నలభై అయిదు మంది ఇంతుల ప్రయాణ అనుభవాల ముచ్చట్లే ‘ఇంతియానం’. స్వర్ణ ఈ పుస్తకం గురించి చెప్పగానే, తన ప్రయత్నం చూసి మురిసిపోయాను. పుస్తకం చేతిలోకి రాగానే ప్రయాణపు విలువ తెలిసినదాన్ని కాబట్టి ఆబగా హత్తుకొని చదివాను.
చదివినంతసేపూ ఈ నలభై అయిదు మందిలో ఏదో ఒకచోట నాకు నేను దొరుకుతూనే ఉన్నాను. కొత్త ప్రాంతాల గురించి తెలుసుకుంటూ, కొత్త అందాలను ఆస్వాదిస్తూ మన అంతరింగాన్ని సుసంపన్నం చేసుకునే ద్వారాలు ప్రయాణాలు. ఏ ప్రదేశాన్ని ఏ దృష్టితో చూడాలి, అక్కడి ప్రాంతీయతను ఎలా స్వీకరించాలి, ఆ ప్రాంతపు ఆహారాన్ని ఎలా రుచి చూడాలి అని ఎవరికి వారు ఎక్స్‌ప్లోర్ చేసి తెలుసుకోవాల్సిందే. అయినా ఈ వ్యాసాలలో దానికి కావలసిన సూచనలు చాలా దొరుకుతాయి. ఈ పుస్తకం చాలామందికి రీచ్ కావాలి. ప్రయాణాల పట్ల ఆసక్తి లేని వాళ్ళు చదవాలి. ప్రయాణపు అవకాశాలు క్రియేట్ చేసుకోని వాళ్ళు చదవాలి. వెళ్దాంలే అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చదవాలి. వాళ్ళలో ప్రయాణ కాంక్ష పెరగాలి. అనుభవాలని ఒడిసిపట్టుకొని ఆ ఆనందాన్ని వారూ అనుభవించాలి. యాత్రల పట్ల ఆసక్తి ఉన్నవారు విభిన్న ప్రాంతాల పరిచయం కోసం చదవాలి. ఏ యాత్ర ఎన్నుకోవాలి, ఈ సీజన్‌లో ఏది ప్లాన్ చేసుకోవచ్చు అనే అవగాహన వస్తుంది.
ఇక వ్యాసాల గురించి వివరాల్లోకి వెళ్తే ఒక్కో అనుభవం ఒక్కో పాఠమే. అచ్చెరువు చెందించే ఆలోచనా విధానం, వైవిధ్య యాత్రా నేపథ్యం, సాహసాలూ వీటిల్లో ఉన్నాయి. ఒక్కో కథనం ఒక్కో ప్రదేశాన్నే కాదు ఒక్కో స్త్రీ అంతరంగాన్ని, జీవన తాత్వికతనూ కళ్ళముందు నిలుపుతుంది. యాత్రలు ఇలా కూడా చేయొచ్చా, ఇలా బయటా లోపలా ఇంత కొత్తగా మనకు మనం దొరుకుతామా అనే సంభ్రమం కలుగుతుంది. తల్లిదండ్రులను కోల్పోయి అంతులేని దుఃఖంలో ఉన్న అపర్ణ తోట హిమాలయాల్లోకి ఒంటరిగా ప్రయాణం చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో సాంత్వన పొందుతారు. జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రయాణాన్ని ఆసరాగా తీసుకున్న తీరు ఒక మంచి ఆలోచన. ఆనాటి శిల్పకళను చూసి చెక్కిన చేతులకు జోహార్లు అని రాసుకున్నారు ఆలమూరు సౌమ్య. బాల్యంలోకి గెంతులు వేస్తూ ప్రకృతి సౌందర్యంలో ఓలలాడిరచారు ఉమా నూతక్కి.
