గ్లోరియా స్టీనమ్

– ఇంటర్వ్యూ: అమ్మూ జోసెఫ్ (అనువాదం: పి.సత్యవతి)

గ్లోరియా స్టీనం అనగానే సెకండ్ వేవ్ ఫెమినిజం ఉత్తుంగ తరంగం, సివిల్ రైట్స్ ఉద్యమం, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం అన్నీ గుర్తుకొస్తాయి. ఎంఎస్ పత్రిక వ్యవస్థాపకురాలు, రచయిత్రి, ఉద్యమ కార్యకర్త 72 ఏళ్ళ వయస్సులో ఆశకి మారుపేరులా వుండే గ్లోరియా ఇటీవల జరిగిన విమెన్ జర్నలిస్టుల సమావేశానికి బెంగుళూరు వచ్చారు. ఆ సందర్భంగా ప్రముఖ స్త్రీవాదీ, జర్నలిస్ట్ అయిన అమ్మూ జోసెఫ్ ఆమెతో జరిపిన సంభాషణ క్లుప్తంగా

అమ్ముః స్త్రీవాదోద్యమ కార్యకర్తగా మీ ముప్ఫై సంవత్సరాల పైబడిన అనుభవాలని “హృదయానికి రహదారి” (Road to heart., America as if every one mattered) అనే పుస్తకంగా వ్రాస్తున్నారని తెలిసింది…

గ్లోరియాః తమాషా ఏమిటంటే ఆ పుస్తకం వ్రాసేందుకు చాలాకాలం నేను రహదారిపైనే వున్నాను. వ్రాయడం మొదలుపెట్టి తొమ్మిదేళ్ళయింది… ఇంకా రెండింట మూడొంతులు పూర్తి కావాల్సే వుంది. కొంత నా మార్గాన్ని గురించీ కొన్ని నా జ్ఞాపకాలు, ప్రసార మాధ్యమాలలో కనిపించే అమెరికాకీ నిజమైన అమెరికాకి గల వ్యత్యాసాన్ని తెలియజెప్పటమే నా ఉద్దేశ్యం. ఎక్కువమంది వ్యక్తులు కార్యకర్తలు కావాలనేది కూడా నా ఆకాంక్ష. మనుషులు సమాచారం అందుకోడానికి సమావేశాలూ, ముఖాముఖీ సంభాషణలూ అవసరం లేదని, ప్రసార మాధ్యమాలూ, ఇంటర్నెట్ చెబుతున్నాయి. కానీ కలుసుకోవడం, పరస్పరం ప్రత్యక్షంగా మాట్లాడుకోవడం, ఒకరినొకరు వినడం అనేది దేనికీ సాటికాదు. యాభై సంవత్సరాల క్రిందట మొదటిసారి నేను ఇండియా వచ్చి గాంధీ గురించి తెలుసుకుంటూ వినోబాభావే అనుచరులతో కలిసి గ్రామాలెన్నో పర్యటించాను. ఆ పర్యటనలు నాలో పర్యటించటం, కార్యకర్తల్ని సంఘటితపరచటం వంటి విషయాలపై ఎంతో ఆసక్తిని పెంచాయి.

నా పుస్తకం పాఠకులలో అటువంటి ఆసక్తిని కలుగజేస్తుందని నా ఆశ. వినోభా భావే అనుచరులెప్పుడూ గాంధీ ప్రస్తావన తెచ్చేవారు. మనం చెప్పేది ప్రజలు వినాలంటే వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి. నేను తిరిగి అమెరికా వెళ్ళాక, అక్కడ జరుగుతున్న పౌరహక్కుల ఉద్యమం ఈ నిజాన్ని ఋజువుచేసింది. తరువాత స్త్రీవాద ఉద్యమం విషయంలో కూడా అదే జరిగింది. స్త్రీలు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి సంఘటితం అయ్యారు.

అమ్ముః “రహదారి మీద” స్త్రీల రచన కాదని మీరొక చోట అన్నారు. సాహితీ ప్రక్రియలకి కూడా ‘జెండర్’ వుంటుందా?

