అమెరికాలో నివసించే స్త్రీలలో సగం మందికి పైగా శ్రమ శక్తిలో భాగమే. సమకాలీన స్త్రీవాద ఉద్యమం మొదలయ్యేటప్పటికి అమెరికాలోని కార్మికులలో మూడొంతుల పైగా ఆడవాళ్ళే. నేను పుట్టి పెరిగిన ఆఫ్రికన్ అమెరికన్ శ్రామిక కుటుంబంలో ఎక్కువ మంది స్త్రీలు శ్రమించే వాళ్ళే. స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పుడు అనేక మంది
సంస్కరణ వాద భావాలతో పనిచేసే స్త్రీవాదులు పురుషాధిక్యత నుండి బయట పడాలంటే స్త్రీలు శ్రామిక శక్తిలో భాగమవ్వటం అవసరమని వాదించినప్పుడు ఆ ఆలోచనని తీవ్రంగా విమర్శించిన వారిలో నేనొకదాన్ని. పదేళ్ళ క్రితం రాసిన ‘ఫెమినిస్టు థియరీ: ఫ్రమ్ మార్జిన్ టూ సెంటర్’లో నేనిలా రాశాను ‘‘జీతాలు ఇచ్చే శ్రమ మగవాళ్ళ ఆధిపత్యం నుండి ఆడవాళ్ళని విముక్తి చేస్తుందని నమ్మే తెల్లజాతి స్త్రీవాదుల రాతల వల్ల శ్రామిక శక్తిలో భాగమయిన స్త్రీలు అప్పటికే విముక్తులైపోయారనే భావన కల్పిస్తాయి. ఒక రకంగా అప్పటికే శ్రామిక శక్తిలో భాగమయిన స్త్రీలందరికీ ‘స్త్రీవాద ఉద్యమం మీ కోసం కాదు’ అని చెప్పకుండానే చెప్పినట్లు అయింది. నేను నా ప్రత్యక్ష అనుభవంతో నేర్చుకున్నదేమిటంటే, తక్కువ జీతాలకు చేసే పని ఏ పేద, శ్రామిక స్త్రీలని పురుషాధిపత్యం నుండి విముక్తి చెయ్యదు.
డబ్బున్న నేపథ్యం నుండి వచ్చిన ఈ స్త్రీవాద ఆలోచనాపరుల దృష్టిలో శ్రమ అంటే మంచి జీతాలిచ్చే ఉద్యోగాలన్నమాట. జన బాహుళ్యంలోని ఆడవాళ్ళు చేసే శ్రమకీ, వీళ్ళనుకునే శ్రమకీ పోలిక లేదు. అయితే, సమాన పనికి సమాన జీతాలు
ఉండాలని స్త్రీవాదులు చేసిన డిమాండు అందరి జీవితాలను ప్రభావితం చేసింది.
స్త్రీవాద ఉద్యమకారుల నిరసనల కారణంగా పని స్థలాల్లో వివక్ష పూర్తిగా అంతం కాకపోయినా ఆడవాళ్ళకి జీతాలు, హోదాలు, పదవుల విషయంలో కొన్ని హక్కులయితే లభించాయి. ఈ రోజుల్లో కాలేజీ క్లాసు రూముల్లో చాలామంది ఆడ, మగ విద్యార్థులు ఇద్దరూ కూడా స్త్రీలకి సమానత్వం వచ్చేసిందనీ, కాబట్టి స్త్రీవాద ఉద్యమం అవసరం ఇప్పుడు లేదని వాదిస్తున్నారు. ఆడవాళ్ళలో చాలామందికి ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దొరకట్లేదనీ, మగవాళ్లు సంపాదించే ఒక డాలర్‌కీ, ఆడవాళ్ళకి 75 సెంట్లు మాత్రమే సంపాదించటం సాధారణమని ఈ విద్యార్థులకి తెలియదు.
శ్రమ మాత్రమే ఆడవాళ్ళని మగవాళ్ళ పెత్తనం నుండి విముక్తి చెయ్యదని మనకిప్పుడు తెలుసు. వృత్తిపరంగా బాగా సంపాదించే ఆడవాళ్ళు, డబ్బున్న ఆడవాళ్ళు కూడా పూర్తి మగపెత్తనం అమలయ్యే కుటుంబాల్లో, ఆయా సంబంధాల్లో జీవించటం మామూలే. అయితే మనకి ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించిన స్త్రీలకి పెత్తనం నుండి బయట పడడానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆమె ఆ పెత్తనం నిండిన సంబంధాన్ని వదిలెయ్యగలిగే స్థితిలో ఉంది కాబట్టి వదిలేస్తుంది. స్త్రీవాద ఆలోచనలు చేసే ఆడవాళ్ళలో చాలామందికి మగ పెత్తనం నుండి బయటపడాలని ఉన్నప్పటికీ ఆర్థికంగా ఆయా మగవాళ్ళపై ఆధారపడి ఉండటం వల్ల అది కష్టతరమవుతుంది. చాలా మందికి అసాధ్యం కూడా.
