ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం – కొండవీటి సత్యవతి

ముప్ఫై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం
ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన నేను కొండవీటి సత్యవతి నుండి భూమిక సత్యవతిగా మారిన క్రమం గురించి రాయడమంటే నా జీవితంలో సగం కాలం గురించి రాయాలి. 48 సంవత్సరాల క్రితం బిడియపడుతూ, భయపడుతూ మా సీతారామపురం నుంచి బయలుదేరిన

నేను నగరానికొచ్చింది నా బతుకు తెరువు కోసమే. అందరిలాగానే మంచి ఉద్యోగం, అదీ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మా కుటుంబానికి ఆసరాగా ఉండాలన్నదే అప్పటి నా కల. కల సాకారమైంది. ప్రభుత్వ ఉద్యోగమొచ్చింది. కడుపులో చల్ల కదలకుండా నెలనెలా వచ్చే జీతం రాళ్ళతో ‘హాయిగా’ బతికేయొచ్చు. కానీ నా ఉద్యోగం నా ఆలోచనల్ని మార్చింది. కుదురుగా ఒకచోట ఉండడం నా నైజం కాదు. ఉద్యోగ జీవితం నిలవనీరులా మారుతున్న క్రమంలో వేరే ఉద్యోగానికి పోటీపడి సంపాదించినా అక్కడా నిలబడాలనిపించలేదు. ఫలితం రాజీనామా. స్వచ్ఛంద రాజీనామా. అప్పటికే చదివిన పుస్తకాలు, ఎంతోమంది ఉద్యమకారుల సాహచర్యాలు, స్త్రీల ఉద్యమాలు, స్త్రీవాద సాహిత్యాలు నా పరిధిని ఎంతో విశాలంగా విస్తృతం చేశాయి. స్త్రీ శక్తి సంఘటన, అన్వేషి, అస్మిత, మానుషి పత్రిక నా మీద బలమైన ముద్రవేసి నా ఆలోచనల్ని ఆచరణలోకి నడిపించాయి. ఎనభయ్యవ దశకంలో స్త్రీవాద సాహిత్యం నిలువునా నన్ను ముంచేసింది. స్త్రీల దృష్టికోణాన్ని నాలో ఆవిష్కరించింది. జెండర్‌ లెన్స్‌తో ప్రపంచాన్ని చూడడం అలవాటయ్యాక జనాభాలో సగం భాగంగా ఉన్న స్త్రీల దుఃఖం, అణచివేతలు చాలా స్పష్టంగా కనబడడం మొదలైంది. మా ఉమ్మడి కుటుంబంలో మా తాతని నేను పితృస్వామ్యానికి ప్రతిరూపంలా చూశాను, కానీ అప్పటికి నా దగ్గర ఫెమినిజం పదజాలం లేదు. తెలియదు కూడా. తుది మొదలు తెలియని మర్రి ఊడల్లా ఇంటా, బయటా, పనిచేసేచోట, రోడ్లమీద ఒక్కచోటేమిటి ప్రపంచమంతా విస్తరించి ఉన్న పితృస్వామ్య భావజాలం స్త్రీలను పీల్చిపిప్పి చేస్తున్న వైనాలు అర్థమయ్యాకే ఆ అంశం మీదే పనిచెయ్యాలని నిర్ణయించుకున్నాను. పెళ్ళి, భార్యాభర్తల సంబంధాలు, కుటుంబం, మాతృత్వం వీటన్నింటి చుట్టూ నిండి ఉన్న అసమానత్వం, హింసాయుత కుటుంబాల్లో నలుగుతున్న స్త్రీలు, పిల్లలు… ఇక్కడే నా ఆచరణ మొదలవ్వాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. ప్రత్యక్షంగా చూసిన కొన్ని దుస్సంఘటనలు నన్ను కొత్త దారులు తొక్కేలా పురికొల్పాయి.
అదే సమయంలో కొత్త పోకడలతో దక్షిణ భారతంలో స్త్రీవాద ఉద్యమం పెద్ద ఎత్తున మొదలవ్వడం, అప్పుడే అన్వేషి ఒక స్త్రీవాద పత్రికను ప్రారంభించాలని చర్చిస్తున్న సందర్భం. నేను కూడా అన్వేషిలో సభ్యురాలిగా ఉండటం వల్ల ఆ చర్చల్లో భాగస్వామినయ్యాను. అలా అన్వేషి ఆవరణలో 1993లో భూమిక పత్రిక పుట్టింది. నన్ను సంపాదకురాలిని చేసారు. తొలిరోజుల్లో చాలామంది భూమికతో
ఉన్నారు. 1999 నాటికి అందరూ వెళ్ళిపోయారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం వదిలెయ్యడం, భూమికను నా చేతుల్లోకి తీసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప మలుపు. అన్వేషి బృందం చర్చోపచర్చల సారంగా రూపుదిద్దుకున్న భూమిక పత్రికను వారంతా ఎందుకు ‘డిస్‌ఓన్‌’ చేసుకున్నారో, ఎందుకు వదిలేశారో నాకిప్పటికీ తెలియదు. నేను భూమికను ప్రేమించాను కాబట్టి నా గుండెల్లోకి తీసుకుని 23 సంవత్సరాలుగా ఒక్కదాన్నీ నడుపుతున్నాను. నాకు సాధ్యమైనంతవరకు నడిపిస్తాను. ఒకప్పుడు భూమికలో ముగ్గురం మాత్రమే పనిచేసేవాళ్ళం. ఎడిటర్‌గా నేను, సర్క్యులేషన్‌లో లక్ష్మి, డిటిపి, లే అవుట్‌, ప్రింటింగ్‌ బాధ్యత ప్రసన్న మాత్రమే
