‘ఎల్‌జిబిటిక్యూ భారతీయ సంస్కృతిలో భాగమే’ – దీప్తి సిర్ల

ముకుంద మాల మన్నెం. తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి ‘‘మాలా ఆంటీ’’. ఈవిడతో మాట్లాడుతూ ఉన్నంతసేపు మాక్సిమ్‌ గోర్కీ నవల ‘‘అమ్మ’’లో అమ్మ పాత్రలోని కొన్ని కోణాలు మనకు కనబడతాయి. ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన మహిళ, తన బిడ్డ కోసం ఎలా అవరోధాలని అధిగమిస్తూ తన

బిడ్డ పోరాటంలో భాగమై ఒక కొత్త వ్యక్తిగా ఆవిర్భవించిందో చెబుతుంది ఈ కథ. ‘‘అమ్మ’’లో నీలోవ్నా వ్లాసోవా ఛాయలు కొన్ని మాలా ఆంటీలోనూ ఉన్నాయి. నీలోవ్నాకి తన కొడుకు భాగమై ఉన్న శ్రామిక పోరాటం గురించి ఎలాంటి అవగాహనా ఉండదు. కానీ, ఆ తర్వాతి కాలంలో తనూ అందులో భాగమై కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మాలా ఆంటీ కూడా ఎల్‌జిబిటిక్యు (LGBTQ) వ్యక్తుల గురించి అసలేమీ తెలియని స్థాయి నుంచి వాళ్ళ కోసం పోరాడే స్థాయికి ఎదిగి కమ్యూనిటీ పరంగా కీలక వ్యక్తిగా మారారు.
ఆన్యా తల్లి మాలా గురించి కాకుండా ముందు మాలా అనే వ్యక్తి గురించి చెప్పండి.
నేను పుట్టి పెరిగింది విశాఖపట్నంలో. మా నాన్నది కాకినాడ, అమ్మది చెన్నై దగ్గర. మా అమ్మ మాతృభాష కన్నడ. మేము లింగాయత్‌లం. దానివల్ల మాకు అటువైపు పెళ్ళి సంబంధాలు దొరకవని మా నాన్న మా మాతృభాష కన్నడ అని రాయించారు. ఎందుకంటే, ఆంధ్రాలో కట్నాలు చాలా ఎక్కువ. మేము ఐదుగురు ఆడపిల్లలం, ఇద్దరు మగపిల్లలు. ఐదుగురు ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్ళి చేయడం కష్టం. కర్ణాటకలో కట్నాలు లేవు కాబట్టి అక్కడే మాకు సంబంధాలు చూద్దామని మా మాతృభాష కన్నడ అని పెట్టారు. చదువంతా విశాఖపట్నంలోనే సాగింది. ఇంటర్మీడియట్‌ అయ్యాక, ఇంక మా నాన్నమీద ఆధారపడకూడదని అనుకున్నా. ఆయన ఏడుగురు పిల్లల్ని చదివించారు. అప్పుడే రిటైరయ్యారు. నేను ఆరవ సంతానం. నా తర్వాత ఒక చెల్లి ఉంది. ఇంకా ఆయన మీద ఆధారపడకూడదని చెప్పి నాకు చెన్నైలో ఉద్యోగం రావడంతో వెళ్ళి చేరిపోయాను. చిన్న ఉద్యోగమే. 1989లో స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగం, జీతం రెండు వందల రూపాయలు. అక్కడికి వెళ్ళిపోయి ఇండిపెండెంట్‌గా ఉండడం మొదలుపెట్టాను. అప్పుడు మా చుట్టాలు మా నాన్నని అడిగేవారు, అదేంటి ఆడపిల్లని ఒక్కదాన్నే అలా వేరేగా ఉంచావ్‌, మంచిది కాదు అని. కానీ నాన్న అవేవీ పట్టించుకునేవారు కాదు. ఆయనది ఫార్వర్డ్‌ థింకింగ్‌. మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీరెవరూ నాకు చెప్పనక్కర్లేదు అని వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. చెన్నైలో ఉద్యోగం చేస్తుండగానే ఈ సంబంధం వచ్చింది. ఆ తర్వాతే హైదరాబాద్‌ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాను.
మీరేమి చదివారు? ఉద్యోగం ఎప్పుడు మొదలుపెట్టారు?
ఇంటర్‌ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదివాను.
అంటే చాలా చిన్న వయసులోనే ఒక్కరే చెన్నై వెళ్ళి ఉద్యోగం మొదలుపెట్టారు. అయితే మొదటినుంచే స్వతంత్ర భావాలు ఉన్నాయి మీకు.
ముందు నుంచీ అంతే. పదో తరగతి పరీక్షలు ఎప్పుడెప్పుడైపోతాయా, ఎప్పుడు టైప్‌ రైటింగ్‌ నేర్చుకుంటానా అని ఎదురు చూసేదాన్ని. పదో తరగతి సెలవుల్లోనే టైప్‌ రైటింగ్‌ నేర్చేసుకున్నా. సర్టిఫికెట్‌ చేతికి రాగానే పరీక్ష కూడా రాశా. అలాగే టైప్‌ రైటింగ్‌ హయ్యర్‌ కూడా అయిపోయింది. స్టెనోగ్రఫీ నేర్చుకున్నా. పరీక్ష రాయలేదు, కానీ మంచి అనుభవం ఉంది అందులో. ఆ విధంగా స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయి పెళ్ళయ్యాక హైదరాబాద్‌ వచ్చేశాను. మా వారి ఉద్యోగం హైదరాబాద్‌లో ఉండేది.
లింగాయత్‌లు సంప్రదాయంగా ఉంటారు కదా. మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది?