శ్రమ మాత్రమే స్త్రీల విముక్తికి దారి తియ్యదనీ, ఆర్థిక స్వావలంబన మగపెత్తనం నుండి బయటపడడానికి కీలకమని మనలో కొంతమందికి స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పుడు అర్థమయినప్పటికీ ఆ విషయం చాలా మంది ఆడవాళ్ళకి ముందు నుండే తెలుసు. ఆర్థిక స్వావలంబన ముఖ్యమని గుర్తించిన తర్వాత, ఒక అడుగు ముందుకేసి, ఏ రకమైన పని మన విముక్తికి దారితీస్తుందని మాట్లాడుకోవచ్చు. తగినంత జీతంతో సౌకర్యవంతమైన పని గంటలుండీ, శ్రామికులకు కావలసినంత స్వేచ్ఛనిచ్చే పని అనే సమాధానం స్పష్టంగా వస్తుంది.
శ్రామిక శక్తిలో చేరితే విముక్తిని సాధించవచ్చనే ఆలోచనని తమలో కలిగించిందనే కారణంతో స్త్రీవాదం అంటేనే కోపగించుకునే వాళ్ళు జన బాహుళ్యంలో చాలామంది స్త్రీలే ఉన్నారు. ఇంటి దగ్గరా, పని స్థలాల్లో రెండు చోట్లా ఎక్కువ గంటలు తాము పనిచెయ్యాల్సి
ఉంటుందని వారికి అర్థమయింది. స్త్రీవాద ఉద్యమం బయట పని గురించి అనుకూలంగా ఆలోచించటం స్త్రీలకి నేర్పేముందే ఆర్థిక మాంద్యం వల్ల స్త్రీలని పనుల్లో చేర్చుకోవటం మొదలయిపోయింది. సమకాలీన స్త్రీవాద ఉద్యమం రాకపోయినా జన బాహుళ్యంలోని స్త్రీలు శ్రామిక శక్తిలో భాగమయ్యేవాళ్ళే కానీ, స్త్రీవాదులు స్త్రీల పట్ల వివక్షని సవాలు చేయకపోయుంటే మనకి ఇప్పుడున్న హక్కులు కూడా లభించేవి కావు. స్త్రీవాదం వల్లే తాము ఇలాంటి చాకిరీ చెయ్యాల్సి వస్తోందని అనేకమంది స్త్రీలు అనుకుంటారు గానీ అది తప్పు. నిజమేంటంటే స్త్రీలని పెద్ద ఎత్తున శ్రామిక శక్తిలోకి లాగింది వినిమయ పెట్టుబడిదారీ విధానం. ఆర్థిక మాంద్యం వచ్చిన తర్బాత, తెల్లజాతి మధ్య తరగతి స్త్రీలు తాము ఇళ్ళల్లో గృహిణులుగా పనిచేసి, బయట పనిచేయకుండా ఉండి ఉంటే వారి స్థాయిని, లైఫ్‌స్టైల్‌ని కొనసాగించడం అసాధ్యమయి ఉండేది.