గ్లోరియాః స్త్రీలు కానీ, కొన్ని ఇతర బృందాలు కానీ, ధనమూ ఇతరుల సహకారమూ అవసరం లేని రంగాల్లో ఎక్కువ కనిపిస్తారు. ఉదాహరణకి స్త్రీలలో నాటక రచయితల కన్న కవులెక్కువ కనిపిస్తారు. శిల్పులకన్నా చిత్రకారిణులెక్కువుంటారు. నృత్య దర్శకులకన్న నృత్యాంగనలెక్కువ. అట్లాగే దర్శకులకన్న నటీమణులెక్కువ. ఈ పుస్తకం పురుషులకి సంబంధించిందని ఎందుకన్నా నంటే, ‘రహదారి’ స్త్రీలకి చాలా ప్రమాదకర మైంది. ఎవరైనా ఒక స్త్రీ ధైర్యం చేసి రహదారి మీద నడచి వచ్చినా ఆమెకి ఇంట్లో తిరిగి స్వాగతం లభించటం కష్టం. సాహసాలు నాయకులకే కానీ నాయికలకు కాదు. తిరిగే మొగవాళ్ళకుండే ఆదరణ తిరిగే ఆడవాళ్ళకు వుండదు. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారింది గానీ ఇంకా సమతూకం రాలేదు… తక్కిన సాహితీ ప్రక్రియల్లో కూడా రచయిత జెండర్ని బట్టి రచనకి విలువ కట్టడం జరుగుతూనే వుంది… “మేడమ్ బోవరీ” కానీ “ఆనాకెరినీనా” కానీ ఒక స్త్రీ వ్రాసి వుంటే, అవ్వన్నీ ఆమె స్వీయానుభవాలేననో లేక అదంతా స్త్రీల సాహిత్యం అనో అని వుండేవారు, అవి పురుష విరోచితాలు కనుక గొప్ప కళాఖండాలయినాయి. పురుష రచయితలు ప్రధాన స్త్రీ పాత్రల్ని సృష్టించవచ్చు, కానీ రచయిత్రులు ప్రధాన పురుష పాత్రల్ని సృష్టిస్తే వాళ్ళని నిలదీస్తారు. పత్రికా రచనలో కూడా పురుషులు పంపిన అంశాలు అధికారిక మైనవిగా పరిగణింపబడతాయి. మరొక విశేషమేమంటే పురుషులకు సంబంధించిన అంశాలు ‘రాజకీయపరమైన’విగానూ, స్త్రీలకి సంబంధించినవి ‘సాంస్కృతిక’పరమైనవి గానూ పరిగణించ బడతాయి. పురుషుల స్థాయి పెరుగుతుంది గానీ స్త్రీల స్థాయి ఎప్పటికీ అంతేనని పరోక్షంగా చెప్పడం అన్నమాట. అయినా ఇదంతా మారుస్తున్నాం కదా. స్త్రీవాదం లేనిదే ప్రజాస్వామ్యం లేదు.

అమ్ముః ప్రసార మాధ్యమాల్లోకి స్త్రీలెక్కువగా ప్రవేశించారనీ, కొద్ది కాలంగా మీడియా స్త్రీయీకరణ చెందుతోందనీ అనుకుంటున్నాం కదా! మరి ఇప్పుడు స్త్రీలకి ప్రత్యేకంగా “విమెన్ మీడియా సెంటర్” అవసరమా?