ఓల్గా హిమాలయా పర్వతాల అందాన్ని, రాణి ప్రసాద్ ఆల్ఫ్స్ పర్వతాల అందాల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అంటూ వాటిని మన కళ్ళముందు నిలిపేలా వర్ణించారు. ఇక కంభంపాటి సీత సాహస యాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక హిమానీ నదాన్ని అవలీలగా ఈదుతుంటే స్థానికులే చప్పట్లతో అభినందించడం చూడచక్కని అనుభూతి. పాపికొండల అందాన్ని అనుభవిస్తూనే మళ్ళీ వాటిని తిరిగి చూడగలనా అని మధనపడతారు కల్పనా రెంటాల. ట్రైనింగ్ కోసం మొదటిసారిగా ఒంటరిగా విదేశీయానం చేసిన కవిత పులి, అలతి అలతి పదాలతో కొత్త ప్రదేశాలను వర్ణిస్తూనే అనేక సామాజిక అంశాలను స్పృశించారు. ప్రయాణంలో కొత్త స్నేహాలూ దొరుకుతాయని తెలియజెప్పి, ఒంటరిగా వెళ్ళి సమూహంలా ఇంటికి చేరుకుంటారు.
కాత్యాయని విద్మహే కలకత్తా మీదుగా సిక్కింలో చైనా సరిహద్దుల దాకా చేసిన యాత్రలో పొందిన గాఢమైన అనుభవాలు, హృదయ దఘ్నమైన అనుభూతులు, జ్ఞానదాయకమైన జ్ఞాపకాలు పుస్తకానికి పరిమళాలు అద్దాయి. చిన్న వయసులో ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి కుప్పిలి పద్మ చేసిన సోలో యాత్ర మన సోల్‌నీ నింపుతుంది. తన అనుభవాలను పంచుకుంటూ ‘‘ఇది ఒంటరి ప్రయాణమా! ఎక్కడా… మన చుట్టూ మనుషులు ఉంటారు. మనల్ని పట్టించుకునేవాళ్ళు ఉంటారు. మనం పట్టించుకునే మనుష్యులుంటారు’’ అని చెప్తే ఆ మాటల నుండి చాలాసేపు కదలలేక పోయాను. మనుషులు మెకానికల్ అయిపోతున్నారు అని వాపోతామే… ఎంత చెమ్మ మిగిలి ఉందీ… అదే కదా ఇంకా లోకంలో ఇంత ఆనందాన్ని మిగిల్చింది. మల్లీశ్వరి జాక్ లండన్‌ను పలవరిస్తూ ఆయన విగ్రహాన్ని వెతుకుతూ అమెరికా వీథుల్లో తిరగడం చూస్తే ఇది కదా మన అభిమాన రచయితకు మనం ఇచ్చే ప్రేమ అనిపిస్తుంది. ఆయన పుస్తకాలను మరోసారి వెతుక్కొని చదువుకుంటాం. సునీతారాణి నేటివ్ కెనడాను, కొండవీటి సత్యవతి కాశీ యాత్రను కొత్త కోణంలో చూపిస్తారు. బుద్ధుడ్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా ఒక్కసారైనా బుద్ధగయ వెళ్ళాలి అనుకునే సత్యవతి బుద్ధగయను సందర్శించి శాంతిని పొందుతారు. న్యూజీలాండ్ జీవన విధానాన్నీ, అందాన్నీ అబ్బురపడేలా రాశారు జయశ్రీ అబ్బినేని. అమరనాథ్ యాత్రలో భక్తి, సాహసం, ప్రకృతి మైమరపు, సైనికుల సామీప్యం లాంటి అన్ని కోణాలను ఆవిష్కరించారు జ్వలిత. రaాన్సీ చేసిన ‘పిల్లలతో ఆస్ట్రేలియా ప్రేమయాత్ర’తో మనమూ ప్రేమలో పడతాం. రaాన్సీ పాపుదేశి బెల్లిగుండి జలపాతం ట్రెక్కింగ్ చదివాక కొత్త షూస్ కొనుక్కొని మనమూ ట్రెక్కింగ్‌కి సిద్ధమవుతాము.
