స్తీల కోసం స్త్రీ వాద పత్రిక భూమిక పోషించిన అద్భుతమైన పాత్ర!
ముందుగా 30వ పుట్టినరోజు జరుపుకోబోతున్న భూమికకు హృదయపూర్వక అభినందనలు!
స్త్రీవాదమనగానే వెంటనే 30 ఏళ్ళనుంచి స్త్రీల ప్రాథమికమైన సమస్యల్ని చర్చిస్తూ మహిళా లోకాన్ని ప్రభావితం చేస్తున్న స్త్రీ వాద పత్రిక ‘‘భూమిక’’ గుర్తొస్తుంది. మహిళలకు వ్యక్తి స్వాతంత్య్రమనేదే లేకుండా చేస్తున్న ఈ వ్యవస్థలోని అపసవ్యతలను, క్రూరత్వాన్ని ఎత్తిచూపుతూ స్త్రీల హక్కుల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలను భూమిక నిరంతరం నిర్వహిస్తూ ఉంటుంది. కష్టాల్లో, ఆపదల్లో ఉన్న స్త్రీలకు భూమిక హెల్ప్‌లైన్ ద్వారా అవసరమైన సహాయ సహకారాలందిస్తుంది. సమాజంలో అక్కడక్కడా విస్తరిస్తున్న సమానత్వ భావనలను తమ చైతన్యంతో కొందరు మహిళలు మాత్రమే అందిపుచ్చుకోగలుగుతారు. కానీ పుట్టుక, పెళ్ళి, చావు మొదలైన ప్రతి విషయంలోనూ ఆడవాళ్ళను ఆచారాలు, మూఢ నమ్మకాలతో అనాది కాలం నుంచి అణచివేస్తున్నారు. దేవుడు, భక్తి పేరిట రకరకాల పూజలు, వ్రతాల్లో 365 రోజులూ మునిగిపోయేటట్లు వాస్తవాలను తెలుసుకోనీయకుండా మహిళలను మాయ చేస్తున్నారు. అటువంటి సాధారణ స్త్రీలకు అంతవరకూ అలవాటైన జీవనశైలి వల్ల ప్రజాస్వామ్య భావనలు ఏ మాత్రం మింగుడు పడవు. 24 గంటలూ ఇంటి చాకిరీతో మగ్గిపోతూ బయటికి రావాలన్నా, ఏది చేయాలన్నా ‘‘అమ్మో, ఎవరేమనుకుంటారో అని తమలో తాము భయపడుతుంటారు. భూమిక లాంటి సంస్థలు ఎడతెగకుండా చేస్తున్న కృషి వల్ల సమాజంలో ప్రతిఫలిస్తున్న సమానత్వ భావనలు సాధారణ స్త్రీల వరకూ ప్రసరిస్తున్నాయి.
భూమిక ఆధ్వర్యంలో మేము చేసిన తలకోన, గంగవరం పోర్టు, వాకపల్లి ప్రయాణాల్లో విజ్ఞానం, వినోదం, స్నేహసౌరభాలు వెల్లి విరిశాయి. ఆ రోజులు మళ్ళీ రావు! నిరుపేద ఆదివాసీ మహిళలు తమ ప్రతిఘటన ఉద్యమాలతో అత్యంత శక్తివంతమైన వ్యవస్థను ఎదిరించి నిలిచి ప్రపంచం దృష్టిని తమవైపు మళ్ళించారు. ప్రభుత్వాలు ఎన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పినా ప్రపంచమంతా నిజాయితీగా ఉన్న వాకపల్లి మహిళల పక్షానే నిలబడిరది. వారి గురించి మేమందరం రాసిన వ్యాసాలు భూమికలో వచ్చాయి.
నేను పాతికేళ్ళకు పైగా భూమికకు లైఫ్ మెంబర్ని. అలాగే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లైఫ్ మెంబర్ని. వివిధ దేశాల ప్రత్యామ్నాయ సినిమాలు చూస్తున్నప్పుడు స్త్రీలు`బాలికల జీవితాలు`జీవన స్థితిగతులు మన దేశంలో కంటే ఏ దేశంలోనైనా ఏ కొంచెమైనా మెరుగ్గా ఉన్నాయా అనే కుతూహలంతో విమర్శనాత్మకంగా గమనిస్తుంటాను. ఆ దృష్టితో చూసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ దాదాపు బాలికలను, ఆడవాళ్ళను ఇంటి చాకిరీకి బలి చేస్తూనే ఉన్నాయి! నవనాగరికులమయ్యామని ఎన్ని చెప్పుకున్నప్పటికీ మహిళలకు ఇంటి చాకిరీ వదిలించుకోలేని పెద్ద గుదిబండగా మారింది. చిన్నవయసు నుంచే బాలికలను కూడా ఆక్టోపస్‌లా పట్టి పీడిస్తున్న పరిస్థితిని ఒక బాలిక ద్వారా ‘‘హయాత్’’ అనే ఇరాన్ చిత్రం నిరూపిస్తుంది. ఆ సినిమా సమీక్ష 2011, డిసెంబర్‌లో మొదటిసారిగా భూమికలోనే వచ్చింది. సినిమా చూడగానే వెంటనే రాయడం వల్ల సక్రమంగా వివరించలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పితృస్వామిక భావజాలాన్ని నిరూపించే ‘‘హయాత్’’ అనే చిత్ర సమీక్ష భూమిక స్నేహితులందరి కోసం ఇప్పుడు మరోసారి…
నా ఈ సినిమా సమీక్షని 2011లోనే గుర్తించి, ప్రచురించిన భూమికకు ధన్యవాదాలు.
` పి. శివలక్ష్మి
షషష