మానవతావాద ప్రతిఫలనాలు స్త్రీవాద కవితలు

డా|| యస్‌. రాజేశ్వరి
తాను మనిషిగా పుట్టినా స్త్రీగా తయారుచేయబడుతూందన్న సామాజిక, శారీరక స్పృహ ఈనాటి స్త్రీలో కలిగింది. తన శరీరం చుట్టూ పురుషస్వామ్య వ్యవస్థ ఏర్పరచిన రాజకీయ భావజాలాన్ని ఛేదించుకుని ఒక మనిషిగా రూపుదిద్దుకుంటుంది. నేటి మానవి. తనను ఒక మనిషిగా కాక, మని+షిగా చూస్తున్న సమాజాన్ని ప్రశ్నిస్తూంది. మానవతావాద ప్రతిఫలనాలైన స్వేచ్ఛా, సమానత్వాల కోసం పోరాడుతూంది. తింటున్న ఆహారం దగ్గరి నుంచి, విద్య, ఉద్యోగాల వరకు మొత్తం జీవనవిధానంలోనే సమానత్వాన్ని కోరుతూంది. బానిసత్వం నుంచి స్వేచ్ఛ కోసం, ద్వితీయ స్థానం నుంచి సమానత్వం కోసం ఉద్యమిస్తూంది. జండర్‌ వివక్షతో అన్నింటా తనను తక్కువగా చూడడాన్ని వ్యతిరేకిస్తూంది. ఈనాటి స్త్రీకి ఈ చైతన్యాన్ని, పోరాట స్వభావాన్ని ఇచ్చింది స్త్రీవాదమే. మానవతాబీజాలైన స్వేచ్ఛా, సమానత్వాలే స్త్రీవాద మూలాలు. ఏఏ అంశాల్లో స్త్రీలు తక్కువగా చూడబడుతున్నారో ఏ పరిస్థితుల్లో స్త్రీలు స్వేచ్ఛను సమానత్వాన్ని కోరుతారో స్త్రీవాద కవితలు స్పష్టం చేసాయి.
శారీరక స్పృహ
స్త్రీ జీవితం చుట్టూనే కాక, శరీరం చుట్టూ కూడా ఎన్నో రాజకీయాలు  అందమైన సాలెగూటి అల్లికలా పితృస్వామ్య వ్యవస్థ రూపొందించిన భావజాలం. వానినన్నింటినీ బట్టబయలు చేసిందీ స్త్రీవాద కవిత. వసంతాకన్నబిరాన్‌ ‘శరీరం’ కవిత స్త్రీ శరీరం చుట్టూ ఉన్న రాజకీయాలు, కుతంత్రాలు, దోపిడీలు బట్టబయలు చేసింది. ‘పురాతన పితృస్వామ్య వివాదాలకు ఒరిగా నిల్చిందీ శరీరం’… ‘నీచేత ఇంత ద్వేషింపబడడానికి ఎపుడైనా ఏం చేసిందీ శరీరం’… ‘నిన్ను ప్రేమించడం, సేవించడం, నిన్ను కనటం తప్ప…’ అని పురుష సమాజాన్ని నిలదీసింది. విమల రాసిన ‘సౌందర్యాత్మక హింస’ చెవులకీ, ముక్కుకి రంధ్రాలు పొడిచి – ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా! అంటూ మనసంతా తీసేసి, డొల్ల చేసిన ఈజిప్షియన్‌ మమ్మీల్లాగున్నారనడంలో ఆవేదం వ్యక్తం అవుతోంది. స్త్రీ శరీరం పట్ల పురుషస్వామ్య వ్యవస్థ రూపొందించిన భావజాలం నుంచి స్వేచ్ఛ ప్రసరించే కవితలివి.
 భ్రూణహత్యలు
ఆడపిల్ల పుడితే విషం ఇచ్చి చంపే రాజస్థాన్‌లోని దుష్టాచారాన్ని నిరసిస్తూ ‘శ్రీమతి’ రాసిన కవిత ‘నిషిద్ధ స్వప్నం’. ఆడపిల్ల తానొక నిషిద్ధజీవినని ఈ లోకంలో తనకు చోటు లేదని క్రుంగిపోతుంది. అంజన రాసిన ‘తల్లికాని పిల్లల తల్లి’ కవిత బాల్యం మరచిపోయిన చిన్నపిల్ల జీవితం, శాపవిమోచనం లేని ఆడపిల్ల జీవితకథ ఇది. బి. పద్మావతి ‘గుక్కపెట్టిన బాల్యం’ కవితలో ‘అమ్మకావాలి – నాన్న చేత తన్నులు తినని అమ్మ కావాలి – సుడిగుండంలా అమ్మ ఏడుపు ముంచెత్తని సుఖనిద్ర రాత్రి కావాలి’ అని చిన్నపిల్ల కోరుకోవడం ఈ సమాజానికొక కొరడా దెబ్బ.