సరిత భూపతి తన కాశీయాత్రను ఎంత హాస్యంగా రాసారనీ, బారిస్టర్ పార్వతీశంను గుర్తు చేసేలా ఉంది. నవ్వుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ తిప్పడి కొండపర్తి యాత్ర తీసి చదువుకోవడమే. శిలాలోలిత, నీరజ అండమాన్ అందాల్ని, ఆటపాటల్ని, చరిత్రని కళ్ళకు కట్టారు. సినిమా షూటింగ్ కోసం నేపాల్ వెళ్ళిన నీహారిక తన కంటి కెమెరాతో నేపాల్‌ని షూట్ చేసి మనకు చూపించారు. యాత్రలతో తన జీవితంలోని ఒంటరితనాన్ని తరిమికొట్టిన రమా శాండిల్యను ఆదర్శంగా తీసుకోవాల్సిందే. తన కథనంలోని కొన్ని వాక్యాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో. యాత్ర అంటే ఏ విదేశాలకో, దూరప్రాంతాలకో వెళ్ళడం కాదు. మన ఊర్లో ఉన్న చెరువునో, అడవినో చూసి అంతే సంబురపడొచ్చు అని తెలియచెప్పారు వాడ్రేవు వీరలక్ష్మి. రాజవొమ్మంగిలో బయలుదేరి ‘ఈ అడవి దాటిపోనా’ అంటూ తనతో పాటు మనల్నీ అడవి దాటిస్తారు. మౌంట్ కైలాష్ యాత్రకు ఎలా సన్నిద్దం కావాలో విజయ నాదెళ్ళ వ్యాసంలో తెలుసుకోవచ్చు.
పద్మ మీనాక్షి లాండోర్ ప్రయాణం ఒక మంచి మెలోడియస్ పాటలా సాగుతుంది. దేవభూమితో పరిచయం ఒకనాటితో తీరదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని ఉత్తరాఖండ్ యాత్రను ముగించిన సుజాత వేల్పూరితో పాటు మనమూ గంగను ఆవాహనం చేసుకుంటాం.
నర్మద రెడ్డి నమీబియా ఎడారి అందాలను, నస్రీన్‌ఖాన్ ఢల్లీి వైవిధ్యాన్ని, శైలజ కాళ్ళకూరి శ్రీలంక విస్తృత పర్యటనను, షేక్ సలీమా పంజాబ్ స్ఫూర్తి యాత్రను, సుభాషిణి కేరళ ప్రకృతి యాత్రను, సయ్యద్ నజ్మా అజ్మీర్ దర్గా సందర్శననీ, సుమతి చూరుకంటి నాగాలాండ్ యాత్రానుభవాలను తమ వ్యాసాల్లో పొందుపరచారు. చిన్నప్పుడెప్పుడో పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న ప్రదేశాలు కళ్ళముందు ప్రత్యక్షమైతే ఆ ఆనందమే వేరు. ఆ ప్రదేశ చరిత్రను గుర్తు చేసుకుంటూ, తడిమి తడిమి, తరచి తరచి చూసేవారి అనుభవాలు ఎంతో ఆసక్తిదాయకం. వి.బి.సౌమ్య యూరోప్‌లో చేసిన పాస్‌పోర్ట్ లేని విదేశీయానం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. వసుధా రాణి అమెరికాలో మంచుకొండలను చూడడానికి వర్షంలో బయలుదేరి గమ్యం రెండు మైళ్ళ దూరం ఉందనగా మంచు తుఫాను నుంచి తప్పించుకొని వెనక్కి తిరిగి ఇంటికి చేరి, గమ్యం చేరని ప్రయాణం గొప్ప జీవితానుభవం ఇచ్చింది అంటారు. ఈ రెండూ ఆపకుండా చదివించే సాహస యాత్రలే.
ఆదివాసుల కోసం తన ప్రాణాలను బలిచ్చిన బస్తర్ రాజు ‘ప్రవీర్ చంద్ర’ మూలాలను వెతుక్కుంటూ ఛత్తీస్‌ఘడ్‌లోని జగదల్‌పూర్‌కి ప్రయాణం చేశారు పూదోట శౌరీలు. భరణీ చిత్రలేఖ ఆసిఫాబాద్ అడవుల్లో బర్డ్ వాక్ కోసం వెళ్లి అక్కడి అటవీశాఖ ఉద్యోగుల అతిధి మర్యాదలను ముచ్చటగా పంచుకున్నారు. శాంతి ప్రబోధ ఒరిస్సాలోని గిరిజన ప్రాంతానికి ఒక సర్వే కోసం వెళ్ళి కొత్త రకం జీవన విధానాలను, జీవన ప్రస్థానాలను అవగాహన చేసుకొని తన వ్యాసంలో పొందుపరిచారు.
