంతా తెల్లవారి ప్రభావమే. ఆఫ్రికా గురించీ, నల్ల వారి గురించీ ప్రతికూల భావాలు కూడా వింటూ పెరగవచ్చు.
ఆఫ్రికన్‌ ప్రజల చరిత్ర గురించి గర్వంగా భావించేలా చెప్పు. విదేశాలలో స్థిరపడిన ఆఫ్రికన్‌ ప్రజల గురించి చెప్పు. చరిత్రలో ఘనత సాధించిన నల్లజాతి స్త్రీ, పురుషుల గురించి చెప్పు. అలాంటి వారు ఉన్నారు. తమ స్కూల్లో నైజీరియా గురించి ఏదైనా ప్రతికూల విషయం నేర్చుకొని వచ్చి నీకు చెబితే దాన్ని వెంటనే ఖండిరచు. నైజీరియా చరిత్రలో మనం గర్వపడే అంశాలేవీ వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో పొందుపరిచి లేవు. తనకి స్కూల్లో ఉపాధ్యాయులు లెక్కలు, సైన్సు, కళలు, సంగీతం బోధిస్తారు. నువ్వు ఆత్మగౌరవం నేర్పాలి. సమాజంలో కొందరికి ఉన్న అనుకూలతలు, హక్కులు, ఇంకొందరికి ఉన్న అసమానత్వం గురించి చెప్పు. తనకు హాని తలపెట్టని వారందరినీ గౌరవించడం నేర్పు. మన ఇంట్లో పనిచేసే వ్యక్తి కూడా మనలాగే ఒక మనిషి అని చెప్పు. మీ డ్రైవర్‌కి కూడా అందరిలాగే అభివాదం చెయ్యమని చెప్పు. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వ నిర్మాణంలలో ఒక భాగమే. తనతో ఇలాచెప్పు ‘‘మనకుటుంబంలో నీకన్నా పెద్దవాళ్ళను వాళ్ళ ఉద్యోగంతో సంబంధం లేకుంలడా గౌరవించు.’’
తనకి ఒక ఇగ్బో ముద్దుపేరు కూడా పెట్టు. నేను పెరిగే వయసులో మా అత్త గ్లాడిస్‌ నన్ను ‘‘అదా ఒడోబో డైకే’’ అని పిలిచేది. ఆ పేరు నాకు చాలా ఇష్టంగా ఉండేది. అసలు మా స్వంత ఊరు ఎజి… అబ్భా, అంటే వీరుల భూమి అని. వీరుల భూమి పుత్రికా అని పిలిపించుకోవడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది!!
10. పదవ సూచన : ఆమె ప్రవర్తన, అభిరుచుల విషయంలో స్పష్టంగా ఉండు. క్రీడల్లో ఆసక్తిని పెంచు. భౌతిక వ్యాయామం చాలా అవసరం. తనతో పాటు ఈత కొట్టు. పరిగెత్తు. టెన్నిస్‌ ఆడు. ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, అలా ఏదో ఒకటి ఆడు. ఆటల వలన ఆరోగ్యం బాగుండడం ఒకటే కాదు ఆడపిల్లల శరీరాల మీద సమాజం కలిగించే అభద్రతలు తొలగిపోతాయి కూడా. ఎప్పుడూ చురుకుగా ఉండడంలో చాలా లాభాలున్నాయని చిజలమ్‌ తెలుసుకోవాలి. ఆడపిల్లలు పెద్దమనుషులయ్యాక ఆటలు మానేస్తారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వక్షోజాల గురించి వాళ్ళకి ఒక ఎరుక కలగడం వలన కూడా ఆటలు మానేస్తారు. నేను కూడా అలాగే ఫుట్‌బాల్‌ ఆడడం మానుకున్నాను. నా వక్షోజాలను దాచిపెట్టుకోవడమే ఒక పనిలా అనిపించేది. పరిగెట్టేటప్పుడు అది కుదరదు. తను అలా కాకుండా చూసుకో. పెద్ద మనుషులు కావడం, వక్షోజాలు పెరగడం అంతా ప్రకృతి సహజం.