అవును. సంప్రదాయంగా ఉంటారు, కానీ మా అమ్మా నాన్న అసలు సంప్రదాయవాదులు కారు. మేము లింగపూజ చేయాలి. అదొక్కటే చేస్తారు అంతే. ఇక వేరే పండగలకి గుళ్ళకి వెళ్ళాలి, పూజలు చేయాలి అనే ఆంక్షలు ఉండేవి కావు. లింగపూజ మాత్రమే చేసేవాళ్ళు. ఉన్నదాంట్లోనే మమ్మల్ని బాగా చూసుకున్నారు. జీతం తక్కువే. ఆ రోజుల్లో అంత తక్కువ జీతానికి అంతమంది పిల్లల్ని పెంచడం కష్టమే. అయినా కూడా నాన్న ఒకరికి చదువు చెప్పించడం, పుస్తకాలు కొనడం లాంటి సహాయం చేస్తుండేవారు. అదే మాక్కూడా వచ్చింది. మేము చదువుకునేటప్పుడు పదో తరగతిలో స్కూల్‌కి వెళ్ళడానికి బస్సు టిక్కెట్‌కి సరిపడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో టికెట్‌ ఏడు పైసలు. మాకు పధ్నాలుగు పైసలు ఇచ్చేవాళ్ళు. మేము వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చేవాళ్ళం. అలా డబ్బులు మిగుల్చుకునేవాళ్ళం. నేను, అక్క, ఇంటి పక్కన ఇద్దరు పిల్లలు… అందరం ఒకే స్కూల్‌. అందరం కలిసి నడిచి వచ్చేవాళ్ళం. ఆ డబ్బులతో లెప్రసీ వచ్చిన వాళ్ళకి ఏదైనా కొనేవాళ్ళం. అలా చిన్నప్పటి నుంచే మాకు అలవాటైంది. అలాగే, కట్నం తీసుకునేవాళ్ళని చేసుకోనని చెప్పేశాను. నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళయినా ఫర్వాలేదు కానీ కట్నం తీసుకునే వాళ్ళని వద్దన్నాను. ఒక డ్రైవర్‌ సంబంధం వస్తే దానికి కూడా అంగీకరించాను. వాళ్ళకి డబ్బుంది, కానీ చదువు లేదు. చదువు, సంస్కారం నేను నేర్పించుకోవచ్చునని ఆ సంబంధానికి ఓకే చెప్పాను. కానీ అప్పట్లోనే వాళ్ళు కట్నంగా పదివేలు అడిగారు. 1983లో అది చాలా పెద్ద మొత్తం. పెళ్ళి కూడా మేమే చెయ్యాలన్నారు. వెంటనే నో చెప్పేశాను. మావారు కట్నం లేకుండానే చేసుకున్నారు. ముందు నుంచి కూడా కొన్ని సిద్ధాంతాలు పాటించాను. మా అమ్మానాన్నల నుంచి పుట్టుకతోనే వచ్చాయి. మా నాన్న కూడా మమ్మల్ని ఎప్పుడూ ఆడపిల్ల కదా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పలేదు. ఆయన బయటనుంచి వచ్చేసరికి మేము వంటగదిలో కనిపించకూడదు. మా గదిలో మేముండాలి. ఆయన ఎప్పడూ చెప్పేవారు, ‘‘లోకజ్ఞానం, చదువు అనేవన్నీ నీకు పెళ్ళయ్యేలోపే అయిపోవాలి. ఈ వంట పెంట ఇల్లు చూసుకోవడం లాంటివి జీవితాంతం ఎలాగూ ఉండేవే. చదువు, లోకజ్ఞానం అనేవి పునాదులు. ఇప్పుడివి నేర్చుకుంటే జీవితాంతం తోడుంటాయి. నీ జీవితాన్ని నువ్వు మెరుగుపరచుకోవచ్చు. అది ముఖ్యం కాదు, ఇది ముఖ్యం. అందుకే వీటిమీదే ఫోకస్‌ పెట్టు’’ అనేవారు. ఆయన మాకు పనులు అప్పగించి బైటికి పంపేవారు. మేము ప్రయాణాలు బాగా చేసేవాళ్ళం. రైల్వే పాస్‌ ఉండేది. బాగా ట్రావెల్‌ చేసేవాళ్ళం. ఒక్కోసారి నాన్న మమ్మల్ని కావాలనే రైల్వేస్టేషన్‌కి వెళ్ళి టికెట్‌ పోస్ట్‌పోన్‌ చేసుకుని రమ్మనేవారు. మేము అప్పటికి పదో తరగతిలో, ఇంటర్‌లో ఉన్నాం. ఆ సమయంలో మమ్మల్ని అలా బైటికి పంపేవారు, అదికూడా వేరే చోటికి. మేము బాగా చిరాకు పడేవాళ్ళం. అమ్మ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసేవాళ్ళం. ‘‘ఏంటి ఈయనకి ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? మనిషేనా ఆయన? ఆడపిల్లల్ని అలా పంపిస్తారా ఎక్కడైనా’’ అని అమ్మతో పోట్లాడేవాళ్ళం. నాతో ఎందుకు గొడవ వెళ్ళి మీ నాన్ననే అడగండి అనేది అమ్మ. కానీ మాకు తెలీదు ఆయన మమ్మల్ని ఫాలో అవుతున్నారని. ఒకరోజు ఒక ఘటన వల్ల తెలిసింది. ఏదో జరిగి మేము గాభరా పడుతుంటే అప్పుడు పక్కనుంచి ఆయనొచ్చారు. అప్పుడన్నారు, ‘‘నేను పిచ్చివాణ్ణి కాదుగా, మీకు ఇలాంటి సమస్యలు వస్తాయని తెలుసు. కానీ, సమస్యలు ఎలా ఎదుర్కోవాలో కూడా మీకు తెలియాలి కదా. ఒక అమ్మాయిగా మీరు ఇవన్నీ నేర్చుకోవాలి కదా. నేనెప్పుడూ వెంటే ఉండేవాణ్ణి, అది నీకు తెలీదు’’ అని. ఇదంతా నాకు చాలా ఉపయోపగపడిరది. ఆ విధంగా ఉండడం వల్లే మేము భర్త మీద ఆధారపడే అవసరం రాలేదు అన్నింటికీ. మావారు సహాయం చేస్తారా చేయరా అనేది అనవసరం. మేము స్వతంత్రంగా ఉన్నాం. నన్ను టికెట్‌ కొనుక్కొని ఏ దేశానికి వెళ్ళి రమ్మన్నా నేను రెడీ. మా పెంపకం వల్ల ఇలా ఉన్నాం. మావారు కూడా అంతే. బాగా సంప్రదాయవాది కాదు. పెళ్ళయిన తర్వాత నేను ఆయనకి చెప్పాను, చాలా చిన్న వయసులో… అంటే 18 ఏళ్ళకే ఉద్యోగం మొదలుపెట్టాను కాబట్టి ఇప్పుడు రెస్ట్‌ తీసుకుందామని అనుకుంటున్నాను, ఉద్యోగం చేయాలని లేదు, ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అది విని ఆయన అలా కుదరదని చెప్పేశారు. ‘నువ్వు ఉద్యోగం చేయాలి. రేపు మనకి ఓ కొడుకు పుడితే, తను, తన భార్య కూడా ఉద్యోగం చేయాల్సిందే. ఎవరూ ఇంట్లో కూర్చోవద్దు’ అన్నారు. ఇదంతా డబ్బు గురించి కాదు, మేము స్వతంత్రంగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. అలా ప్రోత్సహించారు. నేను ప్రైవేట్‌ కంపెనీలో కదా చేసేది, అక్కడ పని ఎలా ఉంటుందో తెలుసు కదా. ఓసారి బాగా విసిగిపోయి రాజీనామా చేస్తానన్నాను. అప్పుడు ఆయన, ‘‘వద్దు, నువ్వు నాకంటే ఎక్కువ జీతం సంపాదించాలి’’ అన్నారు. వేరే మగ వాళ్ళు అలా అంటారా? ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. ఆన్యా విషయంలో మొదటి నుంచి ఆయన నాతో ఉన్నారు. ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. వాళ్ళ కుటుంబం మాకు సపోర్టుగా లేదు కానీ ఆయన బాగా సపోర్టుగా ఉన్నారు.