స్త్రీలు శ్రామిక శక్తిలో భాగమవ్వటం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగటం మరియు సముదాయంలో భాగమవ్వటం వంటి అనుకూల పరిణామాలు జరిగాయని స్త్రీవాద పరిశోధనలు చెప్పాయి. ఏ స్థాయికి చెందిన స్త్రీ అయినా ఇంట్లో గృహిణిగా ఉన్నప్పుడు వారికి ఒంటరితనం, కృంగుబాటు, ఏకాకితనం అనుభవంలోకి వస్తాయి. పనిస్థలాలు భద్రంగా లేనప్పటికీ తమకంటే పెద్దదయిన విషయంలో తాము అందులో భాగం అనే స్పృహ పురుషులు, స్త్రీలు అందరికీ కలుగుతుంది. ఇళ్ళల్లో సమస్యలు తీవ్ర ఒత్తిడికి గురిచెయ్యటమే కాక, ఒక పట్టాన కొలిక్కి రావు. పనిస్థలాల్లో సమస్యలు అందరివీ కాబట్టి, పరిష్కారాలు వెతకటం ఒకరిమీదే పడదు. మగవాళ్ళు ఉద్యోగాలకెళ్తే ఆడవాళ్ళు ఇంటిని వారికి సౌకర్యవంతంగాను, వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా చేసేవాళ్ళు. పిల్లలు, మగవాళ్ళు ఇంటి బయటికి వెళ్ళినపుడే ఆడవాళ్ళకి ఇళ్ళల్లో కొంత విశ్రాంతి దొరికేది. ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఇతరుల అవసరాల కోసమే తమ సమయమంతా ధారపోస్తుంటే వాళ్ళకి ఇల్లు ఒక పనిస్థలమే కానీ, విశ్రాంతి, సౌకర్యం, ఆనందం ఇచ్చే స్థలం కాదు.
ఇంటి బయట పని చేసుకోవటం వల్ల, స్వతంత్రంగా బ్రతికే (సింగిల్) ఆడవాళ్ళకి మాత్రమే విముక్తి వచ్చింది
(వాళ్ళు పరలింగ సంపర్కులే కావచ్చు, కాకపోవచ్చు). చాలామంది ఆడవాళ్ళకి సంతోషాన్నిచ్చే పని దొరకటమే గగనమవుతుంది. అంతేకాక, ఆ శ్రమలో పాల్గొనటం వల్ల వాళ్ళ ఇంటి జీవితం గుణాత్మకంగా దిగజారుతోంది.
ఏదో కారణాల వల్ల బాగా చదువుకుని కూడా ఉద్యోగాలు చెయ్యకుండానో, ఏదో కొంచెం పనితో సరిపెట్టుకున్న స్త్రీలు, స్త్రీవాదం వల్ల ఉద్యోగాల్లో వివక్ష తగ్గి తమకి నచ్చే పనులు, ఆర్థికంగా తమ కాళ్ళమీద తాము నిలబడే పనులు చేయగలుగుతున్నారు. వారి సాఫల్యం జన బాహుళ్యంలోని స్త్రీల పరిస్థితులలో ఏ మార్పూ తీసుకురాలేదు. నేను ఫెమినిస్టు థియరీలో అన్నేళ్ళ క్రితం ఏమి రాశానంటే:
ఉద్యోగాలు లేని అన్ని వర్గాల స్త్రీలకి ఉద్యోగాలు కల్పించటం, బాగా డబ్బిచ్చే ఉద్యోగాలు స్త్రీలకి దొరికేలా చూడటంతో పాటు పని స్థలాల్లో స్త్రీల పరిస్థితులు బాగుపరచటం కూడా స్త్రీవాద ఉద్యమం అజెండాలో భాగమై ఉంటే అందరు స్త్రీల అవసరాలని, ఆసక్తులని పట్టించుకున్న ఉద్యమంగా స్త్రీవాదం పేరు పొందేది. కేవలం బాగా డబ్బొచ్చే వృత్తుల్లో స్త్రీలకి అవకాశం కల్పించటం, కెరీర్‌లో పైకెళ్ళటం మీద స్త్రీవాదులు దృష్టి పెట్టటంతో జరిగిన రెండు పర్యవసానాలు` ఒకటి జన బాహుళ్యంలోని స్త్రీలని స్త్రీవాదానికి దూరంగా పెట్టడంÑ రెండవది, కొంతమంది బూర్జువా స్త్రీలు శ్రామిక శక్తిలో భాగమవ్వటం వల్ల ఒక సముదాయంగా స్త్రీలందరి ఆర్థిక శక్తి పెరిగిందనే నిర్ధారణకు రాకూడదు అన్న విషయాన్ని పక్కన పెట్టటం. పేద, శ్రామిక వర్గ ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని ఉంటే పెరుగుతున్న నిరుద్యోగం, అన్ని వర్గాలలోనుంచి స్త్రీలు పేదరికంలోనికి అడుగుపెట్టటాన్ని స్త్రీవాదం గమనించి ఉండేది.