తనకి మేకప్‌ వేసుకోవాలనిపిస్తే వేసుకోనియ్‌. తనకి ఫ్యాషన్‌ ఇష్టమైతే అలాగే దుస్తులు ధరించనియ్‌. ఇవేవీ తనకి ఇష్టం లేకపోతే అలాగే ఉండనియ్‌. తనని ఒక స్త్రీవాదిగా పెంచడం అంటే స్త్రీత్వాన్ని మర్చిపొమ్మని కాదు. స్త్రీవాదమూ, స్త్రీత్వమూ విరుద్ధమైనవి కావు. ఆ రెండూ వేరు అనడం స్త్రీని ద్వేషించడం కిందకు వస్తుంది. సంప్రదాయపరంగా స్త్రీలు కోరుకునే వాటిని, అంటే అలంకరించుకోవడం వంటివి మనం తిరస్కరించడం విచారకరం. అయితే సంప్రదాయం ప్రకారం పురుషులు కోరుకునేవి ఏవీ అనుసరించడానికి పురుషులు సిగ్గుపడరు. కార్లు కొనుక్కోవడం ఖరీదైన క్రీడలలో పాల్గొనడం లాంటివి. సమాజం కూడా వాళ్ళపైన ఎటువంటి నిషేధాలూ విధించదు. స్త్రీల అలంకరణ గురించి చేసే వ్యాఖ్యలు పురుషుల అలంకరణ గురించి చెయ్యరు. పురుషులు మంచి దుస్తులు వేసుకుని బాగా తయారైనా వాళ్ళ తెలివితేటల మీద, సామర్ధ్యం మీద ఎవరూ వ్యాఖ్యానించరు. అదే ఒక స్త్రీ మెరిసే లిప్‌స్టిక్‌ వేసుకున్నా, మంచి దుస్తులు వేసుకున్నా ఆమెను చులకనగా చూస్తారు.
ఎప్పుడూ కూడా చిజలమ్‌ దుస్తులకూ, ఆమె నైతికతకూ ముడిపెట్టకు. పొట్టి స్కర్ట్‌ వేసుకోవడం నీతి కాదని చెప్పకు. మన ఆహార్యం మన అభిరుచిని, ఆకర్షణనీ సూచిస్తుంది. కానీ మన నైతికతను కాదు. తన దుస్తుల విషయంలో ఎప్పుడైనా మీ ఇద్దరికీ వాదన వస్తే ‘‘నువ్వొక వేశ్యలా కనిపిస్తున్నావు’’ అని ఎప్పుడూ అనకు. ఎందుకు చెబుతున్నానంటే ఒకసారి మీ అమ్మ నిన్ను అలా అన్నది. ఇలా అను ‘‘ఈ బట్టలు నీకు మిగతా వాటిలా అందాన్ని ఇవ్వవు’’ అను. లేకపోతే నీకు బాగా అమరవు అని చెప్పు. అదీ కాకపోతే చూడ్డానికి బాగాలేవు అని చెప్పు. ఎప్పుడూ కూడా బట్టలకీ, నీతికీ ముడిపెట్టకు. నీతికీ, బట్టలకీ అసలు సంబంధం లేదు కనుక.
మరొక విషయం. జుట్టుకీ బాధకీ సంబంధం లేదు. నాకింకా గుర్తుంది. నా ఒత్తైన పొడవాటి జుట్టును జడలు అల్లేటప్పుడు ఎన్నిసార్లు ఏడ్చానో. నా తల దువ్వేటపుడు నా ముందర చాక్లెట్లు పెట్టేవాళ్ళు. ఎందుకు? మనచిన్నప్పుడు, కౌమారంలో తల దువ్వించుకోవడానికి ఎన్ని శనివారాలు వ్యర్థం చేశామో కదా? అ సమయంలో ఏం చేసి ఉండవచ్చు? అబ్బాయిలు శనివారాలు ఏం చేస్తారు? తల ‘‘శుభ్రంగా’’ పెట్టుకోవడం అనే దానికి నువ్వు వేరే అర్థం చెప్పు. చాలా గట్టిగా పుర్రె పగిలిపోయేలా, తల నరాలు తెగేలా లాగి లాగి దువ్వడం శుభ్రత కాదు.
ఈ శుభ్రతకి నిర్వచనాన్ని మనం మార్చాలి. నైజీరియాలో స్కూళ్ళల్లో చాలామంది ఆడపిల్లలు జుట్లు శుభ్రంగా లేవని వాళ్ళని ఏడిపిస్తూ ఉండడం చూశాను. ఎందుకంటే వాళ్ళకు స్వతహాగా వచ్చిన జుట్టు వంకులు తిరిగి నుదుటి మీదికి జారుతూ ఉంటుంది. చిజలమ్‌ జుట్టును వదులుగా అల్లు. మరీ బిగించకు. పెద్ద జడలు పెద్ద వరసలు వెయ్యి. మన జుట్టు తీరుని దృష్టిలో పెట్టుకుని తయారు చెయ్యని చిన్న చిన్న పళ్ళున్న దువ్వెనలు వాడకు. నీ ఉద్దేశంలో అదే నీట్‌గా ఉండడం అని చెప్పు. చిజలమ్‌ని ఎవరైనా ఏడిపిస్తే స్కూలు యాజమాన్యంతో మాట్లాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మార్పుకి నాంది కావాలి కదా!! చిజలమ్‌కి అప్పుడే తెలిసిపోతుంది, ఎటువంటి అందాన్ని ప్రధాన స్రవంతి ప్రపంచం కోరుతుందో. పిల్లలకు గ్రహణ శక్తి ఎక్కువ. అవన్నీ తను పత్రికలలో, సినిమాలలో, టీవీలో చూస్తుంది కదా! తెల్లగా ఉండడానికి విలువ, వంకీలు లేకుండా సాదాగా ఉండే జుట్టుకే విలువ. నిక్కబొడుచుకునే జుట్టుకంటే క్రిందకు జారే జుట్టుకే విలువ. నీకు నచ్చినా నచ్చకపోయినా తనకి ఇవన్నీ తెలుస్తాయి. అందుకని తను చూసేదానికి ప్రత్యామ్నాయం ఆలోచించు. సన్నగా, తెల్ల్గగా ఉండేవాళ్ళు అందంగా ఉంటారు. కానీ అంత నాజూగ్గా తెల్లగా లేనివాళ్ళు కూడా అందంగా ఉంటారని చెప్పు. ప్రధాన స్రవంతి నిర్వచనానికి వేరుగా అనేక జాతుల దేశాల ప్రజలు ఉన్నారని చెప్పు. తన అందాన్ని గురించి తనకొక దృఢమైన అభిప్రాయం ఉండాలి. తన రూపం గురించి తనకు అసంతృప్తి కలగకుండా నువ్వు కాపాడుకోవాలి.
