‘భూమిక’తో నా ప్రయాణం ` ఒక మధుర జ్ఞాపకం
దాదాపు ఇరవై సంవత్సరాల నుంచీ ‘భూమిక’ చదువుతున్నాను. నాకు బాగా నచ్చిన పత్రికల్లో ‘భూమిక’కు అగ్ర స్థానం ఉంది. న్యూఢల్లీిలోని జె.యన్.యు.లో పరిశోధక
విద్యార్థిగా ఉన్నప్పుడు ‘భూమిక’ను చదవడం నా అకడమిక్ కార్యంలో భాగంగా సాగేది. నా పరిశోధనా పర్యవేక్షకులైన ప్రొఫెసర్ ఇందీవర్ కామ్టేకర్, ప్రొఫెసర్ మహాలక్ష్మీ రామకృష్ణన్ గార్లు ‘‘సమకాలీనంగా వెలువడుతున్న తెలుగు స్త్రీల పత్రికలు చదువుతున్నావా?’’ అని అడిగారు. అవునని చెప్పాను. భూమిక పేరు ప్రస్తావించాను. వారెందుకలా అడిగారంటే ఎం.ఫిల్.లో నా పరిశోధనా విషయం బ్రిటిష్ వలస పాలనా కాలంలో వెలువడిన మాసపత్రిక ‘గృహలక్ష్మి’లో వ్యక్తమైన స్త్రీల చైతన్యాన్ని పరిశీలించడం. అలాగే పి.హెచ్.డి. పరిశోధనా విషయం బ్రిటిష్ పరిపాలనా కాలంలో ప్రచురించబడిన స్త్రీల పత్రికల్లో వ్యక్తమైన వివిధ రకాల చైతన్యాన్ని పరిశీలించడం. మహిళోద్యమకారుల ప్రయాణంలో వలస కాలానికీ, వలసానంతర కాలానికీ ఉన్న తేడాల్నీ, కొనసాగింపుల్నీ స్ఫష్టంగా అర్థం చేసుకోవడానికీ ‘భూమిక’ను ఒక పద్ధతిగా, లోతుగా అధ్యయనం చేశాను. చరిత్ర భూత, వర్తమాన, భవిష్యత్కాలాలకు మధ్య జరిగే ఎడతెగని సంభాషణ కదా!
ఇక ఈ చిరువ్యాసంలో ప్రచురించబడిన మధుర జ్ఞాపక డాక్యుమెంట్ల గురించి. నాకొచ్చే ‘భూమిక’ను జె.యన్.యు.లోని కొంతమంది తెలుగు విద్యార్థినీ, విద్యార్థులు కూడా చదివేవారు. స్త్రీల హాస్ట్టళ్ళలోనూ, స్త్రీ, పురుష పరిశోధక విద్యార్థులు కలిసి ఉండే ‘సబర్మతి’ హాస్టల్లోనూ చక్కర్లు కొట్టేది. చివరికి నాదగ్గరికొచ్చేటప్పటికి శిథిలావస్థలో వచ్చేది. (పుస్తకాల్ని చిన్న పిల్లల్ని చూసుకొనేట్లు చూసుకోవడం ఇప్పటికీ చాలా మందికి చాతకావట్లేదు!) ఏది ఏమైనా ‘భూమిక’ జె.యన్.యు. తెలుగువాళ్ళలో ప్రవహించేది.
ఒక రోజు నేనూ, సాంబన్నా (సోషియాలజీ పరిశోధక విద్యార్థి డా.సాంబశివ, ప్రస్తుతం కెనడాలో ఉన్నారు), జోనతీ ‘భూమిక’లో ప్రచురితమైన వివిధ విషయాల గురించి చర్చించుకుంటున్నాము. సుబ్బారావన్న (డా.శీలం సుబ్బారావు) వచ్చి మాతో కూర్చున్నారు. ‘‘ఎప్పుడూ చదవడమేనా? ఏమైనా రాయొచ్చు కదరా భూమికకి?’’ అన్నారు. దాంతో ముగ్గురం కలిసి ఒక నిర్ణయానికొచ్చాంÑ డాక్టర్ దమయంతీ థాంబే గారి గురించి రాయాలని. ఆమె ‘‘వార్ విడో’’. మేము యుద్ధాలకు బద్ధ వ్యతిరేకులం. సాంబన్న అయితే మరీ మరీ ఎక్కువ. దమయంతీ థాంబే గారిని ఇంటర్వ్యూ చేశాము. ఆమె అనుమతితో ఫోటో తీసుకున్నాము. ‘‘యుద్ధ ఖైదీలను పట్టించుకోండి!’’ అనే వ్యాసాన్ని ‘భూమిక’కు పంపించాము. అలా మా వ్యాసాన్ని అందుకున్న ‘భూమిక’ ఎడిటర్ ‘సత్యవతి’ గారు 5.4.2002న మాకు రాసిన ఉత్తరంలో వ్యాసం రాసిన వారి అనుమతి తీసుకోమని రాసారు. ఆమెకు ప్రత్యుత్తరమిచ్చాము. మార్చి`ఏప్రిల్ 2002 సంచికలో మా వ్యాసం ప్రచురితమైంది. అలా సుమారు 20 సంవత్సరాల క్రితం ‘భూమిక’తో మొదలైన నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతుంది. స్త్రీలకు సంబంధించి నా ఆలోచనల్ని మరింత మెరుగుపరచుకోవడంలో ‘భూమిక’ కూడా ప్రధాన భూమిక వహించింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ‘భూమిక’ను నడుపుతున్న శ్రీమతి కొండవీటి సత్యవతి గారికీ, ‘భూమిక’ టీంకీ శుభాభినందనలుÑ ధన్యవాదాలు. అందరికీ నమస్తే.
` డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా,
షషష