గ్లోరియాః స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ప్రసారమాధ్యమాల్లో స్త్రీల సంఖ్య పెరిగిన మాట నిజమే. కానీ నిర్ణయాలు తీసుకునే పదవుల్లో లేరు. స్త్రీల అనుభవాలను గురించి అద్భుతంగా వ్రాసేవారికి, సంపాదకులకి, పత్రికా రచయితలకి కొదవలేదు. కానీ ఈ స్త్రీలందరూ ప్రధాన స్రవంతి పత్రికల్లో కాక ప్రత్యామ్నాయ పత్రికల్లో ఉన్నారు. ప్రధాన స్రవంతిలో ఉన్నవారికి వారి ‘స్వేత పురుష బాస్’ తో పోరాటం తప్పదు. స్త్రీయీకరణ అంటే చాలామంది కొన్ని ఉద్యోగాలలో స్త్రీలని నియమించడం ద్వారా వేతనాలను తగ్గించవచ్చని… వాస్తవ గాధల్ని ప్రసారం చేసి, ఓప్రా విజయం సాధించింది కానీ వాస్తవ గాధలకన్నా పైనించి వచ్చే గణాంకాలే ముఖ్యం అని పురుషులని నమ్మించడంతో వారు ఓప్రా విజయాన్ని చాలా అప్తమైన విషయంగా కొట్టిపారేస్తారు. ప్రస్తుతం పత్రికల్లో కానీ, ప్రసార మాధ్యమాల్లో కాని, ఇంటర్నెట్ లో కానీ స్త్రీల రచనలు మూడోవంతు కూడా లేవు. సెప్టెంబర్ 11 తీవ్రవాద సంఘటన తరువాత యూ.యస్.టీ.వీ లో స్త్రీ అధికారులతో సంభాషణల ప్రసారం ఉన్నట్టుండి తగ్గిపోయింది. టీ.వీ కార్యక్రమ నిర్మాతలు ఈ కార్యక్రమంలో మాట్లాడ్డానికి రిటైరైన జనరల్స్ని తవ్వి తీసుకొస్తారు. సంబంధిత కాంగ్రెషనల్ కమిటీల అధినేతలంతా స్త్రీలే అయినా కూడా విదేశీ తీవ్రవాదుల కేసుల్లో శిక్ష విధించే అధికారం గల ఒకే ఒక ప్రాసిక్యూటర్ స్త్రీ అయినా కూడా వారిని పిలవరు. ఎందుకంటే తీవ్రవాదానికి సంబంధించిన విషయాలు సంచలనాత్మకమైనవి, గట్టివి అవి పురుషులే చెప్పాలి. స్త్రీలు మృదువైన విషయాలు చెప్పాలి.

స్త్రీల స్థాయి ఎట్లా దిగిపోయిందో చూడండి. ఇది కాదా జెండర్ వివక్ష? ఇప్పటికింకా ఆదివారం ఉదయం వచ్చే టాక్ ఫోల్లో స్త్రీ “అతిధుల” కంటే పురుష అతిధులు తొమ్మిది రెట్లు ఎక్కువ. వార్తా పత్రికల్లో ముఖ్య వ్యాఖ్యానాలుండే పేజీల్లో కూడా ఒక స్త్రీ, ఒక శ్వేతేతర జాతీయుడూ వుంటే చాలను కుంటారు. ప్రముఖ మీడియా కంపెనీల బోర్డ్ మెంబర్లలో స్త్రీలు పదిశాతం కన్నా కూడా తక్కువ. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోగల స్థాయిలోనయితే మూడుశాతం కూడా వుండరు. ఇంకా కంటితుడుపుగానే వుంది. ఈ దశాబ్దంలో పెద్దగా మార్పేమీ రాలేదు. 1970 లలో స్త్రీల కంఠాలనుంచీ వీక్షకులు గట్టివార్తలు అంగీకరించరనే వారు… పురుషులే ముఖ్య యాంకర్లుగా వుండేవాళ్ళు. స్త్రీలు సహ యాంకర్లుగా పక్కనుండేవాళ్ళు, క్రిందటి సంవత్సరమే ఒక ప్రముఖ ఛానెల్లో కేటీ కౌరిక్ స్వతంత్ర (రీళిజిళి) యాంకర్గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా ద్వంద్వ విలువలు. క్యామెరా ముందు స్త్రీలింకా అలంకారాలుగానే పరిగణింపబడుతున్నారు. వాళ్ళు పురుష యాంకర్ల కన్నా 15 ఏళ్ళు చిన్నవాళ్ళై వుంటారు. వాళ్ళ వృత్తిలో కొంత అనుభవం, శక్తీ సంపాదించుకునే సమయానికి ఉద్యోగం నించీ తీసివెయ్యటం కూడా జరుగుతుంది. అందుకే స్త్రీలెవరూ వాల్టర్క్రోన్ కైట్, ఎడ్బ్రాడ్లీలు కాలేరు. విమెన్ మీడియా సెంటర్ని అందుకే ప్రారంభించాం. ఇది లాభాపేక్ష లేని సంస్థ. 10,20 సంవత్సరాల క్రిందట మీడియాలో అడుగుపెట్టడం అసాధ్యం అనుకున్న స్త్రీలు ఇప్పుడు ఇందులో వున్నారు. నిర్ణయాధికారం కల స్థానాల్లో ఉన్నారు. స్త్రీలను గురించిన వార్తా కథనాలను ప్రపంచానికి అందజేస్తారు. సమావేశాలు, ప్రెస్ మీట్లు జరుగుతాయి. ఒక వెబ్సైట్ కూడా వుంది. అభ్యుదయ భావాలుగల కాలమిస్టులతో సత్వర లింకులున్నాయి. గడచిన వసంత కాలంలో మేము దక్షిణ డకోటాలో గర్భస్రావ నిషేధాన్ని గురించిన కథనం అందించాం. అ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాక గత ఎన్నికల మీద ప్రభావం కూడా చూపించింది. ఇప్పుడు మేము అనేక విషయాలపై దృష్టి సారించాం. ఇరాక్లో ఒక పధ్నాలుగేళ్ళ బాలికపై అమెరికన్ సైనికుల అత్యాచారం, హత్య వంటి వార్తలే కాక, క్రీడారంగంలో స్త్రీలను గురించి, అట్లా వైవిధ్యభరితమైన ఎన్నో విషయాల గురించి… మీడియాలో స్త్రీలకి ఉద్యోగాలు లభించటం ఒకటే ధ్యేయం కాదు. వారు అందించే కథనాలు మరింత అధికారికంగా, ఖచ్ఛితంగా వుండాలి. ఉపయోగకరంగా వుండాలి. ఒక నటి గర్భవతి అయిందా కాదా అన్న వార్త కాదు ముఖ్యం, అంతర్జాతీయ సెక్స్ వ్యాపారాన్ని గురించిన సమాచారం కావాలి. ఎన్ని ఫైటర్ జెట్లు, న్యూక్లియర్ ఆయుధాలున్నాయని కాదు, తాగునీరు, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, గర్భనిరోధం ఎంతమందికి అందుతున్నాయనేది కావాలి.

