మా ‘‘షీ… రో’’! – మనోజ నంబూరి

ఈ మధ్య నంబూరి పరిపూర్ణకి సరిగ్గా తూగే పేరొకటి కనిపెట్టబడిరది. జాస్తి శివ అనే ఓ ఎన్నారై పిల్లల ప్రేమికుడు, ఈ గొప్ప పదాన్ని మన మధ్య గల ధీరల కోసం తీసుకొచ్చారు. అదే ‘షీరో’. హీరోలకి, హీరోయిజాలకి మాత్రమే ఉనికి ఉన్న ఈ దేశంలో ఈ ‘షీరో’ అనే పదం కాస్త కలవరపాటుని కలిగించొచ్చు గాక!

ఔను… పరిపూర్ణ చాలా చిన్నవయసులోనే షీరో అయింది. పదేళ్ళకే! నటన అనేది కుటుంబ నిషేధ అంశంగా లెక్కించే కాలంలో, ధైర్యంగా పెద్ద నటులతో, తన చక్కటి స్వరంతో స్వయంగా పాడుతూ నటించి ఆ మారుమూల గ్రామానికీ, తన కుటుంబ బంధువులకీ ‘షీరో’ అయిపోయింది. అందరూ ఆమె జీవితం పరిపూర్ణంగా జీవించింది అన్నారు. ఔను. పరిపూర్ణబింబం. ఎన్నోమార్లు చిక్కిపోతుంది, చీకట్లో కూరుకుపోతుంది. కానీ మళ్ళీ దినదిన ప్రవర్ధమానమౌతుంది. లోకానికి వెలుగునిస్తుంది. పరిపూర్ణ లోకానికి కాకపోయినా, క్లిష్ట పరిస్థితుల్లో నిబ్బరంగా సరైన నిర్ణయం తీసుకుని తన భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తూ వెలుగులోకి తెచ్చుకుంది. బాధించే భర్తను భరిస్తూ… భవసాగరాన్ని, కళ్ళనుండి కారే ఉప్పునీళ్ళను చప్పరిస్తూ… ఉలుకూ పలుకూ పట్ల కూడా ఓ నిరాసక్తతతో జీవికను వెళ్ళదీసే మహిళలెందరో (ఈనాటికీ) ఉన్న రోజులవి. పిల్లల పట్లా, తన పట్లా మనసులో తడిలేని భర్త, పైగా కులాంతరం కంఠంలో అడ్డుపడుతూనే ఉంది. ఆదర్శవంతమైన ఓ పార్టీ అధినేతగా ఎదిగిన ఆయన, భర్తగా, తండ్రిగా మాత్రం పరిపూర్ణతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. కన్నపిల్లల కోసం తల్లిదండ్రులు కలిసి కనాల్సిన కలను ఒక్క తల్లి మీదనే రుద్దాడు. అతడిని కాదని, బిడ్డలను ఒంటిచేత్తో పెంచుకోవాలనంటే, అందుకు ఉద్యోగానికి తగినంత చదువు పెంచుకునే క్రమంలో అక్క కూతురు అరుణ పతాక, తమ్ముడు జనార్ధన, తల్లి లాలమ్మలు తన జీవితానికి ప్రమిద, ఒత్తి, చమురులకు మల్లె కాచుకున్నారు.
అలా తలరాతలు రాసే శ్రమ దేవుడికివ్వకుండా, తనతోపాటు తన ముగ్గురు బిడ్డల రాతలనూ అందమైన కవితలా రాసుకున్నదీ షీరో! తన ఈ వృత్తాంతం బంధువులలో అడపాదడపా వైవాహిక విచ్ఛిన్నతకు గురైన మహిళలకు ఎంతో స్ఫూర్తినీ, ధైర్యాన్నీ, తెగింపునీ ఇచ్చింది. అలా తన రక్తసంబంధపు కుటుంబాలలో ఓ షీరోగా నిలిచింది. రిటైరయ్యి విశ్రాంతి తీసుకోకుండా, కాలనీలోని కుల సందడీ, స్నేహ స్తబ్దతా గమనించి, నిద్ర పట్టకుండా ఆలోచించేంత కలవరపడి, అందరినీ కలుసుకుని, మహిళా మండలిని ఏర్పరచి, పట్టువదలని నాయకురాలు నాగమ్మలా కాలనీ సమస్యలు నెత్తికెత్తుకొని తిరుగుతూ, మగవారివల్లే కాగల కార్యాలనుకునే పనులు… ఇంటింటికీ పంపు కనెక్షన్లు, మెటల్‌ రోడ్లు, టెలిఫోన్‌ సౌకర్యాలు శాంక్షన్‌ చేయించిన ధీర ఈ పరిపూర్ణ అనబడు హైదరాబాద్‌ షీరో!