తను ఎవర్నయితే ఇష్టపడుతుందనుకుంటావో ఆ అత్తల్ని, పిన్నమ్మల్నీ అమెను ఎక్కువ కలిసేలా చూడు. వాళ్ళను నువ్వెంత అభిమానిస్తావో చెప్పు. పిల్లలు ఎక్కువగా పెద్దల్ని అనుకరిస్తారు. నేనైతే ఎక్కువగా ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీవాది ఫ్లోరిన్స్‌ కెన్నెడీనిన అభిమానిస్తాను. నేనైతే ఎక్కువగా ఆఫ్రికన్‌ అమెరికన్‌లైన అమా ఆటా అయిడూ, డోరా అకున్యిలు, ముతోని లికుమాన్యి న్గొజి ఒకోన్జో, ఇవిఎలా, టైవో, అజైలిసెట్‌ గురించి చెబుతాను. స్త్రీ వాదానికి స్ఫూర్తిదాయినులైన చాలామంది ఆఫ్రికన్‌ అమెరికన్‌ స్త్రీలున్నారు. వీరు ఏం చేశారో, ఏమి తిరస్కరించారో, మనకి తెలుసు. మీ అమ్మమ్మనే తీసుకో ఆవిడ మాట ఎంత పదునో మనిషి ఎంత శక్తివంతురాలో. చిజలమ్‌కి మన మామయ్యలనీ, బాబాయిలనూ కూడా చూపించు. నీ సహచరుడికున్న స్నేహితులతో ఇది కష్టం కావచ్చు. ఒకసారి అతడి పుట్టినరోజు పండగనాడు వచ్చిన ఆ మోటు మనిషిని నేనెప్పుడూ మర్చిపోలేను. అతనేమన్నాడో గుర్తుందా? ‘‘నేను పెళ్ళి చేసుకోబోయే ఏ పిల్లయినా సరే నేనేం చెయ్యాలో నాకు చెప్పకూడదు’’ అన్నాడు.
కనుక కొంతమంది సంస్కారవంతులైన పురుషులను ఎంపిక చేసి చిజలమ్‌కి పరిచయం చెయ్యి. అంటే నీ సోదరుడు ఉగోమ్బా, మన స్నేహితుడు చినకూజే లాంటి వాళ్ళు. ఎందుకంటే తను ముందు ముందు చాలామంది పిచ్చి వాగుడు మగవాళ్ళను ఎదుర్కోవలసి
ఉంటుంది. ఇప్పటినుంచే వీళ్ళకి ప్రత్యామ్నాయాలైన సంస్కారవంతులైన మగవాళ్ళను పరిచయం చెయ్యి. వాళ్ళ ప్రభావం గురించి అతిగా మాట్లాడను కానీ ఇలా చేస్తే, తనకి ముందు ముందు స్త్రీల గురించిన మూస పాత్రల మాటలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది. ఆడవాళ్ళే వంట చెయ్యాలి అని ఎవరైనా అంటే వంట చేసే ఏ మామయ్యో గుర్తొచ్చి ‘‘ఏం కాదు’’ అని కొట్టిపారేస్తుంది. అటువంటి తెలివితక్కువ మాటలను అసలు పట్టించుకోదు.
11. పదకొండవ సూచన : మన సంప్రదాయాల పేరుతో స్త్రీల శారీరక నిర్మాణాన్ని తమకు వీలైనట్లుగా ఉపయోగించడాన్ని ఖండిరచడం మీ అమ్మాయికి నేర్పు.