మీ అమ్మగారు ఉద్యోగం చేసేవారా?
లేదు. తను పదో తరగతి చదివింది. ఆ రోజుల్లో పదో తరగతి అంటే ఇప్పుడు పీజీతో సమానం. కానీ ఆవిడకి ఎంతో టాలెంట్‌ ఉంది. ఆర్ట్‌, సంగీతం, డాన్స్‌ అన్నింట్లో తనకి ప్రవేశం ఉంది. ఆవిడ మాకు నేర్పేవారు కూడా. స్కూల్‌ ఫంక్షన్స్‌ కోసం ఆవిడే మమ్మల్ని తయారుచేసేది. అప్పట్లో తను మహిళా మండలికి కూడా వెళ్ళేది. ఆ రోజుల్లో మహిళా మండలి అంటే ఇప్పటి కిట్టీ పార్టీల్లా కాదు, చాలా కార్యక్రమాలు ఉండేవి. వాటికి వెళ్ళేవాళ్ళం. అలా చాలా నేర్చుకున్నాం, తెలుసుకున్నాం.
హైదరాబాద్‌ వచ్చాక మీరు ఏం చేసేవారు?
ఇక్కడికి వచ్చినపుడు ఉద్యోగం లేదు, ఇంట్లో ఉంటానంటే ఆయన ఒప్పుకోలేదు. పేపర్‌లో ప్రకటనలు చూసి చిన్న చిన్న కంపెనీల్లో అప్లై చేసా. కానీ అవి నచ్చక ఆరు నెలలకే మానేసేదాన్ని. చివరికి లాన్‌వీర్‌, నాగార్జున ఫైనాన్స్‌ కంపెనీల్లో చేశా. అవి మంచి కంపెనీలే. ఆఖరికి ఐటిసిలో కొంతకాలంచేసి కోరమండల్‌లో పాతికేళ్ళు చేశాను.
డిగ్రీ చదివారా?
చెన్నైలో ఉద్యోగం చేసేటప్పుడే డిగ్రీ చదివాను. ఉద్యోగం చేస్తూ పరీక్షలకి వైజాగ్‌ వెళ్ళొచ్చేదాన్ని. ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎ. డిగ్రీ పూర్తి చేశాను.
కోరమండల్‌లో ఏం చేశారు?
సెక్రటరీగా చేశా. అది చేసి చేసి ఇంకా ఎన్నాళ్ళు ఇదే పని చేయాలి అనిపించింది. అప్పుడు SAP స్టార్ట్‌ అయింది. నా కొలీగ్స్‌ దగ్గర కూర్చొని అది నేర్చుకున్నా. ఆ తర్వాత ఇంక సెక్రటరీగా వద్దని, లైన్‌ ఛేంజ్‌ చేయమని రిక్వెస్ట్‌ చేశా. అలా కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌లోనూ చేశాను. ముందు SAP-FICO నేర్చుకుని తర్వాత MM నేర్చుకున్నా. వీవీ మాడ్యూల్‌లోనే రిటైరయ్యాను. కమర్షియల్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరయ్యాను.
పెళ్ళయ్యాక ఎన్నేళ్ళకి బాబు పుట్టాడు?
మూడేళ్ళ తర్వాత. మేము అలా ప్లాన్‌ చేసుకున్నాం. ఆర్థికంగా అంత బలంగా లేము కాబట్టి మూడేళ్ళు ఆగాలని అనుకున్నాం. మూడేళ్ళ తర్వాత బాబు పుట్టాడు. బాబుని ఎవరి దగ్గరా వదిలిపెట్టలేదు. అత్తయ్య దగ్గరకానీ, అమ్మ దగ్గర కానీ ఉంచలేదు. బాబుకి ఆరునెలలు వచ్చాక బేబీ కేర్‌ సెంటర్‌లో వేసి ఆఫీసుకి వెళ్ళేవాళ్ళం. తను చదువుకోవడం ఒక చిన్న స్కూల్లోనే. తెలివి ఉంటే ఎక్కడ చదివినా బాగానే ఉంటుందని మావారు అన్నారు. అందుకే దగ్గర్లోని ఒక చిన్న దాంట్లోనే వేశాం. ముందు నుంచి కూడా మా బాబు చాలా బాధ్యతాయుతంగా ఉండేవాడు. ఎల్‌.కె.జి నుంచే స్కూల్‌ నుంచి వచ్చాక ఒకడే ఉండేవాడు. మూడున్నరేళ్ళు బేబీ కేర్‌ సెంటర్‌లో ఉన్నాడు. ఆ తర్వాత స్కూల్‌లో వేశాక ఒక్కడే ఉండేవాడు.
మీకు ఒక్కరే బిడ్డ కాబట్టి తనమీద మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా!