చివరివరకూ చదివింది! చివరివరకూ పాడిరది! చివరివరకూ రాసింది ! చివరివరకూ జీవితాన్ని ప్రేమించింది! చివరివరకూ మనుషులను ప్రేమించింది! చివరివరకూ తనను చదివించినవారి ఔన్నత్యాన్ని, ఆదుకున్నవారి మానవత్వాన్నీ స్మరించుకుంటూనే ఉంది.!
చివరివరకూ తప్పనిసరి సభలకూ హాజరైంది! చివరిలోనూ మళ్ళీ నటించమని ఆమెని అడిగారు. కానీ, నేను మా ప్రియమైన మేనత్తకు ‘‘ఇదిగో నీ కోసమే ఒక అద్భుత పదం పుట్టింది… మా షీరో ‘నువ్వే!’’ అని చెబుదామనుకున్నాను!!
‘‘ఇదిగో… నీలాగే నిద్రకు దూరమై, నా పరిసరాల్లో భార్యలను హింసించే తాగుబోతులపై యుద్ధాన్ని ప్రకటించాను. నీలాగే సమస్యలపై గెలుస్తాను. దీవించు’’ అని అడగాలనుకున్నాను!. ‘‘నాకు స్ఫూర్తి నీవే’’ అని ప్రకటించాలనుకున్నాను. హు… ఈ మేనకోడలి పిచ్చిగానీ పెద్దవాళ్ళు మనకు తీరికయే వరకూ ఆగుతారా?! తమ పాత్రలు నెరవేర్చి, తమ ముద్రలు వదిలేసి, ఇలా మాటమాత్రం చెప్పక బయలుదేరిపోతారు. క్రమశిక్షణ, నిబద్ధత, ప్రేమ, నిజాయితీల ఆ తరం వెళ్ళిపోతోంటే… నిస్సహాయంగా నిలబడటం, ‘తీరని లోటు’ అనే మాట చాలక గింజుకోవటం… మనకు అనుభవమౌతుంది. వాళ్ళని ఈ చేతులతో పంపేసి, మన చేతలలో బ్రతికించటం… ఇక మన పని ఔతుంది!!
ఒకసారి గతంలోకి… అత్తయ్య ఎప్పుడూ ఉక్కు మహిళే :
నాన్న నా బాల్యంలో ప్రతి వేసవికి నన్ను అత్తయ్య దగ్గర వదిలేవాడు. అమ్మ సణుగుతూ ఉండేది. ఆ పిల్ల వయసెంతనీ… అలా తిప్పుతున్నావూ… అంటూ. అక్కడ పక్కపక్కనే నివాసాలున్న పూర్ణత్తయ్య, ఇంకా నాకెంతో ఇష్టమైన శిరీషొదిన, (తన కూతురు రచయిత్రి దాసరి శిరీష) తన పిల్లలు… సరదాగా ఉండటానికే కదా! అనుకున్నాను. కానీ నాన్న ఒరిగిపోయాక గానీ అర్ధం కాలేదు. ఓ టెన్త్‌ పూర్తిచేసిన ఆడపిల్లకి, ప్రపంచాన్ని ఎలా చూడాలో, మనుషులను ఎలా వినాలో, మనుషులను ఎంత ప్రేమించాలో, మనసులను ఎలా చదవాలో, జీవితాన్ని ధైర్యంగా ఎలా దాటాలో, సమాజం పట్ల బాధ్యతలు ఎలా నెత్తికెత్తుకోవాలో, పాజిటివ్‌గా ఎలా ఉండాలో, ఇంకా… ఏం పుస్తకాలు చదవాలో, చూసి నేర్చుకోవడానికి వన్‌ ప్లస్‌ ఆఫర్‌లాగా అత్తయ్య, వదినల వద్ద వదిలేవాడని! తన కూతురు వ్యక్తిత్వం రూపుదిద్దుకునే సమయంలో అక్కడ తన ప్రియ సోదరి పరిపూర్ణ సహవాసం ఎంతో తోడ్పడుతుందనే గొప్ప ఆలోచన తనది! పరిపూర్ణత్తయ్య తరువాత పుట్టినవాడు మా నాయన జనార్ధన. పెద్దన్న నంబూరి శ్రీనివాసరావు స్వ్రాతంత్య్ర పోరాటంలో చురుకైన యువకునిగా నెహ్రు దృష్టిలో పడినవాడు, ఆదర్శ రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు. రెండుమార్లు ఎమ్మెల్యే అయిన ఆయన పి.వి.