యేరూబా తెగకు చెందిన ఒక అమ్మాయి ఇగ్బో అబ్బాయిని వివాహం చేసుకుంది. వాళ్ళ ప్రథమ సంతానానికి నామకరణం చేసే విషయంపై వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అన్నీ ఇగ్బో పేర్లే వచ్చాయి. బిడ్డ ఇంటిపేరు తండ్రిది అయినప్పుడు మొదటిది యేరూబా పేరు కావచ్చు కదా? నేను ఆ అమ్మాయికి ఇట్లా సూచించినప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? ‘‘బిడ్డపై మొదటి హక్కు తండ్రిదే అదలాగే ఉండాలి’’ అంది.
మనం జీవశాస్త్రాన్నీ, శారీరక నిర్మాణాన్నీ ఉపయోగించుకుని పురుషాధిక్యతను సమర్ధిస్తున్నాం. వాళ్ళు శారీరకంగా బలవంతులే కావచ్చు. కానీ నిజంగా జీవశాస్త్రం ప్రకారం సంప్రదాయాలు ఏర్పడ్డాయనుకున్నా కూడా, బిడ్డపైన తల్లిదే మొదటి హక్కు. ఎందుకంటే తల్లి జన్మనిస్తూ ప్రత్యక్షంగా కనిపించే వ్యక్తి. తండ్రి తల్లి మాట మీద ఏర్పడే ఒక నమ్మకం. ఈ ప్రపంచంలో ఎన్ని వంశాలు నిజంగా జీవశాస్త్ర సంబంధమైనవి అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది ఇగ్బో స్త్రీల మెదళ్ళు తండ్రే బిడ్డకు హక్కుదారుడు అని నియంత్రించబడ్డాయి. వివాహంలో అన్యోన్యత లేనందువలన స్త్రీ పురుషులు వేరుపడితే బిడ్డలపై హక్కు పురుషుడికే ఉంటుంది కానీ స్త్రీలకు ఉండదు. బిడ్డల్ని చూసి పోయే అవకాశం కూడా స్త్రీలకి ఇవ్వరు. మనం జీవశాస్త్ర పరిణామాల గురించి మాట్లాడేటపుడు పురుషులకున్న వివాహేతర సంబంధాల గురించి మాట్లాడతాం కానీ స్త్రీల సంబంధాల గురించి మాట్లాడం. స్త్రీలకు కూడా అలాంటి సంబంధాలున్నప్పుడు బిడ్డలు బ్రతికి బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ అది నిషిద్ధం.
జీవశాస్త్రం చాలా ఆసక్తికరమైన విజ్ఞాన శాస్త్రం అని చిజలమ్‌కి చెప్పు. కానీ సమాజంలో ఉండే కట్టుబాట్లకూ సంప్రదాయాలకూ అదే మూలమని చిజలమ్‌ నమ్మకూడదు. సంప్రదాయాలూ, కట్టుబాట్లూ మనుషులు ఏర్పరచుకున్నవే గానీ విజ్ఞాన శాస్త్రం ఏర్పరచినది కాదు. అదీకాక మనం మార్చలేని సంప్రదాయం అంటూ ఉండదు.
12. పన్నెండవ సూచన : చిజలమ్‌కి లైంగికత గురించి అర్థం చేయించు, అది కూడా చిన్నప్పుడే. కొంచెం ఇబ్బందిగా ఉండే మాట నిజమే కానీ చాలా అవసరం.
నీకు గుర్తుండే ఉంటుంది. మనం మూడవ తరగతిలో ఉండగా ‘‘లైంగికత’’ అనే అంశం మీద ఒక సెమినార్‌ జరిగింది. అందులో అసలు విషయం పక్కన బెట్టి, మగపిల్లలతో మాట్లాడితే గర్భాలొస్తాయని, చెడ్డపేరు వస్తుందని హెచ్చరికలు చేశారు. నాకింకా గుర్తుంది ఆ హాలూ, ఆ సెమినారూ! సిగ్గుతో చచ్చిపోయాం!! వికారం పుట్టేలాగా! మనం ఆడపిల్లలమైనందుకు అలాంటి సిగ్గును భరించవలసి వచ్చింది. మీ అమ్మాయికి ఇటువంటి సందర్భం ఎప్పుడూ ఎదురు కాకూడదు.