లేదు. మేమసలు ఏమీ అనుకోలేదు. తను డాక్టర్‌ అవ్వాలనో, ఇంకేదో అవ్వాలనో అనుకోలేదు. తనకి మంచి అలవాట్లు మాత్రం నేర్పించాము. మేము ఆఫీసు ఉన్నా, లేకున్నా పొద్దున్నే నాలుగున్నరకి నిద్ర లేస్తాం. ఇప్పటికీ అంతే. తనకి కూడా అదే అలవాటు. అమెరికా వెళ్ళినా కూడా అదే కొనసాగిస్తోంది. పొద్దున్నే లేచి యోగ, మెడిటేషన్‌, వాకింగ్‌ ఏదో ఒకటి చేస్తుంది. మేము కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. అమ్మాయికి కూడా అదే అలవాటైంది. చాలా క్రమశిక్షణతో పెంచాం. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాం. డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని ఎంత అడిగితే అంత ఇవ్వడం లాంటిది ఎప్పుడూ చెయ్యలేదు. డబ్బుల గురించి అన్నీ చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళం. డబ్బు గురించి, వస్తువుల విలువ గురించి వివరించేవాళ్ళం. అప్పట్లో నన్నో పిచ్చిదానిలా చూసేవాళ్ళు అందరూ. వెక్కిరించేవాళ్ళు కూడా అబ్బాయికి అన్నీ చెప్తున్నానని. ఏదైనా కొన్నప్పుడు బాబుకి చెప్పేదాన్ని ఇంత పెట్టి కొన్నా ఇది అని. చాలావరకు ప్లాట్‌ఫారం మీదనో, చిన్న చిన్న దుకాణాల్లోనో కొనేవాళ్ళం. అదే కాక ఫోన్‌ బిల్లు ఇంత, కరెంట్‌ బిల్లు ఇంత అని అన్నీ చెప్పేవాళ్ళం. అలా తనకి అన్నీ చెప్తూ ఉండటంవల్ల తను కూడా చాలా బాధ్యతగా ఉండేది.
మీ సోషల్‌ వర్క్‌ గురించి చెప్తారా? ముందు నుంచే ఇందులో ఆసక్తి ఉందా లేక మీ అమ్మాయి గురించి పని చేశాక మొదలయ్యిందా?
ఇప్పుడు కాదు 2003 నుంచే మొదలుపెట్టాను. నేను రిటైరయ్యాక తనని పెళ్ళి చేసుకోమని పోరు పెడతానేమోనని, నన్ను ఏదో ఒక పనిలో పెట్టేస్తే తన వెంటపడకుండా ఉంటానని అనుకునేది మా అమ్మాయి. అలా తను నన్ను ఎంకరేజ్‌ చేసింది. అదేకాక చిన్నప్పటినుంచి మా నాన్న వల్ల ఆ దృక్పథం ఉంది. ఉన్న కొద్ది సంపాదనతోనే మా నాన్న మమ్మల్ని చదివించడమే కాకుండా లెప్రసీ రోగులకు భోజనం పెట్టించడం, ఎవరైనా పేదవాళ్ళకి సహాయం చేయడం లాంటివి చేసేవారు. అలా మాకు అలవాటయింది. బొల్లారం దగ్గర ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ అని ఒక చిన్న సంస్ధ ఉంది. మా అమ్మాయి టీవీలో చూసి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. తను ముందు వెళ్ళినపుడు అడ్రస్‌ కోసం అడిగితే అక్కడికి ఎందుకు వెళ్తున్నావని తనని తిట్టారంట. అది హెచ్‌.ఐ.వి. రోగుల కోసం పనిచేసే సంస్థ. అప్పటికి తను అబ్బాయిగానే తెలుసు అందరికీ. చిన్నపిల్లాడు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దని అనేవాళ్ళు. తనొచ్చి నాకు చెప్తే నేను తీసుకెళ్ళా. 2003, అంటే అప్పటికి ఆ వ్యాధి గురించి బాగా భయం ఉండేది, నాక్కూడా భయం ఉండేది. మా అబ్బాయి ఆ వ్యాధి ఎలా వస్తుంది అని వివరించి ధైర్యం చెప్పాక వెళ్ళాను. అక్కడ పిల్లలతో సమయం గడపడం, ఆడటం, వాళ్ళతో కలిసి సంస్థలకి కూడా వెళ్ళడం మొదలుపెట్టాను. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ లాగానే ప్రతి వ్యక్తికీ ఇండివిడ్యువల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఉండాలిÑ సమాజం మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా తిరిగి ఇవ్వాలి అని మా అమ్మాయి ప్రోత్సహించేది. అలా తనతో కలిసి వెళ్ళేదాన్ని. 2005లో మా అమ్మాయి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ఉండగా తనకి ఒకటే చెప్పాను, ‘‘తను చంటిబిడ్డగా ఉన్నప్పటినుంచే బేబీ కేర్‌ సెంటర్‌లో పెట్టాల్సి వచ్చింది. అప్పటికి ఫోన్లు లేవు. నాది ప్రైవేటు ఉద్యోగం. చాలా ఇబ్బందులు పడ్డా. అందుకే తను అలాంటి ఇబ్బందులు పడొద్దని ఎంబీబీఎస్‌ అయిపోగానే తనకి నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకొమ్మని, ఒకర్నో, ఇద్దర్నో కని మా చేతిలో పెట్టేసి తన చదువు, కెరీర్‌ మళ్ళీ కొనసాగించమని చెప్పాను. అప్పుడు తను నాకు చాలా పెద్ద కోరికలు ఉన్నాయని, అవన్నీ తీరవని అంది. మిగతా అందరు అమ్మలకి ఉన్నట్లే నాకూ ఆ కోరికే ఉంది అని అన్నాను. నేను ఏవో ఆశలు పెట్టుకుని తర్వాత అవన్నీ తీరక బాధపడొద్దని తను నాకు అబ్బాయిలను చూపిస్తూ బాగున్నారు అనేది. నేను దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఎప్పుడూ అబ్బాయిలనే చూస్తావ్‌, అమ్మాయిలని చూసి ఎవరైనా నచ్చితే నీకు హెల్ప్‌ చేస్తానని చెప్పా. తను అప్పుడు చెప్పింది తనకి అమ్మాయిలు ఇష్టం లేదని. నాకు అర్థం కాలేదు. నాకు అసలు ఈ విషయాల్లో ఏ మాత్రం అవగాహనా లేదని తనకు అర్థమై ఓ ఆదివారం నన్ను కూర్చోబెట్టి తను గే అని చెప్పింది. అంటే ఏంటో నాకు తెలీదు. గే అంటే ఏంటని అడిగాను. తను అర్థం చెప్పాక అలా ఎలా కుదురుతుందని కోప్పడ్డా. అప్పుడు తను నాకు ఎల్‌.జి.బీ.