అక్టోబర్ 10, 2023న హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో సమావేశం జరిగింది. మీడియాలో స్త్రీలను ఎలా చిత్రీకరిస్తున్నారు, వార్తలు రాసే విధానంలో పితృస్వామ్య భావజాలం ఎలా కనబడుతోంది, ఎటువంటి భాషను వాడుతున్నాము అనే విషయాలపై యువ జర్నలిస్టులకు ఎలాంటి అవగాహన అవసరం అన్నది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసి రిటైరైయిన ప్రొఫెసర్ పద్మజ షా, ట్రాన్స్ వ్యక్తుల యాక్టివిస్ట్ తాషి, క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ నుండి ముకుంద మాల ప్రముఖ వక్తలుగా హాజరయ్యారు. డా.బి.ఆర్.అంబేద్కర్ జర్నలిజం కాలేజి నుండి అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, రచన జర్నలిజం కాలేజి నుండి విద్యార్థులు, ఎబిఎన్ జర్నలిజం కాలేజి విద్యార్థులు, మరికొంతమంది ప్రింట్ మీడియా ప్రతినిధులు, మొత్తం 40 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొండవీటి సత్యవతి గారు మాట్లాడుతూ ఈ రోజు సమావేశానికి ఇంతమంది విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉందని అంటూ అందరినీ వ్యక్తిగత పరిచయాలు చేసుకోవడం ద్వారా సమావేశాన్ని మొదలు పెట్టారు. జర్నలిజాన్ని కెరియర్‌గా ఎందుకు ఎంచుకున్నారు, వాళ్ళ ఆకాంక్షలేంటి అని అడిగినప్పుడు సమాజంలో జరిగే విషయాలను అందరి దృష్టికి తీసుకువెళ్ళడం, పబ్లిక్‌తో కలిసి పనిచేయడం ఇష్టమని కొందరు, మన వాయిస్ అందరికీ తెలియజేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చునని మరికొందరు చెప్పారు. వీరి సమాధానాలు విన్న తర్వాత సత్యవతి గారు మాట్లాడుతూ ప్రపంచానికి తెలియకుండా చీకటిలో ఉండిపోయిన చాలా విషయాలను, సమస్యలను, అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, చాలా క్రియేటివిటీకి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి మంచి కథనాలు రాయడం ద్వారా కూడా మీరు చెప్పదలచుకున్న విషయాన్ని తెలియజేయ వచ్చునని చెప్పారు. రకరకాల కారణాల వల్ల మనం చెప్పదలచుకున్న విషయాలను చెప్పలేకపోతున్నామని, ప్రధాన మీడియాకి ప్రత్యామ్నాయంగా ఒక మీడియా సమాంతరంగా ఎప్పుడు ఉంటుంది. అదే సోషల్ మీడియా, అంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ (ఎక్స్), యూట్యూబ్, వెబ్‌సైట్ వంటి సోషల్ మీడియా ద్వారా మన అభిప్రాయాలను తెలియజేయవచ్చునని చెప్పారు. భూమిక, మీడియా వారితో కలిసి ఇన్ని సంవత్సరాలపాటు పనిచేయడానికి కారణం మీడియాలో జెండర్ సెన్సిటివిటీ ఉండాలన్నది, తీసుకురావడం కోసమని చెప్పారు.
పద్మజ షా మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత పిల్లలతో (విద్యార్థులతో) మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువ జర్నలిస్టులు నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రస్తుత కాలంలో జర్నలిజం అనేది ఒక వ్యక్తిగత సంస్థ కాదు. దీనికి నేపధ్యం, సందర్భం అనేది ఉంటుంది మరియు సమాచారాన్ని భధ్రపరచడంలో ప్రాథమిక పాత్ర ఉంటుంది అని అన్నారు. ఈ రోజుల్లో దినపత్రికలలో రాసే వార్తలు విషయాన్ని మరోలా అంటే తప్పుగా వివరణ ఇచ్చేలాగా ఉంటున్నాయని, అందువల్ల సమాచారం అనేది పబ్లిక్‌లోకి వెళ్ళేటప్పటికి అర్థం మారిపోతోందని అన్నారు. న్యూస్ రిపోర్టింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించాలని, మీరు ప్రస్తుతం జరిగింది రాస్తారని, అది గతంలో జరిగినదే అయి ఉంటుందని, కానీ భవిష్యత్తులో దాని అవసరం వచ్చినప్పుడు రికార్డ్ పర్పస్‌గా ఉంటుందని అన్నారు. ఏదైనా ఒక కథ లేదా న్యూస్ రాసేటప్పుడు చాలా అప్రమత్తతో రాయడం అవసరం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులనే కాకుండా భవిషత్తుని కూడా ప్రభావితం చేసేలా ఉంటుంది. చెప్పారు.