శృంగారం అనేది కేవలం పునరుత్పత్తి కోసమేనని అబద్ధాలు చెప్పకు. కేవలం వివాహంలోనే అని కూడా నమ్మించకు. అది నిజం కాదు. మీ వివాహం కాకముందే నువ్వూ, నీ సహచరుడూ శారీరక సంబంధం కలిగి ఉన్నారు. మీ అమ్మాయికి ఆ సంబంధం సంగతి పన్నెండేళ్ళు వచ్చేసరికి తెలిసిపోతుంది. శృంగారం ఒక సుందరమైన విషయమనీ దాని భౌతికమైన, ఉద్వేగపరమైన పర్యవసానాలు ఆడపిల్లల మీద ఉంటాయనీ చెప్పు. ఇంకొకటి కూడా చెప్పు తన శరీరం మీద సర్వహక్కులూ తనవే, తన శరీరం తన స్వంతం. ఎంత ఒత్తిడికి గురైనా తనకి ఇష్టంలేని చర్యకి ఎప్పుడూ లోబడవద్దని చెప్పు. తనకి అయిష్టమైన విషయానికి ‘‘వద్దు’’ అని చెప్పడం గర్వించదగ్గ విషయం అని చెప్పు.
కౌమారం గడచి తనొక యువతి అయ్యేవరకూ శృంగారం అభిలషణీయం కాదని చెప్పు. కానీ తన గురించి తెలుసుకోవడానికి నువ్వు సంసిద్ధంగా ఉండు. తను అంతవరకూ ఆగలేకపోతే ఆ విషయం నీతో చెప్పేటట్లు చూసుకో. నీతో అన్ని విషయాలూ పంచుకునేలా అమ్మాయిని పెంచుతున్నానని సంబరపడకు. నీతో మాట్లాడేందుకు ఆమెకొక భాషని నేర్పు. తనేమి పదాలు వాడాలి? ఎలాంటి పదాలతో నీతో సంభాషించాలో నేర్పు.
నా చిన్నప్పుడు మలద్వారం గురించి చెప్పాలన్నా, యోని గురించి చెప్పాలన్నా ‘‘ఏక్‌’’ అనేదాన్ని అంటే అక్కడ దురద అనో ఏదో ఒకటి చెప్పాలంటే ‘‘ఏక్‌’’ అనేదాన్ని. పిల్లల అభివృద్ధి గురించిన నిపుణులు ఏమంటారంటే పిల్లలకు శరీరాంగాలన్నింటికీ వాటి జీవశాస్త్ర నామాలు చెప్పాలి అని. యోని అనీ, పురుషాంగం అనీ, అవి బయటికి చెప్పడానికి సిగ్గుపడకుండా. వాళ్ళు చెప్పింది ఒప్పుకుంటాను కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. జననాంగాలను ఏ పేర్లతో పిలిచినా అవి పలకడానికి సిగ్గుపడనక్కర్లేదు.
ఆమె నీ దగ్గరనుంచీ ‘‘సిగ్గుపడడం’’ అనేది వారసత్వంగా పొందకూడదు. నువ్వు కూడా మన పైతరం నుంచీ పొందిన ‘‘సిగ్గుపడడాన్ని’’ వదిలించుకోవాలి. అదెంత కష్టమో నాకు తెలుసు. ప్రపంచమంతట్లోనూ స్త్రీల లైంగికత సిగ్గుతోనే కూడి ఉంది. పశ్చిమ దేశాల్లో స్త్రీలు ‘సెక్సీ’గా ఉండాలంటాయి గానీ ‘సెక్స్యువల్‌’ గా ఉండాలని కోరవు.
స్త్రీల లైంగికతకు ఈ సిగ్గు అంటగట్టడం కేవలం వాళ్ళను కట్టడి చేయడానికే. చాలా మతాలూ, సంస్కృతులూ ఏదో విధంగా స్త్రీల శరీరాలను కట్టడి చేస్తాయి. ఈ కట్టడి స్త్రీల సంక్షేమం కోసమా అంటే కాదు. స్త్రీలు పొట్టి స్కర్ట్‌లు వేసుకుంటే క్యాన్సర్‌ వస్తుంది అంటే అది వేరే విషయం. ఇక్కడ అదికాదు, కారణం పురుషుల నుంచి రక్షణ కోసం మీరు శరీరాలు పూర్తిగా కప్పుకోవాలి. అది పురుషుల కోసం. ఇది పూర్తి అమానవీకరణ, ఇలా చెప్పడం స్త్రీలను కేవలం పురుషులలో ఆసక్తులు రేకెత్తించే వస్తువులు ఃజూతీశీజూంః గా చూడడం.
ఇక సిగ్గు గురించి: ఎప్పుడూ కూడా లైంగికతకూ, సిగ్గుకూ ముడిపెట్టకూడదు. నగ్నంగా ఉండడాన్ని కూడా సిగ్గుకి ముడిపెట్టకూడదు. ఎప్పుడూ కూడా ‘కన్యాత్వం’ మీదే దృష్టి పెట్టి మాట్లాడకూడదు. కన్యాత్వం గురించి వచ్చే ప్రతి సంభాషణలోనూ తప్పనిసరిగా ‘సిగ్గు’ ముడిపడి ఉంటుంది. సిగ్గుకూ, స్త్రీల శారీరక నిర్మాణానికి ముడి పెట్టడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించమని చెప్పు. మనం మన శరీర ధర్మాలననుసరించి వచ్చే నెలసరి గురించి గుసగుసగా ఎందుకు మాట్లాడాలి? మనం సిగ్గుపడాలనా ఆ రక్తపు మరక మనకి అంటుకుంది? నెలసరి అనేది సహజ సిద్ధమైన ప్రకృతి ధర్మం. అది లేకపోతే మానవజాతే లేదు. ఎప్పుడో ఒకతను ఇదొక పెంటలాంటిది అన్నాడు. ‘‘అవునుగాక! అయితేనేం అది పవిత్రమైన పెంట. అది లేకపోతే నువ్వు లేవు’’ అని చెప్పాను అతనికి.