ఉండేవాళ్ళం. ప్రూఫ్‌ రీడిరగ్‌ నేనే చేసేదాన్ని. ఆ రోజుల్లో ఎన్నో ప్రత్యేక సంచికలు… దశాబ్ది ప్రత్యేక సంచిక, 20 ఏళ్ళ ప్రత్యేక సంచిక ఐదేళ్ళ క్రితం 25 ఏళ్ళ ప్రత్యేక సంచికలతో పాటు ప్రపంచీకరణ, వ్యవసాయ సంక్షోభం, మానసిక ఆరోగ్యం, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌, దళిత మహిళ లాంటి అనేక సమకాలీన సామాజిక అంశాల మీద ప్రత్యేక సంచికలు తేగలిగాం. అలాగే ఎంతోమంది ప్రముఖ మహిళల ఇంటర్వ్యూలు చేసి ‘‘జీవితానుభవాలు’’ పేరిట భూమికలో ప్రచురించేవాళ్ళం. ఎన్నో విలువైన జీవితానుభవాల ఇంటర్వ్యూలు భూమికలో ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి పుస్తకంగా తీసుకురావాల్సి ఉంది.
ప్రస్తుతం భూమిక టీం చాలా పెరిగింది. మొదట్లో పత్రిక పని మాత్రమే ఉండేది. 2006లో భూమిక హెల్ప్‌లైన్‌ మొదలయ్యాక భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌గా అనేక పనుల్లోకి మళ్ళాల్సివచ్చింది. హెల్ప్‌లైన్‌తో పాటు పోలీస్‌స్టేషన్లో సపోర్టు సెంటర్ల నిర్వహణ పట్టణ, గ్రామీణ కమ్యూనిటీలతో వివిధ అంశాల మీద పనిచేయడం, పోలీసులు, జడ్జీలతో సహా ఎందరికో జెండర్‌ స్పృహ మీద ట్రైనింగ్‌ ఇవ్వడం లాంటి అనేక కార్యక్రమాలు మొదలైనాయి. ఈ కార్యక్రమాల వల్ల భూమికకు స్థిరమైన ఆపీసు, సహకరించే సిబ్బంది ఉండడం వల్ల కూడా పత్రిక నిలదొక్కుకోవడానికి దోహదం చేసింది. పత్రికకి ఎప్పుడూ బయట నుండి ఫండిరగ్‌ లేదు. మితృల, అభిమానుల సహకారంతోనే నడుస్తున్నది.
ముగ్గురి నుండి మొదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందమందిమయ్యాం. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. నేను కూడా అనేకానేక పనుల్లో మునిగిపోయాను. కానీ నెలనెలా పత్రిక తేవాల్సిన బాధ్యత నామీదే ఉంది. ఇది నాకు బరువనిపించదు కానీ ప్రత్యేకంగా పత్రికకే ఒక వ్యక్తి ఉండడం చాలా అవసరం. ఎవరైనా ముందుకొస్తారేమో వెతకాలి. ఇంతకుముందు ప్రసన్న ఇచ్చిన సహకారం ఇప్పుడు శ్రీలలిత ఇస్తున్నారు. నా బాధ్యతలో చాలావరకు లలిత నిర్వహించడం వల్లనే భూమిక నెలనెలా క్రమం తప్పకుండా వస్తున్నది. థాంక్యూ లలితా!
2024 సంవత్సరం జనవరి నాటికి నాకు డెబ్భై సంవత్సరాలొస్తాయి. ఇప్పుడు నేను చేస్తున్న పనుల్ని కొన్నింటిని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నాను. నా నడక వేగాన్ని తగ్గించుకోవాలి. ప్రయాణాలంటే ప్రాణం కాబట్టి వాటిని తగ్గించుకోలేను. కొంతకాలం నగరంలో, కొంతకాలం నగరానికి బయట బతకాలనుకుంటున్నాను. నా తిరుగు ప్రయాణం మా సీతారామపురం వైపా, నాకిష్టమైన అడవి వైపా ఇప్పుడే తెలియదు. నన్నెంతో మోహపరిచే హిమాలయ ప్రాంతానికా, ఏమో తెలియదు.
ఏది ఏమైనా 2024 నా జీవితానికి మరో కొత్త మలుపు కాబోతున్నది అన్నది మాత్రం సత్యం. నాకేమీ కొత్త కోరికలు, కొత్త గమ్యాలూ లేవు. ఇవి సాధించాలి. అవి సాధించాలనే టార్గెట్లు లేవు. నా కాళ్ళు నడిచినంత కాలం నడుస్తాను. నా వేళ్ళు రాయగలిగినంత కాలం రాస్తాను. నేను చేస్తున్న పనిని ఎవరో ఒకరు తీసుకుంటారనే నమ్మకం ఉంది.
భూమికతో మీ మీ అనుబంధాన్ని, ప్రయాణాన్ని రాసి పంపిన అందరికీ ధన్యవాదాలు. ముప్ఫై సంవత్సరాల సంబరానికి ఆర్థికంగా సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రత్యేక సంచికను స్పాన్సర్‌ చేసిన ప్రశాంతికి అభినందనలు.

Share
This entry was posted in సంపాదకీయం, స్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.