అమ్ముః ఇతర మీడియా సంస్థల్లో పనిచేస్తున్న స్త్రీలు మీ సెంటర్పై ఎలా స్పందించారు?

గ్లోరియాః చిరకాలంగా మీడియాలో వున్న స్త్రీలనుంచీ ముందు కొంత వ్యతిరేక స్పందనే వచ్చింది. పురుష కార్పోరేట్ ప్రపంచం అనే గోడకేసి మేం తల బద్దలు కొట్టుకుంటున్నా మన్నారు వాళ్ళు. ఇదంతా వృధా ప్రయాస అనీ, స్త్రీలు ఇచ్చే కథనాలన్నీ సెక్స్ గురించీ, వినోదం గురించీ, పునరుత్పత్తి గురించీ, వస్తు వినియోగం గురించీ మాత్రమేననీ అన్నారు. కానీ మేము వాళ్ళందర్నీ సమావేశపరచి మమ్మల్ని గురించి వివరించిన తరువాత వాళ్ళ అభిప్రాయాలలో మార్పు వచ్చింది. అయితే మీడియాలోకి కొత్తగా వచ్చిన స్త్రీలనుంచి మాత్రం మొదట్లోనే అనుకూల స్పందన వచ్చింది. మేమొకసారి ప్రముఖ వార్తా టాక్షో బుకర్స్ని సమావేశపరచాం. వారంతా స్త్రీలే కానీ వారు చేసే కార్యక్రమాల నిర్మాతలు మాత్రం పురుషులు, కథనాల ప్రసారంలో వారికెదురయ్యే సమస్యల్ని మాతో పంచుకోగలిగారు.

అమ్ముః “స్త్రీల అభిష్టాలకణుగుణంగా వినూత్నాంశాలతో, కాలానుగుణమైన, వినోదభరితమైన” ఛానెల్గా మీరు ప్రారంభించిన గ్రీన్ స్టోన్ మీడియా గురించి చెప్పండి.