13. పదమూడవ సూచన : పిల్లలు ప్రేమలో పడతారు, తప్పేమీ కాదు. ఆ సందర్భాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా
ఉండాలి. నేను ఇలా ఎందుకు రాస్తున్నానంటే తను సాధారణమైన స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణకు చెందిన (ష్ట్రవ్‌వతీశీంవఞబaశ్రీ) అమ్మాయిగా భావిస్తూ రాస్తున్నాను. ఒకవేళ తను భిన్నమైన లైంగిక స్వభావం కలిగి ఉండవచ్చు. కానీ ఈ సాధారణ లైంగికత గురించి మాట్లాడుకోవడం సౌకర్యంగా ఉంటుంది. తన జీవితంలో ఇలాంటివి జరుగుతున్నట్లు నీకు తెలుస్తోందని తను గ్రహించేలా చూడు. అందుకని తొలి దశల్లోనే నువ్వు ప్రేమ గురించి, సెక్స్‌ గురించి మాట్లాడడానికి ఒక భాష నేర్పు. తనకు నువ్వొక ‘‘స్నేహితురాలిగా’’
ఉండాలని చెప్పడంలేదు. నీతో ఏ విషయమైనా స్వేచ్ఛగా చెప్పగలిగిన తల్లిగా ఉండు.
ప్రేమించడమంటే కేవలం ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా తెలియాలని చెప్పు. ఎందుకంటే మనం ఆడపిల్లలకు వాళ్ళెలా
ఉండాలో సూచనాత్మకంగా చెబుతూ ఉంటాం. వాళ్ళు ప్రేమించడం అంటే తమను తాము త్యాగం చేసుకోవడమే అని అర్థం చేయిస్తాం. మగపిల్లలకు మనం ఇలా చెప్పం. ప్రేమ ఒక ఉద్వేగం. ఆ ఉద్వేగం అవతల వారిలో కూడా మనం కోరుకోవాలి. జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైనది. నువ్వు ప్రేమను ఎలా నిర్వచించినా సరే. ప్రేమ అత్యంత ప్రధానమైనది. మరొక మనిషికి మనం ఇచ్చే గొప్ప విలువ ప్రేమ, మరొక మనిషి నుంచీ మనం అందుకునే గొప్ప విలువ. కానీ మనం ప్రపంచంలో ఒక సగానికి దీన్ని నేర్పుతున్నాం. నేనొకచోట చాలామంది స్త్రీలు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. సంభాషణ మొత్తం పురుషుల గురించే. తమకు పురుషుల వలన జరిగిన అవమానాలు, దారుణాలు అవి. ఒకతను తనను ఘోరంగా మోసగించాడు. ఒకతను ఆమెతో అబద్ధాలు చెప్పాడు. ఒకతను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మళ్ళీ కనిపించకుండా మాయమైపోయాడు. తన భర్త ఇలా చేశాడు, అలా చేశాడు వగైరా…
దీనికి విరుద్ధంగా కొంతమంది పురుషులు ఒకచోట చేరి ఇలా మాట్లాడుకోరు. లక్ష్యం లేనట్లు మాట్లాడుకుంటారు గానీ ఇలా తమ తమ జీవితాలపై వాపోతూ మాట్లాడుకోరు. ఎందుకని?
దీనికి కారణం మనం చిన్నప్పటినుంచీ చేసే నియంత్రణ.
ఇటీవల ఒక పాపకు పేరు పెట్టే కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు పాపకు తమ దీవెనలను ఒక చిట్టీమీద వ్రాసి ఇవ్వమని అందర్నీ అడిగారు. ఒక అతిథి ‘‘పాపకు మంచి భర్త లభించాలి’’ అని రాశారు. సదుద్దేశమే కానీ, తరువాత చాలా కష్టాలు తెచ్చేది. ఒక మూడు నెలల పాపకు అప్పుడే పాప జీవితాశయం ఒక మంచి భర్త అని చెప్పడం. అదే ఒక పిల్లవాడు అయి ఉంటే ‘‘నీకు మంచి భార్య రావాలి’’ అని వ్రాయరు కదా?