సాహిత్యంలో ఎక్కడ చూసినా మహిళలే కానీ చరిత్రలో ఎక్కడ చూసినా మహిళలు కనిపించరని వర్జీనియా వూల్ఫ్ అనే బ్రిటిష్ రైటర్ అన్నారని దినపత్రికలలోని సప్లిమెంట్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కాలమ్స్‌లో ఆడవాళ్ళ బొమ్మ లేకుండా దినపత్రిక ఉండదని/ అమ్ముడు పోదని అన్నారు. ప్రధాన పేజి లో ఎక్కడ వెదికినా ఆ వార్త కనిపించదన్నారు. ఎంత గొప్ప మహిళా రాజకీయవేత్త అయినా ఎంటర్‌టైన్‌మెంట్ దృష్టితోనే చూస్తామని, వార్తలు రాసే విధానం కూడా పురుషుల దృష్టికోణం నుండి రాస్తారని అన్నారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీల దృష్టి కోణం నుండి అర్థం చేసుకుని రాయడం ఒక్కసారిగా రాదని, ఇది నేచురల్‌గా వచ్చే విషయం కాదని ఆమె అన్నారు. అది స్పృహతో ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి పురుషాధిక్య సమాజంలో పుట్టి పెరగడం వలన కొంతమంది అమ్మాయిలు కూడా అదే భావనతో ఉంటారని, మహిళల పట్ల ఏది అన్యాయం అనేది అర్థం చేసుకోగలగాలని అన్నారు. మన దేశంలో చట్ట సభలలో మహిళల సంఖ్య చాలా తక్కువ ఉందని, తద్వారా మనది పురుషాధిక్య సమాజమనేది అర్థమవుతుందని అన్నారు. మీడియాలో కోవిడ్ కాలానికి ముందు 22% మహిళలు పని చేస్తుంటే, కోవిడ్ కాలం అనంతరం 14%కి తగ్గిందనేది తను తెలుసుకున్న విషయమని చెప్పారు. చాలామంది మహిళలు ఉద్యోగాలు పోయి మీడియా నుండి వెళ్ళిపోవడం వలన స్త్రీల దృష్టికోణంలో వచ్చే వార్తల కవరేజి కూడా తగ్గిపోయిందని అన్నారు.
ఒక మీడియా సంస్థలో సమాచారం అనేవారు అంతా పురుషులే ఉన్నప్పుడు స్త్రీల దృష్టికోణం ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు సంబంధించిన కథనాలు వస్తాయా? దానిమీద ధ్యాస ఉంటుందా? ఒకవేళ ఉన్నా అది ఎలాంటి దృక్పథంతో ఉంటుంది అనేది మనం ఆలోచించవలసిన విషయం కాబట్టి మీడియాలో జెండర్ దృష్టికోణం అనేది జెండర్ డైవర్సిటీ అనేది ఉండాలని అన్నారు. ఒక వ్యక్తిని వ్యక్తిగా మాత్రమే గుర్తించాలని, మానవీయ దృక్పథం లేని జర్నలిజం అనేది చాలా దుర్మార్గమైనదని అన్నారు. సహానుభూతి లేని జర్నలిజం ఉపయోగపడదని, జర్నలిజంలో డెమోక్రసీ అనేది అస్సలు కనబడడం లేదని అన్నారు.
స్త్రీలు, పిల్లలు, ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించిన విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి, వార్తలు రాసేటపుడు భాష చాలా ముఖ్యమని, ఎలాంటి భాష వాడుతున్నాము, బయట మనం వాడుతున్న భాషను ఉపయోగించవచ్చా లేదా అనేది ఆలోచించి రాయాలని చెప్పారు. జర్నలిస్టులకు ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలన్నారు. ప్రింట్ మీడియా వారికి రాసింది చూసుకుని సరిదిద్దుకునే అవకాశమైనా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మహిళలను ఎలా చూపించాలి అనే సెన్సిటివిటీని కూడా అనుసరించడం లేదని అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన కేసుల శాతం ఎక్కువగా ఉంటోందని, ఈ మధ్య ఒక రీసెర్చ్ విద్యార్థిని ఎన్‌సిఆర్‌బి రిపోర్టు ద్వారా తెలిసిందని చెప్పిందని ఆమె తెలిపారు. స్త్రీలపై జరుగుతున్న హింసకు కారణం కూడా పితృస్వామ్య భావజాలమేనని, ఇందులో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ముకుంద మాల మాట్లాడుతూ జెండర్ ఐడెంటిటీ గురించి ఎల్‌జిబిటిక్యు హక్కులు, వారి కోసం ప్రత్యేకంగా ఏవైనా చట్టాలు ఉన్నాయా అనే వాటి గురించి మాట్లాడారు. రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన అన్ని ప్రాథమిక హక్కులు అందరికీ వర్తిస్తాయని, కానీ ట్రాన్స్ వ్యక్తులు ఇప్పటికీ వివక్షతను ఎదుర్కొంటున్నారని అన్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ఏర్పాటు చేసి ట్రాన్స్ వ్యక్తులకు గుర్తింపు కార్డులను ఇవ్వడం మొదలుపెట్టిందని చెప్పారు. జర్నలిస్టులకు ట్రాన్స్ వ్యక్తుల కమ్యూనిటీ గురించి, వారు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, కుటుంబం నుండి, సమాజం నుండి వివక్షతను ఎందుకు ఎదుర్కొంటున్నారు అని పూర్తిగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అవసరమని అన్నారు. యువ జర్నలిస్టులకు ఆ సెన్సిటివిటీ ఉన్నప్పుడు వారికి సంబంధించిన విషయాలను న్యూస్‌లో రాసేటపుడు, దాన్ని చదివినవారు అర్థం చేసుకోగలరని అన్నారు. కనీసం అలా అయినా వారి హక్కులను వారికి అందచేయవచ్చునని అన్నారు. స్కూళ్ళు, కాలేజీలు, ఎన్జీఓలలో ఉద్యోగాలలో వారికి కూడా అవకాశాలు వచ్చేలా చేయవచ్చునని అన్నారు.