టీ. గురించి చెప్పింది. మొదటసారి వాటి గురించి విన్నా. ఓ పక్క బాధ ఉబికి వస్తున్నా తనని బాధ పెట్టొద్దని అణచుకొని ఏది ఏమైనా నువ్వు నా బిడ్డవే, ఎలా ఉన్నా నాకు సమ్మతమే అని చెప్పా. నేను తనతో ఉంటానని, ముందు చదువు పూర్తిచేయమని చెప్పాను. మెడికల్‌ సైన్స్‌లో కొత్త టెక్నాలజీలు వచ్చాయని, దీని గురించి ఏదో ఒకటి చేద్దామని చెప్పా. తనకి తెలుసు వాటితో లాభం లేదని. అయినా సరే నేను ఎక్కడికంటే అక్కడికి వస్తానని నా తృప్తి కోసం చెప్పింది. ఎక్కడికి వెళ్ళాలో తననే చెప్పమన్నా. తను ఒక సైకాలజిస్ట్‌ దగ్గరికి వెళ్దామంది. అలా వెళ్ళాక సైకాలజిస్ట్‌ నాతో మాట్లాడి నేను అలా రావడాన్ని మెచ్చుకుంటూ దీనికి ఏమీ చేయలేం, తను ఇంతే ఉంటుంది అని చెప్పింది. మర్నాటి నుంచి ఈ కమ్యూనిటీల గురించి ఇంటర్నెట్‌లో చదవడం మొదలుపెట్టాను. ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్‌ చేయడం తప్ప ఏం చేయలేమని అర్థమైంది. మా వారితో చెప్పాను. ఆయన ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి ఇంక దీని గురించి అమ్మాయితో ఏమీ మాట్లాడవద్దని అన్నారు. ఈ దేశంలో ఇలా ఉండడం కష్టం కాబట్టి విదేశాలకి వెళ్ళడం మంచిదని నేను మా అమ్మాయితో అన్నాను. కానీ తను ఒప్పుకోలేదు. కానీ ఎంబీబీఎస్‌ అయిపోయే సమయానికి నేను చెప్పింది నిజమని తనకి తెలిసొచ్చి పీజీ కోసం బైటికి వెళ్ళిపోయింది. బైటికి వెళ్ళాక తను గే కాదని, ట్రాన్స్‌జెండర్‌ అని తను తెలుసుకుని నాకు చెప్పింది. అక్కడే తను హార్మోన్స్‌ తీసుకోవడం మొదలుపెట్టింది. దాంతో శరీరంలో మార్పులు రావడంవల్ల ఇక్కడికి రాలేకపోయింది. ఫోటోలో ఒకలా, బయట ఒకలా ఉండేది. అప్పుడు ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌ ఐడీ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి అప్లై చేయించా. స్వీకార్‌ అనే ఒక సంస్థలో చేరాను. ఈ పనులు చూసుకోవడం మొదలుపెట్టాను. మా అమ్మాయి కోసం చేయడం మొదలుపెట్టి మిగతావాళ్ళకోసం కూడా పనిచేయడం ప్రారంభించాను.
ఇక్కడి కమ్యూనిటీ వ్యక్తులు ఎలా పరిచయమయ్యారు?
మా అమ్మాయి తన గురించి చెప్పాక మొదటిసారి ఇక్కడ ప్రైడ్‌ మార్చ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఇంకో సంస్థలో ట్రాన్స్‌జెండర్లకి సంబంధించిన మీటింగ్‌ ఉంటే వెళ్ళాను. అలా పరిచయాలు పెరిగాయి. అప్పటికి ఇలా తల్లిదండ్రులు ఒప్పుకోవడం అరుదు కాబట్టి అందరూ నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు. అన్ని సమావేశాలకు పిలిచేవాళ్ళు.
మీది ప్రేమ వివాహమా? పెళ్ళికి ముందు నుంచే ఉద్యోగం చేస్తున్నారా?
లేదు. అమ్మవాళ్ళు కుదిర్చిన సంబంధమే. నేను డిగ్రీ పూర్తవకుండానే ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. అదీ చెన్నైలో. ఆ కాలంలో చిన్న వయసులో పెళ్ళి చేసేవాళ్ళు. కానీ పద్దెనిమిది సంవత్సరాలకి వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాను. పెళ్ళి తర్వాత ఉద్యోగం మానేయాలని అనుకున్నా కానీ ఆడవాళ్ళు కూడా సంపాదించాలని మావారి అభిప్రాయం. కట్నం అడిగారని వేరే సంబంధాలు వద్దనుకున్నాం. ఈయన ఏమీ అడగలేదు.
ఒక్కరే సంతానం కదా, ఎలా పెంచాలనుకున్నారు?
మేము ఏమీ అనుకోలేదు. తను డాక్టర్‌ అవ్వాలని కూడా మా ఆలోచన కాదు. కాకపోతే డబ్బులు, క్రమశిక్షణ గురించి మాత్రం అన్నీ చెప్పేవాళ్ళం. తను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా సంపాదన ఎంత, ఇంట్లో ఖర్చులు ఎంత, మిగతా ఖర్చులు ఎంత అని అన్నీ చెప్పేవాళ్ళం. విలువల గురించి చెప్పేవాళ్ళం. తను కూడా అన్నీ అర్థం చేసుకొని మంచి వ్యక్తిగా ఎదిగింది.
సైకాలజిస్ట్‌ మీకు ఏం చేయలేమని చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్టయ్యారు?
చాలా బాధ, నొప్పి కలిగింది. అంటే నాకు కోడలు, మనవలు రారని కాదు, తను జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందేమో అని బాధ. ఇలాంటివన్నీ ముందునుంచి ఊహించిందేమో, మా అమ్మాయి అప్పుడప్పుడూ నాతో కొన్ని విషయాలు చర్చించేది. జీవితంలో పెళ్ళి ఎందుకు, లేకపోతే పెళ్ళి చేసుకున్నా పిల్లలు ఎందుకు, అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా అని మాట్లాడేది. ఇవన్నీ నన్ను పరీక్షించడానికి చేసేది అని తర్వాత అనిపించింది. తన గురించి తాను చెప్పాక ఎవరైనా మంచి అబ్బాయిని చూసైనా పెళ్ళి చేసుకోమని గానీ, కలిసి జీవించమని గానీ చెప్పేదాన్ని. అందుకు కూడా నేను సిద్ధపడ్డా. సెక్షన్‌ 377 గురించి ఒకసారి మీడియా వాళ్ళు అడిగితే, ‘ఎవరి పడగ్గదిలో ఏం జరుగుతుంది అనేది నాకు గానీ, ప్రభుత్వానికి గానీ సంబంధం లేని విషయం. తర్వాత్తర్వాత వీళ్ళందరూ ఇబ్బంది పడవద్దు. కాబట్టి సెక్షన్‌ 377ని డీక్రిమినలైజ్‌ చేయడాన్ని సమర్ధిస్తున్నాను’ అని చెప్పాను.