ఇప్పుడు వివాహం చేసుకుంటానని నమ్మించి పారిపోయిన వాడి గురించి మాట్లాడదాం. ప్రపంచంలోని అనేక సమాజాలలో ఇప్పటికీ స్త్రీలు తమ వివాహం గురించి తామే మొదటగా ప్రతిపాదించడమనేది ఎక్కడా లేకపోవడం ఆశ్చర్యమే కదా? వివాహమనేది జీవితంలో అతి పెద్ద మెట్టు. దాని నిర్ణయం మనం తీసుకోక ఇంకా పురుషుడే ప్రతిపాదించాలనుకోవడం చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది స్త్రీలు ఎంతకాలం ఇష్టపడిన వారితో సంబంధాలలో ఉన్నా వివాహానికి పురుషులే ముందు ప్రతిపాదించాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎదురు చూపులు చివరికి ఒక ప్రహసనంగా మారతాయి. అవి ఒక్కొక్కప్పుడు వివాహానికి అనర్హమైనవి కూడా అవుతాయి. ఇక్కడ మనం స్త్రీవాదం ఉపయోగిస్తే పురుషుడితో సమానమైన హోదా లేక హక్కు గల స్త్రీ అతని కోసం అంతకాలం వేచి చూడడం కంటే జీవితంలో వెయ్యబోయే ఈ ముఖ్యమైన అడుగు గురించి తనే ముందు ప్రతిపాదించడం మంచిది. ఫెమినిజం లైట్‌ను అనుసరించే వ్యక్తి ఒకరు ఏమన్నారంటే ‘‘పురుషుడు ప్రతిపాదించినప్పుడు స్త్రీ సరేనంటేనే కదా వివాహం జరిగేది. కనుక స్త్రీకి హక్కు ఉన్నట్లే’’ అని. నిజం ఏమిటంటే ఎవరు ప్రతిపాదిస్తారో వారికే అధికారం ఉంటుంది. స్త్రీలు అవుననో కాదనో అనే ముందు పురుషులే అడగాలి. చిజలమ్‌ మనవలసిన సమాజం ఇది కాదు. అక్కడ ముందు ప్రతిపాదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అప్పుడు స్త్రీ పురుష సంబంధాల సంతోషప్రదంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. వివాహం గురించి చేసే సంభాషణ కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
డబ్బు గురించి కూడా ఒక మాట చెప్పదలచుకున్నాను. నా డబ్బు నా డబ్బే అతని డబ్బు మా ఇద్దరిదీ అని ఎప్పుడూ అనవద్దని చిజలమ్‌కు చెప్పు. అది చాలా నీచమైన పని. ప్రమాదకరమైనది కూడా. అటువంటి స్వభావం ఉంటే తక్కిన హానికరమైన ఆలోచనలు కూడా సాగుతాయి. పురుషుడికి పాత్ర పోషించడం కాదని చెప్పు. స్త్రీ పురుషుల మధ్య ఆరోగ్యకరమైన, ప్రేమపూరితమైన సంబంధం ఉండాలంటే ఎవరికి సంపాదించే శక్తి ఉందో వారు ఇల్లు నడపాలి కానీ పురుషుడొక్కడే కాదు.
14. పధ్నాలుగవ సూచన : అణచివేత గురించి ప్రస్తావించేటపుడు ఎప్పుడూ కూడా అణచివేతకు గురైన వాళ్ళు త్యాగశీలురనో, సాధ్వీమణులనో అనడకుండా జాగ్రత్తపడు. సాధుత్వం ఎప్పుడూ హుందాతనానికి మొదటి అర్హత కాదు. దయలేని వారు, నిజాయితీ లేనివారు కూడా మనుషులే. వారికీ ఒక మనసు ఉంటుంది. గ్రామీణ నైజీరియన్‌ స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలనేది ఫెమినిస్టుల వాదన. ఆస్తి హక్కు పొందడానికి గాను వారు త్యాగమయులుగా, దేవతలుగా ఉండవలసిన పని లేదు.