పేదరికం స్త్రీలకి అత్యంత కీలకమయిన సమస్యగా పరిణమించింది. తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్యం పేద స్త్రీలకి మౌలిక అవసరాలయిన ఆహారం, షెల్టర్ అందించే సంక్షేమాన్ని నాశనం చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది. ఇట్లా చేస్తే, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి మగవాళ్ళు సంపాదించే మగపెత్తనం సాగే కుటుంబాల్లోకి వీళ్ళందరూ తిరిగి వెళ్తారని సంప్రదాయ రాజకీయ వేత్తల భావన. అయితే స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారనీ, అసలు ఉద్యోగాలే లేవనీ, ఉద్యోగాలున్న మగవాళ్ళు కూడా తమ జీతాలని స్త్రీల, పిల్లలపై ఖర్చు పెట్టటానికి సిద్ధంగా లేరనే వాస్తవాన్ని వీళ్ళు పక్కన పెడుతున్నారు.
ఈ పరిస్థితి నుంచి బయట పడెయ్యటానికి, అసలు పనినే పునర్నిర్వచించటానికి, స్త్రీవాదం దగ్గర ఏ అజెండా లేదు. మన సమాజంలో మామూలుగా బ్రతకటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువవటం వల్ల మామూలు కార్మికులకు ఆర్థిక స్వావలంబన రావట్లేదు. పనిచేసే స్త్రీల పరిస్థితి కూడా అంతే. అది లేకుండా మగపెత్తనం నుండి బయటపడి, తమ జీవితాలని తామనుకున్న విధంగా జీవించటానికి అవకాశమే లేదు.
ఆర్థికంగా తమ కాళ్ళమీద తాము నిలబడటానికి స్త్రీలు చేసే ప్రయత్నాల వల్ల, ఈ తెల్ల జాత్యహంకార పెట్టుబడిదారీ పితృస్వామ్యంలో మాస్ మీడియా ద్వారా మనకు నిర్దేశించబడిన జీవనశైలి కాకుండా భిన్నమైన జీవన శైలులు మన ముందుకు రాబోతున్నాయి. నిండుగా, మంచిగా జీవించటం, మన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచే పని చేసుకోవటం, దానికి తగ్గ జీతాన్ని పొందటం కోసం, ఉద్యోగాలని పంచుకుని చెయ్యగలిగే ప్రోగ్రాములు అవసరమవుతాయి. సేవారంగంలో పనిచేసే వాళ్ళకి, ఉపాధ్యాయులుగా పనిచేసే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని పెంచుకోవాలి అనుకునే ఆడవాళ్ళు, మగవాళ్ళకి రాజ్యమే జీతాలివ్వాలి. వాళ్ళు ఇంటినుండే చదువుకోవటానికి అవకాశాలు కల్పించాలి.
మెరుగైన సాంకేతిక సహాయంతో ఇంటి దగ్గరుండి చదువుకోవాలనుకున్న వాళ్ళు తక్కువ క్లాసులకెళ్ళి, ఎక్కువ కాలేజీ కోర్సుల వీడియోలు చూసి నేర్చుకోవచ్చు. యుద్ధాలు కాకుండా సంక్షేమం మీద దృష్టిపెడితే, ఉద్యోగం దొరకనప్పుడు ప్రతి వ్యక్తికి ప్రభుత్వం జీవితంలో రెండేళ్ళపాటు ఆర్థిక సహాయం అందిస్తే సంక్షేమం అంటే ప్రజల్లో ఉండే ప్రతికూల అభిప్రాయం పోతుంది. మగవాళ్ళకి కూడా సామాజిక సంక్షేమం ఉంటే, అది కేవలం పేద స్త్రీలకోసమనే అభిప్రాయం పోతుంది.