ఈ కమ్యూనిటీల గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు?
మా అమ్మాయి చెప్పిన తర్వాత ఇంటర్నెట్‌లో చదివేదాన్ని. మీటింగ్స్‌కి వెళ్ళడం, అక్కడ అందరితో మాట్లాడటం వల్ల ఇంకొంత అవగాహన కలిగింది. ప్రైడ్‌ మార్చ్‌కి వెళ్ళాక అక్కడ ఒకేసారి అంతమందిని మొదటిసారి చూశా. ట్రాన్స్‌ జెండర్స్‌ గురించి అప్పటికి సరిగ్గా తెలీదు. మిగతావాళ్ళలాగా కాకుండా ట్రాన్స్‌జెండర్స్‌ని చూస్తే తెలిసిపోతుంది. నేను మొదటిసారి చూసి మా అమ్మాయిని అడిగితే తను వాళ్ళ గురించి చెప్పింది. అప్పుడు నేను తనతో థాంక్‌ గాడ్‌ నువ్వు గే మాత్రమే, ట్రాన్స్‌ కాదు అన్నాను. అంటే నా బాధ తనెక్కడ ఇబ్బందులు పడుతుందోనని. వాళ్ళ పరిస్థితి ప్రత్యక్షంగా చూశాను కాబట్టి కంగారుపడ్డా. అంతేగానీ, వాళ్ళమీద చెడు అభిప్రాయం కాదు. మిగతావాళ్ళకి ఫ్రెండ్స్‌ ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, మంచి చెడు అన్నీ చూస్తారు. కానీ, కమ్యూనిటీ వాళ్ళకి అలా ఉండదు కదా. అందుకే వాళ్ళకి ఏదైనా చేయాలని తపన. ఇంతకు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కానీ, ఈ కమ్యూనిటీల కోసం చేయడం వేరు. నా వల్ల ఒక్కరికి మంచి జరిగినా నాకు తృప్తి. కిరాణా సరుకులు ఇప్పించడం, మెడికల్‌ క్యాంపులు పెట్టించడం, ఐడి కార్డులు ఇప్పించడం వంటివన్నీ కూడా చేసే అవకాశం దొరికింది.
మీరు, మీవారు తొందరగానే ఒప్పుకున్నారు. మరి బంధువులు ఎలా స్పందించారు?
మావారివైపు వాళ్ళు అసలు ఒప్పుకోరు, కలవరు, మాట్లాడరు. మావైపు వాళ్ళు కొంచెం ఓపెన్‌గా ఉన్నారు. మా అమ్మాయి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇంటికి పిలిచారు. ఆలస్యంగా చెప్పినందుకు కోప్పడ్డారు కూడా. మావారి తరపు వాళ్ళని ఏమీ అనలేము, వాళ్ళకి అవగాహన లేదు కదా. అయినా ఇంటికి పెద్ద మేమే కాబట్టి బానే ఉంటారు, ఏ తప్పూ చేయమని నమ్మకం కాబట్టి. ముందు ఎన్నో మాటలు పడ్డాం. ఇంటిపేరు పాడు చేస్తున్నారని అన్నందుకు మా అమ్మాయికి ఆ ఇంటిపేరు తీయించేశా. దానివల్ల మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏదో అన్నారని నా బిడ్డని దూరం పెట్టి ఇబ్బంది పెడితే తన జీవితం పాడవుతుంది. అందుకే ఎవరు ఏమన్నా అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళడమే చేస్తా.
మీ స్నేహితులు, కొలీగ్స్‌ మీతో ఎలా ఉన్నారు?
మా అమ్మాయి ట్రాన్స్‌ అని తెలిసినప్పటికి రిటైరయ్యాను. కానీ, ఇంకా పి.ఎఫ్‌. కమిటీలో ఉన్నాను. ఇప్పుడు అందరికీ చెప్పేశాను. ఎందుకు బైటికి చెప్పి ఇబ్బందులు పడడం అన్నారు మా బాస్‌. బ్రిటిష్‌ వాళ్ళ నుంచి మనకి స్వాతంత్య్రం రావడానికి ఎందరో పోరాటం చేశారు. అప్పుడే మనకి స్వేచ్ఛ దొరికింది, హక్కులు అందాయి. అలాగే నేను కూడా వీళ్ళ కోసం పోరాడతాను. ఇప్పుడు కాకున్నా వచ్చే తరం వాళ్ళయినా బాగా ఉండాలని నా ఉద్దేశ్యం. నాతో ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. అయినా నాకు ఏ బాధా లేదు. వాళ్ళు లేకపోతే ఏంటి, నాకు ఈ కమ్యూనిటీ ఉంది, ఈ పిల్లలంతా ఉన్నారు. చాలు. అదే నాకు బలాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.
మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మీతో బాగానే ఉంటారా?
మా అమ్మాయి రావడానికి కొన్ని రోజుల ముందే నేను అందరికీ చెప్పేశా. ఇప్పుడు తను నా కొడుకు కాదు, కూతురు అని. వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా నన్నే అడగమని చెప్పాను. అందరూ బానే ఉన్నారు గానీ, ఒకావిడ మాత్రం ఎందుకు అలా జరిగిందని ఏడ్చింది. నాకేం బాధ లేదు, మేము సంతోషంగానే ఉన్నామని ఆమెకి చెప్పా. నవ్వుతూ పలకరిస్తే చాలని చెప్పాను.
మెడిసిన్‌ అనేది చాలా కష్టమైన చదువు. మీ అమ్మాయి అప్పుడు చదువుతూ తనకి తన ఐడెంటిటీ పట్ల ఉన్న డిస్పోరియా ఎదుర్కొంటూ
ఉన్న స్టేజిలో మీరు ఎలా సహాయపడ్డారు?
అప్పటికి నాకు ఏమీ తెలీదు. తను చదువులో చాలా చురుకు. ఇంటర్‌ తర్వాత మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చినా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అని తను వెళ్ళలేదు. తెలిసిన తర్వాత మాత్రం ముందు చదువు పూర్తి చేసి దేశం దాటిపొమ్మని చెప్పాను.