వృద్ధాప్యం
రావులపల్లి సునీత ‘అమ్మ అలిగింది’ కవితలో, బతుకు యుద్ధం ముగించి, అలిసిన స్త్రీ భద్రత కోల్పోతూ చేసిన ఆక్రోశమే కవితారూపం దాల్చింది. స్త్రీల బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు పొందుతున్న బాధల్నుంచి స్వేచ్ఛ కోరిన కవిత ఇది.
ఇంటిపని, వంటపని
వసంత కన్న బిరాన్‌ రాసిన ‘గృహమే కదా స్వర్గసీమ’, మందరపు హైమావతి ‘ద్విపాత్రాభినయం’, విమల ‘వంటిల్లు’, ఓల్గా ‘గృహలక్ష్మిలు’, కె. వరలక్ష్మి ‘ఆమె’, ఓలా ‘సూపర్‌ ఉమెన్‌ కాలేను’.
కవితలు ఆడదాన్ని ఇంటిచాకిరీ ఎంతగా అణచివేసిందో బట్టబయలు చేసాయి. వెట్టిచాకిరీ నేరంగా పరిగణించి కింది వర్గాల వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తం చేసింది మారిన సమాజం. మరి ఆడదాన్ని ఇంటి చాకిరీ నుంచి, ఎప్పటికీ విముక్తం చేస్తుందీ సమాజం? అని ప్రశ్నిస్తున్నాయి ఈ కవితలు.
ఇన్ని సంవత్సరాలుగా స్త్రీ అనుభూతుల్ని చిదిమివేసి, బాధల్ని కట్టివేసి – ఆమె కష్టాన్ని గుర్తించక అతిమామూలుతనంతో ఆకాశపథానికి దూసుకుపోయిన మగవాడి స్వార్ధాన్ని వెల్లడించిందీ గృహమే కదా స్వర్గసీమ కవిత.
 ఇంగువ వాసనలో మునిగితేలే ముక్కు
 ఊపిరి పీల్చుకోవటం మర్చిపోతుందిట.
 చేతుల చీపురుకట్టులు, హృదయపు పెనం, నడుం బండ, అంటూ పని పరికరాలకు, స్త్రీల శరీరావయవాలకు అభేదం ఏర్పడింది. అయినా జీవితం ఎందుకో ఎప్పుడూ కాటు వాసనే వేస్తుంటుంది అనడంలో చచ్చేంత చాకిరీ చేసినా గుర్తింపులేక పోవడాన్ని బాధగా వ్యక్తీకరించింది గృహలక్ష్మి కవిత.
 కడిగిందే కడిగి, ఏళ్ళ తరబడి వండీ, వండీ
 వడ్డిస్తూ, ఎంగిళ్ళెత్తేసుకుంటూ…
 చివరకు కలల్లోనూ వంటిల్లే
 మల్లెపూవుల్లోనూ పోపువాసనలే
 స్త్రీల రక్తం పీల్చేసి, ఆశల్నీ, కలల్నీ కాజేసి,
 కొద్దికొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న
రాకాసిగ్రద్ధ ఈ వంటిల్లు – కసాయి దుకాణం ఈ వంటిల్లు.
అని వంటింటి భ్రమల్ని బద్దలుకొట్టిందీ వంటిల్లు కవిత. తరతరాలుగా స్త్రీలను వంటింటి బానిసలు చేసారు. అమ్మలు, అమ్మమ్మలు అందరూ ఆ వంటింట్లోనే ఆడవాళ్ళయ్యారు, బతికున్న శవాలయ్యారు.
‘ద్విపాత్రాభినయం’ కవిత అటూ గృహిణిగా, ఇటు ఉద్యోగినిగా స్త్రీ పొందే ఘర్షణను చిత్రించింది. ఉదయించే సూర్యుడిని చూసే అవకాశం ఆడవాళ్ళకెక్కడిది? గ్యాస్‌-పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తారు. కుక్కర్‌ విజిల్స్‌లోనే మనోజ్ఞ సంగీతం వింటారు. వంటగదే ప్రకృతి, సర్వస్వం – అంటూ ఇంటిపనీ, వంటపనీ, తమ జీవితమంతా వ్యాపించి, తమ ఆలోచనలు, సృజనాత్మకతల్ని ఎలా అణగద్రొక్కుతున్నాయో ఆక్రోశం వెల్లగక్కాయి ఈ కవితలు. చివరగా ఈ ఒంటరి వంటిల్లును బద్దలు కొట్టండి అంటూ ఇంటిపనిలో సమానత్వాన్ని ప్రబోధించిన కవితలివి.