నరసింహారావు, దర్శి చెంచయ్య, గుర్రం జాషువా లాంటి గొప్ప వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలు గరిపినవాడు, కవి. పార్టీ అరెస్టులలో జైల్లో ఉండి కూడా సోదరి విద్యను గురించి తండ్రివలె బాధ్యత పడిన వ్యక్తి. పరిపూర్ణ రెండో అన్నయ్య దూర్వాసుడు. అక్కినేని నాగేశ్వరరావుతో గండపెండేర సన్మానం గ్రహించిన పెద్ద కవి. మా నాన్న జనార్ధన అత్తయ్యకెంతో ప్రియమైన సోదరుడు. వారిది ప్రత్యేక బంధం. కష్టకాలాల్లో ఆవిడకు ఈయన ఆసరా… ఒడిదుడుకులలో ఈయనకి ఆవిడ చేయూతగా మెలగడం… యువకులుగా, కమ్యూనిస్టు పార్టీ చురుకైన కార్యకర్తలుగా వీరిద్దరి సాహసాలూ రాస్తే ఒక పుస్తకమౌతుంది.
తన జీవితాన్ని అక్షరబద్ధం చేస్తూ, కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణంతో సంసారం, అందులో తీవ్ర ఒడిదుడుకులు, ఆ బంధం వద్దనుకుని, ముగ్గురు పసివారితో ఒంటరి పోరాటం, సింగిల్‌ మదర్‌గా తన చదువును కొనసాగించి, ఆపై ఉమెన్‌ వెల్ఫేర్‌ అధికారిణిగా ఎదగటం, ముగ్గురు పిల్లలనీ ప్రయోజకుల్ని చేయటం… ఎంతో నిజాయితీగా రాసింది అత్తయ్య.
రజాకార్లకూ, ప్రభుత్వాలకూ తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతూ, విద్యార్థి నాయకులపై కూడా నిషేధం నడుస్తున్న ఆ కాలంలో విద్యార్థి నాయకుడైన దాసరి తన సహచరి పరిపూర్ణతో సహా అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు పార్టీ కరపత్రాలు, విప్లవ సాహిత్యం తీసుకుని ఓ రాత్రి రిక్షాలో వెళుతుండగా ఇద్దరు పోలీసులు అనుమానంతో అత్తయ్య వెంటపడి, స్టేషనుకి నడవమని ఎస్కార్ట్‌లా ముందు సైకిళ్ళపై వెళ్ళసాగారు. అప్పుడు తను ఎంతో చాకచక్యంగా సంచిలోని కాగితాలన్నీ మురికి కాలువలోకి విసిరేసిందట. అయినా, తనని తీసుకెళ్ళి సెల్‌లో కూర్చోమన్నారట. కానీ, అక్కడెవరో మూత్ర విసర్జన చేసిన దాఖలాలుండటంతో తానక్కడ కూర్చోలేనని నిరాకరించగా, అక్కడి రైటర్‌ చాచి తన చెంపై కొట్టాడట. పరిపూర్ణ వెంటనే అతని కాలరుపట్టి గుంజి బెబ్బులిలా అతని గుండెలపై గట్టిగా గుద్దిందట. మిగిలిన కానిస్టేబుళ్ళు వచ్చి విడదీసేంతవరకూ వదలలేదట. అప్పుడు తనని ఓ వారం గుంటూరు జైలులో ఉంచారట. అంతకు పూర్వం విద్యార్థి కార్యకలాపాల్లో కూడా అరెస్టై 26 రోజుల జైలు జీవితాన్ని గడిపిన అనుభవం తనది. ఇలాంటి ఎన్నో అనుభవాలతో కూడిన తన స్వీయచరిత్ర ‘వెలుగు దారుల్లో’ అనే పుస్తకం తన 84వ ఏట రాసుకొచ్చింది. మేథావుల మన్ననలు పొంది 2017లో మొదటి ముద్రణైతే, ఇప్పుడు మళ్ళీ 2024లో రెండవ ముద్రణకు నోచుకుంది. ఈ స్వీయ చరిత్రలో మా నాన్న గురించి ఇలా రాసుకున్నది. ‘నా ప్రియ సోదరుడు, స్నేహితుడు అయిన జని మరణవార్త వినగానే తీరని దుఃఖం కమ్ముకున్నది. ఎపుడో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అమ్మా, నాయన, ఇద్దరు అన్నయ్యలు ఇపుడే, మళ్ళీ అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు తీవ్రమైన వెలితితో ఒణికిపోయాను’ అని.