డబ్బున్న స్త్రీలకి, పేద స్త్రీలకి మధ్య వర్గ భేదం తీవ్రంగా పెరిగి వాళ్ళను వేరు చేస్తోంది. కులీన వర్గ స్త్రీల అధికారం దాదాపు పేద స్త్రీల స్వేచ్ఛని లాగేసుకోవటం వల్ల వచ్చిందే. కొంతమంది డబ్బున్న స్త్రీలు పేద స్త్రీలని ఆదుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. వంశపారంపర్యంగా ఆస్తులు పొందిన స్త్రీలు, స్త్రీవాద స్పృహతో కొత్తరకమైన ఆర్థిక భాగస్వామ్యంతో కూడిన ఆర్థిక సంబంధాలని ఆస్తులు లేని స్త్రీలతో పెంపొందించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య చాలా చిన్నది. కానీ వారి పని అందరికీ తెలిసినప్పుడు వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
ముప్ఫై ఏళ్ళ క్రితం స్త్రీవాదులు భవిష్యత్తులో పని ప్రపంచంలో వచ్చే మార్పులని ఊహించలేకపోయారు. తీవ్ర నిరుద్యోగం సమాజంలో నిరంతరంగా ఉండబోతోందనీ, లేని ఉద్యోగాల కోసం ఆడవాళ్ళు తమని తాము సిద్ధపరచుకుంటారనీ, వారికి తెలియలేదు. సాంప్రదాయ వాదులు, కొన్నిసార్లు ఉదారవాదులు కూడా సాంఘిక సంక్షేమం పైన దాడులు చేస్తారనీ, డబ్బులేని ఒంటరి తల్లులని వారి ఆర్థిక అసమర్థత గురించి నిందిస్తారనీ, వారినే విలన్లు చేస్తారనీ ఊహించలేకపోయారు. ఈ ఊహించలేని వాస్తవాల నేపథ్యంలో మనకి స్త్రీ విముక్తికీ, శ్రమకీ మధ్య గల సంబంధాన్ని కొత్తగా ఊహించగలిగే అద్భుతమైన స్త్రీవాద ఆలోచనా పరులు కావాలి.
ఇప్పుడున్న స్త్రీవాద పరిజ్ఞానం శ్రామిక శక్తిలో స్త్రీల పాత్ర గురించీ, శ్రమలో పాల్గొనటం స్త్రీలలో తెచ్చే మార్పు గురించీ మనకి చెప్తుంది. కానీ ఎక్కువమంది స్త్రీలు శ్రామిక శక్తిలో పాల్గొనటం వల్ల మగవాళ్ళ పెత్తనంలో వచ్చిన మార్పుల గురించి అధ్యయనాలు లేవు. చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగాల్లోకి రావటం వల్లే తమకి ఉద్యోగాలు లేకుండా పోయాయనీ, తమకి కుటుంబంలో ఆధిపత్య స్థానం పోయి, ఒక అస్తిత్వం లేకుండా పోయిందనీ, ఈ పరిస్థితికి ఆడవాళ్ళే కారణమనీ తిట్టిపోస్తుంటారు, ఆ అస్తిత్వం పూర్తి కట్టుకథ అయినా సరే. భవిష్యత్తులో వచ్చే స్త్రీవాదం మగవాళ్ళకి, ఆడవాళ్ళకి శ్రామిక ప్రపంచంతో ఉండే సంబంధాల వాస్తవాలని విప్పి చెప్పాలి. శ్రామిక శక్తిలో ఉండే స్త్రీలు మగవాళ్ళ శత్రువులు కాదని అర్థం చేయించాలి.
ఆడవాళ్ళు శ్రామిక ప్రపంచంలోకి వచ్చి ఇప్పటికి చాలా కాలం గడిచిపోయింది. మంచి జీతాలొచ్చినా, తక్కువ జీతాలొచ్చినా, మనం చేసే శ్రమ స్త్రీవాద ఆదర్శవాదులు ఊహించినట్లు ఏమంత అర్థవంతమైనది కాదని మనకి స్పష్టమయింది. మన జీవితాలని మెరుగు పరచుకోవటం కన్నా ఇంకా ఇంకా వస్తువులు కొనుక్కోవటం కోసం మాత్రమే మనం శ్రమిస్తుంటే అది మన ఆర్థిక స్వాతంత్య్రానికి దారి తీయదు. డబ్బుని మన శ్రేయస్సు కోసం వాడుకోకపోతే ఎంత ఎక్కువ డబ్బు సంపాదించినా అది స్వేచ్ఛనివ్వదు. శ్రమ అర్థాన్ని పునరాలోచించటం భవిష్యత్తులో వచ్చే స్త్రీవాద ఉద్యమం చెయ్యాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. పేదరికం నుండి బయట పడటం, అలాగే డబ్బు సంపాదించిన తర్వాత కూడా మంచి జీవితం గడపడం… ఈ రెండు విషయాల గురించీ స్త్రీవాద ఉద్యమం ఆలోచించాలి.
స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పుడు ఆడవాళ్ళ ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రాథమిక లక్ష్యంగా తీసుకోలేదు. కానీ స్త్రీల అర్థిక స్థితిని గురించి పట్టించుకున్నప్పుడు స్త్రీవాదం జన బాహుళ్యంలోకి వెళ్తుంది. సంఘటితమవ్వటానికి ఒక చోటుని కల్పించి, ఉమ్మడి భూమికగా మారి, స్త్రీలందరినీ కలపగలిగే సమస్య ఇది.