ట్రాన్స్ వ్యక్తి, యాక్టివిస్ట్ అయిన తాషి మాట్లాడుతూ స్త్రీలు, పురుషులు అని ఎలా గుర్తిస్తామని పార్టిసిపెంట్స్‌ని అడిగినప్పుడు శరీర భాగాలను బట్టి గుర్తిస్తామని, వారు చేసే పనిని బట్టి గుర్తిస్తామని వారు చెప్పారు. ఆడవారికి ఎలాంటి లక్షణాలుంటాయి, మగవాళ్ళకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే చర్చ చేశారు.
1. ఆడవారు అంటే ఇంటి పనులు, పిల్లల్ని పెంచడం గుర్తుకు వస్తాయి.
2. మగవాళ్ళు అంటే సంపాదించడం, బయట తిరగడం గుర్తుకు వస్తాయి.
మరి ట్రాన్స్ వ్యక్తుల గురించి ఏం తెలుసు అని అడిగినప్పుడు స్త్రీలలాగా ఉండి మగవారి లక్షణాలు ఉండడం, మగవారి శరీరంతో పుట్టి ఆడవారి లక్షణాలు కలిగి ఉండడం చూశామని, ఒక పార్టిసిపెంట్ పురాణ గాథలు చెప్పాడు. శివుడు అర్థనారీశ్వరుడని, రాముని కాలం నుండి కూడా ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారని పార్టిసిపెంట్స్ మాట్లాడారు. తాషి మాట్లాడుతూ జెండర్, సెక్స్, సెక్సువాలిటీ గురించి క్లుప్తంగా చెబుతూ, జర్నలిజం విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు / విరోధాలు ఉండకూడదని, అటువంటప్పుడు మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా వార్త రాయగలరని అన్నారు. ఎల్‌జిబిటిక్యు గురించి అవగాహన ఉన్నప్పుడు ప్రింట్ మీడియాలో రాసేటపుడు సరిగ్గా రాయగలమని, కానీ ప్రస్తుతం ఒక్క ఆర్టికల్ అయినా కరక్టుగా ఉంటోందా అని ప్రశ్నించారు. సెక్సువాలిటీ అనేది వారిలో ఉన్న లోపమని అర్థం వచ్చేలా రాస్తున్నారని అన్నారు.
మనం పితృస్వామ్య భావజాలంతో చూస్తున్నప్పుడు పితృస్వామ్యం ఎక్కడ ఉంది అని గుర్తించాలని, పురుషులు ఒక కంటెంట్‌తో రాస్తే వారి మైండ్‌సెట్‌తోనే రాస్తారని. ఏ దృక్పథంతో రాస్తున్నాం అనేది ముఖ్యమని, అలాగే రిసెర్చ్ చేసేవారు కూడా ఏ దృక్పథంతో చేస్తున్నాం అన్నది ముఖ్యమని తాషి చెప్పారు. ట్రాన్స్ వ్యక్తులపై జరుగుతున్న హింస ఎలా ఉంది అనేదాని గురించి రెండు, మూడు ఉదాహరణలు చెప్పారు. వార్త రాసేటప్పుడు జెండర్ మైనారిటీల గురించి ఏం జరుగుతోంది, ఎలా అర్థం చేసుకుని రాస్తున్నాము అనేది చాలా ముఖ్యమని చెప్పారు. మీరు రాసే రిపోర్టు వలన అట్టడగున ఉన్నవారు నష్టపోకుండా ఉండాలని, పాప్యులర్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుందని, వాస్తవాలనేవి ఒకలా ఉంటాయని, రిపోర్టులు రాసేటప్పుడు వివక్ష లేకుండా వాస్తవాలను రాయాలని అన్నారు.
సమావేశం ముగించే ముందు పార్టిసిపెంట్స్ అందరూ ఈ సమావేశంలో కొత్త విషయాలను తెలుసుకోగలిగామని, జెండర్ దృష్టికోణంతో వార్తలు ఎలా రాయాలి, పితృస్వామ్య భావజాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది తమకు నచ్చిన అంశాలని చెప్పారు.