మా వంశవృక్షంలోనే ఉక్కుమహిళ పరిపూర్ణ అత్తయ్య. అంబేద్కర్‌ ప్రవచించిన ‘చదువే తలరాతలు మారుస్తుంది, కష్టాలను తీరుస్తుంద’నే మాటను ఆచరించి, మా అందరికీ అదే మాట నూరిపోసేది. తలరాతలు రాసే అవకాశం వేరేవారికివ్వకుండా తను నిలబడిరది, పిల్లలనూ తీర్చిదిద్దుకుంది. మహిళల స్వావలంబనకు పాటుపడే తన ఉద్యోగ సమయంలో గ్రామ గ్రామాల్లో తిరుగాడి మహిళలు అనుభవిస్తున్న ఎన్నో వెతలనీ, హింసనీ, అభద్రతనీ చూసిన అనుభవంతో… ‘‘బలవంతులైన వాళ్ళెప్పుడూ బలహీనులను క్రూరంగా అణచివేస్తుంటారు. భార్యలపై హింస, చంపటం, ఆడవారిపై అత్యాచారాలు పీడనలోని క్రూరభాగాలు! ‘పులుల్ని బలి ఇవ్వరనీ, మేకల్ని మాత్రమే బలిస్తారనీ’ అంబేద్కర్‌ అలనాడే సెలవిచ్చారు. దీనికి విరుగుడు ఒక్కటే! ప్రతి మహిళా చదువుకుని, ఉద్యోగమో, ఏదైనా సంపాదనార్హమైన పనో చేస్తూ స్వతంత్రంగా ఉండటమే!’’ అంటూ చాలా స్పష్టమైన పిలుపునిచ్చింది. ఈ మాటలు ఆవిడకు అనుభవమైన, తను కంటితో చూసిన… ఈనాటికీ మార్పులేని గృహ హింస బాధితులకు సందేశం వంటివి.
చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తనకు మూడు నెలలు సంగీతం నేర్పిన మాస్టర్‌ వేణు, తనతో భక్తప్రహ్లాదలో నటించిన అశ్వర్థామ, పుండరీకాక్షయ్య, జి.వరలక్ష్మి, రేడియోలో ఎన్నో ప్రోగ్రాములు చేయించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజనీకాంత్‌ గారూ ఇలా చెబుతూ పోతే ఎందరో గొప్ప మనుషులతో గల సాంగత్యం వల్లనూ, నిజాయితీ, క్రమశిక్షణ గల నిరాడంబర జీవితం వల్లనూ, తన ప్రతి మాట ఎంతో విలువగా, మధురంగా మాకో విజ్ఞాన గనిగా ఉండేవి. ఒక్క వ్యాసంగా ఆవిడ జీవితపు వ్యాసంగాలను కుదించటం కుదరని పని. పదేళ్ళకు నటనే గాదు, 74 ఏళ్ళ వయసులో కారు డ్రైవింగ్‌కు కూడా వెళ్ళింది. ప్రరవే వంటి క్రియాశీలక సమావేశ ప్రాంగణానికి పరిపూర్ణ పేరు పెట్టడం ఆమె షీరో గనకనే కదా!
‘‘నువ్వు ఎంత పొట్టిగానైనా ఉండు. కానీ నిటారుగా నిలబడు’’ అనే ఈ మహిళ ఏ సందర్భం అయినా తలెత్తుకునే నడిచింది అనటానికి సందేహమేముంది? ఇక నాలాంటి తన వెనుక తరాలమంతా ఆమె పరిచిన వెలుగుల దారుల్లో నిర్భయంగా, నిటారుగా నడిచిపోవటమే… చేత పరిపూర్ణ ఆత్మగౌరవ జెండాను గర్వంగా ఎగరేసుకుంటూ! అందరికీ ఓ హీరో ఉండొచ్చు… మాకు మాత్రం మా పరిపూర్ణ అత్తయ్యే ఎన్నటికీ ‘షీరో’!

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.