గ్లోరియాః ఈ రేడియో ద్వారా ఒక కొత్త కార్యక్రమాన్ని రూపొందించగల అవకాశాన్ని కనుక్కున్నాం. యునైటెడ్ స్టేట్స్లో ఆల్రా రైట్వింగ్ (అతి సంప్రదాయవాదులు) కేవలం ఫాక్స్ న్యూస్, ఎ.ఎం టాక్ రేడియో వంటి కార్పొరేట్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసే టీవీ షోల ఆధారంతోనే అధికారంలోకొచ్చింది. టాక్ రేడియోలో, శబ్దాడంబరం, కేకలు, అతిధోరణులతో చాలామంది స్త్రీ శ్రోతలు విసుగు చెందారు. పురుషులకీ కూడా విసుగొచ్చింది ఐపాడ్స్ బాగా ప్రాచుర్యంలో కొచ్చాక ఎఫ్ ఎమ్ రేడియోకి కూడా శ్రోతలు తగ్గారు. కనుక కొత్త రకం కార్యక్రమాలకి అవకాశం వచ్చింది. అందుకే మొదటి స్త్రీల రేడియో గ్రీన్ స్టోన్ ప్రారంభించాం. ఇది వినోదంతో పాటు విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఒక శ్రోతల కుటుంబాన్ని సృష్టించింది, వారానికి అయిదు రోజులు ప్రసారమయ్యే మా కార్యక్రమాలు అందరూ ఆఫీసులకి కార్లల్లో వెళ్ళే సమయంలో మూడు గంటల పాటు మధ్యాహ్నం వేళల్లో రెండు గంటలూ వుంటాయి. “ఇది ఉపన్యాస రహిత ప్రాంతం”. ఇక్కడ గౌరవమే మాట్లాడుతుంది. “కారులో పిల్లలతో ప్రయాణించేటప్పుడు కూడా వినొచ్చు” వంటి నినాదాలతో కార్యక్రమాలు నడుస్తాయి. రేడియో ఒక ప్రజాస్వామికమైన ప్రసార మాద్యమం అని గడచిన రెండేళ్ళలో నాకర్ధమైంది. రేడియో వినడానికి చదువూ, ఖరీదైన పరికరాలు, ఆఖరికి విద్యుత్తు కూడా అవసరం లేదు. అతి పేద దేశమైన లైబీరియాలో ఎల్లెన్ జాన్సన్, సర్లీఫ్ల ఎన్నికలో ముఖ్య పాత్ర పోషించింది రేడియోనే. ఒక నేటివ్ అమెరికన్ మహిళ, మరొక కెన్యా వనిత, శాటెలైట్ రేడియో టాక్ షోల ద్వారా స్నేహం చెయ్యవచ్చు. ఇంటర్నెట్, కంప్యూటర్లూ పెంచే వివక్షని రేడియో తగ్గిస్తుంది.

అమ్ముః బాలల్ని గురించిన అనేక కార్యక్రమాలలో మీరు చాలా శ్రద్ధగా పనిచేస్తారని బాలల సంక్షేమాన్ని గురించి బాగా పట్టించుకుంటారనీ విన్నాను. ఆవిషయాల గురించి వినాలని కుతూహలపడుతున్నాను.

గ్లోరియాః ఆయుధాల నిషేధానికి నాకు తోచే ఏకైక మార్గం పిల్లల పెంపకం. మన ఇళ్ళల్లో హింస లేకుండా చేస్తే వీధుల్లోనూ విదేశాంగ విధానంలోనూ కూడా హింస లేకుండా పోతుంది. అసలు రాజకీయ శాస్త్రంలోని ప్రతి తరగతీ కూడా మొదట కుటుంబం, పిల్లల పెంపకంతో ప్రారంభించాలి. కుటుంబాలలో ప్రజాస్వామ్యం లేకపోతే సమాజంలో ప్రజాస్వామ్యం వుండదు. మగపిల్లల్ని ఎప్పుడూ తమ తోటి ఆడపిల్ల తమ కన్నా తక్కువ అన్న అభిప్రాయం కలిగేలా పెంచటం, పురుషులలో తమ భార్యలను ఎప్పుడూ అదుపులో వుంచుకోవాలనీ, తమ పురుషత్వాన్ని కాపాడుకోవటానికి అప్పుడప్పుడూ వారిపై హింసకైనా పాల్పడ వచ్చనే భావాలని కలుగచెయ్యటం వలన జాత్యహంకారాలను, పెత్తందారీ స్వభావాన్ని, వర్గాలని, కులాలని మనమే తయారు చేసినట్లవుతుంది. పురుషత్వం, స్త్రీత్వం అనే బీతిజిశిరీ ని తయారుచేసి తీవ్రవాదానికి మార్గం తెరచినట్లు వుంటుంది. కొందరు నాయకుల బాల్యం చూడండి. హిట్లర్, స్టాలిన్, సద్దాం హుస్సేన్ వీరందరూ బాల్యంలో హింస అనుభవించినవారే. తాము అనుభవించిన హింసని వాళ్ళు ఇతరుల మీదకు మళ్ళించారు. ఇది క్షంతవ్యంకాని ఒక నెపం మాత్రమే. ఎందుకంటే ఇటువంటివారు కొంతమంది తమ గాయాలను నయం చేసుకొని తమకొచ్చిన అనుభవ జ్ఞానంతో ఇతరులకు సాయపడతారు. ప్రతివారూ మానవ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలి. సహానుభూతి, మారే స్వభావం, ఓర్పు, క్షమ వంటి గుణాలను పురుషులు అలవర్చుకోవాలి. వాటితోపాటు ధైర్యం, స్వీయాభిప్రాయ ప్రకటన, సృజనాత్మకత అందరికీ వుండాలి. అప్పుడే మనం బాధ్యతగల వ్యక్తులమౌతాం.