తను మీకు చెప్పాక అర్థం చేసుకొని అంగీకరించడానికి ఎంత సమయం పట్టింది?
నేనసలు ఏమీ ఆలోచించలేదు. సైకాలజిస్ట్‌ని కలిసి తన మాట విన్న తర్వాత నాకు అర్థమయింది, మన చేతుల్లో ఏమీ లేదని. నేను కేవలం జన్మనిచ్చాను. దేవుడు మనని భూమ్మీదకి పంపి, అన్నీ మనకి ముందే రాసి పెట్టినప్పుడు మనం మార్చలేం. నేను అది నమ్ముతాను. సెక్సువాలిటీ ఒకరు కోరి ఎంచుకునేది కాదు, పుట్టుకతోనే ఉంటుంది. భగవంతుడు ఇచ్చినదాన్ని మనం ఎలా మారుస్తాం. ఆ విషయం నాకు ముందే అర్థమయ్యి త్వరగానే అంగీకరించాను.
తను సర్జరీ చేయించుకుంది కదా. మీరున్నారా అప్పుడు?
తను బయటే చేయించుకుంది. నన్నేమీ అడగలేదు. అయినా ఎందుకు అడగాలి? అది తన శరీరం. తనకి మాత్రమే హక్కుంది. సర్జరీ చేయించుకోవడం తన నిర్ణయం. ముందే చెప్తే నేను కంగారు పడతానేమోనని నాకు చెప్పలేదు. మొత్తం అయ్యాక నాకు చెప్పింది. అప్పుడు తన మొహంలో సంతోషం, వెలుగు చూసి చాలా సంతోషపడ్డాను. నా శరీరం, నా జీవితం ఇప్పుడు నాకు నచ్చినట్టు ఉందని ఉత్సాహంగా చెప్పింది. ఆ తృప్తి చాలు నాకు.
తన భవిష్యత్తు సురక్షితంగా ఉండడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా?
మేమెలా అయితే కష్టపడి పైకి వచ్చామో తను కూడా రావాలని అనుకుంది. మాకు ఉన్నది తన కోసం కాకుండా మా కోసమే దాచుకోమని, ఖర్చు పెట్టుకోమని చెప్పింది. ఏదేమైనా ఉన్నదంతా తనకే.
ట్రాన్స్‌ కమ్యూనిటీ కోసం పనిచేయడం మొదలుపెట్టాక ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి?
వేరే ఎవరి నుంచి ఎలాంటి ఇబ్బంది రాలేదు గానీ కమ్యూనిటీ వాళ్ళే విమర్శిస్తూ ఉంటారు. నేను వాళ్ళల్లో ఒకరిని కానప్పుడు ఎందుకు పనిచేస్తున్నానని వాళ్ళకి అనుమానం. నేనేదో పేరు కోసం చేస్తున్నానని అనుకుంటారు. ఎవరో ఏదో అన్నారని నేనైతే ఆపలేను కదా? అధికారుల అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం, పేపర్‌ వర్క్‌ చేయించడం… ఇవన్నీ అందరికీ అయ్యే పనులు కాదుగా. వీటన్నింటినీ నేనే తిరిగి చేయిస్తూ ఉంటా. ఒక ప్రతిపాదన తీసుకొస్తే సరిపోదు. ఉదాహరణకి ఉస్మానియా హాస్పిటల్‌లో ట్రాన్స్‌జెండర్స్‌ కోసం ఒక యూనిట్‌ తెరిచారు. దానికోసం వెనకాల చేయాల్సింది ఎంతో ఉంటుంది. సూపరింటెండెంట్‌తో, ఎండోక్రోనాలజిస్ట్‌తో మాట్లాడి, హెల్త్‌ సెక్రటరీతో మీటింగ్‌ పెట్టించి, ఇతర సంబంధిత అధికారులతో, మంత్రి హరీష్‌రావు గారితో మాట్లాడిరచి ఎన్నో చేస్తే గానీ ఆ పని జరగదు. ఇవన్నీ ఎవరు చేస్తారు?
ప్రభుత్వాధికారులతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదా?
లేదు, వాళ్ళు నన్ను బాగా రిసీవ్‌ చేసుకుంటారు.
ఎన్నో విమర్శలు వస్తుంటాయి కదా. అలాంటప్పుడు ఇంక ఎందుకు ఇంత కష్టపడడం అనిపించిందా? మీ అమ్మాయికి కావలసినవన్నీ ఎలాగూ ఉన్నాయి కదా. మా అమ్మాయికి నేను కార్డు చేయించడం తప్ప ఏమీ చేయలేదు. అయితే దిగువస్థాయిలో ఉన్నవాళ్ళకి చాలా సహాయం అవసరం ఉంటుంది. కొంచెం చదువు, లేక డబ్బు ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు ఎలాగోలా బతికేస్తారు. ఏమీ లేక రోడ్డున పడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? విమర్శించేవాళ్ళ వల్ల కష్టాలు పడేవాళ్ళని ఎలా వదులుకుంటాను? వాళ్ళు కూడా ఓ తల్లి బిడ్డలే. ఎలాంటి సహకారం అందక అలా ఉన్నారు. అలాంటివాళ్ళకి నా బాధ్యత అనుకొని చేస్తున్నాను. నా బిడ్డకి నేను ఉండబట్టే ఈ స్థాయిలో ఉంది. మిగతా వాళ్ళు కూడా అలా ఎదగాలని నా కోరిక. నా ప్రాణం ఉన్నంతవరకు నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను.
ఇవన్నీ అధిగమించడానికి ఏం చేస్తారు మరి? మీ ఆధ్యాత్మికత ఏమైనా సహాయపడిరదా?
దీనికి, దానికి సంబంధమే లేదు. దేవుడి విగ్రహానికి ప్రసాదం పెడతారు. దేవుడు తింటాడా? అవన్నీ చేయమని దేవుడు చెప్పలేదు. సాటి మనుషులకి సహాయం చేయమని కదా చెప్పాడు. ఎలాంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసి ఉన్న దాంట్లో పెట్టాలి. పేదలకి ఇవ్వాలి. దానం అంటే అదే కదా? దేవుడికి ప్రార్థన చేసి అందరూ బాగుండాలి, అందరికీ జ్ఞానం ఇవ్వమని కదా కోరుకోవాలి? దేవుడితో మాట్లాడాలి. అది నిజమైన పూజ.
