ఆధునిక అమ్మాయీ! ఒక్కసారి
నీ బలమెంతో దృష్టి సారించుకో
కర్కోటక రక్కసి మూకల నుంచి
కిరాతకుల నుంచి కాపాడను
నీ కోసం ఎవరో రారు నీకు నీవే రక్ష
యాప్‌నో పోలీస్ నంబర్‌నో దాచుకో
కరాటేనో, పెప్పర్ స్ప్రేనో నమ్ముకో
బిడ్డా! నీ జాగరూకతే నీ ఆయుధం
ప్రతి అడుగునూ ఆచి తూచుకో
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష !
మిత్రులు షికార్లకీ, సినిమా కబుర్లకీ
స్నేహితులు సూచనలకీ పరిమితం
సన్నిహితులు, ఆత్మీయులు కొంతవరకే
నీ దారుల్లో ప్రమాదాలకు నీదే బాధ్యత
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష !
అత్యుత్సాహానికి అదుపు కళ్ళెం అందం
భావుకత్వానికి కాగితాల్లో చెయ్యి పదిలం
రంగురంగుల కలలమ్మే సినీ మాయ చిత్రాలు
రూకల కోసం యువతను బలిచ్చే మరాఠీలు
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష !
ఇన్ఫాట్యుయేషన్లూ, ఫస్ట్ లవ్వులూ
బతుకునావను ముంచేసే సుడిగుండాలు
ఎమోషన్లు అవమానాలకు రహదారులు
ప్రేమబంధాలు పీకతెంచేసే ఉరికంబాలు
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష !
వాస్తవ లోకజ్ఞానం అలవరచుకో
లాజికల్ రీజనింగ్ గుర్తుంచుకో
నిర్భయ, దిశల్ని మననం చేసుకో
తోడేళ్ళ గుంపుని సదా గమనించుకో
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష !
కవిత్వం చెప్పే కాలనాగుల్ని కనిపెట్టుకో
నిదానంగా, నిబ్బరంగా నడచుకో
జనారణ్యమిది… ఒళ్ళంతా కళ్ళు పెట్టుకో
నిత్యం నీకు నీవే భద్రం చెప్పుకో
నీ కోసం ఎవరూ రారు నీకు నీవే రక్ష!