అమ్ముః నేటి మీడియా జర్నలిజంల గురించి మీ అభిప్రాయం..

గ్లోరియాః మీడియాపై వినిమయ సంస్కృతి ప్రభావం, అధికార జోక్యం పోయి అది ప్రజాస్వామికం కావాలి. బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఆ అభివృద్ధి సాధనకు చెల్లించిన పర్యావరణ, ఆరోగ్య, అహింస వంటి మూల్యాలను గురించి అభివృద్ధి చెందుతున్న, ఇంకా చెందని దేశాల ప్రజలు తెలుసుకోవాలి,

మీడియా తను విక్రయించదలచిన అంశాలను ఆకర్షణీయం చేస్తుంది. సంపదకూ, మనుషుల రూపురేఖలకూ పెద్దపీట వేస్తుంది.మిగతా మీడియా పేదరికం, సమస్యలు, హింసపై దృష్టి పెడతాయి.

వాస్తవమేమిటంటే, ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో (అమెరికాలో కూడా) కూడా కేవలం ధనవంతులు మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రమైన గాలీ, ఆత్మగౌరవం, తీరిక మొదలైనవి అనుభవించగలుగుతున్నారు. మీడియా సమస్యల్నే కాకుండా పరిష్కారాలను కూడా స్పృశించగలగాలి. ఎక్కువ సమస్యల్నీ, వాటిపై ఎక్కుమంది అభిప్రాయాలనీ ప్రకటించగలగాలి. ఇందుకు ఇంటర్నెట్ ఒకటే సాధనం కానీ అది సామాజికపరంగా, ఆర్థికపరంగా కొంతమందికే అందుబాటులో వుంది. అదీకాక అందులో వచ్చిన కథనాల నిజానిజాలను పరిశీలించాలి.

అమ్ముః ఇప్పుడున్న సమాజమూ, జీవితమూ ఇట్లా వుండడానికి స్త్రీవాదం ఏవిధంగా దోహదపడింది?

గ్లోరియాః పునరుత్పత్తి స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కుగా సాధించడం స్త్రీవాదం చేసిన ముఖ్యమైన పని. పునరుత్పత్తి శక్తి అయిన స్త్రీ శరీరాన్ని అదుపు చేయడం పితృస్వామ్య ముఖ్య లక్షణం. ఆవిధంగా స్త్రీలపై పెత్తనం చెయ్యటం… ఆ హక్కుని లాక్కుని స్త్రీలు కొంత సమతూకాన్ని సాధించారు. ఇంతకన్నా ముఖ్యమైనది “పురుషత్వం” అనే ఒక బీతిజిశి ని సవాలు చెయ్యటం.

అమ్ముః మీ జీవితాన్ని ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే మీకేమనిపిస్తుంది? ఏ పని చేసినందుకైనా విచారిస్తున్న సందర్భం వుందా?

గ్లోరియాః మనందరిలోనూ ఒక స్వభావం వుంటుంది. కొందరం గతంలో, కొందరం వర్తమానంలో, కొందరం భవిష్యత్తులో జీవిస్తూ వుంటాం. నేను భవిష్యత్తులో జీవిస్తాను… ఎవరైనా “మీరు సాధించిన గొప్ప విజయం ఏది” అంటే “అదింకా సాధించాల్సే వుంది” అంటాను. నా వయస్సుకి (72) అది తగ్గ సమాధానం కాదేమోనని వాళ్ళు ఆశ్చర్యపోతారు. వెనక్కి చూస్తే నాకెలాంటి విచారమూ (రిగ్రెట్స్) లేదు. కాలమేమైనా వ్యర్థం చేశానేమో అని తప్ప. యింకా వ్రాయాలని అంశాలని లోతుగా పరిశీలించాలని, సహజమైన సంస్కృతులని గురించి తెలుసుకోవాలని, నూరేళ్ళు బ్రతకాలని నా ఆకాంక్ష.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.