జెండర్‌ గురించి చేసే ప్రవచనాలలో స్త్రీలెప్పుడూ పురుషుల కన్నా ఎక్కువ నీతిగా ఉండాలని చెబుతూ ఉంటారు. అక్కర్లేదు. వాళ్ళు కూడా పురుషులలాగా మనుషులే. స్త్రీలలో మంచి చెడూ రెండూ సహజ గుణాలే. ఇంకొక సంగతేమిటంటే ఈ లోకంలో తోటి స్త్రీలను ఇష్టపడిన స్త్రీలు కూడా ఉన్నారు. దీన్ని గుర్తించడం నిరాకరించడం కన్నా స్త్రీవాద ద్వేషులకు ఆ ద్వేషాన్ని పెంచడానికి ఇంకొక అవకాశం ఇవ్వడమే అవుతుంది. ఎలా అంటే కొంతమంది స్త్రీలు ‘‘నేను స్త్రీవాదిని కాను’’ అని చెప్పుకోవడాన్ని ఒక ఉదాహరణగా చెప్పి ఆనందబడతారు. స్త్రీ అయి ఉండి ‘స్త్రీవాదిని కాను’ అనడం ఒక విచిత్రంలాగా ఉంటుంది వాళ్ళకి. స్త్రీవాదాన్ని మరికాస్త కించపరచడానికి ఉపయోగిస్తుంది. ఒక స్త్రీ తాను స్త్రీవాదిని కాను అన్నంత మాత్రాన స్త్రీవాదం ఆవశ్యకత తగ్గిపోదు. మీదు మిక్కిలి మనకు అందులో ఉన్న సమస్య అర్థమౌతుంది. పితృస్వామ్యాన్ని ఎదుర్కోవడానికి సాయపడుతుంది.
15. పదిహేనవ సూచన : చిజలమ్‌కి భిన్నత్వం అంటే ఏమిటో చెప్పు. భిన్నత్వం సహజమని చెప్పు. భిన్నత్వానికి ఎక్కువ విలువ ఇవ్వవద్దని చెప్పు. మంచిగా ఉండడం సున్నితంగా ఉండడం కన్నా మానవత్వంతో ఉండడం, ఆచరణాత్మకంగా ఉండడం ముఖ్యమని చెప్పు. భిన్నత్వం అనేది ఈ ప్రపంచంలో వాస్తవమైనది. లోకంలో అనేకమంది అనేక బాటలలో ప్రయాణిస్తారు అనే విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు నడిచే బాట ఇతరులకి హాని చెయ్యనంతవరకూ ఎవరి బాట వాళ్ళు ఎంచుకుంటారు. వాటిని మనం గౌరవించాలి. జీవితం గురించి ఎవరికీ పరిపూర్ణ జ్ఞానం ఉండదని చెప్పు. మనకి తెలియని విషయాలలో మతానికీ, విజ్ఞాన శాస్త్రానికీ కూడా సంబంధించిన విషయాలున్నాయి, కనుక జీవితంతో సాగిపోవడమే చాలు.
తన అభిప్రాయాలూ, ప్రమాణాలూ, అనుభవాలూ విశ్వజనీనమైనవని ఎప్పుడూ అనుకోవద్దని చెప్పు. ఇదే అసలైన వినయం, భిన్నత్వం సహజమని గుర్తించడం.
కొంతమంది స్వలింగ సంపర్కులు ఉంటారు. కొంతమంది ఉండరు. కొంతమంది పిల్లలకు ఇద్దరు తల్లులు
ఉంటారు. కొంతమందికి ఇద్దరు తండ్రులు ఉంటారు. కొంతమంది మసీదుకు వెళ్తారు, కొంతమంది చర్చికి వెళ్తారు. మరి కొందరు వారి వారి ప్రార్థనా స్థలాలకు వెళ్తారు. కొందరు అసలు వెళ్ళరు. వాళ్ళు అంతే.
తనతో ఇలా చెప్పు ‘‘నీకు పామ్‌ నూనె నచ్చుతుంది, కొందరికి నచ్చదు’’.
తను వెంటనే ‘‘ఎందుకు?’’ అంటుంది.
అప్పుడు నువ్వు ‘‘నాకు తెలీదు, అదంతే’’ అని చెప్పు.
తనని దేనిమీదా తన తీర్పు చెప్పకుండా పెంచమని చెప్పడంలేదు. ఈ రోజుల్లో అందరూ తీర్పులు చెప్పకుండా
ఉండే స్వభావం అనే మాట తక్కువ వాడుతున్నారు. నాకెందుకో అది నచ్చదు. ఆ మాట వెనుక మంచే ఉండవచ్చు. ‘‘తీర్పులు చెప్పలేనితనం’’ ఒక్కొక్కసారి దేనిమీదా మనకో అభిప్రాయం లేకుండా పోవడం క్రిందకు దిగజారుతుంది. కనుక చిజలమ్‌ గురించి నేనేమనుకున్నానంటే, తనకి స్వంత అభిప్రాయాలుండాలి. అభిప్రాయాలు విషయ పరిజ్ఞానంతో కూడుకున్నవి, భావ వైశాల్యంతో కూడినవి, మానవీయమైనవి అయి ఉండాలి అని.
తను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. తన జీవితం తను కోరినట్లు సాగిపోవాలని కోరుకుంటున్నాను.
ఇదంతా చదివాక నీకు తలనొప్పి వచ్చిందా? అయితే సారీ. ఇంకెప్పుడూ నా పిల్లని ఒక స్త్రీవాదిగా పెంచడం ఎలా అని మాత్రం అడక్కు. ప్రేమతో ఓయేగీ చిమామండా

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.