మీరు కమ్యూనిటీ కోసం పని చేయడం మొదలుపెట్టిన దగ్గరనుంచి అందరితో మీ సంబంధాలు, స్నేహాలు మారాయా?
అంతా బాగుంది. ఈ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నెట్‌వర్క్‌ ఏర్పడిరది. అందువల్లే ఇప్పుడు ఇన్ని పనులు చేయగలుగుతున్నాను. జ్యూట్‌ బ్యాగ్‌ యూనిట్‌ పెట్టించడానికి కష్టపడ్డాను. అందులో ఆరుగురికి జ్యూట్‌ మెషీన్లు ఇప్పించాను. హాస్పిటల్‌ ఖర్చులు సర్దుతాను. ఇల్లు వదిలి వచ్చినవాళ్ళకి గ్యాస్‌ సిలిండర్లు ఇప్పించడం… ఒకమ్మాయితో బ్యూటీ పార్లర్‌ పెట్టించా, ఇంకొకరికి ల్యాప్‌టాప్‌, జిరాక్స్‌ మెషీన్‌ ఇప్పించాను. ఒకమ్మాయి స్టేషనరీ షాప్‌ పెట్టుకోవడానికి సహాయం చేశాను. ఇంకా చాలా పనులు చేయగలిగాను అంటే దానికి కారణం అందరితో సంబంధాలు మంచిగా ఉండబట్టే. కానీ, చేయాల్సింది చాలా ఉంది. అందరినీ
ఉద్యోగాల్లో చూడాలి. కొందరికి ఉద్యోగం ఇప్పించాను. ఇంకా చాలా చేయాలి.
ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వ అవార్డు కూడా వచ్చింది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు వచ్చినందుకు ఎలా అనిపిస్తోంది?
నాకు అది పెద్ద విషయం కాదు. నా పని గుర్తించాల్సింది కమ్యూనిటీ వాళ్ళు. నాకు అదే కావాలి.
మీలాగా మిగతా తల్లిదండ్రులు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు?
సమాజం తమని ఎలా చూస్తుందో అన్న భయం, అవగాహనా లోపం వల్ల ఇవన్నీ. సమాజం మంచిదే. అవగాహన లేక ఇలా ఉందంతే. ప్రభుత్వం మానవ హక్కులు అంటుంది కదా. అందులో భాగంగా ఇలాంటి పిల్లల్ని వదిలిపెట్టవద్దని నియమం తేవాలి. అలా చేస్తే రోడ్డున పడే దౌర్భాగ్యం ఉండదు కదా పిల్లలకి. సెక్స్‌ వర్క్‌ చేస్తారు, భిక్షాటన చేస్తారని అందరూ అంటారు. కానీ, ఎందుకు చేస్తున్నారో ఆలోచించరు.
అందరికీ పాటించే ఆచారాలు, నమ్మకాలూ ఉంటాయి. అలా మీ అమ్మాయి ఐడెంటిటీ మీరు నమ్మే వాటికి ఏమైనా విరుద్ధంగా ఉందా?
మన ఆచారాల గురించి తెలిస్తే ఎవరూ ఇలా అనరు. ూGదీుూ అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమే. మన గ్రంథాల్లో ఉంది. ప్రాచీన కట్టడాలు చూస్తే తెలిసిపోతుంది కదా. ఆ కాలంలో లేకపోతే అజంతా, ఎల్లోరాల్లో అలాంటి విగ్రహాలు ఎలా వచ్చాయి? ఇదంతా పాశ్చాత్య సంస్కృతి అని అనుకుంటారు కానీ అది నిజం కాదు. ఇదీ మన సంస్కృతిలో భాగమే. అర్థనారీశ్వరుడు మన సంస్కృతిలో భాగమే కదా? మానవ సృష్టి ఉన్నప్పటి నుంచే ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే సంఖ్య తక్కువ అవడం వల్ల పైకి రాలేకపోతున్నారు. సమలైంగికత్వం నేరమని బ్రిటిష్‌ వాళ్ళు అన్నారు. వాళ్ళు పెట్టింది మనం ఇంకా ఎందుకు పాటించడం?
ఒక పేరెంట్‌గా మీది విజయవంతమైన గాథ. మిగతా పేరెంట్స్‌కి ఏమి సందేశమిస్తారు?
తల్లి ప్రేమ అన్నింటికన్నా గొప్పది అంటారు కదా, మరి అలా అయితే తన బిడ్డ ఎలా ఉన్నా అంగీకరించాలి కదా? ఎలాంటి షరతులు లేకుండా బిడ్డని స్వీకరించాలి. కొందరు వాళ్ళే తమ పిల్లల్ని హింసిస్తారు. ఇదంతా మూర్ఖత్వం. హ్యూమన్‌ లైబ్రరీ అని
ఉంటుంది. అక్కడా, ఇంకా ఎన్నో చోట్ల అదే చెప్పాను. అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను.
ఒక తల్లిగా, వ్యక్తిగా ఇప్పటిదాకా మీ ప్రయాణం ఎలా ఉంది?
నేను బాగా ఎంజాయ్‌ చేస్తాను, చేస్తున్నా కూడా. ఒక్కోసారి పిల్లలు విసిగిస్తారు, కానీ అది కూడా ఎంజాయ్‌ చేస్తాను. రోజూ ఎవరో ఒకరికి ఏదైనా చేసే అవకాశం వస్తుంది. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.
ఎప్పుడూ కష్టమని అనిపించలేదా?
ఇదేం కష్టం? ఒక్కో బిడ్డ ఎంత కష్టపడుతుంది? దాంతో పోలిస్తే నేను పడేది ఎంత? నేను జీవితాంతం ఒక షఱం మహిళగా అన్ని సౌఖ్యాలు అనుభవించాను కదా. ఇప్పుడు ఇదంతా కష్టం అనుకోవద్దు. ఇదే నేను పడలేకపోతే ఒక్కో బిడ్డ ఇంటా బయటా వివక్షను అనుభవిస్తూ ఎంత బాధలు పడుతున్నారు? ఒక్కోసారి కోప్పడతాను. కానీ, అది కూడా ప్రేమతోనే. అందుకే ఎవరు ఏమన్నా ఆగిపోవాలని అనుకోలేదు. వీళ్ళ కోసం నాకు చేతనైనంతవరకు శ్రమిస్తూనే ఉంటా. అందరినీ చదువుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం చూడాలని, వాళ్ళు ఒక స్థాయికి రావాలని నా ఆశ.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.