రొంపిచర్ల భార్గవి గుజరాత్‌లో ప్రతి సందర్శనీయ ప్రదేశాన్ని పంచుకుంటూ, అక్కడ తను కలిసిన ఒక అమ్మాయి ఉదంతాన్ని వివరిస్తారు. ఇది చదివాక యాత్రలు మనుషులను, మనసులను ఎలా విశాలం చేయగలవు, కొత్త ప్రదేశంలో కొత్తగా తెలుసుకోవడంతో పాటు కొత్తగా ఎలా ఆలోచించగలుగుతాం అని కూడా అనుభవంలోకి వస్తుంది. సుజాత గొట్టిపాటి తన జపాన్ పర్యటనను ఎంతో లోతుగా విశ్లేషించారు. అణుదాడి నుండి అత్యుత్తమ స్థాయికి ఆ దేశం ఎలా చేరగల్గిందో తెలుసుకోవడం స్ఫూర్తిదాయకం.
సి.వనజ రాసిన మెక్సికో గోడలమీద మ్యూరల్స్ గురించిన వ్యాసం ఒక అద్భుతం. సమాజంలోని అనేక సాంఘిక వర్గపు ప్రతినిధుల కుడ్యచిత్రాల వర్ణనలను వివరించారు. మనందరికీ తెలిసిన దక్షిణాఫ్రికా కాకుండా, తెలియని మరెన్నో కోణాలను, అందమైన విశేషాలను, దాగున్న అంధకారాన్ని గురించిన ఆవేదనను వేమన వసంతలక్ష్మి ‘మదర్ సిటీ మహా సౌందర్యవతి’లో చదవాల్సిందే.
స్వాతి పంతుల కథనం ద్వారా హిమాలయాల ట్రెక్కింగ్‌కి ఎలా సన్నద్ధం కావాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలుసుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా నాకు ప్రేరణ ఇచ్చిన వ్యాసం. ఫిట్‌నెస్, ధైర్యం రెండూ ఇంకా పెంచుకోవాలని అనుకున్నాను. రావులపల్లి సునీత స్విట్జర్లాండ్ అనుభవాలలో అక్కడి అందాలకంటే అక్కడ పరిచయమైన వ్యక్తులను గురించి ఎక్కువగా చెప్తారు. ప్రయాణమంటే కొత్త ప్రదేశాలు చూడటంతో పాటు, కొత్త మనుషులతో పరిచయాలూ, వారి జీవితానుభవాలూ తెలుసుకోవాలంటారు.
చివరగా సంకలన కర్త స్వర్ణ కిలారి వ్యాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక పుస్తకాన్ని రాయడం కోసం ఆ సంఘటన మూలాలను వెతుక్కుంటూ థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్‌కి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఈ కథనంలో పొందుపరిచారు. దీనిద్వారా ఒక పుస్తకం తీసుకురావడంలో తన నిబద్ధత స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఈ ‘ఇంతియానం’ని తీసుకురావడంలో ఉన్న కృషి ప్రతి పేజీలో కనిపిస్తుంది.
ఇక ఆలస్యం ఎందుకు పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని విశ్వప్రయాణం చేసేద్దాం. ట్రావెల్ ప్లానర్సతో రొటీన్‌గా చేసే ప్రయాణాలే కాకుండా మరో భిన్నమైన ప్రపంచాన్ని కూడా చూసి వద్దాం. అలాంటి యాత్రలు మనమూ చేయొచ్చు అనే స్ఫూర్తినీ పొందుదాం. ఈ ఉత్సాహంలో కొత్త ప్రయాణాలు చేసి మరో ‘ఇంతియానం’ను సృష్టించేద్దాం.