 దాంపత్యం
స్త్రీపురుషుల మధ్య అనురాగం – ఏ వివక్షలూ చోటుచేసు కోనంత వరకు – స్వచ్ఛమైనది, నిర్మలమైనది. సమాజం రూపొందించిన విలువలు ఆ అనురాగాన్ని కలుషితం చేసాయి. స్త్రీపురుషుల్ని భార్యాభర్తలుగా నిర్వచించి వైరుధ్యాన్ని పెంచాయి. వారి మధ్య ఘర్షణలు రేకెత్తించాయి. జయప్రభ రాసిన ‘స్పర్శానురాగాన్ని ఆలపిస్తూ…’ అన్న కవిత స్త్రీపురుషుల మధ్య అనురాగాన్ని వర్ణించింది. స్పర్శతో జ్వలించే ఇరువురూ, ఎపుడూ దూరంగానే ఉంటారు. పృథ్వీ, ఆకాశాలై అనడంలో వారి మధ్య వైరుధ్యాన్ని స్పష్టం చేసింది.
శివలెంక రాజేశ్వరీదేవి ‘రంగులు వెలిసి రాగాలు వినిపించని వేళ’ అన్న కవిత భార్యాభర్తల మధ్య అసమ సంబంధాల్ని స్పష్టం చేసింది. సమాజం భార్యాభర్తల్ని ‘చీలిన దారుల మొగదల నిలబెడితే’ ప్రకృతి వారిని స్త్రీపురుషుల్ని చేసి కలుపుతుంది. కానీ ఈ కలయిక అశాశ్వతం.
రాత్రి కవితగా పెనవేసిన అక్షరం,
పగలు వచనమై విడివడుతుందిట.
ఈ పరీక్షా సమయంలో మనం
అసిధారావ్రతం చేయవలసిందే
పునర్‌నిర్మాణం జరిగేంత వరకు
అనడంలో వ్యవస్థలో మార్పును కోరుతూ ఆశావాదాన్ని వ్యక్తం చేసిందీ కవిత. మొక్కపాటి సుమతి రాసిన ‘మిత్రవైరుధ్యమా?’ కవిత ‘మరీ’ వర్గశత్రువు నా శ్రమనే దోచుకుంటాడు. ఈ దుష్టశత్రువు నా బ్రతుకే దోచుకుంటాడు అని వాపోయింది.
వ్యవస్థ సంసార జీవితం పట్ల కల్పించిన భ్రమల్ని బద్దలుకొట్టాయి ఈ కవితలు. ‘అనురాగ దాంపత్యం ‘మిత్‌’ అని తేలిపోయింది. ఆ భ్రమల్లో బతికే ఆడవారిని జాగృతం చేసాయి. స్వేచ్ఛ సమానత్వాల కోసం అలమటింపచేసాయి.
 సమాజంలో స్త్రీ స్థితి
సావిత్రి రాసిన ‘బందిపోట్లు’ కవిత పెళ్ళి, మొగుడు, మగమహారాజు అన్న పదాలకు కొత్త నిర్వచనాలిచ్చింది. పెళ్ళంటే పెద్ద శిక్ష, మొగుడంటే స్వేచ్ఛాభక్షకుడు, మగవాళ్ళంటే స్త్రీలను విభజించి పాలించేవారని తెలియచేసింది.
పార్వతి రాసిన ‘సిగ్గుసిగ్గు’ కవితలో సహనానికి గాడిద, విశ్వాసానికి కుక్క, స్తబ్దతకు గొంగళిపురుగు ప్రతీకలు. అవేవీ స్త్రీ జీవితంలోని స్తబ్దతకు, సహనానికి, విశ్వాసానికి సమానం కాలేక పోయాయి. నీ అంత విశ్వాసంతో, సహనంతో, స్తబ్దతలో బతకలేమని పారిపోయాయి.
స్త్రీలు శారీరకంగానూ, సామాజికంగానూ, వ్యవస్థాపరం గానూ ఎదుర్కుంటున్న అసమానతను స్త్రీవాద కవితల ద్వారా సమాజానికి వెల్లడిచేస్తారు స్త్రీవాదులు. ఆ భావాలను తెలపడంలో ఎంతో ఆవేదన, ఆక్రోశం వెలుగుచూసాయి. తరతరాల నుంచి అణచివేతకు గురై గొంతు మూగబోయిన వారు ఎలుగెత్తి అరిచారు. సమస్యను గుర్తించడంలోను, పరిష్కారాలను వెతకడంలోనూ ఎంతో స్ఫూర్తి కనపరిచారు. వారి ఆవేదన, ఆక్రోశాలు, తెలివితేటలు సమాజానికి మింగుడు పడలేదు. ఎన్నో విషయాల్లో ఉదారత కనపరచినవారు, పోరాటాన్ని సమాజానికి నిర్దేశించినవారు సైతం స్త్రీల ఆక్రోశాన్ని అణగద్రొక్క ప్రయత్నించారు. కానీ ఎన్నో ఏండ్ల నుంచి గడ్డకట్టిన బాధ ఆవేశంగా మారి లావాలా నిప్పులు కక్కుతూ వెల్లువలా వస్తోంది. దాన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. అసలు ఆపే ప్రయత్నం కంటే అర్థం చేసుకొని చేయూత నందించడమే నేటి సమాజం బాధ్యత.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.